ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Friday 16 May 2014

కర్మయోగం


ళ్లు వంచి కష్టపడాలనే భగవంతుడి ఉద్దేశాన్ని తేనెటీగలు, చీమలు, కొన్ని రకాల పురుగులు, అడవిలో జంతువులు చక్కగా నెరవేరుస్తున్నట్లు కనపడుతుంది. కొందరు మనుషులు మాత్రం- తాము కూర్చోవాలి, ఇతరులు కష్టపడాలి, వాళ్ల కష్టాన్ని హాయిగా దోచుకోవాలనే దుర్మార్గపు ఆలోచనతో బతుకుతుంటారు. ఇది భగవంతుడు నిర్దేశించిన కర్మ మార్గానికి విరుద్ధం. ఇతరుల కూడు కొల్లగొట్టే ఇలాంటివారు లోకానికి ప్రమాదం. వీళ్లకు భవిష్యత్తు ఉండదు.
జీవితమంతా పని చెయ్యాలి. శ్రమైక జీవనసౌందర్యం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఎవరి పని వారు చెయ్యాలి. మనల్ని ఒక ప్రదేశంలో ఉంచి, మనతో ఒక ప్రయోజనం నెరవేరేటట్లు మన జన్మను తీర్చిదిద్దిన ఆ భగవంతుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? చక్కగా కష్టపడి పనిచేసి బతుకుతూ, హాయిగా ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తూ జీవించడం తప్ప!

కర్మయోగంలోనే కాదు, భక్తియోగంలోనూ పంచేంద్రియాలకు, మనసుకు పని ఉంది. జ్ఞానయోగంలో మనసుకు, వివేకానికి బోలెడంత పని ఉంది. కదలకుండా ఒక దగ్గర కూర్చున్నట్లు కనిపించినా- యోగులు చేసే పని అనితర సాధ్యం! కదులుతున్నట్లు కనిపించినా బుద్ధి తక్కువ పనులు చేసేవాళ్లు ఏం పని చేస్తున్నట్లు? చేసే పనిలో నాణ్యత ఉండాలి. ఒక లక్ష్యం ఉండాలి. ఉన్నతంగా ఉండాలి. తక్కువ కాలంలో ఎక్కువ పనిచేసి కొత్త విషయాలను అందించి లోకోపకారం చెయ్యగలగాలి.

దైవాన్ని అర్థం చేసుకున్నవాళ్లు పనిని విమర్శించరు. తమకు కేటాయించిన పనిని ప్రసాదంగా స్వీకరిస్తారు. తమకు ఇచ్చిన పనిని అంకితభావంతో ఎవరూ వేలెత్తి చూపడానికి అవకాశం లేకుండా పూర్తిచేసి, తమదైన ముద్ర వేస్తారు.

అంతమంది వీరులు ఉండగా అర్జునుణ్నే కురుక్షేత్ర యుద్ధానికి సమాయత్తం చేశాడు శ్రీకృష్ణుడు. ఎందుకు? అతడి విలువిద్యానైపుణ్యం, కార్యనిర్వహణ సామర్థ్యం అసాధారణమైనవి. పని వెంట విజయం ఉంటుంది. మన పని మనం పరిపూర్ణమైన మనసుతో వివేచనతో చేస్తే- దైవబలం, ఫలం తప్పక లభిస్తాయి!

దేవతలు వేరుగా లేరు. మానవ దేహాలను అంటిపెట్టుకుని తిరుగుతూ ఉంటారంటారు పెద్దలు. వాళ్ల లోకాలు నరదేహంలోనే నిర్మించుకున్నారు. శిరస్సు నుంచి పాదం వరకూ వ్యాపించి ఉన్నారు. దేహంలో రకరకాల పనులు నిర్వహిస్తున్నారు. మనం బయట పనులు చేస్తుంటే, వాళ్లు లోపల పనులు చేస్తున్నారు. నిజానికి వాళ్లు చేయాల్సిన పనులు అత్యంత జాగరూకతతో, నిరంతర అప్రమత్తతతో చెయ్యకపోతే మన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి.

దేహంలో అంతర్గత కార్యకలాపాలైన రక్తప్రసరణ, గుండె కొట్టుకోవటం, కాలేయం, మూత్రాశయం, మూత్రపిండాలు పనిచేయడం, జీర్ణవ్యవస్థ పనిచేయడం, శిరస్సులో మెదడు కోటానుకోట్ల కణజాలంతో అనుసంధానమై పనిచేయడం... ఇదంతా ప్రకృతి చేసిన ఏర్పాటే.

విశ్వవ్యవస్థలో నిరంతర కర్మ జరుగుతూనే ఉంటుంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రకృతి తన చైతన్యంతో విస్తరించి ఉంటుంది. రాత్రి మరో కర్మకు తెరతీసి జీవులను సేదతీరుస్తూ ఉంటుంది.

నిజంగా, శాశ్వతంగా మనం బతకాలనుకుంటే మన పని గురించి గొప్పగా, ఉన్నతంగా మన మరణం తరవాతా ప్రతి ఒక్కరూ చెప్పుకోవాలి. అలాంటి పని చెయ్యాలి. తప్పకుండా చేద్దాం. భగవంతుడి ఉద్దేశాన్ని నెరవేరుద్దాం.
- ఆనందసాయి స్వామి 

Thursday 15 May 2014

నీరు- దైవస్వరూపం


పంచభూతాత్మకమైన ఈ ప్రకృతిలో నీటికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రాణికోటికి జీవనాధారమైనది కనుక నీటిని దైవస్వరూపంగా భావిస్తాం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు, వాటినుంచి అన్నం, అన్నం వల్ల ప్రాణులు ఉత్పన్నమైనట్లు శ్రుతులు చెబుతున్నాయి. మన శరీరం కూడా పంచభూతాల తత్వంతో ఏర్పడిందే. అందుకే దీన్ని పాంచభౌతిక దేహం అంటున్నాం.
సకల చరాచరాలను సృష్టించేది నీరే. 'నారాయణుడు' అంటే నీరే స్థానంగా కలవాడని అర్థం. నీటి నుంచే నారాయణుడు ఆవిర్భవించినట్లు రుగ్వేదం చెబుతోంది. ఉదకంలో భగవంతుడు, భగవంతుడిలో ఉదకం ఉందనీ, దాని విశేషం తెలుసుకున్నవారే ముక్తికి అర్హులనీ 'మంత్రపుష్పం' చెబుతోంది. 'జీవితమివ్వడానికి, దీర్ఘాయువు కలిగించేందుకు, తేజస్సు పెంచేందుకు ఈ జలాలు కదులుతూ మమ్మల్ని తడుపుతుండాలి' అన్న వేదార్థం కూడా ఉంది.

నీటితో చేసే అయిదు రకాల స్నానాల వివరణ పద్మపురాణంలో ఉంది. శరీరానికి విభూతి పూసుకొంటూ జలస్మరణం చేయటం ఆగ్నేయస్నానం. శుద్ధజలంతో స్నానం చేస్తే అది వారుణస్నానం. శిరస్సుమీద జలాన్ని ప్రోక్షణ చేసుకుంటే బ్రహ్మస్నానం. గోధూళిలో సంచరిస్తే వాయవ్యస్నానం. ఎండకాస్తుండగా కురిసేవానలో తడిస్తే దివ్యస్నానంగా చెబుతారు. తడిగుడ్డతో శరీరాన్ని తుడుచుకోవడం కపిలస్నానం. ఏనుగులా చాలాసేపు స్నానం చేయడం శ్రేష్ఠమని నీతిశాస్త్రకారుడు చెప్పాడు.

మన ఆరోగ్యవృద్ధి కోసం సనాతనులు పలు సందర్భాల్లో పలువిధాలుగా నీటిని స్వీకరించాలని చెప్పారు. ఆధునిక విజ్ఞానశాస్త్రమూ దీన్నే సమర్థిస్తోంది. సంధ్యావందనంలో పెట్టిన ఆచమన విధి అందులో ఒక భాగమే. అరచేతిని ఆవుచెవిలా చేసుకొని అందులో ఒక ఉద్ధిరణ శుద్ధోదకం పోసుకుని మూడుసార్లుగా ఆచమనం చెయ్యమన్నారు. సంధ్యావందనం ముగిసేలోగా ఇలా చాలాసార్లు చేయవలసి వస్తుంది. అంటే, రోజూ మనం నీరు తరచూ తాగాలన్న సంకేతమిది. పూజలో కూడా 'మధ్యేమధ్యే పానీయం సమర్పయామి' అంటున్నాం. ఎలాంటి జలం అంటే, 'శుద్ధాచమనీయం' అంటున్నది వేదం. నీరు పరిశుభ్రంగా లేకుంటే వ్యాధులు వస్తాయన్న హెచ్చరిక ఉంది అందులో.

మనకు సంక్రమించే వ్యాధుల్లో అధికభాగం స్వచ్ఛమైన నీరు తాగకపోవడంవల్లే సంభవిస్తున్నాయి. వేదంలో అడుగడుగునా 'శుద్ధోదకం' అనే మాట వినిపిస్తుందందుకే. ఒక అగ్గిపుల్ల ప్రకాశానికీ, దహనానికీ ఎలా వినియోగపడుతుందో ఒక్క నీటిచుక్క ఆరోగ్య రక్షణకు, ఆరోగ్యహానికీ అలాగే ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో జల ఔషధ వైశిష్ట్యం సవివరంగా ఉంది. ప్రకృతి చికిత్సలో నీటికిగల ప్రాచుర్యం అనూహ్యమైనది. వేలసంవత్సరాల పూర్వం రాజులు జలస్తంభన విద్య నేర్చేవారు. పరిశుద్ధమైన నీరునిచ్చే వర్షంకోసం యజ్ఞాలు చెయ్యాలని 'గీత'లో పరమాత్మ చెప్పాడు.

జలతరంగాల్లో అంతర్యామిగా ఉన్న రుద్రుడికి నమస్కారమని 'రుద్రనమకమ్‌' చెబుతోంది. మత్స్యకూర్మావతారాల ఆవిర్భావం నీటినుంచే జరిగింది. అందుకే సలిలం దైవసమానం. జలచరాలన్నింటికీ భగవంతుడే ఆశ్రయమిచ్చి ప్రత్యక్ష సంరక్షకుడయ్యాడు. విషాన్ని హరించి జలాన్ని శుద్ధిచేసే జలచరాలెన్నో ఉన్నాయి. వాటికి ఆ వరం దైవమే ప్రసాదించాడు.

పరమాత్మ 'పత్రం, పుష్పం, ఫలం, తోయం'లలో తనకు నాలుగోదైన నీటిని సమర్పించినా సంతుష్టి పొందుతాననే చెప్పాడు. కలియుగంలో వ్యామోహ, ప్రలోభాలకు దాసులైన మానవాళికి ఇంతటి సేవాసౌలభ్యం అనుగ్రహించాడంటే భగవంతుడికి మనం సర్వదా కృతజ్ఞులమై ఉండాలి.

చెంబుడు నీళ్లుపోస్తే శంభుడు సంబరపడతాడు కదా! అందుకే ఆ అగ్నినేత్రుణ్ని అభిషేక ప్రియుడంటున్నాం. సృష్టిలో మూడువంతులు నీరు, ఒకవంతు నేల ఉంది. వృక్ష సంతతితో సహా సకలజీవకోటిని ఈ నీరే పోషిస్తోంది. పవిత్రమైన నదీ సాగర తీరాల్లో ఎన్నో దేవాలయాలు, పుణ్యతీర్థాలు వెలిసి భక్తకోటిని తరింపచేస్తున్నాయి. సముద్రస్నానం, నదీస్నానం మానవజన్మ సార్ధక్యానికి అత్యంత ఆవశ్యకాలని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఆరోగ్య పరిరక్షణలోనూ నీరు కీలక పాత్ర పోషిస్తుంది. మానవ శరీరంలో అరవై ఎనిమిది శాతం నీరు ఉంది.

