ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Wednesday, 2 April 2014

మరణానంతర జీవితం

                              
   నూ
రేళ్లు, వీలైతే ఇంకా ఎక్కువకాలం జీవించాలని కోరుకునేవాళ్లెందరో ఉన్నారు. ఎంతకాలం జీవించినా ఎప్పుడో ఒకప్పుడు పోక తప్పదు. ఆది శంకరాచార్యులవారు ముప్ఫై రెండేళ్లే జీవించారు! వెయ్యి సంవత్సరాల తరవాత కూడా ఆయన కీర్తి సజీవంగానే ఉన్నది. ఆయన ఆధ్యాత్మిక శక్తి అజరామరం. నిరుడు వివేకానందుల 150వ జయంతి ఉత్సవాలు దేశమంతటా వైభవోపేతంగా జరిగాయి. యువశక్తితో జాతిని జాగృతం చేయాలని ఆనాడు ఆయన పిలుపునిచ్చారు. నేటి యువతకు వివేకానందులే స్ఫూర్తి ప్రదాత. వివేకానందులు ఎక్కువకాలం జీవించలేదు. ఆయన కీర్తిశేషులైన తరవాత స్వాతంత్య్ర ఉద్యమం వూపునందుకొన్నది. తిలక్‌, గాంధీ, సుభాష్‌... వంటి స్వాతంత్య్రోద్యమ వీరులందరూ తాము స్వామి వివేకానందుల నుంచి స్ఫూర్తి పొందామన్నారు! జీవించి ఉన్నప్పటికంటే, మరణించిన తరవాతే మహాత్ములు ఎక్కువ ప్రభావం చూపిస్తారు!

మనిషి జీవించి ఉన్నప్పుడు ధనాన్నీ, అధికారాన్నీ. పేరు ప్రతిష్ఠలనూ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అతడి ధనాన్ని చూసీ, అధికారానికి ఆకర్షితులై అనేకులు 'ఎందుకైనా మంచిది' అని పొగడ్తలకు లంకించుకుంటారు. పదిమందీ పొగిడితే కీర్తి లభిస్తుంది. ఆ కీర్తిమంతులు భుజకీర్తులు తగిలించుకొని మురిసిపోతూ ఉంటారు. అధికారాంతమున జూడవలెగదా ఆ అయ్య సౌభాగ్యముల్‌- అన్నాడొక కవి. ధనం రావచ్చు, పోవచ్చు. అధికారమూ అంతే... ఇవి నిలకడగా ఉండేవి కావు. వీటిని ఎవరూ వెంట తీసుకువెళ్లలేరు. వారి మరణానంతరం కొందరైనా 'పోయినోడు మంచోడు' అనుకుంటే... వాళ్లు మరణానంతరం కూడా కొంతకాలం జీవించిఉన్నట్లే! అయితే ఆ 'కొందరు' పోయినవాడి దగ్గర అవినీతి సొమ్మును పంచుకున్నవాళ్లు మాత్రం కాకూడదు.

కళాకారుల జీవితంలో ఎక్కువ భాగం కష్టాలతో గడుస్తుంది. ఎక్కువ కష్టాలు అనుభవించినవారి కీర్తి, వారి మరణానంతరం ఎక్కువగా వ్యాపిస్తుంది. సంగీతం, సాహిత్యం, శిల్పం, చిత్రం... అన్ని కళలకూ ఈ సూత్రం వర్తిస్తుంది. వాళ్లు కష్టాలు అనుభవించారని మనం భావించి బాధపడతామే గాని, ఆ మహాత్ములు మాత్రం ఆనందంగానే జీవితం గడిపారు. వేమన వీధులవెంట వెర్రివాడిలాగా తిరిగాడు. ఆయన చెప్పే ఆటవెలదుల్ని పిచ్చిమాటలనుకున్నారు. కానీ... కాలం గడిచేకొద్దీ ప్రజల నాలుకలపై ఆయన ఆటవెలదులు నాట్యం చేశాయి. ప్రజల హృదయాల్లో వేమన సజీవమూర్తిగా నిలిచాడు. 'కవులు హాలికులైతేనేం? అడవుల్లో కందమూలాలు తిని బతికే వాళ్లయితేనేం? కష్టపడి భార్యాబిడ్డల్ని పోషించుకోవడంలో తప్పులేదు' అని చాటిన పోతన పేదరైతు. తెలుగు సాహిత్య సరస్వతికి వెలలేని భాగవత రత్నహారాన్ని సమర్పించిన సంపన్నుడు! శ్రీ కైవల్యసిద్ధి కోసం ఆయన భాగవతాన్ని రచిస్తే, ఆ భాగవత పఠనం తమకు శ్రీ కైవల్యం కలగజేస్తుందని అనునిత్యం పోతన భాగవత పద్యాలను పఠించేవాళ్లెందరో ఉన్నారు.

హంపీ శిల్పాలను చూద్దాం. ఏ శిల్పి చెక్కాడో తెలియదు. సరిగమలు పలికే రాతిస్తంభాల్లో నాటి శిల్పులు జీవించే ఉన్నారనిపిస్తుంది! సృజనాత్మక ప్రతిభకు మరణం లేదు. యోగివేమన, భక్తపోతన, త్యాగయ్య పాత్రలకు ప్రాణం పోసిన మహానటుడు చిత్తూరు నాగయ్య చలనచిత్ర ప్రపంచంలో సజీవుడే! భగవద్గీతను తాదాత్మ్యంతో గానం చేసిన ఘంటసాల అమర గాయకుడే!

జగ వీర పాండ్య కట్ట బ్రహ్మన- తమిళనాడులో ఒక చిన్న పాళెగాడు. స్వాతంత్య్ర సమరయోధుల్లో ప్రథమశ్రేణిలో ఎన్నదగినవాడు. రవి అస్తమించని బ్రిటిష్‌ పాలనను ఎదిరించి నిలిచాడు. తుదకు మేజర్‌ సర్‌ బానర్‌మన్‌ వంచనతో కట్ట బ్రహ్మనను బంధించాడు. ఒక చింతచెట్టుకు ఉరి తీశాడు. ఉరితాడు తగిలించుకునే ముందు కట్ట బ్రహ్మన పలికిన పలుకులు- 'ఇప్పుడుపోయే నా వూపిరి నుంచి లక్షలాది దేశభక్తులు వూపిరి పోసుకుంటారు!' కట్ట బ్రహ్మన భౌతికంగా మరణించినా, కోట్లాది దేశభక్తుల హృదయాల్లో జీవించే ఉన్నాడు!
- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

No comments:

Post a Comment