ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Wednesday 31 July 2013

సాయుజ్యముక్తి


 జనని గర్భాన పుట్టిన నాటి నుంచి ధరణి గర్భంలో కలిసిపోయేవరకు లోకంలో మనిషిని అనుక్షణం వెంటాడేవి దుఃఖాలు. వీటికి అంతం లేదు. ఒక స్వరూపం లేదు. ఒక స్వభావం లేదు. మనిషి బతికి ఉన్నంతకాలం ఏ క్షణంలోనైనా, ఏ సందర్భంలోనైనా, ఎక్కడైనా దుఃఖాలు సంభవించవచ్చు. ఈ దుఃఖాలు తొలగిపోవాలంటే ఏమి చేయాలి? బుద్ధి తెలిసిన నాటి నుంచే మనిషి అందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ అవి తొలగిపోవడం అంత సులభం కాదనీ, వాటిని నిర్మూలించాలంటే విశేష ప్రయత్నమే చేయాలనీ తెలుసుకున్నాడు. త్రిగుణాలకు లోబడిన అతడి ప్రవృత్తి దుఃఖాన్ని ఎంతమాత్రం దూరం చేయలేకపోతోంది.

మనిషికి కలిగే దుఃఖం సహజమైందా? లేక ఏదైనా కారణంతో వచ్చి చేరిందా? దీనిపై వేదాంతులు సుదీర్ఘ చర్చలు చేశారు. వారి శోధనలో తేలిందేమిటంటే- దుఃఖం మనిషికి సహజంగా ఉండేది కాదనీ, కారణంతోనే వస్తూపోతూ ఉంటుందనీ. సహజంగా ఉండేదే అయితే మనిషికి ఎల్లప్పుడూ దుఃఖాలే ఉండాలి. సుఖాలు అసలే ఉండకూడదు. అయితే అలా ఉండటం లేదు కదా! దుఃఖాలు వస్తున్నాయి, పోతున్నాయే తప్ప స్థిరంగా ఉండటం లేదంటే ఏదో కారణం ఉండి తీరాలి. ఏమిటా కారణం?

మనిషి మెదడులో ఆలోచన ప్రారంభం అయింది. అప్పుడు మనిషి లోకంలోని అన్ని వర్గాలవారినీ పరిశీలించడం ప్రారంభించాడు. ఒక నిరుపేద అయిన సామాన్య జనుడు మొదలుకొని దేశాన్ని పాలించే మహారాజు దాకా అందరిలో ఏ ఒక్కరైనా దుఃఖం లేకుండా ఉన్నారా? శోధించడం మొదలుపెట్టాడు. అతడి శోధనలో ప్రపంచంలోని ఏ ఒక్కరూ దుఃఖానికి అతీతులైనవారు కనబడలేదు. ప్రతి ఒక్కరూ, ఏదో ఒక సమయంలో దుఃఖాన్ని అనుభవిస్తున్నవారే అని తేలింది. అందువల్ల దుఃఖానికి మూలకారణం ఏదో ఒకటి ఉండితీరాలి అనే జిజ్ఞాస మొదలైంది. మానవాతీతులైన దేవతలకూ, రాక్షసులకూ కూడా దుఃఖాలు తప్పలేదు. దేవతలకు రాక్షసుల కారణంగా దుఃఖాలు సంభవించాయి. రాక్షసులకు దేవతలవల్ల దుఃఖాలు కలిగాయి. దేవ, మానవ, రాక్షసులకు వారి వారి శరీరాలు ఉన్నాయి. ఆ శరీరాలే దుఃఖాలకు మూలకారణాలని మనిషి తెలుసుకొన్నాడు.

ఆత్మకు దుఃఖం ఎన్నడూ లేదు. శరీరానికే దుఃఖం సంభవిస్తుంది. అత్యంత కష్టతరమైన వ్యవసాయం, బరువులు మోయడం వంటి పనులు చేసే మనిషి ఆ దుఃఖాన్ని మరచిపోవడానికి పనిచేస్తూ పాటలు పాడుతుంటాడు. కనుక మనిషికి సుఖం అనేది మాయే. శరీరం ఉన్నందువల్లనే ఆకలిదప్పులూ, ఎండవాన చలి బాధలు, విష కీటకాల వల్ల ఆపదలూ, రోగాలూ... ఇలా ఎన్నో ఎన్నెన్నో! ఇవన్నీ శరీరం ఉన్నందువల్లనే కలుగుతున్నాయి. దేవతలు, రాక్షసులు శరీరధారులైనందువల్లనే పరస్పరం కలహించుకొని, యుద్ధాలతో, శాపాలతో దుఃఖాలు అనుభవించారు. కనుక శరీరధారణే దుఃఖాలకు మూలం.

మనిషి అజ్ఞానంతో తన దేహాన్ని ఆత్మగా భావించి దుఃఖాలు కొనితెచ్చుకుంటున్నాడు. శరీరం వేరనీ, ఆత్మ వేరనీ తెలిస్తే దుఃఖం ఉండదు. ప్రపంచం అంతా ఒక శరీరమే. శరీరం శాశ్వతం కాదు. ఏనాటికైనా నశించిపోతుంది. ఆత్మ ఒక్కటే నిత్యం, శాశ్వతం. ప్రపంచం ఎంత అందంగా ఉన్నా, అది ఎప్పటికో ఒకప్పటికి నశించిపోయేదే కాని శాశ్వతంగా ఇలాగే ఉండిపోదు. అలాగే మానవశరీరం కూడా. అది ఎన్నటికైనా నశించిపోవలసిందే కనుక శాశ్వతత్వం లేదు. శాశ్వతం కాని శరీరం వల్లనే మనిషికి దుఃఖాలు సంభవిస్తున్నాయి. మనిషి తన శరీరాన్ని చూసుకొని నేను గొప్ప అందగాణ్ననీ, నేను గొప్పవంశంలో పుట్టినవాణ్ననీ, గొప్ప పదవి గల వాణ్ననీ, బాగా డబ్బుగలవాణ్ననీ విర్రవీగుతుంటాడు. కాని వాడి శరీరమే శాశ్వతం కాదని తెలుసుకోడు. శరీరాన్ని చూసుకొని మురిసిపోయే మనిషి ఆత్మ ఉన్నదనే సంగతిని మరచిపోతూ అజ్ఞానాంధకారంలో పడి కొట్టుకొనిపోతుంటాడు.

శాశ్వతం కాని శరీరాన్ని చూసుకొని, అదే శాశ్వతం అనుకొంటున్నందువల్లనే మనిషికి దుఃఖాలు సంభవిస్తున్నాయి. శరీరాన్ని చూసి, అదే గొప్పదని అనుకొన్నప్పుడే దుఃఖాలు సంభవిస్తున్నాయి. శరీరం గొప్పది కాదనీ, అది నశించిపోయేదనీ, ఆత్మ ఒక్కటే నిత్యం అనుకొన్నప్పుడే మనిషికి దుఃఖం దూరమవుతుంది. కనుక మనిషి తెలుసుకోవాల్సిన సత్యం ఒక్కటే- 'శరీరం ఎన్నటికీ శాశ్వతం కాదు. శరీరం వల్లనే దుఃఖాలు కలుగుతున్నాయి. కనుక మళ్ళీ శరీర రూపమైన జన్మలేకుండా పరమాత్మలో లీనమయ్యే సాయుజ్యముక్తి కలగాలి. అదే శాశ్వతం!'
                                                    - డాక్టర్‌ అయాచితం నటేశ్వర శర్మ 

Tuesday 30 July 2013

స్వీయ గమనిక


మనిషి కళ్లు తెరచిన నాటినుంచి ప్రపంచాన్ని గమనిస్తుంటాడు. చూస్తాడు. వింటాడు. మాట్లాడతాడు. ఆడతాడు. పాడతాడు. నదీప్రవాహంలో పడవలా, కాలవాహినిలో జీవనయానం సాగిపోతుంటుంది.

ఆధ్యాత్మిక ప్రపంచం ఒక అంతర్లోకమనే సత్యాన్ని సామాన్యులు గుర్తించరు. మనిషి వేషభాషలు, ప్రవర్తనను బట్టి అంచనాలుంటాయి. తను ఏమి చేసినా, ఎలా ఉన్నా అది సవ్యమేనన్న భావనతో మనిషి జీవిస్తూ ఉంటాడు. ఎదుటివారి లోపాలను వేలెత్తి చూపుతాడు. తనకు ఏ లోపాలూ లేవనే భ్రమలో ఉంటాడు.

లోపాలు వేలెత్తిచూపటమే పెద్దలోపం!
తల్లిదండ్రులకు, గురువుకు, సన్మిత్రుడికి మనలోని లోపాలు సరిదిద్దే హక్కు ఉంటుంది. ఇతరులు కేవలం మనల్ని అవహేళన చేయటానికే మనలోని లోపాలు వేలెత్తి చూపుతారు. ఇవి మేలుకన్న కీడు ఎక్కువగా చేస్తాయి. ఎందుకంటే, మనసు పసిపాపలాంటిది. ప్రేమగా చెబుతే వింటుంది. నిందిస్తే ఎదురు తిరుగుతుంది. ఎంత మంచి సలహా అయినా తియ్యగా చెప్పాల్సిందే. అప్పుడే మనసు దాన్ని స్వీకరిస్తుంది.

శ్రీకృష్ణుడు 'సత్యం ప్రియం హితం' అనే సూత్రాన్ని మనకు సూచించాడు. ఇది ప్రజా సంబంధాల్లో ప్రాణప్రదమైనది. సత్యమే చెప్పాలి. ప్రియంగా చెప్పా లి. హితం ఉండాలి. ఇది పాటిస్తే మనకు ఎదురుండదు. నిందను మనం భరించలేం కదా... ఇతరుల్ని నిందించే హక్కు మనకెక్కడిది?

బాల్యావస్థలో తల్లిదండ్రులు, గురువులు మన జీవనశైలికి మెరుగులు పెడతారు. ఎన్నెన్నో మందలింపులు, సూచనలు, సలహాలు వారి నుంచి మనకు లభిస్తాయి. వాటిని మహాప్రసాదంగా భావించి స్వీకరించిన వారందరూ జీవితంలో ప్రయోజకులైనవారే. ఉన్నత స్థాయికి చేరుకున్నవారు తమ బాల్యస్మృతుల్ని గర్వంగా చెప్పుకొంటారు. కోట్లు గడించినవారూ ఒకప్పుడు తాము తిండికి లేని వారమని చెప్పుకొనేందుకు సిగ్గుపడరు. వాల్మీకి ఒకనాటి బోయవాడే! కాబట్టి, జీవితసోపానాలు నేలమీద మొదలవుతాయి. మన సంకల్పం, పాదాల శక్తిని బట్టి శిఖరాన్ని చేరుకోగలుగుతాం.

ఆధ్యాత్మిక ప్రయాణంలో స్వీయ గమనిక అత్యుత్తమ విధానమని అనుభవజ్ఞులు చెబుతారు. మనిషి తనను తాను ప్రతిక్షణమూ గమనించుకోవడమే స్వీయ గమనిక. రోజూ అనేకసార్లు అద్దంలో మన ముఖారవిందాన్ని చూసుకుని మురిసిపోతుంటాం. అదే విధంగా బుద్ధిని అంతర్దృష్టిగా మార్చుకోవాలి. అప్పుడు మనం రెండుగా విడిపోతాం. ఒకటి కర్మ శరీరం. రెండోది జ్ఞానదేహం. రెండోది ప్రారంభ దశలో కేవలం మనల్ని గమనిస్తుంటుంది. పోను పోను మనలోని లోపాలు సరిదిద్దే గురువుగా మారిపోతుంది.

పసివాడిగా ఉన్నప్పుడు మనకు తల్లి స్నానం చేయిస్తుంది. పెద్దయ్యాక మనమే శరీర శుభ్రతకు స్నానం చేస్తాం. ఇదీ ఇంచుమించు అలాంటిదే. మనలోని కాలుష్యాలను మనమే తొలగించుకునేందుకు స్వీయగమనిక గొప్ప యోగసాధనగా మనం గ్రహించాలి.

ఒకసారి స్వీయ గమనికకు అలవాటుపడ్డాక మనలో చాలా చాలా మార్పు వస్తుంది. ఆత్మప్రకాశం మనకు అనుభవంలోకి వస్తుంది. అంతర్యామితో మన బంధం బలపడుతుంది. అదే స్వీయగమనిక అసలు ప్రయోజనం.                                                             - కాటూరు రవీంద్రత్రివిక్రమ్‌ 

Monday 29 July 2013

బతుకు బంగారం


  బంగారం! విలువైనది... ప్రపంచమంతటా చలామణీ అయ్యేది. కొందరి దృష్టిలో పవిత్రమైంది. తప్పక ధరింపదగింది! కానీ- మనం విస్తుపోయే విషయం- 'స్వర్ణం కలికి నిలయం' అని భాగవత ప్రవచనం. అంటే, బంగారం పాపాలపుట్ట అన్నమాట!
శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు. కలి ప్రవేశించాడు. పరీక్షిత్తు కలి ఆట కట్టించడానికి బయలుదేరి సరస్వతీ నదీతీరానికి వచ్చాడు. అక్కడ ఒక ఎద్దూ ఆవూ మాట్లాడుకోవడం విన్నాడు. గోమాతను వృషభం అడిగింది- 'ఎందుకమ్మా ఏడుస్తున్నావు? కన్నబిడ్డలు నిన్ను విడిచి వెళ్లారనా? రాజులు అధర్మంగా పరిపాలిస్తున్నారనా? రాక్షసులు విజృంభించారనా? లోకంలో ఉత్పాతాలు సంభవిస్తున్నాయనా? మనుషులు ఆత్మతత్వాన్ని అవతలపెట్టారనా? లేక... నేను మూడు కాళ్లు పోగొట్టుకొని ఒంటికాలిపై నిలబడాల్సి వచ్చిందనా?'- అని. ఆ గోమాత ఎవరో కాదు, భూమాత! ప్రశ్నలడిగిన వృషభం ధర్మదేవత.

గోమాత బదులు పలికింది. 'లోగడ నీవు నాలుగు కాళ్లతో నడిచేదానివి. కలి ప్రవేశించాడు. ఒంటికాలి దానివి అయ్యావు. ఇకపై ఎవరిపై ఆధారపడి జీవించాలి?'. ఇంతలో ఒక పురుషుడు కర్రతో గోమాతను కొట్టాడు. ఎద్దును కాలితో తన్నాడు. ఈ అమానుష కృత్యం చూసిన పరీక్షిత్తుకు కోపం వచ్చింది. 'ఓ వృషభరాజా! దుఃఖించ వద్దు. ఈ దుర్మార్గుణ్ని చంపుతాను. నిన్ను నాలుగు పాదాలతో తిరిగి నడిపిస్తాను. ఓ గోమాతా! శ్రీకృష్ణుడు లేడని కుంగిపోవద్దు. నేనున్నాను. దుష్టశిక్షణకు శిష్టరక్షణకు రాజుల్ని బ్రహ్మ సృష్టించాడు. సాధుజీవుల్ని బాధించేవారిని శిక్షించని రాజు ఆయుష్షూ, సంపదా నశిస్తాయి!'. పరీక్షిత్తు పలుకులు విని వృషభం ఇలా అన్నది- 'రాజా! మావల్ల మానవులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఇందాక మా కన్నీటికి కారణం అడిగావు. మన సుఖదుఃఖాలకు కారణం మనమే అని నాస్తికులు పేర్కొంటారు. ధర్మమే మూలకారణం అని మీమాంసకులు పలుకుతారు. జ్యోతిష్కులు గ్రహాలే కారణం అని గట్టిగా వాదిస్తారు. స్వభావమే కారణం అని లోకాయితికులు అభిప్రాయపడతారు. ఇందులో ఏది నిజమో తేల్చగలవా?'