భూగర్భంలో జలవనరులు అడుగంటిపోతున్న ఈ విషమ పరిస్థితుల్లో తమవంతుగా నీటిని పొదుపుగా వాడుకోవడం మానవాళి పరమావధి. ప్రతి నీటిబిందువును అమృతసింధువుగా భావించి, అప్రమత్తతతో ఉంటే జలయాగాలు చేసినంత ఫలితం.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి 

Wednesday 14 May 2014

మహితాత్ముడు


యిదుగురు ఆధ్యాత్మికవేత్తలకు ఒక వివాదం వచ్చింది. ఎవరికి వాళ్లు తమ మతమే మంచిదని వాదించుకుంటున్నారు. ఎంతకూ వాళ్ల తగాదా తీరడంలేదు. 'ఎవరైనా గొప్ప జ్ఞాని వద్దకు వెళ్లి, మన వాదాలు వివరించి, ఏ మతం గొప్పదో తేల్చిచెప్పమని అడుగుదాం!' అని నిర్ణయించుకున్నారు. అలాంటి గొప్ప జ్ఞాని ఎవరా అని వెతికి, అక్కడకు చేరుకున్నారు. ఒక్కొక్కరే తన మతంలోని విశిష్టతను, తాము పూజించే దేవుడి స్వరూపాన్నీ, స్వభావాన్నీ వర్ణించి చెప్పి, తుదకు ఇతర మతాలపై తమ ద్వేషాన్ని కూడా వెళ్లగక్కారు. 'ఇతర మతాలు పనికి మాలినవి కాబట్టి అందరూ తమ మతాన్ని అనుసరిస్తేనే దైవసన్నిధికి చేరగలరు' అని స్పష్టం చేశారు.
అక్కడ మౌనంగా కూర్చుని ఉన్న మహాత్ముడు తుదకు పెదవి కదిపాడు. 'దేవుడి దృష్టిలో అందరూ సమానులే! ఆయనకు రాగద్వేషాలుండవు. పక్షపాత బుద్ధి ఉండదు. ఆయన శాంతిస్వరూపుడు, కరుణామయుడు, పవిత్రుడు, శుభంకరుడు- అని మీరందరూ స్తుతిస్తూ ఉంటారు. కానీ, మీ హృదయాల్లో మాత్రం పక్షపాత బుద్ధి, రాగద్వేషాలూ నెలకొని ఉన్నాయి. మీ మాటల్లో అసహనం తాండవిస్తూ ఉంది. సర్వ సద్గుణ సముపేతుడైన సర్వేశ్వరుడి చెంతకు చేరుకోవాలంటే, ముందుగా ఈ దుర్గుణాలను మీరు విడిచిపెట్టాలి. మీలో సహిష్ణుత అనే సద్గుణం ఉండాలి. మీరు ప్రేమమూర్తులు కావాలి. శాంతస్వభావులే భగవంతుడి సన్నిధికి చేరుకోగలుగుతారు!'

మహాత్ముడి మాటలు విని ఆ అయిదుగురు మత తత్వవేత్తలూ సిగ్గుతో తలదించుకున్నారు. ఈ హితబోధ చేసిన మహాపురుషుడు బుద్ధభగవానుడు. బుద్ధుడి జీవితంలో మనకు నమ్మశక్యంగాని విషయాలేమీ ఉండవు. కానీ, సన్నివేశాలన్నీ అద్భుతమైనవే! కష్టమంటే ఏమిటో తెలియడానికి అవకాశంలేని రాజసౌధంలో పెరిగిన యువరాజు తుదకు సన్యాసిగా మారడం కంటే ఆశ్చర్యకర సన్నివేశం ఏముంటుంది?

కోరికలే దుఃఖానికి కారణం. అజ్ఞానంవల్ల కోరికలు కలుగుతాయి. అజ్ఞానాన్ని అంతంచేస్తే దుఃఖానికి స్థానం ఉండదు. ఈ ప్రపంచం అశాశ్వతం అని గ్రహిస్తే అజ్ఞానం తొలగిపోతుంది. సరైన వాక్కు, దృష్టి, క్రియ, జీవనం, ప్రయత్నం, మనసు, ధ్యానం అనే వాటివల్ల జ్ఞానం కలుగుతుంది. అహింస, దయ, భోగరాహిత్యం, ప్రేమ, సత్యం- ఈ నియమాలే మనిషి తనను తాను ఉద్ధరించుకోవడానికి తోడ్పడతాయి!

అందరికీ అర్థమయ్యే రీతిలో, ఆచరించడానికి వీలైన వాటిని ప్రవచించాడు బుద్ధుడు. ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఆయన అడుగుపెట్టగానే మత ధర్మాల తీరే మారిపోయింది. భిక్షాటనం చేసే ఒక భారతీయ సన్యాసి తన ప్రవచనాలతో ఆసియాఖండం మొత్తాన్ని ప్రభావితం చేశాడు. ఆయన వెలిగించిన జ్ఞానజ్యోతి రెండున్నర వేల సంవత్సరాల తరవాతా సర్వ ప్రపంచ మానవాళి శోకపు చీకట్లు చీల్చుకొని బయటపడటానికి కరదీపికగా వెలుగొందుతూనే ఉంది. నాటికీ నేటికీ ఏవైనా మహిమలు చూపగలవారినే ప్రజలు అధిక సంఖ్యలో అనుసరిస్తారు. మహిమలతోగాక, హిత వచనాలతో ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించి, వారిని సన్మార్గగాముల్ని చేసిన మహితాత్ముడు గౌతమ బుద్ధుడు.

జీవహింస మానవత్వానికి మచ్చగా ఆయన భావించాడు. ఒక పక్షికి బాణపు దెబ్బ తగిలితే, దాన్ని తన ఒడిలో పెట్టుకొని, కన్నీటితో దాని రక్తాన్ని కడిగాడు. 'ఒక గొర్రెపిల్లను బలి ఇస్తే మోక్షం లభిస్తుందని నమ్మేటట్త్లెతే, మనిషినైన నన్ను బలి ఇస్తే మీరు సరాసరి స్వర్గానికే పోవచ్చు కదా!' అని సమాజంలోని మూఢవిశ్వాసాలకు ముచ్చెమటలు పట్టించాడు. మతం అంటే ప్రేమాదరాలతో, సచ్ఛీలతతో కూడిన ధర్మమార్గం అని బుద్ధుడు విశ్వసించాడు. ఎనభయ్యో ఏట తాను తుదిశ్వాస విడిచే వరకు, సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో, సమాజ గమనాన్ని సచ్ఛీలతవైపు మరలించడానికే ప్రయత్నించాడు. 'ఎవరి మోక్షాన్ని వాళ్లే సంపాదించుకోవాలి. ఎవరో వచ్చి సాయంచేస్తే వచ్చేది కాదు అది!' అనే మహత్తర సందేశాన్ని మానవజాతికి ప్రసాదించాడు.

'బుద్ధుడు' అనే పదం అనంత జ్ఞానానికి సంకేతం. 'నేను గౌతముణ్ని. సాధనవల్ల బుద్ధుణ్ని కాగలిగాను! మీరూ సాధనచేస్తే బుద్ధులుగా మారగలరు' అని ఆత్మవిశ్వాసాన్ని మనందరికీ కలగజేసిన మహామహితాత్ముడు బుద్ధ భగవానుడు. 
- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు 

Tuesday 13 May 2014

పసి పిల్లల పసిడి ప్రపంచం


హాభారతం, రామాయణం వంటి ప్రాచీన కావ్యాల్లో ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయి. అవి అన్నీ నమ్మదగినవిగా ఉండవు. కొన్ని సంఘటనలు నిజంగా జరిగాయా అని ఆశ్చర్యం వేస్తుంది. కల్పిత గాథలుగా కనిపించినా అవి యుగాలుగా నిలిచి ఉన్నాయి. ఇప్పటికీ వాటిని ఎంతో ఆసక్తితో చదువుతూనే ఉన్నాం. పసిపిల్లలు మాత్రమే కాదు, పెద్దవారికీ కథలంటే ఆకర్షణ. దేవతల గురించి కథలు మరీ మరీ ఇష్టం. 'అవి అన్నీ అబద్ధాలు, వాటిని చదవవద్దు' అని జ్ఞానం ఉన్నవారెవరూ అనలేదు. అడ్డు చెప్పలేదు. కథలు చదవగా చదవగా వాటి వెనక మరేదో రహస్యం ఉన్నట్లు, ఏదో సత్యం దాగి ఉన్నట్లు తెలుస్తుంది. మన మనసు అంతఃస్ఫూర్తితో విశాలంగా ఎదిగిన కొద్దీ కథలన్నీ ప్రతీకలుగా కనిపిస్తాయి. మనిషి మనసు, జీవితం వికాసం చెందడానికి పనికివచ్చే అంతరార్థాలు అన్నింటినీ వాటిలో ద్రష్టలు నిక్షిప్తం చేశారనిపిస్తుంది. వాటిలో నైతిక, ఆధ్యాత్మిక, ధార్మిక పరమార్థం ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రాచీన కథలు- అంతర్దర్శన కథలు!
మనిషిలో ధర్మం, నీతి ఉన్నంతకాలం కథలు కల్పితాలైనా నష్టం రాదు. రామాయణ, భారతాలు కల్పితాలైనా, కట్టుకథలైనా వాటిలో ధర్మం, నీతి లేవని ఎవరూ ధైర్యంగా చెప్పలేదు. అవి చదివితే పాతివ్రత్య మహిమ అనేది ఉందని, తపశ్శక్తితో ఏదైనా సాధించవచ్చునని తెలుస్తుంది. మానవాళి ధర్మం, నీతిని కాపాడుతూ వచ్చేవి ఆ కథలే.

ప్రాచీన యుగాల్లో ఉన్న ధర్మం, నీతి ఆ స్థాయిలో ఇప్పుడు ఉన్నాయా అన్న సందేహం వస్తుంది. కారుచీకట్ల మధ్య వెలిగే దీపకళికలాగా- దొంగలు, అవినీతిపరులు, హంతకులు, దుష్ట కీచకులు. అధర్మ, వికృత రాకాసి నీడల మధ్య ధర్మం ఇంకా వెలుగుతూనే ఉంది.

ధర్మం మరణిస్తే మానవజాతి గురించి గొప్పగా చెప్పుకొనేది ఏదీ చరిత్రలో మిగలదు. కాంతిహీనమైన నిర్జీవ భూగోళం సూర్యుడి చుట్టూ నిరామయంగా పరిభ్రమిస్తూనే ఉంటుంది. ధర్మం, నీతిని కాపాడే బాధ్యత ఇప్పుడు మానవజాతి భుజస్కంధాలపైనే ఉంది. 'ధర్మం ఎవరిక్కావాలి, నీతి ఎవరికి అవసరం' అని మొండిగా జీవించాలనుకుంటే మానవ జీవనపరిణామ హోమగుండంలో రాక్షస ప్రవృత్తులు మాత్రమే ప్రజ్వరిల్లుతాయి. అవి మానవజాతి ఉనికికే ప్రమాదం తెస్తాయి.

భవిష్యత్తులో ప్రపంచం సద్వర్తనులు, సాధుమూర్తుల ధర్మధామం కావాలంటే నేటి పసిపిల్లల ఆలోచనలే కాంతిపునాదులు కావాలి. క్రాంతి బీజాలు కావాలి. వారు భగవంతుడి కలలకు ప్రతిరూపాలు. చిన్న పిల్లలు ఉత్సాహంగా పుస్తకాలు చదువుతున్నప్పుడు 'అవి కట్టు కథలు' అని చెప్పి, వారిని నిరుత్సాహపరచకూడదు. 'జీవితం అలా ఉండదు' అని ఎప్పుడూ వారితో అనకూడదు. 'ప్రస్తుతం ప్రపంచం అలా లేదు. పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కాని వాటి వెనక, ఒక అతిలోక సౌందర్యం దాగి ఉంది. ఈ కురూపి ప్రపంచం ఆ అద్భుత సౌందర్యాన్ని వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తోంది' అని వారితో చెప్పాలి. 'ఈ సౌందర్యాన్ని నువ్వు ప్రేమించాలి. నీ వైపు ఆకర్షించుకోవాలి. దీన్ని నీ స్వప్నాలు, నీ ఆశల పరమావధిగా చేసుకోవాలి' అని చెప్పాలి. వారిని ప్రోత్సహించాలి.

