ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday 3 June 2013

హనుమజ్జయంతి ..


భారతదేశంలో ఆంజనేయస్వామి మందిరంలేని పల్లె కాని, పట్టణం కాని ఉండదు. హిందువుల్లో ఆ స్వామిని పూజించని ఆస్తికులుండరు. సర్వజన వంద్యుడైన హనుమాన్‌, రామాయణ వీరుల్లో అగ్రగణ్యుడు. ఆంజనేయుడి శౌర్యం, సాహసం, బుద్ధి, వినయం, స్వామి భక్తి రామకథలోనే కాక, ప్రజల హృదయంలో అగ్రస్థానాన్ని సంపాదించుకున్నాయి. వాల్మీకి రామాయణంలోని కిష్కింధ కాండలో మొదటిసారిగా మనకు కనిపించే హనుమంతుడి పుట్టుకను గురించి ఎన్నో కథలున్నాయి. సాధారణంగా మన దేవతల జన్మ వృత్తాంతాల్లా హనుమంతుడి పుట్టుకను గురించి వివిధ పురాణాల్లో, రామాయణాల్లో విభిన్న రూపంలో ఉన్నాయి. వాల్మీకి రామాయణంలో జాంబవంతుడు హనుమంతుడి జననగాథను ఈ విధంగా వివరించాడు.

మహా రూపవతి అయిన పుంజికస్థల అనే అప్సర స్త్రీ శాపకారణంగా కుంజరుడనే వానర నాయకుడి కూతురుగా జన్మిస్తుంది. ఆమెను కేసరి అనే వానర శ్రేష్ఠుడు పెళ్ళి చేసుకొంటాడు. కామరూపిణి అయిన ఆమె ఒకనాడు మానవ రూపం ధరించి, దివ్యాలంకార భూషితురాలై పర్వత ప్రాంతాల్లో విహరిస్తూ ఉంటుంది. ఆమె అపూర్వ సౌందర్యానికి ముగ్ధుడైన వాయువు ఆమెను ఆలింగనం చేసుకొంటాడు. పతివ్రత అయిన అంజన వాయుదేవుని విపరీత ప్రవర్తన పట్ల కోపగించుకొంటుంది. వాయుదేవుడు ఆమెను సముదాయిస్తూ 'నిన్ను నేను హింసించలేదు. నీ పాతివ్రత్యాన్ని భంగపరచలేదు. కేవలం మానసికంగా నిన్ను ప్రేమించినందువల్ల నీకే దోషం అంటదు. ప్రతిఫలంగా శుభం ప్రాప్తిస్తుంది. పరాక్రమంలో, మేధాశక్తిలో, సత్వంలో, తపశ్శక్తిలో అద్వితీయుడైన కుమారుడు నీకు పుడతాడు' అన్నాడు. కొంతకాలం తరవాత అంజన ఒక కొండ గుహలో హనుమంతుని ప్రసవిస్తుంది.

అంజనాసుతుడు జన్మించిన సమయంలో సూర్యోదయమవుతూ ఉంది. ఉదయిస్తున్న బాల భానుణ్ని ఎర్రని పండుగా భ్రమించి, అప్పుడే పుట్టిన ఆంజనేయుడు ఆకాశానికి ఎగిరాడు. బాలవీరుడి సాహసాన్ని గమనించిన ఇంద్రుడు, తన పదవికి ముప్పు తేగల వీరుడు కావచ్చుననుకొన్నాడు. బాలుడిపై వజ్రాయుధం ప్రయోగించాడు. ఆ దెబ్బతో కొండపై కూలిన బాలాంజనాసుతుడి చెంప కొండ తాకిడితో చీలిపోయింది. నాటి నుంచి ఆంజనేయుడికి హనుమాన్‌ (హనుమ=చెంప, చెక్కిలి) అన్న పేరు వచ్చింది.

హనుమంతుడు మహా వీరుడే కాక, మహా భక్తుడు. సంగీత నృత్యాల్లో ఆరితేరినవాడు. వ్యాకరణ ఆధ్యాత్మ విద్యల్లో ఆరితేరినవాడు. రుష్యమూకపర్వతంపై తలదాచుకొన్న సుగ్రీవుని కలుసుకొంటాడు. రామలక్ష్మణులు సీతను అన్వేషిస్తూ కిష్కింధకు చేరతారు. సుగ్రీవుడి దూతగా రామలక్ష్మణులను కలుసుకొంటాడు. హనుమంతుడి మాటలు విని రాముడు 'లక్ష్మణా, ఇతడు సామాన్యుడు కాడు. వేదాధ్యయనం చేసినవాడు. అతడి మాటల్లో ఒక్క అపశబ్దం లేదు. గొప్ప సంస్కారం గలవాడు' అన్నాడు. నాటినుంచి హనుమంతుడు రామదూత అయ్యాడు.

సింహాచల క్షేత్రంలోని శ్రీనృసింహస్వామి ఆలయంలో యోగాంజనేయ మూర్తి విగ్రహముంది. యోగముద్రలో ఉన్న ఆంజనేయమూర్తికి నాలుగు చేతులున్నాయి. పై రెండు చేతుల్లో శంఖ, చక్రాలు, తక్కిన రెండు చేతుల్లో వ్యాఖ్యాన వరద ముద్రలున్నాయి. వాటిలో జపమాల పుస్తకాలున్నాయి. మెడలో హారం, యజ్ఞోపవీతాలున్నాయి.

తాంత్రికులు పంచముఖ ఆంజనేయస్వామిని ఆరాధిస్తారు. ధ్యాన శ్లోకం ప్రకారం హనుమంతుడి పూర్వరూపం కపి, దక్షిణ ముఖం ఉగ్రనరసింహుడు, పశ్చిమ ముఖం వీర గరుత్మంతుడు, ఉత్తర ముఖం వరాహం, వూర్ధ్వ ముఖం హయగ్రీవుడు. యుద్ధరంగంలో మూర్ఛిల్లిన లక్ష్మణుని సంజీవినితో కాపాడినవాడు హనుమంతుడే. అందుకే రాముడు ప్రశంసిస్తూ, 'నా విజయానికి కారకుడు హనుమంతుడే' అంటాడు. గాఢంగా ఆలింగనం చేసుకుంటాడు. 
హనుమంతుడికి గంగసింధూరం ఇష్టమైనది. శని, మంగళవారాలు స్వామికి ప్రీతిపాత్రమైనవి. ఆయనకు వివిధ రీతుల్లో పూజిస్తారు. ఆకుపూజలు, వడమాలలు, బెల్లం- వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు. 

హనుమనామ జపం వల్ల బుద్ధి, బలం, యశస్సు, ఆరోగ్యం, వాక్పటుత్వం లభిస్తాయని హనుమ భక్తుల విశ్వాసం.
                                                                                                       - జానమద్ది హనుమచ్ఛాస్త్రి

No comments:

Post a Comment