ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday 30 September 2013

ఆలోచనాలోచనం


 మనిషి జీవించి ఉన్నంతవరకు ఆలోచనల నుంచి తప్పించుకోలేడు. మంచో, చెడో ఏదో ఆలోచన చేస్తూనే ఉంటాడు. జ్ఞానాంగాలతో గ్రహించగలిగే పూర్వాపరాల మనోపరిశీలనే ఆలోచన. ఒక వస్తువు లేదా విషయం మీద మనసును కేంద్రీకరించినప్పుడు ఆవిర్భవించే భావతరంగమే ఆలోచన. వూహకీ, విశ్లేషణకీ, విచక్షణకీ, ఆచరణకీ, అభివ్యక్తికీ ఈ ఆలోచనే మూలమవుతుంది. కన్నవీ, కననివీ, విన్నవీ, విననివీ... అన్నీ ఆలోచనలకు ఉత్ప్రేరకాలే. చెలమ మనసైతే, చెలమలోంచి ఊరే నీటి వూట ఆలోచన. నేల మంచిదైతే, నీరు తియ్యగానే ఉంటుంది. నేల మంచిది కాకపోతే, ఆ నీటి చుక్కను కూడా ముట్టలేం.
మంచి ఆలోచనలకు మూలం మంచి మనసు. మనసు నిర్మలమైనప్పుడు, అందులోంచి ఉదయించే భావాలు, వూహలు, ఆలోచనలు అన్నీ నిర్మలంగానే భాసిస్తాయి. అలాంటి ఆలోచనలు ఆలోచించేవారినే కాక, ఎదుటివారినీ ఆహ్లాదపరుస్తాయి.

ఆలోచించడానికి సమయం తప్పనిసరిగా కేటాయించుకునేవాళ్లు కొందరైతే, సమయం గడపడానికి- వ్యర్థమైన ఆలోచనల్ని ఆహ్వానించుకునే నిరర్థకులు కొందరు.

అందుకే ప్రతి మనిషీ ఏ విషయమై ఎంతవరకు ఎలా ఆలోచించాలో ప్రణాళికాబద్ధతను అలవరచుకోవాలి. విపత్కర, విషమ పరిస్థితుల్లో తీవ్రమైన భావోద్వేగాలకు, ప్రతికూల స్పందనలకు బానిసలై, కర్తవ్యతా విమూఢులై చేజేతులా జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్న వాళ్లెంతో మందిని మనం చూస్తున్నాం. ఆలోచనా సరళిలోని లోపాలు, బలహీనతలే ఇందుకు కారణమని చెప్పాలి. మనిషి వ్యక్తిత్వం ఈ ఆలోచనలశైలి మీదనే ఆధారపడి ఉంది. మనిషి భవితవ్యం ఈ ఆలోచనల ధోరణి మీదనే ఆధారపడి ఉంది. పరిస్థితులు, సాటివారి సంభాషణ, ఎదురవుతున్న సమస్యలు, కష్టాలు- వీటినిబట్టి ఆలోచనలను ఎప్పటికప్పుడు సవరించుకుంటూ, మార్చుకుంటూ, తగిన నిర్ణయాలు తీసుకుంటూండాలి. తమ ఆలోచనలనీ, నిర్ణయాలనీ కుటుంబ సభ్యులు, మిత్రులమీద బలవంతంగా రుద్దకూడదు. తన ఆలోచనల్లో పొరపాట్లు జరిగినప్పుడు నిస్సంకోచంగా పశ్చాత్తాపం ప్రకటించాలి. అదే ఉత్తమ మానవుడి లక్షణం.

అపరిమితమైన ఆలోచనలు ఆచరణలకు అవరోధం అవుతుంటాయి. అలాగే ఆలోచనా శూన్యత కూడా మనిషిని నిస్సహాయుణ్ని చేస్తుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేని ఆలోచనలు మనిషిని నిరాశా నిస్పృహలకు గురిచేస్తాయి.

శ్రీరాముడు తగిన సమయంలో వనవాస నిర్ణయం తీసుకోకపోతే పితృవాక్య పాలనా దక్షుడు అనిపించుకోగలిగేవాడు కాదు.

పరస్త్రీ వ్యామోహం వల్ల కలిగిన దురాలోచనల ఫలితంగానే పతనమైపోయాడు రావణాసురుడు.

దుర్యోధనుడు భూమి, పదవి, అధికార వ్యామోహపీడితుడై దాయాదులను హింసించి, అపమార్గాలోచనాదాసుడై అపఖ్యాతిపాలైనాడు. పౌరాణిక గాథల్లో ఇలాటి ఉదాహరణలు కోకొల్లలు.

మనిషి తనను తాను తెలుసుకోగలిగే ఆలోచనలు చేసినప్పుడు 'ఆత్మజ్ఞాని' అవుతాడు. ఆ ఒక్క బిరుదు చాలు- మంచి మనిషిగా జీవించడానికి!

- చిమ్మపూడి శ్రీరామమూర్తి

Sunday 29 September 2013

యాత్రాఫలం


పూర్వీకులు భగవదారాధన కోసమో, జీవితంలో ఏర్పడ్డ ఒత్తిళ్లను అధిగమించడానికో సంవత్సరానికోసారైనా యాత్రలకు వెళ్ళేవారు. అదొక సనాతన సంప్రదాయమైంది. సాధారణంగా వయసుపైబడిన వాళ్లు ఆధ్యాత్మిక చింతన అలవరచుకొని దేవుణ్ని వెతుక్కుంటూ తీర్థయాత్రలు చేస్తూ ఉపశమనం పొందేవారు. వేద భూమి అయిన మనదేశంలో అసంఖ్యాకమైన యాత్రాస్థలాలు ఏర్పడ్డాయి. వేర్వేరు స్థల పురాణాలతో దేవాలయాలు అవతరించాయి.
చాలావరకు యాత్రాస్థలాలు నదీ పరీవాహక ప్రదేశాల్లోనో, కొండలమీదనో ఉన్నాయి. అక్కడైతే పవిత్రంగా ఉంటాయనే భావన ప్రబలంగా ఉంది.

యాత్రలకు వెళ్ళి దైవదర్శనం చేసుకొని కంచు, రాగి పూజాసామగ్రిని, పుస్తకాలను తెచ్చుకుంటూ ఉంటారు. అక్కడ ప్రవహించే నదీ జలాలను, ప్రసాదాలను తెచ్చి ఇరుగుపొరుగులకు పంచడంలో ఎందరో తృప్తి పొందుతారు. ఆ దేవుళ్ల కథలను పూసగుచ్చినట్టుగా చెప్పేవారూ ఉన్నారు. అవన్నీ యాత్రలో అంతర్భాగాలే.

ప్రయాణ సదుపాయాలు పెరిగి, నాగరికత వెల్లివిరిసి యాత్రాస్థలాల్ని 'గొలుసుకట్టు'గా దర్శించే ఏర్పాట్లు జరిగాయి. దేవాలయాల సమీపంలో సత్రాలు, ఉచిత భోజన ఏర్పాట్లు రావడంతో యాత్రలకు వెళ్ళేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రత్యేక పూజలు ఏర్పడ్డాయి. ధ్యానం కోసం మందిరాలు ఏర్పాటయ్యాయి. నిశ్శబ్దానికి గౌరవ ప్రదమైన స్థానం దక్కింది. యాత్రల కోసం ప్రత్యేక నిధులు ఏర్పరచుకొని కొన్ని కుటుంబాలు ఉమ్మడిగా వెళ్ళడం చూస్తూనే ఉన్నాం.

హిమాలయాల్లో అమర్‌నాథ్‌ మంచులింగ యాత్ర నుంచి పక్కనే ఉన్న గ్రామదేవతను దర్శించడం వరకు మన వ్యవహార శైలిని మెరుగుపరుస్తున్నవే. మానసిక క్రమశిక్షణను అలవాటు చేస్తున్నవే. యాత్రలో వివిధ భాషా సంస్కృతుల్ని మనం గమనిస్తుంటాం. వాటిని గౌరవించి శుచిగా, శుభ్రంగా ఆ ప్రాంతాల రీతి, రివాజులను ఆపాదించుకొని ధన్యజీవులమవుతాం. కాశీలో గంగాదేవికిచ్చే హారతి జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాలి. హరిద్వార్‌, సోమ్‌నాథ్‌, వైష్ణోదేవి, శిరిడి మొదలైన తీర్థయాత్రల్లో వైవిధ్యాన్ని గమనిస్తూ మరిన్ని యాత్రలు చేయాలనే ఉత్సుకతతో మనసును పునీతం చేసుకుంటారు. ఆ హారతులతో మనసులు పులకించి చైతన్యవంతులవుతారు. యాత్ర ప్రారంభించి తిరిగి ఇంటికొచ్చే వరకు జరిగే ప్రతి అంశం మనసులో పవిత్రమైన ముద్రగా మిగిలిపోతుంది. పుస్తకాలు చదివేకన్నా ఎక్కువ అనుభవాన్ని గడిస్తాం. దైవ సందేశం మనసును సూటిగా తాకుతుంది.

యాత్రలకు ఒంటరిగా కాకుండా మిత్రులతోనో ఇరుగుపొరుగులతోనో కుటుంబ సభ్యులతోనో వెళ్ళడం స్నేహసంబంధాన్ని ఏర్పరుస్తుంది. తిరుమల కొండకు నడక దారిన బయల్దేరేటప్పుడు గుంపుగా వెళ్ళడంవల్ల శ్రమను మరిచిపోతాం. గోవిందనామాల పాటలతో పరిసరాలు మార్మోగడం గమనిస్తాం. హారతిలో మూలవిరాట్టు దేదీప్యమానంగా వికసించడం చూస్తే 'అంతర్యామి' విశేషం అవగతమవుతుంది.

యాత్ర మానసిక క్రమశిక్షణనిస్తుంది. ఉల్లాసాన్ని కలిగిస్తుంది. భగవన్నామస్మరణ చెడు ఆలోచనల్ని దూరం చేస్తుంది. చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుని, కోరికల్ని, కష్టాల్ని నివేదించుకొని తేలికపడ్డ మనసుతో మంచి మార్గంలో నడుస్తానని శపథం చేసుకోవడం దీక్షగా అనుకోవాలి. చాలామంది పాపపరిహారంగా హుండీల్లో ధనం, నగలు గుమ్మరించి బయటపడి- ధనాకాంక్షతోనూ, స్వలాభాపేక్షతోనూ మళ్ళీ తప్పులు చేస్తుంటారు. అలాంటివాళ్లకు యాత్రాఫలం లభించదు. సర్వాంతర్యామి నిత్యం మనల్ని గమనిస్తూనే ఉంటాడు. ధర్మరక్షణను పెడచెవిన పెట్టినవాళ్లకు అశాంతి తప్పదు. ఆరాధనాభావం ఉన్నవారికి తృప్తి, సంతోషం అధికపాళ్లలో లభిస్తాయి. అహంకారం, మొండితనం, బలప్రదర్శన, కామక్రోధాలకు తలవంచి పరులను నిందించేవారు భగవదారాధనే మరిచిపోతారని శ్రీకృష్ణుడు గీతోపదేశం చేశాడు. నరకానికి ద్వారాలైన అవి మనిషిని సర్వనాశనం చేస్తాయి. వాటిని జయించి దైవం ముందు మనసు పెట్టి సాధుజనులను ఆదుకుంటూ నిజాయతీ, దానగుణం, సాత్విక స్వభావం పెంపొందించుకొని మనసులో జయభేరి మోగించడమే మోక్షమార్గం.

ప్రాపంచిక నిజాలు తెలుసుకోవడానికే యాత్రలు చెయ్యాలి. విలాసం కోసం కానేకాదు. ఆలయాలు దర్శించినప్పుడు దానధర్మాలు చేస్తాం. సమీప నదుల్లో వంశవృక్షంలోని పెద్దలను తలచుకొని గతాన్ని నెమరు వేస్తాం. వారు మనకు నేర్పిన జీవన సరళిని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో నివాళి ఉండనే ఉంటుంది. ఆ సంస్కారాలు పెంపొందించుకుంటే 'యాత్ర' సఫలమైనట్లే. శరీరాన్ని, మనసును ఎప్పటికప్పుడు శుభ్రపరచుకొని నడచుకునేదే 'జీవనయాత్ర'.
- గుడిమెట్ల గోపాలకృష్ణ 

Saturday 28 September 2013

మోక్ష సాధన


జ్ఞానాంగాలు మోక్షదాయకాలు. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం- ప్రకృతివైపు దృష్టిపెట్టి చుట్టుపక్కల జరుగుతున్న వాటిని ఆహ్వానిస్తూ ఉంటాయి. వాటిని నాడీతంత్రుల ద్వారా మెదడుకు పంపిస్తాయి. మెదడు కర్మేంద్రియాలైన కాళ్లు చేతులకు కర్మలు ఆచరించటానికి ఆదేశాలనిస్తాయి. మధ్యలో జ్ఞాపకాల స్మృతి కలగజేసుకోకపోతే, యాంత్రికంగా పనులు జరిగిపోతూ ఉంటాయి. చైతన్యం తనంతట తానే ఉద్భవించి పొంగిపొరలుతుంది. వెన్నుపాములోని షట్‌చక్రాలు యథావిధిగా తెరుచుకుంటాయి. మూలాధారంనుంచి సహస్రానికి మార్గం సుగమం అవుతుంది. సహస్రారానికి చేరుకున్న చైతన్యం శరీరంలోని గ్రంథుల స్రావకాన్ని సరిజేస్తుంది. ప్రతి చిన్న రక్తనాళం తెరుచుకుంటుంది. ప్రతి కణం తన కర్తవ్యాన్ని తాను సరిగ్గా నిర్వర్తిస్తుంది. జీవ రసాయనాల శుద్ధి జరుగుతుంది. అడ్డంకులు తొలగిపోయి మలినాలు పూర్తిగా బయటకు వెలువడతాయి. శక్తి నిరవధికంగా నిరంతరం వస్తూనే ఉంటుంది. ఈ జీవక్రియలు ఇతోధికంగా జరుగుతున్నప్పుడు మనిషి చైతన్యవంతుడు, శక్తిమంతుడు, మహోన్నతుడు.

గడిచిపోయిన సంఘటనల స్మృతి, వాటి ప్రతిస్పందనే మనసు. పరిణామ క్రమంలో, మనిషి నాడీవ్యవస్థ జరుగుతున్న సంఘటనలను ముద్రించుకుని దాచుకోవటం మొదలవుతుంది. వయసు పెరిగే కొద్దీ ఈ ప్రక్రియ పెరుగుతూ వస్తుంది. అనుభవాలు జ్ఞాపకాలవుతాయి. వాటిని నాడీవ్యవస్థ అనుక్షణం బయటపెడుతూనే ఉంటుంది. వర్తమానం, గతంలో జరిగినవాటితో పోల్చుకుని, భవిష్యత్తును వూహించటం మొదలవుతుంది. భయం, బాధ, సంతోషం, అనుమానం లాంటివి వ్యక్తమవుతూ ఉంటాయి. ఇవి జరుగుతున్నంతవరకు మనిషికి సుఖశాంతులుండవు. దీనినుంచి బయటపడాలంటే మనిషి జ్ఞానవంతుడు కావాలి. ప్రాపంచిక జ్ఞానం లౌకిక జీవితానికి అవసరం. అలౌకిక ఆనందానికి ఆధ్యాత్మిక జ్ఞానమే సోపానం. అది గుండె లోతుల్లో నుంచి పుడుతుంది. అది పుట్టాలంటే భౌతిక ప్రపంచాన్ని చూడాలి, వినాలి. అది శరీరం లోపల చేసే సందడిని గమనించాలి. అది ఎక్కడినుంచి పుడుతుందో మూలాలను అన్వేషించుకుంటూ లోతుల్లోకి సాగిపోవాలి. కష్టమని విలాసాలు, వ్యసనాలవైపు మనసు మళ్ళిస్తే అసలైన ఆనందం చేజారినట్లే. అందుకే జరుగుతున్నవాటిని కాదు, వద్దు అని ఖండించకుండా, సమర్థించకుండా మనసును మౌనం చేయాలి. దానికి సాధనే మార్గం. కష్టం, నష్టం, అవమానం, అభిమానం, సుఖం, సంతోషం అన్నింటినీ లోపలనుంచి గమనిస్తూ ఉండటమే. మొదట శరీరం కష్టపడవచ్చు- సహనం వహించాలి. అదే సాధన. అప్పుడే ఆనంద సముపార్జన.

క్షీరసాగర మథనం జరిగితేనే అమృతం పుట్టింది. గరళం చూసి భయపడకుండా, కల్పతరువు, కామధేనువు లాంటి ఆశలకు, కోరికలకు లొంగిపోకుండా ముందుకు సాగితే అమృతధార అందుకోగలం. కష్టం, సుఖం ఏదైనా సరే- వాటిపట్ల మౌనం వహిస్తూ, అనుభవించినప్పుడు జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. మౌనం సిద్ధిస్తుంది. మోక్షానికి దారితీస్తుంది. అది సిద్ధించిననాడు మనిషికి జనన మరణ చక్రం ఒక ఆటబొమ్మే!
- డాక్టర్‌ డి. చంద్రకళ 

Friday 27 September 2013

యువతరం


లోచనల్లో వేడి, వాడి లేకపోతే యువకులైనా వృద్ధాప్యాన్ని అనుభవించవలసిందే. పుట్టుకతో అందరికీ గొప్ప భావాలు కలగవు. ప్రపంచాన్ని చూసి, మనుషులు పడే బాధలు, పెనుగులాట బతుకును చూసి ఇదేం జీవితం అనుకుంటే- అప్పుడు అన్వేషణ మొదలవుతుంది.