తాము అందమైన కల కన్నామని, ఆ కలలో తమకెన్నో శక్తులున్న భావం కలిగిందని, అక్కడ అన్నీ దివ్య సౌందర్యంతో భాసిస్తున్నాయని పిల్లలు చెప్పినప్పుడు 'మీ జీవితం అలా ఉండదు' అని వారితో ఏనాడూ చెప్పకూడదు. 'జీవితం అలాగే ఉంటుంది' అని చెప్పాలి. అప్పుడే ప్రేమ మాధుర్యాలు నిండిన బంగరులోకం తలుపులు తెరుచుకుంటాయి.
- కె.యజ్ఞన్న 

Monday 12 May 2014

జీవన సౌఖ్యాలు


నిషి పుట్టిన తరవాత, బుద్ధి తెలిసిన నాటినుంచి అతడు అనుక్షణం కోరుకునేది సౌఖ్యం. అయితే సౌఖ్యం అంత సులభంగా దొరకదు. దానికోసం కష్టపడాలి. కష్టం చేయకుండా ఇష్టమైన సౌఖ్యం సాధ్యం కాదు. అందుకే దుఃఖానంతరం సుఖం, సుఖానంతరం దుఃఖం- చక్రంలా మనిషి జీవితంలో తిరుగాడుతూ ఉంటాయని అన్నీ తెలిసిన పెద్దలు అంటారు. సుఖదుఃఖాలు శాశ్వతాలు కావని సారాంశం.
మనిషి ఎంత స్వార్థపరుడంటే, చివరికి మరణం కూడా సుఖంగానే రావాలని భగవంతుణ్ని కోరుకుంటాడు. నిరంతరం పాపాలు చేసే మనిషి, చేసిన పాపాలకు ఎప్పుడో ఒకప్పుడు శిక్ష అనుభవించాలి కదా! చేసిన పాపాలకు శిక్షపడకుండా తప్పించుకోవాలని శతవిధాలా ప్రయత్నించడం మానవనైజం. శిక్షానుభవం తప్పదంటే, కనీసం కొన్నేళ్లపాటు శిక్షను వాయిదా వేసుకోవడానికైనా ప్రయత్నిస్తాడు. అంటే మనిషి ఎంతటి సుఖలాలసుడో తేటతెల్లం అవుతుంది. కష్టాలకు భయపడే మనిషిని కాలం ఇంకా భయపెడుతుంది. భయం ఒక మానసిక బలహీనత. ఇది ఉంటే అన్ని రోగాలూ ఉన్నట్లే. చీమ చిటుక్కుమన్నా భయపడేవాడు ధీరుడు ఎలా కాగలడు? అందుకే మనిషి భయాన్ని జయించాలి. అందుకోసం కష్టాన్ని సైతం ఇష్టపడాలి. మహాత్ములు కష్టాలకు భయపడరు. వనవాసంతో సీతారామ లక్ష్మణులూ, పంచపాండవులూ పొందినంత కష్టం లోకంలో ఎవరైనా పొందారా? అయినా వారు ఎంత ధైర్యంగా ఉన్నారో గ్రహిస్తే 'భయం' అనేది మిథ్య అని తేలుతుంది.

నిరంతరం ధనం వస్తుండటం, రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉండటం, మనసుకు నచ్చిన- మధురంగా మాట్లాడే భార్య ఉండటం, తన మాటను జవదాటని కొడుకులు లేదా కూతుళ్లు ఉండటం, డబ్బును సంపాదించి పెట్టే విద్య ఉండటం... మనిషి జీవితంలోని సౌఖ్యాలని 'హితోపదేశం'లో నారాయణ పండితుడు అంటాడు. ఇవన్నీ ఉన్నవారు నేటిలోకంలో చాలా అరుదు. ప్రవాహంలా డబ్బు వస్తే వస్తుందేమోగానీ, అనారోగ్యాలు రాకుండా ఎలా ఉంటాయి? 'లక్షాధికారి అయినా లవణాన్నమే తింటాడుగానీ బంగారు ముద్దలను మింగలేడు' అని నరసింహ శతకకర్త అంటాడు. నేడు కోటీశ్వరుడికి షడ్రసోపేత భోజనం చేసే అదృష్టం ఉండదు. ఈ రెండూ (డబ్బూ, ఆరోగ్యం) ఉంటే ఇంట్లో భార్యానుకూల్యం ఉండదు. భార్య అనుకూలవతి అయినా, కొడుకులు చెడుదారి పడతారు. చెప్పిన మాటలు వినరు. కూతుళ్లూ అంతే. అన్నీ ఉన్నా, డబ్బు సంపాదించిపెట్టే విద్య ఉండదు. ఇలా మానవ జీవనంలో అన్నీ సక్రమంగా ఉండటం అనేది ఎండమావే.

కొందరు ధార్మికులు అంటారు- 'మనిషికి ఇన్ని కష్టాలున్నా, తనను పుట్టించిన దేవుణ్ని కనీసం కృతజ్ఞతతో తలవడమే లేదు. దేవుడు అన్ని సౌఖ్యాలూ వాడికి ఇస్తే, ఇక దేవుణ్ని లెక్కచేస్తాడా?' అని. ఇందులో సత్యం లేకపోలేదు. ఎన్ని కష్టాలున్నా మనిషి కృతఘ్నుడు కాకూడదు. తన పుట్టుపూర్వోత్తరాలను స్మరించుకోవాలి. తన జన్మకు కారణమైనవారిని తలచుకొని, నమస్కరించాలి. వీలైతే సేవ చేయాలి. అందులోనే మానవ సౌఖ్యం ఉంది. సేవలో సౌఖ్యాన్ని అనుభవిస్తున్న గొప్ప మనుషులెందరో లోకంలో ఉన్నారు!

మనిషి అమితంగా సుఖాలకు అలవాటు పడటం మంచిది కాదు. శ్రుతిమించిన సౌఖ్యం శరీరాన్ని భారంగా మార్చివేస్తుంది. అనారోగ్యాలకు ఆలవాలమవుతుంది. కనుక కష్టాన్ని కూడా ఇష్టంతో ఎదుర్కోవాలి. పురాణ పురుషులందరూ భగవంతుణ్ని ప్రార్థించే సమయంలో, తమకు కష్టాలే ఉండాలని కోరుకునేవారట. దాని పరమార్థం- కష్టాలుంటేనే భగవంతుడు గుర్తుకు వస్తాడు. లేకుంటే మనిషి భగవంతుణ్ని కూడా మరచిపోతాడు. కష్టాల్లో భగవంతుణ్ని తలచుకుంటే, అతడు భక్తుణ్ని ఇష్టపడతాడు. ద్రౌపదీ మాన సంరక్షణం, గజేంద్రమోక్షం లాంటి కథలు ఇందుకు ఉదాహరణలు.

స్వప్న వాసవదత్త నాటకంలో విదూషకుడన్నట్లు 'సుఖం అంటే రోగాలతో గడపడం కాదు, ఆరోగ్యంగా ఉండటమే' అనే మాటల్ని తలచుకుంటే 'ఆరోగ్యమే సౌఖ్యం' అనేది అక్షరసత్యం. మానవాళి ఆయురారోగ్య భాగ్యాలతో ఆచంద్రార్కం వర్ధిల్లుగాక! శ్రుతిమించిన సుఖాలను కోరకుండుగాక!
- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

Sunday 11 May 2014

నీవే ఓ ప్రపంచం


'ప్రపంచం మొత్తం నీలో ఉంది. ఎలా చూడాలో గ్రహించాలో తెలిస్తే తలుపు అక్కడే ఉంది. భూమిమీద ఉన్న ఏ ఒక్కరూ నీకా తాళంచెవిని ఇవ్వలేరు. తలుపూ తెరవలేరు, నీవు తప్ప!'. ఈ వాక్యాలు చెప్పినవారు గురువా, యోగి పుంగవుడా, అవధూతా? ఆయనను ఏమని సంబోధించినా తక్కువ చేసినట్లే అవుతుంది. ఆయనే జిడ్డు కృష్ణమూర్తి. మహా వక్త, దార్శనికుడు, ఎంతమందికో జీవితం పట్ల అవగాహన కలిగించిన మార్గదర్శకుడు. తాను భారతదేశానికో మరొక దేశానికో సంబంధించిన భావనాత్మక ఆలోచనకు కాని, సిద్ధాంతానికి కాని ప్రతినిధిని కాదన్నారు.
'మన పరిసరాల నుంచి బాంధవ్యాల నుంచి ఎక్కడికో పారిపోవటం కాదు. ఉన్నచోటనే ఉండి, ఎదురయ్యే క్షణంలోని సమస్యను అవగాహన చేసుకోవా'లన్నారు కృష్ణమూర్తి. సమాజ నిర్మిత కట్టుబాట్లను అర్థం చేసుకుని, మరింత క్రమశిక్షణ పేరుతో వాటికి బందీలు కాకుండా స్వేచ్ఛా జీవితాన్ని పొందాలన్నారు. స్వేచ్ఛ అనేది ఒక భావం కాదు, ఒక స్థితి. ఆలోచనలో చిక్కుకొన్న మనసు... స్వేచ్ఛను తెలుసుకోలేదు. దానిని బయటనుంచి యథార్థంగా చూడగలిగినప్పుడు మాత్రమే స్వేచ్ఛను అవగాహన చేసుకోగలదు. అలా చూడగలగాలంటే సావధానత ఎంతో అవసరం. అది ఎలా వస్తుందన్న ప్రశ్నకు సమాధానంగా 'సావధానంగా లేము అనే ఎరుకే సావధానత తెస్తుంది' అని చెప్పారాయన. 'తన లోపల ఉన్న ఆలోచనల్ని బహు స్పష్టంగా పరిశీలిస్తూ సావధానతలో ఉంటే, మనసు మౌనమవుతుంది. ఆ మౌనంలో నుంచి సమస్తం చూడగలం. ఆ స్థితిలో మాత్రమే ఉన్నదానిని గ్రహించి అఖండమైన క్రియ చేయగలరు. అదే- సత్యాన్ని గ్రహించటం' అన్నారు. తనను తాను ఉద్దేశించి మాట్లాడుతూ 'నేను ఒకే ఒక్క నిమిషంపాటు ఎరుకతో ఉంటే, ఒక గంటపాటు సావధానత లేకుండా గడుపుతాను. ఆ గంట గడచిన తరవాత తిరిగి సావధానమవుతాను' అంటూ వివరించారు. అదే మనమూ ఆచరించగలిగితే, మన లోపల అద్భుతమైన యోగక్రియ జరగటాన్ని గమనించవచ్చు. చేతన, అచేతన మనసులను అప్పుడే అవగాహన చేసుకోగలం.

'అసలు ఏదీ... దేనికీ వేరు కాదు' అంటారాయన. ఆలోచన- ఆలోచనాపరుడు, అనుభూతి- అనుభూతి చెందేవాడు... వేరుకాదు. అన్నీ తనలోనే ఉన్నాయి, తానే అయి ఉన్నాయి. అన్నింటినీ వేరుగా విభజించటం వల్ల అన్వేషణ అనే పేరుతో బయట వెదుకుతున్నాం. నిజానికి సమస్య, పరిష్కారం రెండూ నీలోనే ఉన్నాయన్నారు. 'మొత్తం నీలో ఉంది. నీ అంతరంగాన్ని శోధించగలిగేది నీవే. కోరికలు, భావాలు, కోపాలు, ద్వేషాలు, ప్రేమ, కరుణ అన్నీ నీలో నిబిడీకృతమై ఉన్నాయి. పరిశీలన అనే కాగడాతో అణువణువూ వెదికి చూస్తే, అన్నీ నీలో కనపడతాయి. ఎప్పుడైతే నిన్ను నీవు తెలుసుకోగలవో అప్పుడే సత్యాన్ని ఆవిష్కరించుకోగలవు' అన్నారు.