'ప్రతిదీ పరమేశ్వరాధీనం!' అని వృషభం మాటలను బట్టి పరీక్షిత్తు గ్రహించాడు- తన ఎదుట ఉన్నది సాక్షాత్తు ధర్మదేవత అని నిశ్చయించుకున్నాడు. 'ఓ ధర్మదేవతా! నీకు నమస్కారం. నీకు తపస్సు, శౌచం, దయ, సత్యం అనే నాలుగు పాదాలుండేవి. కృతయుగంలో 'గర్వం' అనే దుష్టశక్తివల్ల నీకు తపస్సు అనే ఒక పాదం పోయింది. త్రేతాయుగంలో 'సంగరూప అధర్మం'వల్ల 'శౌచం' అనే పాదం పోయింది. ద్వాపర యుగాంతంలో 'మదం' కారణంగా 'దయ' అనే పాదం పోయింది. ఇప్పుడు కలి ప్రవేశించాడు. అసత్యప్రచారం వల్ల 'సత్యం' అనే నీకున్న ఆ ఒక్క పాదాన్నే లేకుండా చేస్తాడు. ఈ గోమాత భూదేవి అని గ్రహించాను. శ్రీకృష్ణుడి పవిత్ర పాదస్పర్శతో పునీతమైన తన శరీరం దుర్మార్గుల పాదతాడనానికి గురికావాల్సి వచ్చిందే అని ఈ తల్లి శోకిస్తున్నది. మిమ్మల్ని కొడుతున్న ఈ పురుషుడే కలి. వీడినిప్పుడే అంతం చేస్తాను!' అని పరీక్షిత్తు కత్తి ఎత్తాడు. కలిపురుషుడు 'శరణు శరణు' అన్నాడు. 'శరణు అన్నవారిని రాజులు చంపకూడదు. కానీ, నీకు ఇక్కడ స్థానం లేదు. అసత్యం, చోరత్వం, కలహం, మొదలైన చెడులన్నీ నిన్ను ఆధారం చేసుకొని వ్యాపిస్తాయి. వెళ్లిపో!' అని పరీక్షిత్తు ఆగ్రహంతో పలికాడు. 'రాజా! ఎక్కడికని పోను? దయతో ఏదైనా దారి చూపించు' అని కలి ప్రార్థించాడు. 'ఓ కలీ! నీవు హింస, వెలది, జూదం, మద్యపానం అనే స్థానాల్లో నివసించు!' అన్నాడు పరీక్షిత్తు. 'రాజా! ఈ నాలుగూ కలిసిన ఒకేచోటు అనుగ్రహించు!' అని దీనంగా పలికాడు కలి. 'అయితే స్వర్ణమే నీకు తగిన చోటు!' అని కలిని పరీక్షిత్తు అనుగ్రహించాడు. దయ, తపస్సు, శౌచం అనే మూడు పాదాలూ వృషభరూపంలో ఉన్న ధర్మదేవతకు తిరిగి వచ్చాయి. గోరూపంలో ఉన్న భూదేవి సంతోషించింది. కలి కూడా బంగారంలో కలిసిపోయి కులుకుతున్నాడు. అటువంటి బంగారాన్ని రక్షించుకోవడానికే మనుషులు నానాపాట్లు పడుతుంటారు. బంగారం పంపకాల వల్ల మమతలు మాయమవుతున్నాయి. సమాజంలో సంపదకున్న విలువ సత్యానికి లేదు. దయకు లేనేలేదు. కలి అన్నింటినీ బలి తీసుకున్నాడు. స్వర్ణాభరణాలు దేవతా విగ్రహాలను కప్పివేస్తున్నాయి. అసలు రూపదర్శనం అపూర్వమయ్యే స్థితి దాపురించింది. ఇది కలిమహిమకాక మరేమిటి?
బతుకు, బంగారం- ఈ రెంటినీ న్యాయదేవత త్రాసులో పెడితే? బతుకువైపే తప్పక ముల్లు చూపుతుంది. మనకు బతుకు బంగారం లాగా ఉండాలేగాని, బంగారమే బతుకు కాదు!
- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు 

Sunday 28 July 2013

ఆషాఢ బోనాలు

 మైక్య జీవన సౌందర్యానికి ప్రతిబింబాలు- పండుగలు, పర్వదినాలు, ఉత్సవాలు, జాతరలు, వేడుకలు. పేరేదైనా సరే, సామూహిక భక్తి చైతన్యం, సమష్టితత్వం, సామాజిక ఐక్యత ఈ సంబరాల్లో ప్రకటితమవుతాయి. సమస్త ప్రకృతినీ దైవస్వరూపంగా, దివ్యశక్తిగా ఆరాధన చేసే సనాతన సంప్రదాయం మనది. ప్రకృతి శక్తి అయిన జగన్మాతను మంత్రతంత్రాలతో, యజ్ఞయాగాదులతో అర్చించే విధానమే కాక, నిష్కల్మష భక్తితో, తమకు తెలిసిన పద్ధతిలో, తమకు అనుకూలమైన రీతిలో అమ్మను ఆరాధించే సంస్కృతి కూడా అమలులో ఉంది. జీవవైవిధ్యానికి ప్రతిఫలంగానే ప్రకృతి మాతను కొలుచుకుని, అనుగ్రహాన్ని పొందడానికి ఈ వెసులుబాటును, అందుబాటును మనం పొందగలిగాం. ఆ పరంపరలోనిదే తెలంగాణ ప్రాంతంలో నిర్వహించుకునే బోనాల సంబరం. ఆషాఢ బోనాలు, ఆషాఢ జాతరగా వ్యవహరించే ఈ సంరంభానికి జానపదుల సంస్కృతీ సంప్రదాయాలే ఆలంబన.

దైవశక్తి ఏ కొందరిదో కాదు, అందరిదీ అనే భావన జానపదుల వేడుకల్లో పరిఢవిల్లుతుంది. తమ జీవనశైలిని సమ్మిళితం చేసి దేవతల్ని ఆరాధించే ఉదాత్త వైఖరి బోనాల సంబరంలో వెల్లివిరుస్తుంది. ప్రకృతిశక్తి విభిన్న కళలే గ్రామదేవతలని దేవీభాగవతం చెబుతోంది. వీరి శుభదీవెన వల్లే గ్రామాల్లో ఎలాంటి ఉపద్రవాలు, అరిష్టాలు కలగకుండా సకల సౌభాగ్యాలు చేకూరుతాయని ప్రతీతి. వర్షాలకు నెలవైన ఆషాఢమాసం ప్రకృతిపరంగా ఎన్నో మార్పులకు నేపథ్యం వహిస్తుంది. ఎన్నో రోగకారక పరిస్థితులున్న ఈ తరుణంలో అన్ని అవరోధాల్నీ, అనారోగ్యకర వాతావరణాన్ని అధిగమించాలంటే గ్రామదేవతల ఆరాధనే మార్గమని జానపదుల నమ్మకం. పోచమ్మ, ఎల్లమ్మ, చిత్తారమ్మ, పోలేరమ్మ వంటి గ్రామదేవతల స్వరూపాలు వైదిక సంస్కృతినుంచి విస్తరిల్లినవే! గ్రామం ఎల్లల్లో ఉండే అమ్మ (ఎల్లమ్మ), చిత్తశాంతిని కలిగించే అమ్మ (చిత్తారమ్మ), నూకలు అనగా ఆహారాన్ని అందించే అమ్మ (నూకాలమ్మ), ముక్తిని ఇచ్చే అమ్మ (ముత్యాలమ్మ), ఎల్లరూ కొలిచే అమ్మ (ఎల్లారమ్మ), భక్తుల్ని బ్రోచే అమ్మ (పోచమ్మ), చింతల్ని నివారించే అమ్మ (చింతాలమ్మ)... ఇలా జానపదులు తమ పలుకుబడులకు అనువుగా అమ్మ ఇచ్చే అనుగ్రహాన్ని బట్టి, వారికి పేర్లను ఏర్పాటుచేసుకుని పూజలు నిర్వహిస్తారు. నైవేద్యాల్ని సమర్పిస్తారు. ఆషాఢమాసంలో జానపదులు తమ నివాస ప్రాంత పరిసరాల్లో ఉండే గ్రామదేవతలకు ప్రత్యేకంగా బోనాలు (అన్న పదార్థాలు) సమర్పణ చేస్తారు. పదిహేనో శతాబ్దం నుంచి ఈ సంప్రదాయం పరివ్యాప్తిలో ఉంది. భాగ్యనగరంలో కులీ కుతుబ్‌షాహీల కాలంలో ఈ సంప్రదాయం విశేషంగా పరిఢవిల్లింది. నేటికీ ఈ సంవిధానం ఓ మహత్తర వేడుకగా, లక్షలాది భక్తులు పాల్గొనే ఉత్సాహపూరిత సంరంభంగా ఆకట్టుకుంటోంది. చరిత్రాత్మకమైన గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో ఆషాఢంలో మొదటి బోనాల వేడుక ఆరంభమవుతుంది. ఘటం ఎదుర్కోళ్లతో సంబరాలకు శ్రీకారం చుడతారు. వ్యాధి నిరోధకశక్తిని పెంచే, క్రిమికీటకాదుల్ని నివారింపజేసే పసుపు కలిపిన నీరు వేపకొమ్మలతో చిలకరిస్తూ అమ్మతల్లి ఆలయాలకు భక్తులు బయలుదేరతారు. తమ మొక్కుబడుల్ని అనుసరించి అన్న పదార్థాల్ని బోనపు ఘటాల్లో అమర్చి నివేదన చేస్తారు.

సాకబెట్టుట (పసుపు జలంతో అభిషేకం), ఫలహారపు బండ్లు (ఆహార పదార్థాల తరలింపు), గావుపట్టుట (సొర, గుమ్మడికాయలతో అమ్మవారికి దృష్టిదోషాన్ని నివారించడం), రంగం (భవిష్యవాణి వివరించడం) వంటి ప్రక్రియలతో ఈ బోనాల వేడుక భక్తుల కోలాహలం, ఆనందాల మధ్య వర్ధిల్లుతుంది. సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలోని బోనాల సందడితో ఈ ఉత్సవ శోభ పతాకస్థాయిని చేరుకుంటుంది. ఆషాఢంలోని ఆదివారాల్లో ఆర్భాటంగా ఈ జాతర కొనసాగుతుంది. లాల్‌దర్వాజ అక్కన్న మాదన్న గుడిలో భక్తులు తుది బోనాల్ని సమర్పించడంతో జాతర సుసంపన్నమవుతుంది.

ఆషాఢంలో శక్తిదేవతల్ని పలు ప్రాంతాల్లో, వివిధ రీతుల్లో అర్చిస్తారు. ఉపాహారాల పేరుతో ఇళ్లల్లో ఆహార పదార్థాల్ని నివేదన చేస్తారు. కొలుపులు, సందళ్లు పేరిట జాతరలు జరుపుతారు. జీవకోటికి ఆధారమైంది- అన్నం. జీవోత్పత్తి, దేహనిర్మాణం, పోషణలు అన్నంవల్లే జరుగుతున్నాయని గీతాచార్యుడి వచనం. భోజనానికి ప్రతిరూపమైన బోనాన్ని స్వీకరించి, సూక్ష్మరూపులైన దేవతాశక్తులు కూడా సంతృప్తి చెందుతాయంటారు. యజ్ఞద్రవ్యమైన అన్నాన్ని సమర్పించడం వల్ల ప్రకృతి శక్తులు ఆనందిస్తాయని పెద్దల మాట. వర్షం, పాడిపంటలు వంటివి ప్రకృతివల్లే మనకు అందుతున్నాయి. 'నీ అనుగ్రహం వల్ల మాకు దక్కినదాన్ని, తిరిగి నీకే నివేదన చేస్తున్నాం, మమ్మల్ని తరింపజేయి' అని ప్రకృతిని వేడుకోవడమే బోనాల సమర్పణలోని అసలైన అంతరార్థం.
                                                           - డాక్టర్‌ కావూరి రాజేశ్‌పటేల్‌

Saturday 27 July 2013

తప్పు-ఒప్పు


ప్పు చేస్తే ఒకసారి క్షమించవచ్చు. మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా ఉండాలి. అప్పుడే ఆ పదం అర్థవంతం అవుతుంది. అలాంటి తప్పే కాదు, మరెలాంటి తప్పూ జరగకూడదనే సందేశం క్షమత్వంలో దాగి ఉంటుంది. తప్పుదారిలో నడుస్తూ, తప్పుడు పనులు మానకుండా, ప్రతిసారీ క్షమించమని వేడుకుని ఇవతలికి రాగానే అంతా మరిచిపోయి మరింత రెచ్చిపోయే ప్రమాదకరమైన వ్యక్తులు సమాజానికి చీడపురుగులు. ఇలాంటి పాపాత్ములను క్షమిస్తూపోతే, సామాజిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి, మూలాలు కదిలిపోయిన మహావృక్షంలా కూలిపోతుంది. అలా జరగకుండా, నైతిక బాధ్యతను గుర్తించి, కట్టుదిట్టంగా సమాజానికి గట్టి పునాది నిర్మించటానికే మతం పుట్టింది. ఈ మహావృక్షం ఎప్పుడు, ఎలా పుట్టిందో తేల్చిచెప్పటం అసాధ్యం. కాని, అందరూ గుర్తుంచుకోవలసిన విషయం ఒకటుంది. నైతిక విలువలు లేని మతం, వేళ్లూనని మహావృక్షం లాంటిది. అది పేకమేడలా ఏ క్షణాన్నైనా కూలిపోతుంది. అలాగే, ఆత్మోన్నతి సాధించలేని శుష్క నీతివాచకం మోడువారిన మహావృక్షంలాంటిది. అది ఉన్నా ఊడినా ఒరిగేది ఏమీ లేదు. వట్టి దండగే అనాలి. తప్పు చేయటం అంటే నిప్పుతో చెలగాటమే. తెలిసి చేసినా, తెలియక చేసినా శిక్ష తప్పదు. బయటికి కనిపించకపోయినా, లోపల అది భుగభుగమంటూ కాలుస్తూనే ఉంటుంది. తప్పుచేశాక దాని తాపం సన్నని మంటలా రగులుతూ మాటిమాటికీ గుర్తుచేస్తూ ఉంటుంది. కాబట్టి, ఫలితం అనుభవించక తప్పదు. పశ్చాత్తాపం పరిశుద్ధం చేస్తుంది. తగిన ప్రాయశ్చిత్తం జరిగేదాకా మనసును ఆ తాపం కొరత వేస్తూనే ఉంటుంది. శరీరంకన్నా మనసు పడే బాధ మరింత దుర్భరం.

మనం చేసే తప్పొప్పులకు, పాపపుణ్యాలకు మనమే బాధ్యత వహించాలి. పాపాల నుంచి ఎలా రక్షించుకోవాలో, అవసరమైతే శిక్ష ఎలా అనుభవించాలో నిర్ణయించుకోవలసింది మనమే. అందుకే మనసు అనే పరికరాన్ని మన చేతిలో పెట్టాడు ఆ భగవంతుడు. ఆలోచించే శక్తి, విశ్లేషించే నేర్పు, యుక్తాయుక్త విచక్షణ- అన్ని గుణాలూ మనసుకే ఉన్నాయి. సృష్టిలో మరే అన్యజీవికీ లేని ఈ వెసులుబాటు ఒక్క మనిషికి మాత్రమే ఉండటం గమనించదగ్గ విషయం. తప్పు చేయటం మానవ సహజం. అది తప్పు అని తెలియగానే ఆ నిప్పును దూరం చేసుకోవాలి. మనకు కనువిప్పు కలగాలి. ఒకసారి చేయి కాలాక, బాధ ఏమిటో తెలుస్తుంది, అనుభవించాలి. అలాంటి బాధలు కలగకుండా జాగ్రత్తపడటం వివేకవంతుడి లక్షణం. అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు లెమ్మనుకుని మన ప్రవర్తన మార్చుకోకపోతే, మనిషి జన్మకు అర్థమే ఉండదు.
                                                                   - ఉప్పు రాఘవేంద్రరావు

Friday 26 July 2013

బోనాల పండగ


   తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకునే పండగ బోనాలు. బోనాల పండగ అనగానే కోలాహలం, ఉరకలెత్తే సంతోషం, కొత్తబట్టలు, పసుపు కుంకుమలు, వేపాకు తోరణాలు. ప్రతీ వీధిలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఎవరికి వారు ఒంటరిగా కాకుండా కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు అందరూ కలిసి గుడికి వెళతారు,. బోనాల పండగరోజు ఆలయాల దగ్గర వినిపించే తెలంగాణ జానపడద పాటలు కూడా అమ్మను స్తుతిసే ఉత్తేజపర్చేలా ఉంటాయి.