లోకాన్ని చూసి స్పందించనివాడికి ఆత్మాన్వేషణకు దారి ఎలా దొరుకుతుంది? దుఃఖ నివారణ మార్గం ఎలా తెలుస్తుంది? జగత్తును మనం చూసే విధానాన్ని బట్టే మన భావాలు మారుతూ ఉంటాయి. కొందరు రవ్వంతలో కొండంత సాధిస్తారు. మరికొందరు కొండను అద్దంలో చూసి సంతృప్తి చెందుతారు.

భావాలు మొదట బండల్లాగానే ఉంటాయి. వాటిని చెక్కి శిల్పాలను చెయ్యాలి. ప్రారంభంలో ఆలోచనలు విత్తనాల్లాగానే ఉంటాయి. వాటిని సారవంతమైన మట్టిలో నాటి మొక్కలు చేయాలి. అంతా మనమే చెయ్యాలి.

గొప్ప భావాలు కలిగిన యువకులు, మంచివారైన వృద్ధులు ఇప్పుడు కావాలి. దేశానికి వృద్ధాప్యం లేదు. జీవించేవారి భావాలే దాన్ని కుంగదీస్తున్నాయి. సంస్కృతి తల్లడిల్లిపోవటంలేదు. దాన్ని రక్షించాల్సినవాళ్లే మంటపెడుతున్నారు.

భగవంతుడు ఇచ్చిన దేహాన్ని రక్షించుకోవాలి. మనసుని ఆధ్యాత్మిక భావాలతో జాగృతం చెయ్యాలి. లోకక్షేమం కోసం అవకాశం దొరికినంత మేర ఆచరణాత్మక సాధన చెయ్యాలి. పాత భావాల్లోని గొప్పతనాన్ని నిలబెడుతూ కొత్త భావాలను స్వీకరించి పోషించాలి.

నీరసం, నిస్తేజం, నిర్వీర్యం, జడత్వం, అయోమయం అనే మాటలకు ఆధ్యాత్మికతకు సంబంధం లేదు. వెలుగే దాని జీవం. ప్రేమే దాని మార్గం. సత్యమే దాని పరమావధి. వృద్ధులను యువకులను చేస్తుంది. మూర్ఖులను వివేకులను చేస్తుంది. నరపశువులను కూడా నారాయ ణుడి సరసన కూర్చోబెడుతుంది.

శరీరాలు అందంగా ఉంటే సరిపోదు. శ్రీమంతులైతే సరిపోదు. గొప్ప నామగోత్రాలతో జన్మిస్తే సరిపోదు. భావదారిద్య్రం లేకుండా ఉండాలి. లోకంలో దుఃఖానికి తీవ్రంగా స్పందించగలగాలి. మన ఆలోచనలు మనకు, ఇతరులకు దారి చూపించాలి. వయసుతో సంబంధం లేకుండా జ్ఞానాగ్నిని రగిలించుకుంటూ నింగి వైపు దూసుకుపోవాలి. వాళ్లు నిజమైన సంఘసంస్కర్తలు, దైవాంశసంభూతులు.

మన ఆలోచనలను మార్చుకుంటూ కొత్తరకం ఆలోచనలు చేస్తూ మనం సంకల్పించుకున్నది సాధించుకోవాలి. అది చూసి ముందుతరం ప్రేరణ పొందాలి. పిన్న వయసులోనే గొప్ప భావాలు ఎలా కలిగాయా అని వాళ్లు ఆశ్చర్యపోవాలి.

ప్రహ్లాదుడి మాటలకు, భక్తికి అందరూ ఆశ్చర్యపోయేవారు. హిరణ్యకశ్యపుడికి కూడా ఒక్కోసారి మతిపోయి హరినామ స్మరణలో పడిపోయేవాడు. తరవాత సర్దుకుని కొడుకు పట్టుదలకు విస్తుపోయేవాడు.

చిమ్మచీకటిలో చిన్నదీపకళికైనా వెలుగునిస్తుంది. వంశచరిత్రను మార్చేసే ఒక్క బీజం చాలు. తరతరాలు తరిస్తాయి. రాముడు భువిపై నడయాడటం చూసి దేవతలు, రుషులు, తల్లిదండ్రులతో పాటు అయోధ్య పులకించింది. ధరణి పల్లవించింది. విశ్వం శ్లాఘించింది.

పద్నాలుగేళ్లకే నిర్భయులై మారీచ సుబాహులను ఎదుర్కొని విశ్వామిత్రుడికి సహాయం చేసి యాగం పూర్తిచేసిన రామలక్ష్మణుల అనుభవమెంత? జగత్తుకు వారేమి సందేశం ఇచ్చారు?

ఎప్పుడు మన జీవితం మొదలుపెట్టాలి? ఏ వయసులో జ్ఞానోదయం కావాలి?

ఏదో ఒకరోజు అందరం వృద్ధులమవుతాం. కానీ, మన భావాలకు వృద్ధాప్యం రాకూడదు. అవి శిథిలం కాకూడదు. నిత్యనూతనంగా ఉండాలి. దివ్యంగా ఉండాలి. యౌవనంతో తొణికిసలాడాలి.

రథాన్ని వెనక్కి తిప్పకూడదు. శత్రువులకు వెన్ను ఇచ్చి పారిపోకూడదు. నిలబడాలి. కురుక్షేత్రం మధ్యలో నిలబడాలి. జీవన సమరానికి సిద్ధంకావాలి. అప్పుడే దైవ సహాయం అందుతుంది. అంతర్నేత్రం తెరుచుకుంటుంది. సత్యం బోధపడుతుంది. కర్తవ్యం పరుగులు తీయిస్తుంది. విజయం వరిస్తుంది.

మన దేశం గర్వించేలా బతకాలి. ఆలోచనలకు పదునుపెట్టాలి. అవకాశాలను అందిపుచ్చుకోవాలి. మన జీవితంలో ఆధ్యాత్మికత ఒక భాగమై పోవాలి. స్వామి వివేకానందను స్మరించండి- ఇక ప్రతి ఆలోచనా అగ్నిశిఖలా మండుతుంది. నిత్యనూతనంగా పండుతుంది. అదే యువతరం చెయ్యాల్సింది!
- ఆనందసాయి స్వామి

Thursday 26 September 2013

బండెళ్లిపోతోంది


  ఓ వృద్ధురాలు ఆవేదన చెందుతోంది... పయనానికి సమయం ఆసన్నమైందనీ, పరంధాముని కొలిచే అవకాశమే రాలేదనీ, ఇక సమయం లేదనీ. ఇంతకాలం ఏం చేశావని మనం ఎద్దేవా చేయకూడదుగానీ ఆమె మరీ ఇంత నిర్లక్ష్యం చేసి ఉండరాదు. అయినా సరే... ఆమె మరీ ఇంత నిరాశపడే అవసరమూ లేదు. కాలాన్ని మనం ఎలా లెక్కలు కడతాం? నిమిషాలు, గంటలు, దినాలు, వారాలు, నెలలు, సం...! కాదు. సమయాన్ని మనసుతో లెక్క కట్టాలి. మనసుతో కొలుచుకోవాలి. మనసుతో అధిగమించాలి.

ఆ వృద్ధురాలి బాధ ఆమెది మాత్రమే కాదు. ఎందరిదో. జీవితమంతా పనులు, బాధ్యతలు, బాధలు, మనోవేదనలు... ఎన్నని! ఎక్కడ తీరిక? అసలు భగవంతుడనే వాడొకడున్నాడనే, 'ఉన్నాడా?' అనే ఆలోచనకైనా అవకాశం ఉందా? సంసారం అనే సాగరం, అలలు, పాములు, మొసళ్లు, తుపానులు... వూపిరాడని పోరాటం. అయినా వూపిరాగని ఉక్కిరిబిక్కిరి. ఔను... దేవుడి లెక్క దేవుడిది. వూపిరి ఆయన చేతిలోది. ముక్కులోని ఈ 'శ్వాస హంస' రెక్కలు కొట్టుకుంటూ ఉన్నా, తోక తెగి ఎగరలేక హింసపడుతున్నా రుణం తీర్చేదాకా ఆ రుణదాత లెక్కలు కడుతూనే ఉంటాడు. రెక్కలు కత్తిరిస్తూనే ఉంటాడు. ఎందుకీ బాధలు! చిన్నప్పుడు అమ్మ చెప్పలేదూ, నానమ్మ బోధించలేదూ? బడికెళ్లే దారిలో గుడి లేదూ, అందులో జేగంటలు మోగలేదూ? ఔను. దేవుడనే అవగాహన మన పుట్టుకతోనే ఉంది. ఉగ్గుపాలతోనే విశుద్ధి, అనాహత, మూలాధార, స్వాధిష్ఠాన, మూలాధార చక్రాల వరకూ దిగింది. మనమే పెరిగి తెలివి మీరిపోయి పొట్టి అయిపోయిన గౌనులా, చొక్కాలా భగవత్‌ స్పృహను విడిచి పారేశాం. పెద్దవాళ్లమైపోయాం కదా? చదువు, పెళ్లి, భర్త (లేదా భార్య), పిల్లలు, సంసారం, సంపాదన, విషయ సుఖాలు...! ఈ విషయ (విష)లోలత్వం మధ్య భగవంతుడనే ఆ బ్రహ్మాండ స్వరూపం మననుంచి పైపైకి అంతరిక్షంలోకి, అనంతంలోకి వెళ్లిపోతూ తగ్గిపోయి, చిన్నదై, సూక్ష్మమై, అగమ్యగోచరమై అంతర్థానమైపోయింది. కల్తీ అయిపోయిన ఈ ప్రాపంచిక ఆదరువులతో మనసు, దేహం, విషమయమైపోయి చివరి ప్రయాణానికి సిద్ధమవుతున్నాం. మరి అలవాటులేని 'రామా' అనే నామం ఇప్పుడు పలుకుతుందా? 'దేవీ' అనే పిలుపు ఇప్పుడు అలవడుతుందా? అలవరచుకుందామంటే, అలవాటు చేసుకుందామంటే- సమయమేదీ? వేళ్లలోంచి నీళ్లలా నిశ్శబ్దంగా జారిపోయింది. రిక్తహస్తాలతో మిగిలిపోయింది వృద్ధురాలు. కాలిన చేతులతో. ఇప్పుడు పట్టుకుంటే ఆకులు పనిచేస్తాయా- చేతులు కాలాక?

అలా నిరాశచెందాల్సిన అగత్యం లేదు. నిజమే... ధన్యం చేసుకోవాల్సిన మానవ జన్మను వ్యర్థం చేసుకున్నాం. దుర్వినియోగం చేశాం. పనులు, తప్పనిసరి బాధ్యతలు, ఆటంకాలు, అవరోధాలు... సమయమేదీ, అవకాశమేదీ? పనులు! ఏం పనులు? భగవత్‌ ధ్యాస ఒక పనా?! అదేం!? పూజ పని కాదా? అర్చన పనికాదా? షోడశోపచారాలకు సమయం పట్టదా? నిజమే... అదంతా పూజే. నిజమే. కానీ... అదే పూజ కాదే? నిజమైన పూజకు పనితో సంబంధం లేదు. పనిచేసే పనిముట్లు పంచేంద్రియాలు. మరి మనసేం చేస్తోంది? దైవస్మరణ, మనన, ధ్యాస, ధ్యానం... వీటికి శరీరంతో, ఇంద్రియాలతో పనిలేదు. మనసు చాలు. నిజమే... లెక్కలోకి తీసుకుంటే మనసుకూడా ఒక ఇంద్రియమే. అదికూడా లుప్తమైపోయే దశ వస్తుంది. రావాలి. అప్పుడు జీవాత్మ పరమాత్మలో రమిస్తూ మిగిలిపోతుంది. అంతవరకూ మనసును మనం నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు. మన బరువులతో, బాధ్యతలతో మనసుకు సంబంధం లేదు. ఆటంకమూ ఉండదు. ఏవైనా, ఎవరైనా శరీరాన్ని ఆపగలరుగానీ- మనసును ఆపలేరు. భగవంతుడికి కావలసిందీ అదే. మనసు. ఆ వృద్ధురాలికి ఒక జీవితకాల సమయం లభించింది- మనసును యథేచ్ఛగా, అవరోధ రహితంగా భగవంతుడి పాదాలవద్ద నియమించేందుకు. అవగాహనా లోపంవల్ల దాన్ని ఇంద్రియాలతో మమేకం చేసి విషాన్ని మప్పి పరమాత్ముడనే అమృతపానాన్ని కోల్పోయింది. ఆమె చేసిన పొరపాటును మనం అర్థం చేసుకుందాం. అవగాహన పెంచుకుందాం.

భగవంతుడు ఇంద్రియాలకు సంబంధించినవాడు కాదు. ఆయన ఆరాధనకు వయసుతో, ఆయుఃప్రమాణంతో కూడా పెద్దగా పనిలేదు. వృద్ధురాలు పశ్చాత్తాప్పడొచ్చుగానీ పూర్తి నిరాశ చెందాల్సిన పనిలేదు. జీవితమంతా సాధన చేసినా ఆధ్యాత్మికత అంటే, అచ్యుతుడంటే ఏమిటో, ఎవరో అవగాహనలోకి రానివాళ్లున్నారు. సాధన కాలపరిమితికి సంబంధించినది కాదు. (ప్రహ్లాదుడు, మార్కండేయుడు, పరీక్షిత్తు... ఎంత కాలాన్ని వెచ్చిస్తే భగవంతుణ్ని పొందారు?) దానిది మనోధర్మం. మనో ప్రమేయంలేని సాధన సాధించేది శూన్యమే. వృద్ధాప్యం భక్తి సాధనకు అనర్హత కాదు. పూర్తి ఆటంకమూ కాదు. కాకపోతే వీలైనంత తొందరగా సాధన ప్రారంభిస్తే అన్నివిధాలా శ్రేయస్కరం.
- చక్కిలం విజయలక్ష్మి 

Wednesday 25 September 2013

ఉషోదయం

షోదయదృశ్యం కళ్ళకెంత మనోహరంగా కనిపిస్తుందో! ఈ సృష్టిలోని సర్వజీవరాసులపైన అపారమైన దయతో ఆ సృష్టికర్త అందిస్తున్న అందమైన చిత్రమది. అలాంటి సుమనోజ్ఞ సృష్టివిన్యాసం నింగిలో తప్ప మరెక్కడా కనిపించదు. అత్యద్భుతమైన ప్రశాంత సమయం కూడా అదే. ప్రతీ ఉషోదయం సౌందర్య ప్రభలతో వెలిగిపోతూ అనంతమైన సందేశాలను జీవకోటికి అందిస్తుంది. ఆత్మవికాసం, ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది తొలిసంధ్య. ఉషోదయ కిరణాలు సృష్టినంతటినీ మేల్కొలుపుతాయి. అంతేనా! అవి క్రమశిక్షణకు నిలువెత్తు ప్రతీకలు. 

విశ్వాన్ని మేలుకొలిపే ఆ కాంతిరేఖలు ఎందరెందరికో స్ఫూర్తిని కలిగిస్తాయి. సంకల్పబలం ఎంత గొప్పదో లోకానికి చాటి చెప్పి జీవకోటిలో చైతన్యం కలిగించి కర్తవ్యోన్ముఖుల్ని చేస్తాయి.
 
చదువుల తల్లి సరస్వతీదేవి నడయాడుతూ నర్తించే సమయమది. ఆ వేళలో ఏ విద్య అభ్యసించినా మస్తిష్కంలో నాటుకుపోతుందని పెద్దలంటారు.
ప్రభాత సమయం భగవంతుడికి ప్రీతికరమైనదంటారు. రామాయణ మహాకావ్యంలో బాలరాముణ్ని విశ్వామిత్ర మహర్షి మేల్కొలుపుతూ 'కౌసల్య సత్‌ పుత్రుడవైన ఓ రామా! తెల్లవారుతోంది... ఓ నరశ్రేష్ఠుడా లెమ్ము భగవత్‌ ప్రీతికరమైన కార్యాలు ఆచరించాల్సి ఉంది!' అంటాడు. అలా మేల్కొలపడంలో ఎనలేని వాత్సల్యం కనిపిస్తుంది. ఆ భగవంతుడు కనులు విప్పితేనే జగత్కల్యాణం జరుగుతుందనే భావన గోచరిస్తుంది. ఈ సుప్రభాతం ఆ సర్వాంతర్యామినే కాదు, సమస్త ప్రపంచాన్నీ జాగృతపరచే ప్రభాత గీతం. అందరినీ కర్మాచరణకు ప్రోత్సహించే ప్రబోధగీతం.