'సత్యం... ఎవరో చెబితేనో గ్రంథాలు చదివితేనో తెలిసేది కాదు. అది తనలోకి తాను అవలోకించి అనుభూతి చెందగలిగేది. అప్పుడే- నీ సుఖాలకు దుఃఖాలకు, శాంతికి అశాంతికి కారణాలు తెలుసుకోగలవు. ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించుకోగలవు. అప్పుడు నీకు నువ్వే ఓ ప్రపంచం కాగలవు' అన్నారు జిడ్డు కృష్ణమూర్తి.

సన్యాసం తీసుకొని జీవితం నుంచి పారిపోవాలనుకుంటారు. మనిషిలో ఉన్న మనసు నుంచి పారిపోలేరు కదా! ఎక్కడికెళ్ళినా అది వారితోపాటే ఉంటుంది. ఇంట్లో చొరబడిన దొంగను పట్టుకోవాలంటే- జాగ్రత్తగా వాడిని గమనిస్తూ వెనకే వెళ్ళాలి. అలాగే మనసును తెలుసుకోవాలంటే ఆ మనసు ఎటు పయనిస్తుందో, ఎలా స్పందిస్తుందో గమనించాలి. ఆ గమనికే జరుగుతున్న వాటిపట్ల ఎరుక కలిగిస్తుంది. తన గురించిన జ్ఞానం కరతలామలకం అవుతుందని ఆయన ఉద్బోధించారు.

'కులం, మతం, దేశం అంటూ విభజించటం వల్ల మనుషులు సైతం విభజనకు గురవుతున్నారు. ఏ ప్రజలకైనా భాష, ఆహారం, అలవాట్లు వేరు కావచ్చు కాని- మానసిక స్థితి అందరిదీ ఒక్కటే. అందరిలోనూ అభద్రతా భావనలు, భయాలు ఒక్కటే. అందుకే నేను, నీవు అంటూ విడిపోకుండా సమస్యలను కలిసి చర్చిద్దాం- పరిష్కారం దొరుకుతుందేమో. అప్పుడే ఒక నవ్య సమాజాన్ని, ప్రేమపూరిత సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలం' అంటూ ఆయన ఇచ్చిన సందేశం ఆచరణ యోగ్యం. ఆయన సరళమైన జీవనశైలి మహోన్నతం. అందరికీ అనుసరణీయం.
- డాక్టర్‌ డి.చంద్రకళ

Saturday 10 May 2014

నేను-ఏమిటి?


'నేను' అనే పదానికి లోతైన అర్థం ఉంది. రోజూ కనీసం పదిసార్లయినా చెప్పుకొనే ఈ పదానికి అర్థం చాలామందికి తెలీదు. అదేమిటో అనుభవిస్తేగాని అంతుపట్టని ఒక చిత్రమైన ప్రయోగం.
మంత్రార్థం తెలుసుకోకుండా ఎన్నిసార్లు మంత్రం వల్లెవేసినా ఫలితం దక్కదు. అన్ని మంత్రాలకు అతీతమైన ఈ 'నేను' అనే మూలమంత్రం గురించి తెలుసుకుని మననం చేయకపోతే జీవితకాలం వృధా అయిపోతుంది.

ఇంతకూ 'నేను' అంటే ఏమిటి? కాలా, మోకాలా? తొడా, నడుమా? కడుపా, కాలేయమా? గొంతు, నోరు, ముక్కు, మొహం, చెవులు, కళ్లు, గుండెకాయ, తలకాయ- ఇవేవీ కాదు. ఇవన్నీ శరీరంలోని భాగాలు మాత్రమే. ఒకదానితో మరొక దానికి పోలిక లేదు. వాటి రూపాల్లా వాటి కర్మలూ వేరువేరు. ఒకవేళ వాటికి తామేమిటో తెలియజేయగల అవకాశం కలిగితే, దేనికది నేను అంటే ఆశ్చర్యపోనవసరంలేదు. అంచేత, నేనుకు అర్థం వీటిలో వెతకటం వృధా ప్రయాస.

కాస్త కుదురుగా కూర్చుని, ప్రశాంతంగా ఆలోచిస్తే, ఈ విభజనకు అతీతంగా ఒక అఖండ చైతన్యం ఉండవచ్చునన్న తలపు, తలుపు తడుతుంది. ఆ చైతన్యమే అన్నింటా నిండి నిబిడీకృతమై ఉండాలన్న అభిప్రాయం కలుగుతుంది. అన్ని జీవరాశుల్లో ఉన్న ఈ నేను- దేవ, మానవ, దానవ గణాలకు అన్వయిస్తుందన్న ఎరుక ఏర్పడుతుంది.

ఈ మేను- నేను కాదని తెలియకపోవటంవల్ల, జీవితంలో వ్యాకులపాటు, భయభ్రాంతులు చోటుచేసుకున్నాయి. మేనుకు, నేనుకు మధ్య అవిద్య ఒక అడ్డుగోడ కావటంవల్ల, ఈ ప్రపంచం అడ్డగోలుగా, తలకిందులుగా కనిపిస్తోంది. ఇలా మనల్ని తికమకపెడుతోంది, ఆత్మ నుంచి మరింత దూరం చేస్తోంది- వికారషట్కం! అంటే, 'నేనున్నాను, నేను పుట్టాను, నేను పెరుగుతున్నాను, నేను మార్పుకు లోనవుతున్నాను, నేను తరిగిపోతున్నాను, నేను చనిపోతున్నాను' అన్న ఆరు వికారాలే భ్రాంతికి మూలకారణం. ఈ భ్రాంతి ముదిరి భవరోగంగా మారిపోతుంది. కురుక్షేత్రంలో అర్జునుణ్ని పట్టుకున్న ఈ భవరోగం అతణ్ని విషాద యోగానికి గురిచేసింది. వివేకం కోల్పోయి వియోగబాధతో విలవిల్లాడిపోయాడు. అది మరింత విషమించకుండా కృష్ణుడు గీతామృతం అందించి తగిన చికిత్స చేశాడు నరుడికి.

ఆ నరుడి సంతతి మనది కాబట్టి ఈ ఆరు వికారాల భవరోగానికి దూరంగా ఉండాలి మనం. అలతోపాటు ఆకాశానికి ఎగసిన ఒక నీటి బిందువు తన అస్తిత్వపు మూలం తెలుసుకుని తిరిగి ఆ సింధువులో ఒక బిందువుగా మారిపోయింది. ఇంతే నేను అన్న భావనవల్ల మనల్ని మనం పరిమితం చేసుకుని అజ్ఞానంలో కుమిలిపోతున్నాం. భావనే భవకారణం కాబట్టి, మనసును అన్నివైపులా వ్యాప్తిచెందేలా ప్రయత్నం చేయాలి. సాధన వల్ల అంతా నేనే భావన బలపడి, మనసు సముద్రమంత విశాలమవుతుంది. భూమి ఆకాశం ఏకమైనట్టు, పరిమితమైన నేను అపరిమితమైన నేనుతో లీనమైపోవటమే యోగం.

నేను- ఏమిటి అన్న ప్రశ్నకు సంతృప్తికరమైన జవాబు రాబట్టుకోవటం అంత సులభం కాదు. కనీసం ఈ జీవితంలో రోజూ ఎదురయ్యే మూడు ప్రశ్నలకు సమాధానం తెలుసుకోగలిగితే జీవితం ధన్యమవుతుంది. శరీరం ఆలోచనల దృశ్యరూపం, మనసు అదృశ్యరూపం, ఆత్మ నగ్నరూపం!
- ఉప్పు రాఘవేంద్రరావు

Friday 9 May 2014

అనుభవించక తప్పదు!


నవారు చేసిన తప్పులకు తాను బాధ్యత వహించేవాడు ఉత్తముడు. తాను చేసిన తప్పులకు తనవారిని, అమాయకులను, తనను విశ్వసించినవారిని బాధ్యులను చేసేవాడు అధముడు.
ఇది సత్యకాలం కాదు. కలికాలం. కాబట్టి నీ, నా భేదాలు, పాపం పుణ్యం పరమార్థాలు ఉండని వైనం సర్వత్రా దర్శనీయమే. స్వప్రయోజనాలకోసం ఎంతకైనా తెగించే తత్వమే ఎక్కువ. ఇతరులకు హానిచేసైనా తన పబ్బం గడుపుకోవాలన్న దుగ్ధతో మనిషి ఎంతకైనా దిగజారే దుర్మార్గమైన ప్రవృత్తి కనిపిస్తోంది.

కుటుంబంలో వ్యక్తి తప్పు చేస్తే కుటుంబ యజమాని; శిష్యుడు తప్పు చేస్తే గురువు; పరివారం, ఉద్యోగులు తప్పు చేస్తే పాలకులు బాధ్యత వహించాలని భారతీయ ధర్మాలు చెబుతున్నాయి. ధర్మాన్ని ఆచరించడం మనిషి ప్రధాన కర్తవ్యం. అధర్మ వర్తన మనసుకు తోచినంత మాత్రానే సరిదిద్దుకునేవాడు వివేకి. న్యాయశాస్త్రాలు తప్పుపట్టినా న్యాయపోరాటాల పేరుతో ముసుగులు కప్పుకొనేవారు సమాజానికి, కుటుంబానికి సైతం దూరంగా ఉండాల్సిన వారే. మనసే మొదటి న్యాయస్థానం. ఆ తీర్పు సరైన, కచ్చితమైన నిర్ణయాన్నే ఇస్తుంది. ఆ తీర్పును శిరసావహించినవారు చరిత్ర పురుషులవుతారు. లోకానికి ఆదర్శనీయులూ అవుతారు.

గంగా యమునలు కలిసే చోట నీటమునిగి పన్నెండు సంవత్సరాలు ఘోర తపమాచరించిన మహా రుషి చ్యవనుడు. ఒకసారి జాలర్లు వేసిన వలలో చిక్కుతాడు. ఆశ్చర్యపోతారు, భయపడతారు మత్స్యకారులు. 'చేపలతోపాటు రాజుగారికి నన్ను కూడా అమ్మేయండి' అంటాడు చ్యవనుడు. విషయం తెలుసుకున్న మహారాజు నహుషుడు వచ్చి చ్యవనుడి పాదాలపై పడి- ఇది నా తప్పుగా భావించి మన్నించమని ప్రార్థిస్తాడు. ఇది ఎవరి తప్పుకాదు. నా విలువ ఎంతో కట్టి, వారికి ఇచ్చి పంపమంటాడు. కోటి మాడలిస్తానని అంటాడు మహారాజు. 'నా విలువ అంతేనా?' అంటాడు. అయితే రాజ్యమే వారికిస్తానంటాడు మహారాజు. నవ్వుతాడు చ్యవనుడు. ఇంతేనా నా వెల అంటాడు. సర్వ సంపదలకు నెలవు గోమాత. కాబట్టి ఆ మత్స్యకారులకు గోదానం చేసి పంపుతారు మధ్యవర్తులుగా అక్కడే ఉన్న రుషులు, మంత్రులు.

ఇక్కడ మనం గమనించాల్సింది- నిజానికి మత్స్యకారులు చేసిన తప్పేమీ లేదు. అది వారి వృత్తి. అంతటి మహర్షి తపోభంగమైంది కాబట్టి తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి, ఆ తప్పును తనదిగా భావించమని, రాజ్యపరిత్యాగానికి కూడా సిద్ధపడ్డాడు నహుషుడు.

శివాజీ మహారాజుకు కానుకగా సైనికులు, ఓ అద్భుత సౌందర్యవతిని అంతఃపురానికి తెస్తారు. విషయం తెలుసుకున్న ఛత్రపతి ఆ సౌందర్యవతి దగ్గరకు వెళ్ళి- తల్లీ! నా సైనికులు చేసిన ఈ అజ్ఞానపు కార్యానికి నన్ను మన్నించు. 'అమోఘ సౌందర్యవతివి తల్లీ నీవు! బిడ్డగా నీ కడుపున పుట్టే భాగ్యం నాకు లేకపోయెనే' అంటూ చేతులు జోడిస్తాడు.

అంతటి గొప్ప సంస్కారం ఉంది కనకనే చరిత్రలో వారి గాథలు సువర్ణాక్షర లిఖితమయ్యాయి.

