ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Sunday 30 June 2013

పవిత్ర ధామాలు


హిమాలయ పర్వతశ్రేణి ప్రపంచంలో ఒక అద్భుతం. ఈ పుణ్య గిరుల్లో పురాణ ప్రసిద్థమైన నాలుగు పవిత్ర క్షేత్ర-తీర్థాలను చతుర్థాలుగా వ్యవహరిస్తారు. 'చార్‌ధామ్‌'గా ప్రసిద్ధి చెందిన గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌, బదరీధామం- ఈ నాలుగూ పౌరాణిక వైశిష్ట్యాన్నీ, చారిత్రక ప్రభావాన్నీ వ్యక్తపరుస్తున్నాయి.

యుగయుగాల నుంచి అనేకమంది ఈ నాలుగు ధామాల యాత్రలను భక్తిశ్రద్ధలతో చేస్తున్నారు. బదరీ నుంచి పై మూడు క్షేత్రాలు వైశాఖ శుద్ధ తృతీయ(అక్షయ తృతీయ) నుంచి, ఆశ్వయుజ బహుళ (దీపావళి) అమావాస్య వరకు మాత్రమే యాత్రకు అనుకూలం. ఆ తరవాత వీటిలో ప్రవేశానికి అనుమతించరు. ఈ నడిమి కాలంలో దేశం నలువైపులనుంచి ఎందరో యాత్ర చేస్తారు. ఈ యాత్రతో జన్మసాఫల్యం పొందినట్లుగా, చరితార్థత సాధించిన అనుభూతి భారతీయుల అంతరంగంలో పొంగుతుంది.

బదరికా క్షేత్రం శ్రీమహావిష్ణువు తపోభూమిగా పురాణాలు చెబుతున్నాయి. సర్వ విష్ణుక్షేత్ర శక్తి రాశీభూతమైన ఈ పుణ్యప్రాంతంలో నారాయణుడు తపోమూర్తిగా వెలసి ఉన్నాడని స్కాందపురాణ వచనం. ధర్ముడు, మూర్తి అనే దివ్య దంపతులకు తపోఫలంగా నారాయణుడు 'నర, నారాయణ' అనే నామాలతో రెండు మూర్తులుగా అవతరించాడని, ఇందులో నారాయణుడు పూర్ణస్వరూపంగా, నరుడు అంశావతారంగా పురాణాలు వర్ణించాయి. వీరుభయులూ తపోమార్గాన్నీ, జ్ఞానమార్గాన్నీ సముద్ధరణ చేసిన దివ్యావతారాలంటారు. నారాయణుడి తపస్సమయంలో లక్ష్మీదేవి గొప్ప బదరీవృక్షం(రేగుచెట్టు)గా మారి, ఆయనకు నీడపట్టి ఆశ్రయించి ఉన్న కారణంగా ఈ క్షేత్రం బదరీ క్షేత్రమైందని పురాణోక్తి.

నరనారాయణులు శాశ్వతావతారులనీ, సర్వ దివ్య విద్యలకు, రుషులకు ఆశ్రయమూర్తులనీ శాస్త్రాలు చెబుతున్నాయి. గంగానది 'అలకనందా' పేరుతో ప్రవహిస్తున్న పుణ్యప్రవాహ తీరంలో భవ్యమైన నారాయణ మందిరం ఉంది. తపోమూర్తిగా ఉన్న నారాయణ దివ్యవిగ్రహం కాలాంతరంలో నదిలో అదృశ్యమైందని, ఆదిశంకరుల యోగదృష్టికి గోచరమై, తిరిగి ప్రతిష్ఠితమైందని చరిత్ర.

ఈ ఆలయ పరిసరాల్లో, పర్వత శ్రేణుల్లో ఎన్నో తీర్థాలు, తపోధామాలు ఉన్నాయనీ, వాటి మహిమ అపారమనీ ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి. 
పరవళ్ళతో ప్రవహిస్తున్న గంగా నదీతీరంలో ఎన్నో పుణ్యఘట్టాలను పురాణం పేర్కొంది. తపోయోగ శక్తిగా నారాయణుడు కృతయుగం నుంచే అక్కడ నెలకొని, ధ్యాననిష్ఠులకు మాత్రమే హృదయంలో గోచరించేవాడనీ, తరవాత దేవతల ప్రార్థన మేరకు దివ్య శిలామూర్తిగా తన తపోముద్రను ప్రకటిస్తూ ఆవిర్భవించాడనీ 'స్కాందం' చెబుతోంది. ఈ క్షేత్రానికి 'విశాల' అనే నామాంతరం ఉంది. అపరిమితమైన విష్ణుశక్తిని ప్రకటించే ఈ విశాల నామంతో నేటికీ భగవానుని ఎలుగెత్తి కీర్తిస్తారు. 'బదరీ విశాల్‌' అని ఆ క్షేత్ర పరిసరాలు భక్తుల నినాదాలతో మారుమోగుతుంటాయి. దర్శనమాత్రం చేతనే పాపసంహరణం చేసే ఈ క్షేత్రంలో, స్వామి ప్రసాదానికి గొప్ప మహిమ ఉందని పురాణం వర్ణించింది.

ఇక్కడి ఆలయ సమీపాన బ్రహ్మకపాల తీర్థం ప్రత్యేకమైంది. గయ కంటే ఎనిమిది రెట్లు అధిక ఫలాన్ని ప్రసాదించే ఈ పితృతీర్థాన్ని పురాణాలు బహువిధాల ప్రస్తుతించాయి. దీనితోపాటు అగ్ని తీర్థం ప్రసిద్ధమైంది. ఆలయ సన్నిధిలో ఉన్న పంచశిలలు, పురాణాలు వర్ణించిన విధంగానే నేటికీ గోచరిస్తున్నాయి. నారది, నారసింహి, వారాహి, గారుడి, మార్కండేయ- అని ఆ శిలల పేర్లు. వీటికి ఐతిహ్యాలు కూడా చాలా ఉన్నాయి. ఈ అయిదు శిలల నడుమ గంగను గొప్ప తీర్థంగా అభివర్ణించారు.

నారాయణుడి వూరువు (తొడ) నుంచి ఆవిర్భవించిన వూర్వశీదేవి వ్యక్తమైన తీర్థం- వూర్వశీ తీర్థం. బదరీధామంలో మరో గొప్పతీర్థం- సరస్వతీ తీర్థం. ఒకప్పుడు అసుర శక్తులు వేదాలు అపహరించగా, బ్రహ్మదేవుడు బదరికాశ్రమాన తపస్సు ఆచరించాడనీ, అప్పుడు నారాయణుడు హయగ్రీవ రూపంతో అసుర సంహారంచేసి వేదవిద్యను బ్రహ్మకు అనుగ్రహించాడనీ, ఆ వేదాలే ద్రవరూపంలో ఇక్కడ ప్రవహిస్తున్నాయనీ పురాణ ఐతిహ్యం. ఈ ద్రవరూపిణే 'సరస్వతీ తీర్థం'గా పూజలందుకుంటోంది. ఈ పుణ్య ప్రవాహ సమీపంలో మానసోద్భేద తీర్థం ఉంది. దాని సమీపానే 'వ్యాస గుహ' ప్రసిద్ధి. వేదవ్యాసులు ఇక్కడే వేదాలు, పురాణాలు రచించారని చెబుతారు.

ఉన్నత పర్వత శిఖరాల్లో వసుధారా జలపాత తీర్థం మరో విశిష్టత. అష్టవసువుల తపశ్శక్తి ప్రభావంవల్ల ఏర్పడిన ఈ పావన ధారను అద్భుతంగా స్కాంద పురాణం కీర్తించింది. ఈ మార్గం ద్వారానే పాండవులు స్వర్గారోహణ గావించినట్లు భారత వచనం. అనేక దివ్యత్వాలకు ఆలవాలమైన బదరీ విశాల క్షేత్రం ప్రపంచంలోని అన్ని దిశల నుంచి ప్రజలను ఆకర్షిస్తోంది. మాటలకందని ఒక దివ్యానుభూతిని, శక్తిని ప్రసరిస్తూనే ఉంది.
                                                              - సామవేదం షణ్ముఖ శర్మ 

Saturday 29 June 2013

సత్యాన్వేషణలో...


   లోకంలో చాలా ఘాతుకాలు జరుగుతుంటాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంటాయి. ఇవన్నీ భగవంతుడు చేస్తున్నవేనా? వీటన్నింటికీ కారణం ఎవరు? చాలామంది భగవంతుడు నిర్దయుడు, ఇన్ని జరుగుతుంటే చూస్తూ ఉంటున్నాడు, జరగకుండా ఆపవచ్చు కదా అంటుంటారు. ఇదెలా సాధ్యం?
     కారు నడుపుతుంటే ప్రమాదం జరుగుతుంది. కారు నడిపేవాడు కారణమా, కారులో ఇంధనం కారణమా, కారే కారణమా, రహదారి కారణమా? అసలు ఆ ప్రయాణం సంకల్పించిన వ్యక్తి కారణమా, ఆ వ్యక్తికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కారణమా, వాళ్లను కన్నవాళ్లు కారణమా? ఇలా వెదుక్కుంటూపోతే ఎన్నో కారణాలు కనిపిస్తాయి. చివరికి ఒక్క దగ్గరే అంతమవుతాయి. ఇది అంతర్జాలం లాగా ఒక మాయాజాలం.

అన్నింటికీ భగవంతుడు కారణం కాదు అని తెలుసుకునేంత వరకు ఈ సంఘటనలు మనల్ని బాధపెడుతూనే ఉంటాయి. కాని, శాస్త్రాలు సర్వానికీ కారణం భగవంతుడే అని చెబుతున్నాయి కదా. ఈ చిక్కుముడి వీడటం ఎలా?

కనిపించే ఈ ప్రపంచానికి కారణం భగవంతుడి సృజనాత్మక శక్తి. దానికి మరోపేరు మాయ. దీన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించి ప్రయత్నించి విజయం సాధించినవాళ్లు మౌనం వహిస్తారు. విఫలమైనవాళ్లు భగవంతుడే కారణం అంటూ బాధపడుతూ ఉంటారు.

ఏది ఏమైనా మన కళ్లముందు జరుగుతున్నదాన్ని మనం నమ్ముతాం. అది లేదు అంటే, ఆ అన్న వ్యక్తిని పిచ్చివాడికింద జమకడతాం. మన కన్నే మనకు ప్రమాణం. దాని వెనక బుద్ధి ఒకటి ఉందని మరచిపోతాం. దాని వెనక వివేకం ఒకటి ఉందని మరచిపోతాం. కనిపించనివి ఎన్నో మనం మన జ్ఞానంతో అంగీకరిస్తున్నాం.

ముందు మనం దైవాన్ని అంగీకరించాలి. చూసిగాని చూడకుండాగాని సత్యాన్ని నమ్మడానికి సిద్ధపడినప్పుడే విశ్వరహస్యాలు తెలుస్తాయి. విశ్వం నడిచే విధానం తెలుస్తుంది. ఏ వస్తువూ అన్ని కాలాల్లో ఒకేవిధంగా ఉండదు. మార్పు సహజం. మనల్ని మనం అంగీకరించినట్లే దైవం చేసే పనిని కూడా అంగీకరించాలి. సృష్టిలో చాలా లోపాలు కనిపిస్తాయి ప్రతి ఒక్కరికీ. పనిగట్టుకుని విమర్శించమని చెబితే, నేనైతే ఈ సృష్టిని ఇలా కాకుండా మరోలా తయారుచేద్దును అని ప్రతి ఒక్కరూ అంటారు!

దేవుణ్ని మార్చేయడానికి సిద్ధపడతారు కొందరు. దేవుడికి బోధ చెయ్యడానికి ఉద్యుక్తులవుతారు ఇంకొందరు. దేవుణ్ని పక్కనపెట్టి తామే దేవుళ్లం అంటారు మరికొందరు. మంచి ధర పలికితే దేవుణ్ని అమ్మేయడానికి ముందుకొస్తారు ఇంకొందరు. చివరికి దేవుణ్ని మాయం చేయడానికీ వెనకాడరు. మంచి జరిగినప్పుడు పొగిడి, చెడు జరిగినప్పుడు దేవుణ్ని తిట్టేవాళ్లను ఏమనాలి?

అన్ని శక్తుల్లోనూ అత్యంత గొప్పది ఇచ్ఛాశక్తి. అది స్వేచ్ఛాయుతంగా మనిషి వాడుకునే సంకల్పశక్తి. దీనితో అద్భుతాలు చెయ్యవచ్చు. ఇది జ్ఞానశక్తిగా క్రియాశక్తిగా మారుతుంది.

కల కను, నిజం చేసుకో అంటారు. కల కనాలి అంటే మనలో ఇచ్ఛాశక్తి పుష్కలంగా ఉండాలి. దీన్ని నడిపించేదే దైవశక్తి. మోక్షం వరకు తీసుకెళ్లేదీ ఇదే శక్తి. దీనిద్వారా నేనైనా నువ్వయినా చివరికి ఏ ప్రాణి అయినా తన ఆధ్యాత్మిక ప్రయాణంలో పురోగమనం సాధించడం తథ్యం.

దేవుణ్ని అర్థం చేసుకోవటం అంటే విశ్వాన్ని అర్థం చేసుకోవటమే. చెట్టును తెలుసుకుంటే అడవి తెలుస్తుంది. నది గురించి తెలుసుకుంటే సముద్రం తెలుస్తుంది. వెలుగు గురించి తెలుసుకుంటే సూర్యుడు తప్పక అర్థం అవుతాడు. శ్రద్ధ-సహనం ఉంటే జరుగుతున్న విపరీతాల వెనక సూత్రధారి ఎవరో తెలియకుండా పోతుందా?

మంచికి మంచే కారణం. చెడ్డకు తప్పనిసరిగా చెడే కారణం. తిరుగులేని ఈ అనివార్య సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని దైవాన్ని అర్థం చేసుకోవాలి. ఏది ఎవరు చేస్తున్నారో, ఎవరివల్ల జరుగుతున్నదో, ఎందుకు జరుగుతున్నదో తెలుసుకోవడానికైనా మన విమర్శలను మాని సత్యాన్వేషణ మొదలు పెట్టాలి. అప్పుడు ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో తెలిసిపోతుంది!
- ఆనందసాయి స్వామి 

Friday 28 June 2013

అమర్‌నాథ్‌ యాత్ర


  రమాత్ముడు ఒక్కడే అయినా రూపాలు అనేకం. సాకార, నిరాకార స్వరూపుడిగా భగవంతుడు ప్రకటితమవుతాడు. ఆద్యంతాలు లేని ఆదిదేవుడు, అనంతకాల గమనాన్ని శాసిస్తూ అంచనాలకు అందని అమేయ స్వరూపుడు- విశ్వేశ్వరుడు. ప్రళయకాల సందర్భంలో సర్వేశ్వరుడు లింగాకృతిలో అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. లింగ స్వరూపం సృష్టి రహస్యానికి ప్రతీక. సకల చరాచర జగత్తు శివాంశతో పరిఢవిల్లుతోంది. శివపరమాత్మ ప్రకృతిలో ప్రకృతిగా ఒదిగి, తానే ప్రకృతి ఆకృతిగా లింగమూర్తిగా ఆవిష్కారమయ్యాడు.