అమ్మ తన బిడ్డలందరినీ ఎంతో ప్రేమగా చూస్తుంది. తప్పు చేస్తే మందలిస్తుంది. అయినా సరే వినకుంటే దండిస్తుంది. అప్పుడు ఆ బిడ్డ తన తప్పు తెలుసుకొని సరైన మార్గంలో పయనిస్తాడు. అదే తల్లీపిల్లలకు ఉన్న అనుబంధం. అదేవిధంగా ప్రకృతిమాత లేదా ఆ అమ్మలగన్న అమ్మకు కోపం వస్తే కడూఆ మనని దండిస్తుంది. అప్పుడే ప్రకృతి విలయతాండవం చేస్తుంది. దానివల్ల అంటురోగాలు ప్రబలుతాయి. 1869వ సంవత్సరంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఇలాగే మలేరియా వ్యాధి ప్రబలి తీవ్ర జననష్టం జరిగింది. అమ్మకు కోపం వచ్చిందని భావించిన ప్రజలు ఆమెను శాంతపర్చడానికి ఉత్సవాలు, జాతర జరిపించాలని నిర్ణయించారు. అదే బోనాలు. ఈ పండగను ఆషాడ మాసంలో జరుపుకుంటారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలోనే కాకుండా మరికొన్ని తెలంగాణ ప్రాంతాల్లో ఈ పండగ చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ పండగ ముఖ్య ఉద్ధేశం కలరా, ప్లేగు, మశూచి వంటి అంటువ్యాధులు ప్రబలకుండా ప్రకృతి బీభత్సాలు జరగకుండా పాడిపంటలను, తమ పిల్లలను చల్లగా చూడమని ఆమెకు బోనం సమర్పిస్తారు. ఉగాది తర్వాత చాలా రోజులకు వచ్చే మొదటి పండగ ఇదే.

బోనం అంటే భోజనం. శుచిగా అన్నం వండుకుని దానిని కొత్త ఘటంలో అంటే మట్టికుండ లేదా ఇత్తడి గుండిగలో ఉంచి దానికి పసుపు, కుంకుమలతో అలంకరించి, వేపాకు తోరణాలు కడతారు. అన్నంలో పసుపు లేదా పాలు చక్కెర కలిపి నైవేద్యం తయారుచేస్తారు. ఆ పాత్రపైన ఒక ప్రమిదలో దీపం పెట్టి ఇంటి ఇల్లాలు లేదా ఆడపడుచు పట్టుబట్టలు కట్టుకుని, పూలు, నగలు అలంకరించుకుని సంతోషంగా ఆ బోనాన్ని తమ తలపై పెట్టుకుని మంగళవాయిద్యాలు, డప్పుల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మకు సమర్పిస్తారు. ఈ ఊరేగింపులో హుషారుగా నాట్యం చేసుకుంటూ వెళతారు. అంతేకాదు వెదురుబద్దలు, రంగు కాగితాలతో తయారుచేసిన తొట్టెలను కూడా అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మకు బోనాలు, తొట్టెల సమర్పించి కల్లుతో సాక పెడితే అమ్మశాంతించి తమను, తమ పిల్లలను చల్లగా చూస్తుందని అందరి నమ్మకం. ఎందుకంటే అప్పుడే వానాకాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణ మార్పు వల్ల కూడా అంటురోగాలు వచ్చే ప్రమాదం ఎలాగూ ఉంది. తల్లిని సంతోషంగా చూసుకుంటే ఆమె దయ ఎప్పటికీ ఉంటుందని అన్ని ఆపదల నుంచి ఆమె కాపాడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

రాజధానితో పాటు చుట్టుపక్కల ఈ పండగను ఆషాడమాసం మొత్తం జరుపుకుంటారు. ఒక్కోవారం ఒక్కోప్రాంతంలో ఉత్సవాలు జరుగుతాయి. ఈ పండగకు సంబంధించి తెలంగాణ ప్రజలకు ఒక ప్రగాఢమైన నమ్మకం ఉంది. కొత్తగా పెళ్లైన ఆడపిల్ల ఆషాడమాసంలో తన పుట్టింటికి వస్తుంది. అమ్మ వారిని తమ తల్లిగా, ఇంటి ఆడపడుచుగా భావించి పూజిస్తారు. కాబట్టి ఆషాడమాసంలో అమ్మ తన పుట్టింటికి వస్తుంది అని నమ్ముతారు. తమ కూతుళ్లు పుట్టింటికి వస్తే ప్రత్యేకంగా చూసుకున్నట్లే ప్రజలందరూ వెళ్లి ఆమెను దర్శించి ప్రేమగా బట్టలు, భోజనం పెడతారు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ గుళ్లను అందంగా అలంకరించి ఉత్సవాలు జరుపుతారు. ఈ పండగలోని ముఖ్యమైన అంశం బోనాన్ని సమర్పించడం. అమ్మ వారికి సమర్పించే బోనాన్ని తలకెత్తుకున్న మహిళలు ఆ అమ్మ అంశ అని గౌరవిస్తూ ప్రజలు ఆమెకు కోపం రాకుండా ఉండాలని గుడి దగ్గరకు రాగానే బోనం ఎత్తుకున్న మహిళ కాళ్ల మీద నీళ్లుపోస్తారు. అలా చేస్తే అమ్మవారు శాంతిస్తుందని వాళ్ల నమ్మకం.

బోనాల పండగలో అమ్మవారి సోదరుడైన పోతరాజు పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. బలిష్టుడైన ఒక వ్యక్తి ఒళ్లంతా పసుపు రాసుకుని, నడుముకు వేపాకు మండలు కట్టుకుని, నుదుట పెద్ద కుంకుమ బొట్టుతో, కాలికి గజ్జెలు కట్టుకుని కొరడా ఝలిపిస్తూ పూనకం వచ్చినట్టు ఆడుతూ ఉంటాడు. అమ్మవారికి సమర్పించే బళ్లను అతనే ముందుండి నడిపిస్తాడు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ ఇలా అమ్మవారిని ఎన్నో పేర్లతో పిలుస్తారు. ' అమ్మ ఏ పేరున పిలిచినా పలుకుతుంది. తమను ఆదుకుంటుంది' అని ప్రజలు బలంగా నమ్ముతారు. ఆదివారం బోనాలు నమర్పిస్తారు. ఆ మరునాడు 'రంగం' అనే ఒక కార్యక్రమం ఉంటుంది. రంగం చెప్పడం అంటే అమ్మవారు ఒక అవివాహిత శరీరాన్ని ఆవహించి ఆమె ద్వారా నగర ప్రజలకు రాబోయే ఏడాదిలో జరగబోయే మంచి-చెడులను చెబుతుంది. రంగం చెప్పే మహిళ గర్భాలయం ముందు ఒక పచ్చికుండ పైన నిలబడి, పూనకంతో ఊగుతూ భవిష్యత్తు చెబుతుంది. అదే సమయంలో ప్రజలు అడిగే ప్రశ్నలకు కూడా జవాబు చెబుతుంది. అందుకే వేలాది మంది భక్తులు ఈ భవిష్యవాణి వినడానికి గుంపు కడతారు.
బోనాల సంబరంలో చివరి అంకం ఘటం ఊరేగింపు. రంగం తర్వాత సాయంత్రం వేళ ప్రతి ప్రాంతం నుంచి వేర్వేరు ఘటాల ఊరేగింపు ప్రారంభమవుతుంది. హైదరాబాద్‌లోని పాతబస్తీ వీదులన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. అలంకరించిన వాహనాలపై అమ్మవారిని ఘటం రూపంలో ఉంచుతారు. ఆ తర్వాత ఊరేగింపుగా వెళతారు. ఒక్కొక్కటిగా అన్ని ఘటాల ఊరేగింపులు కలిసిపోయి ఒక్కటిగా సాగుతాయి. ఈ ఊరేగింపులో వివిధ వేషదారణలు, పాటలు, నాట్యాలు, గుర్రాలు కూడా కోలాహం సృష్టిస్తాయి. ఈ రెండు రోజులూ ఎంతో సందడిగా ఉంటుంది. తెలంగాణ జానపద గీతాలతో వీధులన్నీ మారుమోగుతాయి. ఈ పాటలన్నీ ప్రజల్ని చిందులు వేయించేలా ఉంటాయి. ఆటపాటలతోసాగిపోయే ఈ ఘటాలన్నీ నయాపూల్‌లోని మూసీ నదిలో నిమజ్జనం చేయడంతో బోనాల పండగ సంబంరం ముగుస్తుంది. ఇక ఏడాది పొడవునా తమ పంటలను, పిల్లలను చల్లగా ఆ అమ్మ చూసుకుంటుందన్న అపారమైన విశ్వాసంతో భక్తులు నిశ్చింతగా ఇళ్లకు తిరిగి వెళతారు.
                                                                                 - సుహాసిని

Thursday 25 July 2013

గృహస్థాశ్రమం


 ఆ
ధ్యాత్మిక జీవిత పయనం అంటే చాలామందికి భయం. ధనార్జన నిలిపివేయాలి. సుఖానుభవాలు తగ్గించుకోవాలి. అబద్ధాలు, మోసాలు, స్వార్థం, లోభత్వం, కాఠిన్యం... ప్రాపంచిక సుఖానుభవాలకు అనివార్యమైన ఈ అన్నీ వదులుకోవాలి. ఉద్యోగం, వ్యాపారం... సంపాదనకు, సంతోషానికి ఇవి అవసరం. మరెలా? భార్యాపిల్లలు, తల్లిదండ్రులు... వీరిని సుఖపెట్టడం, సంతోషపెట్టడం బాధ్యత అయినప్పుడు జీవన విధానంలో కొంత వెసులుబాటు కావాలి. పూర్తి నిజాయతీ, సత్యసంధత, పనికిరావు. ఎలా? ముఖ్యంగా ఎన్నో నియమాలు, నిబద్ధతలు! మరెలా? ఆధ్యాత్మిక జీవితాచరణ... బాబోయ్‌... ఎన్ని ఆటంకాలు! ఎన్నెన్ని అవరోధాలు!

మనిషికిది నిజంగా డోలాయమాన స్థితే. సంసారాన్ని వదులుకోలేడు. భగవంతుణ్ని పొందాలనే కాంక్షనూ వీడలేడు. కానీ భయం! మనం ఏమైనా ప్రయాణం పెట్టుకున్నప్పుడు మూడు మార్గాల్లో ఒకటి ఎంచుకోవలసి ఉంటుంది. గమ్యాన్ని బట్టి ఒక్కోసారి రెండు, ఎప్పుడైనా మూడూ కూడా. భూమార్గం, జలమార్గం, ఆకాశమార్గం. తప్పదు. భూమార్గంలో వాహన ప్రమాదాలుంటాయి. దొంగల భయం ఉంటుంది. అరణ్యం గుండా అయితే క్రూరమృగాల బాధ. జలమార్గంలో ఆటుపోట్లు, వరదలు, తుపానులు. సాగరంలో అయితే మొసళ్లు, తిమింగిలాలు, సముద్ర దొంగలు. ఇక ఆకాశమార్గం చెప్పనే అక్కర్లేదు. ప్రతి క్షణం ప్రమాద భయం. అయినా మన ప్రయాణం ఆగదు. చేసే తీరాలి. అనివార్యం. పరమపద ప్రయాణంలో మాత్రం అవరోధాలుండవా, సమస్యలుండవా? ఉంటాయి. లోకంలో ప్రతి సమస్యకూ పరిష్కారాలుంటాయి. ఔను. ఒక సమస్యకు వంద పరిష్కార మార్గాలు. పరిష్కారం లేని సమస్యే ఉండదు.

సాధారణ జీవన పోరాటానికే... అనివార్యం అనుకున్నప్పుడు... ఆయుధాలు సమకూర్చుకుంటాం. బలగాన్ని సమీకరించుకుంటాం. మనోదారుఢ్యాన్ని పెంచుకుంటాం. జయం మనదా, కాదా? ఇది సమస్య కాదు. పోరాడతాం. అంతే. విషయ భోగాలకే మనం ఇంత వెంపర్లాడి సర్వస్వాన్నీ పణంగా పెట్టేందుకు సిద్ధం అయిపోతున్నప్పుడు అత్యంత ఉత్కృష్టమూ, అనివార్య ఫలితమూ అయిన పరమపదాన్ని సాధించుకునే యుద్ధం చేయలేమా? ఎంత అందమైన యుద్ధం? ఎంత ఆనందకరమైన పోరాటం! ఒక వసంతం, ఒక వెన్నెల, ఒక కోయిలపాట... ఒక సుమబాలల సౌందర్యం, సౌరభం, మకరందం, మకరందాల మత్తిల్లిన తుమ్మెదల ఆనందభైరవి రాగాలు, గానాలు... ముగ్ధమనోహరమైన అనుభూతి. ఆధ్యాత్మిక మార్గం పొడుగునా ఈ అనుభవమే. ఈ అనుభూతే. కాదు. ఇది కాదు. ఇదే కాదు. ఇంతే కాదు. వూహలకందని, మాటలకు చెందని రసానుభూతి. దివ్యానుభూతి. ఒకనాటిది కాదు. ఒక కాలానిది కాదు. భగవంతుడి నామాన్ని స్వీకరించింది మొదలు ఆయనలో మమేకమయ్యే క్షణం వరకు, ఏకమయ్యే క్షణం వరకు... దేని కోసం దీన్ని వదులుకోవాలి? దీనికి సాటి మరోటేముంది? అసలు పోల్చే దమ్మెవరికుంది? ఎవరైనా 'ఎంపిక' అవకాశం వచ్చినప్పుడు ఉన్నతమైనదాన్నే ఎంచుకుంటారు. ఉత్తమమైనదాన్నే కోరుకుంటారు. అవకాశం ఉండాలంతే... మనకు ఆ అవకాశం ఉంది, ఆ అదృష్టం ఉంది.

నిజమే. సంసారాన్ని వదులుకొమ్మని ఎవరూ చెప్పరు. అది మనిషి కర్తవ్యం. అయితే ఉత్తమమైనదానికి అధిక ప్రాధాన్యమిస్తూ దాని పురోభివృద్ధికి రెండోదాన్ని ఆసరా చేసుకునే అవకాశాన్ని వెదుక్కోవాలి. ధర్మాచరణకు జీవిత భాగస్వామి అవసరం ఎంతో ఉంది. స్త్రీకైనా, పురుషుడికైనా గృహస్థాశ్రమం ఎంతో ఉదాత్తమైంది. ఉదారమైంది. ధార్మిక జీవనానికి ఎంతో ఉపయుక్తమైంది. మెలకువలు తెలుసుకోవాలి. వెసులుబాట్లు వాడుకోవాలి. అనివార్యతను ఆచరిస్తూనే అత్యుత్తమమైనదాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి. తీవ్రమైన కృషి చేయాలి. రహస్యం ఏమిటంటే- సన్యాసి కంటే సంసారికి తన్ను తానూ, తన ప్రగతినీ పరీక్షించుకునేందుకు, పైకెదిగేందుకూ ఎక్కువ అవకాశం ఉంది.

ఆశ్రమాల్లోనే తలమానికం గృహస్థాశ్రమం. పరీక్షకైనా, పరిణతికైనా... ఇదే నిజమైన పోరాటం, అసలైన యుద్ధం. చేద్దాం!
                                                                   - చక్కిలం విజయలక్ష్మి 

Wednesday 24 July 2013

హృదయార్పణం

                               
 మనిషి తనకు మానవజన్మ ప్రసాదించిన భగవంతుడికి అనేక విధాలుగా పూజలు చేస్తుంటాడు. పూజా సమయంలో యథాశక్తి తనకు ఉన్నంతలో పత్రమో, పుష్పమో, ఫలమో, జలమో సమర్పించుకుంటూ ఉంటాడు. ఈ విధంగా సమర్పించడం కృతజ్ఞతా సూచకం అయితే కావచ్చునేమోగానీ, అసలు మనిషి భగవంతుడికి సమర్పించగల శక్తిమంతుడేనా? ఇలా ఆలోచిస్తే, ఎంతమాత్రం కాదని చెప్పవచ్చు. భగవంతుడిదే ఆ యావత్‌సృష్టి. అలాంటివాడికి భక్తుడు ఇచ్చే కానుకలు అత్యల్పమైనవే. కానీ ఏదో ఒకటి సమర్పించకపోతే భక్తుడి మనసు వూరుకోదు.