దేశ ఉన్నతికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు ఉషోదయ వేళలో తీసుకున్నవేనని గాంధీజీ చెప్పేవారు. 
ఒకసారి గాంధీజీకి, రవీంద్రనాధ్‌ ఠాగూర్‌కి మధ్య ఉషోదయ సమయంలో సంభాషణ జరుగుతోంది. 
ఉదయభానుడి లేతకిరణాలతో ప్రభావితుడైన ఠాగూర్‌... గాంధీజీ ఏదో ధ్యాసలో ఉండటం గమనించారు. 'మీరెందుకంత నిశ్చలంగా ఉన్నారు? సూర్యోదయవేళ ఉదయభానుడి లేత ఎర్రని కిరణాలు చూస్తే మీ మనసు ఆనందంతో నిండిపోదా? పక్షుల కిలకిలరావాలు విని మీ హృదయం పరవశించదా? విచ్చుకుంటున్న ఎర్రగులాబీలను చూస్తే ఆహ్లాదంగా అనిపించదా?' అని ప్రశ్నించారు.

అప్పుడు గాంధీజీ 'గురుదేవ్‌, నేనేమీ జీవం లేని శిల్పాన్ని కాదుకదా... ఉదయభానుడి ఎర్రని కిరణాలతో, పక్షుల కిలకిలారావాలతో, విచ్చుకున్న గులాబీలతో పరవశించకుండా ఉండటానికి! కానీ, నేనేమి చేయను? నా మనసంతా వేరేచోట ఉంది. ఆ లేత గులాబీ ఎర్రదనాన్ని ఆకలితో అలమటించే కోట్లాది జీవుల చెక్కిళ్ళపై ఎప్పుడు చూస్తానా అనిపిస్తోంది. ఆనందం వాళ్ళల్లో ప్రస్ఫుటిస్తుందా, పక్షుల కిలకిలరావాల్లాంటి మధుర ధ్వనిని వాళ్ళ గొంతుల్లోంచి వింటానా, ఉదయభానుడి లేతకిరణాలతో పేదవాడి మనసు సమస్యలు తీరి ఎప్పుడు పరవశిస్తుందా అని ఆలోచిస్తుంటాను!' అని సమాధానం చెప్పారు. దేశప్రజల కోసం ప్రతి క్షణం తపించడంవల్లే మహాత్ముడిగా గాంధీ కీర్తి గడించారు.

పల్లెల్లో ఉషోదయ దృశ్యాలు మనోఫలకం మీద చెరగని ముద్రవేస్తాయి. ఎరుపెక్కిన తూరుపు తెల్లవారుతూంటుంది. పిల్లగాలులు వీస్తూంటాయి. పక్షుల కిలకిలలూ, లేగదూడల అంబారావాలు, కవ్వంతో చల్ల చిలుకుతున్న చప్పుళ్ళు, ఇళ్ళముందు బియ్యంపిండితో ముగ్గులేసే పల్లె పడుచులు... సాక్షాత్తూ ఆనాటి వేదనాగరికతే ఈనాటికీ పల్లెల్లో కనిపిస్తుంది. సమైక్యతకు, సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తుంది.

తెలతెలవారుతూంటే పిట్టలు ఆకాశంలో సందడిచేస్తూ కనిపిస్తాయి. చిన్న పొట్ట కోసం ఎంత దూరం ఎగురుతాయో! శ్రమైక జీవన సౌందర్యాన్ని లోకానికి వెల్లడిచేస్తాయి. మూగజీవుల్లా ప్రతీ మనిషీ ఉషోదయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. మంచి నిర్ణయాలతో కర్తవ్యోన్ముఖుడు కావాలి. వెలుగనే జ్ఞానామృతాన్ని అందరికీ పంచుతూ అతడో ఆదిత్యుడిగా మారాలి.
-విశ్వనాథ రమ

Tuesday 24 September 2013

ప్రేరణ కోసం అన్వేషణ

  నలో చాలామంది 'జీవితం ఎందుకు ఉత్సాహంగా ఉండటం లేదు... విసుగ్గా ఉంటోంది' అని పదేపదే అనుకోవడం చూస్తుంటాం. ఏదో యాంత్రికంగా ఉదయం నిద్రలేవడం, కడుపులో అంత పడేసుకోవడం, పనుల్లో పడటం, ఏదోలా పూర్తయిందనిపించడం... ఉరుకులు పరుగులు... ఈ చక్రం ఇలాగే తిరుగుతుంటుంది. ఏం చేయాలి, ఇంతకంటే వేరే ఏముంటుంది ఎవరికైనా... జీవితం బతకడం కోసమే కదా... ఈ ఆలోచన తప్పు. జీవితానికి ఒక పరమార్థం ఉండాలి. ఉత్సాహం కావాలి... ఆలోచనా పరిధి విస్తృతం కావాలి. కూపస్తమండూకంలా ఉండకూడదు. తిండి-బట్ట-గూడు... వీటికోసం ఓ ఉద్యోగం. ఇవి అవసరాలు. ఆ అవసరాలను మించి ఆలోచించాలి, ఆలోచించగలగాలి. దీనికి విశాలదృక్పథం అలవరచుకోవాలి. ఆ దృష్టి మన లక్ష్యాన్ని నిర్దేశించాలి. దానికి కృషి, పట్టుదల, ఏకాగ్రతల అవసరం ఏర్పడుతుంది. చేసే పనిలో తృప్తి లభిస్తుంది. విశ్రాంతి కూడా తీసుకోవాలనిపించదు. ఆ ధ్యాసకు అంతటి శక్తి ఉంటుంది. బతుకుపట్ల సరైన దృక్పథం ఏర్పరచుకోగలిగితే- పనిలోనే పరమార్థం కనబడుతుంది!

ఎటువంటి ఉన్నతమైన ఆశయాలూ లేనట్లయితే, ఆలోచనలు 'నేను-నాది' అన్నదాని చుట్టే పరిభ్రమిస్తుంటే మొహం మొత్తుతుంది. ఏం తిందాం, ఏం చేద్దాం అన్నచోటే ఆగిపోతే, ఎదుటివ్యక్తి ఒక పోటీదారుడిగా కనిపిస్తాడు. మన శక్తియుక్తులను తక్కువగా అంచనా వేసుకుని అభద్రతా భావానికి గురవుతాం. స్వార్థం జీవం పోసుకుంటుంది. అనవసర భయాలు, ఏవేవో వూహించుకోవడాలు, యథార్థాల నుంచి దూరంగా బతకడంతో మన మీద మనకే జాలి కలగడం, వ్యధ చెందడం... చివరికి మన పతనాన్ని మనమే తెచ్చుకున్నట్లు అవుతుంది.

ఈ ప్రపంచానికి అసాధారణ వ్యక్తులే అవసరం అని ఎక్కడా లేదు. చాకచక్యం కలిగిన మేధాసంపన్నులే కావాలనీ ఏం లేదు. మనకు కావలసింది ప్రేరణ కలిగించే శక్తి కలిగినవారు. మహాత్మాగాంధీ సాధారణ వ్యక్తే. కానీ సత్యం, అహింసా ధర్మాలవైపు జనాన్ని ప్రేరేపించగల శక్తిసంపన్నుడు. రైట్‌ సోదరులు- సామాన్యులే. ఎగరాలనే బలమైన కలగన్నారు. ఇలా ఎందరో...

ఎవరైనా ఉన్నతమైన ఫలితాలు సాధించవచ్చు. ఓ గొప్ప ఆదర్శానికి ప్రభావితమైతేనే అది సాధ్యం. నేటి విద్యాప్రమాణాలు క్రమక్రమంగా దిగజారిపోతున్నాయి. కారణం? ఒక ఉపాధ్యాయుడు సమాచారాన్ని విద్యార్థులకు ప్రసారం మాత్రమే చేయగలుగుతున్నాడు. ఒక ఉన్నతమైన ఆశయసాధనకు మేధాశక్తిని ప్రేరేపించలేకపోతున్నాడు. ఉత్తేజపరచడమన్నది అంత క్లిష్టమైన విషయం ఏమీ కాదు. కొద్దిమందే మనకు అటువంటివాళ్లు కనిపించడంవల్ల అలా అనిపించడం సహజం. జీవితాలను త్యాగం చేసినవాళ్లెందరో ఇప్పటికీ ప్రేరేపించగలుగుతున్నారు. విద్య, సామాజిక న్యాయం, పర్యావరణం... ఇలా ఏ రంగమైనా కావచ్చు. ఎవరైనా ఒక ఆదర్శానికి కట్టుబడి ఉండాలి.

అన్నింటిలో ఉన్నతమైనది- ఆధ్యాత్మిక లక్ష్యసాధన. 'దేవుడు నన్ను పరిగెత్తిస్తున్నాడు... నేను దేవుడికోసం పరిగెత్తుతున్నాను' ఎందరినో ఆకట్టుకున్న వాక్యమిది. ఒకసారి భగవంతుడిచే ప్రేరణ పొందగలిగితే ఆ శక్తి మనలో బలంగా చోటుచేసుకుంటుంది. ఆ ధైర్యంతో ఎటువంటి అడ్డంకులనైనా ఎదుర్కోవచ్చు.

మనలో ఎంతమంది ఉత్తేజంతో నిద్రలేస్తాం, తెల్లారిన తరవాత సేవా దృక్పథం కలిగి ఉంటాం? సమాజానికి ఏదైనా చేయాలనే ఉత్సాహం ఎందరికుంటుంది? సేవాభావం ఉన్నప్పుడు జీవితం వూహాతీతంగా, విసుగు చికాకులతో కాకుండా ఉత్తేజవంతమైన స్థాయికి చేరుకుంటుంది. పనికిరాని పద్ధతుల్ని పునర్‌ నిర్వచించుకుని అసాధారణం అనుకున్నవాటినీ సాధించవచ్చు. అనూహ్యమైన విజయాలను సొంతం చేసుకోవచ్చు. పనిలో ఆనందం కనిపిస్తుంది కానీ, పనిని తప్పించుకోవడంలో కాదు. అన్నింటికంటే ముఖ్యమైనది, ఆధ్యాత్మిక ధోరణిని అలవరచుకుని భగవత్తత్వాన్ని అవగతం చేసుకోవడం.

ప్రేరణ కలిగినప్పుడు సామాన్యుల్లో ధైర్యం, ఆశ చోటుచేసుకుంటాయి. అవి వారి జీవితాలనే కాకుండా భవిష్యత్‌ తరాలను సైతం ప్రభావితం చేస్తాయి.
- మంత్రవాది మహేశ్వర్‌

Monday 23 September 2013

అడ్డదారితో అనర్థం


కొందరు చాలా సులువుగా ఇతరులను మోసం చేస్తూంటారు. ధర్మాధర్మాల విచక్షణ సైతం వారికుండదు. తమ వల్ల మోసపోయినవారు పడే బాధను చూసైనా వారికి జాలి కలగదు. మోసం చేయడమే లక్ష్యంగా జీవించేవాళ్లు అనేకులు ఉన్నారు. పదేపదే మోసపోవడం మోసపోయిన వారి అమాయకత్వానికి ప్రతీక. ఐనా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. సోక్రటీస్‌ మహాజ్ఞాని, తత్వవేత్త. ఆ కాలంలో ఆయన ఎందరికో బోధించే ఆధ్యాత్మిక నైతిక సూత్రాలు రాజుగారికి నచ్చేవి కావు. ఒక రోజు రాజోద్యోగి ఒకడు సోక్రటీస్‌ వద్దకు వెళ్ళి 'మిమ్మల్ని రాజుగారు ఒకసారి ఆస్థానానికి రమ్మన్నారు. మీరు విజ్ఞులని రాజుగారు నమ్ముతున్నారు. మీరు ఆస్థానానికి ఎప్పుడు రాగలరో చెబితే మిమ్మల్ని సత్కరించడానికి తగిన ఏర్పాట్లు చేస్తాం!' అన్నాడు. 'ఎప్పుడో ఎందుకు? ఈ సాయంత్రమే వస్తాను. సత్కారాలు నాకు అవసరం లేదు. ప్రజల పట్ల రాజుగారు ఎలా నడచుకోవాలో చెబుతాను. ఆ సూత్రాలు పాటిస్తే చాలు... రాజ్యం క్షేమంగా ఉంటుంది!' అన్నాడు. ఆ రాజోద్యోగి సరేనంటూ వెళ్లిపోయాడు. 

ఆ సాయంత్రం సోక్రటీస్‌ రాజాస్థానానికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా రాజపురోహితుని కొడుకు పరుగుపరుగున వచ్చాడు. 'మహాశయా! మీరు ఆస్థానానికి వెళ్లవద్దు. రాజు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించలేదు. ఉదయం వచ్చిన రాజోద్యోగి రాజు ఆంతరంగికుల్లో ఒకడు. మీరక్కడికి వెళ్లగానే ప్రజలెవరికీ తెలియకుండా మిమ్మల్ని బంధించి హింసించే ఏర్పాట్లు జరుగుతున్నాయి' అని వివరించాడు. పురోహితుని కొడుకు అనిస్సీకి సోక్రటీస్‌ అంటే ఎనలేని భక్తి గౌరవాలు ఉన్నాయి. అలా సోక్రటీస్‌ చివరి క్షణంలో రాజతంత్రం నుంచి తప్పించుకోగలిగాడు.

తరవాత అనిస్సీ సోక్రటీస్‌తో 'అయ్యా! రాజు మీ ఉనికిని ఇష్టపడడంలేదని తెలిసీ తెలిసీ ఆ రాజోద్యోగి మాటలకు మీరు ఎలా మోసపోయారు!' అని ప్రశ్నించాడు. అందుకు సోక్రటీస్‌ బదులిస్తూ 'నాయనా! ఆ రాజోద్యోగి ఆరితేరిన మోసగాడు. నేను అతని మాయ మాటలు నమ్మాను. నమ్మేవారినేకదా ఎవరైనా మోసం చేయగలరు' అన్నాడు.

మోసగాడు విషసర్పం లాంటివాడు. పాము కాటు వేయడానికి మాటువేసి ఉంటుంది. చాణక్యుడు తన నీతిచంద్రికలో- గయ్యాళి భార్య, మోసగాడు, ఎదురు తిరిగే సేవకుడు, పాము దాగిన ఇల్లు మృత్యువుతో సమానమని అంటాడు. స్వార్థచింతనతో స్వలాభం కోసం మోసంచేసే వారివల్ల సమాజంలో అనర్థాలు జరుగుతాయి.

నిస్వార్థంతో దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసమూ కొన్ని మోసాలు జరిగాయి. భస్మాసురుడు శివుడు ఇచ్చిన వరంతో కనబడిన వాళ్లందరి నెత్తిపై చేయిపెట్టి వారిని నాశనం చేస్తూంటే శ్రీమహావిష్ణువు స్పందిస్తాడు. అందమైన స్త్రీ రూపంలో అవతరించి భస్మాసుర సంహారం చేస్తాడు. సముద్ర మథనం సందర్భంగా ఆ మహావిష్ణువే మోహినీ రూపం ధరించి అమృతాన్ని సురులకు అందించి అసురులు అమృతులై భూమికి భారం కాకుండా కాపాడతాడు. మహాభారత యుద్ధంలో సైతం ద్రోణుణ్ని ధర్మరాజు అసత్య వచనంతో మోసగించి అస్త్ర సన్యాసం చేయిస్తాడు. అలాకాకపోతే, పాండవులకు విజయం అంత సులువుగా లభించేది కాదు. ఇలాంటి ఘటనలు పురాణాలకే పరిమితం. దైవం తాను సృజించిన మానవాళి క్షేమం కోసం నిర్వహించే కార్యాల కోవలోకి ఈ సంఘటనలు వస్తాయి. కాని, మనిషే తోటి మనిషిని మోసం చేయడంవల్ల సమాజంలో ఒకరిపై మరొకరికి నమ్మకం నశిస్తుంది. క్రూర మృగాలను కొమ్ములున్న జంతువులను నదులను మోసగాళ్లను ఆయుధాలున్న వారిని ఎన్నటికీ నమ్మకూడదని చణకుడు అంటాడు. మానవుడు మౌలికంగా ఆశాజీవి. తన ఆశయాన్ని సాధించేందుకు రాచబాటను అనుసరించాలేకాని అడ్డదారులను కాదు. అడ్డదారుల్లోనే మోసగాళ్లు తారసపడతారు. వాళ్లబారిన పడితే కుడితిలో పడ్డ ఎలుకలా ఉంటుంది పరిస్థితి. అందుకే దురాశ దుఃఖానికి చేటు అంటారు. దురాశ ఎక్కడ ఉంటుందో అక్కడే మోసం మాటువేసి ఉంటుంది. నిశ్చయంగా లభించేవి కొన్నే అయినా, వాటిని వదిలిపెట్టి- లభిస్తాయన్న నమ్మకం లేని వాటికోసం పాకులాడితే మొదటికే మోసం వస్తుంది.
- అప్పరుసు రమాకాంతరావు

Sunday 22 September 2013

దానమే ధర్మం


 భారతీయ సంస్కృతిలో దానం ప్రముఖమైంది. అదెంతో మహిమాన్విత స్థానాన్ని సంతరించుకుంది. సనాతన ధర్మానికి ప్రధాన సూత్రమైన దానగుణం, మానవహితానికి ఏర్పరచిన పరిపక్వ ప్రణాళికగా గోచరిస్తుంది.
దానం స్వీకరించేవాడికి భుక్తి ప్రదాయకం. ఇచ్చేవాడికి ముక్తి ప్రదాయకం. దానం ఇచ్చేవాడి ఆయువు పెరిగినా, తీసుకునేవాడి ఆయువుమాత్రం తరగదు. సంపన్నులు నిరుపేదలను, నిస్సహాయులను ఆదుకునేందుకు దానగుణం మానవజాతిలో సర్వదా సుస్థిరమై వెలుగొందాలనే మన పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి.