కృతయుగంలో రత్నలింగం, త్రేతాయుగంలో స్వర్ణలింగం, ద్వాపరయుగంలో రసలింగం, కలియుగంలో పార్థివలింగం పూజనీయాలని చెబుతారు. అలాగే సకల మనోభీష్టాల్ని నెరవేర్చుకోవడానికి హిమలింగ దర్శనం, ఆరాధనం దోహదపడుతుందని పెద్దల మాట. మహిమాలయంగా వెలిగే హిమాలయ సీమల్లో ప్రకృతి రూపుడిగా, హిమలింగంగా అమరనాథునిగా ఏటేటా ఆవిర్భవిస్తున్నాడు. దివ్య ధవళ కాంతులతో, స్వచ్ఛ స్ఫటికంగా, సహజసిద్ధంగా ఏర్పడే అమరనాథుని మంచులింగాన్ని దర్శించుకోవడం భక్తులకు కమనీయ అనుభూతి. సహజాతమైన హిమలింగంగా కాలస్వరూపుడైన ముక్కంటి అభివ్యక్తం కావడం ఓ మహా విభూతి. నేటినుంచి అపురూపమైన ఆ అమరనాథ యాత్ర ఆరంభమవుతోంది.

అమరనాథ యాత్ర ఎన్నో అనుభవాలు, అనుభూతుల సమ్మేళనం. ఎన్నో వ్యయప్రయాసల సమ్మిశ్రితం. హిమధామంలో గుహాలయంలో నెలకొన్న హిమ సుందరేశ్వరుడైన అమరలింగేశ్వర దర్శనం పరమానందదాయకం. అమరనాథుని భవ్య లింగాకృతిని తిలకించగానే భక్తులు తమ ప్రయాసంతా మరిచి, ప్రమోదాన్ని పొందుతారు. ప్రతి భక్తుడి హృదయం ఆనంద రసార్ణవమవుతుంది.

జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు 141కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3,888మీటర్ల ఎత్తులో అమరనాథుని గుహాలయం భాసిల్లుతోంది. లోతైన లోయల మీదుగా, ఇరుకు దారుల వెంట, పర్వతాల్ని అధిరోహిస్తూ, ఎముకలు కొరికే చలిలో కాలినడకన, గుర్రాలపై సాగే ఈ ప్రయాణం సంక్లిష్టమైంది. అమరనాథుడిపై ఉన్న భక్తి, అచంచల విశ్వాసం, స్వామిని దర్శించాలనే బలీయమైన ఆకాంక్షల వూతంగా ఈ యాత్ర కొనసాగుతుందని భక్తుల నమ్మకం. అమరనాథ్‌ యాత్ర చేయాలనుకునే భక్తులు ముందుగా జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రప్రభుత్వ పర్యాటకశాఖ వద్ద తమ పేర్లు నమోదు చేసుకోవాలి. మంచుకొండల్లో, ప్రతికూల వాతావరణంలో ఈ యాత్రను చేపట్టాలి. అందుకు తగిన శారీరక సామర్థ్యం తమకు ఉన్నట్టుగా యాత్రికులు వైద్యుల ధ్రువీకరణ పత్రాన్ని పొంది పర్యాటక శాఖకు సమర్పించాలి. ఈ యాత్రలో చందన్‌వాడీ నుంచి సాగే ప్రయాణం కీలకమైంది. పిస్సూటాప్‌, జోజిబాల్‌, నాగకోటి, శేష్‌నాగ్‌ వంటి ప్రదేశాల మీదుగా పయనం కొనసాగుతుంది.

హిమపర్వతాల మధ్యనుంచి వయ్యారంగా మెలికలు తిరిగే లిడ్జర్‌ నది సౌందర్యం, నీలిరంగు తటాకాలు, హొయలు మీరే పర్వతాలు, చూపును మరల్చుకోలేని ప్రకృతి అందాల సమాహారం మురిపిస్తాయి. ఇంతటి మహా సౌందర్య సన్నిధి కాబట్టే నీలకంఠుడు తన నివాసాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడనే భావన కలుగుతుంది. గుహాలయంలో అయిదు అడుగుల ఎత్తయిన శంఖువు ఆకృతిలో అమరనాథుడు విలసిల్లుతాడు. చంద్రుడి వృద్ధిక్షయాల్ని అనుసరిస్తూ ఈ మంచులింగం పెరుగుతూ, తరుగుతూ ఉంటుందంటారు. జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లో అమరనాథుడు సాకారమవుతూ, శ్రావణం తరలివచ్చే నాటికి అంతర్థానమవుతాడు. ఈ దివ్యక్షేత్రానికి సంబంధించిన ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది. ఓ సందర్భంలో సృష్టి రహస్యాన్ని వివరించమని పార్వతి, పరమేశ్వరుణ్ని కోరింది. అమరమైన ఈ రహస్యాన్ని ఏ ప్రాణికీ వినిపించని ప్రదేశంలో చెబుతానన్నాడు శివుడు. హిమాలయాల్లో ఓ గుహలో సృష్టి మర్మాన్ని మహేశ్వరుడు, గౌరికి వెల్లడిస్తుండగా గుహపై ఉన్న పావురాల జంట విన్నాయంటారు. దాంతో అది మృత్యురాహిత్యాన్ని పొంది, ఇప్పటికీ అమరనాథుని గుహ ప్రాంతంలో సంచరిస్తాయని చెబుతారు.

కాశ్మీర రాజుల చరిత్ర తెలిపే 11వ శతాబ్దానికి చెందిన 'రాజ తరంగిణి' గ్రంథంలో ఈ క్షేత్ర వైభవాన్ని విశేషంగా పేర్కొన్నారు. కాశ్మీరదేశ రాణి సూర్యమతి అమరనాథుని సన్నిధికి పసిడి త్రిశూలం, బాణ లింగాల్ని సమర్పించింది. రాజా వాలి పతాక, ప్రజాభట్టు వంటి రాజులు అమరనాథుణ్ని ఇలవేల్పుగా ఆరాధించారు. అలాంటి మహా మహిమోపేతుడైన హిమలింగ రూపధారి అమరనాథుని దివ్యదర్శనం... అనన్య భక్తి పారవశ్యాల సమ్మేళనం!
                                                           - డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌ 

Thursday 27 June 2013

విద్యాధనం

   తెలియనివారికి తెలియజేసేది విద్య. అది అనంతరూపాల్లో లోకంలో కనబడుతుంది. విద్యగలవాడు అన్నీ చక్కగా తెలుసుకోగలడు. విద్యలేనివాడు తెలుసుకోలేడు. అంటే విద్య లేనివాడు కళ్లు ఉన్నప్పటికీ గుడ్డివాడే. తెలుసుకోవడం అనేది రెండు విధాలు. ఒకటి పైచూపులతో చూడటం. రెండోది లోతుల్లోకి వెళ్లి అంతరంగాన్ని తెలుసుకోవడం. ఈ రెండు మార్గాల్లో రెండోదాన్నే 'విద్య' అని అంటారు. ఈ విద్య పైకి కనిపించని ధనం వంటిదని ప్రాచీనులు చెబుతారు. ధనం లేకున్నా విద్య ఉంటే చాలు. దానివల్ల ధనాన్ని సంపాదించుకోవచ్చు. విద్య లేకపోతే ఎంత ధనం ఉన్నా- జీవితానికి అర్థం, పరమార్థం ఉండవు.

విద్య అంటే సరస్వతి. చదువుల తల్లి. ఆమెను ఒక కవి ఇలా సంభావించాడు- 'తల్లీ, సరస్వతీ! నీ దగ్గర అపూర్వమైన ధనాగారం ఉంది. అది విద్యలతో నిండి ఉంది. ఆ ధనాగారంలో నుంచి ఎన్ని విద్యలను తోడుకున్నా, ఇంకా అవి వృద్ధి చెందుతూనే ఉన్నాయి. వాటిని ఖర్చు చేయకుంటే నశించిపోతున్నాయి. ఇలాంటి ధనాన్ని నేనెక్కడా చూడలేదు!'. అంటే, ఖర్చు చేస్తున్నకొద్దీ అభివృద్ధి చెందుతూ ఉండే విద్యాధనం గొప్పతనం ఏమిటో అర్థమవుతుంది.

సంపదలు లోకంలో అసంఖ్యాకంగా ఉన్నాయి. వాటిని లెక్కించడం అసంభవం. గడ్డిపోచను మొదలుకొని పర్వతాలదాకా నెలకొని ఉన్న వస్తువుల్లో దేని విలువ దానిదే. ప్రవాహంలో పడి కొట్టుకొనిపోతున్నప్పుడు మనిషిని గడ్డిపోచలు కాపాడవచ్చు. అవి అమూల్యమైనవే కదా! కానీ, విద్య అనే ధనం మాత్రం సర్వకాలాల్లో సకల ప్రదేశాల్లో ఎంతో విలువైంది. అది ధరించినవారికి ఆభరణంలా భాసిస్తుంది. ఆ ఆభరణానికి విలువ కట్టలేం. ఇతర సంపదలు ఎప్పటికో ఒకప్పటికి తరిగిపోతాయి లేదా నశించిపోతాయి. కానీ, విద్యాధనం మాత్రం అక్షయంగా నిలిచి ఉంటుంది. దానికి ఎన్నటికీ నాశనం లేదు.

విద్యలు ప్రధానంగా రెండు విధాలు. ఒకటి శస్త్రవిద్య. రెండోది శాస్త్రవిద్య. శస్త్రాలు (ఆయుధాలు), శాస్త్రాలు (తత్వజ్ఞాన సాధనాలు) మనిషికి ఎంతో అవసరమైనవే. ఒకటి రక్షణకు, మరొకటి ఆత్మోన్నతికి మూలం. ఈ రెండింటిలోనూ శాస్త్రవిద్యలే గొప్పవి. ఎందుకంటే శస్త్రవిద్యలు యౌవనంలో ఉన్నంత కాలమే ఉపకరిస్తాయి. వృద్ధాప్యంలో పనికిరావు. శాస్త్రవిద్యలు అలా కాదు. పండుముసలితనంలోనూ వాటిని ఉపయోగించే వీలు ఉంటుంది. కనుక జీవితాంతం ఉపయోగపడే శాస్త్రవిద్యలు మనిషికి సంపదలే! అందుకే సుభాషితకారులు- 'ఎన్నో సంశయాలను దూరం చేసేవీ, పరోక్ష ప్రయోజనాలను అందించగలిగేవీ, అన్నింటినీ చూడగలిగే కన్నులవంటివీ అయిన శాస్త్రాలను మనిషి ఎన్నడూ వదిలిపెట్టరాదు. శాస్త్రాలను తెలుసుకోలేని మానవుడు కళ్లుండి కూడా చూడలేనివాడే అవుతాడు' అని ప్రబోధించారు.

ఎన్ని సంపదలను అపారంగా కూడబెట్టినా మనిషికి మానసిక శాంతి ఉండదు. ఎప్పుడు ఏ దొంగ వచ్చి దోచుకొనిపోతాడో అని బిక్కుబిక్కుమంటూ కాలం గడపాలి. ధనం ఎక్కువగా ఉంటే ప్రభువుల కళ్లు దానిపై పడతాయి. ఆ ధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. అన్నదమ్ములూ డబ్బుకోసం పోట్లాడతారు. తమకు వాటా ఇమ్మంటారు. ఇవ్వకుంటే చంపడానికైనా సిద్ధపడతారు. అంతేకాదు, అపారంగా ఉన్న డబ్బును ఎక్కడ దాచాలో తెలియదు. ఎవరికంటా పడకుండా ఎక్కువకాలం దాచడం కష్టమే. అందువల్ల ధనం భారమే అవుతుంది. విద్యాధనం మాత్రం అలాకాదు. ఏ దొంగలూ విద్యను దోచుకోలేరు. ప్రభువులూ గుంజుకోలేరు. అన్నదమ్ములూ పంచుకోలేరు. ఎంత విద్య ఉన్నా ఏ భారమూ లేదు. అందుకే ప్రపంచంలోని అన్ని సంపదల్లో 'విద్య' అనే సంపదకు ఉండే విలువ ఇంతా అంతా కాదు.

విద్యావంతుణ్ని విద్య తల్లిలా సదా రక్షిస్తుంది. కట్టుబట్టలతో విదేశాలకు వెళ్లినా, విద్యావంతుడు పుష్కలంగా డబ్బు సంపాదించుకోగలడు. విద్యావంతుణ్ని విద్య తండ్రిలా ముందుకు నడిపిస్తుంది. ఏది హితమో అదే చెబుతుంది. వేదనలు, కష్టాలు ముంచుకొని వచ్చినప్పుడు వాటిని విద్య దూరం చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే- విద్యకూ, కల్పవృక్షానికీ ఏ భేదమూ లేదు. విద్యగలవాడు కల్పవృక్షం నీడలో ఉన్న దేవుడివంటివాడే. ఇందులో ఎంతమాత్రం సందేహంలేదు.
ఎన్ని కష్టాలు అనుభవించినా సరే, ఎంత ధనాన్ని వెచ్చించినా సరే, ఎన్ని త్యాగాలు చేసినా సరే- విద్యావంతుడు కావడానికే మనిషి ఆజీవనాంతం ప్రయత్నించాలి. విద్య ఒక్కటే మనిషి బతుకుకు వెలుగు!
                                                               - డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

Wednesday 26 June 2013

కోరికల కర్మాగారం

                       
 నిషిలోని మనసు చాలా చంచలమైంది. దాని యాంత్రికతకు అంతం లేదు. మనిషి బాల్యం నుంచి ఏవేవో వాంఛలకు అలవాటుపడతాడు. ఒకదాని తరవాత మరొకదాన్ని మనసు కోరుతూనే ఉంటుంది. జీవితాంతం అలా మనసు మనిషిని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. నిజానికి మనిషి తనలోని మనసును గురించి అవగాహన కల్పించుకోవాలి. దాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అలా నమ్మడం ఒక పెద్ద వ్యామోహం. ఈ వ్యామోహాన్ని తగ్గించుకోవాలంటే మనసు చెప్పినట్లు వినడం మానేస్తే సరి. మనసు నిండా కోరికలు, ఆలోచనలను నింపకూడదు.

మనసును స్థిమితపరచడం ఎలా? కోరికల్ని నియంత్రించడం ఎలా? ఇందుకోసం మనిషి సాధన చేయాలి. మొదట మనలోని కృత్రిమత్వాన్ని గుర్తించాలి. అందులోని చెడును తెలుసుకోవాలి. మానవత్వాన్ని, దైవత్వాన్ని అవగాహన చేసుకోవడంవల్ల కోరికల ఉద్ధృతి తగ్గుతుంది. సరిగ్గా అప్పుడు మనలోకి మనం నెమ్మదిగా సూటిగా చూసుకోవాలి. మనలో ఏం జరుగుతుందో గమనించడం అవసరం. మనసులోకి ప్రవేశిస్తున్న ప్రతి వాంఛను, ప్రతి ఆలోచనను గమనిస్తూ ఉండి, అలాంటి గమనిక కొనసాగినప్పుడు మనసు తాలూకు చంచల ప్రవృత్తి నెమ్మదిస్తుంది. ఆ తరవాత మన మనసులోకి మనం ప్రవేశించగలం. సాధారణంగా మనసు తాను గమనించిన ప్రతిదానికి ఏదో ఒక పేరు పెట్టి దానికో ప్రయోజనం కల్పించి, మరొకదానితో పోల్చడం చేస్తుంది. అయితే ఏ ప్రయోజనం ఆపేక్షించకుండా, నిర్వ్యామోహంగా మనసు లోపలికి చూడటం జరిగితే చంచలమైన ఆలోచనలు ఆగిపోతాయి. నిశ్చలమైన స్థితి కలుగుతుంది. ఆ స్థితిలో మనకు కోరికలు ఉండవు. ప్రయోజన ఆపేక్షా ఉండదు. ఆశలు, భయాలు కలగవు. ఈ స్థితిని నిలుపుకోవడం ఎలా?