పూర్వం ఒక యోగి భగవంతుణ్ని అర్చించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు అతడిలో వివేకం ఉదయించింది. పూజలో ఒక్కొక్క ఉపచారాన్నీ చేస్తూ భగవంతుడితో ఇలా విన్నవించుకున్నాడు- 'పరమేశ్వరా! నీవు బ్రహ్మాండమంతా నిండి ఉన్నావు. కనుక నిన్ను ఎలా ఆవాహన చేయాలి? అన్నింటికీ ఆధారమై నీవు ఉండగా నీకు ఆసనం ఎక్కడ వేయాలి? నిరంతరం స్వచ్ఛంగా ఉండే నీకు కాళ్లు కడుక్కోవడానికి నీళ్లెందుకు? పరిశుద్ధుడవైన నీకు ఆచమనం అవసరమా? నిత్యనిర్మలుడవైన నీకు స్నానం ఎలా చేయించాలి? ప్రపంచమంతా నీలోనే ఉండగా నీకు వస్త్రం ఎలా ధరింపజేయాలి? గోత్ర వర్ణాలకు అతీతుడవైన నీకు యజ్ఞోపవీతం అవసరమా? ఏ లేపనాలూ అవసరం లేని నీకు గంధం ఎలా పూయాలి? నిత్య పరిమళుడవైన నీకు పూలు పెట్టడం ఎందుకు? మహిమతోనే వెలిగిపోయే నీకు ఆభరణాలు తొడగాలా? నిరంజనుడవైన నీకు ధూపం వేయడం సరి అయినదేనా? జగత్తుకే సాక్షిగా నిలిచిన నీకు దీపం అవసరమా? నిజమైన ఆనందంతో నిలిచే నీకు నైవేద్యం ఎందుకు? విశ్వానికే ఆనందాన్ని అందించే నీకు తాంబూలాన్ని అర్పించి సంతృప్తిపరచగలనా? అంతమే లేకుండా అంతటా వ్యాపించిన నీకు ప్రదక్షిణం ఎలా చేయాలి? అద్వయుడవైన నీకు నమస్కారం ఎలా చేయాలి? వేదాలే నిన్ను స్తుతించడానికి శక్తి చాలనివి అవుతుంటే నేను నిన్ను ఎలా స్తుతించాలి?'

ఈ పలుకుల్లో నిజం లేకపోలేదు. భగవంతుడి ముందు ఎంతటి మానవోత్తముడైనా అత్యల్పుడే. వీడి శక్తి భగవంతుడి ముందు పరిగణనలోకి రానే రాదు. అయినా భగవంతుడు మనిషి చేసే పూజలను స్వీకరిస్తున్నాడంటే ఆయన అపార కారుణ్యం వర్ణించలేనిది. నిజంగా భగవంతుడు మనిషి నుంచి కోరేవి సంపదలు కావు. వస్తువులు అంతకన్నా కావు. ఆయన మనిషి నుంచి హృదయార్పణను కోరతాడు. భక్తితో స్మరిస్తే చాలునంటాడు. కానీ మనిషి మనసు చంచలం. చపలం. స్థిరంగా ఒకచోట ఉండదు. లౌకిక లంపటాల వల్ల భగవంతుడిపై లగ్నం కాదు. అందుకే శంకరభగవత్పాదులు- 'ఓ పరమేశ్వరా! నా మనసు ఒక కోతి వంటిది. అది ఎప్పుడూ సంసారవాంఛ అనే అడవిలో తిరుగుతూ ఉంటుంది. భార్యాపుత్రుల ప్రేమ అనే చెట్టుకొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉంటుంది. క్షణం తీరిక లేకుండా అటూ ఇటూ పరుగులు తీస్తుంటుంది. అందువల్ల నా మనసు అనే కోతిని నీకు అర్పిస్తున్నాను. దాన్ని తాడుతో గట్టిగా కట్టి నీ అధీనంలో ఉంచుకో' అని ప్రార్థిస్తారు. సామాన్య భక్తులను తరింపజేయడానికి ఆయన చేసిన విన్నపం ఇది.

'ఓ పరమేశ్వరా! బంగారుకొండ మేరుపర్వతమే నీ చేతిలో ఉంది. అపార ధనవంతుడైన కుబేరుడు నీ పాదదాసుడై ఉన్నాడు. కల్పవృక్షం, కామధేనువు, చింతామణి నీ ఇంటిలోనే ఉన్నాయి. షోడశ కళలను కురిపించే చంద్రుడు అమృతాన్ని వర్షిస్తూ నీ తలపైనే ఉన్నాడు. సమస్త మంగళాలనూ కలిగించే పార్వతీదేవి సర్వమంగళయై నీ పక్కనే ఉంది. కనుక నీకు నేనేమీ ఇవ్వలేను. నా దగ్గర ఉన్నది ఒక్క మనసే. అది నీకు సమర్పిస్తున్నాను!' అని హృదయాన్ని అర్పిస్తే భగవంతుడు ఎంతో ఇష్టపడతాడు.

అచంచల విశ్వాసం, అకుంఠిత భక్తి, అన్నింటినీ నివేదించగల మనసు ఉంటే చాలు. భగవంతుడు ఏ రూపంలో ఉన్నా పూజల్ని అందుకుంటాడు. అట్టహాసాలు, ఆర్భాటాలు నిజమైన పూజలు కావు. హృదయార్పణమే పూజ. నిశ్చల ధ్యానమే భక్తి. అంతేకానీ లోకమంతా చూడాలని చేసే నటనలు పూజలు కావు. ఈ సత్యాన్ని మనిషి గ్రహిస్తే మేలు!
                                                     - డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ 

Tuesday 23 July 2013

సన్నిహితుడు

                     

సమస్త ప్రాణులకు మేలు చేసేవాడు భగవంతుడితో సమానమవుతాడు. ఆ వ్యక్తి అందరికీ సన్నిహితుడే. 

మంచిని కోరేవాడు నిజమైన బంధువు, హితం కోరేవాడు నిజమైన హితుడు, సాన్నిహిత్యం కోరుకునేవాడే నిజమైన సన్నిహితుడని విజ్ఞులు చెబుతారు. హితవచనం పలికి తోటివారికి సహాయ సహకారాలందించడం ఉత్తముల లక్షణం. అటువంటి ఉత్తమ గుణాలున్న వ్యక్తి అందరికీ ఆత్మీయుడై నిరంతరం సేవాగుణం కలిగి ఉంటాడు.

ఎదుటి వ్యక్తి హితాన్ని కోరేవారు సద్భావనతో సమాజాన్ని సుభిక్షం చేస్తారు. మనం కోరకుండానే సూర్యడు తన కిరణస్పర్శచేత పద్మాలను వికసింపజేస్తున్నాడు. చంద్రుడు తన ధవళ కాంతులతో కలువలను వికసింపజేసి లోకాన్ని ఆహ్లాదపరుస్తున్నాడు. ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండానే మేఘుడు లోకానికి జీవనాధారమైన వర్షపు జల్లులను ఇస్తూ పుడమిని పునీతం చేస్తున్నాడు.

అలాగే సత్పురుషులూ ప్రతీ క్షణం పరహితం కోరుతూ ప్రపంచశాంతి కోసం పాటుపడతారు.

మీహితాన్ని కోరుకునేవాడే సన్నిహితుడని, బంధువని, అలా ఉపయోగపడనివాడు శత్రువుతో సమానమని స్మృతి చెబుతోంది. మన శరీరంలో పుట్టినప్పటికీ వ్యాధి ప్రమాదకరమైనదే. ఎక్కడో అడవిలో పుట్టినప్పటికీ మన వ్యాధిని పోగొట్టే ఔషధగుణాలున్న మూలిక మనకు ఆప్తబంధువే. అందుకే ఆత్మీయుడైనా, బంధువైనా చెడ్డవాడిని విడిచిపెట్టాలి. ఆదరాభిమానాలు ప్రదర్శించి, మన హితం కోరే వ్యక్తి పరాయివాడైనా అతడినే అత్యంత ఆత్మీయుడిగా భావించాలి.

ఆపదలో ఉన్న దీనుణ్ని కాపాడేవాడు మాత్రమే నిజమైన సన్నిహితుడని, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వెంట ఉండి సహాయం చేసేవాడే నిజమైన బంధువని రామాయణంలో వాల్మీకి వివరిస్తాడు.

రాముడితో యుద్ధానికి ముందు రావణుడు సభికులను అడిగితే- కుంభకర్ణుడు 'మహారాజా! సీతాపహరణమునకు ముందు నీవు చేసిన పనిని గురించి మాతో ఆలోచించి ఉంటే ఆ పని సర్వోత్తమంగా ఉండేది' అని హితవాక్యం చెబుతాడు.

విభీషణుడు కూడా రావణుడితో 'పరస్త్రీలను పట్టిచూడటం అపకీర్తికరం, ఆయుక్షీణం, సంపద్వినాశకరం, పాపానికి మరో రూపం. అంతకన్నా దారుణమైనది మరొకటి లేదు' అంటాడు 'సుఖాన్ని, ధర్మాన్ని పోగొట్టే కోపాన్ని విడిచిపెట్టు, తృప్తిని కీర్తిని పెంచే ధర్మాన్ని సేవించు... నా మాట విని దశరథ పుత్రుడికి సీతను తిరిగి ఇచ్చివేయి. అందరం పుత్రులతో, బంధువులతో సుఖంగా బతుకుదా'మని హితవచనాలు చెబుతాడు.

ఇలాంటి హితవాక్యాలు మనకు రామాయాణంలో ఎన్నో కనిపిస్తాయి. అందుకే ఆ పవిత్ర గ్రంథం నేటికీ అందరికీ ఆరాధ్యమైనదిగా నిలిచిపోయింది.

మహాభారతం- మనకు ఏ పనులు బాధ కలిగిస్తాయో అలాంటి పనుల్ని ఇతరుల విషయంలో చేయరాదని హితాన్ని పలికింది. పురాణాల్లోనూ సకల జీవులను హింసించరాదని, అసత్యం పలకరాదని, దొంగతనం చేయరాదని, హితం కాని దాన్ని పలకరాదని ప్రబోధించడం చూస్తుంటాం

నిజానికి మనకు అత్యంత సన్నిహితుడు ఆ పరమాత్ముడే. పూలదండలో దారం పూవులకు లోపలే ఉంటుంది. బయట ఉండదు. కాని భగవత్తత్వం ఈ చరాచర జగత్తులో లోపలా బయటా వ్యాపించి ఉంటుంది.

అందుకే సన్నిహతుడైన ఆ భగవంతుడి అనుగ్రహం పొందాలంటే మనం అందరికీ సన్నిహితుడిగా మారాలి. ఈ లోకమంతా మనదేనని భావించాలి. ఎలాంటి తారతమ్యాలూ చూపించకుండా సేవలందించాలి.

అప్పుడే ఆ పరమాత్ముడు మనకు అందుతాడు. మనం చేసే మంచి కార్యాలకు ప్రేరణ, ఉత్సాహం కలిగిస్తాడు. సహాయ సహకారాలు అందిస్తాడు. నిస్వార్థమైన మన కార్యాలకు విజయాలను ప్రసాదిస్తాడు.
                                                                            - విశ్వనాథరమ 

Monday 22 July 2013

గురు పూర్ణిమ

                            
 నాలుగు ముఖాలు ఉండటం బ్రహ్మరూపం. నాలుగు చేతులు ఉండటం విష్ణు లక్షణం. నొసట కన్ను ఉండటం శివుడి లక్షణం. అయినా ఒకే ముఖం ఉండి కూడా ఆయన బ్రహ్మ. రెండు చేతులే ఉండి కూడా ఆయన విష్ణువు నొసట కన్ను లేకున్నా ఆయన శివుడు. ఆయన త్రిమూర్తుల లక్షణాలను పుణికిపుచ్చుకొన్నాడు. అందుకే ఆయన భగవానుడు. ఆయన వ్యాస భగవానుడు- బాదరాయణుడు, కృష్ణద్వైపాయనుడు.

వ్యాసుడు భారతీయ సంస్కృతిని రూపుదిద్దాడు. వేదాలను విభజించి చక్కగా పరిష్కరించాడు. పంచమ వేదంగా కౌరవ, పాండవ గాథను 'మహాభారతం'గా నిర్మించాడు. అందులో శ్రీకృష్ణప్రోక్తం, సర్వోపనిషత్తు సారమైన 'గీత'ను గ్రథనం (కూర్పు) చేశాడు. భాగవతాది పురాణాలు లోకానికి అందించాడు. వ్యాసుడు తన శిష్యుల్లో పైలుడికి రుగ్వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, సుమంతుడికి అధర్వణవేదాన్ని అప్పగించి లోకంలో ప్రసరింపజేశాడు. వ్యాసుడు పరిపూర్ణ తత్వజ్ఞానంతో బ్రహ్మసూత్రాలు రచించాడు. వాటిలో విశ్వంలోని ఏ తాత్విక ధారనూ విడిచిపెట్టకుండా సరళ సుందరశైలిలో చర్చించాడు. 'మునుల్లో నేను వ్యాసుడిని' అంటాడు గీతలో శ్రీకృష్ణుడు.

యోగి అయినవాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఘర్షణకు తావులేకుండా కర్తవ్యాన్ని బాధ్యతాయుతమైన లీలగా ఎలా నిర్వహిస్తాడో వ్యాసుడి జీవితంలో మనం దర్శించవచ్చు. లోకహితార్థమై ఒక వంక తపస్సు, మరొకవంక శిష్యులకు శిక్షణ, ఇంకొకవంక ఆశ్రితరక్షణ నిర్వహిస్తూనే- అవసరమైనప్పుడల్లా జన్మనిచ్చిన తల్లిని దర్శిస్తూ తగినరీతిన సేవిస్తూ వచ్చాడు వ్యాసుడు. వైరాగ్యం అంటే బాధ్యతలను వదిలిపెట్టడం కాదని, వ్యామోహపడకుండా బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వహించడమనే సందేశాన్ని మహాభారతంలో వ్యాసుడి పాత్ర మనకందిస్తుంది. కృష్ణుణ్ని మానవమాత్రుడిగా గాక పరిపూర్ణ అవతార పురుషుడిగా దర్శించిన మొదటివాడు వ్యాసుడు.

వ్యాసుడి జనన తిథిని 'ఆషాఢపూర్ణిమ'గా బ్రహ్మాండ పురాణం చెబుతోంది. పూర్ణిమ అంటే సమగ్రత. వ్యాసపూర్ణిమ భారతీయ సంప్రదాయంలో గురుపూర్ణిమ. శ్రీకృష్ణుడు గీతోపదేశం ద్వారా జగద్గురువైతే, శక్తిమంతమైన సంస్కృతిని, దానికి అవసరమైన విశాల వాఞ్మయాన్నీ సృష్టించిన వ్యాసుడూ లోకానికి గురువే. గురువు జ్ఞానప్రదాత. జ్ఞానం బ్రహ్మస్వరూపం. అందుకే గురువు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర స్వరూపుడన్నారు. ఈ దేశంలో ఎందరో మహానుభావులు, మహాత్ములైన గురువులున్నారు. సర్వగురువులకూ గురుస్థానీయుడు వేదవ్యాసుడు. అందరు గురువుల్లోనూ అంశల భేదంతో వేదవ్యాసమహర్షి ఉంటాడు. ఈ విధమైన ఏకత్వ గురుభావన ఈ దేశ సంప్రదాయం.


వ్యాసుడనేది ఒక్కడి పేరు కాదని అది ఒక వ్యవస్థ అని, ఒక పీఠమని ఒక భావన. పరాశరపుత్రుడు ఇరవై ఏడో వ్యాసుడిగా ప్రసిద్ధుడు. విష్ణుమూర్తి మానసపుత్రుడైన అపాంతరతముడే ఈ వేదవ్యాసుడిగా అవతరించాడని చెబుతారు. 'ఓయి వ్యాసా! ఓయి విశాలబుద్ధా! ఓయి వికసించిన అరవిందాలవలె దీర్ఘనేత్రాలు గలవాడా! భారతమనే తైలంతో ప్రపూర్ణమైన జ్ఞానమయప్రదీపాన్ని ప్రజ్వలింపజేశావు. అటువంటి నీకు నమస్కారం' అని ఒక ధ్యానశ్లోకం పేర్కొంటోంది.
                                                  - డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

Sunday 21 July 2013

దేవుడు మనవాడు



 ఏ పద్ధతైనా, విధానమైనా, మార్గమైనా- మనం ఎందుకు తెలుసుకోవాలి? అందులో ఉన్న ప్రయోజనాన్ని పొంది మన జీవితం ఇంకా సుఖంగా గడపడానికి. తెలుసుకుంటున్న కొద్దీ బతకడం సులువు కావాలి. అన్నీ తెలుసుకుంటున్నవాడికి ఇంకా ఏదో మిగిలి ఉంది తెలుసుకోవడానికి అనిపిస్తుంది. అజ్ఞానానికి అంతం ఉంది. జ్ఞానానికి అంతం లేదు. జ్ఞానం అనంతం బ్రహ్మ. దైవరూపంలో మనం తెలుసుకునేది జ్ఞానాన్నే. జ్ఞానానికి రూపం ఉండదు. విగ్రహానికి రూపం ఉంటుంది. నామం ఉంటుంది. అదే భగవంతుడు అనుకుంటారు చాలామంది. అక్కడ మన భావం దివ్యంగా పవిత్రంగా ఉంటే దైవమవుతుంది. లేదంటే రాతి బొమ్మ.

