ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Sunday 11 May 2014

నీవే ఓ ప్రపంచం


'ప్రపంచం మొత్తం నీలో ఉంది. ఎలా చూడాలో గ్రహించాలో తెలిస్తే తలుపు అక్కడే ఉంది. భూమిమీద ఉన్న ఏ ఒక్కరూ నీకా తాళంచెవిని ఇవ్వలేరు. తలుపూ తెరవలేరు, నీవు తప్ప!'. ఈ వాక్యాలు చెప్పినవారు గురువా, యోగి పుంగవుడా, అవధూతా? ఆయనను ఏమని సంబోధించినా తక్కువ చేసినట్లే అవుతుంది. ఆయనే జిడ్డు కృష్ణమూర్తి. మహా వక్త, దార్శనికుడు, ఎంతమందికో జీవితం పట్ల అవగాహన కలిగించిన మార్గదర్శకుడు. తాను భారతదేశానికో మరొక దేశానికో సంబంధించిన భావనాత్మక ఆలోచనకు కాని, సిద్ధాంతానికి కాని ప్రతినిధిని కాదన్నారు.
'మన పరిసరాల నుంచి బాంధవ్యాల నుంచి ఎక్కడికో పారిపోవటం కాదు. ఉన్నచోటనే ఉండి, ఎదురయ్యే క్షణంలోని సమస్యను అవగాహన చేసుకోవా'లన్నారు కృష్ణమూర్తి. సమాజ నిర్మిత కట్టుబాట్లను అర్థం చేసుకుని, మరింత క్రమశిక్షణ పేరుతో వాటికి బందీలు కాకుండా స్వేచ్ఛా జీవితాన్ని పొందాలన్నారు. స్వేచ్ఛ అనేది ఒక భావం కాదు, ఒక స్థితి. ఆలోచనలో చిక్కుకొన్న మనసు... స్వేచ్ఛను తెలుసుకోలేదు. దానిని బయటనుంచి యథార్థంగా చూడగలిగినప్పుడు మాత్రమే స్వేచ్ఛను అవగాహన చేసుకోగలదు. అలా చూడగలగాలంటే సావధానత ఎంతో అవసరం. అది ఎలా వస్తుందన్న ప్రశ్నకు సమాధానంగా 'సావధానంగా లేము అనే ఎరుకే సావధానత తెస్తుంది' అని చెప్పారాయన. 'తన లోపల ఉన్న ఆలోచనల్ని బహు స్పష్టంగా పరిశీలిస్తూ సావధానతలో ఉంటే, మనసు మౌనమవుతుంది. ఆ మౌనంలో నుంచి సమస్తం చూడగలం. ఆ స్థితిలో మాత్రమే ఉన్నదానిని గ్రహించి అఖండమైన క్రియ చేయగలరు. అదే- సత్యాన్ని గ్రహించటం' అన్నారు. తనను తాను ఉద్దేశించి మాట్లాడుతూ 'నేను ఒకే ఒక్క నిమిషంపాటు ఎరుకతో ఉంటే, ఒక గంటపాటు సావధానత లేకుండా గడుపుతాను. ఆ గంట గడచిన తరవాత తిరిగి సావధానమవుతాను' అంటూ వివరించారు. అదే మనమూ ఆచరించగలిగితే, మన లోపల అద్భుతమైన యోగక్రియ జరగటాన్ని గమనించవచ్చు. చేతన, అచేతన మనసులను అప్పుడే అవగాహన చేసుకోగలం.

'అసలు ఏదీ... దేనికీ వేరు కాదు' అంటారాయన. ఆలోచన- ఆలోచనాపరుడు, అనుభూతి- అనుభూతి చెందేవాడు... వేరుకాదు. అన్నీ తనలోనే ఉన్నాయి, తానే అయి ఉన్నాయి. అన్నింటినీ వేరుగా విభజించటం వల్ల అన్వేషణ అనే పేరుతో బయట వెదుకుతున్నాం. నిజానికి సమస్య, పరిష్కారం రెండూ నీలోనే ఉన్నాయన్నారు. 'మొత్తం నీలో ఉంది. నీ అంతరంగాన్ని శోధించగలిగేది నీవే. కోరికలు, భావాలు, కోపాలు, ద్వేషాలు, ప్రేమ, కరుణ అన్నీ నీలో నిబిడీకృతమై ఉన్నాయి. పరిశీలన అనే కాగడాతో అణువణువూ వెదికి చూస్తే, అన్నీ నీలో కనపడతాయి. ఎప్పుడైతే నిన్ను నీవు తెలుసుకోగలవో అప్పుడే సత్యాన్ని ఆవిష్కరించుకోగలవు' అన్నారు.

'సత్యం... ఎవరో చెబితేనో గ్రంథాలు చదివితేనో తెలిసేది కాదు. అది తనలోకి తాను అవలోకించి అనుభూతి చెందగలిగేది. అప్పుడే- నీ సుఖాలకు దుఃఖాలకు, శాంతికి అశాంతికి కారణాలు తెలుసుకోగలవు. ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించుకోగలవు. అప్పుడు నీకు నువ్వే ఓ ప్రపంచం కాగలవు' అన్నారు జిడ్డు కృష్ణమూర్తి.

సన్యాసం తీసుకొని జీవితం నుంచి పారిపోవాలనుకుంటారు. మనిషిలో ఉన్న మనసు నుంచి పారిపోలేరు కదా! ఎక్కడికెళ్ళినా అది వారితోపాటే ఉంటుంది. ఇంట్లో చొరబడిన దొంగను పట్టుకోవాలంటే- జాగ్రత్తగా వాడిని గమనిస్తూ వెనకే వెళ్ళాలి. అలాగే మనసును తెలుసుకోవాలంటే ఆ మనసు ఎటు పయనిస్తుందో, ఎలా స్పందిస్తుందో గమనించాలి. ఆ గమనికే జరుగుతున్న వాటిపట్ల ఎరుక కలిగిస్తుంది. తన గురించిన జ్ఞానం కరతలామలకం అవుతుందని ఆయన ఉద్బోధించారు.

'కులం, మతం, దేశం అంటూ విభజించటం వల్ల మనుషులు సైతం విభజనకు గురవుతున్నారు. ఏ ప్రజలకైనా భాష, ఆహారం, అలవాట్లు వేరు కావచ్చు కాని- మానసిక స్థితి అందరిదీ ఒక్కటే. అందరిలోనూ అభద్రతా భావనలు, భయాలు ఒక్కటే. అందుకే నేను, నీవు అంటూ విడిపోకుండా సమస్యలను కలిసి చర్చిద్దాం- పరిష్కారం దొరుకుతుందేమో. అప్పుడే ఒక నవ్య సమాజాన్ని, ప్రేమపూరిత సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలం' అంటూ ఆయన ఇచ్చిన సందేశం ఆచరణ యోగ్యం. ఆయన సరళమైన జీవనశైలి మహోన్నతం. అందరికీ అనుసరణీయం.
- డాక్టర్‌ డి.చంద్రకళ

No comments:

Post a Comment