వస్తున్న ఆలోచనలను గమనించాలి. వాటిని గమనిస్తే చాలు- మనసు పరిధిలోకి వ్యక్తిగతమైన శక్తి అపరిమితమవుతుంది. అప్పుడు మనసును వ్యక్తిగత పరిధినుంచి తప్పించడమే మనం చేయాల్సిన పని. నెమ్మదిగా ముందుకు సాగాలి. ఈ ఆలోచన లేని ఏకాగ్రతను ధ్యానం అనవచ్చు. నెమ్మదిగా నిశితంగా మనలోని మనసును గమనించడంవల్ల ఏ ఘర్షణ లేకుండానే మనోభూమిక నుంచి వెలుపలికి రావచ్చు. మనలోని సున్నితత్వం, సూక్ష్మ పరిశీలనా పెరిగే కొద్దీ- ఆలోచనలు, కోరికలు సమసిపోతాయి. ఆలోచనల నుంచి స్వేచ్ఛ పొందడం, స్వస్థితిని చేరడం- మనల్ని మనం తెలుసుకోవడం! ఇవి తెలివితేటలతో సాధించేవి కాదు. మన స్వప్రేరణతో అనుభవించవలసిందే. మనసు ప్రమేయం లేకుండా స్వప్రేరణ సాధ్యమేనా? సాధ్యమే, కాని సాధన చాలా కష్టం. ఎందుకంటే నిరాపేక్షతో మనసును గమనించడం మనకు అలవాటు లేని పని. మన నరాల నిర్మాణం అందుకు సహకరించదు. మన మెదడులోని కణాలు తమను తాము గమనించుకోవడానికి అలవాటు పడి లేవు. అందుకే మన దృక్పథం మారడం ముఖ్యం. ఏవో కొన్ని అలవాట్లు, ఆలోచనలు మార్చుకున్నంత మాత్రాన సరిపోదు. మనలో మార్పు సమూలంగా రావాలి. అప్పుడే నూతన చైతన్యం కలుగుతుంది. మనశ్శాంతిని, ప్రశాంతిని, ఆనందాన్ని ప్రసాదించే శుద్ధ చైతన్యాన్ని అన్వేషించాలి.
సంపూర్ణ అవగాహనతో మన సమస్త శక్తులను వెచ్చించి కృషి చేయాలి. సరే! మరి ఈ యాంత్రిక మానసిక క్రియలను ఎలా వదిలించుకోవాలన్న ప్రశ్న ఇక్కడ తలెత్తక మానదు. మౌలికంగా ప్రస్తుత స్థితినుంచే సాధన ప్రారంభించాలి. మనసు చర్యలను నెమ్మది నెమ్మదిగా గమనిస్తూ ఉండాలి. ఉత్తినే గమనించండి చాలు. ఆలోచనా ప్రవాహం నెమ్మదిస్తుంది. ఉద్ధృతి తగ్గుతుంది. రానురాను మనసు మనల్ని వశపరచుకోవడంలో వైఫల్యం చెందుతూ ఉంటుంది. విచక్షణ, ఆలోచన, వాంఛ లేనప్పుడు ఆలోచనలు నిలిచిపోతాయి. ఎంత అధికశక్తిని ఏకాగ్రతపై వెచ్చించగలమో, అంతగా భౌతికమైన ఆలోచనలు తగ్గుతూ వస్తాయి. అప్పుడు ఆలోచించకుండానే బాహ్యాన్ని మరిచి పరాన్ని గమనించగలుగుతాం. ఆ పైన మనసు చైతన్యమై ప్రస్ఫుటమవుతుంది. మనసనేది కోరికల కర్మాగారం. ఆ విషయం గ్రహించి బయటపడాల్సింది మనమే. మన గురించి మనం అర్థం చేసుకొన్నప్పుడు ఆత్మ విలువ తెలుస్తుంది. అప్పుడే మనసు చేసే పెత్తనం నుంచి మనం చైతన్యం, స్వేచ్ఛ పొందగలుగుతాం. ఆ స్వేచ్ఛలోనే శాంతి లభిస్తుంది. ఆధ్యాత్మిక అవగాహనతో జీవితాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలి. మనసును హృదయంతో జతచేయాలి. అప్పుడు మన ప్రతిభ బయటకొస్తుంది.ఎల్లెడెలా ఆధ్యాత్మికానందం మన సొంతమవుతుంది.
                                              - అప్పరుసు రమాకాంతరావు 

Tuesday 25 June 2013

మనోనిశ్చలత


    రైలు బోగీ కిక్కిరిసి ఉంది. ఓ మనిషి కూర్చున్న ఓ పెద్దాయనను గడబిడ చేసి, మాటల దాడితో కూర్చున్నవారి వరసలో ఇరుక్కున్నాడు. గమ్యస్థానం చేరేవరకు తాను హాయిగా కూర్చోలేకపోయాడు. ఇతరులనూ కుదురుగా కూర్చుండనివ్వలేదు.

మన సౌకర్యం కోసం, ప్రశాంతత కోసం ఇతరుల ప్రశాంత వాతావరణాన్ని భగ్నంచెయ్యడం ఎంతటి అనౌచిత్యమో గ్రహించుకునే వివేకం అవసరం. సరైన ఆలోచనా విధానం, ప్రవర్తనా శైలి మృగ్యమైతే మనకు మనమే ఓ సమస్యగా మారతాం. ఇతరులకు సమస్యగా తయారవుతాం.

వివేకవంతుడైన మానవుడు తనను తాను ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉంటాడు. ఇది ఉత్తమ సంస్కారాన్ని సూచిస్తుంది. ప్రపంచ విజేతగా నిలిచిపోవాలన్న దుగ్ధతో ఎన్నో యుద్ధాలు చేసి ప్రపంచాన్ని యుద్ధభీతిలో ముంచివేసిన గ్రీకువీరుడు సాధించింది ఏమిటి? కడకు అశాంతితో అలమటించి కన్నుమూశాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి? బోగీలో ఇంతచోటు దొరికినందుకు, ప్రయాణించే అవకాశం లభించినందుకు తృప్తిపడాలే కానీ- సౌకర్యం లేకపోయెనే అన్న ఆలోచనే రానీయకూడదు. అశక్తతతో, ఎక్కేందుకు వీలులేక 'ఫ్లాట్‌ఫాం' మీదనే నిలుచుండిపోయినవారికంటే, తానెంతో అదృష్టవంతుణ్నని భావించుకోవాలి. అలాగే, కూర్చున్నవారు తనకంటే ఎంతో శ్రమించి సాధించుకున్నారన్న ఆలోచన రావాలి.

ఒకరికి ఉన్నదాన్ని గురించి ఈర్ష్యాద్వేషాలకు గురికావడం నీచమైన మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. ఉన్నతస్థాయికి ఎదిగేందుకు మార్గం అంకితభావంతో చేసే శ్రమ మాత్రమేనని గుర్తెరగాలి. శ్రమించడానికి శక్తిలేనప్పుడు ఉన్నదానితోనే తృప్తిపడే మనస్తత్వాన్ని కలిగి ఉండటమే గొప్ప సుగుణం.

ఇందుకు గొప్పమనసు ఉండాలి. దానికై మానవుడు ప్రయత్నించాలి. శ్రీకృష్ణ దర్శనం చేసుకుంటాడు కుచేలుడు. శ్రీకృష్ణుడి ఆదరాభిమానాలు ఏమీ అడగలేనివాడిగా చేశాయి. తిరుగు ప్రయాణంలో 'ఇదేమిటి, పరమాత్మను ఏదైనా కోరుకోవడం మరిచాను. ఎంతటి జడత్వం ఆవహించింది నన్ను! అయినా ఆయనకు అన్నీ తెలియకుండా ఉంటాయా! ఆ పురుషోత్తముణ్ని చూడగలిగాను. అది చాలు' అంటూ తన నివాస ప్రాంతానికి చేరతాడు. అక్కడ ఇంద్రభవనాన్ని తలదన్నే ఓ సదనాన్ని చూసి 'ఏ పుణ్యాత్ముడిదో కదా ఈ భవనం' అని అనుకుంటాడు. మనం గ్రహించాల్సింది ఒక్కటే. మనకు ఉన్నా లేకున్నా ఇతరుల వైభవాన్ని కీర్తించడం గొప్ప సంస్కారం. ఇతరుల గొప్పదనాన్ని ప్రశంసించడం ఉన్నత సంస్కారంగా గుర్తెరగాలి.

అందుకే పోతన మహాకవి భాగవతంలో అంటాడు- తనకున్నదానితో సంతృప్తి పొందనివాడు సప్తద్వీప ఏలిక అయినా తృప్తిగా జీవించలేడు అని. మానవ జీవితం విలువ కట్టలేనిది. ఈర్ష్యాసూయలతో కుంగదీసుకునేది, ఆయుర్దాయాన్ని తగ్గించుకునేది కాదు.

ప్రశాంత జీవన విధానంకోసం మనకు మనం ఏ విధంగా మారాలో ఆంతరంగిక పరిశీలన అవసరం. మన సుఖం, సంతోషం, అదృష్టం మన చేతుల్లోనూ, చేతల్లోనూ ఉంటాయని గ్రహించుకోవాలి. మనలో లేని ఉన్నత గుణాలు ఇతరుల్లో ద్యోతకమైతే ఆదర్శంగా తీసుకోవాలి.

బుద్ధ భగవానుడు ఏది చెప్పినా వాస్తవిక విషయాల ఆధారంగానే చెప్పాడు. అష్టాంగ మార్గంలో సమ్యక్‌ అవధానాన్ని సూచించాడు. మనలోనూ మనచుట్టూరా ఏది జరిగినా మనం వివేకంగా జాగరూకతగా వ్యవహరించడమే అవధానం. నాలో కోపం వస్తోంది. అసహనం పెరుగుతోంది. కోర్కెల బలం పెరుగుతోంది. మనసు తామస ప్రవృత్తికి లోనవుతోంది. నా ప్రవర్తన ఇలా ఎందుకుంది, ఎలా ఉండాలి, అనాలోచిత విధానాలతో గుడ్డిగా ప్రవర్తిస్తున్నానా అన్న స్వీయ అధ్యయనం అవసరం. మనోశోధన అనివార్యం. ఈ శోధన మనోసాగరాన్ని గంభీరంగా, నిశ్చలంగా ఉంచగలుగుతుంది. ఆ స్థితి మాత్రమే ప్రశాంత వాతావరణాన్ని సృష్టిస్తుంది.                                                                                                                                                         
                                                               
- దానం శివప్రసాదరావు 

Monday 24 June 2013

అంపశయ్య


  హాభారతాన్ని పంచమ వేదం అంటారు. శ్రీకృష్ణుడు ఇరుసుగా మహాభారత కథాచక్రం తిరుగుతుంది. అందులోని ప్రతిపాత్రా ఇరుసుతో సంబంధం కలిగినదే. కొన్నిపాత్రలు ప్రత్యక్షంగా, మరికొన్ని పరోక్షంగాను పరమాత్మ శ్రీకృష్ణుడితో అనుబంధం కలిగి ఉన్నాయి.

శ్రీకృష్ణుడి ప్రియసఖుడు అర్జునుడు, అక్రూరుడు, విదురుడు... వీరు ప్రత్యక్ష భక్తులు. పరమాత్మతో దర్శన, స్పర్శన, సంభాషణల మహద్భాగ్యాన్ని పొందగలిగారు. పరోక్ష భక్తుల్లో భీష్ముడు ప్రముఖుడు. ఆయన వల్లనే విష్ణుసహస్రనామం ప్రపంచానికి లభించింది.

భీష్ముడు అసమాన యోధుడు. సత్యదీక్షా దక్షుడు. పరమాత్మకు పరమ భక్తుడు. అయినా అంతిమ దశ అంపశయ్య మీద గడపాల్సిన దుర్గతి పట్టింది. కారణాలు విశ్లేషిస్తే, సమర్థుడై ఉండీ దుర్యోధనుడు, దుశ్శాసనులు నిండుసభలో పాండవ సతి ద్రౌపదిని ఘోరంగా అవమానిస్తున్నప్పుడు నివారించకపోవటమే ఆయన కర్మదోషంగా తెలుస్తుంది. బాణఘాతాలతో ఏర్పడిన గాయాల నుంచి కౌరవ పోషణతో, కృతజ్ఞతాభావంతో కలుషితమైన రుధిరం నిష్క్రమించగానే తాను పునీతుడైనట్లు స్వయంగా భీష్ముడే ధర్మజుడికి చెబుతాడు.

మనలో భీష్ముడు వంటి మహనీయులు లేరు. కానీ భీష్ముడిలాగా ఉదాసీనతతో అన్యాయాలను ఉపేక్షించే వారు మాత్రం చాలామంది ఉన్నారు. కళ్లముందు ఎంత ఘోరం జరుగుతున్నా పట్టించుకోరు. తమకేదన్నా అన్యాయం జరిగితే ఆకాశం విరిగి నెత్తిమీద పడినట్లు అల్లాడిపోతారు. సాయం చెయ్యనివాళ్లను తిట్టిపోస్తారు.

ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. మన తప్పులే విధి బాణాలై మనల్ని అంపశయ్య మీదకు చేరుస్తాయి. భీష్ముడు ఒకే ఒక తప్పు చేశాడు. అందుకు శిక్ష అనుభవించాడు. అర్జునుడి చేత అనేక అధర్మ చర్యలను శ్రీకృష్ణుడు చేయించాడు. కర్ణుణ్ని, భీష్ముణ్ని అధర్మ పద్ధతుల్లోనే అర్జునుడి బాణాలకు ఎరచేశాడు. అధర్మాన్ని అధర్మంతోనే జయించాలనేది శ్రీకృష్ణుడి రాజనీతిలా కనిపించినా, వాస్తవంలో ధర్మ రక్షణ కోసమే అదంతా చేయించాడు గనుక అర్జునుడికి కర్మదోషం అంటలేదు. అధర్మనాశనం కానిదే ధర్మరక్షణ సాధ్యంకాదు. దుష్టాంగాన్ని ఖండించకపోతే, శరీరమే శిథిలమైపోతుంది. సమాజ శరీరంలో ప్రతి వ్యక్తీ ఒక అంగం లాంటివాడు. ఏ వ్యక్తీ దుష్టాంగం కాకూడదు. అయ్యాడా, వేరు కావాల్సిందే. లేదా విధి బాణాల ఘాతాలకు అంపశయ్య మీద కూలతాడు.

జీవితం అందరికీ పూలశయ్య కాదు. కానీ, అంపశయ్య కాకుండా చూసుకోవాలి. అందుకు ఆధ్యాత్మిక జీవన విధానం మనకెంతగానో తోడ్పడుతుంది. అటువంటి జీవితాన్ని మనం మనస్ఫూర్తిగా స్వీకరించాలి.
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌ 

పరమాత్మతో ప్రయాణం


    సాధన అంటే ఎన్నుకున్న ధ్యేయాన్ని సాధించే ప్రయత్నం... బాధతోనో, ఆనందంతోనో. అది మనం ఎన్నుకున్న ధ్యేయాన్నిబట్టి ఉంటుంది. ఆధ్యాత్మిక సాధన ఆనంద రసపూర్ణం. ఆ రసం అవిరళ ధారాసదృశం. అంతర్లీనంగా బాధ కూడా ఉంటుంది. తీయని బాధ. తాళలేని బాధ. సాధకుడు.... కావాలని మరీ మరీ కోరుకుని మనసుకు ఎక్కించుకున్న బాధ. మనం ఒక గొప్ప అంశాన్ని కోరుకుని, దాన్ని పొందే ప్రయత్నంలో తగిలే బాధ. రగిలే బాధ. ఇష్టమైన బాధ. సాధనలోని కష్టంలోనూ ఇంత ఇష్టముందంటే, ఇంత మాధుర్యం ఉందంటే మనం కోరుకుంటున్న ఆ అంశం మరెంత అపురూపమై ఉండాలి, ఎంత అమృతతుల్యమై ఉండాలి? మరి దాని సాధనలో మనం తీసుకోవలసిన శ్రద్ధ ఏమిటి, అనుసరించాల్సిన పద్ధతి ఏమిటి?