అవినీతిపరుల దుశ్చర్యలతో ప్రభుత్వ బొక్కసంలోని ద్రవ్యం అపహరణకు గురైనా, ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టినా, దుండగుల వల్ల రాజ్యంలో శాంతి సుఖాలకు ఆటంకం ఏర్పడ్డా, ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారినా అందుకు తప్పు- బాధ్యులైనవారిదే కాదు, పాలకులది కూడా!

తన తప్పులకు ఇతరులను బలిచేయడం, అభిశంసించడం, దోషులుగా చేయడం అమానవీయ వైఖరి. పంచతంత్ర కథలు ఇందుకు అద్దం పట్టేవిగా అనేకం కనిపిస్తాయి. 'ఇకపై అడవిలోని సాధు జంతువులను కాపాడదాం. ఇష్టం వచ్చినట్లు తినేయడం, చంపేయడం చెల్లదు' తీర్మానం చేసింది పులి. అలాగేనన్నాయి నక్క, తోడేలు, ఒంటె. నక్కకు జిహ్వచాపల్యం ఎక్కువ.

దొంగచాటుగా సాధు జంతువులను చంపి తింటూ ఎముకలను తోడేలు, ఒంటె సంచరించే ప్రాంతాల్లో వేసేది. పైగా పులితో ఈ రెండింటిపై చాడీలు చెప్పింది. పులి వచ్చి చూసింది. ఆగ్రహించింది. వాటిని చంపేసింది.

తన కడుపు నింపుకోవడంతోనే తృప్తిపడలేదు నక్క. దానిది అధమ గుణం. తోటి జంతువులకే కీడు తెచ్చింది. తన తప్పులను గ్రహిస్తూ ఎప్పటికప్పుడు నడతను మార్చుకునే గుణం కొనియాడతగిందే. ఎందరో పురాణ పురుషులు, మహనీయుల చరిత్రలే ఇందుకు నిదర్శనం.
మహాత్మాగాంధీ చిన్నతనంలో చేసిన చిన్న చిన్న పొరపాట్లను తండ్రికి చెప్పి సరిదిద్దుకునే వరకు, స్థిమిత మనస్కుడిగా ఉండలేకపోయేవాడు. మరలా ఆ పొరపాట్లు చెయ్యలేదు జీవితంలో. అందుకే మహాత్ముడైనాడు. ప్రపంచానికే ఆరాధ్యుడయ్యాడు. నిప్పు కాలుస్తుంది. తప్పూ అంతే. ధర్మరాజుకు తెలియనిదా, జూద వ్యసన ఫలితం ఎలా ఉంటుందో! జూదం ఆడక తప్పలేదు. ఫలితం కురుక్షేత్ర సంగ్రామానికే దారితీసింది. తెలిసి తప్పుచేసి దిద్దుకొనే కంటే, తప్పు చెయ్యకపోవడమే మేలు కదా!
- దానం శివప్రసాదరావు

Thursday 8 May 2014

ధన్యజీవులు

  మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. తన అభిరుచి మేరకు ఉద్యోగ, వాణిజ్య, రాజకీయ, ఆధ్యాత్మిక రంగాల్లో దేనిలోనైనా, లేదా అన్నింటా ఎదుగుదలకు ప్రయత్నించవచ్చు. అయితే, తాను ఎన్నుకున్న రంగంలో మనిషి ఒక ఉన్నత స్థితికి చేరుకునేసరికి, వ్యక్తిగా కూడా ఎదుగుదలను తప్పక సాధించాలి. వ్యక్తిగతంగానూ ఔన్నత్యం సాధించి, ఒక రకమైన హుందాతనాన్ని సంతరించుకున్న మనిషిని ఈ సమాజం బాగా గౌరవించి, ఆయన్ను అనుసరిస్తుంది. పెద్ద రాజకీయ నాయకుడయ్యేసరికి, లేదా బాగా డబ్బున్నవాడయ్యేసరికి ఆ మనిషికి పెద్దమనిషి తరహా అలవడాలి. వయసొచ్చినంత మాత్రాన ప్రతి వ్యక్తీ పెద్దవాడవుతాడని లేదు. చాలామంది ముసిలాళ్ళవుతారు. కొందరే పెద్దవాళ్ళవుతారు.
వ్యక్తిగతంగా ఉన్నత స్థితిని సాధించిన మనిషి ఆలోచనల్లో- ఒకానొక సామాజికపరమైన, సాంస్కృతికపరమైన హుందాతనం కనపడుతుంది. లోకానికి హితం చేకూర్చే సద్భావన ఆ ఆలోచనల్లోంచి తొంగిచూస్తుంది. ఆ రకమైన లోపలి ఎదుగుదల లేకుండా మనిషి ఈ లోకంలో గొప్పవాడైపోతే, ఆత్మ లోకంలో ఘర్షణ ఎదురవుతుంది. లోపల ఒక రకంగా, బయటకు మరోరకంగా ఉన్న మనిషిని ఆత్మలోకపు దివాలాతనం వెక్కిరిస్తుంది. నూటికి తొంభైమందిలో ఈవేళ మానసిక అశాంతికి ముఖ్య కారణం ఇదే! సమాజంలో ఉన్నతస్థితిలోనే ఉన్నా, వ్యక్తిగతంగా ఔన్నత్యం లోపిస్తే మనిషికి మనశ్శాంతి కరవవుతుంది. సమాజంలో పెరుగుతున్న కీర్తిప్రతిష్ఠలు- మనిషికి నీడ వంటివి. నీడ మనిషిని మించిపోతోందంటే- సూర్యాస్తమయానికి సమయం సమీపించిందని అర్థం. ఆపై మిగిలేది చీకటే! కనుక కీర్తి కన్నా, ప్రాచుర్యం కన్నా మనిషి స్వీయ వ్యక్తిత్వం తప్పక ముందుండాలి. ఆ రెండింటి మధ్యా సమతుల్యం ఏర్పడాలి.

మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పేదిదే! ఆత్మలోకపు ఎదుగుదల లేకుండా బయట సమాజంలో మాత్రం పెద్దమనిషిగా చలామణీ అయిపోయేవాళ్లను 'మిస్టర్‌ జకిల్‌-మిస్టర్‌ హైడ్‌'గా వర్ణిస్తారు. పైకి ఉదారవాదాన్ని వినిపిస్తూ, నీతి గురించి ప్రవచించే వ్యక్తి- 'మిస్టర్‌ జెకిల్‌!' లోలోపలి తప్పుడు ఆలోచనలకు ముసుగు తొడిగి ఉన్న అదే వ్యక్తి పేరు 'మిస్టర్‌ హైడ్‌'! మనకు రోజూ ఎదురయ్యేవాళ్ళలో చాలామంది ఇలాంటివాళ్ళే. సభల్లో, బారుల్లో, క్లబ్బుల్లో యూనియన్ల నేతల్లో- ఎక్కువమంది వారే కనబడతారు. ముఖ్యంగా రాజకీయ నేతల్లో వీరి శాతం మరీ ఎక్కువగా ఉంటుంది. దురదృష్టకరమైన విషయం ఏమంటే- అప్పుడప్పుడు అద్దంలో చూసుకుంటున్నప్పుడు కూడా!

'విజయమా, విలువలా... దేనికి మీ ప్రాధాన్యం?' అని ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ను అడిగితే ఆయన 'ఓటమి ఎరుగని మనిషిని అనిపించుకోవడం కన్నా- విలువలు వదులుకోని వ్యక్తిగా ఉండటమే నాకు ఇష్టం' అన్నాడు. మహాత్ముడు చెప్పిందీ అదే! ఏం సాధించావు అనేదాని కన్నా, ఎలా దాన్ని సాధించావు అనేది ప్రధానం అనే అర్థంలో బాపూజీ 'సిద్ధి కన్నా సాధనలు ముఖ్యం' అని నిర్వచించారు. విలువల కోసం తాపత్రయపడ్డారు కనుకనే అలాంటివారు చరిత్రలో నిలిచారు. ఎదిగే క్రమంలో ఓడిపోయినా ప్రమాదం లేదుగానీ, విలువలు జారిపోతే మాత్రం- అటు వ్యక్తికీ, ఇటు సమాజానికీ చేటు కలుగుతుంది. కనుక మనిషి బయటే కాదు, లోపలా 'మిస్టర్‌ జెకిల్‌'గానే ఉండాలి. 'హైడ్‌'తో స్నేహం వదులుకోవాలి. అప్పుడే మనిషిలో ఘర్షణ ఆగిపోయి, ప్రశాంతత ఏర్పడుతుంది.

మనిషికి లోపలా బయటా స్థిరపడుతున్న సమతూకాన్ని ప్రముఖ కవి షేక్‌స్పియర్‌ కవితాత్మకంగా వ్యాఖ్యానిస్తూ 'నువ్వు బయటకు ప్రదర్శిస్తున్నదానికన్నా నీలో విషయం ఎక్కువ ఉండాలి. ప్రపంచానికి నీవు చెబుతున్నదానికన్నా నీకు ఎక్కువ తెలిసి ఉండాలి' అన్నాడు. లోకంలో దీనికి విరుద్ధంగా జరుగుతోంది కాబట్టే మనిషికి ఒత్తిడి పెరిగిపోతోంది. లోపల సంఘర్షణ చోటుచేసుకుంటోంది. దీనికి విరుగుడుగా పెద్దలు నాలుగే మాటల మంచి మంత్రాన్ని మనకు సూచించారు. దాని పేరు 'చిత్తశుద్ధి'! ఆ ఒక్కదాన్ని మనిషి కాపాడుకుంటే చాలు. రాజకీయ, వాణిజ్య, ఆధ్యాత్మిక రంగాల్లో మనిషి ఎన్నెన్ని ఎత్తులకు ఎదిగినా- చిత్తశుద్ధిని ఆధార కుడ్జమంగా నిలుపుకొన్ననాడు ఆ మనిషిలో ఘర్షణ ఉండదు. దివాలాకోరుతనం ఉండదు. జీవనరాగం శ్రుతి తప్పదు. అశాంతికి చోటు ఉండదు. బయటా లోపలా మనిషి 'మిస్టర్‌ జెకిల్‌'గానే ఉండగలగడం అంటే- జీవితాన్ని జయించడమని అర్థం. దానికి చిత్తశుద్ధి మూలం. అప్పుడు మనిషి సాధించినదానికన్నా అతడి అర్హత ఇంకా పై స్థాయిలో ఉంటుంది. లోకంలో ప్రాచుర్యంకన్నా, కీర్తికన్నా- అసలు మనిషి ఇంకా ఎత్తులో ఉంటాడు. అలాంటి మనుషుల్నే ధన్యజీవులంటారు.
- ఎర్రాప్రగడ రామకృష్ణ 

Wednesday 7 May 2014

పుత్రవ్యామోహం

పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు కాదు- ఆ కుమారుడు పెరిగి పెద్దవాడై, గుణవంతుడై, పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పుడే వాస్తవంగా కలుగుతుందని ప్రసిద్ధ శతక పద్యం చెబుతోంది. భారతీయ సమాజంలో పున్నామనరకం నుంచి రక్షించేవాడు పుత్రుడనే భావన ఉంది. అందుకే అన్ని కాలాల్లో పుత్రసంతానాన్ని కోరుకునేవారు కనిపిస్తారు. పుత్రకామేష్ఠియాగం గురించి తెలిసిందే.

పుత్రులు తమ కుటుంబ భౌతిక సంపదలకే కాదు- సద్గుణ సంపత్తికి, సత్సంప్రదాయాలకు, ధార్మిక జీవనానికీ వారసులు కావాలి. శైశవం నుంచి తల్లిదండ్రులు తమ పిల్లల పోషణలో చూపే శ్రద్ధ, తమ వారసుల్ని గొప్పవారిగా తీర్చిదిద్దాలనే తపన ఫలించి భవిష్యత్తులో వారు సంస్కారవంతులై గొప్ప వ్యక్తిత్వంతో విరాజిల్లుతారు. దీనికి భిన్నంగా పుత్రులు తమ సంపదకు వారసులని, వారు తమకన్నా ఎక్కువ సంపాదించాలని వస్తుసంస్కృతినే బోధిస్తూ స్వార్థచింతనకు, అక్రమార్జనకు, అధర్మాచరణకు తమ సంతానాన్ని వారసులుగా తీర్చిదిద్దుతున్నవాళ్లు ప్రజాస్వామిక వ్యవస్థలో కొల్లలుగా మనకు కనిపిస్తున్నారు. పుత్రులపై ప్రేమ ఉండటం తప్పు కాదు. వారిని అధర్మవర్తనులను కావించేటంతటి అభిమానం- దురభిమానమే గాని ప్రేమ అనిపించుకోదు!

