ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday 3 April 2014

ఆనందోపాసన

     ఆనందం అనే అనుభూతి ఎంతటిదో నిఘంటువులు చెప్పలేవు. అది ఉపాసకుడికి తెలుస్తుంది. సుఖం, సంతోషం, ఆనందం వంటివన్నీ నిఘంటువుల్లో పర్యాయపదాలుగా కనపడతాయి. వాస్తవానికి అనుభూతిస్థాయిలో అవి వేరువేరు. ఆధ్యాత్మికంగా చూస్తే వాటిమధ్య అంతరాలు చాలా పెద్దవి. లోకంలో 'ఆనంద బాష్పాలు' అనే మాట వినబడినంత విరివిగా- సుఖ బాష్పాలు, సంతోష బాష్పాలు వంటి పదాలు మనకు వినపడకపోవడానికి కారణం వాటిమధ్య స్పష్టమైన తేడాలున్నందునే! మండుటెండలో తిరిగి తిరిగి వచ్చిన మనిషికి చల్లని చెట్టునీడ ఎంతో ఉపశమనాన్నిస్తుంది. అప్పుడు కలిగే సంతృప్తిని సుఖం అని చెప్పుకోవచ్చు. చెట్టు నీడలోనో, శీతల మందిరాల్లోనో సేద తీరేటప్పుడు మనిషికి సుఖంగా అనిపిస్తుంది. అంటే, అది దేహానికి సంబంధించినది. అలా ఇంద్రియాలకు సంబంధించిన ఒకానొక సంతృప్తిని సుఖంగా మనం అర్థం చేసుకోవాలి.
సంతోషమనేది దీనికంటే పైస్థాయిది. సుఖానుభూతిలో శరీరానికి లేదా ఇంద్రియాలకు మాత్రమే ప్రమేయం ఉంటుంది. మనసుకు సైతం సంతృప్తిని కలిగించేదాన్ని సంతోషంగా చెప్పుకోవచ్చు. లేకలేక బిడ్డ కలిగినప్పుడో, కొడుక్కి మంచి ఉద్యోగం దొరికిందని, కూతురికి చక్కని సంబంధం కుదిరిందని వార్త విన్నప్పుడు మానసికంగా ఎంతో ఉత్తేజం కలుగుతుంది. అలా మనసులో పొటమరించే సుఖానుభూతిని, సంతృప్తిని మనం సంతోషంగా భావించాలి. ఒక్కమాటలో సుఖం- శారీరకం! సంతోషం- మానసికం!

సంతోషకరమైన స్థితిలో అటు మనసు, ఇటు శరీరమూ రెండూ ఉల్లాసంగా ఉంటాయి. కనుక, సుఖంకన్నా సంతోషం కాస్త పైస్థాయికి చెందినదిగా చెప్పుకోవచ్చు. 
ఆనందం అనేది ఆత్మకు సంబంధించిన సుఖానుభూతి. ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే, దైవం మెచ్చుకునే పనులు చక్కపెట్టినప్పుడు వరంగా లభించే సంతృప్తి పేరు- ఆనందం! లోకహితం కోరి కృషిచేసే సజ్జనులకు ఆనందం అనుభవమవుతుంది. ఆనందం అనేది ఆత్మలోకపు దినుసు. అందుకే ఆనందమయ స్థితిలో అప్పుడప్పుడూ కళ్లు చెమరిస్తాయి. సుఖం అనే స్థితిలో ఉన్నవాడెవడూ కంటతడి పెట్టడు. కాబట్టే లోకంలో ఆనందాశ్రువులనే మాటే తప్ప, సుఖాశ్రువులన్నది స్థిరపడలేదు.

సుఖసంతోషాలది శాక్రిన్‌ తీపి అనుకుంటే- ఆనందానిది పట్టుతేనె మాధుర్యం. ఆనందానుభూతిని చవిచూసినవారికి సుఖసంతోషాలతో సరిపెట్టుకోవడం కిట్టదు. మందారమకరంద మాధుర్యాన్ని రుచిచూసిన తేనెటీగ ఉమ్మెత్తపూల జోలికి ఎలా పోగలుగుతుందని ప్రశ్నించాడు పోతన్న. ఆనందోపాసకుడు కాబట్టే ప్రవరుడు సుఖానుభూతిని కోరిన వరూధినిని తృణీకరించాడు. ఆనందమనేది అంత ఉన్నతమైనది కనుకనే బ్రహ్మానందం అన్నమాటే తప్ప- బ్రహ్మసుఖం, బ్రహ్మసంతోషం అనే మాటలు వాంగ్మయంలో మనకు కనపడవు. సుఖం, సంతోషం, ఆనందాల్లోని స్థాయీ భేదాలను గుర్తించిన మనపెద్దలు 'ఆనందోబ్రహ్మ' అని తేల్చి చెప్పేశారు. వేదాంతులు గొప్పగా వర్ణించే అలాంటి అత్యున్నత స్థితిని సాధించాలనుకుంటే మనిషి స్వీయవాస్తవిక స్థితిని చేరుకోవాలని 'మాస్లో' వంటి మానసిక తత్వశాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు.

దాని గురించి సరళమైన భాషలో చెప్పుకోవాలంటే- పరుగులు ఆపేసి, సాధారణంగా జీవించడం. మానవ జీవితంలో అతి సహజంగా లభించే ఆనందాన్ని గుర్తించి, ఆస్వాదించడం మనిషి అలవరచుకోవాలి. పసిపిల్లల్ని చూస్తే మనకది తెలుస్తుంది. వారికి అచ్చమైన ఆనందం కావాలంటే పెద్దపెద్ద ప్రయత్నాల జోలికి పోరు. వెన్నెల విరిస్తే చాలు, వర్షం కురిస్తే చాలు, హరివిల్లు నిలిస్తే చాలు, ఆటల్లో గెలిస్తే చాలు, పక్షులు పిలిస్తే చాలు... ఆనందం ఆవరిస్తుంది. సీతాకోకచిలుక పలుకరిస్తే, అమ్మ దగ్గరకు తీసుకుని ముద్దిస్తే, నాన్న చిన్న బొమ్మేదో కొనిస్తే... ఎంత గొప్ప ఆనందమో! అది సుఖసంతోషాలకన్నా చాలా ఎత్తయిన అచ్చమైన ఆనందం. ఆరాటాలు, ఆతృతలు, ఉద్విగ్నతలు ఏవీ లేని సహజ జీవన మకరందం. 
నిజానికి వారిది చాలా విలువైన ఉపదేశం! నిసర్గ సుందర జీవిత సందేశం! దాన్ని అలవరచుకున్ననాడు మనమంతా అచ్చమైన ఆనందోపాసకులం.
- ఎర్రాప్రగడ రామకృష్ణ 

No comments:

Post a Comment