ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Saturday 5 April 2014

ధర్మాన్ని కాపాడు!


రుల ధర్మానికి విరుద్ధంగా నిలిచే ఏ ధర్మమైనా అది కుధర్మమే- అని పంచమ వేదమైన మహాభారతం చెబుతుంది. ధర్మమార్గంలో నడవాలని మానవుల్ని హెచ్చరిస్తోంది. మానవ జీవితాన్ని నియమపూర్వకంగా ముందుకు నడిపిస్తుంది ధర్మం. మానవులంతా సమష్టిగా ఉండాలనీ అది ఉద్బోధిస్తోంది. వైరుధ్యంతో కూడిన విశ్వాసాలను, భావాలను అదుపులో పెట్టుకొని, వాటిని అధిగమించాలని హితవు పలుకుతోంది. సంయమనాన్ని పాటించమంటుంది. సహనాన్ని అలవరచుకోమంటుంది. సామరస్యపూర్వకంగా ఐక్యతను సాధించుకోమని సలహా ఇస్తోంది.
పర ధర్మంలో ఉండే విశిష్టతలను స్వీకరించమని ధర్మం చెబుతుంది. పొరపాటు చేసినవారిని మన్నించమని అంటుంది. మానవులంతా సమానమే అని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోమని, తెలియజేస్తుంది. పొరుగువారిని ప్రేమించమని చెబుతుంది. కబీరుదాసు కూడా పరులకు మేలు చేసేదే ధర్మమని చెప్పాడు. ధర్మం మానవులందర్నీ సమానంగా భావిస్తుందని, అది ఎవరికీ హాని చేయదని, ఎవరితోనూ కలహించదని తేటతెల్లం చేశాడు.

ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అనేది ఆర్యోక్తి. మన కర్తవ్యం ప్రకారం నడవడాన్ని ధర్మం అంటారు. ధర్మం ప్రకారం నడుచుకొంటే కాపాడినట్టే అని గ్రహించాలి. అంటే మనం చేసే పనులు న్యాయబద్ధంగా ఉండాలన్నమాట. ఇలాంటి సందర్భంలోనే 'ఎవరి హద్దుల్లో వాళ్లు ఉండా'లనే మాటను వాడుతూ ఉంటాం. హద్దు దాటి ప్రవర్తిస్తే ధర్మాన్ని అతిక్రమించడం అవుతుంది. అలాంటప్పుడు ఇతరులు తమ ధర్మాన్ని, విధుల్ని తాము సక్రమంగా నిర్వర్తించలేరు. ఇతరుల్నీ వాళ్ల పనులు వాళ్లను చేసుకోనివ్వాలి మనం. అప్పుడే వాళ్ల ధర్మాన్ని మనం కాపాడిన వాళ్లమవుతాం. అంతేకాదు, మన ధర్మాన్ని మనం పాటించినవాళ్లమవుతాం. ఇతరులు కూడా తమ విధి నిర్వహణలో తాము ఉంటూ మన ధర్మానికి అడ్డు రాకుండా ఉండగలుగుతారు.

అగ్రజునికి రాజ్యాన్ని అప్పగించాలనే దశరథుడి విధి నిర్వహణను భంగపరచడంలో, రాముడికి చెందవలసిన రాజ్యాధికారాన్ని తన కొడుకు భరతుడికోసం లాక్కోవడంలో కైకేయి తన ధర్మాన్ని తాను విస్మరించింది. అంతే కాకుండా ఎదుటివారి (దశరథుడి) ధర్మ నిర్వహణకు అడ్డు తగిలింది. అందువల్ల కైకేయికే కాకుండా ఆ కుటుంబసభ్యులందరికీ కలిగిన కష్టనష్టాల్ని రామాయణంలో మనం చూస్తాం. కైకేయి ధర్మాన్ని కాపాడలేదు కాబట్టి ధర్మం ఆమెను కాపాడలేదన్నది స్పష్టమవుతోంది. రాముడి సొత్తును (సీతాదేవిని) రావణుడు అపహరించాడు. అధర్మ మార్గంలో చరించాడు. ధర్మ రక్షణమనే తన కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా ధర్మానికి హాని కలిగించాడు. అందుకే ధర్మం కూడా అతణ్ని రక్షించలేదు.

ఇతరుల హక్కునీ, అధికారాన్నీ మనం గౌరవించాలి. వాళ్ల సొత్తును, సంపదను కబళించాలని ప్రయత్నించకూడదు. ధర్మాన్ని తప్పి ప్రవర్తించకూడదు. ధర్మానికి భంగం కలిగించే పనులు చేస్తే ఎన్నెన్నో ఆపదలు, కష్టాలు మనకు వస్తాయి. పాండవుల సంపదను, రాజ్యాన్ని లాక్కోవడంతో దుర్యోధనుడు ధర్మం తప్పాడు. ధర్మానికి హాని కలిగించాడు. అందుకే ధర్మం కూడా అతణ్ని కాపాడలేదు. ఫలితంగా సర్వనాశనమయ్యాడు.

ప్రజలకు సుఖవంతమైన జీవితాన్ని అందివ్వడం పాలకుడిగా ప్రభువు ధర్మం. ఈ ప్రభు ధర్మాన్ని రాముడు పాటించాడు కాబట్టే 'రామరాజ్యం'గా ఆయన పాలన జనరంజకమైంది.

అమృతాన్ని పొందాలని దేవదానవులు క్షీరసాగర మథనం జరిపారు. ఆ సందర్భంలో బయటపడిన భయంకర విషం తన పెనుమంటలతో లోకాన్ని బూడిద చేస్తుంటే, ప్రభు ధర్మాన్ని పాటించిన పరమశివుడు ప్రజాహితం కోసం ఆ విషాన్ని పానం చేశాడు. ప్రజల్ని కాపాడి ప్రభుధర్మాన్ని పాటించమని పార్వతీమాత కూడా తన భర్తను ప్రోత్సహించింది. ధర్మాన్ని కాపాడినందువల్లనే పార్వతీ వల్లభుడు శుభాలనొసగే శంకరుడిగా స్తవనీయుడయ్యాడు.

భగవంతుడు మనకు ప్రసాదించిన ఆర్థిక, శారీరక, విద్యా బలాలను నిస్వార్థ బుద్ధితో సాటి మానవులకు వినియోగించి మానవ ధర్మాన్ని మనం పాటించాలి. అప్పుడే ధర్మం మనల్ని కాపాడుతుంది.
- కాలిపు వీరభద్రుడు

No comments:

Post a Comment