దైవాన్ని తెలుసుకుని జీవించేవాళ్లు ఎలా ఉంటారు? మనలాగే ఒక నోరు, రెండు కళ్లు, రెండు చెవులు, ఒక ముక్కు, ఒక తలతోనే ఉంటారా? ఇంకా ఏమైనా మార్పులు వస్తాయా? భౌతికంగా ఏ మార్పులూ ఉండవు. అహంకారాన్ని పోగొట్టుకుంటారు. అరిషడ్వర్గాలను పోగొట్టుకుంటారు. 'నేను'ని వదిలించుకుంటారు. సహజంగా ఉంటారు. సాత్వికంగా ఉంటారు. ప్రేమగా ఉంటారు. నిరాడంబరంగా ఉంటారు. ఉండీ లేనట్లుగా ఉంటారు. తామరాకు మీద నీటిబొట్టు చందాన జీవిస్తుంటారు.

దైవాన్ని చూసినవాళ్లు వరసలో చివరన నిలబడతారు. ఎవరికీ పోటీగా ఉండరు. ఇస్తే అతి తక్కువగా పుచ్చుకొంటారు. ఇవ్వకపోతే అడగరు. అకారణంగా తిట్టినా ఆవేశానికి లోనుకారు. ఆవేశం వచ్చినా అది నాది కాదు అన్నట్లు చూస్తారు. సినిమాహాల్లో కూర్చుని సినిమా చూస్తున్నవాళ్లు ప్రభావితం అవుతున్నట్లు ఉద్వేగానికి, ఆందోళనకు గురికారు. తామే సినిమా తీస్తున్నవారిలా నిశ్చలంగా ఉంటారు. వారికిచ్చిన పనిని వారు ధర్మబద్ధంగా వృత్తిధర్మంగా సాక్షీభూత దృష్టితో చేస్తుంటారు. హరిశ్చంద్రుడు కాటికాపరి వృత్తి చేసినట్లు.

దైవం గురించి తెలియనివాళ్లు, బాహ్యాడంబరాలు, పటాటోపాల గురించి బాగా తెలిసినవాళ్లు, తాము సర్వజ్ఞులం అనుకున్నవాళ్లు లోకాన్ని పక్కదోవ పట్టించేస్తుంటారు. తప్పుడు బోధలు చేసే ఉపాధ్యాయుడి కంటే అసలు ఏ బోధా చేయని ఉపాధ్యాయుడు మంచివాడు. అదృష్టవశాత్తు పరిణామ క్రమంలో కొంతమందికి ఆధ్యాత్మిక పదవులు వస్తాయి. వాటితో భగవంతుడి సామీప్యాన్ని పొందాలి. లేకపోతే మంచి చేద్దామనుకుని చెడుచేసేవాళ్లలాగ దైవానికి దూరమైపోతాం.

తవ్వుతున్న కొద్దీ, తోడుతున్న కొద్దీ నీరు వూరుతున్నట్లు మంచి విషయాలు తప్పక మనల్ని చుట్టుముడతాయి. దైవీజ్ఞానం వ్యక్తి వికాసానికి, సంఘ వికాసానికి, వ్యవస్థ వికాసానికి తప్పక ప్రయోజనకారి అవుతుంది. లేకపోతే యుగయుగాలుగా ఈ జ్ఞానాన్వేషణ ఎందుకు?

వైద్యుడు కనిపించినట్లు, న్యాయవాది కనిపించినట్లు, సాంకేతిక నిపుణుడు కనిపించినట్లు- దైవం కనిపించడానికి ఒక రూపాన్ని పెట్టుకోడు. మనమే చూడాలి. ఏ రూపంలోనైనా చూడొచ్చు. చూసినప్పుడు మన హృదయంలో దైవభావం ఉండాలి. మనసంతా నిండాలి.

ఈ రోజుల్లో నిర్వచనాలు మారిపోతున్నాయి. మాటలకు విపరీత అర్థాలు వెదుకుతున్నారు. భావాలను చక్కగా ఎవరికి తగినట్లు వాళ్లు అన్వయించుకుంటున్నారు. దైవసేవలు అయిదు నక్షత్రాల హోటల్లో భోజన పదార్థాల ఖరీదులను మించిపోతున్నాయి. సామాన్యుడికి దేవుడు దొరకడు. దేవుడు సామాన్యుడు కాడు. ఏ మార్గంలోనైనా సంపాదించు. ఎవరినైనా వంచించు. ధనం సంపాదించు. నోట్లకట్టలు పట్టుకు రా. అప్పుడే దేవుడు నీ దగ్గరకు వస్తాడు అంటున్నారు. అతడు దేవుడా, వాళ్లు దైవ సేవకులా?

దేవుడు మనవాడు. మనలోనివాడు. అందరివాడు. అతడు ఇంట్లో ఉంటాడు. ఒంట్లో ఉంటాడు. వసంతకాలంలో పచ్చదనంకోసం వెదుక్కోవాలా? సూర్యోదయం అయిన తరవాత వెలుగు ఎక్కడుంది అని ఎవరైనా అడుగుతారా? మట్టి లేని భూమి ఉందా? నరుణ్ని విడిచి నారాయణుడు ఉండగలడా? సరిగ్గా ఆలోచిస్తే- దేవుణ్ని మనం చూస్తున్నామా, దేవుడు మనల్ని చూస్తున్నాడా? ఎవరి దర్శనం ఎవరికి కావాలి?- ఆనందసాయి స్వామి 

Saturday 20 July 2013

విశ్వలీల‌..

                                 
 
విశ్వం భగవత్‌ సంకల్పంవల్లనే ప్రభవించింది. భగవంతుడు ప్రతి మనిషిలోనూ స్పందిస్తున్నాడు. ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసమే భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. తన సంకల్పం ప్రకారం సృష్టి పురోగమించేటట్లు ఆయన సకల చర్యలు తీసుకుంటున్నాడు. సర్వలోకాలను సృష్టించిన పిమ్మట భగవంతుడు ఆ లోకాల్లోకి ప్రవేశించినట్లు ప్రాచీన వేదం చెబుతోంది. విశ్వంలోకి ప్రవేశించి విశ్వమంతటా పరివ్యాప్తమై ప్రకాశిస్తున్నాడు. ఆ వెలుగే మనకు నక్షత్రాలుగా మిణుకుమంటోంది. ఆ వెలుగే సముద్రాల్లో నీలంగా భాసిస్తోంది. ఆ వెలుగు చిన్నగుండెగా మారి ప్రతి జీవిలో కొట్టుకుంటోంది. ఆ వెలుగు మన వూపిరి. ఆ వెలుగు ఆగిపోతే మన వూపిరి ఆగిపోతుంది.

జీవితంలో ప్రతి కదలికకు అర్థం ఉంది. మనకే కాదు భగవంతుడికి సైతం అందులో పరమార్థం కనిపిస్తుంది. సృష్టి అంతా కూడా ఆయన కదలిక. సంభూతి. ఆయన వైభవం. మనమే అన్ని పనులు చేస్తున్నట్లు, మన కోరికలను తీర్చుకుంటున్నట్లు, ఆకర్షణ లేనివాటిని తిరస్కరిస్తున్నట్లు అనుకుంటుంటాం. మనపై భగవంతుడు బలవంతంగా దుఃఖాలను ఎందుకు రుద్దుతున్నాడో తెలియదు. 'తన స్వర్గంలో భగవంతుడికేం హాయిగా ఉన్నాడు. భూమిపై జరిగే ఘోరాలను, నేరాలను పట్టించుకోడు. ఈ దుఃఖాగ్ని గుండంలో మనల్ని పడవేసి కాల్చుకు తింటున్నాడు' అని నిందిస్తాం. 'జీవితం ఎలా ఉంటే అలాగే అనుభవించాలి. వివరాల జోలికి వెళ్లవద్దు' అని మరికొందరి సిద్ధాంతం. కాని భగవంతుడు మానవాళి శ్రేయాన్నే మనసులో పెట్టుకుని వేల మార్గాల్లో ఆలోచిస్తుంటాడు. సాధారణ మానవులం- 'భగవంతుడికి అనేక ఇతర పనులుంటాయి. మన సంగతి అసలు పట్టించుకోడు' అని, 'మనం చీమల్లాగా కనిపిస్తాం, అసలు మనవైపు చూడనే చూడడు' అని వాపోతుంటాం.

ఇది తప్పుడు భావన. అసంఖ్యాక జన్మల్లో, తన జీవన పరమావధిని నెరవేర్చుకోవడానికి ప్రతి జీవిలోను సత్య బీజం నిక్షిప్తమై ఉంటుందంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ప్రతి చిన్న కదలికకు ఒక విశిష్టత ఉంటుంది. ఈ ప్రపంచంలో, ప్రతి జీవిలో ఒక మేధస్సు పనిచేస్తుంటుంది. ప్రతి ఆలోచనను, ప్రతి సంవేదనను, ప్రతి ప్రేరణను, ప్రతి చర్యను గుర్తించి ఆత్మకు నివేదిస్తుంది.

మనకు తెలిసినా తెలియకపోయినా పరిణమిస్తున్న ప్రతి జీవిలోని చైతన్య వికాసమే తన జీవితం. తన వెనక భగవత్సంకల్పం ఏమిటో తెలుసుకోవడానికి ఆత్మ శ్రమిస్తుంటుంది. దీన్నిబట్టిచూస్తే, ప్రపంచంలో జరిగే ప్రతి పనినీ భగవంతుడు లెక్కలోకి తీసుకుంటాడు. ఏం చేసుకుంటారో అది చేసుకోండి- అని భగవంతుడు విధి అనే దీర్ఘపాశాన్ని మనపైకి విసిరివేయలేదు. ప్రతి జీవిలోనూ భగవంతుడు సాయుజ్యం చెందుతాడు. నిజానికి ప్రతి జీవీ భగవంతుడి జ్యోతిర్మయ కిరణ ప్రసారమే.

'పరమాత్మలో అందరూ ఉన్నారు. అందరిలోనూ ఉన్నాడు. ఆయనే అంతా' అని ఉపనిషత్‌ చెబుతుంది. పరిణామ క్రమంలో అభివ్యక్తమవుతున్న పరమాత్మ వ్యష్టిగా, సమష్టిగా ప్రతి కదలికలోని ఆనందరస ప్రవాహాన్ని ఆస్వాదిస్తుంటాడు. ఇదొక అంతర్గత రాసలీల. కాలం నిర్మించిన అద్భుతాలను భగవంతుడు ప్రేమిస్తాడు. కాలమే సంకల్ప ప్రదీప్తమైన కదలిక. కాలంలో జరిగేదంతా భగవంతుడి కదలికే.

భగవంతుడు మానవాళి ఆశలకు, బాధలకు ప్రతిస్పందిస్తాడు. మన గాథల్ని శ్రద్ధగా వింటాడు (చెప్పగలిగితే). మన జీవితాల్లో ఆయన పాత్రను మనం మరచిపోతే అసలు ఈ లీలలోని ఆనందాన్ని మనం పోగొట్టుకున్నట్లే. ఆయన తనతో తానే నిరంతర లీల సాగిస్తున్నాడు. మనం కనుక అది తెలుసుకుంటే జీవిత ముఖచిత్రమే మారిపోతుంది. అది భగవంతుడి స్వీయ ఆవిష్కరణలో ఆనందమయ విన్యాసం!
                                                                                       
  -  కె.యజ్ఞన్న 

Friday 19 July 2013

మానవత్వమే సాయితత్వం


    మహిమలతో కాదు, మానవత్వంతో బతకాలన్నదే సాయితత్వం. బాబా ఎప్పుడూ తన గొప్పతనాన్నీ, మహిమాన్వత శక్తినీ ప్రద ర్శించలేదు. తాయెత్తులు కట్టలేదు. చివరకు జ్యోతిషం, గ్రహదోషాల వంటి వాటిని కూడా బాబా మూఢనమ్మకాలుగానే భావించారు. వాటి జోలికి తన భక్తుల్ని వెళ్లనివ్వలేదు. అందుకే యోగీశ్వరుల పరంపరలో సాయిబాబా ఎంతో విశిష్ఠమైనవారు. కొందరు మిడిమిడి జ్ఞానంతో మహిమలు ప్రధ ర్శించబోయినా వారిని వారించి దారిలో పెట్టారు. మహిమల కంటే మానవత్వాన్ని ప్రదర్శించడమే ఉత్తమమని బోధించేవారు. బాబాకు దేహాభిమానం లేదు. భక్తులను మనసారా ప్రేమించారు.

గురువులు రెండు రకాలు. ఒకరు- నియత గురువులు. అంటే నియమితులైన గురువులని అర్థం. రెండు- అనియత గురువులు. సమయానుకూలంగా తమంతట తామే వచ్చి మన అంతరంగాలను శుద్ధిచేసి, సుగుణాలను పెంపొందించి, మోక్షమార్గాన నడిపించే వారిని అనియత గురువులు అంటారు.

రకరకాలుగా ప్రపంచ జ్ఞానాన్ని బోధించే గురువులు లోకంలో ఎందరో ఉన్నారు. వీణ, చిరుతలు పట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ ఆధ్యాత్మిక ఆడంబరాన్ని చాటేవారు కొందరు. గురువులమని చె ప్పుకుంటూ డాబుసరి కబుర్లతో కాలం గడిపే వారు మరికొందరు. చెవిలో మంత్రాలు ఊదుతామని భక్తుల వద్ద డబ్బులు గుంజేవారు ఇంకొందరు. కానీ, ప్రస్తుతం మనమున్న సహజస్థితిలోనే మనల్ని ఉంచి, ప్రపంచపు అంచులకు అతీతంగా తీసుకుపోయేవారే నిజమైన గురువులు. వారే సద్గురువులు. సాయిబాబా అలాంటి సద్గురువు.

బాబా మహిమ నిజంగా వర్ణనాతీతం.
చూపుమాత్రంగానే బాబా, భక్తుల భూత, భవిష్యత్, వర్తమానాలను గ్రహించేవారు. అవన్నీ బాబాకు కరతలామలకం. బాబా ప్రతి జీవిలోనూ దైవాన్ని చూసేవారు. శత్రువులు, స్నేహితుల పట్ల సమభావంతో ఉండేవారు. నిరభిమానం, సమత్వం బాబాలో మూర్తీభవించి కనిపించేవి. బాబాకు కలిమిలేములు సమానం. బాబా మానవదేహం ధరించినా, ఇల్లూ వాకిలి పట్ల అభిమానం, వ్యామోహం ఉండేవి కావు. శరీర ధారిగా కనిపించే సాయిబాబా నిజానికి నిశ్శరీరులు.

నిజమైన, స్వచ్ఛమైన కవిత్వం పాండిత్యం వల్ల రాదు. ప్రేమలోంచి వ స్తుంది. హృదయం దాని ఆస్థానం. ఈ లెక్కన చూస్తే షిర్డీ వాసులు ఎంతో పుణ్యాత్ములు. తాము తింటున్నా, తాగుతున్నా, పనీపాటలు చేసుకుంటున్నా సాయి నామస్మరణను ఎప్పుడూ మరిచేవారు కాదు. బాబా మహిమలను కీర్తిస్తూ తమ పనులు తాము చేసుకునే వారు. బాబా పట్ల షిర్డీ స్త్రీల ప్రేమను, బాబా పట్ల వారి భక్తిని, బాబా వారిపై కురిపించిన అవ్యాజమైన కరుణను గురించి వర్ణించడానికి అక్షరాలు చాలవు. షిర్డీ వాసులు అక్షరజ్ఞానం లేని పామరులే అయినా, అద్భుతమైన ప్రేమతో బాబాను గెలుచుకున్నారు. బాబా పాదస్పర్శతో షిర్దీలోని చెట్టూ చేమ, మట్టీ పుట్ట అన్నీ పులకించాయి. ఆ నేల బాబా పాద ధూళిని తాకి పునీతమైంది.