తల్లికిచ్చిన దానం నూరు రెట్లు, తండ్రికిచ్చిన దానం వెయ్యి రెట్లు, సహోదరులకిచ్చిన దానం అనంతంగా ఫలితాన్నిస్తుందంటారు. పాపాత్ములకు, దుర్వ్యసనపరులకు ఇచ్చిన దానం పూర్తిగా వ్యర్థమైపోతుంది. అంటే, యోగ్యులకే దానం చెయ్యాలి. పాత్రతనెరిగి దానం చెయ్యాలి. తీర్థయాత్రల్లో, పుష్కర స్నాన సమయాల్లో, శుభకార్యాల్లో చేసే దానం పుణ్య ఫలితాలనిస్తుంది.

మహాభారతం 'అరణ్యపర్వం'లో మార్కండేయ మహర్షి ధర్మరాజుకు దానధర్మాల మహిమ గురించి విపులీకరించాడంటారు. దానం ఇవ్వలేనివాడు, ఇవ్వగలిగే సత్పురుషుణ్ని యాచకుడికి చూపినా పుణ్యఫలమే సంప్రాప్తిస్తుందట. బీదలకు చేసేదానం దేవుడికిచ్చిన అప్పుతో సమానం. దేవుడు మళ్లీ వడ్డీతోసహా మనకందజేస్తాడు!

మరికొన్ని పురాణాల్లో పదమూడు విధాల దానాల వివరణ ఉంది. రక్తదానం, ఆరోగ్యదానం, అవయవదానం, నేత్రదానం, కాయదానం, శ్రమదానం, సమయదానం, అభయదానం, ఆశీర్వచన దానం, దయాదానం, క్షమాదానం, త్యాగదానంతోపాటు గోదాన - కన్యాదాన మహిమలనూ విపులీకరించారు.

దానం చేస్తున్న మనిషిలో ప్రేమ, శ్రద్ధ, అభిమానం ఉండాలి. లోభత్వం ప్రకటించకూడదు. ఔదార్యం, దాక్షిణ్యం కలిగిన దానమే సత్ఫలితాలను ఇస్తుంది. విసుగుదలతో రాగద్వేషాలతో ఇచ్చేదానం నిరర్థకం. పేదలకు మనం పెట్టే ఆహారం దేవుడి ఖాతాలో మన పేర జమవుతుందని గ్రహించాలంటారు పెద్దలు.

జ్ఞాని అయిన ధనికుడు తన సంపాదనలోని కొంత భాగాన్నయినా దానం చెయ్యాలన్న నియమం పెట్టుకుంటాడు. ధనికుడైన లోభి కన్న దానశీలి అయిన పేదవాడు గొప్పవాడు. సముద్రంలో ఉన్న అపారమైన క్షారజలంతో దాహార్తి తీరదు. కానీ, చెలమలోని గుక్కెడు నీరు అతడి దాహం తీర్చి ప్రాణం నిలబెట్టగలదు. నీరు మంటను ఆర్పేసినట్టు దాన ధర్మాలు పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగిస్తాయి.

వందమందిలో శూరుడొకడే ఉంటాడు. వేయిమందిలో పండితుడొక్కడే ఉంటాడు. పదివేల మందిలో వక్త ఒక్కడే ఉంటాడు. లక్షమందిలో నిజమైన దాత ఒక్కడే ఉండొచ్చు. ఉండకపోనూ వచ్చు. దాన గుణ వైశిష్ట్యం అంత మహత్తరమైంది. క్షేత్రమెరిగి విత్తనం వేస్తే మంచి మొక్క వస్తుంది. మహావృక్షమవుతుంది. అలాగే అర్హతగలవాడికి దానం చెయ్యడంవల్లనే అనంతపుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ఆర్భాటంతో, ప్రచారంతో, కీర్తికండూతితో చేసే దానం ఫలితమివ్వదు. గుప్తదానానికుండే ఫలితం అనంతమైనది.

ఒకరోజున మహాకవి కాళిదాసు భోజరాజు ఆస్థానానికి బయలుదేరాడు. అది వేసవికాలం, ఎండ తీక్షణంగా ఉంది. ఒక పేదవాడు చెప్పులు లేకుండా ఆ ఎండలో నడుస్తూ బాధపడుతూ ఎదురైనాడు. కాళ్లు కాలుతూ, అవస్థపడుతున్న ఆ పేదవాడి బాధకు జాలిపడిన కాళిదాసు తన చెప్పులతనికి ఇచ్చి నడక కొనసాగించాడు. అలా నడవడం తనకూ కష్టంగానే ఉంది. అయినా ఒక బాటసారికి సాయపడిన తృప్తి, ఆనందం ముందు అది బాధనిపించలేదు. ఇంతలో రాజుగారి ఏనుగును మావటివాడు అటువైపు తోలుకుని పోతూ కాళిదాసు పాదరక్షలు లేకుండా నడవడం చూసి దిగి, ఏనుగుమీద ఎక్కించుకొని రాజుగారి కొలువుకు తీసుకెళ్లాడు. కొలువులోని కవులు ఆశ్చర్యపోయి 'మహాకవీ! ఇవాళ ఏమిటీ మహర్దశ?' అని అడిగారు. 'నేను చేసిన స్వల్పదానానికే గౌరవం' అని జరిగినది వివరించాడు కాళిదాసు. నిర్మల హృదయంతో నిస్వార్థ బుద్ధితో చేసే ఇటువంటి దానం మానవుణ్ని మహోన్నత యశోశిఖరాలకు తీసుకుపోతుంది. దానంచెయ్యడానికెంత సంపద ఉందన్నది ప్రశ్న కాదు. ఆపదలో ఆదుకునే ఆవగింజంత దానమైనా చాలు, మానవ జన్మకు సార్థకత చేకూరుస్తుంది. దరిద్రుడైనా తనకున్నదాంట్లో కొంత దానంచేసి నిస్సహాయులకు తోడ్పడవచ్చు. దానానికి ఉపయోగపడని ఎంత ధనరాశి అయినా వృథా. ఎవడికేది అవసరమో గ్రహించి ప్రదానం చేసేదే దానం. రక్త, నేత్ర, మూత్రపిండ దనాలు విశిష్టమైనవని ఆయుర్వేదంలోని అష్టాంగ మార్గం ప్రవచిస్తోంది. దీనులకు, ఆర్తులకు చేసే ఏ దానమైనా విశిష్టమైనదేనన్నారు ఆదిశంకరులు. మనంచేసే దానధర్మాలే మనకోసం ఏర్పరచుకునే సంక్షేమ నిధులు. దానం చెయ్యడం అంటే మనకోసం భగవంతుడే వెదికేలా చేసుకోవడమన్నమాట. సంపద ఉంటే దానం చెయ్యాలి. లేకుంటే హృదయాన్నయినా దానం చెయ్యాలి. అప్పుడే మానవ జన్మ చరితార్థం.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి

Saturday 21 September 2013

జయించడమంటే?


నసుంటే మార్గం ఉంటుందంటారు. మనసుండటమంటే- చేస్తున్న పనిమీద ధ్యాస ఉండటమని అర్థం. ఇష్టంగా చేస్తే పనిమీద ధ్యాస కుదురుతుంది. ఏ పనైనా ఇష్టంగా చేద్దామనుకుంటే- మనసు ఏదో ఒక చక్కని మార్గాన్ని చూపిస్తుంది. ఒకవేళ ఎగ్గొడదామనుకున్నా- తగిన సాకునూ మనసే చూపిస్తుంది. ఇది చాలా చిత్రమైన విషయం. నచ్చిన మనిషిలో వెయ్యి సుగుణాలను వెతికే మనసే, నచ్చకపోతే వెయ్యి దుర్గుణాలనూ ఎత్తిచూపిస్తుంది. అలా విచిత్రంగా ప్రవర్తించడమే మనసు ప్రత్యేకత!
'శరీరం కన్నా విభిన్నమైనది, అపూర్వమైనది, విశేషమైనదీ అయిన మనసు అనేదాన్ని సృష్టించి, ప్రజాపతి ప్రతి మనిషిలోనూ దాన్ని నిక్షిప్తం చేశాడు' అని ఐతరేయ బ్రాహ్మణం వెల్లడిస్తోంది. ఆ విశేషణాలను మనం విశ్లేషిస్తే- మనసు ప్రత్యేకత ఏమిటో తెలుస్తుంది. పైగా అది సృష్టిలో మనిషి ఒక్కడి సొత్తు. అందుకే మనసంటే మనందరికీ ఎంతో ఆసక్తి! అదెలా ఉంటుందో, ఎక్కడుంటుందో తెలియదు. కనుక మనం దాని గురించి ఆలోచించాలి. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి.

'ఆ అమ్మాయి మీద మనసు పడ్డాను' అని ఏ కుర్రాడో అన్నాడంటే- అతగాడు నిరంతరం ఆ పిల్ల గురించే ఆలోచిస్తున్నాడని అర్థం. ప్రతి మనిషీ అలా ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. మనసు పనే అది! పుట్టలోంచి లక్షలాది చీమలు బారులుతీరి సాగిపోతున్నట్లుగా- మనసులో ఆలోచనలు ఒకదానివెంట మరొకటి ప్రవాహంలా వస్తూనే ఉంటాయి. ముసురుకునే ఆలోచనల ప్రవాహంలో మునిగిపోకుండా ఉండటం మునులకే తప్ప మామూలు మనుషులకు సాధ్యం కాదు.

నిరంతరాయంగా అలా వచ్చిపోతుండే ఆలోచనల్లో మంచివీ ఉంటాయి, చెడ్డవీ ఉంటాయి. మంచి ఆలోచన తడితే మనిషి సంతోషపడతాడు, చెడు ఆలోచనలు వస్తే కంగారు పడతాడు. వాటిని అదుపు చెయ్యలేకపోతున్నామని దిగులూ పడతాడు. నిజానికి ఈ మథనంవల్ల ఏ ప్రయోజనమూ లేదు. అవి మన వశంలో ఉంటే కదా, రావద్దనడానికి? 'ఒక పరిస్థితిని నీవు అదుపు చేయలేనప్పుడు- దాన్ని గురించి స్పందించడం మానేసెయ్‌'' అన్నారు రాధాకృష్ణ పండితులు. అంటే- ఆలోచనలను అరికడదామనిగాని, అలా చేతకావడం లేదని ఆందోళన చెందడం కాని- శుద్ధ అనవసరం. ఎలాంటివైనా ఆలోచనలంటూ వస్తే వాటిని ఎదుర్కోవడం కన్నా వాటిని గమనిస్తూ ఉండటం చాలా ముఖ్యం. అదే మనిషికి ఆరోగ్యకరం. ఆలోచనలు మంచివే అయితే పేచీయే లేదు. వాస్తవానికి మనిషి ఆలోచన ఎన్నో అద్భుతాలను సాధించింది. ఎంతో విలువైన విషయాలను కనుగొంది. ఎన్నింటినో ఆవిష్కరించింది. సృష్టించింది. కనుక మనసును అదేపనిగా ద్వేషించవలసిన పనిలేదు. మంచి ఆలోచనలతో మనిషికి చాలా అవసరం ఉంది.

ఆలోచనలు చెడ్డవైతే మాత్రం మనిషి నిదానించాలి. ఎదిరించి లాభం లేదు కనుక, వాటిని గమనిస్తూ ఉండాలి. వాటి నుంచి తాను విడిపోయి, ఉన్నది ఉన్నట్లుగా చూస్తూ ఉండిపోవాలి. ఆ స్థితిలోనే మనిషిని 'సాక్షీభూతుడు' అంటారు. పారిపోదామనుకుంటే భయపెడతాయి తప్ప- చూస్తూ నిలిచిపోతే చెడు ఆలోచనలు నెమ్మదిగా కరిగిపోతాయి. ఇంతలోనే మరో ఆలోచన ఎలాగూ మొదలైపోతుంది. ఆలోచన ఎంత చెడ్డదైనా ప్రమాదం లేదు- దాన్ని అమలు చేయడానికి సిద్ధపడితే మాత్రం ఆపద ముంచుకొస్తుంది. కనుక చెడు ఆలోచనలు రావడంలో తప్పులేదు. వాటిని అమలు చేద్దామనుకోవడం మాత్రం తప్పు. బుద్ధిమంతులు ఇక్కడే జాగ్రత్తపడతారు. విచక్షణ పాటిస్తారు. ఆయా సందర్భాల్లో తమ బుద్ధికి పని చెబుతారు. మనిషి మేల్కొని ఉన్న ఇంటికి దొంగల వల్ల ప్రమాదం లేనట్లే- బుద్ధి మేల్కొని ఉన్న మనిషికి చెడు ఆలోచనల వల్ల ఎలాంటి అపాయమూ ఉండదు. కనుక మనం ఎల్లప్పుడూ బుద్ధిని మెలకువగా ఉంచుకోవాలి. అది- ఆలోచనలు మంచివైతే, వాటిని ఆచరణలోకి తెస్తుంది. చెడు ఆలోచనల పట్ల ఉదాసీనంగా ఉంటుంది. ఈలోగా ఆలోచన మారేపోతుంది. ఈసారి అది మంచిదైతే బుద్ధి చక్కగా స్వీకరిస్తుంది. చెడ్డదైతే దాన్నీ తిరస్కరిస్తుంది. మనసును అదుపులో ఉంచుకోవడమంటే ఇంతే! ఆలోచన మంచిదైతే వాడుకోవడం, కాకపోతే మరిచిపోవడం- మంచిదా చెడ్డదా అని తేల్చుకోవడానికై బుద్ధిని ఉపయోగించడం... ఇంతే మన పని! మనసును జయించడమంటే- దాన్ని ఓడించడం కాదు, సరిగ్గా వాడుకోవాలని అర్థం. నిజానికి, అది చాలా గొప్ప గెలుపు!
- ఎర్రాప్రగడ రామకృష్ణ

Friday 20 September 2013

అప్రమత్తత


లోకంలో చరాచరాలన్నింటికీ కొన్ని అవధులు ఉన్నాయి. అవి సక్రమంగా ఉన్నంతకాలం దేనికీ ఏదీ లోపం ఉండదు. పట్టుతప్పితే మాత్రం అంతా ప్రమాదమే. ప్రమాదాన్నే ప్రమత్తత అంటారు. ఇది లేకుండా అంతా సవ్యంగా ఉండాలంటే అప్రమత్తత చాలా అవసరం.
మనిషి నూరేళ్లూ హాయిగా జీవించాలంటే అనుక్షణం అప్రమత్తంగా ఉండటం అవసరం. మనిషిని చెడగొట్టేవీ, బాగుపరచేవీ మూడే మూడున్నాయి. అవి మనోవాక్కాయాలు. అంటే మనసు, మాట, శరీరం అన్న మాట. వీటినే 'త్రికరణాలు' అని పెద్దలు అన్నారు. త్రికరణాలంటే పనిచేసే మూడు సాధనాలని అర్థం.

త్రికరణాల్లో మనసు పాత్ర గొప్పది. ఇది అన్నింటినీ బాగుచేయడానికీ, చెడగొట్టడానికీ ఉపకరిస్తుంది. ఇది పాదరసం లాంటిది. ఎప్పుడూ జారిపోతూ ఉంటుంది. ఎంత పట్టుకుందామన్నా దొరకదు. దీన్ని గురించి వేదాంతులు ఎన్నో నిర్వచనాలు చెప్పారు.

మనసు ఒకసారి కిలకిలా నవ్వుతుంది. ఒకసారి భోరున విలపిస్తుంది. భ్రమతో అన్ని దిక్కులకూ పరుగెత్తుతుంది. ఒకనాడు సంతోషంతో వూగిపోతుంది. మరొకరోజు విషాదాన్ని పులుముకొంటుంది. ఒకణ్ని ద్వేషిస్తుంది. ఒకణ్ని ప్రేమిస్తుంది. మంచివాళ్లను తిడుతుంది. చెడ్డవాళ్లను పొగుడుతుంది. ఇదీ మనసు స్వభావం. దీన్ని అదుపులో పెట్టుకోకపోతే అడుగడుగునా కష్టాలే ఎదురవుతాయి. దీన్ని అదుపు చేయడానికి వివేకం కావాలి. విజ్ఞత రాటుతేలాలి. ఆలోచన పదునుతేలాలి. అప్పుడే అప్రమత్తత సాధ్యం. మనసు కోతి వంటిది అనడం అక్షరసత్యం. అలాంటప్పుడు కోతిని అదుపులో పెట్టుకొని, మనిషి తనకు ఇష్టం వచ్చిన తీరులో ఆడించాలేగాని, కోతి చెప్పినట్లు మనిషి ఆడకూడదు. అలా ఆడితే ప్రమాదమే.