మహాభారతంలో ధృతరాష్ట్రుడి పుత్రప్రేమ ప్రసిద్ధమైనది. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు, వారికి హాని చేయ సంకల్పిస్తాడు దుర్యోధనుడు. వ్యాసుడు ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చి- నీ కుమారుడి అధర్మవర్తనాన్ని మాన్పించమని ప్రబోధిస్తాడు. వాడిది దుర్బుద్ధి అని తెలిసికూడా పుత్రప్రేమవల్ల ఉదాసీనుణ్నయ్యానని తన నిస్సహాయత వెల్లడిస్తాడు గుడ్డిరాజు. ఈ సందర్భంలో వ్యాసుడు ఇంద్ర-సురభి సంవాదాన్ని రాజుకు చెబుతాడు. పూర్వం సకల గోవులకు తల్లి అయిన సురభి దేవేంద్రుడి వద్దకు వెళ్లి ఏడ్చింది. ఇంద్రుడు కారణమడిగితే, నీ పాలనలో నా సంతానం కష్టాలనుభవిస్తున్నారని చెప్పింది. బలమైన పశువులతో బలహీనమైన పశువుల్ని కట్టి మనుషులు నాగళ్లతో దున్నుతున్నారు. అవి ఆ భారం మోయలేకపోతే ములుకోలతో కొట్టి, పొడిచి హింసిస్తున్నారు. అది చూడలేకుండా ఉన్నానని రోదించింది. దానికి ఇంద్రుడు నీకు వేలకొద్దీ సంతానం ఉంది. అందరికీ ఇటువంటి దుఃఖమే కలగలేదు. ఎందుకు బాధపడతావని ఓదార్చాడు. కాని, సురభి 'తల్లికి బిడ్డలందరూ సమానమే. ఒకరిపై ఇష్టం మరొకరిపై అయిష్టం ఉండకూడదు. బాధల్లో ఉన్నవారినే మరింతగా ప్రేమించాలి' అన్నది. ఇంద్రుడు ఆమె మాటలు విని వర్షం కురిపించాడు. నేలమీద తృణసంపద పెరిగింది. పశుగ్రాసంతో పశువులు బలిష్ఠమయ్యాయి. ఈ కథ చెప్పిన వ్యాసుడు- నీ పుత్రులపై ఉన్న ప్రేమ నీ తమ్ముడి కొడుకులపైనా చూపవయ్యా అని సలహా ఇచ్చాడు. మైత్రేయ మహాముని వచ్చి నీ కుమారుడికి ధర్మోపదేశం చేస్తాడనీ చెప్పి వెళ్లిపోయాడు.

మైత్రేయుడు రాగా ధృతరాష్ట్రుడు అతణ్ని పూజించాడు. దుర్యోధనుడు మాత్రం నిర్లక్ష్యంగా చూశాడు. ముని 'పాండవులతో వైరం మంచిది కాదు... యుద్ధమంటూ వస్తే వారిని నీవు జయించలేవు' అంటూ వారితో మైత్రి నెరపమని హితవు పలికాడు. అహంకారియైన దుర్యోధనుడు కాలిబొటన వేలితో నేలను తాటిస్తూ చేతులెత్తి తొడలు చరుచుకొంటూ నవ్వాడు. మైత్రేయుడు ఆగ్రహించి- సమరంలో భీముడి గదాఘాతంవల్ల నీ తొడలు విరిగిపోతాయని శాపం ఇచ్చాడు. ధృతరాష్ట్రుడు భయంతో శాపం మరల్చమని ప్రార్థించాడు. 'వీడికి సమబుద్ధి ఏర్పడితే నా శాపం బాధించ'ద'న్నాడు. కాని దుర్యోధనుడిలో మార్పు రాలేదు. మునిశాపం అనుభవించాడు. ధృతరాష్ట్రుడి గుడ్డిప్రేమే దీనికి కారణం. తమ వారసులకు అక్రమంగా సంపదలు దోచిపెడుతున్న నాయకులు, ఆ ధనమదంతో ధర్మాన్ని విస్మరించి అధర్మరాజ్య స్థాపనకు వ్యూహాలు పన్నుతున్న వారసుల్ని జనాగ్రహం క్షమించదు. మన పిల్లల్ని మంచి పౌరులుగా, ధర్మప్రతీకలుగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులు విస్మరిస్తే సమాజమే రోగగ్రస్తమవుతుంది.
- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు 

Monday 5 May 2014

ఉన్నత వ్యక్తిత్వం

ప్రతి వ్యక్తీ గొప్పవాడు కావాలని కలలు కంటుంటాడు. ఇది సహజం. కానీ, అందరికన్నా గొప్పవాడు కావాలని కొందరు ఆరాటపడతారు. అలా కావటానికి చేతనైన అన్ని రకాల విధానాలూ అనుసరిస్తారు. అడ్డదారులు తొక్కుతారు. అవినీతికి సిద్ధపడతారు. అనాయాసంగా, నిస్సంకోచంగా అబద్ధాలు ఆడతారు.

కొందరు విశేషంగా ధనం సంపాదించి, తాము గొప్పవారమనే భ్రమతో గర్విస్తారు. మరికొందరు హోదా లభించగానే అధికార దర్పం, అహంకారం ప్రదర్శిస్తారు. ఇది కూడా ఆధిక్యతాభావం వల్లనే!

కొందరు తమకంటే అందరూ తక్కువ స్థాయిలోనే ఉండాలని కోరుకుంటారు. తమకన్నా ఎవరు మించిపోతున్నా భరించలేరు. అసూయతో కుమిలిపోతారు. వారిమీద కక్షగా ఉంటారు. అవకాశం లభిస్తే, ఏదో విధంగా, తమకన్నా అధికులకు అపకారం చేస్తారు. వారికి కష్టనష్టాలు కలిగినప్పుడు, లోలోపల సంతోషపడుతూ, పైకి కపట సానుభూతి ప్రకటిస్తారు.

దుర్యోధనుడికి సుయోధనుడు అనే మరొక పేరు ఉంది. నిజానికి అతడు అసూయాధనుడు. పాండవుల ఔన్నత్యాన్ని, ఆధిక్యతను సహించలేక పోతుండేవాడు. బాల్యం నుంచే పాండవుల పట్ల అసూయ, ద్వేషం కలిగి ఉండేవాడు.

అసూయ అగ్ని వంటిది. ద్వేషమూ అంతే.

ఏ కర్ర నిప్పు ఆ కర్రనే కాల్చినట్టు, ఎవరు అసూయాపరులో, వారినే అసూయాద్వేషాలు దహిస్తాయి. ఇది నిత్య సత్యం.

'స్పర్ధయా వర్ధతే విద్య'- చదువులో అసూయ తప్పులేదు. కానీ, అది ద్వేషపూరితంగా ఉండకూడదు. పోటీతత్వంతో, పట్టుదలగా విద్య నేర్వాలి. వాయిదాలు వేయకుండా విద్యాకృషి చెయ్యాలి. 'రేపు చదవొచ్చు' అని బద్ధకిస్తే, చివరికది పరీక్షల సమయం దాకా ఆచరణగా మారదు! అప్పుడు ఆందోళన, ఆవేదన పడుతూ ఆరోగ్యభంగం చేసుకోవాల్సి ఉంటుంది. కొందరు నిరాశా నిస్పృహలకు లోనై ఆత్మహత్యకు పాల్పడతారు. ఇవన్నీ చేయకూడని పనులే.

'కృషితో నాస్తి దుర్భిక్షం'- నిరంతర కృషి ఒక్కటే విజయ ద్వారాలకు తాళపు చెవి. మరే అడ్డదారులూ ఉండవు. సత్కార్యాలకు ఆలోచన- ఆచరణ మధ్య ఆలస్యం ఉండకూడదు. కర్ణుడు ఎడం చేత్తో బంగారు పాత్రను దానం చేయటానికి గల కారణం చెబుతూ- 'చెయ్యి మార్చుకునే లోగా మనసు మారిపోవచ్చు' అనటం అందరికీ ఆదర్శం. ప్రజాసేవ చేస్తామనేవారికన్నా, చేస్తున్నవారినే ప్రజలు నమ్ముతారు.

భక్తిని బోధించేవారిని కాకుండా, భక్తిగా జీవించేవారినే భగవంతుడు సైతం ఇష్టపడతాడు. అసూయ లేకపోవటం ఎంత గొప్పదంటే- అసూయలేని ఏకైక మహిళగా, అత్రి మహర్షి అర్ధాంగిగా వినుతికెక్కిన అనసూయా దేవి పుత్రుడిగా జన్మించటానికి, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు ఇష్టపడ్డాడు.

అసూయలేని హృదయం పరిశుద్ధ దేవాలయం. అసూయ లేదంటే, ప్రేమకు నిలయమని అర్థం. ప్రేమ పున్నమి వెన్నెల వంటిది. అందర్నీ ఆకట్టుకొంటుంది. భగవంతుని కూడా ప్రసన్నుణ్ని చేస్తుంది. అసూయ లేనివారికి ద్వేషం ఉండదు. శత్రువులూ ఉండరు.

ఉన్నత వ్యక్తిత్వం కేవలం అసూయా రహితులకే సాధ్యం. మనం మన దేహంలోని రోగాల నుంచి విముక్తి పొందటానికి తహతహలాడతాం.

అసూయ నుంచి విముక్తి పొందటానిక్కూడా తహతహలాడాలి. అప్పుడే నిజమైన ఆధ్యాత్మిక జీవితం సాధ్యపడుతుంది.
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌ 

Sunday 4 May 2014

అన్న ప్రసాదం


భారతీయ సంస్కృతికి మోక్షమే లక్ష్యం. అంతఃకరణ శుద్ధి ద్వారా ఇది సాధ్యం. అంతఃకరణ శుద్ధికి ఆహారశుద్ధి ఆవశ్యకం. శుద్ధమైన ఆహారం ప్రశాంత జీవనానికి ప్రథమ సోపానం. 'ఆహారం శుద్ధంగా ఉండాలి. అప్పుడే భోక్త బుద్ధివల్ల స్మృతి దృఢమవుతుంది. స్మృతివల్ల హృదయ దృఢత్వం, దానివల్ల ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుంది' అని ఛాందాగ్యోపనిషత్తు. భుజించడానికి ముందు ఆహార పదార్థాలను భగవంతుడికి నివేదన చేయాలి. అప్పుడది 'అన్నప్రసాదం'గా మారుతుంది. ప్రసాదగుణం గల భోజనం మనసును ప్రసన్నం చేస్తుంది. భగవన్మార్గంలో ప్రయాణించడానికి సాత్వికాహారం ఇలా తోడ్పడుతుంది. త్రికాలజ్ఞులైన మహర్షులు అన్నాన్ని గురించి ఎన్నో విషయాలు పేర్కొన్నారు.

ధర్మ సాధనకు శరీరమే మూలం. శరీరం ఉంటేనే పురుషార్థాలు పొందగలుగుతారు. ఆరోగ్యవంతులే ధార్మిక, సామాజిక రంగాల్లో రాణిస్తారు. ఈ శరీరానికీ, దీని ఆరోగ్యానికీ ఆధారం అన్నమే. 'కోటి విద్యలూ కూటి కొరకే', 'ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు...' లాంటి సామెతలు అన్న ప్రాధాన్యాన్ని చాటుతున్నాయి. లోతుకుపోయి ఆలోచిస్తే అవి ఎంత సార్థకతో తెలుస్తుంది. వేదంలో 'ఆకలి మానవులకు మహత్తర శత్రు'వని ఉంది. ఆకలి ఒక వ్యాధి అనీ, దీనికి ఔషధం ఆహారమే అని శంకర భగవత్పాదులు సెలవిచ్చారు. ఈ వ్యాధి లేకపోతే లోకంలో ఆకృత్యాలకు తావేలేదు. మితాహారంతో క్షుద్బాధను తగ్గించుకుంటే హితం చేకూరుతుంది. 'అన్నమో రామచంద్రా' అని అల్లాడే దీనులకు పట్టెడన్నం పెట్టడం కంటే పవిత్ర మతం ఏదీలేదని వివేకానందులు చాటారు.