కొన్ని లక్ష్యాలు బాహ్యోపకరణాల సాధనతో సరిపుచ్చేవి. కొన్ని ఆంతరిక సాధనకుగానీ లభించనివి. పరమపదం అలాంటిది. అది అంతరంగ సాధన. ఆంతర్య శోధన. ఉపకరణం... వేదన! అది ప్రేమతో, ఆర్తితో కూడిన వేదన. ఈ సాధనలో, సాధనా సాగర మథనంలో ప్రాణం పెట్టాలి. ప్రాణం పోయాలి. సామాన్యంగా ప్రాణం కంటే విలువైంది మనకు మరోటుండదు. అలాంటి ప్రాణాన్నీ తృణప్రాయంగా పణం పెట్టి మరీ చేయాలి. సాధనా సంబారాల్లో అంతకంటే విలువైందీ, ఘనమైందీ మన దగ్గర మరోటి లేదు. అయితే ప్రాపంచిక అమూల్య ఉపకరణాలను, ప్రాణాలనూ కేవలం తులసీదళ సమానంగా తూచే వస్తువు మన దగ్గరొకటుంది. అది ప్రపంచాన్ని జయించగలది. విశ్వాన్ని అధిగమించగలది. సంకల్పం చేసుకుంటే భగవంతుణ్ని గెలుచుకోగలది. అదే అంతరంగం. మన సాధనతో దాన్ని ఉపకరణం చేయాలి. సంబారంగా ఉపయోగించాలి.

 ఉదాహరణకు మనం జపం చేస్తాం. ఎలా? అందులో మనకు పూసల సంఖ్య ముఖ్యం. నూట ఎనిమిది పూసలు. ఒక కొలికి పూస. కొలికి పూస తరవాతి పూస నుంచి జపం మొదలుపెట్టింది మొదలు మళ్ళీ కొలికి పూస వచ్చేవరకూ దానిమీదే ఉంటుంది ధ్యాస. జపం మీద కాదు- కొలికిపూస మీద. ఎక్కడ దాన్ని దాటిపోతామోనని. ఎందుకంటే నూటఎనిమిది పూసల తరవాత వచ్చే కొలికి పూసను దాటి అవతలకు పోరాదు. మళ్ళీ వెనక్కు తిప్పాలి. ఇదీ మన జపం! ఇదా జపం! కాదేమో. అయితే అది అందరి గురించీ కాదు. కొందరి గురించి మాత్రమే. జపం అంటే ఏమిటి? ఒక యజ్ఞం. జపయజ్ఞం. యజ్ఞాల్లోకెల్లా ఉత్తమ యజ్ఞం. అష్టాంగ యోగంలోని ఏడో అంగమైన ధ్యానానికి దారితీసే మహాసాధన. మహోన్నత సాధన. రత్నాకరుడనే బోయ, నారదుడు ఉపదేశించిన 'మరా' అనే రామనామాన్ని జపించి జపించి, తపించి తపించి వాల్మీకి మహర్షిగా రూపాంతరం చెందేందుకు దారిచూపిన మహోజ్జ్వల జ్యోతి. మన చేతుల్లో ఉండే జపమాల ఒక పూసల దండ కాదు. మన భగవత్‌ సాధనలో దాదాపు మూడువంతుల వరకు మనకు తోడుండే ఒక అండ. మునుముందుకు సాగడానికి మనకు అనుక్షణం ధైర్యాన్నందించే ఒక కొండ. అలాంటి జపమాలను చేతుల్లోకి తీసుకుంటేనే మన మనసు ప్రఫుల్లమైపోవాలి. పులకరించిపోవాలి. జప ప్రారంభంగా కళ్లు మూయకముందే అవి అరమోడ్పులై ఆనంద పారవశ్యం చెందాలి. జపమాలతో భగవంతుడి నామాన్ని ఉచ్చరిస్తే ఆయనను మన ముందుకు, మనలోకి ఆవాహన చేయమని ఆహ్వానించే ఒక మధుర వైఖరి. ప్రేమ పిలుపు.

 జపమాల....! వందలు, వేలు, లక్షలు, కోట్లసార్లు జపించి జపించి పండిపోయిన జపమాలలోని పూసలు ఒక్కోనామాన్ని లేదా గురు ప్రసాదిత మంత్రాన్ని సాధకుడు జపిస్తూ ఉంటే బీజాక్షరామృతాన్ని తాగలేక అతిశయ మాధుర్యంతో ఉన్మత్తమై మత్తిలి సాధకుడి చేతుల్లో ఆనంద విశ్రాంతంలో ఉండిపోతుంది జపమాల. మనం జపమాలను చేతితో తిప్పుతుంటే గండకీ నదిలోని సూక్ష్మపరిమాణ శివలింగాలు మన భాగ్యవశాన చేతిలో, వేళ్ల మధ్య ఒకటొకటిగా తిరుగుతున్న వాస్తవానుభూతి కలగాలి. స్పర్శాసాధనగా అంతరంగం అమృతోపమానం అయిపోవాలి. ఆధ్యాత్మిక హృదయం దగ్గర జపంతో మాల తిరుగుతూ ఉంటే మన హృదయాన్ని స్పృశిస్తూ ఆశీర్వదిస్తూ కిందికి జారుతున్న పూసలు మనం భగవంతుడికి దగ్గరవుతున్న ఆశ్వాసన ఇస్తున్న అమ్మలా అనిపించాలి.

 జపం... అంకెల లెక్క కాదు. సంఖ్యల గారడి కాదు, అది మన సాధనా పయనంలో పూలబాట. పూసల ఆట కాదు. ఇది నిజం... మనం జపిస్తూ వదిలిపెడుతున్న ఒక్కో పూసా మంత్రపూరిత అమృతాన్ని మోసుకుపోయిన కలశంలా వెళ్లి పరమాత్ముని అభిషేకిస్తుంది. సాధనలోని ప్రతి సూక్ష్మాంగాన్నీ మనం ఇలాగే- కాదు కాదు- ఇంతకంటే అధికంగా, అధికాధికంగా, అపురూపంగా అత్యంత ప్రేమ పూర్వకంగా ఆచరించాలి. అనుభవించాలి. భగవంతుడితో కలిసే మనం భగవంతుడికై ప్రయాణించాలి. ఎంత అద్భుతమైన ప్రయాణం!
- చక్కిలం విజయలక్ష్మి 

Saturday 22 June 2013

ఏరువాక పున్నమి

                           

  
    భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి మూలస్తంభం లాంటిది వ్యవసాయం. దానికి తొలి పనిముట్టు నాగలి, ముఖ్యవనరు వర్షం. ఆ వర్షం కురిసే కాలం మొదల య్యేప్పుడు రైతులు కృతజ్ఞతతో జరిపే పండుగ 'కృషిపూర్ణిమ'. దీనికే హలపూర్ణిమ, ఏరువాక పున్నమి అనే పేర్లున్నాయి. 'ఏరు' అంటే నాగలి అని, 'ఏరువాక' అంటే దుక్కి ప్రారంభం అనీ అర్థాలున్నాయి. వ్యవసాయానికి కావలసిన వర్షాన్ని కురిపిస్తాడని భావించే ఇంద్రుణ్ని పూజించడం, నాగలిని పూజించి వ్యవసాయ పనులు మొదలుపెట్టడం జ్యేష్ఠపూర్ణిమ పర్వదిన ముఖ్యాంశాలు. రైతులు ఈ పండుగ జరపడానికిగల కారణాన్ని పరిశీలిస్తే- నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే రోజు జ్యేష్ఠపూర్ణిమ. చంద్రుడు ఓషధులకు అధిపతి. ఓషధులు (మంచు, ఎరువు, సూక్ష్మధాతువులు) పుష్కలంగా ఉంటేనే వ్యవసాయం అధిక ఫలసాయాన్నిస్తుంది. పై కారణాలన్నింటివల్ల జ్యేష్ఠపూర్ణిమనాడు ఈ పర్వదినాన్ని జరుపుతారు.


వ్యవసాయానికి ఆలంబన అయిన పశుసంపద, భూమి, పనిముట్లకు ప్రాధాన్యమిచ్చి పూజించడం ఈ పూర్ణిమ ప్రత్యేకత. నాగలిని శుభ్రపరచి, పసుపు, కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. దానితోపాటు పశువులను అలంకరించి వాటితో వ్యవసాయ భూమికీ పూజచేస్తారు. పశువుల కొట్టాలు, కళ్ళాలు మొదలైనవాటినీ శుభ్రంచేసి అలంకరిస్తారు. ఆపైన పొంగలిని (కొన్ని ప్రాంతాల్లో పులగం) వండి వర్షానికి అధిదేవత అయిన ఇంద్రుణ్ని పూజించి నివేదన చేస్తారు. ఆ తరవాత ఆ పదార్థాలను ఆవులకు, ఎడ్లకు తినిపిస్తారు. నాగలిని పూన్చి, పశువులను, బళ్లను మేళతాళాలతో వూరేగించి భూమిలో తొలి వ్యవసాయ పని ప్రారంభిస్తారు. కొన్నిచోట్ల తొలిదుక్కిలో రైతులు కూడా ఎడ్లతో సమానంగా కాడికి రెండోవైపు నిలిచి భూమిని దున్నుతారు. పశువులగెత్తం (ఎరువుగా మారిన పశువుల పేడ) పొలాలకు తరలించే ప్రక్రియా ఈ పూర్ణిమనాడే ప్రారంభిస్తారు.

ఉత్తర భారతదేశంలో దీన్ని 'ఉద్‌వృషభయజ్ఞం' అని పిలుస్తారు. వృషభం అంటే ఎద్దు. ఉద్ధృతం అంటే లేపడం. అంతవరకు వేసవివల్ల కాస్త విశ్రమించిన పశువులను వ్యవసాయం కోసం సిద్ధపరచడమని అర్థం. 

రుగ్వేదంలోనూ వ్యవసాయ పనుల ప్రారంభ దినాన చేసే గౌరవసూచకమైన ఉత్సవ ప్రసక్తి ఉంది. అధర్వణ వేదంలోనూ 'అనడుత్సవం' అనే పేరుతో ఒక ఉత్సవం జరపాలని ఉంది. దీనిలో భాగంగా హలకర్మ (నాగలిపూజ), మేదినీ ఉత్సవం (భూమి పూజ), వృషభ సౌభాగ్యం (పశువుల పూజ) మొదలైన ప్రక్రియలు చేయాలని చెబుతున్నాయి. ఇవేకాకుండా అనేక పురాణాల్లోనూ 'కృషిపూర్ణిమ' ప్రసక్తి ఉంది. వరాహమిహిరుడు రచించిన 'బృహత్సంహిత'లోను, పరాశరుడు రాసిన 'కృషిపరాశరం'లోనూ ఈ ఉత్సవ ప్రసక్తి ఉంది. కర్ణాటక ప్రాంతంలో 'కారణిపబ్బం' అని పిలుస్తారీ ఉత్సవాన్ని.
                                                             - అయ్యగారి శ్రీనివాసరావు 

Friday 21 June 2013

ఒక మనిషి-మూడు స్థితులు


 
   లో
కంలో ప్రతి మనిషీ మూడు స్థితుల్లో సంచరిస్తూ ఉంటాడు. ఈ స్థితులను అవస్థలు అనీ అంటారు. మనిషి మేల్కొని ఉంటాడు. ఇది జాగ్రదవస్థ. కలలు కంటూ ఉంటాడు. ఇది స్వప్నావస్థ. గాఢనిద్రలో ఉండే స్థితి సుషుప్త్యావస్థ.

గార్గ్యుడు జ్ఞానాన్వేషణకు బయలుదేరాడు. అతడిలాగానే మరో అయిదుగురూ అదే పనిమీద బయలుదేరారు. ఈ ఆరుగురూ పిప్పలాద మహర్షి గురించి విని ఆయనను కలుసుకున్నారు. వారి వారి ప్రశ్నలకు పిప్పలాదుడు సమాధానాలు ఇచ్చాడు. గురువు సమీపంలో శిష్యుడు ఉండి జ్ఞానాన్ని పొందడం- ఉపనిషత్తు. మాండ్యూకోపనిషత్తులో చర్చించిన జాగ్రద, స్వప్న, సుషుప్తి అవస్థలను మరింతగా విచారణ చేసేది ప్రశ్నోపనిషత్తు. అందువల్ల దీన్నే మాండ్యూకోపనిషత్తు సహ ఉపనిషద అని కూడా భావిస్తారు.

మనిషిలో ఏవి నిద్రిస్తున్నాయి, ఏవి మేల్కొంటున్నాయి, ఎవరు సుఖాన్ని అనుభవిస్తున్నారు, అన్నీ దేనిలో లయమవుతున్నాయి మొదలైన ప్రశ్నలు గార్గ్యుడు అడిగాడు. దానికి పిప్పలాద మహర్షి ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు.

మనం మేల్కొని ఉన్నప్పుడు ఇంద్రియాలు పనిచేస్తుంటాయి. అవి బాహ్య ప్రపంచంతో సంబంధం కలిగి ఉండి అనుభవాలు సంపాదిస్తాయి. ఇది సూర్యోదయం తరవాత సూర్యకిరణాల వ్యాప్తి లాంటిది. సూర్యాస్తమయంలో కిరణాలు ఎలా లయించిపోతాయో అలాగే మనిషి నిద్రిస్తున్నప్పుడు అతడి ఇంద్రియాలన్నీ మనసులో లయించిపోతాయి. ఇంద్రియాలు పనిచేయకపోవడం వల్ల ఎలాంటి బాహ్య అనుభవమూ కలగదు.

నగరం రాత్రివేళ గాఢనిద్రలో ఉన్నా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటాయి. అదే రీతిలో శరీరం ఆదమరచి నిద్రిస్తున్నా ప్రాణశక్తులు మేల్కొని ఉంటాయి. పని చేస్తూ ఉంటాయి. అవి విశ్రమించవు. హృదయం, పేగులు, మూత్రపిండాలు వంటివి వాటి పనులు చేస్తుంటాయి. తిన్న ఆహారం జీర్ణమవుతూ ఉంటుంది. రక్తం పరిశుద్ధం కావడం వంటి పనులు నిద్రిస్తున్నప్పుడూ జరుగుతూనే ఉంటాయి.

మనసే దైవం. మనోశక్తికి హద్దులు లేవు. జాగ్రదావస్థలో చూసి అనుభవించినవన్నీ సుప్త చేతన మనసులో నమోదవుతాయి. కలలో మనసే ఇవి అన్నిటిగా అయిపోయి మళ్ళీ వాటిని అనుభవిస్తుంది. జాగ్రదవస్థలో మనం చూసినవి, విన్నవి కలలో సంభవించవచ్చు.

ప్రగాఢ నిద్రావస్థలో జాగ్రద, స్వప్నాలు లేవు. మేల్కొని ఉండకపోయినా, కలలు కనకపోయినా ఆ ప్రగాఢ నిద్రావస్థను మనం అనుభవిస్తాం. ఎందుకంటే నిద్రలేచిన తరవాత 'నిన్న బాగా నిద్రపోయాను. చాలా సుఖంగా ఉంది' అని చెబుతాం. సుషుప్త్యావస్థలోని లక్షణాలను మాండ్యూకోపనిషత్తు వివరిస్తుంది. ఈ స్థితిలో అనుభవాలు ఏమీ ఉండవు. కన్ను, చెవి వంటి మన ఇంద్రియాలు చేతన, మనసు, సుప్తచేతన అన్నీ విశ్రాంతిలో మునిగి ఉండటంతో అక్కడ బాహ్య జగత్తుకు సంబంధించిన అనుభవాలూ ఉండవు. నిద్రిస్తున్నప్పుడు మనసు, సుప్తచేతన లయించినప్పటికీ నేను అనే స్ఫురణ మేల్కొని ఉంటుంది. ఈ విధంగా నేను- స్ఫురణలో లయించిన మనసు బయటకు వస్తున్నప్పుడు మొదటి స్థితి కల ఇంకా బాహ్యస్థితిలోకి వస్తున్నప్పుడు జాగ్రదవస్థను అనుభవిస్తుంది. గాఢనిద్రలో ఉన్న ఒకే అనుభవం సుఖం. అందువల్లనే నిద్ర నుంచి లేవగానే 'నేను సుఖంగా నిద్రపోయాను' అని మనం చెప్పగలుగుతాం.