మనిషి మాట కూడా చాలా విలువైనది. మాట వజ్రాయుధంలా పని చేస్తుంది. పువ్వులా మెత్తగా తాకుతుంది. బాణంలా మనసుకు గుచ్చుకుంటుంది. బురదలా అంటుకొంటుంది. కనుక మాట్లాడేటప్పుడు అప్రమత్తత అవసరం. మాటల కారణంగా సామ్రాజ్యాలు వైభవంతో వెలిగిపోవడమూ, కాలగర్భంలో కలిసిపోవడమూ అందరికీ తెలిసిందే. అనుకూలమైన మాటలు, వ్యతిరేకమైన మాటలు మనిషి జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. ఒక్క సాంత్వన వాక్యంతో- చావాలనుకొనేవాడు బతుకుతాడు. ఒక్క నిందావాక్యంతో- బతకాలనుకొనేవాడు చస్తాడు. ఇదే- మాటకు ఉండే విలువ. అసలు ప్రపంచం అంతా మాట మీదే జీవిస్తోంది అంటే అతిశయోక్తి కాదు. మాట అంటే శబ్దమే కదా. అది లేకుంటే ప్రపంచం ఎలా ఉంటుందో మహాకవి దండి ఒక్క మాటలో చెప్పాడు- 'శబ్దం అనే దీపం ప్రపంచమంతటా వెలుగుతూ ఉండకపోతే ఈ ప్రపంచమంతా కటిక చీకటిలో మునిగిపోతుంది'. ఈ మాట త్రికాల సత్యం. అందువల్ల జాగ్రత్తగా మాట్లాడాలి. పెద్దలు 'ఆచి, తూచి' మాట్లాడాలని అంటారు. మాట విలువ తెలిసినవాళ్లు అతిగా మాట్లాడరు. సందర్భోచితంగా, మితంగా మాట్లాడతారు. మాట విలువ తెలియనివాళ్లు పనికిరాని మాటల్ని పదేపదే మాట్లాడుతుంటారు. కనుక మాటల్లో అదుపు అవసరం.

మంచి పనులు చేయడానికి భగవంతుడు ప్రసాదించిన గొప్ప సాధనం శరీరం. శరీరం ప్రతిక్షణం విధ్వంసానికి గురి అవుతూ ఉంటుందని అంటారు చార్వాకులు. అంటే అశాశ్వతమైనదని అర్థం. ఈ మాట నిజమే. యౌవనంలో ఉన్నంత అందంగా మనిషి ముసలితనంలో ఎందుకు ఉండటం లేదు? శరీరంలోని అణువులన్నీ అనుక్షణం విధ్వంసానికి గురి కావడమే అందుకు కారణం. ఎలాగైనా నశించిపోయే శరీరాన్ని మంచి పనులతో పవిత్రంగా మార్చుకోవడం మంచిది. మంచి భోజనంతో, వ్యాయామంతో పెంచి పోషించిన శరీరం ఎల్లకాలం ఉంటుందా? ఉండనే ఉండదు. కాలం మూడితే పతనం అవుతుంది. అందువల్ల శరీరాన్ని మంచి పనులతో అప్రమత్తంగా కాపాడుకోవడం అవసరం.

ఏ పని చేసినా త్రికరణశుద్ధిగా చేయాలని మానవ ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. త్రికరణాలు (మనసు, మాట, శరీరం) శుద్ధి కావాలంటే అప్రమత్తత అవసరం. సుగుణాల వల్లనే అప్రమత్తత ఏర్పడుతుంది. దుర్గుణాల వల్ల ఏర్పడదు. కనుక మనిషి త్రికరణాల విషయంలో సదా జాగ్రత్త వహించడం శ్రేయస్కరం.
-డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

Thursday 19 September 2013

పంచాయతన పూజ

 దిశంకరులు ఈ భువిపై జీవించినది కేవలం 32 సంవత్సరాలే. అయినా ఎన్నో వేల సంవత్సరాలకు సరిపడా ఆధ్యాత్మిక సంపదను ప్రపంచానికి అందించి చిరస్మరణీయులయ్యారు. ఒకవైపు బౌద్ధమత వ్యాప్తి, మరొకవైపు శైవులు, వైష్ణవులు తాము గొప్పంటే తాము గొప్పని వాదించుకునే రోజుల్లో ఆదిశంకరులు ఈ నేలపై అవతరించారు. పుట్టింది కేరళ రాష్ట్రంలోని కాలడి గ్రామంలో. ఆసేతు హిమాచలం మూడుసార్లు పర్యటించి, తన బోధలతో ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు. భారతదేశంలో శైవులు, వైష్ణవులతో పాటు శాక్తేయులు, గాణాపత్యులు, సూర్యోపాసకులు సైతం ఉండేవారు. వారు ప్రాంతాలవారీగా చీలిపోయి ఒకరిని ఒకరు దూషించుకుంటూ, కొట్లాడుకొంటూ కాలాన్ని వృథాపరచడం చూసి శంకరులు తీవ్రంగా వ్యధ చెందారు.
ఆ తరుణంలోనే శంకరాచార్యులు అద్వైతమతాన్ని స్థాపించారు. అహం బ్రహ్మాస్మి, తత్వమసి సిద్ధాంత భావజాలం వ్యాప్తిచేసి, తనలో ఉన్న దైవాన్ని ముందు దర్శించి, ఎదుటివారిలోనూ దైవాన్ని దర్శించి తరించమనే బోధతో పలువురిని ఆకట్టుకున్నారు. పరమశివుడు, మహావిష్ణువు వేరు కాదు. వివిధ రూపాల్లో కనిపించినా ఇరువురూ ఒక్కరే అని చాటిచెప్పి, 'శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే' అని ప్రబో ధించారు. అజ్ఞానాన్ని పారదోలి వివేకవంతులను చేశారు. సూర్యుణ్ని, గణపతిని, అమ్మవారిని, పరమశివుణ్ని, మహావిష్ణువును ఆరాధ్యదేవతలుగా, ఇష్టదైవాలుగా నమ్మి పూజించే ఎవరినీ నిరాశపరచకుండా, ఏ దైవాన్నీ ద్వేషించకుండా అందర్నీ ఒక పీఠంపైనే కూర్చోబెట్టి పూజ చేయవచ్చని నచ్చజెప్పి పంచాయతన పూజను ప్రోత్సహించారు.

పంచాయతన పూజలో ఇష్టదైవాన్ని పీఠంపై మధ్య భాగాన ప్రతిష్ఠించి పూజిస్తారు. ఉదాహరణకు శ్రీ మహావిష్ణువు ప్రీతి అయినవారు విష్ణువును మధ్యలో ఉంచి మిగతా నాలుగు మూలలా అంబికను, పరమశివుని, సూర్యనారాయణమూర్తిని, గణపతిని ప్రతిష్ఠించి, పూజించమని బోధించారు. శివుడు ఆరాధ్యదైవమైతే మధ్యలో శివుణ్ని, అలాగే గణపతి, అంబిక, సూర్యుణ్ని కూడా ఉంచి పూజించవచ్చని తెలియజేసి అందర్నీ శాంతింపజేశారు. ఆదిశంకరులు దూరదృష్టితో ఈ పంచాయతన పూజను ప్రోత్సహించారు. ఏ దేవతను పూజించినా భక్తి ప్రధానమని, నదులన్నీ చివరకు సాగరాన్ని చేరినట్లు మనం చేసే పూజలూ ఇష్టదైవానికే చెంది భగవంతుడు అందరినీ అనుగ్రహిస్తాడని చెప్పి పలువురి కనులు తెరిపించి జగద్గురువులుగా ప్రసిద్దిచెందారు.

ఆది శంకరాచార్యులు ఉపనిషత్తులకు భాష్యం చెప్పడమే కాకుండా పలు దేవతాస్తోత్రాలు రచించారు. తన వాక్చాతుర్యంతో మేధస్సుతో, పెక్కుమంది పండితులతో వాదించి వారిని ఓడించి శిష్యులను చేసుకున్నారు. అద్వైత మతాన్ని దేశవ్యాప్తంచేసి, హిందూ ధర్మాన్ని నిలబెట్టి భారతీయులకు, ఈ విశ్వానికి ఎనలేని సేవ చేశారు. దేశంలో ఎన్నో దేవాలయాలను పునరుద్ధరింపజేసి, పూజాదికాలు సక్రమంగా జరిగేటట్లు ఏర్పాట్లు చేశారు. శివానందలహరి, సౌందర్యలహరి, భజగోవిందం వంటి మహద్గ్రంథాలను లోకాలకు అందించారు.

ఆది శంకరులు దూరదృష్టితో ఆలోచించి దేశం నలుమూలలా నాలుగు పీఠాలను ఏర్పాటు చేసి, హిందూధర్మం శాశ్వతంగా నిలిచేటట్లు చేశారు. దేశంలో నాలుగు దిక్కులా- ఉత్తరాన హిమాలయాల దగ్గర బదరీనాథ్‌లో, పశ్చిమాన ద్వారకలో, తూర్పున పూరీజగన్నాథ్‌లో, దక్షిణాదిన శృంగేరిలో పీఠాలు నెలకొల్పారు. తన ముఖ్య శిష్యులను పీఠాధిపతులు చేశారు. మానవాళి ధర్మపథంలో నడవడానికి మార్గదర్శకులుగా వ్యవహరించారు. ఇది మానవాళి తరించడానికి ఆదిశంకరులు పెట్టిన భిక్ష!
- మహాభాష్యం నరసింహారావు

Wednesday 18 September 2013

పద్మనాభ చతుర్దశి

 కామితార్థాలు ఈడేరాలనే కోరికతో కొన్ని, కష్టాలూ బాధలనుంచి గట్టెక్కించమనే తలంపుతో కొన్ని వ్రతాలు చేస్తుంటారు మానవులు. ప్రకృతిలోని వనరులపట్ల కృతజ్ఞత తెలుపుతూ చేసేవీ కొన్ని ఉన్నాయి. భాద్రపద శుక్ల చతుర్దశినాడు చేసే అనంత పద్మనాభవ్రతం పై మూడు కోవలకీ చెందుతుంది. అరణ్యవాస క్లేశాన్ని అనుభవిస్తున్న పాండవులు తమ కష్టాలు గట్టెక్కే మార్గాన్ని సూచించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నారట. అప్పుడాయన 'అనంత పద్మనాభవ్రతం' చేస్తే కష్టాలు తొలగిపోతాయని తెలిపినట్లు భాగవత కథనం.

శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పిన వ్రతకథగా ప్రచారంలో ఉన్నదిది. కృతయుగంలో సుమంతుడనే పండితుడి భార్య దీక్ష. వారి కుమార్తె 'శీల'. దీక్ష మరణించడంతో 'కర్కశ' అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె సవతి కూతురుపట్ల దారుణంగా ప్రవర్తించేది. శీల అత్తవారింటికి వెళుతున్న సమయంలో సారె పెట్టి పంపలేదు. అది గమనించిన సుమంతుడు భార్యకు తెలియకుండా కొంత 'సక్తు(పేల)పిండి'ని మూటకట్టి ఇచ్చాడు. అది తీసుకుని భర్త అయిన కౌండిన్యుడితో అత్తవారింటికి వెళుతోంది. తోవలో నదీతీరాన కొందరు స్త్రీలు ఒకవ్రతం చేస్తుండటం గమనించి, విధానం తెలుసుకుని, తానూ ఆ పూజలో పాల్గొని తోరం కట్టుకుంది శీల. తన దగ్గరున్న సక్తుపిండిని సగం వాయనమిచ్చి మిగిలిన సగంలో కొంత భర్తకు ప్రసాదంగా ఇచ్చి, తానూ స్వీకరించింది. ప్రసాదం తిన్న కౌండిన్యుడు వివరాలు అడగలేదు. ఆ దంపతులు ఆశ్రమానికి చేరేసరికి శీల చేసిన వ్రత ఫలితంవల్ల వారికి సకల సంపదలు కలిగాయి. కౌండిన్యుడు ఒకరోజు భార్య చేతికున్న తోరం చూసి తనను వశం చేసుకోవడానికి కట్టుకున్నదని భావించి, ఎంత చెప్పినా వినకుండా తెంపి అగ్నిలో పడేశాడు. అప్పటి నుంచి ఆశ్రమాన్ని దారిద్య్రం అలముకుంది. తరవాత అసలు విషయం తెలుసుకుని తాను చేసిన అపచారానికి చింతించాడు. అనంతుడి అనుగ్రహం కోసం ఎంతగానో పరితపించాడు. చివరికి నీరసించి పడిపోయిన కౌండిన్యుడికి అనంతుడు దర్శనమిచ్చి అనుగ్రహించాడని శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పిన కథ.

ఈ వ్రతంలో పద్నాలుగు సంఖ్యకు విశేష ప్రాధాన్యం ఉంది. విష్ణువు పద్నాలుగు భువనాలకీ స్థితి కారకుడు. అవి వూర్ధ్వలోకాలైన భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు. ఏడు అధో లోకాలు- అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ అనేవి. వాటి మొత్తం సంఖ్య విష్ణు ఆరాధనలో ముఖ్యపాత్ర పోషిస్తుందన్నది విష్ణుపురాణ కథనం. పూజాక్రమంలోనూ ఆ సంఖ్యే అత్యంత ప్రాధాన్యం వహిస్తుంది.

విష్ణువును, అతడి శయ్య అయిన ఆదిశేషు(అనంతు)డినీ కలిపి ఆరాధించడం, వారితోపాటు యమునా జలాలను పూజించడం ఇందులో ప్రధానం. ఈ వ్రతం చేసేవారు వేకువజామునే మేల్కొని, శుచిగా తూర్పు, ఉత్తర, ఈశాన్య దిక్కుల్లో అవకాశాన్ని బట్టి ఒకచోట గోమయంతో అలికి, అష్టదళ పద్మం వేసి దానిమీద పూర్ణకలశం ఉంచాలి. దానిలో యమునానది నీటిని పోయాలి. (లభ్యంకాకపోతే ఆవాహన చేయాలి). ఆ కలశం పక్కన దర్భలతో ఆదిశేషుని (అనంతుని) పద్నాలుగు పడగలకు ప్రతీకగా పద్నాలుగు ముడులతో ప్రతిమను చేసి నిలపాలి. విష్ణుమూర్తి (పద్మనాభుని) రూపానికి ప్రతీకగా పద్నాలుగు ముడులతో తోరాన్ని తయారు చేసి అనంతుడి ప్రతిమ పక్కన ఉంచి, విష్ణు సహస్రనామాలతో విధివిధానంగా పూజించాలి. పూజానంతరం గత సంవత్సరం కట్టుకున్న తోరాన్ని విసర్జించి కొత్త తోరాన్ని కట్టుకోవాలి. ఇలా చేయడంవల్ల విష్ణుశక్తి వారిని ఎల్లవేళలా కాపాడుతుందని నమ్ముతారు. పద్నాలుగేసి చొప్పున పద్నాలుగు రకాల పిండివంటలు తయారుచేసి, నివేదన చేసి వాటిలో సగం వాయనం ఇచ్చి, మిగిలిన వాటిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇలా పద్నాలుగు సంవత్సరాలు గడిచాక ఉద్యాపన చేయాలి. ఆపై వీలున్నవారు తిరిగి ప్రారంభించి మరో పద్నాలుగు సంవత్సరాలు చేయాలని భవిష్యోత్తర పురాణ కథనం. దీనికి త్రయోదశితో కూడిన చతుర్దశి పనికిరాదు. పూర్తి చతుర్దశి ఉన్నరోజైతే సాధారణ ఫలితం ఉంటుంది. పౌర్ణమి గడియలు కలిస్తే సర్వశ్రేష్ఠమని చెబుతారు.

పూజలో యమునకు ప్రాధాన్యమివ్వడానికి కారణం... గోవు (ఆవు, పులి కథలో) తన సత్యసంధతను యమున ఒడ్డునే నిరూపించుకుందని. ఆ సంఘటన జరిగిన తిథి భాద్రపదశుక్ల చతుర్దశి అని, దానికి సాక్షీభూతమైన యమునను ఈ దినం పూజిస్తారు. దీనివల్ల పశుసంపదకు మేలు కలుగుతుందని భావిస్తారు. ఈ వ్రతాన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఉత్కళ(ఒడిశా) ప్రాంతీయులు 'అఘోర చతుర్దశి' అంటారు. మహారాష్ట్రులు, వంగదేశీయులు, రాజస్థానీయులు ఈ వ్రతాన్ని 'పాలీ చతుర్దశివ్రతం', 'కదళీవ్రతం' అనీ పిలుస్తారు. దీన్ని దక్షిణాది రాష్ట్రాల్లో వైష్ణవ సంప్రదాయానుయాయులు ఎక్కువగా ఉన్న తమిళనాడులో విశేషంగా జరుపుతారు.
- అయ్యగారి శ్రీనివాసరావు

Tuesday 17 September 2013

పంచామృత కలశం

  వృద్ధాప్యం పాపం కాదు. వృద్ధాప్యం శాపం కాదు. అదో పక్వఫలం. జీవన పోరాటంలో పోరాడి గెలిచి, కాలానికి ఎదురు నిలిచిన విజేత వృద్ధుడు. అయితే అంతటి యోధుడూ భీరువైపోతున్నాడు. డీలా పడిపోతున్నాడు. వయసు మానని గాయంలా బాధపెడుతోంది. భయపెడుతోంది.

