ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Friday, 16 May 2014

కర్మయోగం


ళ్లు వంచి కష్టపడాలనే భగవంతుడి ఉద్దేశాన్ని తేనెటీగలు, చీమలు, కొన్ని రకాల పురుగులు, అడవిలో జంతువులు చక్కగా నెరవేరుస్తున్నట్లు కనపడుతుంది. కొందరు మనుషులు మాత్రం- తాము కూర్చోవాలి, ఇతరులు కష్టపడాలి, వాళ్ల కష్టాన్ని హాయిగా దోచుకోవాలనే దుర్మార్గపు ఆలోచనతో బతుకుతుంటారు. ఇది భగవంతుడు నిర్దేశించిన కర్మ మార్గానికి విరుద్ధం. ఇతరుల కూడు కొల్లగొట్టే ఇలాంటివారు లోకానికి ప్రమాదం. వీళ్లకు భవిష్యత్తు ఉండదు.
జీవితమంతా పని చెయ్యాలి. శ్రమైక జీవనసౌందర్యం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఎవరి పని వారు చెయ్యాలి. మనల్ని ఒక ప్రదేశంలో ఉంచి, మనతో ఒక ప్రయోజనం నెరవేరేటట్లు మన జన్మను తీర్చిదిద్దిన ఆ భగవంతుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? చక్కగా కష్టపడి పనిచేసి బతుకుతూ, హాయిగా ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తూ జీవించడం తప్ప!

కర్మయోగంలోనే కాదు, భక్తియోగంలోనూ పంచేంద్రియాలకు, మనసుకు పని ఉంది. జ్ఞానయోగంలో మనసుకు, వివేకానికి బోలెడంత పని ఉంది. కదలకుండా ఒక దగ్గర కూర్చున్నట్లు కనిపించినా- యోగులు చేసే పని అనితర సాధ్యం! కదులుతున్నట్లు కనిపించినా బుద్ధి తక్కువ పనులు చేసేవాళ్లు ఏం పని చేస్తున్నట్లు? చేసే పనిలో నాణ్యత ఉండాలి. ఒక లక్ష్యం ఉండాలి. ఉన్నతంగా ఉండాలి. తక్కువ కాలంలో ఎక్కువ పనిచేసి కొత్త విషయాలను అందించి లోకోపకారం చెయ్యగలగాలి.

దైవాన్ని అర్థం చేసుకున్నవాళ్లు పనిని విమర్శించరు. తమకు కేటాయించిన పనిని ప్రసాదంగా స్వీకరిస్తారు. తమకు ఇచ్చిన పనిని అంకితభావంతో ఎవరూ వేలెత్తి చూపడానికి అవకాశం లేకుండా పూర్తిచేసి, తమదైన ముద్ర వేస్తారు.

అంతమంది వీరులు ఉండగా అర్జునుణ్నే కురుక్షేత్ర యుద్ధానికి సమాయత్తం చేశాడు శ్రీకృష్ణుడు. ఎందుకు? అతడి విలువిద్యానైపుణ్యం, కార్యనిర్వహణ సామర్థ్యం అసాధారణమైనవి. పని వెంట విజయం ఉంటుంది. మన పని మనం పరిపూర్ణమైన మనసుతో వివేచనతో చేస్తే- దైవబలం, ఫలం తప్పక లభిస్తాయి!

దేవతలు వేరుగా లేరు. మానవ దేహాలను అంటిపెట్టుకుని తిరుగుతూ ఉంటారంటారు పెద్దలు. వాళ్ల లోకాలు నరదేహంలోనే నిర్మించుకున్నారు. శిరస్సు నుంచి పాదం వరకూ వ్యాపించి ఉన్నారు. దేహంలో రకరకాల పనులు నిర్వహిస్తున్నారు. మనం బయట పనులు చేస్తుంటే, వాళ్లు లోపల పనులు చేస్తున్నారు. నిజానికి వాళ్లు చేయాల్సిన పనులు అత్యంత జాగరూకతతో, నిరంతర అప్రమత్తతతో చెయ్యకపోతే మన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి.

దేహంలో అంతర్గత కార్యకలాపాలైన రక్తప్రసరణ, గుండె కొట్టుకోవటం, కాలేయం, మూత్రాశయం, మూత్రపిండాలు పనిచేయడం, జీర్ణవ్యవస్థ పనిచేయడం, శిరస్సులో మెదడు కోటానుకోట్ల కణజాలంతో అనుసంధానమై పనిచేయడం... ఇదంతా ప్రకృతి చేసిన ఏర్పాటే.

విశ్వవ్యవస్థలో నిరంతర కర్మ జరుగుతూనే ఉంటుంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రకృతి తన చైతన్యంతో విస్తరించి ఉంటుంది. రాత్రి మరో కర్మకు తెరతీసి జీవులను సేదతీరుస్తూ ఉంటుంది.

నిజంగా, శాశ్వతంగా మనం బతకాలనుకుంటే మన పని గురించి గొప్పగా, ఉన్నతంగా మన మరణం తరవాతా ప్రతి ఒక్కరూ చెప్పుకోవాలి. అలాంటి పని చెయ్యాలి. తప్పకుండా చేద్దాం. భగవంతుడి ఉద్దేశాన్ని నెరవేరుద్దాం.
- ఆనందసాయి స్వామి 

No comments:

Post a Comment