అండగా నిలిచే బాబా
మంచి కోసం మనిషి నిరంతర ప్రయత్నం చేయాలి. మనసు మాయల ఫకీరు. కొద్దిసేపు ఆశల పల్లకీలో ఊరేగిస్తుంది. మరికొద్దిసేపు ఆకాశానికి నిచ్చెనలు వేస్తుంది. అదే సమయంలో పాతాళానికి దిగ జార్చే సందేహాలను, అపోహలను కలిగిస్తుంది. నిలకడలేని తనం దాని లక్షణం. అలాంటి మనసును అదుపులో పెట్టుకోవడానికి మనిషి ఏదో ఒక పనిచే యాలి. దాన్ని దారి మళ్లించాలి. ఎంచుకున్న పనిలో, దాని తాలూకు ప్రయత్నాల్లో సంపూర్ణంగా మునిగిపోవాలి. మనసులో మంచి ఆలోచనలు కలగడం కోసం, ఆ ఆలోచనలు సాఫల్యం కావడం కోసం చేసే ఏ ప్రయత్నానికైనా భగవంతుడు మనకు అండగా నిలుస్తాడు.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు పార్థునికి చెప్పింది కూడా ఇదే. " అర్జునా! మన సు నిలకడలేనిది. దాన్ని నిశ్చలం చేసుకోవడం ద్వారా ప్రతి మనిషీ తనను తాను ఉద్ధరించుకోవాలి. తనను తానే సంస్కరించుకోవాలి. అంతే తప్ప మనసు చెప్పినట్టల్లా తలాడించి తనను తాను అధోగతి పాలు చేసుకోకూడదు.'' షిర్గీ సాయిబాబా కూడా ఆ తన భక్తులకు ఇదే విషయాన్ని బోధిస్తున్నారు.రోహిల్లా ఆజానుబాహుడు. అతను షిర్డీలో ఉండేవాడు. అతని మనసు నిలకడగా ఉండేది కాదు. ఏవేవో ఆలోచనలతో మనిషి కదిలిపోతుండేవాడు. అతను చదువుకున్నవాడు కాదు. మనసును అదుపులో పెట్టుకోవడానికి ఏం చేయాలో తెలియదు. అతనికి తెలిసిన ఏకైక మంత్రం దైవ నామస్మరణ. తనకు చెడు ఆలోచనలు రాకుండా ఉండేందుకు రాత్రింపగళ్లు 'అల్లాహో అక్బర్' అని గట్టిగా అరుస్తూ ఉండేవాడు. అలా స్మరిస్తే మనసులో చెడు ఆలోచనలకు తావుండదనేది అతని భావన.

రోహిల్లా అలా అరుస్తుంటే, ఆంబోతు రంకెలు వేస్తున్నట్లుండేది. పగలంతా శ్రమించి హాయిగా నిద్రపోతున్న షిర్డీవాసులు ఈ రంకెలతో ఉలిక్కిపడి లేచేవారు. రోజూ ఇదో తంతుగా మారడంతో ఇక భరించలేక వారంతా సాయి బాబా వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. వారి మాటలు విన్న బాబా " ఎవరి పనులు వారు చేసుకోండి. రోహిల్లా జోలికి వెళ్లకండి'' అని గట్టిగా అనడంతో వారు విస్తుపోయారు. ఆ తరువాత బాబా దీన్ని వివరిస్తూ, " రోహిల్లాకు ఓ దౌర్భాగ్యపు భార్య ఉంది. ఆమె పరమగయ్యాళి. అతని మనసును ఆమె ఏనాడూ కుదురుగా ఉండనీయదు. ఆ దౌర్భాగ్యం నుంచి బయటపడేందుకే రోహిల్లా అలా గట్టిగా భగవన్నామ స్మరణ చేస్తున్నాడు'' అంటూ షిర్దీవాసులకు సర్ది చెప్పారు.

వాస్తవానికి రోహిల్లాకు అసలు పెళ్లే కాలేదు. అయితే బాబా ఇక్కడ అన్నది అతని మనసులోని దుర్బుద్ధిని ఉద్దేశించి. అతని మనసులో చెడు ఆలోచనలు పుడుతున్నాయి. వాటిని అణుచుకోవడానికే రోహిల్లా భగవంతుని నామాన్ని గట్టిగా స్మరిస్తున్నాడు. బాబా అతన్ని ప్రయత్నాన్ని గ్రహించారు. అందుకే అతనిపై షిర్డీ వాసులు ఫిర్యాదు చే సినా బాబా వారిపైనే తిరిగి కేకలు వేశారు. మంచి కోసం ఎవరు ఏ ప్రయత్నం చేసినా ఏదో విధంగా ప్రోత్సహించాలనేది బాబా అభిమతం. ఏమైనా కొన్నాళ్లకు నిరంతర భగవ న్నామ స్మరణ ద్వారా రోహిల్లా మనసు కుదుటపడింది.
సాయిబాబా ప్రత్యేకత ఏమిటంటే, ఏ విషయం చెప్పినా, భక్తుల మనసులో సూటిగా నాటుకుపోయేలా నిదర్శనాలు చూపేవారు. చిన్న చిన్న ఉపదేశాలు, సన్నివేశాల ద్వారా ఎవరో ఒకర్ని నిదర్శనంగా చూపి, మిగతా వారి కళ్లు తెరిపించేవారు. మంచితనాన్ని, మంచి ప్రయత్నాలను ఎలా ప్రోత్సహించాలో కళ్లకు కట్టినట్లుగా చూపేందుకు బాబా రోహిల్లాను నిదర్శనంగా చూపారు.
                                                            - డాక్టర్ కుమార్ అన్నవరపు

Thursday 18 July 2013

తొలి ఏకాదశి



హైందవ సంప్రదాయ సాంస్కృతిక జీవన విధానంలో ఏకాదశి అత్యంత పవిత్రమైన తిథి. హరినామ సంకీర్తనానికి ఈ పర్వదినం ప్రశస్తమైనది కావడంతో దీన్ని 'హరివాసర'మన్నారు. 

సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. వాటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని 'తొలి ఏకాదశి'గా వ్యవహరిస్తారు. విష్ణ్వార్చనతోపాటు ఈ రోజున ఉపవాసానికి ప్రాధాన్యమిస్తారు. ఈ శుభ దినాన శ్రీమహావిష్ణువు క్షీరాబ్ధిలో శేషపర్యంకంమీద శయనించి నిద్రకు ఉపక్రమిస్తాడని 'శయనైకాదశి'గా పరిగణిస్తారు. ఈ రోజు నుంచి సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్లు గోచరిస్తాడు. ఈ పర్వడిరోజున 'గోపద్మ వ్రతం' ఆచరిస్తారు. ఆషాఢ శుక్ల ఏకాదశితో ఆరంభమై, కార్తిక శుక్ల ఏకాదశి వరకు ఉండే పవిత్ర సమయాన్ని 'చాతుర్మాస్యం' అంటారు. ఈ కాలమంతా విష్ణువు శేషశాయిగా నిద్రిస్తాడంటారు. చాతుర్మాస్య వ్రత విధానం స్కంద, భవిష్య పురాణాల్లో విశేషంగా వర్ణితమైంది. అనేక వ్యాధులకు ఆలవాలమైన క్రిమికీటకాలు విస్తరించే ఈ వర్షకాలంలో అపథ్యాహారాన్నే త్యజించి, శాకాహారులుగా, ఉపవాస వ్రతులుగా భగవచ్చింతనతో గడపాలన్నది ఈ చాతుర్మాస్య సందేశం, సంకేతం!

దశమినాటి రాత్రి నిరాహారంగా గడిపి ఏకాదశినాడు పూర్తిగా ఉపవసించి, ద్వాదశిరోజున పారణ చేసి, ప్రసాదం తీసుకుని త్రయోదశినాడు నృత్యగీతాలతో, భజనలతో ఏకాదశీ వ్రతం ముగిస్తారు. బ్రహ్మహత్యాది మహాపాతకాలన్నింటినీ తొలగించి, భక్తుడికి ముక్తిని ప్రసాదించే మహత్తర వ్రతమిది. ఈ వ్రతం ఆచరించే ఇంటివైపు యముడు కూడా కన్నెత్తి చూడలేడట. అందుకే గంగవంటి తీర్థం, తల్లివంటి గురువు, విష్ణువు వంటి దైవం, నిరాహారం వంటి తపం, కీర్తి వంటి ధనం, జ్ఞానం వంటి లాభం, ధర్మం వంటి తండ్రి, వివేకం వంటి బంధువు 'ఏకాదశి' వంటి వ్రతం లోకంలో లేవని పురాణ గాథలు అభివర్ణించాయి.

కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు తనకు లభించిన బ్రహ్మవరంవల్ల గర్వితుడై దేవతలను, రుషులను హింసిస్తుంటే విష్ణువు అతడితో వెయ్యి సంవత్సరాలు పోరాడి అలసిపోయి, నిరాశ చెంది, ఓ గుహలో విశ్రాంతి తీసుకొంటుండగా, ఆయన దేహం నుంచి ఓ కన్య ఉద్భవించి, ఆ అసురుణ్ని ఎదుర్కొని సంహరించిందని చెబుతారు. అందుకు సంతోషించిన శ్రీమన్నారాయణుడు వరం కోరుకొమ్మంటే, 'ఏకాదశి' తిథిగా విష్ణుప్రియగా లోకారాధ్య కావాలని కోరుకుంటుంది. అది మొదలు 'తొలి ఏకాదశి' వ్యవహారంలోకి వచ్చిందంటారు.

ఏకాదశికి మరో పవిత్రమైన అంతరార్థం పురాణాలు చెబుతున్నాయి. అయిదు కర్మేంద్రియాలు, అయిదు జ్ఞానేంద్రియాలు, మనసు- వెరసి పదకొండింటిపైన నియంత్రణ కలిగి వ్రతదీక్ష కొనసాగించాలన్నది ఆంతరిక సందేశం. 
అంబరీష మహారాజు దుర్వాస మహర్షి శాపం నుంచి తప్పించుకుని, హరిభక్తితో ఏకాదశీ వ్రతాన్ని నియమ నిష్ఠలతో నెరవేర్చడం వల్ల విష్ణు సాయుజ్యం పొందినట్లు పురాణగాథ ఉంది. సతీ సక్కుబాయి తొలి ఏకాదశీ వ్రతం శాస్త్రోక్తంగా నిర్వర్తించి, అదేరోజున విష్ణు సాయుజ్యం పొందిందట.

ఆనందకరమైన ఆరోగ్యప్రాప్తికీ, చిదానందకరమైన ఆధ్యాత్మిక దీప్తికీ తొలి ఏకాదశి జ్ఞానసుధావారాశి. ఈ వ్రతం ఆచరించేవారికి భూరి దానాలు చేసిన పుణ్యం, అశ్వమేధయాగ ఫలం, అరవై సంవత్సరాల తపోఫలం లభిస్తాయని స్మృతి పురాణ కథనం. వ్రతం చేయలేనివారు ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణ చేసి, అర్చించి, ఉపవాసం చేసి దైవచింతనతో గడిపినా ఎంతో మంచిదని చెబుతారు. 

మానవ మనోవికాసం, సాత్విక చింతన, దానధర్మ కర్మాచరణ, సత్యనిష్ఠ, జ్ఞాన పిపాస, మోక్షాసక్తికి 'తొలి ఏకాదశి' తొలి సోపానం.
                                                             - చిమ్మపూడి శ్రీరామమూర్తి

Wednesday 17 July 2013

అమ్మ ఆరాధన


  కల సృష్టికి మూలం శక్తి. సృష్టి స్థితి లయ కారణమైన శక్తిని పలువిధాలుగా దర్శిస్తున్నాం. శక్తిని ఏ పేరుతో వ్యవహరించినా ప్రకటించే చైతన్యం ఒక్కటే. ఆ శక్తే ఆదిశక్తి, మూలశక్తి, చిచ్చక్తి. ఈ జగత్తంతా ఆ చిచ్చక్తి లీలా విలాసమే! అండ పిండ బ్రహ్మాండమంతా శక్తి ఆవరించి ఉంది. ఈ ప్రకృతి శక్తి వివిధ శక్తులుగా, విభిన్న దేవతలుగా వ్యక్తమవుతోంది. అలాంటి ప్రకృతి ఆకృతులైన జగన్మాత స్వరూపాల ఆరాధనకు తగిన తరుణం ఈ ఆషాఢమాసం.

ఆషాఢమాసం శూన్యమాసంకాదు. ఆధ్యాత్మిక ఆరోగ్యసాధనకు ఉపయుక్తమైన మాసం. ప్రకృతిమాతకు కృతజ్ఞతల్ని సమర్పించే మాసం. భక్తిప్రపత్తులతో అమ్మను అనేక మార్గాల్లో కొలిచే మాసం. సమాజానికి, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి ముఖ్యమైనవి మూడు అంశాలు. అవి జ్ఞానం, శక్తి, సంపద. జ్ఞాన, శక్తి, ఐశ్వర్య స్వరూపాలే సరస్వతి, దుర్గ, లక్ష్మి. ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మగా మహాశక్తి రూపాల్ని అర్చించడం ఈ మాసంలోని సంప్రదాయం. ప్రాకృతికంగా అనేక రోగకారక పరిస్థితులు ఆషాఢంలో ఉంటాయి. ఈ స్థితిని తట్టుకుని, అన్ని ఆటంకాల్ని అధిగమించడానికి అమ్మ ఆలంబనను భక్తులు కోరుకుంటారు. ఆషాఢమాసంలో మహిషాసుర మర్దిని రూపాన్ని విశేషంగా పూజించాలని 'స్మృతికౌస్తుభం' తెలియజేస్తోంది. ఆషాఢ శుద్ధ నవమినాడు (ఈరోజు) ఇంద్రాదేవిని పూజించాలని 'రామార్చన చంద్రిక' వెల్లడిస్తోంది.

ఆషాఢ శుద్ధ నవమి నుంచి శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు 'శాకమహాలక్ష్మీ వ్రతం' పేరిట లక్ష్మీ ఆరాధనం కొనసాగుతుంది. సంపదల తల్లి అయిన మహాలక్ష్మిని దశమినాడు షోడశోపచారాలు, అష్టోత్తరాలు, శ్రీసూక్త సహితంగా పూజించి ఆకుకూరల్ని నివేదన చేస్తారు. ఈ వ్రతాచరణ చేసేవారు నెలరోజులపాటు ఆకు కూరల్ని స్వీకరించకూడదని వ్రత విధివిధానం తెలియజేస్తోంది. ఆషాఢ పూర్ణిమ రోజున 'అంబికావ్రతం' పేరిట జగన్మాతను ఆరాధిస్తారు. ఆయురారోగ్య సిద్ధికి ఈ వ్రతం దోహదపడుతుందని చెబుతారు. ఆషాఢ పూర్ణిమ నుంచి శ్రావణ పూర్ణిమ వరకు అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి 'కోకిలా వ్రతాన్ని' ఆచరించే సంప్రదాయం ఉంది. నదీతీరాల్లో లేదా గృహాల్లో తులసి మొక్క సమక్షంలో నువ్వుల పిండితో కోకిల బొమ్మను తయారుచేస్తారు. ఈ ప్రతిమను అమ్మవారి రూపంగా భావించి, పూజాదికాలు నిర్వహిస్తారు. లేత చిగురాకులు, ఫలాల్ని నివేదన చేస్తారు. శ్రీఘ్ర వివాహ సిద్ధి, సౌభాగ్య ప్రాప్తి ఈ వ్రత ఫలితాలని శాస్త్ర వచనం.