ఈ చరాచర సృష్టి యావత్తూ పరిణామశీలమే. ప్రతి ఒక్కటీ మార్పు చెందేదే. నాశనమయ్యేదే. ఆది ఉన్నచోట అంతం తప్పదు. ఈ మధ్యలోదే జీవితం. అనుభవం. పరిణామం. మనిషి జీవితంలోనే నాలుగు ఆశ్రమాలున్నప్పుడు శరీరంలో ఉండవా? అవే బాల్య, కౌమార, యౌవన, వృద్ధాప్యాలు. వానకాలం వచ్చేస్తోందని చీమలు సైతం వేసవిలోనే ఆహారాన్ని సేకరించి పెట్టుకుంటాయి. గుడ్లు పెట్టే సమయానికి ముందే పక్షులు గూళ్లు కట్టుకుంటాయి. అవన్నీ పరిణామాన్ని అంగీకరిస్తున్నాయి. ఆహ్వానిస్తున్నాయి. ఆస్వాదిస్తున్నాయి. బుద్ధి, జ్ఞానాలున్న మనిషి మాత్రం అలా ఎందుకు చేయలేకపోతున్నాడు? పుట్టిన మరుక్షణమే బిడ్డకు అందే క్షీరం అమ్మ అడిగిందా, శిశువు కోరాడా? ఎవరికి ఎప్పుడు ఏమివ్వాలో ఆ మహాధార్మికుడు, దాత ఇచ్చే తీరతాడు. వృద్ధాప్యమూ ఆయన ఇచ్చిందే. ఏం కావాలో ఏం చేయాలో ఆ కర్తకు తెలీదా? కాకపోతే అనుభవించేందుకు మన కర్మఫలాలతోపాటు ఆచరించేందుకు కొన్ని కర్తవ్యాలూ ఉంటాయి. వాటిని విస్మరించి పైకి చూస్తే కళ్లలో దుమ్ము మాత్రమే పడుతుంది. ధూళి మాత్రమే రాలుతుంది.

వృద్ధాప్యం పక్వమై మిగలపండిన ఫలం. నవరసాల అనుభవసారం. గోక్షీరం, గోదధి, గోఘృతం, చక్కెర, చక్కెరకేళీలతో నిండిన పంచామృత కలశం. దుర్భరం, దుర్మార్గం కాదు. పంచదారనైనా పక్వపాకంగా వాడుకోవాలి. లేకపోతే వెగటు పుడుతుంది. మూతగల తగిన పాత్రలో భద్రపరచుకోవాలి. లేకపోతే చీమలు, ఈగలు మూగిపోతాయి. వృద్ధాప్యంలాంటి సున్నిత శారీరక, మానసిక స్థితిని తగినట్లుగా నిభాయించాలి.

వృద్ధాప్యంలో ముందుగా భయపెట్టేది అనారోగ్యం. ఆపై పిల్లల అలక్ష్యం. అవికాక మరెన్నో. వృద్ధాప్యం అనారోగ్యానికి నిర్వచనం కాదు. లేదా అనారోగ్యం వృద్ధాప్యానికి నిర్వచనం కాదు. అలా అయితే ప్రతి వృద్ధుడూ అనారోగ్యాన పడాలి. లేదే!? కొందరు శతాధిక వృద్ధులూ ఉల్లాసంగా జీవించేస్తుంటారు. దీనికి కారణం జీవన విధానం. జీవితాన్ని స్వీకరించే వైఖరి. జీవితం పట్ల తగిన దృక్పథం. చివరిక్షణం వరకూ జీవితాన్ని పూర్తి అవగాహనతో ఆస్వాదించాలనే ఆకాంక్ష అనారోగ్యాన్ని చాలావరకు దూరంగా తరిమేస్తుంది. ముందునుంచీ ఆరోగ్యంపట్ల అవగాహన, శ్రద్ధ, తగిన జీవన విధానం, సానుకూల దృక్పథం... ఇవన్నీ వ్యాధులకు... చికిత్సకు ముందే నివారణగా పనిచేస్తాయి. మనం ఆరోగ్యంగా ఉండటమన్నది మనకంటే ముఖ్యంగా ఆత్మీయులకు, సమాజానికి ముఖ్యం. అవసరం.

వృద్ధులైనా, పిల్లలైనా చైతన్యవంతమైన పనుల్లో పాలుపంచుకోనివారి పట్ల కొంత ఉదాసీనత సహజమే. సమయాభావం కారణం కావచ్చు. అవసరమైన వ్యక్తుల పట్ల కొంత అధిక శ్రద్ధ వహించే అవసరం కారణమై ఉండవచ్చు. వృద్ధుల ఆరోపణ కొంత నిజమైకూడా ఉండవచ్చు. ఏ వయసువారికైనా ఆదరణలు, ప్రాధాన్యాల్లో అడపాదడపా కొంతకోత తప్పదు. అది వృద్ధులూ అర్థం చేసుకోవాలి. నిస్వార్థంగా, నిష్కామంగా కుటుంబాన్ని ప్రేమించాలనుకున్నప్పుడు, సమాజాన్ని సేవించాలనుకున్నప్పుడు ఈ పట్టింపులు పరిగణనలోకే రావు. రాకూడదు. మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ పోవడమే. దానిలోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ పోవడమే. అన్నింటికంటే ముఖ్యంగా, జీవితం అత్యంత అమూల్యం. క్షణక్షణం అమృత బిందు సమానం. చివరి క్షణాన్నీ ప్రయోజనకరంగా ఆస్వాదించే దిశగా ప్రణాళిక రచించుకుందాం. వృద్ధాప్య భయాన్ని అధిగమిద్దాం.
- చక్కిలం విజయలక్ష్మి

Monday 16 September 2013

వామన జయంతి


 'ర్మ సంస్థాపనకోసం అవసరమైన సందర్భాల్లో అవతరిస్తూనే ఉంటా'నని శ్రీమహావిష్ణువు అభయ ప్రదానం చేశాడు. ఆ పరంపరలో ఆవిష్కారమైన అయిదోది వామనావతారం. భాద్రపద శుద్ధ ద్వాదశినాడు అదితి, కశ్యపుల కుమారుడిగా శ్రీహరి వామనమూర్తిగా అవతరించాడు. దీన్ని వామన ద్వాదశిగా, విజయ ద్వాదశిగా వ్యవహరిస్తారు. సృష్టిలోని జీవావరణంలో జీవులు సూక్ష్మరూపం నుంచి మహా భారీకాయం వరకు వైవిధ్యభరితంగా గోచరమవుతాయి. ఈ అణుత్వం, మహారూపాలు పరస్పర విరుద్ధమైనవి. కానీ, ఆ వైవిధ్యం ఆత్మ, పరమాత్మల విషయంలో లేదని వేదోక్తి. ఆత్మ అణువు కంటే సూక్ష్మమైనది, మహత్తరమైనది. అది ఎంత సూక్ష్మమైనదో, అంత స్థూలమైనదని కఠోపనిషత్తు ప్రకటించింది. వామనావతార నేపథ్యం ఇదే!

వామనావతార విశేషాల్ని శ్రీమద్భాగవతం, వామన పురాణాలు విశదీకరిస్తున్నాయి. ఓసారి బలి చక్రవర్తి ఇంద్రుణ్ని ఓడించి, స్వర్గానికి అధిపతి అయ్యాడు. విజయగర్వంతో రాక్షసులు అనేక అకృత్యాలకు పాల్పడసాగారు. దాంతో దేవతల మాతృమూర్తి అదితి కలత చెంది, కేశవుణ్ని వేడుకుని, అనుగ్రహాన్ని పొందింది. ఫలితంగా నారాయణుడు దేవతల రక్షణార్థం వామనుడిగా అవతరించాడు. అతనికి ఉపనయన సంస్కారాలు జరిగాయి. బ్రహ్మ తేజస్సు, దివ్య యశస్సులతో వెలిగే వటుడైన వామనుడు దండాన్ని, గొడుగును, కమండలాన్ని ధరించి బలి చక్రవర్తి నిర్వహించే యజ్ఞశాలలోకి ప్రవేశించాడు. 'స్వస్తి జగత్త్రయీ భువన శాసనకర్తకు...' అంటూ బలిని ఆశీర్వదించాడు. సందర్భోచిత లౌక్యాన్ని ప్రదర్శించాడు. వామనుడి వర్చస్సు, వాక్చాతుర్యానికి ముగ్ధుడై బలి చక్రవర్తి ఏం కావాలో కోరుకొమ్మన్నాడు. 'కేవలం నా పాదాలకే పరిమితమైన మూడు అడుగుల భూమిని మాత్రం నాకివ్వు చాలు' అన్నాడు వామనుడు. ఆ వటుడి రూపంలాగానే అతడి కోరిక కూడా కురచగానే ఉందని బలి భావించాడు. భూ దానానికి సమాయత్తమైన బలిని అతడి గురువు శుక్రాచార్యుడు నిలువరించాడు. అయినా బలి శుక్రుడి మాట వినకుండా, వామనుడికి ఉదకపూర్వకంగా భూమిని దానం చేశాడు. త్రివిక్రముడిగా వామనుడు విరాట్‌ రూపాన్ని సంతరించుకుని, ఓ పాదంతో భూమినీ, మరో పాదంతో స్వర్గాన్నీ ఆక్రమించి, మూడోపాదం బలి శిరస్సుపై ఉంచి, అతణ్ని రసాతలానికి అణగదొక్కాడు. బలి సర్వ సమర్పణా భావానికి ప్రసన్నుడైన వామనుడు సుతల లోక రాజ్యాన్ని అనుగ్రహించాడు. ఇంద్రుడికి తిరిగి స్వర్గలోకాధిపత్యాన్ని కల్పించాడు.

వామన పురాణంలో ఇదే గాథను పోలిన మరో వృత్తాంతం గోచరమవుతుంది. దుంధుడు అనే దానవుడు దేవతలపై దండెత్తే బలాన్ని సమకూర్చుకోవడానికి దేవికా నదీ తీరాన అశ్వమేధ యాగం చేయసాగాడు. దుంధుణ్ని యుక్తితో జయించాలని, శ్రీహరి వామన రూపంలో దేవికానదిలో ఓ దుంగలాగా తేలుతూ కొట్టుకుపోసాగాడు. దుంధుడు, అతడి అనుచరులు ఆ బాలుణ్ని రక్షించారు. తన పేరు గతి భానుడనీ, తాను మరుగుజ్జునైనందువల్ల ఆస్తి వివాదాల్లో తనను దాయాదులు నదిలో పడవేశారని చెప్పాడు. అతడి దీనగాథను విని దుంధుడు ఏం కావాలో కోరుకొమ్మన్నాడు. మూడడుగుల నేల కోరిన వామనుడు ఆ సంవిధానంలోనే దుంధుణ్ని భూమిలోకి తొక్కి సమాధి చేశాడని పురాణగాథ.

వామనావతారం ఆత్మ తత్వాన్ని అద్భుతంగా ప్రకటించింది. జీవుడు తనలో ఉన్న ఆత్మ, విశ్వాంతరాళంలో ఉన్న పరమాత్మ ఒక్కటేనని జ్ఞానపూర్వకంగా గుర్తించాలి. ఆ స్పృహ ఏర్పడే కొద్దీ వామనరూపం అనూహ్యంగా పెరిగి పెద్దదై, విశ్వవ్యాప్తమై, పరమాత్మ తత్వమై భాసిల్లుతుంది. యజ్ఞయాగాదులనేవి పేరుకోసం చేయవద్దనీ, నేను ప్రభువును, నేను గొప్ప దాతనని గర్వించడం తగదని భగవద్గీత హెచ్చరించింది. పరుల ధనాన్నీ, భూమిని ఆక్రమించడం, దానం చేయడం, నేను కర్తను, భోక్తను అని విర్రవీగేవారు అజ్ఞానులని ఈశావాస్య ఉపనిషత్తు చెబుతోంది. ఈ నేపథ్యమే బలి పతనానికి దారి తీసింది. మనిషి బిందు స్థితిలో బీజప్రాయంగా నిద్రాణంగా ఉన్న శక్తిని ఆత్మవిశ్వాసంతో గుర్తించాలి. దీని ద్వారా మనిషి మహనీయుడిగా ఎదగవచ్చని వామనావతారం సందేశమిస్తుంది.

- డాక్టర్‌ కావూరి రాజేశ్‌పటేల్‌

Sunday 15 September 2013

ముక్తికి మార్గం


 'కూర్చోవడానికి నాకు కాస్త చోటిస్తే ఆ తరవాత నిద్రపోవడానికి కావలసిన జాగా నేను సంపాదించుకోగలను' అనేది ఆంగ్ల సామెత. అరిషడ్వర్గాల విషయంలోనూ ఈ సామెత వర్తిస్తుంది. అరిషడ్వర్గం అంటే ఆరుగురు శత్రువులు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనేవి వాటి పేర్లు. ఇవి బయటికి కనిపించని శత్రువులు. వీటిది రాక్షస ప్రవృత్తి. చూస్తూ ఉండగానే అలాగలాగ ఆకాశం మీదికి ఎదిగిన వామనుడు పాతాళ లోకంలోకి బలిచక్రవర్తిని తొక్కివేసినట్టుగా గోరంతగా ఉన్న కామం (కోరిక) కూడా కొండంతగా పెరిగి తన మిత్రువైన క్రోధాదులతో సహా మనల్ని మూకుమ్ముడిగా ముట్టడించి మరి లేవనివ్వకుండా మట్టి కరిపించి మనల్ని నాశనంచేస్తుంది. అందుచేత మనమంతా మనసును కట్టడి చేసుకోవాలి. నిగ్రహాన్ని అలవరచుకోవాలి. అనంతంగా ఉండే కోరికల్ని అదుపులో పెట్టుకోవాలి. అంతటితో తృప్తిచెంది ఆగిపోకుండా అసలు కోరికలనేవే లేకుండా చేసుకోవాలి. అప్పుడే మనసుకు శాంతి, ఆనందం లభిస్తాయి. ఆ తరవాతనే మోక్షానికి దారి సుగమమవుతుంది.

ఇంద్రియాలను వశపరచుకోవడానికి సాధన అవసరమని అనుభవజ్ఞులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇంద్రియాలు ఎంతో శక్తిమంతమైనవి. మనల్ని అవి బలవంతంగా విషయవాసనలవైపు అంటే, కోరికలవైపు మళ్ళిస్తాయి. మనసును వాటి అధీనంలో పెట్టుకుంటాయి. ఇంద్రియాలు విద్వాంసుని సైతం అస్థిరపరుస్తాయని వ్యాసభగవానులు వెల్లడించారు. అందువల్ల మానవులకు మనోనిగ్రహం అవసరమవుతుంది.

ఇంద్రియ నిగ్రహంవల్ల మనకు సుఖసంతోషాలు లభిస్తాయి. ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఈ స్థితిలోనే మోక్షం ప్రాప్తిస్తుందని పెద్దలంటారు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం మొదలైన జ్ఞానేంద్రియాల్లా చిత్తం (మనసు) కూడా ఒక ఇంద్రియం. ఈ ఇంద్రియాలకు సంబంధించిన శబ్దస్పర్శాది బాహ్యవిషయాల నుంచి మనసును మరల్చి దాన్ని అంతర్ముఖంగా పయనింపజేస్తే అప్పుడది అంతరాత్మలో అచంచలంగా సుస్థిరంగా కొలువై ఉండగలుగుతుంది. ఈ విధంగా సర్వేంద్రియాలను విషయవాసనల నుంచి దూరంగా ఉంచి భగవంతుడిపట్ల మనసును లగ్నం చేసుకొంటే మోక్షప్రాప్తి కలుగుతుందని గీతలో గోవిందుడు తెలియజెబుతాడు. ఇంద్రియ నిగ్రహంతోపాటు ఆత్మచింతన- ఈ రెండూ మోక్షానికి అవసరమని మనం తెలుసుకోవాలి.

