ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday 21 November 2013

ఆనందామృత మంత్రం


 సంతోషంగా ఉండటం ఇష్టం కానిదెవరికి? అటువంటివారు ఎవరూ ఉండరు. సంతోషంగానీ దుఃఖంకానీ ఆకాశంనుంచి అమాంతంగా వూడిపడేవి కావు. ఆలోచనలే వాటికి కారణమవుతాయన్నది గ్రహించాల్సిన అంశం. ఎంత ఆనందంగా ఉన్న సమయంలోనైనా బాధను కలిగించే ఆలోచన ఒక్కటి మెదడులోకి ప్రవేశిస్తే చాలు- ఆనందం ఆవిరైపోతుంది.
ఆనందంగా, హాయిగా ఉండాలని కోరుకుంటే ఒక్కటి గుర్తుంచుకోవాలి... చీకూచింతలను దూరంచేసే వ్యాపకాన్ని అలవాటు చేసుకోవాలి. బుద్ధికి పని కల్పించాలి. 'ఈ ఘడియలు కూడా శాశ్వతం కాదు, గడచిపోతాయి'- దీన్ని గుర్తుంచుకుంటే సంతోషం సంగతి అలాఉంచి, ఎంతటి విచారమైనా తట్టుకోవడం తేలికవుతుంది. దుఃఖమొచ్చినప్పుడు ధైర్యంతో ఎదుర్కోగలిగే పరిస్థితులుంటాయి. 'సుఖదుఃఖాలు శాశ్వతం కాదు'- ఇదొక మంత్రంగా భావించాలి. కష్టసమయాల్ని పదేపదే ఎదుర్కొన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. చలించిపోయే మనస్తత్వం పోయి దృక్పథంలో సమతుల్యత ఏర్పడుతుంది.

రెండు భిన్నమైన పరిస్థితులు జంటగా ఉంటాయి. గమనిస్తే- ఆశ నిరాశలు, కలిమిలేములు, లాభనష్టాలు, శీతల ఉష్ణాలు, చీకటి వెలుగులు... ఇలా ఎన్నో మనిషిమీద ప్రభావం చూపిస్తాయి. ఒక్కో సందర్భంలో, ఒక్కొక్కరిలో ఒక్కోస్థాయిలో వస్తుంటాయి, పోతుంటాయి శరీరం ఉన్నంతవరకూ... వాటికి తీవ్రస్థాయిలో చలించిపోనక్కరలేదు. మనిషి ఏదో ఒకరోజు ఈ లోకం విడిచిపెట్టిపోక తప్పదు. జీవితమే అశాశ్వతమైనప్పుడు అందులో వచ్చిపోయే సుఖదుఃఖాలు ఇంకా ఎంతో అల్పమైనవి. మనిషి ఆనందంగా, ప్రశాంతంగా ఉండే శక్తిని అలవరచుకోవాలి. సుఖమైనా, దుఃఖమైనా ప్రత్యేకంగా ఉండదు. అది మనసుమీదే ఆధారపడి ఉంటుంది. దాని స్వభావం చంచలం. యథార్థ స్థితిని గ్రహించినప్పుడే ప్రశాంతంగా ఉండటం సాధ్యమవుతుంది. ఆనందం అనేది మనలోనే ఉంటుంది. కానీ అజ్ఞానం చేత అది బయట దేని కారణంగానో పొందుతున్నామని భ్రమ చెందుతాం.

నీటిలో సూర్యుడి ప్రతిబింబం పరిశీలిద్దాం. కంటికి కనిపించినా నీటిలో కనిపించేది సూర్యుడు కాదు. ప్రతిబింబమే. ఉందనిపించడం భ్రాంతి. అలాగే ఆనందానుభూతి. సుఖం, సంతోషం... అన్నీ ఇంద్రియాల ద్వారా పొందే అనుభూతి. ఇదీ నిజమైన ఆనందం కాదు. భ్రాంతి మాత్రమే.