చూసేది, స్పర్శను పొందేది, వినేది, వాసన చూసేది, రుచి చూసేది, ఆలోచించేది, గ్రహించేది- వీటన్నింటికీ నేను స్ఫురణే ఆధారం. నిద్రావస్థను అనుభవిస్తున్న ఆ నేను- అమరమైన ఆత్మలో ప్రతిష్ఠితమై ఉంటుంది. శ్రేష్ఠమైన, వినాశన రహితమైన, రంగులేని, స్వచ్ఛమైన ఆత్మను ఎవరు అనుభూతితో గ్రహిస్తారో వారే ఆత్మను పొందగలుగుతారు. నేను అనే స్ఫురణ, ఇంద్రియాలు, పంచభూతాలు అన్నీ ఎక్కడ విలీనమవుతాయో ఆ ఆత్మను అనుభూతిలో గ్రహించినవాడే సర్వజ్ఞుడు.
                                               - డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

Thursday 20 June 2013

మనసు


    చాలామంది తరచుగా తమ మనసెందుకో బాగాలేదంటూ ఉంటారు. వారు దానికి కారణం చెప్పలేరు. వాస్తవంగా అది వారికే తెలియదు. లోతుగా చూస్తే వారి మనసుల్ని ప్రభావితం చేసే అంశాలు చాలా కనిపిస్తాయి. పరిసరాలు, ఆహారం, గత వాసనలు, సాంగత్యం, చేసే పనులు, కాలం... ఇలా అనేకం ఉంటాయి. పరిసరాలు మన మనసులమీద తీవ్రమైన ప్రభావం చూపుతాయి. సహజంగా అతిథుల గదిలో గంభీరంగా ఉన్నా, ఆహ్లాదంగా ఉన్నా మాటలస్థాయి ఎక్కువగానే ఉంటుంది. అదే పడక గదిలో ఆంతరంగికమైనా, శృంగారభరితమైనా గుసగుసల్లోకి మారిపోతుంది. ఇక పూజగదిలో భగవన్నామ స్మరణ మంద్రంగానో, నిశ్శబ్దంగానో సాగిపోతుంది. అందుకే అక్కడుండే ప్రశాంతత మరెక్కడా దొరకదు.

మన ఆహారం కూడా మనసుల మీద ప్రభావం చూపిస్తుంది. సాత్వికాహారం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అదే విపరీతమైన కారం, పులుపు తింటే మనసు ఉత్తేజభరితమవుతుంది. అంతేకాదు, ఎవరు వడ్డిస్తున్నారన్న అంశం కూడా ఇక్కడ ముఖ్యం. తల్లి లాలించి పెడుతుంది. భార్య ప్రియమారపెట్టవచ్చు... లేక మరేదో సాధించాలని సణుగుతూ వడ్డించవచ్చు. వేరే వ్యక్తి ఇంకొక విధంగా ప్రవర్తించవచ్చు. వడ్డించేవారి ప్రవర్తననుబట్టి తినే పదార్థాలపై ఇష్టాయిష్టాలు మారతాయి. ఏర్పడతాయి.

ఒకసారి గాంధీజీ స్వాతంత్య్రోద్యమంలో కారాగారంలో ఉన్నారు. ఒక రాత్రి తాను ఆచరిస్తున్న అహింసావాదం సరైంది కాదేమోనని ఆయనకు అనిపించిందట. అలాంటి ఆలోచన వచ్చినందుకు మర్నాడుదాకా ఆయనను ఆ కలవరం వదలిపెట్టలేదు. తనకలాంటి ఆలోచనలెందుకు వస్తున్నాయా అని ఆయన తీవ్ర మనస్తాపానికి గురవుతుండగా ఎవరో కొత్త వ్యక్తి వచ్చి 'మహాత్మా! టీ' అనటం వినిపించింది. అతను వెళ్లిపోయాక అతనెవరని మామూలుగా వచ్చే వ్యక్తి తనకెందుకు సేవ చేయటంలేదని అడిగారు గాంధీజీ. 'అతను నిర్దాక్షిణ్యంగా కొందర్ని చంపిన హంతకుడు. మర్నాడు ఉరికంబమెక్కుతున్నాడు. తన చివరి కోరిక ఏమిటంటే మామూలుగా వచ్చే మనిషి స్థానంలో ఓ రోజు మీకు సేవ చేయాలని ఉందన్నాడు' అని చెప్పాడు కారాగార అధికారి.

మహాత్ముడు కనుక ఆయనకు వెంటనే విషయం అర్థమైంది. హంతకుడి చేతులమీదుగా తీసుకున్న ఆహారంవల్ల ఒక్కరోజులో తన ఆలోచనల తీరు ఎలా మారిపోయిందో కదా అని ఆయన చింతించారు. అందుచేత ఆహారమే కాదు... దాన్ని వడ్డించేవారి మనస్తత్వం కూడా భోక్తలపై ప్రభావం చూపిస్తుంది. 

గతంలో మనం చేసిన పనులు మన మనసుల్ని పట్టి పీడిస్తుంటాయి. జ్ఞాన సముపార్జన, ధ్యానం గత వాసనల్ని తుడిచివేస్తాయి. 

ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం... ఇలా సమయాన్ని బట్టి మన మనసు ప్రభావితమవుతుంది. నిరంతర సాధనలో మనసును నియంత్రించుకుంటే అన్ని సమయాల్లోనూ ఒకే స్థిర భావనతో ఉండగలగటం సాధ్యం.

సాంగత్యం మన మనసు మీద విపరీతమైన ప్రభావం చూపుతుంది. మంచివారి చెలిమివల్ల జ్ఞానం కలుగుతుంది. ఆ వెలుగులో పయనం సాగిస్తే మనసు నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది. 

చేసే పనులు ఒకరికి హానికరం కానివి, స్వార్థపూరితం కానివి, స్వలాభాపేక్షతో కూడినవి కాకపోతే సరిపోదు. అన్నార్తుల కళ్లల్లోని దీనభావనల్ని గుర్తించాలి. మన సుఖాలను మరి కాస్త వాయిదా వేసుకుని వారిని కష్టంలో ఆదుకోగలగాలి. 

ఒకరికి సాయపడగలగటం ఒక గొప్ప అనుభవం. అందులో అవతలి వ్యక్తి అర్థించకుండానే సాయమందించగలగటం ఒక అదృష్టం. అది భగవద్దర్శన భాగ్యం కలిగినంత భాగ్యం!
                                                      - తటవర్తి రామచంద్రరావు 

Wednesday 19 June 2013

ప్రణవం

                              
 వేదాలకు పునాది అనాది ప్రణవనాదం. లోకాలన్నీ ప్రణవంనుంచే ప్రభవించాయంటారు. పరమేశ్వరుడు ప్రణవ మంత్రాసీనుడై భాసిస్తుంటాడని, సంసార సముద్రాన్ని దాటించగల ఏకైకనాదం ప్రణవమని చెబుతారు.
'ఓంకారం ఎప్పటికీ నశించని నాదం. ఓంకారమే ఈ సకల విశ్వం. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఓంకారమే. కాల తీరాలకు ఆవల కూడా నిత్యమై ధ్వనించేది ఓంకారమే. ఈ విశ్వమంతా పరబ్రహ్మ స్వరూపమే. మనలోని పరమాత్మ ప్రణవనాదమే' అని మాండూక్యోపనిషత్తు విస్పష్టంగా ప్రవచించింది.

ఆద్య మంత్రం ఓంకారం బ్రహ్మానికి ప్రతీక. ఓంకారంపై ధ్యానం చేస్తే అంతిమ సత్య సాక్షాత్కారం సాధ్యమవుతుందని పెద్దల మాట. ప్రణవ ధ్యానం ఒక అవిచ్ఛిన్న కాంతిధారగా పరాత్పరుడివైపు ప్రసరిస్తుంది. ఓంకారాన్ని జపించడంవల్ల మృణ్మయ శరీర భూమిక నుంచి ఆత్మ పరమోన్నత లక్ష్యంవైపు ప్రయాణిస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు బోధించాడు.

ఒకసారి 'ప్రణవ మంత్రానికి అర్థం నాకు తెలియదు' అని బ్రహ్మ అన్నప్పుడు అక్కడే ఉన్న షణ్ముఖుడు ఆయన్ని కటకటాల వెనక బంధించాడు. తనకు వేదాల్లోని జ్ఞానమంతా తెలుసు, కాని ప్రణవ మంత్రానికి పరిపూర్ణ అర్థం తెలియదని బ్రహ్మ అన్నాడు సవినయంగా. మహోన్నత జ్ఞానసిద్ధిని పొందినవారు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలుగుతారు కొంతవరకు.

బ్రహ్మను కారాగారంలో బంధించి షణ్ముఖుడు సృష్టి చేయడానికి ఉపక్రమిస్తాడు. శివుడు షణ్ముఖుణ్ని వారించి, ఎక్కువ కాలం బ్రహ్మను కారాగారంలో ఉంచరాదని, విడుదల చేయాలని నచ్చజెప్పాడు. 'కారాగారం గోడల మధ్య ఎలాంటి భావాలు నీకు కలిగాయి' అని శివుడు బ్రహ్మను అడుగుతాడు. కారాగారం తపస్సు చేయడానికి అనువైన చోటుగా భావించానని బ్రహ్మ సమాధానం ఇస్తాడు. శివుడు షణ్ముఖుణ్ని తన ఒడిలో కూర్చోబెట్టుకొని 'ప్రణవమంటే అర్థం ఏమిటో నువ్వు చెప్పు' అని అడుగుతాడు. 'నీకు రహస్యంగా చెవిలో చెబుతాను' అని షణ్ముఖుడు అంటాడు.

'ప్రణవం మహిమ వర్ణనాతీతం. కర్మబంధాల నుంచి విముక్తం పొందడానికే ఆత్మలు భూమిపై జన్మలు ఎత్తుతున్నాయి. ఈ జీవన చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. చివరికి భగవంతుణ్ని తెలుసుకుని ముక్తి పొందేవారు జీవులు. దైవం ప్రణయానంతరం సృష్టి చేయాలని సంకల్పించినప్పుడు, ఓంకారం వినిపిస్తుందంటారు. సమస్త దేవతలకు, లోకాలకు, ఆత్మలకు మూలం ప్రణవమే!'

ప్రణవనాద సుధారసమే భువనమోహనమైన రామావతారమై దిగివచ్చిందని త్యాగయ్య గానం చేశాడు. 'నాదాల్లో ప్రణవనాదాన్ని నేను' అని శ్రీకృష్ణుడు తెలియజెప్పాడు. గణపతి ఓంకార రూపంతో ప్రకాశిస్తాడు. 'ప్రణవమే ధనుస్సు. ఆత్మే బాణం. బ్రహ్మమే లక్ష్యం. గురి తప్పకుండా ఆత్మ లక్ష్యాన్ని చేరాలి. బాణం లక్ష్యాన్ని ఛేదించినట్లు ఆత్మ బ్రహ్మంలో లీనం కావాలి' అని ఒక ఉపనిషత్తు గానం చేసింది.

భూమాత గర్భంనుంచి, తల్లి గర్భం నుంచి జన్మించానని భావిస్తున్న జీవాత్మ మొదట పరమాత్మనుంచే ప్రభవించింది. ఆత్మ ఆది ప్రణవమే. అది నిత్య కాంతి ధామం. యుగాల పరిణామం అనంతరం అటువైపే ఆత్మ మహాప్రస్థానం.
                                                                     - కె.యజ్ఞన్న
                                                                                                         

Tuesday 18 June 2013

మంత్రంలాంటి మాటలు


   వెలగపండుకు గుజ్జు ఎక్కువ, గింజలు తక్కువ. కొన్ని ద్రాక్షపండ్లకు గింజలే ఉండవు. అరటిపండు తొక్క తీయగానే పండు తినేయడమే. కొంతమంది వాళ్ల భాషా పటాటోప చాతుర్యంతో వూదరగొడుతూ ఉంటారు. మరి కొంతమంది వాళ్ల వాక్ప్రవాహ శక్తితో ఎదుటివాళ్ల మతి పోగొడుతూ ఉంటారు. అతి తక్కువమందే చెప్పాల్సింది సూటిగా, చక్కగా చెబుతారు.
భాషతో ఎంతగా అలంకరించినా, అందులో విషయం లేకపోతే అది తేలిపోతుంది. ఎన్ని రకాల పద విన్యాసాలు చేసినా చెప్పాల్సిన విషయం మీద స్పష్టత లేకపోతే, అది చదివిన మరుక్షణమే స్మృతిపథంనుంచి జారిపోతుంది.

ఎన్ని లొల్లాయి పదాలు పాడితే ఒక త్యాగరాజు కీర్తనకు సరి అవుతుంది? ఎన్ని కవితలు ఆశువుగా చెబితే ఒక కబీరు మహాశయుడి దోహాకు సమానమవుతుంది? శబ్దాలు శ్రవణానందకరంగా ఎంత విన్యాసాలు చేసినా, అవి ఎన్నటికైనా ఓంకారాన్ని మించగలవా?

కూర్చడం, పేర్చడం, అలంకరించడం అరువు తెచ్చుకున్న పద్ధతి. కనుగొనడం, సృష్టించడం అరుదైన పద్ధతి. ఎక్కడెక్కడి భావాలో నావికావు. చుట్టూ ఉన్న వాతావరణం నన్ను కదిలించాలి. పరిస్థితులు నన్ను మెలిపెట్టాలి. బాధలు నన్ను సాన పట్టాలి. జ్ఞానార్తి నా హృదయాన్ని తడిగుడ్డ పిండినట్లు పిండాలి. ఒక్క చుక్క రాలినా చాలు, అది మన సొంత భావమవుతుంది. పారిభాషపదకోశంలోని పదాలన్నీ వరసగా పేర్చినా అందులో మన భావం అంటూ ఒకటి లేకపోతే అది శవాలంకరణతో సమానం. అందుకే ఆదిశంకరులు 'శబ్దఝురి కీకారణ్యం చిత్త విభ్రమ కారణం' అన్నారు.

తెలియనివాళ్లు మెచ్చుకున్నారని బుడబుక్కలవాడి పాట సామవేద గానమవుతుందా? రెండూ నల్లటి పక్షులైనా కాకికి, కోయిలకు కూతలో తేడా లేదా? మహాభారతం మొత్తం చదివితే శాశ్వతంగా గుర్తుండిపోయేది ఆ పరమాత్మ ప్రసాదించిన గీతాసారాంశమే కదా? రామాయణం ఎన్నిసార్లు పారాయణ చేసినా ఒక్క రామప్రేమ తప్ప ఏది మనలను వెంటాడుతుంది? భాగవతం ఎన్నిసార్లు శ్రవణం చేసినా శ్రీహరి రక్షించిన భక్తులే కళ్లముందు మెదులుతుంటారు.

సరళంగా, సూటిగా ఉండి, అసాధారణంగా అనిపించేది 'సత్యం' ఒక్కటే. దాన్ని చెప్పాలంటే- భావనలు అందవు. చిన్ని నోరు కలిగిన చంటిపిల్లాడు పెద్ద వస్తువును నోట పెట్టుకోవాలని తాపత్రయపడినట్లు ఏదో ఒక ప్రయత్నం చెయ్యడమే. అదెంత వరకు సఫలీకృతం అవుతుందన్నది చెప్పలేం.