అత్యంత నియమబద్ధ ఆహారాన్నే ఆర్షసంప్రదాయం ఇష్టపడుతుంది. తినడం, తాగడం, నిదురించడం.. మొదలైనవి సర్వప్రాణి సాధారణం అయితే వాటికి మితం ఉండాలి. విశృంఖలత అనర్థాలకు దారితీస్తుంది. అమితమూ, అనియతమూ అయిన ఆహారంవల్ల కీడు కలుగుతుందని స్మృతుల ప్రబోధం. దేశ, కాల, వయో, అవస్థా భేదాలను అనుసరించి వైద్యశాస్త్రం ఆహార నియమాలు పేర్కొన్నది. స్మృతులు, శాస్త్రాలు పేర్కొన్న ఆహార నియమాలు శరీర ఆరోగ్యానికేగాక, పరమార్థ సాధనాలుగా కూడా ఉపయోగపడతాయి.

అంతరింద్రియం మనసు. మనసు ప్రేరణ చేతనే బాహ్యేంద్రియాలు ప్రవర్తిస్తాయి. మనసు సరైన స్థితిలో ఉంటే మానవుడు, లేకపోతే దానవుడు. ఆత్మ సాక్షాత్కారానికి మూలం మనసు. అదే మోక్షసాధనం. మానసిక శుద్ధి ఆహార శుద్ధిపై ఆధారపడి ఉంటుంది. సాత్విక, రాజస, తామస ఆహారాలను అనుసరించి ఆయా గుణాలూ వస్తాయని ప్రాచీనుల విశ్వాసం. రసవంతం, స్వచ్ఛం, మధురం అయిన ఆహారం- ఆయుష్షు, ఆరోగ్యం, బలం, సుఖం కలిగిస్తుంది. ఇది సాత్వికాహారం. కారం, ఉప్పు, పులుపు, ఎక్కువగా ఉంటే రాజసాహారం- దుఃఖప్రదం. అతిగానో తక్కువగానో వండిందీ, దుర్వాసన వేసేదీ, ఎంగిలిదీ- తామసాహారం- విషప్రాయం. వీటిలో సాత్వికాహారం ఉత్తమం అని గీతోపదేశం.

ఒకే ఆహారం సందర్భాన్ని అనుసరించి మంచిగానో చెడుగానో మారుతుంది. ఒకే ఆహారం ఒక వ్యక్తికి బలకరం, ఇంకో వ్యక్తికి రోగకారకం! దేశకాల పాత్రలననుసరించి ఆహారాన్ని ఎన్నుకోవాలి. ఎవరి ఆహారం వారే వండుకొని తినడం 'స్వయంపాకం'. ఎక్కడపడితే అక్కడ, ఏది పడితే అది తినేవారికి 'స్వయంపాకులు' పరిహాసపాత్రులు. మోదుగ, అరటి, నేరేడు, మామిడి ఆకుల్లో భోజనం శ్రేష్ఠం. తూర్పుకు తిరిగి తినాలని పెద్దల మాట. వరసలో తీపి, ఉప్పు, పులుపు పదార్థాలు తినాలి. మొదట ద్రవపదార్థం, తరవాత ఘనపదార్థం, చివర మరలా ద్రవపదార్థం తీసుకోవాలి. తడిబట్టా, తడి తలా ఉండకూడదు. రెండుసార్లే భోజనం. భోజనానికి ముందు, తరవాతా కాళ్లు, చేతులు, నోరు శుభ్రం చేసుకోవాలి. పంక్తిలో నుంచి మధ్యలో లేవకూడదు. పిల్లలకు, వృద్ధులకు ముందు వడ్డించాలి. పాడుబడిన ఇళ్లూ, గుడులూ భోజనానికి పనికిరావు. పెరుగును తప్ప మిగతావాటిని ఒక్క రాత్రి గడిస్తే స్వీకరించకూడదు. శత్రుపక్షంవారు, దొంగ సాక్ష్యాలు చెప్పేవారు, కోపిష్ఠులు పెట్టే అన్నం తినరాదు.

పారంపర్యంగా చెప్పుకొనే కథ ఒకటుంది. ఒక గ్రామాధికారి ఇంట సన్యాసి ఒకడు భోజనం చేశాడు. అన్నం తిన్న తరవాత అతడి మెదడులో చెడు ఆలోచనలు పుట్టుకొచ్చాయి. ఆ ఇంట్లో ఆడుకునే బాలుణ్ని చూశాడు. బాలుడు ధరించిన ఆభరణాలు కాజేయాలనే కోరిక పుట్టింది సన్యాసికి. ఇంతలో పెద్ద దగ్గుతెరకమ్మి, సన్యాసి తిన్నదంతా బయటకు వచ్చేసింది. మరుక్షణమే అతడి మనసు మంచిగా మారింది. ఈ మార్పుకు కారణం ఏమిటా అని ఆరా తీశాడు. ఒక దొంగ కానుకగా ఇచ్చిన పదార్థాలనే గృహస్థు తనకు పెట్టాడని సన్యాసి తెలుసుకున్నాడు. దొంగసొమ్ము కాబట్టే, తన మనసులో చోర గుణం పుట్టిందని గ్రహించాడు. ఇలాగే హింస మూలంగా సంపాదించిన సొమ్ము కూడా సుఖంగా భోజనం చెయ్యనీయదు. పాండవులు రాజసూయ యాగ సందర్భంలో ఎందరో రాజులను హింసించారు. ఆ రాజ్యసంపద వారికి సంతోషాన్నివ్వలేదు. 'నెత్తురు కూడే' మిగిలింది. ఈ విషయాన్ని దేవీ భాగవతం ప్రవచించింది.

న్యాయార్జితమైన కలోగంజో ఏదైనా దాన్ని భగవంతుడికి సమర్పిస్తే అన్న ప్రసాదం అవుతుంది. భగవత్‌ ప్రసాదం సంతృప్తినీ, సంతోషాన్నీ ఇస్తుంది.
- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు 

Saturday 3 May 2014

అంతర్‌ జ్వాల

  ఈ ప్రపంచం సుఖదుఃఖాల సమాహారం. ఎంతటి ధనరాశి ఉన్నా, ఎంతటి విద్వత్తు ఉన్నా, ఎంతటి యోగదృష్టి ఉన్నా- దుఃఖం తప్పదు! అంతరంగంలో ఆధ్యాత్మిక ప్రకంపనలు చెలరేగినప్పుడు, ప్రాపంచిక విజయాలకన్నా జీవన ప్రయోజనం మరింత గొప్పదని తెలుస్తుంది. అప్పుడే ఒక జ్ఞానజ్యోతి భాసిస్తుంది. ఒక అంతస్ఫూర్తి మేలుకుంటుంది. ఒక అంతర్జ్వాల ప్రజ్వరిల్లుతుంది. అప్పుడే సుఖదుఃఖాలకు అతీతమైన ఒక అద్భుత కిరణం ప్రసరిస్తుంది.

'సుఖదుఃఖాలు ఇసుక, పంచదార లాగా కలిసిమెలిసి ఉంటాయి. ఒక చీమ లాగా వాటిని వేరు చేయగలిగితే మిగిలేది ఆనందం. దీనికి ఎంతో నైపుణ్యం కావాలి. అంతరంగ మథనం కావాలి. అప్పుడే ఆధ్యాత్మిక పురోగమనం సాధ్యపడుతుంది. యోగదృష్టి పెంపొందించిన సాధుపురుషుల మధ్య జీవితాన్ని గడపాలి' అని రామకృష్ణ పరమహంస చెప్పేవారు.

ఆధ్యాత్మిక లోకాలకు ధ్యానమే మార్గం. ధ్యానం మనసుకు సంబంధించినది. ఎంతో ఏకాగ్రత ఉంటేనే అది సాధ్యం. ఆలోచనలతో నిండిన మనసు అనేక మార్గాల్లో పనిచేస్తుంటుంది. మెరుపు వేగాన్ని మించిన ఆలోచనలు శరీరం ఏ పని చేస్తున్నా సాగుతూనే ఉంటాయి.

ఏకాంతాన్ని కోరుకోవడంవల్ల ఆలోచనల ప్రవాహం ఆగిపోదు. నిశ్శబ్ద తీరాల్లో నిలబడినా సముద్ర తరంగాల ఘోష (ఆలోచనలు) వినిపిస్తూనే ఉంటుంది. మనసును నియంత్రించడమే ఏకైక మార్గం.

దైవంపై దృష్టిని ఏకాగ్రం చేయడం ఒక పద్ధతి. ధనుర్విద్య నేర్చుకొనడానికి ముందు బాణాలను పెద్ద వస్తువులవైపు గురి పెట్టాలి. తరవాత నెమ్మదిగా చిన్నదైన లక్ష్యంవైపు మనసును కేంద్రీకరించాలి.

మొదట భగవంతుడి రూపం ధ్యానిస్తూ నెమ్మదిగా మనసులో పరమాత్ముని రూపరాహిత్యం వైపు తిప్పాలి.

చిన్నతనంలో పలకపై పెద్ద అక్షరాలు రాస్తాం. నెమ్మదిగా ఏకాగ్రతతో చిన్న అందమైన అక్షరాలు రాయడం అలవడుతుంది. అలాగే మనసును మొదట భగవంతుడి రూపంపైన ఉంచితే, దారి తప్పే ప్రసక్తి ఉండదు. ఓడలో దిక్సూచి సరిగా పనిచేస్తున్నంత కాలం ఓడ క్షేమంగా ప్రయాణం చేసినట్లు భగవంతుడివైపే మనసు ఉంచితే ఏదోనాడు తీరం చేరవచ్చు. ఒక్క సెకనులో ఆలోచనలు చెల్లాచెదురైపోతాయి. అప్పుడు వాటిని నియంత్రించడం మనసుకు చాలా కష్టమవుతుంది.

సుస్థిరమైన మనసే భగవంతుడివైపు మార్గం చూపుతుంది. ఆలోచనల అలజడి లేని మనోమందిరంలో భగవంతుడు నిశ్చలంగా ప్రకాశిస్తాడు. మనసును భగవంతుడివైపు ఏకాగ్రం చేయగలిగితే, అంతకుమించిన మహనీయ యోగం మరొకటి లేదు. అప్పుడే మనలో అంతర్నేత్రం తెరుచుకుంటుంది.

శాశ్వత తేజస్సు నుంచి ప్రసరించిన కిరణం మనిషి అని తెలుసుకున్నప్పుడు అజ్ఞానం ఉండదు. అజ్ఞానం లేనప్పుడు దుఃఖం ఉండదు. కాంతి దుఃఖిస్తుందా? ఆనందమయ అనంతం నుంచి కాంతిరేఖ తెగిపోవడం జరగదు.

తరంగానికి, సముద్రానికి తేడా లేదు. మానవ కిరణానికి, భగవత్‌ సూర్యుడికి తేడా లేదు. ఈ జ్ఞానం ఉన్నప్పుడు ఇసుక రేణువులో స్వర్గధామం చూడవచ్చు.