మనిషి అది కావాలి, ఇది కావాలి, ఇలా జరగాలి అని కోరుకుంటాడు. అవి తాను పొందగలిగితే, సాధించుకోగలిగితే ఆనందం కలుగుతుందని ఆశిస్తాడు. దానికోసం తాపత్రయపడతాడు. మంచైనా, చెడైనా సాధించడమే ధ్యేయంగా పెట్టుకుని ముందుకెళతాడు. దక్కించుకుంటాడు. దక్కినట్లే దక్కి చేజారితే ఎంత నిరాశో... దక్కితే ఎంత సంబరమో... ఆ తరవాత? అదే అసలైన ప్రశ్న. ఆ దక్కినది శాశ్వతమా? అశాశ్వతమని చూస్తూనే ఉన్నాం. తెలుసుకుంటూనే ఉన్నాం. అయినా ఆలోచనల్లో మార్పురావటం లేదు. అశాశ్వతమైన వాటివెనక పరుగులుపెడుతూ, ఒకదాని తరవాత మరొక 'కోరిక'తో జీవిస్తున్నాం. ఆ కోరికనే త్యజించగలిగితే అసలైన ఆనందం ఏమిటో తక్షణం అర్థమవుతుందని అనుభవజ్ఞులు చెబుతారు. కలల ప్రపంచంలో పొందే ఆనందం కంటే అది ఎన్నోరెట్లు అధికమైందని అనుభవం నేర్పుతుంది.

కోరికలను అధిగమించగలిగితే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. శాశ్వతమైన ఆనందాన్నీ సొంతం చేసుకోవచ్చు. అసలైన శాంతి అంతులేని కోరికల వెంటపడనప్పుడే లభిస్తుందనేది సత్యం.

తృప్తిగా జీవించే వ్యక్తే సంతోషంగా ఉండగలుగుతాడు. కోటీశ్వరుడైనా దివాలా తీస్తాడు, మనశ్శాంతి కరవవుతుంది- 'తృప్తి' అన్నది లేకపోతే. తృప్తి కలిగినవారే నిజమైన సంపన్నులు. వారే ప్రశాంతంగా జీవించగలుగుతారు. వర్తమానానికి విలువిస్తూ, గతంలోని చేదును మరచిపోతూ భవిష్యత్తు గురించి భయంలేకుండా దురాశకు పోకుండా ఉన్నదాంతో తృప్తిచెందే మనస్తత్వం ఏర్పరచుకోవాలి. దేవుడిపట్ల, దేవుడు సృష్టించిన తోటి ప్రాణులపట్ల ప్రేమతో, కృతజ్ఞతతో మెలగినప్పుడే తృప్తి లభిస్తుంది.
- మంత్రవాది మహేశ్వర్‌ 

Wednesday 20 November 2013

కర్మఫలాలు


'పుట్టిన ప్రతి మనిషీ ఒక్కక్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేడు' అని భగవద్గీతలో కృష్ణుడు అంటాడు. అంటే మనిషికి పుట్టుకతోనే కర్మకూడా వెంట వస్తుందని తాత్పర్యం. 'కర్మ' అంటే 'పని' అని కదా అర్థం! మనిషి జీవితంలో మూడు విధాలైన కర్మల్ని ఎదుర్కొంటాడని వేదాంతశాస్త్రం చెబుతోంది. చేసిన ప్రతిపనికీ ప్రతిఫలం ఉంటుందనేది యథార్థం. మంచిపని చేస్తే సత్ఫలం, చెడుపని చేస్తే దుష్ఫలం లభిస్తుందనే మాటా అక్షర సత్యమే. ప్రతి జీవికీ అనేక జన్మలుంటాయని ధర్మశాస్త్రాలు ప్రవచిస్తున్నాయి. కనుక జీవకోటిలోనివాడైన మనిషీ తాను చేసిన, చేస్తున్న పుణ్యపాపాలకు అనుగుణంగా జననమరణాలను ఎదుర్కొంటాడంటారు. మనిషిగా, జంతువుగా, కీటకంగా, చెట్టుగా ఇంకా ఎన్నెన్నో రూపాల్లో జన్మల్ని పొందుతాడని పెద్దలమాట. ఎన్నో సుకృతాలు చేసిన కారణంగానే మానవజన్మ లభిస్తుంది. జీవకోటిలో నరజన్మ దుర్లభమనే సూక్తి ఈ విషయాన్నే సమర్థిస్తుంది. కనుక మనిషి ప్రపంచంలో గొప్పవాడు.