తెలిసినవాళ్లు చెప్పలేక చెప్పరు. తెలియనివాళ్లు ఏదో తెలిసి, చెప్పాలని చెబుతూ ఉంటారు. నిజమైన గురువు మాత్రమే దాన్ని చెప్పగలడు. అసలైన శిష్యుడు మాత్రమే దాన్ని గ్రహించగలడు. వాళ్లది హృదయ భాష. హృదయం మాట్లాడుతుందా? సత్యం మాట్లాడటానికి నోరు పనికి రాదు. హృదయం కావాలి. హృదయం నోరులేకుండా మాట్లాడుతుంది. హృదయాలతో మాట్లాడుతుంది. హృదయమే ప్రాతిపదికన జీవించేవాళ్లు భాషా పటాటోపానికి దూరంగా ఉంటారు. సహజమైన పుష్పాలు ఇచ్చే సౌరభం కృత్రిమ పుష్పాలు ఇస్తాయా? ఎంత మెరుస్తున్నా గాజుపెంకు వజ్రం అవుతుందా?

విలువిచ్చి, విలువైన విషయాన్ని సందర్భానుసారం అసాధారణంగా చెప్పాలి. అద్భుతంగా చెప్పాలి. అందంగా చెప్పాలి. అవ్యాజమైన ప్రేమతో చెప్పాలి. గంగిగోవు పాలు గరిటడైన చాలు. కడివెడైననేమి ఖరము పాలు అన్నాడు వేమన యోగి. మంత్రంలాంటి మాట ఒకటి చాలు. శక్తిని నింపుతుంది. చేవ ఇస్తుంది. అమృతమై పని చేసి మృత సంజీవిని అవుతుంది.
                                                            - ఆనంద సాయి స్వామి 

Monday 17 June 2013

బుద్ధిమార్గం


    కోరికలే కష్టాలకు కారణం. కాబట్టి అలాంటి కోరికల్ని త్యజించమన్నాడు బుద్ధుడు. కోరికలంటే ఎలాంటి కోరికలు? ప్రపంచమంతా సుఖంగా వర్ధిల్లాలని కోరుకోవడం ఇలాంటి కోరిక కాదు. శాంతి అహింసలు పరిఢవిల్లాలని కాంక్షించడమూ ఈ కోవలోకి చేరదు. కర్మఫల త్యాగాన్ని మన ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. కోరికలు లేకపోతే సుఖంగా బతకవచ్చని, ప్రజల హృదయాల్లో ముద్రవేసే విధంగా బుద్ధుడు చెప్పగలిగాడు. బుద్ధుడికి స్వర్గకాంక్ష లేదు. రాజ్య కాంక్ష అసలే లేదు. సంసారాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఏ కోరికాలేని మనీషి (బుద్ధుడు) అయ్యాడు. కాబట్టే శత్రువుకు మేలుచేయడం, ద్వేషించేవారిని ప్రేమించడం ఆయనకు సాధ్యపడింది.
               ఎంత జ్ఞానం ఉంటే ఇది సాధ్యపడుతుంది? ఆకాశమంత! తాను ఆ స్థాయికి చేరుకోవడమేగాక, సాధన చేస్తే అందరూ ఆ స్థాయిని పొంది 'బుద్ధులు' కావచ్చుననీ ఆయన బోధించాడు. ఈ సాధనకు మూల సూత్రం 'కోరిక లేకపోవడం'. తాను జీవితంలో ఆచరించి మరీ చెప్పాడు. భిక్షాటనతో బతికాడు. జంతుజాలమంతా మనవంటిదే కాబట్టి జాలితో చూడమన్నాడు. వాటిని రక్షించడం కోసం నిత్యం తహతహలాడాడు. 'మేకపిల్లను బలి ఇస్తే మోక్షం వస్తుందా? అయితే, మనిషిని బలి ఇస్తే మరీ మంచిది కదా! కాబట్టి నన్నే బలి ఇవ్వండి' అని ఒక జీవిని రక్షించడంకోసం తానే బలిపీఠం ఎక్కాడు. ఇందువల్ల ఆ మహాపురుషుడికి ఒరిగిందేమిటి? తాను అధికారంలోకి రావడానికో, పూజలందుకోవడానికో ఈ పనిచేయలేదు. ఉన్న అధికారాన్ని వదులుకున్నాడు. పూజలపై విశ్వాసంలేదు. 'కరుణ' కోరికలతో సంబంధంలేనిది. దేవుడు, స్వర్గం, ముక్తి... వీటిని గురించి బుద్ధుడు పట్టించుకోలేదు. స్వార్థ రహితమైన సజీవ ప్రేమను ప్రపంచ ప్రజలకు ఒక సందేశంగా అందించాడు.

ఈ లోకానికి మహోపకారం గావించిన మహాత్ములెవరూ తమకంటూ ఏమీ కోరుకోలేదు. ఆఖరికి తమ సంతానం సిరిసంపదలతో తులతూగాలనీ వాంఛించలేదు. 'నాకేంటి?' అనే ప్రశ్న కలలో కూడా మొలకెత్తని 'బుద్ధులు' వీళ్లు. ధర్మానికి బద్ధులు. 'సరే! నీకు ఇది ఇస్తా! మరి నాకేంటి? తిరిగి నాకు ఏమిస్తావు?' అనే ప్రబుద్ధులు నేటి సమాజంలో కనబడుతున్నారు. తమకు లాభం లేకపోతే వీళ్లు దేవుడికి దండం కూడా మనస్ఫూర్తిగా పెట్టరు. భక్తి వెనక ఏ కోరికా ఉండకూడదు. అధికమైన కోరికలకు కారణం అజ్ఞానం. ఒక శాస్త్రజ్ఞుడు అహర్నిశలూ పరిశోధిస్తున్నాడు. ఒక నూతన గణన యంత్రాన్ని నిర్మించడానికి శ్రమిస్తున్నాడు. అతడి కుమారుడు వచ్చి 'నాన్నా! ఇదేమిటి?' అని ప్రశ్నించాడు 'ఒక అపూర్వ గణన యంత్రాన్ని కనిపెడుతున్నాను!' అన్నాడు తండ్రి. 'ఇందులో నుంచి చాక్లెట్లు వస్తాయా?' ఆశగా ప్రశ్నించాడు కుమారుడు. 'అలాంటివేమీ రావు!' అన్నాడు శాస్త్రజ్ఞుడు. 'అయితే ఇది వట్టి పనికిమాలిన యంత్రం... దీంతో నాకు పనిలేదు!' అంటూ ఆ పుత్రరత్నం నిరాశతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. లోకం మొత్తానికి మేలుచేసే వస్తువు తనకూ మేలు చేస్తుంది గదా అనే ఆలోచన ఆ పసివాడికి కలగలేదు. అతడికి కావలసింది చాక్లెట్‌. తన కోరిక తీర్చేది ఉంటే చాలు. లోకం మేలుతో అతడికి పనిలేదు. పసివాళ్లకు అలా అనిపించడం సహజం. కారణం అజ్ఞానం. కానీ, ఉత్తమ విద్యలభ్యసించి, ఉన్నత పీఠాలు అధివసించినవారిది అజ్ఞానమా? కాదు అత్యాశ!

కన్నబిడ్డలకు అన్నం పెడతారు. వస్త్రాలిస్తారు. తల్లిదండ్రులకు ఎలాంటి ప్రతిఫలాపేక్షా ఉండదు. ఇలాంటి సేవాదృక్పథమే పాలకులకు ఉండాలి. 'ఇతరుల కోసం చేసే అతిస్వల్ప కార్యం కూడా మనలోని మహాశక్తిని మేల్కొలుపుతుంది' అంటాడు వివేకానందుడు. లోకానికి మనం ఇచ్చే ప్రతి వస్తువునూ ప్రతిఫలాపేక్ష రహితంగా సమర్పించడమే సనాతనధర్మం. ఒక పర్యాయం లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్‌ బొంబాయిలో ఉపన్యాసం ఇచ్చాడు. ఆయన అపార పరిజ్ఞానానికి సభాధ్యక్షుడు ఆశ్చర్యపోయాడు. 'తిలక్‌ మహాశయా! మీతో సాటిరాగల ప్రజ్ఞావంతులెవరూ లేరు. మీరు అనవసరంగా స్వాతంత్య్రపోరాటంలో కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. విశ్వవేదికలపై మీ అపార పాండిత్యాన్ని ప్రదర్శిస్తే అఖండ ఖ్యాతిని ఆర్జిస్తారు గదా!' అన్నాడు. తిలక్‌ ఇలా సమాధానమిచ్చాడు- 'అధ్యక్ష మహోదయా! దేశానికి స్వాతంత్య్రం వస్తే నావంటి ప్రజ్ఞానిధులు వేలమంది ఉద్భవిస్తారు. నాకు పేరు ప్రఖ్యాతులపై కోరికలేదు. భగవంతుడు నాకిచ్చిన శక్తిని దేశసేవకే వినియోగిస్తాను. నాకంటూ ఏమీ అవసరంలేదు!' ప్రతి ఒక్కరూ ఈ త్యాగమూర్తుల ఆదర్శ జీవితాన్ని స్మరిస్తే 'నాకేంటి'అనే మాట నోట రానేరాదు.
                                                      - డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు 

Sunday 16 June 2013

అదే మనలక్ష్యం!

                                    
    
నమంతా భౌతిక వ్యక్తులం. శుద్ధభక్తిని సాధన చేస్తేకాని పారమార్థిక వ్యక్తులం కాము. భౌతిక వ్యక్తిత్వంతో పరమాత్ముని పొందడం అసాధ్యం. పారమార్థిక భక్తులపై అనుగ్రహం ప్రదర్శించేందుకే భగవంతుడు భూమిపై అవతరిస్తాడని ఉపనిషత్తులు అంటున్నాయి. సముద్రంలో అలలకు మాదిరిగా భక్తి సాధనకూ ఉత్థానపతనాలు ఉంటాయి. ఈ పుణ్యభూమిలో అవతార పురుషుల ద్వారానే భక్తి పునరుద్ధరణకు నోచుకుంటుంది. భగవంతుడు పదిమార్లు మాత్రమే అవతరించాడని మనం అనుకొంటాం. 

దైవాన్ని దశావతారాలకే పరిమితం చేయలేం. ఆకలితో అలమటించేవాడు శుద్ధ భక్తితో- 'తండ్రీ, ఈ ఆకలిని ఈ దేహానికి ఇచ్చింది నీవే. ఆకలిని నివారించేందుకు నా ప్రయత్నాలు ఈ రోజు విఫలమయ్యాయి. ఇక ఈ క్షుద్బాధ నివారణ బాధ్యత నీదే తండ్రీ' అని ప్రార్థిస్తే... ఏ మహానుభావుడి మనసులో కారుణ్యం కలిగి పట్టెడన్నం పెట్టిస్తాడో- ఆ మహానుభావుడి హృదయంలో అవతరించిన కారుణ్యమే పరమాత్మ అవతారం! కొన్నిమార్లు భగవంతుడు ఒకరికోసమే ఏదో రూపంలో అవతరిస్తాడు. రోగికి వైద్యుడు చేసే చికిత్స రూపంలో గానీ, అడవిలో దారి తప్పినవాడికి బాటసారి రూపంలోగాని, దాహార్తికి చెంబెడు నీటిరూపంలోగాని, అవతరిస్తాడు. కావలసిందల్లా విశ్వాసం. విశాలహృదయం, దృఢవిశ్వాసం ఉన్నప్పుడే ఉన్నతమైన పారమార్థిక వ్యక్తిత్వం సాధ్యపడుతుంది. కేవలం సుఖసౌకర్యాలను అనుభవించేందుకే మానవ శరీరం ఉద్దేశితమైలేదు. లౌకిక, ఆధ్యాత్మిక జ్ఞానసముపార్జన కోసమే ఈ శరీరం. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే శుద్ధభక్తి. ఇలాంటి భక్తివల్ల పరమాత్మ శక్తిని అవగతం చేసుకోగలం. నారుపోసినవాడు నీరు పోయడా అని అంటారుగాని, అది చాలా తప్పు. సర్వాన్నీ... దైవాన్ని సైతం... ప్రయత్నించి సాధించుకొనేందుకే ఈ కాయాన్ని ఇచ్చాడు. శోధనలు సాధనలు చేసి మనం అన్నీ సమకూర్చుకోవాలిగాని కోరికలన్నీ తీర్చే మూర్తి గా దైవాన్ని భావించకూడదు. పరమాత్ముడు ఏనుగులకు వాటి శరీరానికి తగిన జ్ఞానాన్ని ఇచ్చాడు. చీమలకు సైతం జ్ఞానాన్ని కల్పించాడు. మనకేం కావాలో దైవానికి తెలియదా? మనం ఇంత చిన్న విషయాన్నీ అర్థం చేసుకోవడం లేదు. రాత్రింబవళ్లు ఈ శరీర అవసరాలకోసం ఎంతగానో పరితపిస్తున్నాం. చివరికి వందల కిలోమీటర్లు ప్రయాణించి తీర్థయాత్ర చేసి మూర్తిమంతుడైన పరమాత్ముడి ముందు నిలబడి కళ్లు మూసుకొని లౌకికపరమైన కోరికలను కోరుకొంటాం.

భగవంతుడు సంపూర్ణుడు. సమగ్రుడు. ఈ దృశ్యజగత్తు కూడా సంపూర్ణమే. పరమాత్మ నుంచి ఉత్పన్నమైనవన్నీ సంపూర్ణాలే. అలా మనమూ సంపూర్ణులమే. దైవశక్తికి అంతమే లేదు. మనం దైవానికి విధేయులమై ఉంటే చాలు... మనకన్నీ సమకూరుతాయి. దైవ విధేయతకు సౌశీల్యం, బలం అవసరం. అంతర్లీనంగా ఉన్న ఈ శక్తిని ఎవరికి వారే ఆవిష్కరించుకోవాలి. అటువంటి శక్తిమంతులే దివ్యమైన ఆత్మానుభూతికి అర్హులు. మనిషి సాధన చేయాల్సిన మహామంత్రం సౌశీల్యం. ఈ గుణంవల్ల కలిగే ఆ శక్తిని భౌతిక ధనంతో సముపార్జించుకోలేం. పారమార్థిక భక్తితో ఎవరికి వారు తమంతట తామే సాధనతో వృద్ధి చేసుకోవాలి. మనిషి సహజంగా ఆనందాన్ని అన్వేషిస్తున్నాడు... దుఃఖాన్ని కాదు. మనం దుఃఖాన్ని కోరడంలేదు కదా మరి బాధలు ఎందుకు కలుగుతున్నాయి? మన జీవితంలో కొంత దుఃఖం కొంత సుఖం తప్పవు. దాన్ని మనం మార్చలేం. కనుక భౌతిక వ్యక్తిత్వం నుంచి బయటపడటానికి ప్రయత్నించాలి. ఇది మనిషి కర్తవ్యం. ఇందుకోసం శుద్ధభక్తిని సాధన చేయాలి. ఇలా చేయడంవల్ల అంతర్యామి అనుగ్రహం కలుగుతుంది. దైవానుగ్రహం కలిగితే మనిషి సత్వస్థితికి చేరతాడు. ఈ ఆధ్యాత్మిక పరిణతి ప్రపంచాన్ని సైతం ప్రభావితం చేస్తుంది. ఆ ఎదుగుదల మనకు ప్రేమను, మరింత ఔదార్యాన్ని అందించే శక్తిని ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మిక దృక్పథంతో మెలగుతూ అహంకారానికి అలజడికి తావులేకుండా నిష్కామంతో కర్మల్ని ఆచరించి చూడండి... ఏం జరుగుతుంది? ఎక్కడో సుదూరంలో ఒక సూక్ష్మప్రభ గోచరిస్తుంది. ఆ వెలుగునే లక్ష్యంగా చేసుకుని అడుగులు వేస్తేచాలు... ఉద్రేకం, ఉద్వేగం, కోపం, ద్వేషం, భయం, అసూయ సమస్తం మన అడుగుల కింద ఆరిపోతాయి. అప్పుడు... మనకు అతి చేరువలో కనపడే ప్రచండమైన వెలుగే దైవం! అదే మన లక్ష్యం!!
                                                     - అప్పరుసు రమాకాంతరావు 

Saturday 15 June 2013

భయం


          భయం మనిషిని ఉద్విగ్నభరితుణ్ని చేసే తీవ్ర మనోవికారం. భయం మనిషితోపాటే పుడుతుంది. చిన్నప్పుడు బూచాడు వస్తాడని అమ్మ చెప్పినప్పుడు భయపడే బిడ్డ భయాన్ని వెంట పెట్టుకుని జీవయాత్ర ప్రారంభిస్తాడు. చదువుకునే చిన్న వయసులో అధ్యాపకులు దండిస్తారనీ, అల్లరి చేష్టలకు తల్లిదండ్రులు కోపిస్తారనీ భయపడుతూ యుక్తవయస్కుడవుతాడు. తానేమిటో సమాజానికి వ్యక్తంచేస్తూ ప్రాపంచిక అనుభవాలతో పరిణతి చెందుతాడు. కడదాకా వెన్నంటి నడిచే మృత్యుభయం దీపం కింద నీడలా ఓ తప్పనిసరి క్రతువని తెలుసుకుంటాడు. భయమనే కంగాళీ వలయంలో మనిషి ఇమిడిపోతూ బతుకు చిత్రం దర్శిస్తూ సాగించే జీవయాత్ర ఎన్నో విచిత్రాల మేళవింపు.