మనసు స్వచ్ఛమైనది. నిర్మలమైనది. తెల్లకాగితం లాంటిది. ఏ మచ్చలూ మరకలు లేనిది. మనకళ్లముందు ఎన్నో దృశ్యాలు, ఎన్నెన్నో వస్తువులు, సుందరమైనవి, ఆకర్షణీయమైనవి కనిపిస్తూ ఉంటాయి. వాటిని గురించి మనసు మొదట ఆలోచిస్తుంది. ఆ తరవాత అటువైపు మొగ్గుతుంది. ఆకర్షితమవుతుంది. ఆసక్తి పెంచుకుంటుంది. వాటి లో తనకు నచ్చినవాటిని కావాలని కోరుకుంటుంది. అనుభవించాలని ఆకాంక్షిస్తుంది. ఈ ఆకాంక్షనే లేదా కోరికనే కామం అంటారు. కోరికను తీర్చుకోవడానికి మనం చేసే పనిలో అడ్డుతగిలిన వారిమీద క్రోధం కలుగుతుంది. ఈ విధంగా కామం వెన్నంటే క్రోధం కూడా మనలో ప్రవేశిస్తుంది. కామ క్రోధాల అనుబంధం విడదీయరానిదని పెద్దలందుకే అంటారు. క్రోధంవల్ల ముఖం ఎర్రగా జేవురిస్తుంది. కళ్లు చింతనిప్పులవుతాయి. ముఖం వికృతంగా తయారవుతుంది. దాంతో మనలోంచి వివేకం పలాయనం చిత్తగిస్తుంది. అవివేకం కారణంగా ఏం చేస్తున్నామో మనకే తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. మన శరీరాన్ని మనమే మరిచిపోతాం. బుద్ధి నశించి చేయకూడని ఏ చెడ్డపనినో చేసేస్తాం. నాశనమవుతాం. కాబట్టి మానవులకు ఇంద్రియ నిగ్రహం ఎంతో అవసరం.

సాధారణంగా మనం చేస్తున్నదేమిటంటే- ఆకర్షణీయంగా కనిపించే బాహ్య వస్తువుల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. దైవధ్యానం గురించి అంతగా పట్టించుకోం. ఈ వైఖరి ఎట్టి పరిస్థితిలోనూ మానవుడికి మేలు చేయదు. విషయవాంఛలనుంచి మనసును దైవం వైపు మళ్ళించాలి. ఇందుకోసం రాగద్వేషాలు లేకుండా మనసును నిర్మలంగా ఉంచుకోవడం అవసరం. మనోనైర్మల్యం వల్లనే ఆనందం లభ్యమవుతుంది. దుఃఖం అంతరిస్తుంది. కష్టాలు ఉండకూడదనీ, ఆనందంగా ఉండాలనే గదా ప్రతి ప్రాణీ కోరుకునేది!

ఇంద్రియాలను, వీటితోబాటు మనసును స్వాధీనంలో ఉంచుకున్న వ్యక్తికి శాంతి, ఆనందం లభిస్తాయన్నది కృష్ణపరమాత్మ గీతలో చెప్పిన మాట. భోగలాలస లేని నిర్మలమైన మనసే మోక్షమని వసిష్ఠ గీత బోధిస్తోంది. ఆత్మతో సమానంగా చిత్తం కూడా నిర్మలమై భాసిల్లే స్థితినే మోక్షమంటారని పతంజలి యోగశాస్త్రం వెల్లడిస్తోంది. అందుకే మనో నిగ్రహంతోనే ముక్తికి మార్గం సుగమమవుతుందని గ్రహించాలి.
- కాలిపు వీరభద్రుడు

Saturday 14 September 2013

సంతోషం

                                       
   
నంద కిరణాలను మనమే వెతుక్కోవాలి. సూర్యుడు అస్తమించి, అంధకారం ఆవరిస్తున్నదే అని దిగులుపడే బదులు చుక్కల్ని చూసి ఆనందించే సమయం వచ్చిందిగదా అని సంతోషించవచ్చు. అంతర్యామి ఆనందనిలయుడు. 'కష్టకాలంలో ఇష్టదైవాన్ని స్మరిస్తుంటాం. సంతోషంగా ఉన్నప్పుడు సర్వేశ్వరుడు స్మరణకు వస్తాడా? అప్పుడు కూడా దైవం మన మదిలో మెదిలితే ఇక జీవితంలో విషాదానికి తావే ఉండదు' అంటాడు కబీరుదాసు. భౌతిక స్పర్శ వల్ల కలిగే సుఖం నిజమైన సంతోషాన్ని ఇవ్వలేదు. రమణమహర్షి, రామకృష్ణ పరమహంస శారీరక బాధలను పట్టించుకోలేదు. సంతోషంగా తనువులు చాలించగలిగారు. 'బాధే సౌఖ్యమనే భావన' చేయమన్నాడొక కవి.

ఆనందాల్లో కూడా మంచివీ చెడ్డవీ ఉంటాయి. మూర్ఖుడొకడు అబలలను ఏడిపిస్తుంటాడు. 'చదువుకొని ఉద్ధరించరా' అని బడికి పంపితే, తోటి విద్యార్థినిని అశ్లీలపు మాటలతో వెంటాడుతూ ఉంటాడొక యువకుడు. ఇంకొక దుశ్శీలుడు పవిత్ర క్షేత్రంలో అపవిత్రంగా ప్రవర్తిస్తూ పైశాచికానందం పొందుతాడు. వీళ్లందరూ పొందుతున్నది ఏ విధమైన ఆనందం? రాక్షసుల వికటాట్టహాసం వెనక ఉన్నది క్రౌర్యమేగాని సంతోషం కాదు. 'మంచి నుంచి పుట్టినదే నిజమైన సంతోషం. పరపీడనంతో పొందేవి నిజమైన సంతోషాలు కావు' అన్నాడు తిరువళ్లువర్‌.

పాపం పుణ్యం తెలియని పసివాడు మిడతను పట్టుకొని, దాని కాళ్లూ రెక్కలూ లాగి ఆనందిస్తుంటాడు. అతడి ఆనందం చూసి పెద్దలు ముచ్చటపడిపోతూ ఉంటారు. దీనికి బదులు వడలిపోయే మొక్కకు చేరెడు నీళ్లు పోసో, దిక్కుమాలిన కుక్కపిల్లకు కొంచెం పాలు తాగించో- సంతోషించడం పిల్లలకు నేర్పాలి. ఈ సంతోషం సంతృప్తిని మిగిలిస్తుంది. లేకుంటే హింసావాదులు తయారవుతారు. ఒకరిని బాధించి, ఇంకొకరికి సంతోషం కలగజేయడం హేయం. తాను బాధపడుతూ పరులకు సంతోషం కలగచేయడం త్యాగం.

శిల్పి సుత్తితో ఉలిపై కొడుతూ నయనానందకరమైన శిల్పాలు చెక్కుతాడు. ఉలిని చూసి సుత్తి జాలిపడింది.

'ఉలీ, నీ నెత్తిన నేను ఎన్నోసార్లు కొడుతూ ఉంటాను... పాపం, నీకెంత బాధ కలుగుతున్నదో!' ఉలి చలించలేదు. చిరునవ్వుతో సమాధానమిచ్చింది. 'అన్నా! నీ దెబ్బ నాకు తగిలే ప్రతిసారీ, నా మొనతో చెక్కే మనోహర శిల్పాన్నే తలచుకుంటాను. నాకు ఆనందమే కలుగుతుంది!'

'పాపం! అప్పుడప్పుడు శిల్పి నిన్ను ఆకురాతితో అరగదీస్తుంటాడు. ఎంత కుమిలిపోతావో ఏమో!'

'లేదు! మరింత పదునుగా తయారై, సుకుమార శిల్పాలను సైతం చెక్కడానికి పనికొస్తానుగదా అని సంతోషిస్తాను.'

'పనికిరాని రాతి బండలను చెక్కే కఠినమైన పని నీతో చేయించడం విచారకరం గదూ!'

'కానే కాదు! ఎందుకూ పనికిరాని శిలలను సైతం మనోహర శిల్పాలుగా మలుస్తున్నానుగదా అని పొంగిపోతాను!'

'కొన్నాళ్లు నీతో పనిచేయించుకొని, తరవాత నిన్ను పాత వస్తువుల్లోకి విసిరిపారేస్తారు. సరికొత్త ఉలితో తమ పని కొనసాగిస్తారు. పాపం! నువ్వు దిగులుతో కుళ్లి కుళ్లి ఏడుస్తావు! అవునా?'

'కాదు! నేను బాగా ఉన్నంతకాలం మంచి పనులకు ఉపయోగపడ్డానుగదా అని సంతోషంతో, సంతృప్తిగా శేషజీవితాన్ని గడుపుతాను!'

మనిషికి ఈ ఉలి మంచి ఆదర్శం. భగవంతుడు ఒక ఇనప ముక్కకు కూడా సార్థక జన్మనే ఇచ్చాడు. సర్వమూ 'ఆతని' దివ్యకళామయమని భావించేవారికి అంతా సంతోషమే!

ఏ ఒక్కరినో సంతోషపెట్టడానికి చేసే ఒక మంచి పని అందరికీ ఆనందదాయకం కావచ్చు. అది ఆధ్యాత్మికమైనదైతే కలకాలం ఇలలో నిలుస్తుంది. జగన్నాథ్‌దాస్‌ ఒడిశాలోని కపిలేశ్వరంలో 1490లో జన్మించాడు. ఆయనను భక్తులు శ్రీ రాధిక అవతారంగా భావిస్తారు. శాక్తేయులు శ్రీ దుర్గావతారంగా పూజిస్తారు. జగన్నాథ్‌దాస్‌ తల్లి పద్మావతి. ఆమె రోజూ జగన్నాథస్వామి దేవాలయానికి వెళ్లి, పండాలు ప్రవచించే భాగవతాన్ని భక్తి శ్రద్ధలతో ఆలకించేది. పౌరాణికుడికి అందరూ కానుకలు సమర్పిస్తున్నారు. ఈమె వద్ద డబ్బులు లేవు. తానేమీ ఇవ్వలేకపోయినందుకు కన్నీరు కార్చుతూ ఆమె ఇంటికి వచ్చింది. జగన్నాథ్‌దాస్‌ తల్లి వేదనను గ్రహించాడు. శ్రీమత్‌ భాగవతాన్ని అతిసుందర, సరళ ఒరియా భాషలో, భక్తిభావ బంధురంగా రచించి తల్లికి వినిపించాడు. తన మాతృమూర్తిని సంతోషపెట్టడానికి జగన్నాథ్‌ దాస్‌ ఆనాడు రచించిన భాగవతం ఈనాటికీ లక్షల మందిని ఆనందపరవశులను గావిస్తోంది.
- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

Friday 13 September 2013

దేహ సాక్షాత్కారం


టీవలి కాలంలో అందరూ దేహ సాక్షాత్కారం కోసమే చూస్తున్నారు. అది అయ్యే ఉంది. కనిపిస్తూనే ఉంది. మరి ఎందుకో ఆరాటం? దేహమే సర్వం అనుకుంటున్నాం. దేహంతోనే కదా అంతా జరుగుతోంది అనుకుంటున్నాం. అది నిజమే. కళ్లకు కనిపించేది అదే. కాని, అదే సత్యమా? ఈ దేహం ఎంతకాలం ఉంటుంది? ఉన్నంతకాలం దీన్ని తీర్చిదిద్దుకుని అందంగా అలంకరించుకొని, చూపించుకోవాలని ఉబలాటపడతాం. దేహప్రశంసలు, పొగడ్తల కోసం అర్రులు చాస్తాం. ఆహ్లాదం కోసం దేహం, ఆనందం కోసం దేహం అని తీర్మానించేసుకుంటాం.

కొందరైతే వారి దేహానికి శాశ్వతమైన గుర్తింపు ఉండాలని బాగా ఖర్చుపెట్టి సమాధులు కూడా తయారు చేసుకోవడానికి పథకాలు రచించుకుంటున్నారు. దేహం అశాశ్వతం కదా. గుప్పెడు బూడిదే కదా. చైతన్యం తరలి వెళ్ళిపోయిన తరవాత దేహం ఎండుకట్టెతో సమానం కదా. మరి ఈ దేహం మీద వ్యామోహం ఎందుకు? అదే చమత్కారం, గారడి, మాయాజాలం, ఓ వింత నాటకం.

దేహ సాక్షాత్కారం కోసం శ్రమపడనవసరం లేదు. ఎక్కడపడితే అక్కడ దేహాలు దర్శనమిస్తూనే ఉంటాయి. సత్యం శివం సుందరం అని నిరూపిస్తున్న సృష్టి అంతా అందమైన శరీరంగా కనిపిస్తూనే ఉంటుంది. అందమైన దేహాన్ని చూస్తే ఒక పులకరింత. ఒక గొప్పదేహాన్ని చూస్తే గౌరవ భావన. ఒక రోగిష్ఠి దేహాన్ని చూస్తే ఏవగింపు. ఒక భయంకరమైన దేహాన్ని చూస్తే జలదరింపు.

'జంతూనాం నరజన్మ దుర్లభం' అన్నారు. నరుడికే ఈ దేహం మీద ఇంత వ్యామోహం. ఇన్ని రాగ ద్వేషాలు. అయినా దేహభావం విడిచిపెట్టం. విడిచి పెట్టలేం. నేను దేహం అనుకోకుండా ఉండలేం. దేహస్మరణ చెయ్యకుండా బతకలేం. దేహబాధలు మనల్ని తడిగుడ్డ పిండినట్లు పిండుతూ ఉన్నా దేహాన్ని అంటిపెట్టుకుని, చూరుకు వేలాడే గబ్బిలంలా బతుకుతూ ఉంటాం. తప్పదు. దేహం మనల్ని అలా ఆడిస్తూ మాయ కుట్రకు బలి చేస్తోంది.

సరే. ఈ దేహం తరవాత మరో దేహం ఉందా? ఉంటే దానికీ ఇదే పరిస్థితి. మార్పు ఉండదా? ఇలా ఎంతకాలం ఈ ప్రయాణం? దీనికి అంతం ఉందా? దీన్ని ఆపగలమా, దీనికి మూలం ఏమిటి, దీన్ని అన్వేషించాలా, వద్దా? 
శ్రీకృష్ణ బోధ తరవాత అర్జునుడు నిరంతరం ఆ పరమాత్మను చూడకుండా ఉండలేకపోయేవాడు. ఎప్పుడూ వెన్నంటి ఉండేవాడు. శ్రీకృష్ణ రూపం కోసం గోపికలు పిచ్చివారై తిరిగేవారు. శ్రీరాముడిది విశ్వభువనైక సౌందర్యం. 
మరి ఆ మహాత్ములు దేహాలా, ఆత్మలా? ఆ రూపాలు ఎందుకు పూజనీయమై విలసిల్లాయి? 
ఏది దేహం, ఏది ఆత్మ? కనిపిస్తే దేహం. కనపడకపోతే ఆత్మ అనుకోవచ్చా? మరి మహానుభావులందరూ ఆత్మసాక్షాత్కారం కోసమే ఎందుకు శంఖం పూరించారు? ఈ కోణంలో మనం ఆలోచిస్తున్నామా? 

మనకు ఆత్మ అక్కరలేదు. దేహమే కావాలి. అది శాశ్వతంగా ఉండిపోవాలి. కొత్త జీవకణాలతో దేహాన్ని మళ్ళీ మళ్ళీ నిర్మించుకుని, ఆయుష్షు పెంచుకునే ఏర్పాటు ఏ శాస్త్రవేత్తయినా చేస్తే, దానికి అయ్యే ఖర్చంతా భరించడానికి ఎంతోమంది కోటీశ్వరులు సిద్ధంగా ఉన్నారు. అది సాధ్యమవుతుందా? అయితే దానివల్ల ఏమిటి లాభం?

దొంగతనాలు, దోపిడిలు, కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, అవినీతికి పాల్పడుతూ దీర్ఘకాలం జీవించే బదులు మంచి పనులు చేస్తూ, ధర్మం కోసం నిలబడుతూ తక్కువకాలం జీవించినా అది శాశ్వతత్వాన్ని ప్రసాదిస్తుంది కదా. 
దేహం ఆత్మకు పూచిన పువ్వులాంటిది. దేహం ఆత్మ తాలూకు దృశ్యభాగం. దేహం ఆత్మకు పరికరం. దేహం ఆత్మ నివసిస్తున్న ఇల్లు. దేహం అద్దెకు తెచ్చుకున్న వాహనం. అందులో ఆత్మ తిరుగుతూ ఉంటుంది. దేహం ఆత్మ అనే ఆకాశంలో మెరిసే మెరుపు. దేహం దేవాలయం. జీవుడు దేవుడు. ఇలా ఎన్నో చెబుతారు... 
అయినా మనల్ని దేహభావం వీడిపోదు. ఎందుకంటే దేహం సాక్షాత్కారం అయ్యే ఉంది. ఆత్మ సాక్షాత్కారం ఇంకా కాలేదు. సర్వశాస్త్రాలు, సమస్త యోగులు, మహానుభావులు 'నువ్వు దేహానివి కాదు ఆత్మవి' అని ఘోషిస్తూనే ఉన్నారు... ఎప్పటికి తెలుసుకుంటాం?
- ఆనందసాయి స్వామి 

Thursday 12 September 2013

రామానుజుల భక్తిమార్గం


తాను బోధించే 'అష్టాక్షరి మంత్రా'నికి తన శిష్యుడు అర్హుడవునా కాదా అన్న సందేహం వచ్చిందా గురువుకు. ఇంకెవరికీ చెప్పనని మాటిస్తేనే ఆ మంత్రాన్ని ఉపదేశిస్తానన్నాడు గురువు. అతడుగ్గపట్టుకున్నది ఒక్కరోజు మాత్రమే! మర్నాడు గ్రామం మధ్యనున్న గుడిగోపురమెక్కి గొంతెత్తి ఆ మంత్రాన్ని వూరివారందరికీ వినిపించాడా శిష్యుడు.
గురువు కోపంతో మండిపడ్డాడు. 'నువ్వు చేసిన ఘోరానికి నరకానికి పోతా'వని దూషించాడు. 'ఈ మంత్ర ప్రభావంవల్ల వేలమంది స్వర్గానికి వెళ్ళగలిగితే నేను నరకానికి పోవటానికి సిద్ధమే గురువర్యా!' అని శాంతంగా జవాబిచ్చాడు శిష్యుడు.