ఆషాఢమాసంలో నిర్వహించే మరో ముఖ్యమైన వేడుక శాకంబరీదేవి ఉత్సవం. పూర్వకాలంలో హిరణ్యాక్షుడి వంశానికి చెందిన దుర్గముడు అనే రాక్షసుడు తన తపశ్శక్తితో వేదాల్ని అంతర్ధానం చేశాడంటారు. దానితో, వైదిక కర్మలు, యజ్ఞయాగాదులు లోపించాయి. ఫలితంగా సుదీర్ఘకాలం కరవుకాటకాలు ఏర్పడ్డాయి. 'శతాక్షి' నామంతో ప్రకటితమైన జగదంబ, అసుర సంహారం చేసి, వేదాల్ని రక్షించి, వైదిక కర్మాచరణను పునరుద్ధరించిందని చెబుతారు. క్షామాన్ని నివారించి, లోకానికి వివిధ శాకాల్ని ప్రసాదించి, ఆకలి బాధను తొలగించిందంటారు. శతాక్షీమాత శాకంబరిగా అభివ్యక్తమైందంటారు. ఆ స్వరూపాన్నే అన్నపూర్ణగా ఆరాధిస్తారు. ఆషాఢంలో అమ్మవారి వివిధ స్వరూపాల్ని ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, సస్యాలు వంటి ఆహార ద్రవ్యాలతో అలంకరించి శాకంబరిగా ఆరాధించడంవల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండుతాయని విశ్వసిస్తారు. ఆషాఢమాసంలోనే బోనాల వేడుకతో ప్రకృతి శక్తిని తమ ఇలవేల్పుగా, కులదేవతగా, గ్రామదేవతగా కొలుచుకుంటారు. ప్రకృతిలో జరిగే అనేక మార్పులను, పరిణామాలను భక్తులు తమ ఆయురారోగ్య సుఖ సౌభాగ్యాలకు అనుగుణంగా మలచాలని ఆషాఢంలో అమ్మను ఆరాధిస్తారు. శారీరక, మానసిక ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రచోదనం చేయడానికి ఆషాఢంలో మాతృశక్తిని పూజిస్తారు.
                                                            - డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌

Tuesday 16 July 2013

రక్షణ కవచం


  'ఓ గంగా మాతా!
నాకు సంపదలూ అధికారాలూ వద్దు! వచ్చే జన్మలో ఒక పక్షిగా పుట్టి, గంగాతీరంలో చెట్టుపై గూడుకట్టుకొని, నీ పవిత్ర శీకరాలతో సేదతీరే వరం ఇవ్వు!' అని వాల్మీకి మహర్షి ప్రార్థించాడు.

గంగానదితో భారతీయ సంస్కృతి పెనవేసుకొని ఉంది. గంగా యమునలు పుట్టిన ప్రాంతాలు ప్రకృతి సౌందర్యానికి నిలయాలు. పవిత్ర భారతావనికి ఉత్తరాన పెట్టని గోడ హిమాలయం. ప్రతి భారతీయుడు దర్శించాలని కలలుగనే పుణ్యక్షేత్రాలకు, తీర్థాలకు నిలయాలు. సదాశివుడి సంచార భూములు. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బదరీనాథ్‌- ఈ చతుర్థామాల యాత్ర పరమ పవిత్రం. కాళిందీ పర్వతం వద్ద యమున ఉద్భవిస్తుంది. అక్కడి భాస్వర ఉదకంలో బియ్యం, బంగాళదుంపలు ఉడుకుతాయి. అవే భక్తులకు ప్రసాదం. నలుపు చలువరాతి యుమునాదేవి ప్రతిమను ఆరాధిస్తారు. గంగోత్రిలో గోర్ఖా అమర్‌సింగ్‌ థాపా గంగోదేవి ఆలయాన్ని నిర్మించాడు. గంగ భువికి అవతరించిన భగీరథ శిలను దర్శించి భక్తులు తన్మయులవుతారు. టిబెట్టు నుంచి మానస సరోవర జలాలు గంగోత్రిలో కలుస్తాయి. మందాకినీ శిరోభాగాన కేదారనాథం నెలకొని ఉంది. పాండవులు భారతయుద్ధానంతరం దీన్ని నిర్మించారంటారు. తొమ్మిదో శతాబ్దిలో ఆదిశంకరులు నందీశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నర, నారాయణ పర్వతాల మధ్య, బదరీ వృక్షాల నడుమ వెలసింది బదరీనాథం. పక్కనే అలకనంద. గంగ-అలకనంద, మందాకిని, భాగీరథిగా చీలడంవల్ల ప్రవాహవేగం అదుపులో ఉంటుంది. ఆదిశంకరులు ఈ విష్ణు దేవాలయాన్ని దర్శించి పరవశించారు. తప్తకుండంలో వేడి వూట నీటిలో రోగనివారణ శక్తి ఉన్నదని విశ్వసిస్తారు.

అల్లసాని పెద్దన మహాకవి మనుచరిత్ర ప్రబంధంలో పరవశంతో ఈ పరమ పవిత్ర క్షేత్రాలను స్మరించాడు. సిద్ధుడి పసరు మహిమతో ప్రవరుడు హిమాలయాలకు వెళ్లి చూసింది ఇక్కడి అద్భుతాలనే! ఇక ఇంటికి పోదామని ప్రయత్నిస్తే పాదలేపనం కరిగిపోవడం వల్ల ఎగరలేకపోయాడు. దారి తెలియని ప్రవరుడు విలపిస్తాడు. మిన్ను మన్నుపై పడ్డ చోటికి తెచ్చి పడవేశావెందుకు దేవుడా- అని మొత్తుకుంటాడు.

యాత్రలకు వెళ్లి చిక్కుల్లో చిక్కుకొనేవారి అనుభూతి ఇలాగే ఉంటుంది. మహిమాన్వితమైన హిమాలయాల్లో వేలకొలది ప్రజలు జలవిలయంలో విగతజీవులు కావడమా! మోక్షానికి పోతే మొసలెత్తుకొని పోవడమా! భక్తులపైనా ప్రకృతి ప్రళయ తాండవం? చతుర్థామాల దర్శనంతో అగణ్యపుణ్యం పొందుతామని వెళ్ళినవాళ్లు ప్రవాహం పాలు కావడమేమిటి? పరమేశ్వరుడి ఉనికినే ప్రశ్నించే దుస్థితి! ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ఇలాంటి ప్రశ్నలు తలెత్తడం సహజం. ఆత్మవిమర్శ చేసుకుంటే సమాధానం స్ఫురిస్తుంది.

ఆధ్యాత్మిక కేంద్రాలను ప్రభుత్వాలు రాబడి కేంద్రాలుగా భావిస్తున్నాయి. సహజ ప్రకృతిని పరిరక్షించుకోవడంలో విఫలమవుతున్నాయి. కైలాస నాథుడి ఏకాంత ధ్యానానికి భగ్నం కలుగుతోంది. ప్రకృతి ఆరాధనే వేద ధర్మమని విస్మరించారు. ఆధ్యాత్మిక కేంద్రాలను విలాస జీవుల విహార భూములుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరిగింది. సహజ నదీప్రవాహాలకు అడ్డుకట్టలు నిర్మించారు. కొండలను బద్దలుచేసి భవనాలు నిర్మించారు. అరణ్యాలను హరించారు. భాగీరథి చూస్తున్నది ఈ పాపాలు. ఫలితమే ఈ కోపాలు! మానవ హననానికి కారణం పరమేశ్వరుడా, మన జనమా? ప్రపంచంలో ఎన్నో నాగరికతలు పెరిగీ పెరిగీ, సహజ ప్రకృతిని వికృతిగా మార్చి, చివరకు జలప్రళయంలో రూపురేకలు లేకుండా మాసిపోయాయి. పాశ్చాత్య సంస్కృతిలో అట్లాంటిస్‌ అలాంటిదే! ప్లేటో రాతల వల్ల దాని కథ తెలుస్తోంది. ఇప్పుడు అట్లాంటిక్‌ సముద్రం ఉన్నచోట అది పరిఢవిల్లింది. అపూర్వ సంపదకు, విజ్ఞానానికి అక్కడి నాగరికత నిలయం. మేధా సంపద, వైజ్ఞానిక వైభవంతో తులతూగీ తుదకు తన బరువుకు తానే ఆ సంస్కృతి అంతా... సముద్రంలో కలిసిపోయింది.

ఇప్పుడూ ఆధునిక సంస్కృతి అంతా జలప్రళయంలో లయం అయ్యే కాలం సమీపించిందని కొందరు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి మానవాళిని గట్టుకు చేర్చే మార్గం ఒక్కటే! ప్రకృతిని పనిముట్టుగా గాక పరమపవిత్ర దైవంగా భావించి ఆరాధించాలి.


ఇంత జలవిలయంలోనూ కేదారీశ్వరుడికీ, ఎదురుగా ఉన్న నందీశ్వరుడికీ ఏ హానీ కలగకుండా జలప్రవాహానికి కొట్టుకువచ్చిన బండరాళ్లు రక్షణ కవచంలా నిలిచాయి! పరమేశ్వరుడు మనకు రక్షణ కవచంగా ప్రకృతిని నిర్మించాడు. మనమే మన రక్షణ కవచాన్ని చీల్చి పారవేస్తే ఇక మనకు దిక్కేది? కంచే చేను మేస్తే కాపేమి చేస్తాడు?
                                                       - డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు 

Monday 15 July 2013

పుష్ప సందేశం

  ప్రకృతి ప్రసాదించిన పుష్పాలు అనేకం. రకరకాల రంగులతో కనులకు ఆనందాన్నిచ్చే పూలు జీవితాన్ని పరిమళింపజేస్తాయి. పండుగ రోజుల్లోనే కాకుండా అన్ని ముఖ్య కార్యక్రమాల్లోనూ అన్ని మతాల వారూ వీటిని ఉపయోగిస్తారు. పూలు ఆనందాన్నివ్వడంతోపాటు శుభాశుభాలన్నింటికీ పూర్ణత్వాన్నిస్తాయి. దేవతార్చనల్లో పుష్పాలు అతి ముఖ్యమైనవి.

పుష్పమూలంలో బ్రహ్మ, పుష్పమధ్యంలో కేశవమూర్తి, పుష్పాగ్రంలో మహాదేవుడు, దళంలో సర్వదేవతలూ నివసించి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.

పుష్పాలన్నింటిలో ఉత్తమ గుణాలు కలిగి, సహస్ర పత్రాలు కలిగిన కమలం ఎంతో విశిష్టమైనది. లక్ష్మీదేవి ఉద్భవించింది కమలం నుంచే కనుక అది సర్వశుభాలకూ నిలయమైందంటారు.

చదువుల తల్లి సరస్వతిదేవి పూజలో తమస్సును దూరం చేసి, సాత్విక ప్రకాశాన్నిచ్చే తెల్లతామర, మల్లెపూలు ప్రధానమైనవి. తెల్లని పట్టుచీరను ధరించి, మల్లెమాలను దాల్చి, వీణ చేతపట్టి తెల్లతామర పూవులో ఆసీనురాలైన సరస్వతీదేవిని మల్లె, తెల్ల తామరలతో పూజించాలని 'శారదా తిలకమ్‌' చెబుతోంది.

సన్నజాజులు దైవ పూజకు శ్రేష్ఠమైనవని పుష్ప చింతామణి గ్రంథం వివరిస్తోంది. ఈ పుష్పాలతో పగటిపూటైనా, రాత్రిపూటైనా శివకేశవులను, ఇతర దేవతలనూ నిరభ్యంతరంగా పూజించవచ్చునని చెబుతారు.

పుష్పాలు రూపంలో కల్మషం లేనివేగాక సువాసన భరితమైనవి. కొన్ని కొన్ని పుష్పాల పరిమళాలను మనిషి ఆఘ్రాణించడం వల్ల కొన్ని వ్యాధులకు ఉపశమనం కలుగుతుంది. పుష్పాలు రోగ నివారణ ఔషధంగానూ పనిచేస్తాయని శాస్త్రపరంగా పరిశోధించి నిరూపించారు. పుష్పాలకు శారీరకంగానే కాకుండా మానసిక రోగాలను సైతం నివారించే స్వభావం ఉంది.

పుష్పాలు మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడంతోపాటు తాత్విక, ఆధ్యాత్మిక విలువలను పొందుపరచుకుని ఉన్నాయి. యోగశాస్త్ర రీత్యా సప్తకమలాల్లో హృదయకమలం ఒకటి. హృదయమనే పుష్పాన్ని నిష్కల్మషంగా భగవంతుడి పాదాల చెంత ఉంచి, మన ఆత్మను ఆయనలో ఐక్యం చేసుకొమ్మని అర్థించాలన్నది పెద్దలమాట.అన్ని పూజల అసలు ఉద్దేశం ఇదే.

ఇక అహింసా పుష్పం, ఇంద్రియ నిగ్రహ పుష్పం, సర్వభూతదయా పుష్పం, క్షమా పుష్పం, శాంతి పుష్పం, తపో పుష్పం, ధ్యాన పుష్పం, సత్యపుష్పం అనే ఎనిమిదింటితో అంతరాత్మలో దైవాన్ని పూజించేవారికి దైవ సాక్షాత్కారం లభిస్తుందని శాస్త్రోక్తి. వేరే మాటల్లో, ఈ ఎనిమిది పుష్పాలతో పూజించడం అంటే ఉత్తమ మానవ లక్షణాలు కలిగి ఉండటం అన్నమాట.

అహింస, శాంతి, దయ, ఇంద్రియ నిగ్రహం, క్షమ, ధ్యాన తపస్సులు కలవాడు సాక్షాత్తు బ్రహ్మవేత్త అనక తప్పదు. ఈ గుణాలు కలిగి జీవనం సాగించేవారు భగవంతుని అష్టవిధ పుష్పాలతో పూజించిన వారవుతారు. అష్టదళ పద్మం ప్రాముఖ్యం ఇదే. జ్ఞాన యోగ నిష్ఠ సాధ్యపడని సామాన్యులు కేవలం ఇటువంటి స్వభావం కలిగి ఉన్నా దైవాన్ని పూజించినట్లే.

సత్ప్రవర్తన, సద్గుణాలు కలిగి, నిర్మలమైన మనసుతో సదా పరమాత్ముని సన్నిధి కోరుకోవాలని మనిషికి పుష్పం సందేశమిస్తోంది.
                                                                                        - భరణి

Sunday 14 July 2013

సేవే పూజ!

   దుటివారి మీద ఒక్కొక్కస్థాయిలో ఒక్కొక్క రకంగా చొరవ, సాన్నిహిత్యం కనబరుస్తాం. ప్రేమ, సేవ, గౌరవం, ఆదరణ, ఆప్యాయత, అర్పణ... లాంటివి వాటిపేర్లు. వీటిలో ప్రేమ విశ్వవ్యాప్తమైనది. తాను, తనవారు, తనది... అనే పరిధి దాటి, అందరూ అన్నీ అంతా అనే భావన కలిగి ఉండటం గొప్ప లక్షణం. ఆ లక్షణాలను పెంచుకున్నవాడు మానవత్వ పరిధినుంచి దైవత్వపు సీమలోకి పయనించడానికి అర్హుడవుతాడు. అలాంటిదే సేవచేసే తత్వమూ. ప్రతిఫలాపేక్ష లేకుండా, ఎదుటివారికి చేసేదే నిజమైన సేవ. గౌరవం విషయంలోనూ అదే పంథా అవలంబించాలి. వయసు, హోదా, స్థితి లాంటి వేటినీ మనసులోకి రానీయకుండా అందరినీ నిండుమనసుతో గౌరవించాలి. ఆదరణ, అభిమానం లాంటివి సైతం స్థాయికి తగ్గట్టుండాలి. వీటన్నింటి సమాహారమే భక్తి. ప్రతిఫలాపేక్ష లేకుండా ఇన్ని భావనలనీ ఒక్కసారిగా ఒక్కరిమీదనే ప్రదర్శిస్తే వాడికే నిజమైన 'భక్తుడు' అని పేరు. అలాంటి భక్తి కలిగి ఉన్న, పొందిన జీవుడు- సిద్ధుడు, అమృతుడు, తృప్తుడు అవుతాడని నారదుడు తన భక్తి సూత్రాల్లో తెలియజెప్పాడు. అంతే తప్ప భయం, కోరిక, ఆశ, లోభత్వం, క్షణిక తృప్తి తదితరాలతో కొలవడం భక్తి కానేకాదు. కళ్లుమూసుకుని కూర్చుని, ఎదుటివాడు చచ్చిపోతున్నా పట్టనట్టు ఉండటం అంతకన్నా కాదు. అందుకే 'తాను జీవిస్తూ, ఇతరులు జీవించడానికి అవకాశం కల్పించేవాడే నిజమైన భక్తుడు' అంటాడు కృష్ణభగవానుడు భగవద్గీత భక్తియోగంలో. ఇక్కడ 'జీవిస్తూ' అనే పదానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. 'ఎల్లరియందు ఆదరణ కలిగి, అనుబంధం పెంచుకుని, కల్యాణాలు(శుభాలు) కోరుకుని, వారి అఖండమైన ఆనందం చూసి తృప్తి పొందుతున్నవాడే నిజమైన జీవి' అని 'బృహదారణ్యకోపనిషత్తు' చెబుతోంది. తాను అలాంటి భావనలు కలిగి ఉండి, మిగిలినవారు వాటినే కలిగి ఉండేటట్లు చేయగలిగితే అదంతా ఒక భక్త సమాజమే అవుతుంది.