ప్రతి వ్యక్తీ తాను పరిపూర్ణుడననీ, తాను చేసేవేవీ తప్పులు కావనీ భావిస్తాడు. చిత్రంగా ఇతరుల దోషాలే అతడికి కనబడతాయి. ఎవరినీ తప్పుపట్టలేని సందర్భంలో విధిని తూలనాడటం మనిషి దౌర్బల్యం. భయం మూలాలు అతడి కర్మల్లోనే ఉంటాయి. కామక్రోధాది శత్రువర్గంతోపాటు అంతటి ప్రభావవంతమైన శత్రువు భయమే. తన చేతల వల్లే కర్మఫలం సంప్రాప్తిస్తుందని మరచే మనిషి, కష్టాలు దరిచేరినప్పుడు దైవంపైనా నింద వేస్తాడు. అది చిత్రమైన ప్రవర్తన. మానవుడు తనలో ఉండే కామక్రోధాది ఆరుగురు శత్రువులు దాడి చేయకుండా ఓర్పుతో, నేర్పుతో జీవించే ప్రయత్నం చేయాలి. అటువంటి సత్ప్రయత్నాన్నే సాధన అంటారు.

భయాన్నుంచి రక్షించగల ఏకైక ఆపన్నహస్తం ఆధ్మాత్మిక శక్తే. ఆధ్యాత్మిక సాధనవల్ల భయం దూరమవుతుందని మన ప్రాచీన రుషులు సూత్రీకరించారు. పరమాత్మను జపధ్యానాలతో అంతర్ముఖుని చేసుకున్నప్పుడు ప్రాపంచిక భయాలు మనిషిపై పట్టు కోల్పోతాయి. భక్తి జ్ఞాన వైరాగ్యాలవల్ల లౌకిక వాంఛల ఉద్ధృతీ తగ్గుతుంది. సాధారణంగా ఉన్నది కోల్పోతానేమోననీ, కోరుకున్నది దొరకదేమోననీ మనిషి భయపడతాడు. తనను రక్షించేది ఆత్మశక్తే అని తెలుసుకున్న మరుక్షణం, మనిషి చింత చాలావరకు దూరమవుతుంది.

ఒక సాధకుడు ధ్యాన సాధన కోసం జనవాహినికి దూరంగా వెళ్లాలనుకున్నాడు. అడవిమార్గం గుండా ప్రయాణించి ఓ పల్లెకు చేరుకున్నాడు. ఒక పాడుబడ్డ పూరింటిని ఆశ్రయించి వస్త్రం పరచుకుని ధ్యానానికి ఉపక్రమించాడు. అంతలో, 'చిరుత... చిరుత వస్తోంది!' అంటూ ఎవరివో అరుపులు దూరంగా వినిపించాయి. సాధకుడు అప్రమత్తుడై తడక తలుపు వేసి లోపల గడియ పెట్టుకున్నాడు. అలా చేస్తే తడక తోసుకొని చిరుత లోపలికి ప్రవేశించలేదని అతడి విశ్వాసం. కొద్ది క్షణాలయ్యాక అతడిలో వివేకం జాగృతమైంది. ఆత్మసాధనకు అడ్డంకిగా ఉన్న అవరోధాలను అధిగమించడానికి ఇంతదూరం వచ్చి చిరుత దాడి చేస్తుందేమోనని భయపడి ఆత్మరక్షణ కోసం తలుపు మూసిపెట్టడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించుకున్నాడు. వెంటనే తలుపు తెరిచాడు. వెలుపలికి వచ్చి నిశ్చింతగా ధ్యానసాధన కొనసాగించాడు. కొంచెం సేపయ్యాక చిరుత అటు రానే వచ్చింది. ధ్యాననిమగ్నుడై ఉన్న సాధకుడి ముఖంలోకి చాలాసేపు తదేకంగా చూసి వెనుదిరిగి అక్కడినుంచి వెళ్లిపోయింది.

మనసు కల్పించే మహా మాయ 'భయం!' సాధన క్రమంలో భ్రాంతుల మాయాజాలం నుంచి బయటపడి భయాన్ని నివారించుకునే ప్రయత్నం చేయాలి. 'దేనికీ భయపడవద్దు. భయపడిన మరుక్షణం మీరు ఎందుకూ పనికిరాకుండా పోతారు... ఈ ప్రపంచంలో దుఃఖానికి మూలకారణం భయమే. నిర్భయత్వమే మనకు స్వర్గాన్ని ప్రసాదించగలదు. భయరాహిత్యమే అనిర్వచనీయమైన మనశ్శాంతికి మార్గం' అన్న స్వామి వివేకానంద పలుకులు సదా స్మరణీయం.
                                                          - గోపాలుని రఘుపతిరావు

Friday 14 June 2013

స్వయంభువు..

                          

     నిషినెవరు సృష్టించారు? భగవంతుడు... అని భగవంతుడు చెప్పాడా? మనం అనుకుంటున్నాం. అంటే ఎవరూ సృజించలేదు. ప్రతి మనిషీ 'నేను' అనుకుంటూ తనకొక ప్రత్యేక గుర్తింపును, ఉనికిని తనకు తాను సృష్టించుకుంటున్నాడు. 'నేను' అంటే ఎవరు? నిజానికి మనిషికి, అంటే మనకు తెలీదు. నిజానికి చాలామందికి తెలుసు. ఏమిటీ భిన్న వ్యక్తీకరణ? నిజమే అయితే రెండూ నిజమే. తెలీని అమాయక స్థితిలో చాలామంది, తెలిసీ చెప్పలేని ఆత్మస్థితిలో మరెంతోమంది ఉంటున్నారు. మధ్యస్థ మిడిమిడి జ్ఞానం మనను అయోమయంలో పడేస్తోంది. తెలిసీ ఇంకా చెప్పగల స్థితిలో ఉండి చెప్పే మహానుభావుల అభిప్రాయం... 'నేను' అంటే దేహస్థితి కాదు. బాహ్యస్థితి కాదు. ఆది లేని, అంతం లేని ఆత్మ ధృతి. నివురుగప్పిన నిప్పులా లోలోన ప్రజ్వరిల్లుతున్న ఎప్పుడూ 'శాంతికాని' మహా కాంతి దీపం. ఎన్నడూ వాడని అనంత శాంతి పుష్పం.

దేహం అంటే సప్త ధాతువులు, పంచ కోశాలు, వాయువులు, నాడులు. ఆత్మను కప్పిఉంచిన ఆధారాలు. ఆధరువులు. ఔను... బంగారు పళ్లానికి కూడా గోడ చేర్పు కావాలి. వజ్రానికీ బంగారు ఆభరణపు ఆధారం కావాలి. జీవాత్మకు దాన్ని నిలిపి ఉంచగల ఉపాధి కావాలి. అదే దేహం. పంచకోశ నిర్మిత దేహం. పంచభూత సమన్విత దేహం. ఆ మహోన్నతమైన ఆత్మస్థితిని, స్థాయిని ధరించగల ఒక వజ్రకవచం, ఒక అమృత కలశం కావాలి. కాబట్టే రక్త మాంస సంతులితమైన దేహాన్ని డెబ్భైరెండు వేల నాడులతో, పంచకోశాలతో, వాయువులతో, ఇరవైతొమ్మిది తత్వాలతో, ఆధ్యాత్మిక హృదయంతో (కుడివైపున ఉంటుంది), మేరు దండంతో, దానిలోని షట్‌ చక్రాలతో, ఇడా పింగళ సుషుమ్న నాడులతో, సహస్రార కమలంతో అత్యున్నతంగా, పరమోత్కృష్టంగా అలంకరించాడు భగవంతుడు. వాటన్నింటినీ కాపాడేందుకు, సమన్వయం చేసేందుకు రుధిరం, మజ్జ, అస్థులు, నేత్రాలు, చక్రాలు, జిహ్వ... ఒకటేమిటి అంగుళమంగుళాన ఒక అధిష్ఠాన దేవత. అంటే ఆత్మ శాశ్వతం అయినప్పుడు, ఎవరూ సృజించనిదైనప్పుడు దాని ఉపాధి అయిన శరీరాన్ని మాత్రం మరెవరో సృష్టించారా? ఆలోచిద్దాం... సాలెపురుగు తన చుట్టూ తన రక్షణ కోసం తానే అందమైన, భద్రమైన గూడు అల్లుకుంటుంది. అవసరం తీరిపోయాక ఆ గూడును మళ్ళీ తనలోకే లయం చేసుకుంటుంది. ఆత్మ అవధానమూ అంతే. అమృతాత్మ స్వరూపుడైన మానవుడు ఒక్కసారి కుబుసంలా తన దేహకోశాన్ని విస్మరిస్తే, విదిలిస్తే, వదిలేస్తే ఆత్మ కుండలిని తేజో విరాజమానం అవుతుంది.

దేహం రక్షక పత్ర సమానం. సుందర సుకుమార సుమాన్ని ధరించినంత మాత్రాన అదే పుష్పమై పోదు. రక్షక పత్రాలు వాలిపోవలసిందే. రాలిపోవలసిందే. పుష్పం జగజ్జేయమానంగా వికసించి వెలిగిపోవలసిందే.

మనిషి 'నేను'ను శరీరమే అనుకున్నప్పుడు, ఆ దేహభావంతో తాదాత్మ్యం చెందినప్పుడు... ఆ దేహాన్ని సృజించినవాడు... అనుమానమేల... ఆ భగవంతుడే. 'నేను' ఆత్మే అనుకున్నప్పుడు ఆత్మకు జనన మరణాలు లేవు. సృజన సంహారాలు లేవు. ఆత్మ శాశ్వతుడే. స్వయంభువే. ఈ సృష్టిలో ఒక శాశ్వత నియమం ఉంది. ఏ పదార్థాన్నీ ఎవరూ సృష్టించలేదు. నాశమూ చేయలేరు. ఆ శక్తి ఒక్క భగవంతుడికి మాత్రమే ఉంది. ఎవరైనా దేన్నైనా సృష్టించారంటే మరో చోటునుంచి తెచ్చుకోవటమే. నాశనం చేశారంటే మరో రూపంలోకి మార్పు చెందటమే. వాయువు నీరవుతుంది. నీరు మంచు అవుతుంది, మళ్ళీ మంచు నీరవుతుంది. నీరు వాయువవుతుంది. కేవలం మార్పు అంతే. ఉన్నదేదో ఉంది. అది పోదు. లేనిదేదీ రాదు.

మనిషి కృత్రిమ 'నేను'లోంచి బయటపడాలి. స్వయంభువు జాగృతం కావాలి. మహితాత్మకం కావాలి. దానికి... ఈ శరీరంతో తాదాత్మ్యం చెందిన మనిషి సాధనతో కొంత- కాదు- సాధికారతతో ఎంతో ఉపచారం చేయాలి. దేహభావంలోంచి తొలుచుకుని ఆత్మభావంలోకి చేరుకోవాలి. నేను అసలు నేనులోకి తాదాత్మ్యం చెందితే ఇక నేను, నీవు, దేహం, సృజన, మరోటీ మరోటీ... ఏదీ లేని శుద్ధాత్మ. అంతా... అహం బ్రహ్మాస్మి!
                                                                   - చక్కిలం విజయలక్ష్మి 

Thursday 13 June 2013

కోరికలే గుర్రాలైతే...

                       
   
       
నిషి మనసు కోరికలకు పుట్టిల్లు. మనసులోని తపన, ఆరాటమే కోరిక. దైనందిన జీవితంలో ఎప్పుడూ ఏదో కావాలనే అనిపిస్తూంటుంది. అది దొరికాక మరోటి. అదీ లభించాక మరోటి. ఇలా చెలమను తోడినకొద్దీ నీరూరినట్టు కోరికలు తీరినకొద్దీ మనసులోంచి కొత్తవి ఊరుతూనే ఉంటాయి. మనసు అనే కొలిమిలో కోరిక అనే ఇంధనం వేసినకొద్దీ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా పెరగడమేకాని, తరగడమంటూ ఉండదు. తృప్తి ఉండదు. ఆనందం ఉండదు. సుఖశాంతులూ ఉండవు. కళ్లెం వేయకపోతే కోరికలు గుర్రాలై పరుగెడుతూనే ఉంటాయి.
                           
కోరికలు ప్రాపంచికంగా కోరుకునేవి, వృత్తిరీత్యా కోరుకునేవి, కుటుంబపరంగా, సమాజపరంగా... ఇలా చాలా విధాలుగా మనసులోంచి పుడుతుంటాయి. ఉన్నతమైనవీ, అధమమైనవీ మాత్రమే కాక- కోరికలు బలమైనవీ, బలీయమైనవీ, బలహీనమైనవీ కూడా ఉంటాయి. మానసిక శాస్త్రజ్ఞుల పరిశోధనల ప్రకారం- ప్రపంచంలో నూటికి ముగ్గురే అనుకున్నది కొంతమేరకు సాధించగలుగుతున్నారట. కోరిక అవసరాన్ని గుర్తించడం, సరైన కార్యాచరణకు పూనుకోవడమే వివేకవంతుడి లక్షణం. జీవనప్రగతికి అవసరంకాని కోరికకోసం మూర్ఖంగా ముందుకు పోవడం, అసలు లక్ష్యానికి ఉపయోగపడే ఆశయాలను, కోరికలను ఉపేక్షించడం విజ్ఞత అనిపించుకోదు. 'లోకంలో అత్యంత ప్రమాదకరమైన కోరికలు మూడే మూడు... వాటి వెంటపడ్డావంటే నీకు మూడటం ఖాయం' అని పెద్దలు చెబుతుంటారు. వీటిలో మొదటిది ధనంమీది వ్యామోహం, రెండోది పరస్త్రీ వ్యామోహం, మూడోది కీర్తి మీది వ్యామోహం.