శ్రీపెరంబుదూరులో వైష్ణవ కుటుంబంలో పుట్టిన శ్రీరామానుజులే ఆ శిష్యుడు. ఆయన గురువు యాదవ ప్రకాశ్‌. తన శిష్యుని జ్ఞానసంపద, భావప్రకాశం, చిత్తశుద్ధికి తనకంటే అతనెక్కడ ఎక్కువ కీర్తి సంపాదిస్తాడో అన్న అసూయాభయాలతో చంపించాలనుకున్నాడు గురువు. కానీ, కారణజన్ముడైన రామానుజులు చేయాల్సిన మహత్కార్యాలెన్నో ఉండబట్టి అలాంటి కుయత్నాలనుంచి తప్పించుకున్నాడు.

రామానుజులకు కులవిచక్షణ అంటే గిట్టేది కాదు. తక్కువ కులంవాడైనా కంచీపూర్ణుడనే సాధువును ఒక రాత్రి తన ఇంటికి పిలిచి అతని కాళ్ళు కడిగి ఆతిథ్యమిచ్చాడు. ఒక సద్బ్రాహ్మణుడీ పని చేయటమేమిటని కంచీపూర్ణుడు సిగ్గుపడిపోయాడు. 'సచ్ఛీలుడైన భగవద్భక్తుడెవరూ కులహీనుడు కాడు' అన్నాడు రామానుజులు.

ఆయన విశిష్టాద్వైత మతాన్ని స్థాపించాడు. మనుషులందరిలోనూ ఉండేది ఏకైక భగవత్స్వరూపమే! బ్రహ్మం, జీవాత్మ, ప్రకృతి ఈ మూడూ అవినాభావ సంబంధం కలిగినవి. జీవాత్మలన్నీ ఆ పరబ్రహ్మ స్వరూపం నుంచి చింది వచ్చిన తేజస్వాంశలే! మనిషి చేయాల్సింది కేవలం భక్తిమార్గంలో తన మూలాన్ని వెతుక్కోవటమే! అన్నింటికీ మూలపురుషుడు శ్రీమన్నారాయణుడు. ఈ జగత్తుకు విష్ణువు తండ్రి. లక్ష్మి తల్లి. మనమంతా వారి అంశలమే!

రామానుజులు శ్రీవైష్ణవ మత సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి సర్వప్రయత్నాలూ చేశాడు. హిందూమత పునరుద్ధరణే ధ్యేయంగా చూపిస్తూ తాము అవలంబిస్తున్న శ్రీవైష్ణవంలో కులాలకు ప్రాధాన్యం లేదని భక్తిచేతనే ఎవరైనా భగవంతుని కరుణకు పాత్రులనీ, అన్ని కులాలవారు సమానులని ఆలయ పూజాసంప్రదాయాల్లో పాలుపంచుకోవటానికి అవకాశం ఉందని చాటాడు. వెనకబడిన జాతులవారిని ప్రోత్సహించటం, హోమాదుల్లో వారు పాల్గొనే అవకాశాలు కలిగించటం, స్త్రీలకూ ఆచార విషయాల్లో ప్రాముఖ్యం కల్పించటం హిందూమతంలోని అన్ని కులాలవారు కలిసికట్టుగా ఉండటానికి దోహదకారి అయింది. రాజులు, రాజ్యాధికారులు, వ్యాపారులు ఇచ్చిన దానధర్మాలు, దేవాలయాలను ఆచార్యులు తీసుకోకుండా వాటిని దేవుడికే అందజేసే సత్సంప్రదాయం అప్పట్నించీ మొదలైందే.

రామానుజులు బ్రహ్మసూత్రాలు, గీతాభాష్యం, శరణాగతి గద్యంవంటి అనేక విశిష్టాద్వైత ప్రపత్తి గ్రంథాలను రచించాడు. దేశాటన చేసి తిరుపతి దేవాలయంలో లాగానే, కర్ణాటకలోని మెల్కోటేలో చెలువ నారాయణ మందిరం వంటి అనేక దేవాలయాల్లో నిర్దిష్ట పూజాసంప్రదాయాలను నెలకొల్పి... భగవంతుడికి మనుషులకు మధ్య ఉండే సంబంధం కేవలం భక్తిమార్గం తప్ప మరొకటి ఏదీ కాదని, లేదని ప్రబోధించాడు!
- తటవర్తి రామచంద్రరావు 

Wednesday 11 September 2013

భగవంతుడి భాష


నసులోని ఆలోచనల్ని వ్యక్తంచేయడానికి మనం భాషను సముచితమైన సాధనంగా వినియోగించుకుంటున్నాం. భాషాపటిమ లేనప్పుడు అభినయం, హావభావాల ద్వారా వ్యక్తంచేస్తున్నాం. మరి భగవంతుడికి కూడా భాషేదైనా ఉన్నదా? ఆ భాష ఏమిటి, ఎలా ఉంటుంది, ఆ భాష ద్వారా ఏం చెబుతున్నాడు, మనం దాన్ని ఎలా గ్రహిస్తున్నాం? ఇలాంటి సందేహాలు కలగడానికి ఆస్కారముంది.
నశ్వరమైన ఈ శరీరానికే భాష ఉన్నప్పుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడైన పరమాత్మకు మాత్రం భాషెందుకుండదు? ఉంది. భాషంటే మాటలా, వాక్యాలా, శబ్దాలా? మౌనం కూడా భాషేనా? రమణమహర్షి మౌని. ఆయన భాష మౌనమే. ఆయన బోధలూ మౌనంద్వారానే భక్తులకు సంప్రాప్తించాయి. దక్షిణామూర్తి మౌనసాధనం ద్వారానే జ్ఞానబోధ చేశాడు. అలాగే మహానుభావులెందరో మౌనంగా ఉంటూనే తత్వబోధ చేశారు. భగవంతుడూ మౌనంగానే ప్రకృతి ద్వారా మనకు జ్ఞానం ప్రసాదించాడు.

నదులు, పర్వతాలు, వృక్షాలు, కొమ్మలు, కాయలు, పూలు, పండ్లు, మేఘాలు, గాలి, నేల- వీటన్నింటిద్వారా పరమేశ్వరుడు మనకెన్నో అమూల్య సందేశాలు అందజేస్తున్నాడు. జ్ఞానసంపదను పంచిపెడుతున్నాడు. ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రతి వస్తువూ మనకు సౌఖ్యాన్ని, ఆనందాన్ని అందజేస్తోంది. సూర్యుడు వెలుగునిస్తున్నాడు. చంద్రుడు వెన్నెలనిస్తున్నాడు. పూలు పరిమళాలిస్తున్నాయి. నదులు నీటినిస్తున్నాయి. మబ్బులు వర్షిస్తున్నాయి. పక్షులు కిలకిలారావాలతో ప్రకృతిని పులకింపజేస్తున్నాయి. పొలాలు సస్యాలనిస్తున్నాయి. గోవులు క్షీరధారలిస్తున్నాయి. గాలి శ్వాస ద్వారా సకల ప్రాణికోటికీ మనుగడనిస్తోంది. సృష్టిచక్ర నిర్వహణకు ఒక్కో వస్తువుకు, ఒక్కో రకమైన సామర్థ్యం, శక్తీ ఏర్పాటు చేశాడు భగవంతుడు. అన్నీ మౌనంగా జరిగిపోతున్నా అవన్నీ భగవంతుడి భాషలే. వాటిలో వాక్యాలు, మాటలు ఉండవు. అన్నీ వేటికవే పరమాత్మ సంకేతాలు అందినట్టుగా, తమ తమ విధులను క్రమం తప్పకుండా నిర్వర్తిస్తున్నాయి. అనంతకోటి నామధేయాలున్నట్టే ఆయనకు అనంతకోటి భాషలూ ఉన్నాయి. ఎవరికి ఏ భాష ద్వారా కర్తవ్యబోధ చేయాలో అలా చేస్తున్నాడు. అలాగే మనకు తన మౌన భాష ద్వారా అనేక విధాలైన బోధలు చేస్తున్నాడు. వాటిని గ్రహించటం, ఆచరించటం- మన సుకృతం, వివేకం, ఆసక్తిమీద ఆధారపడ్డాయి.

వేదాలు, శాస్త్రపురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీతాది పవిత్రగ్రంథాల ద్వారా మనకెన్నో ధార్మిక విషయాలు, నీతి సిద్ధాంతాలు నిర్దేశితమయ్యాయి. తపస్సంపన్నులు, మునులు, రుషులు, బుధులు, వేదజ్ఞులు, పౌరాణికులు, పండిత శ్రేణులు, ప్రవక్తలు మనకు పరమాత్మ భాష ద్వారానే రసానందసిద్ధిని కలగజేస్తున్నారు. మన సుఖజీవనయాత్రకు ఉపయోగపడుతున్న విషయ పరిజ్ఞానమంతా పరోక్షంగా ఆయన భాషా వ్యవహారమే. ఒక్క మనిషి తప్ప ప్రకృతిలోని ప్రత్యణువూ నిస్వార్థంగా సేవచేస్తోంది. ఆ సేవలు, సుఖాలు పొందిన మానవుడు మాత్రం కృతజ్ఞతాహీనుడై ప్రవర్తిస్తున్నాడు. అందుకే ప్రకృతినుంచి పరమాత్మ భాషను, భావాన్నీ, సందేశాన్నీ గ్రహించి, తదనుగుణంగా నడచుకోవాల్సి ఉంది.

అనంతమైన భగవంతుడి భాషల్లో కొన్ని మనకు బాగా తెలిసినవే. అవే సత్యం, అహింస, ప్రేమ, పరోపకారం, భూతదయ, సచ్ఛీలం, క్రమశిక్షణ, సమయపాలన, నిస్వార్థబుద్ధి, త్యాగశీలత, ధర్మం, దానం, నమ్రత, వాత్సల్యం, విధినిర్వహణ... ఇలాంటివి. ఇవన్నీ మనకు ఎంత బాగా తెలుసో, అంత బాగా మనసుకు దూరంగా ఉంచుతాం. అందుకే భగవంతుడి భాష అవగతం కాదు. ఆ సద్గుణాలన్నింటినీ మహానుభావులెందరో ఎప్పుడో సుగ్రాహ్యం చేసుకున్నారు. ఆచరించి చూపారు. కనుక, వారందరికీ భగవద్భాష సుబోధకమే అయింది. ప్రధానంగా గ్రహించవలసింది- భక్తి ఒక్కటే మనల్ని ఎక్కువ దూరం తీసుకెళ్లలేదు. ఆర్తుల సేవ దానికి తోడైతేనే ఆధ్యాత్మికంగా ముందుకు పురోగమించగలం. అప్పుడే మనం భగవద్భాషను సంపూర్ణంగా సాకల్యంగా అవగాహన చేసుకున్నవాళ్లమవుతాం. సద్గురువు మార్గప్రదర్శనంలో సముచితమైన శిక్షణ పొంది, సాధనచేసి సార్థక జీవన ప్రస్థానం సాగిస్తే భగవంతుడి భాషలన్నీ మనకు అర్థమైనట్టే.

జీవించి, వికసించి, తత్వాన్ని తెలుసుకొని, ముక్తిని పొందడమే జీవితం. 'నేను' అనే మాటకు అర్థం తెలుసుకోగలిగితే, ఆ మాటను హృదయం నుంచి తొలగించగలిగితే భగవద్భాషా పరిజ్ఞానం పొందగలిగినట్టే! అదే మనం సాధించగలిగే మహత్కార్యం, మహావిజయం. అందుకే వీలైన్నన్ని భగవంతుడి భాషల్ని నేర్చుకునేందుకు ప్రయత్నిద్దాం.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి 

Monday 9 September 2013

అష్టగణేశావతారాలు

 భారతీయ ఆరాధనా సంస్కృతిలో గణపతిని బహువిధ రూపాలతో పూజించడం కనిపిస్తుంది. పురాణాల్లో, మంత్రశాస్త్రాల్లో ఎన్నో వినాయకమూర్తులు ఉన్నాయి. వాటిని ఉపాసించే పద్ధతులూ అనేకం. గణపతి అవతారాలను కొన్ని పురాణాలు చక్కగా ఆవిష్కరించాయి. ఆ అవతారాల పేర్లను, గాథలను గమనిస్తే ఎంతో చక్కని అద్భుతమైన తత్వాలు గోచరిస్తాయి. మనలో ఉన్న దివ్యత్వాన్ని ఆవిష్కరించుకోవడమే ఆధ్యాత్మిక సాధన అయితే, ఆ సాధనకు అవరోధాలే విఘ్నాలు. వాటిని తొలగించి గ్రహించే పరతత్వమే విఘ్నేశ్వరుడు.

'ముద్గల పురాణం'లో ఎనిమిది గణేశావతారాలను వివరించారు:

1. వక్రతుండావతారం: 'మత్సరా'సురుని సంహరించినది ఈ అవతారం. సింహ వాహనంపై ఉండే గణపతి ఇతడు. జీవుల 'శరీరతత్వం'లోని దివ్యత్వం ఈ గణేశ రూపం. 'దేహబ్రహ్మధారకుడు' అని పురాణం పేర్కొంది.

2. ఏకదంతావతారం: 'మదా'సురిని పరిమార్చిన ఈ గణపతి మూషికవాహనుడు. మనలో 'జీవ' (దేహి) భావంగా వ్యక్తమయ్యే చైతన్యతత్వం ఈ మూర్తి.

3. మహోదరావతారం: 'మోహాసురు'ని నశింపజేసిన ఈ వినాయకుడు మూషిక వాహనుడు. 'జ్ఞాన'చైతన్యానికి అధిపతి.

4. గజాననావతారం: సాంఖ్య (పరబ్రహ్మ) తత్వానికి అధిష్ఠానదేవతగా కొలిచే ఈ స్వామి జ్ఞానప్రదాత. 'లోభా'సురుని సంహరించిన ఈ గణపతీ మూషికవాహనుడే.

5. లంబోదరావతారం: 'క్రోధాసురుని మర్దించిన అవతారం. 'శక్తి' బ్రహ్మగా ఈయనను పురాణం కీర్తించింది. 'దేవీతత్వ' స్వరూపం- గణపతి అని పురాణ భావం. మూషికాన్ని వాహనంగా కలిగిన స్వామి.

6. వికటావతారం: 'కామా'సురుని సంహరించిన స్వరూపమిది. మయూర వాహనంపై ఉన్న స్వామి ఇతడు. 'సూర్యబ్రహ్మ'గా సౌరతత్వంగా పూజలందుకుంటున్నాడు.

7. విఘ్నరాజావతారం: ఆదిశేషుని వాహనంగా స్వీకరించిన గణేశమూర్తి ఇది. 'మమతా'సురుని సంహరించిన ఈ స్వరూపాన్ని 'విష్ణుబ్రహ్మ'గా విష్ణుతత్వంగా చెబుతారు.

8. ధూమ్రవర్ణావతారం: 'అభిమానాసురు'ని సంహరించిన ఈ అవతారం మూషిక వాహనంపై శోభిల్లుతున్నది. 'శివ'రూపంగా అర్చించతగిన శైవతత్వమూర్తి ఇది.

- ఈ ఎనిమిది అవతారాల వైనాలను గమనించితే ఒక చక్కని సమన్వయం తేటపడుతుంది.

1. శరీరంలోనూ, 2. జీవభావంలోనూ, 3. బుద్ధిశక్తిలోనూ, 4. బ్రహ్మజ్ఞానంలోనూ భాసించే భగవచ్ఛైతన్యం మొదటి నాలుగు అవతారాలు. 5. శక్తి, 6. సూర్య 7. విష్ణు, 8. శివ తత్వాలు ఒకే భగవంతుడి వ్యక్తస్వరూపాలు- అనే ఏకత్వం తరవాతి నాలుగు అవతారాలు. పై ఎనిమిది రూపాలున్న గణేశుని ఆరాధించితే మనలో ఉన్న దుర్గుణాలు తొలగిపోతాయంటారు. అవి: మాత్సర్యం, మదం, మోహం, లోభం, క్రోధం, కామం, మమత ('నాది' అనే రాగం), అభిమానం (అహంకారం)- ఈ ఎనిమిది రకాల రాక్షసులే విఘ్నశక్తులు. వ్యక్తి పురోగతికి ఇవే విఘ్నాలు. ఈ అసురగుణాలను ఈశ్వరారాధన ద్వారా తొలగించుకోగలిగితే- అదే ఆరాధన, అర్చన, సాధన. వీటిని నశింపజేసే దైవబలాన్ని మనలో జాగృతపరచేందుకే వినాయకపూజ. పూజలో పరమార్థం- మానవుడు దివ్యత్వ స్థితికి పరిణమించడమే. భగవద్రూప, నామ, అవతార ఘట్టాల్లో రుషులు చూసి, చూపించిన దివ్యభావాలివి.
- సామవేదం షణ్ముఖశర్మ