భక్తికి పరాకాష్ఠ పూజ. దాన్ని పొందడానికి అర్హులు అయినవారు అత్యంత ఉత్కృష్టులై ఉండాలి. ఆ అర్హత కలవాడు భగవంతుడే అని చాలామంది భావన. భగవంతుడిగా భావిస్తున్న ఏ మూర్తిలోనూ సర్వశక్తులూ సమాహారమై లేవు. ఒక్కొక్క దేవత ఒక్కొక్క శక్తికి నిలయాలని చెబుతున్నాయి పురాణాలు. అలాంటి శక్తులు కలిగిఉన్నవాడే దేవుడు అని చెప్పడమే ఆయా మూర్తుల ఆంతర్యం. నిజానికి ఆయా శక్తులు కలవారు ఎవరైనా దేవుడే అనిపించుకుంటాడని పురాణాలు, కావ్యాలు ఉపనిషత్తులు చెబుతున్నాయి. దేవుణ్ని ఒక మూర్తిగానో, కోరికలు తీర్చే యంత్రంగానో భావించడం సరైనది కాదు. ఉత్తమోత్తమ, ఉత్తమ, మధ్యమ, అధమ గుణాల స్థాయి, లక్షణాలు కలవాళ్లను వరసగా దేవతలు, యోగులు(మునులు), మానవులు, రాక్షసులు అని పిలుస్తారని ఛాందోగ్యోపనిషత్‌ చెబుతోంది. ఈ వాక్యం ప్రకారం ఉత్తమోత్తమ గుణాల సమాహారమే 'దేవుడు' అని తేలుతోంది. (అన్ని లక్షణాలు కలిగినవారు చాలా అరుదు కాబట్టే 'దేవుడు' అంటే కనబడనివాడు అనే ఒక భావన ఏర్పడి పోయింది). నిజానికి వెదికితే అటువంటి గుణాలు కలిగినవారు (దేవతలు) ఎందరో కనబడతారు.

ప్రేమ స్వరూపుడైనవాడు ఏ వస్తువునీ కాంక్షించడు. దేనికోసమూ శోకించడు. దేని(ఎవరి)నీ ద్వేషించడు, దేనిమీదా ఆసక్తి, అనురాగం చూపించడు. కానీ... వారికి ఎదురుగా కనిపించే అణువంత వస్తువైనా, విశ్వమంత విశాలమైనదిగా కనబడుతుంది. ఎదుటివారిలో ఏ మాత్రం చిన్న మంచి ఉన్నా గొప్పదిగా భావిస్తారు. అందుకే అందరినీ ప్రేమించగలుగుతారు. అలా అందరినీ ప్రేమించేటప్పుడు ద్వేషానికి తావుండదు. కాబట్టి ప్రేమ స్వరూపులు అనిపించుకుంటారు. చెవులకు వినిపించే అతి చిన్న శబ్దం సైతం విశ్వాంతరాళాలు మార్మోగేదిగా భావిస్తారు. అందువల్లనే ఆర్తిగా ఎవరు పిలిచినా స్పందిస్తారు. ఏదో ఒక రూపంలో సాయం అందిస్తారు. ప్రేమస్వరూపుల స్పర్శకు పులకించిపోతారు. ఆ ప్రేమానురాగాల సందడిలో పడిన జిహ్వ ఆకలి దప్పులను, రుచి, అరుచులను సైతం మరిచిపోతుంది.

భక్తులు, భగవంతుడు మధ్య తేడా కనిపెట్టడం చాలా కష్టం. వారిద్దరి మధ్య అతిసున్నితమైన ఎడమే ఉంటుంది. అది మనోగోచరమే తప్ప దృగ్గోచరం కాదు. ఆ ఎరుక కలిగినవారు అన్నింటినీ భగవత్ప్రసాదంగానే భావిస్తారు. ఇదే భక్తికి పరాకాష్ఠ అయిన పూజ. దీనికి పీఠాలు, పూలు, ధూప, దీప నైవేద్యాలు... ప్రత్యేకంగా అక్కరలేదు. భగవత్ప్రసాదితమైన ఈ తనువు, అందులో ఇమిడి ఉన్న మనసు అనే రెండూ... ఎదుటివారి క్షేమాన్ని కాంక్షించి, వారికి ఉపయోగపడేలా చేసే ఏదైనా పూజ అనిపించుకుంటుంది.
                                                              - అయ్యగారి శ్రీనివాసరావు 

Saturday 13 July 2013

విజయకేతనం


   ఆధ్యాత్మిక రంగంలో ఒక అద్వితీయమైన, అద్భుతమైన అంశం ఉంది. లౌకికమైన ఏ విషయంలోనైనా, ఏ యుద్ధంలోనైనా శ్రమించి, సాధించి, విజయం పొందాక విజయకేతనం ఎగురవేసే అవకాశం ఉంటుంది. అయితే ఆధ్యాత్మిక రంగంలో భగవంతుడి పట్ల ఆశ, ఆర్తి ప్రారంభమైన క్షణమే మనం మన జీవిత రథంమీద విజయకేతనం ఎగురవేయవచ్చు. ఎగిరే విజయకేతనంతోనే, ఆ ఆనందంతోనే, ఆ స్ఫూర్తితోనే ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని నడుపుకోవచ్చు. ఎందుకిలా?! కేవలం ఒక ఆలోచన లేదా ఒక భావన... దానితోనే విజయం సాధించినట్లా? ప్రయత్నం, విజయం పట్ల భరోసా, మధ్యలో విరమించే ఆలోచనలు, అవరోధాలు, ఆటంకాలు... వీటి మాటేమిటి? వడ్డించేవాడు మనవాడైతే ఆఖరి పంక్తిలో కూర్చున్నా విస్తరి నిండా మృష్టాన్న భోజనం చేయవచ్చు. భగవంతుడు 'మనవాడు', 'నావాడు' అనుకున్న క్షణమే విజయం తథ్యమైపోయినట్లే. ఎప్పుడైనాసరే ఎన్నుకున్న అంశమే మన విజయాన్ని నిర్ధారిస్తుంది. కావలసిన అవసరాలు, ఆదరువులు, సరంజామా, సామర్థ్యం... ఆయన చూసుకుంటాడు. మనం పంక్తిలో కూర్చుంటే చాలు. ప్రయత్నంలో ఉంటే చాలు.

నిజమే... ఆధ్యాత్మిక ప్రయాణం ఒక యుద్ధమే. యుద్ధానికెప్పుడూ ఓటమి భయం ఉంటుంది. మరణభయం ఉంటుంది. శత్రు సామర్థ్య భయం ఉంటుంది. అయితే మన ప్రయాణం పరమపథానికి, మన శత్రువులు మన మనోప్రాంగణంలోనివారే. ఇక మరణమా? లేనేలేదు... కేవలం అమృతత్వమే. బయటి శత్రువులతో యుద్ధం చేయవలసివస్తే శత్రువుల శక్తియుక్తులు, సైనికసామర్థ్యం వ్యూహ రచనా రహస్యాలు... మనకు పూర్తిగా తెలిసే అవకాశం లేదు. ఆధ్యాత్మిక యుద్ధంలో శత్రువులు మన మనో ప్రాంగణంలోనివారే. మనలోని వారే. ముఖ్యంగా మనం సృష్టించుకున్నవారే. అయినా సరే... ఓడించటం కష్టం. అయినా సరే.. ఓడించే అవకాశం ఉంది. ఓడించి తీరాల్సిన అవసరమూ ఉంది. ఎవరువారు? కామక్రోధ లోభమోహమదమాత్సర్యాలు... అరిషడ్వర్గాలు. మహా బలీయమైనవారు. మనకు అర్థం కావాలిగానీ అంతకంటే బలమైన మనసు మన వశంలో ఉంది. అలాగే... అది అదుపుతప్పే ప్రమాదమూ ఉంది. దానికంటే బలమైన అరిషడ్వర్గ గజాలను అదుపుచేయగల అంకుశం లాంటి బుద్ధీ ఉంది. బుద్ధి ఆసరాతో అరిషడ్వర్గాలను అదుపుచేసి సాధనాపథంలో ప్రయాణం సాగించాలి. మరి ఓటమి సంగతి? ఎన్నెన్నో అననుకూల అవరోధాలను అధిగమించి ఓటమిని జయించే మనిషి, కృష్ణుడే హితుడై, స్నేహితుడై, సారథి అయిన అర్జునుడు... ఓటమి పొందుతాడా? ఆధ్యాత్మిక పోరాటంలో ఓటమే లేదు. విజయకేతనం పట్టుకునే విజయంవైపు నడిచే అవకాశం ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో, పోరాటంలో మాత్రమే ఉంది. ఇక ఈ యుద్ధంలో మరణభయం లేదు. గెలిచేవాడికి మరణమెక్కడిది? గెలుపే అమృతత్వమైనప్పుడు, ఓటమిలేని యుద్ధం ప్రసాదించేది అమృతత్వమే కదా!

ఈ యుద్ధానికి, పోరాటానికి- పెట్టుబడి? ధనం, బలం, కాలపరిమితి... వీటితో అవసరమే లేదు. కావలసిందల్లా పరమాత్మపట్ల ప్రేమ. తీవ్రమైన ఆర్తి. వీటికి కావలసిన చిత్తశుద్ధి. నిర్మలత్వం. పవిత్రత. ఇంకా ఇలాంటివి. ఇవి మనం ఏ పెట్టుబడీ లేకుండా సాధించుకోవచ్చు. ఎప్పుడు? నిజమైన భగవత్‌ ప్రేమ ఉన్నప్పుడు. అంటే- పరమపద ప్రయాణానికైతేనేమి, పోరాటానికైతేనేమి... కావలసింది భగవంతుడి పట్ల పరమ ప్రేమ. మనలోని ఆ ప్రేమే మన విజయకేతనం. ఎగరేద్దాం.
- చక్కిలం విజయలక్ష్మి 

Thursday 11 July 2013

జీవనగానం


జీవితం జీవించడానికే ఉంది. జీవనకళ తెలుసుకోవాలి. ప్రయత్నిస్తున్నాం. కాని నిజమైన సుఖం, శాంతి దొరకటం లేదు. అవి లేకుండా జీవితం ఉందా? జీవనం గురించి ఆలోచించినప్పుడల్లా మరణం మన ఆలోచనల్లో కదలాడుతుంది. రెండు ధ్రువాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాం. ఎందుకిలా జరుగుతోంది?

చక్కగా జీవించడం తెలిస్తే మరణం గురించి భయపడనవసరం లేదు. ఒకవేళ మరణ రహస్యమే తెలిసిపోతే, జీవితం ఒక ఆటగా మారిపోతుంది. ఆడుతూ పాడుతూ జీవనయాత్ర సాగించడమే నిజమైన మానవుల లక్షణం.

మరణానికి భయపడనవసరం లేదు. మంచి చెయ్యలేకపోతున్నందుకు, చెడ్డ చెయ్యాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నందుకు, ఎంత ప్రయత్నించినా మన మనసు మన మాట వినకుండా, తప్పుదారి పట్టిస్తున్నందుకు భయపడాలి.

భగవంతుడికి భయపడనవసరం లేదు. మనల్ని అధోగతిపాలు చేస్తున్న మాయ ఆకర్షణలకు, మోహదృశ్యాలకు భయపడాలి. ప్రేమ స్వరూపుడైన దైవాన్ని నిత్యం ప్రేమపూర్వకంగా ఆరాధిస్తే భయం, మరణం రెండూ తొలగిపోతాయి. శాశ్వత జీవనంలోకి ఆహ్వానం అందుతుంది.

ఒక శిశువులాగా మనం ఉండలేకపోతున్నాం. ఆ దశ వెళ్లిపోయింది. ఆ బంగారు బాల్యం కనుమరుగైపోయింది. పూర్ణ శరణాగతితో ఈశ్వరుడి ముందు మోకరిల్లితే అహంకారం పటాపంచలైపోతుంది. అప్పుడు మళ్ళీ శిశుప్రాయమే. దేవుడి బిడ్డలమే అవుతాం.

అందుకే 'ఈ విశ్వానికి తండ్రిని నేను' అన్నాడు శ్రీకృష్ణుడు. జీవించడానికి మన శక్తియుక్తులు సరిపోకపోతే తండ్రి సహాయం కోరటంలో తప్పేముంది? లోకరక్షకుడిగా వ్యవహరిస్తున్న దేవుడు 'నేను నీకోసం ఉన్నాను' అంటే అర్థం చేసుకున్నవాళ్లు ఎంతమంది? ఆయనను తెలుసుకుని జీవితాన్ని బాగుచేసుకుని, అదృష్టాన్ని పండించుకున్నవాళ్లు ఎంతమంది?

జీవించడం మనకు ముఖ్యం. సహాయం చేస్తున్నవాడిని గుర్తుపెట్టుకోవడం ముఖ్యం. ఎంతోమంది రామ సహాయం అందుకున్నారు. చరితార్థులు అయ్యారు. శ్రీకృష్ణ ప్రేమను ఎంతోమంది పొందారు. ధన్యులయ్యారు.

అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు భగవంతుడు. ఎంతమంది ఆయనను ఆర్తితో, ప్రేమతో అడుగుతున్నారు? మన జీవితం బాగుపడాలి. మనం సుఖంగా ఉండాలి. హాయిగా ఉండాలి. బాధలు, ప్రకృతి వైపరీత్యాలు మనల్ని ఇబ్బందులపాలు చెయ్యకూడదు.

గజేంద్రుడు మహావిష్ణువును ప్రార్థించినట్లు, ప్రహ్లాదుడు శ్రీహరిని స్తుతించినట్లు, మారుతి శ్రీరాముణ్ని గానం చేసినట్లు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చెయ్యలేకపోతున్నారు?

నాలుగు ముక్కలు తెలిస్తే గురువు, నాలుగు దిక్కులు తిరిగితే శిష్యుడు అనే వింత పరిస్థితి ఉంది. ఈ రోజుల్లో నిజమైన ఆరాధన ఎలా కుదురుతుంది, నాణ్యమైన జీవన విధానం ఎలా లభిస్తుంది?

పరిస్థితులు ఎలా ఉన్నా నిరాశ పడకూడదు. లోకం మారిపోతున్నా మన హృదయంలో దేవుడిపై ప్రేమలో ఏ మార్పు రాకూడదు. నీరు పడితే బిగుసుకుపోయే కాంక్రీటులాగా మన నమ్మకాన్ని అచంచలంగా పెంచుకుంటూపోతే దైవం ముఖాముఖి అవుతాడు. అప్పుడు ఎందుకు మనకు ఈ జీవితాన్ని ప్రసాదించాడు, ఎలా దైవజీవనాన్ని గడపాలి, అపరిమిత ఆనందానికి మనం ఎలా హక్కుదారులం కావాలో ఆయనే తెలియజేస్తాడు.

జీవనకళ ఎవరూ నేర్పరు. జీవిస్తూ నేర్చుకోవాలి. ఈదుతూ ఉంటే ఈత వచ్చినట్లు, పాడుతూ ఉంటే బాగా పాడగలిగినట్లు, సాధనచేస్తూ ఉంటే ఈ జీవితం మనకు సాధ్యమవుతుంది.

జీవితం ఒక వేణువు లాంటిది. అది ఖాళీగా, శూన్యంగా ఉంటుంది. మధుర స్వరాలను అనంతంగా ఆలాపించగల సామర్థ్యం దానికి ఉంది. కానీ, అదంతా గాయకుడి నైపుణ్యం మీదే ఆధారపడి ఉంటుంది.

మనలో ప్రతి ఒక్కరూ తమ వేణువుతో దివ్యగానాలు పలికించవచ్చు. అవధుల్లేని ఆనంద పారవశ్యాన్ని పొందవచ్చు. వెంటనే మన వేణువును మనం తీసుకుందాం. గానాన్ని ఆలపించే అవకాశాన్ని చేజారిపోనివ్వకుండా చూసుకుందాం. తెరదించక ముందే మన జీవనగానాన్ని చక్కగా ఆలపిద్దాం. ఆ బృందావన విహారి మనసు కరిగిద్దాం!                                                                                                       
                                                                    - ఆనందసాయి స్వామి