తుపానులు చెలరేగే సముద్రాలపై ప్రయాణం దేనికి? రూపరహితమైన ప్రేమస్వరూపం నీ గుండెల్లో ఉంది కదా! ఆయన నీలోనే వెలుగుతున్నప్పుడు నీవెక్కడ ప్రారంభించావో అక్కడే నీ మహాయాత్ర ఆగిపోతుంది.
- కె.యజ్ఞన్న 

Friday 2 May 2014

చార్‌ధామ్‌ యాత్ర

    భగవంతుడు మనిషికి ప్రసాదించిన అనేక వరాల్లో ఉత్తమమైంది ప్రకృతి. అలాంటి ప్రకృతి రసార్ణవ ఆకృతిగా ప్రకటితమైతే- హిమాలయ పర్వత పంక్తుల సౌందర్యమై విలసిల్లుతుంది. ఆ హిమవన్నగాల చెంత ఉన్న ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని నాలుగు దివ్యస్థలాల్ని చార్‌ధామ్‌గా వ్యవహరిస్తున్నాం. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బదరీనాథ్‌ క్షేత్రాల దర్శన సమాహారాన్ని చార్‌ధామ్‌ యాత్రగా పరిగణిస్తారు. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయనాడు ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ఈసారి మే రెండునుంచి ఆరంభమయ్యే ఈ యాత్రలో వేలాది భక్తులు పాల్గొంటున్నారు. చార్‌ధామ్‌ క్షేత్రాల యాత్రకు హరిద్వార్‌ను ముఖద్వారంగా భావిస్తారు. భగీరథ యత్నానికి తలవంచి, చండప్రచండమైన వేగంతో, గంగ శివుడి జటాఝూటంలోకి దూకింది. ఆ గంగ హిమ పర్వతాల నుంచి జనావాసాల్లోకి వచ్చింది హరిద్వార్‌లోనే! ఇక్కడ నీల పర్వతంపై నెలకొన్న చాందీదేవి, బిల్వ పర్వతంపై ఉన్న మానసాదేవి ఆలయాల్ని భక్తులు సందర్శిస్తారు. హరిద్వార్‌ నుంచి రిషికేశ్‌కు భక్తులు చేరుకుంటారు. క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన హాలాహలాన్ని మహాదేవుడు సేవించిన ప్రదేశంగా వ్యవహరించే నీలకంఠ మహాదేవాలయాన్ని దర్శిస్తారు. ఇక్కడే ఉన్న రామ్‌, లక్ష్మణ్‌ ఝూలాలు, వసిష్ఠ గుహ, భరత్‌ మందిరాల్ని తిలకిస్తారు.

చార్‌ధామ్‌ యాత్రలో మొదటి క్షేత్రమైన యమునోత్రికి డెహ్రాడూన్‌, ముస్సోరీల మీదుగా భక్తులు పయనమవుతారు. యమునా నది పర్వతాగ్రాల నుంచి కిందకు దిగిన ప్రదేశం యమునోత్రి. హనుమాన్‌ చట్టి నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి కాలినడకన లేదా గుర్రాల మీద భక్తులు వెళ్తారు. సముద్రమట్టానికి 3,165 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో యమునాదేవి ఆలయం గోచరమవుతుంది. కిలోమీటరు దూరంలో ఉన్న భారీ పర్వతాన్ని అధిరోహిస్తే యమున జన్మస్థలి దర్శనమిస్తుంది.

యమునోత్రి నుంచి ఉత్తరకాశి మీదుగా గంగనాని, ధూలి ప్రాంతాల్ని దర్శించి భక్తులు గంగోత్రికి చేరుకుంటారు. సముద్రమట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఈ ప్రదేశం ఉంటుంది. భగీరథుడి తపోఫలితంగా గంగాదేవి నదీరూపంలో భూమిపై అడుగిడిన చోటుగా భావించే స్థలంలో పవిత్రమైన శిల ఉంటుంది. సహజసిద్ధంగా ఏర్పడిన ఈ శిలాకృతిని శివలింగంగా భక్తులు పూజిస్తారు. గంగమ్మ దూకుడును తట్టుకుని తన జటాఝూటంలో బంధించేందుకు శివుడే ఇక్కడ కూర్చున్నాడని స్థల పురాణం. గంగోత్రిలో మంచు కారణంగా ఏటా ఆరు నెలల పాటు మూసి ఉండే గంగా మాత ఆలయాన్ని, అక్షయ తృతీయ నుంచి దీపావళి వరకు తెరుస్తారు. ఈ ఆలయానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోముఖ్‌ను గంగానది జన్మస్థలిగా భావిస్తారు. ఇక్కడ భాగీరథి ప్రవహిస్తుంది. ఇది దేవప్రయాగ దగ్గర అలకానంద నదితో సంగమమై గంగానదిగా మారుతుంది.

గంగోత్రి నుంచి శ్రీనగర్‌, రుద్రప్రయాగ, గౌరీకుండ్‌ మీదుగా భక్తులు మూడో దివ్యధామమైన కేదార్‌నాథ్‌కి చేరుకుంటారు. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం సముద్ర మట్టానికి 12 వేల అడుగుల ఎత్తున ఉంటుంది. హరుడు, కేదారేశ్వరుడిగా వెలసిన ఈ క్షేత్ర వైభవం స్కాంద పురాణంలో ఉంది. ఓసారి పార్వతీదేవి కేదార క్షేత్ర విశేషాల్ని వివరించమని పరమశివుణ్ని ప్రశ్నించింది. 'దేవతల్లో విష్ణువు, సరోవరాల్లో సాగరం, నదుల్లో గంగ, పర్వతాల్లో హిమాలయం, భక్తుల్లో నారదుడు, గోవుల్లో కామధేనువు, పురాల్లో కైలాసం, క్షేత్రాల్లో కేదారం నాకు పరమ ప్రియమైనవి'- అని మహేశ్వరుడు పేర్కొన్నాడట. సృష్టి ప్రారంభం నుంచి నేను బ్రహ్మరూపాన్ని ధరించి, పరబ్రహ్మతత్వాన్ని సాధించడానికి ఈ క్షేత్రంలో నివసిస్తున్నానని శివుడు వెల్లడించాడని చెబుతారు. కేదార్‌నాథ్‌లో మహాదేవుడు లింగాకృతిలో కాకుండా, త్రిభుజాకారంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయం ఏటా మే నుంచి అక్టోబర్‌ వరకే తెరిచి ఉంటుంది. పాండవులు స్వర్గారోహణం చేసిన సన్నిధి, జగద్గురువు ఆదిశంకరాచార్యులు కైవల్యం పొందింది ఇక్కడేనని ప్రతీతి.

చార్‌ధామ్‌ యాత్రలో నాలుగో దివ్యస్థలి బదరీనాథ్‌. హిమాలయాల్లోని నీలకంఠ పర్వతాల నేపథ్యంలో నర, నారాయణ కొండల నడుమ, అలకానంద నదీ తీరాన విష్ణు రూప బదరీనాథుడు కొలువుతీరి ఉంటాడు. ఈ ఆలయం ఏడాది పొడవునా తెరిచే ఉంటుంది. గర్భాలయంలో ధ్యానముద్రాంకితుడైన శ్రీహరి విగ్రహం గోచరమవుతుంది. ప్రధాన ఆలయంతోపాటు ఆదిబద్రి, యోగధ్యాన్‌ బద్రి, బృధా బద్రి, భవిష్య బద్రి పేరిట మరో నాలుగు ఆలయాలు ఉంటాయి. ఇక్కడ పంచ ప్రయాగలుగా పేర్కొనే దేవ, రుద్ర, నంద, కర్ణ, విష్ణుప్రయాగలు దర్శనీయ ప్రదేశాలు.

మన దేశం 'నమోనమామి' అంటూ ఆరాధించదగిన కర్మభూమి, పుణ్యభూమి. ఆసేతు హిమాచలం ఎన్నో దివ్యసన్నిధులు ఇక్కడ నెలకొన్నాయి. ఈ మహనీయ స్థలాల్ని శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతో దివ్య, భవ్య, ఆధ్యాత్మిక పెన్నిధులుగా సేవించాలి. అప్పుడే యాత్ర సిద్ధి, చిత్తశుద్ధి, అలౌకికమైన ఆత్మానంద లబ్ధి చేకూరుతాయి.
- డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌ 

Thursday 1 May 2014

స్వర్గం- నరకం

నలో చాలామంది స్వర్గనరకాలను నమ్ముతారు. అవి నిజంగా ఉన్నాయా అన్న అనుమానం మనకు ఒక్కోసారి వస్తుంటుంది. 'నువ్వున్నది స్వర్గమా, నరకమా అన్నది నీ మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది' అన్నాడు బుద్ధుడు.
   
ఒకడికి మనశ్శాంతి లేదు. ఎవరో ఏదో అన్యాయం చేశారనో, మరే కారణంవల్లో అతడి మనసు గాయపడింది. అలజడి, ఆందోళన, ఒత్తిడి, నిస్పృహ, అసూయ, ద్వేషం, కోపం... ఇలా ఏదోటి అతనికి మనఃస్థిమితం లేకుండా చేశాయి. అంటే, అప్పుడతడి మనసు నరకప్రాయమైందని అర్థం. ఇక్కడ నమ్మకంతో ప్రసక్తిలేదు. అతడికది స్వానుభవం!
 
ఇంకొకడి మనసులో నిర్మల ప్రశాంతత. ప్రేమ, కరుణ, క్షమ, ఆర్ద్రత, వెన్నెల... ఏదోటి నెలకొని ఉన్నాయి. ఇక్కడా నమ్మకంతో పనిలేదు. ఒక అపురూప అనుభూతితో మనసు నిండి ఉంది. అదే స్వర్గం. అతడికది స్వాను భవం!
 
తన జీవితంలో సుఖమొక్కటే ఉండాలనుకునేవాడికి, తనకెలాంటి బాధలు కలగకూడదనుకునేవాడికి అడుగడుగునా అసంతృప్తే మిగులుతుంది. బాధే కలుగుతుంది. అనుభవాలు నరక సదృశమవుతాయి.

తన జీవితంలో దొరికినదానితో తృప్తిపడేవాడికి, తనకెంత కష్టంవచ్చినా ఓర్చుకోగలిగినవాడికి అనుక్షణం స్వర్గధామమే!

ప్రతి అనుభూతి పరిపూర్ణ సంతోష భావనగా గ్రహించగలిగిన స్థితప్రజ్ఞుడు ఎంతటి దుఃఖ భాజనుడితోనైనా నిశ్శబ్దంగా సంభాషించగలుగుతాడు. అతడి దుఃఖంలో పాలుపంచుకుంటాడు. తన సుఖాల్ని అతడికి పంచిపెడతాడు. అతణ్ని తన నరకంలోంచి బయటకులాగి తన స్వర్గంలోకి వెంటపెట్టుకుని వెళ్లిపోతాడు.

ఇది సుఖపడే కాలం, ఇది బాధపడాల్సిన సమయం అంటూ ఎవరి జీవితంలోనూ ఎక్కడా రాసి పెట్టి ఉండవు. అంతా ఆ వ్యక్తి వర్తమాన మానసిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అప్పటి కోరిక తీవ్రతనుబట్టి ఉంటుంది.

తాను పరిమళాలను వెదజల్లాలని ప్రత్యేకంగా ఏ పువ్వూ అనుకోదు. అందరినీ తన సువాసనలతో సరిసమానంగా ఆనందపెట్టడం దానికది ప్రకృతి ధర్మం. అలాగే, తన జ్ఞాన పరిమళాలతో పరిసర వ్యక్తుల్ని ప్రభావితం చేయటం- ఒక పరమజ్ఞానికది సహజగుణం! తనకు ఉన్నంతలో తోటివాడి అవసరాలు తీర్చడం ఒక నిర్మల నిస్వార్థ హృదయానికి జన్మతో వచ్చిన త్యాగగుణం.

స్వార్థంతో, అహంకారంతో, అసూయతో తాను సుఖపడకుండా ఇతరులను ఆనందపడనీయకుండా తన బతుకు దుఃఖభరితం చేసుకునే మనిషి జీవితం అతడికే కాకుండా అందరికీ దుర్భరమే!

మనిషి మరణానంతరం స్వర్గ నరకాల్లో దేనిలోకి ప్రస్థానం జరుపుతాడో అన్న మీమాంసతో వర్తమానాన్ని అశాంతి పాలు చేసుకోవాల్సిన అవసరంలేదు.

ఇక్కడే ఈ భూమి మీదే స్వర్గ నరకాల్లో దేనిలో బతకాలన్నా ఆ భగవంతుడు మనిషికి సమానమైన అవకాశాలు అడుగడుగునా సమకూరుస్తూనే ఉం టాడు. దేనిలో ప్రవేశించటమా అన్నది ఆ మనిషి చేతుల్లోనే ఉంది! 
- తటవర్తి రామచంద్రరావు