ధనార్జనమీద కోరిక మితంగా ఉండాలే కాని, ఆక్రమించి, దోచి, దాచుకోవాలనే అత్యాశ ఎంతమాత్రం వాంఛనీయం కాదు. ఆఖండ సామ్రాజ్యానికి అధిపతి కావాలనే దురాశతో దాయాదులను అడవులపాల్జేసి మహాభారత సంగ్రామానికి కారణభూతుడైన దుర్యోధనుడి చరిత్ర తెలియనిది కాదు. అంతిమశ్వాస తరవాత తనకు అవసరమైన నేల ఆరడుగులేనని తెలిసీ వేలాది ఎకరాల భూమికోసం ఆరాటపడటంలోని ఔచిత్యమేమిటి?విపరీత ధనార్జనకు దాసులై తద్వారా సామ్రాజ్య విస్తరణ, పదవీ కాంక్ష, సార్వభౌమత్వం మొదలైన అత్యాశలకు లోనై చరిత్రహీనులుగా మిగిలిపోయినవారెందరో ఉన్నారు.

ఒక బాటసారి తలపైన డబ్బు మూట పెట్టుకుని, భార్యాబిడ్డలతో నదిని దాటుతున్నాడు. అకస్మాత్తుగా నదీ ప్రవాహ వేగం పెరిగింది. ఆ వేగాన్ని తట్టుకోలేక, బిడ్డను వదిలేశాడు. కొన్ని అడుగులు వేశాక, నీటి ఉరవడిని ఎదుర్కోలేక భార్యని వదిలేశాడు. డబ్బు మూట ఉంటే ఏదైనా సాధించవచ్చనుకున్నాడు. మరికొంత దూరం వెళ్లాక నీటివరద ఉద్ధృతమై- ఆ డబ్బు మూటనూ నీటిలో వదిలేశాడు. చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా చివరకు ఖాళీ చేతులతో ఒడ్డుకుచేరి ఏడవటం మొదలెట్టాడు. సంసారసాగరం ఈదాలన్నా ఇలాంటి కష్టాలే ఎదురవుతాయి. ఈ వివేచన ముందే ఉంటే ఏ సమస్యలూ ఉత్పన్నం కావు.

రెండోది పరస్త్రీ వ్యామోహం. నేడీ కోరిక ఎన్ని ప్రమాదాలకీ, ఘోరాలకీ హేతువవుతుందో ప్రత్యక్షంగా, పరోక్షంగా చూస్తున్నాం, వింటున్నాం. సీతను చెరపట్టిన రావణుడు, ద్రౌపదిని పరాభవించిన దుర్యోధనుడు, కామాంధుడైన కీచకుడు... ఆనాడు ఒక్కొక్కరే. ఇవాళ అడుగుడుగునా వేలాది కామోన్మాదులు చట్టానికీ, న్యాయవ్యవస్థకూ చిక్కకుండా తప్పించుకుపోతున్నారు. స్త్రీ కోసం ఎన్ని కలహాలు, ఎన్ని హత్యలు, ఎన్ని కుతంత్రాలు!

మూడోది కీర్తికాంక్ష. ఏమీ కృషి చేయకుండా, సేవచేయకుండా, స్వార్థపూరిత జీవితం కొనసాగిస్తూ కీర్తికోసం వెంపర్లాడటం అంటే ఎండమావుల్లో జలాన్వేషణ చేయడమే. సహజమైన యశస్సు విరజాజిలోని సురభిలా గుబాళిస్తుంది. ధర్మబద్ధుడై, నీతిమంతుడై నిస్వార్థంగా పరహితవ్రతుడైన మనిషిని ప్రతిష్ఠ తనంత తానుగా వరించి వస్తుంది. భగవంతుడి గుర్తింపు పొందినవాడు సహజంగానే చిర యశోభూషితుడవుతాడు. విదురుడు, అంబరీషుడు, రామకృష్ణ పరమహంస మొదలైనవారెందరో ఈ కోవలో చిరస్మరణీయులు. అశోకుడు, శివాజీ, అల్లూరి, భగత్‌సింగ్‌, ఝాన్సీ వంటివారెవ్వరూ కీర్తిని కోరి త్యాగాలు చెయ్యలేదు. వ్యాసుడు, వాల్మీకి, పోతనవంటి మహానుభావులు 'విశ్వశ్రేయఃకావ్యమ్‌' అన్న సదాశయంతోనే సాహితీ సమారాధన చేశారు. త్యాగయ్య, అన్నమయ్య, గోపన్న భక్తి తత్పరతతో సప్తస్వర సమార్చన చేశారు. అవినీతితో, దొడ్డిదారిలో అధికారాలు, న్యాయకత్వాలు చేపట్టి పదిమందీ బ్రహ్మరథం పట్టాలనుకునే మనస్తత్వం పోవాలి. రుజువర్తనతో నిష్కళంక ప్రజాసేవ ద్వారా మాన్యత పొందడం సాధ్యమని గ్రహించాలి.
                                               - చిమ్మపూడి శ్రీరామమూర్తి 
                                                                                                                                                                                       

పవిత్రత..


తామెంతో ఆచారవంతులమని భావించేవారు అస్పృశ్యత పాటిస్తుంటారు. శుచిగా ఉండవలసిన సందర్భాలు కొన్ని ఉంటాయి. అంతరాలయంలోని మూలవిరాట్టుకు అభిషేక, అలంకారాది సేవలు చేస్తున్నప్పుడు, అలా చేసేవారు ఎవరినీ తాకరు. తాకకూడదనేది ఆచార సంప్రదాయం. తప్పు లేదు. కానీ, ఈ ధోరణి అంతటా సందర్భరహితంగా కొనసాగిస్తే మాత్రం అది గర్హనీయమే అవుతుంది.
                         శుచి, శుభ్రత మన జీవితంలో ఒక భాగం కావాలి. లేకపోతే మనల్ని అనారోగ్యాలు కమ్ముకునే ప్రమాదం ఉంది. శస్త్రచికిత్స సమయంలో వైద్యులు ఎంతో శుచిగా ఉంటారు. ఆ సందర్భంలో శస్త్ర చికిత్సామందిరంలోకి ఇతరులకు ప్రవేశం ఉండదు. ఆ సమయంలో అది రోగికి ప్రాణదానం చేసే అపర దేవాలయం.

ఈ రెండు సందర్భాలూ తప్ప ఇంకెక్కడ అస్పృశ్యత పాటించినా అది ఇతరుల్ని అవమానించటమే అవుతుంది. శుభ్రత- అపరిశుభ్రతల తేడాలు తప్ప జాతి, మత, కుల భేదాలు అస్పృశ్యతకు కారణం కారాదు. ఆధ్యాత్మిక దృష్టితో చూసినా అపరిశుభ్రత సరైంది కాదు.

ఆదిశంకరులకు చండాలరూపుడై పరమశివుడు ఎదురైన ఘటన గుర్తుందా? 'తప్పుకో... తప్పుకో...' అని హెచ్చరించగా 'ఎవరు తప్పుకోవాలి, ఏది తప్పుకోవాలి, అశాశ్వతమైన శరీరమా, శాశ్వతమైన ఆత్మా?' అని ఎదురు ప్రశ్నించి అజ్ఞానపు తెరలు తొలగించాడు శివుడు. ఈ ఉదంతం అందరికీ ఆదర్శ పాఠంగా గుర్తుండాలి. ఎందుకంటే, అణుదీపిక లాంటి ఆత్మ అనేక శరీరాల్లో ప్రభవిస్తోంది. ఆత్మ నిష్క్రమిస్తే శరీరం శవమే. చండాలుడిలోనూ శివాంశ ఉంటుందనేదే ఆదిశంకరుల జ్ఞానోదయ కథలోని సారాంశం.

శుచిగా ఉన్నవారందరూ పవిత్రులుగా చెప్పలేం.
పవిత్రులు శుచిగా ఉండి తీరాల్సిన అవసరం లేదు.
పవిత్రత శరీరానికి సంబంధించింది కాదు. మనసుకు సంబంధించింది. భావశుద్ధివల్ల మన చర్యలు నిష్కళంకంగా ఉంటాయి. ఈ సందర్భంగా మనం రామకృష్ణ-వివేకానందులకు సంబంధించిన సంఘటన ఒకటి స్మరించుకోవాలి.

రామకృష్ణుడు శుద్ధ శాకాహారి. శిష్యుల్నీ అలాగే ఉండాలని ఆదేశించేవారు. ఒకసారి వివేకానందుడు చేపలు తిన్నాడని ఇతర శిష్యులు నేరంగా గురువుగారికి చెప్పారు. ఆయన 'వివేకానందుడికి ఏ దోషమూ అంటదు. కారణం- అతడి మనసు తినేవాటిమీద ఉండదు. మీరు అలా కాదు. అందుకే మీకు ఆంక్షలు. అతడికి అలాంటివి అవసరం లేదు' అని చెప్పారట.

శరీర శుభ్రతనే కాదు- మనసునూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంతరాలయ శుభ్రతలో అర్చకులు ఎంత శ్రద్ధ చూపుతారో, ఆధ్యాత్మిక సాధకులూ అంతరంగ శుభ్రతలో అంతటి శ్రద్ధ పాటించాలి. అప్పుడే దేహం దేవాలయమవుతుంది. అంతరంగం అంతరాలయమై విలసిల్లుతుంది. అంతర్యామి మూలవిరాట్టు అవుతాడు.
                 
అంతరంగ స్వచ్ఛతే అసలు పవిత్రత. పరిమళ ద్రవ్యాలు శరీరాన్ని పరిమళింపజేయగలవు భావాలను కాదు. పవిత్రులకు హృదయాల్లో అంతర్యామి దర్శనం లభిస్తూనే ఉంటుంది. 
                                                                                                                                                                                                  - కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌ 


Tuesday 11 June 2013

ఆత్మవిమర్శ


    మానవ జీవితం చల్లగా, హాయిగా, సుఖప్రదంగా సాగిపోవాలి. మానవుల మధ్య బంధం పటిష్ఠంగా ఉండాలి. పరస్పర గౌరవాదులతో, అనురాగాభిమానాలతో కొనసాగాలి. వైషమ్యాలు, స్పర్ధలు, అసూయాద్వేషాలు, అంతరాల పోరాటాలు ఆధిక్యతా ధోరణులు అంతరించాలి. నిజానికివి లేని ప్రపంచం స్వర్గంతో సమానం. సృష్టి, వినాశనం రెండూ మానవుడి చేతిలోనే ఉన్నాయి.

ఓవైపు ప్రవాహంలో వ్యర్థ కాలుష్యాలు ఎత్తిపోస్తూ- మరోవైపు శుద్ధ జలంకోసం అర్రులు సాచడం అవివేకమే. నేడు మనం చూస్తున్న విచిత్ర పోకడ ఏమిటి? మానవుడు ద్వైదీభావనలతో- భావంతో ఒకతీరుగా, బాహ్యంలో ఒకతీరుగా చరిస్తూ రుజువర్తనా శైలికి గండికొట్టుకుంటున్నాడు. ఇది తాను కూర్చున్న కొమ్మను తానే నరికివేసుకునే చందం. అపోహలు, అనర్థాలు, అనుచితమైన కార్యకలాపాలవల్ల తనకు తానే ఓ పెను సమస్యగా మారిపోతున్నాడు. ఇది వెలుగుతున్న జీవనజ్యోతిని కొడిగట్టుకునేలా చేసుకోవడమే. స్వయంకృత వికృతాలే ఇవన్నీ.

ఇంతటి అస్తవ్యస్త పరిస్థితికి ఒక్కటే కారణం. ఆత్మవిమర్శ లేకపోవడమే. ఒకవేళ ఉన్నా దాన్ని అహంకార ధోరణితోనో, సమర్థింపుల ధోరణితోనో అణగదొక్కుకోవడమే. ఎంతటివారికైనా జీవనయానం మంచి చెడుల మిశ్రమమే. ప్రతి అడుగు జాగరూకతతో వేయాలి. తీసుకునే ప్రతి నిర్ణయం సఫలీకృతం కావాలి. ఏకాకిగా ఎవరూ మనలేరు. సంఘజీవిగా సంఘటితంగా జీవించాలి. వ్యక్తి ఉన్నతి, సుఖ సంతోషాలు సహచర జీవితాలతోనే ముడివడి ఉంటాయి. మనిషికి మనిషికి మధ్య బంధం దృఢంగా ఉండి తీరాలి. మన చేతలు, భావాలు మనకు సవ్యంగా ఉన్నట్టే స్ఫురిస్తాయి. ఒకవేళ 'తేడా' పొడచూపినా స్వార్థం, స్వప్రయోజన కాంక్షలు ముసుగువేసేస్తాయి.

ఏది మంచో ఏది చెడో, ఏది సవ్యమో ఏది అపసవ్యమో తెలీనివాడు కాదు మనిషన్నవాడు. నిప్పు కాలుతుందని తెలీదా, వరదనీరు ముంచుతుందని తెలీదా? దైనందిన జీవితంలో మాట, చేత ముఖ్య భూమికలు పోషిస్తాయి. ఈ రెంటికీ పొంతన అవసరం. విమర్శ చేసుకోవడం అంతకన్నా ముఖ్యం.

మంచి చెడులను విశ్లేషించుకొనడమే విమర్శ. 'నేను' అనేది ఆత్మ స్వరూపం. ఆత్మ విమర్శతో కూడిన మాటలు, చేతలు శుద్ధత్వంతో ఉంటాయి. ప్రయోజనకారిగా ఉంటాయి. సర్వజనామోదంగా ఉంటాయి. క్షీర నీరాలను హంస ఏ విధంగా వేరు చేస్తుందో, ఆత్మ విమర్శ యుక్తాయుక్తాలను ఆ విధంగానే ఎంచి చూడగలుగుతుంది. సన్మార్గ బోధినిగా ఉంటుంది. మాటకు మర్యాద, మన్నన; చేతకు పూర్ణత్వం, ఫలత్వం- ఆత్మవిమర్శవల్లే సాధ్యం! లక్ష్య సాధనల్లో ముందస్తు 'విమర్శ' సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకొనగలుగుతుంది.

ఇదొక ధర్మపీఠం. ధర్మపథాన్ని చూపుతుంది. మనసు ఆ పథంవైపు పయనించాలి. పచ్చని చెట్టును మోడులా, మోడును చిగురింపజేసే శక్తిలా, మనసు అద్భుతాలే చేస్తుంది.

ప్రతి ఒక్కరూ నూరేళ్ల జీవితాన్ని ఫలవంతం చేసుకోవాలి. జీవనగమ్యాలు చేరుకోగలగాలి. తనకు తానే ఓ ప్రబోధకుడిగా మారాలి. ఆత్మవిమర్శ లేని భావాలు, చర్యలు విరుచుకుపడే జలప్రవాహంలానే ఉంటాయి. దుందుడుకుగా, ఏకరీతిగా సాగిపోయే తీరు ప్రతికూల ఫలితాలనే కట్టబెడతాయి. ఆత్మవిమర్శ పరుగులుతీసే జలప్రవాహానికి అడ్డుకట్ట లాంటిది. జలం స్థిరంగా ఉండిపోతే కాలుష్యాలన్నీ అడుగుకు చేరుకుంటాయి. స్వచ్ఛమైన జలం పైకి తేరుకుంటుంది.

జీవితంకూడా స్వచ్ఛంగా ఉండాలి. అంతరాత్మ పారదర్శకంగా తయారు కావాలి. అప్పుడే తానొక తెరచిన పుస్తకం. ఆ పుస్తకంలోని పుటలన్నీ సువర్ణాక్షరమయమే. ఆత్మవిమర్శతో కూడిన ఆచరణే ఇందుకు దోహదపడుతుందని తెలుసుకోవాలి.
                                                           - దానం శివప్రసాదరావు