ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Tuesday 11 June 2013

ఆత్మవిమర్శ


    మానవ జీవితం చల్లగా, హాయిగా, సుఖప్రదంగా సాగిపోవాలి. మానవుల మధ్య బంధం పటిష్ఠంగా ఉండాలి. పరస్పర గౌరవాదులతో, అనురాగాభిమానాలతో కొనసాగాలి. వైషమ్యాలు, స్పర్ధలు, అసూయాద్వేషాలు, అంతరాల పోరాటాలు ఆధిక్యతా ధోరణులు అంతరించాలి. నిజానికివి లేని ప్రపంచం స్వర్గంతో సమానం. సృష్టి, వినాశనం రెండూ మానవుడి చేతిలోనే ఉన్నాయి.

ఓవైపు ప్రవాహంలో వ్యర్థ కాలుష్యాలు ఎత్తిపోస్తూ- మరోవైపు శుద్ధ జలంకోసం అర్రులు సాచడం అవివేకమే. నేడు మనం చూస్తున్న విచిత్ర పోకడ ఏమిటి? మానవుడు ద్వైదీభావనలతో- భావంతో ఒకతీరుగా, బాహ్యంలో ఒకతీరుగా చరిస్తూ రుజువర్తనా శైలికి గండికొట్టుకుంటున్నాడు. ఇది తాను కూర్చున్న కొమ్మను తానే నరికివేసుకునే చందం. అపోహలు, అనర్థాలు, అనుచితమైన కార్యకలాపాలవల్ల తనకు తానే ఓ పెను సమస్యగా మారిపోతున్నాడు. ఇది వెలుగుతున్న జీవనజ్యోతిని కొడిగట్టుకునేలా చేసుకోవడమే. స్వయంకృత వికృతాలే ఇవన్నీ.

ఇంతటి అస్తవ్యస్త పరిస్థితికి ఒక్కటే కారణం. ఆత్మవిమర్శ లేకపోవడమే. ఒకవేళ ఉన్నా దాన్ని అహంకార ధోరణితోనో, సమర్థింపుల ధోరణితోనో అణగదొక్కుకోవడమే. ఎంతటివారికైనా జీవనయానం మంచి చెడుల మిశ్రమమే. ప్రతి అడుగు జాగరూకతతో వేయాలి. తీసుకునే ప్రతి నిర్ణయం సఫలీకృతం కావాలి. ఏకాకిగా ఎవరూ మనలేరు. సంఘజీవిగా సంఘటితంగా జీవించాలి. వ్యక్తి ఉన్నతి, సుఖ సంతోషాలు సహచర జీవితాలతోనే ముడివడి ఉంటాయి. మనిషికి మనిషికి మధ్య బంధం దృఢంగా ఉండి తీరాలి. మన చేతలు, భావాలు మనకు సవ్యంగా ఉన్నట్టే స్ఫురిస్తాయి. ఒకవేళ 'తేడా' పొడచూపినా స్వార్థం, స్వప్రయోజన కాంక్షలు ముసుగువేసేస్తాయి.

ఏది మంచో ఏది చెడో, ఏది సవ్యమో ఏది అపసవ్యమో తెలీనివాడు కాదు మనిషన్నవాడు. నిప్పు కాలుతుందని తెలీదా, వరదనీరు ముంచుతుందని తెలీదా? దైనందిన జీవితంలో మాట, చేత ముఖ్య భూమికలు పోషిస్తాయి. ఈ రెంటికీ పొంతన అవసరం. విమర్శ చేసుకోవడం అంతకన్నా ముఖ్యం.

మంచి చెడులను విశ్లేషించుకొనడమే విమర్శ. 'నేను' అనేది ఆత్మ స్వరూపం. ఆత్మ విమర్శతో కూడిన మాటలు, చేతలు శుద్ధత్వంతో ఉంటాయి. ప్రయోజనకారిగా ఉంటాయి. సర్వజనామోదంగా ఉంటాయి. క్షీర నీరాలను హంస ఏ విధంగా వేరు చేస్తుందో, ఆత్మ విమర్శ యుక్తాయుక్తాలను ఆ విధంగానే ఎంచి చూడగలుగుతుంది. సన్మార్గ బోధినిగా ఉంటుంది. మాటకు మర్యాద, మన్నన; చేతకు పూర్ణత్వం, ఫలత్వం- ఆత్మవిమర్శవల్లే సాధ్యం! లక్ష్య సాధనల్లో ముందస్తు 'విమర్శ' సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకొనగలుగుతుంది.

ఇదొక ధర్మపీఠం. ధర్మపథాన్ని చూపుతుంది. మనసు ఆ పథంవైపు పయనించాలి. పచ్చని చెట్టును మోడులా, మోడును చిగురింపజేసే శక్తిలా, మనసు అద్భుతాలే చేస్తుంది.

ప్రతి ఒక్కరూ నూరేళ్ల జీవితాన్ని ఫలవంతం చేసుకోవాలి. జీవనగమ్యాలు చేరుకోగలగాలి. తనకు తానే ఓ ప్రబోధకుడిగా మారాలి. ఆత్మవిమర్శ లేని భావాలు, చర్యలు విరుచుకుపడే జలప్రవాహంలానే ఉంటాయి. దుందుడుకుగా, ఏకరీతిగా సాగిపోయే తీరు ప్రతికూల ఫలితాలనే కట్టబెడతాయి. ఆత్మవిమర్శ పరుగులుతీసే జలప్రవాహానికి అడ్డుకట్ట లాంటిది. జలం స్థిరంగా ఉండిపోతే కాలుష్యాలన్నీ అడుగుకు చేరుకుంటాయి. స్వచ్ఛమైన జలం పైకి తేరుకుంటుంది.

జీవితంకూడా స్వచ్ఛంగా ఉండాలి. అంతరాత్మ పారదర్శకంగా తయారు కావాలి. అప్పుడే తానొక తెరచిన పుస్తకం. ఆ పుస్తకంలోని పుటలన్నీ సువర్ణాక్షరమయమే. ఆత్మవిమర్శతో కూడిన ఆచరణే ఇందుకు దోహదపడుతుందని తెలుసుకోవాలి.
                                                           - దానం శివప్రసాదరావు 

No comments:

Post a Comment