మనిషి చేసే కర్మలు భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాలకు సంబంధించినవై ఉంటాయి. అంటే గతకాలంలో చేసినవీ, ప్రస్తుతకాలంలో చేస్తున్నవీ, రాబోయే కాలాల కోసం చేసేవీ అన్నీ అతడి విషయంలో పరిగణనలోకి వస్తాయన్నమాట. మనిషి గతంలో చేసిన పుణ్యపాపాలను 'సంచిత' కర్మలుగా పిలుస్తారు. సంచీలో సరకులను వేసి దాచినట్లు ఇవి దాగి ఉంటాయి కనుక ఇవి సంచితాలు.

చేసిన పాపాలుగానీ, పుణ్యాలుగానీ పక్వమై మనిషి అనుభవించడానికి సిద్ధంగా ఉంటే అవి 'ప్రారబ్ధ' కర్మలు. పుణ్యం చేయడం, పాపం చేయడం అనేవి మనిషి విచక్షణకు సంబంధించిన అంశాలు. మనిషి చెడు నడతలకు లోనైతే పాపాలు చేస్తాడు. మంచి నడవడిక కలిగి ఉంటే పుణ్యాలు చేస్తాడు. ఒక్కొక్కసారి మనిషి చెడుపనులను చేసి, ఆ తరవాత జ్ఞానోదయమై 'ఇలా ఎందుకు చేశాను?' అని అనుకొంటాడు. చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఆరాటపడుతాడు. కానీ చేసిన పాపం వూరకేపోతుందా? పోనే పోదు.

ఒక వేటగాడు మృగాన్ని వేటాడటానికి అడవికి వెళ్లాడు. చెట్లపొదలో ఏదో జంతువు కదులుతున్నట్లు అలికిడి వినబడింది. వెంటనే ధనుస్సుకు బాణాన్ని సంధించి, ఆ పొదలోని జంతువుపై ప్రయోగించాడు. బాణం తగిలిన వెంటనే ఆ జంతువు పెద్దగా అరుస్తూ నేలకూలి మరణించింది. అప్పుడు వేటగాడు ఆ పొదలోకి వెళ్లిచూస్తే సాధుజంతువు అయిన ఆవు చచ్చిపడి ఉంది. వేటగాడు తాను గోవును చంపాలనుకోలేదు. అడవిపందిని చంపి, దాని మాంసాన్ని తినాలనుకున్నాడు. కానీ తన తప్పు వల్ల గోహత్య జరిగింది. అందుకు పశ్చాత్తాపం చెందాడు. కానీ ప్రయోజనం ఏమిటి? బాణం తప్పు చేయదు. దాన్ని వినియోగించినవాడే తప్పు చేస్తాడు. చేసిన తప్పువల్ల ఫలాన్ని అనుభవించవలసిందే. ఇదే ప్రారబ్ధం అంటే.

రాబోయే కాలంలో ఉత్తమ స్థితిని కలిగి ఉండటం కోసం మనిషి చేసే సత్కర్మలు 'ఆగామి' కర్మలు. ఇతరులకు చేసే దానధర్మాలు, ఉపకారాలు, త్యాగాలు మనిషికి ఆగామికాలంలో ఉపయోగపడతాయి. వృద్ధాప్యంలో కాళ్లూచేతులూ ఆడవు కనుక యౌవనంలో ఉన్నప్పుడే పుష్కలంగా ధనాన్ని సంపాదించాలని అనుకొంటారు అందరూ. అంటే తాము సంపాదించి, కూడబెట్టుకున్న ధనం ముసలితనంలో శ్రమపడనవసరం లేకుండా ఉపయోగపడుతుందనే కదా దాని అర్థం! ఇలాగే పుణ్య, పాపకర్మల విషయంలోనూ మనిషి ఆలోచించాలి అనేదే ఈ కర్మల పరమార్థం.

ఎన్ని శాస్త్రాలు చెప్పినా, ఎంతమంది ప్రవక్తలు ప్రబోధించినా వాటన్నింటి సారం ఒక్కటే- అదే సత్కర్మాచరణ. పాపానికి భయపడి మంచి పనులు చేయాలి. పుణ్యానికి ఆశపడి మంచి పనులు చేయాలి. ఎలాగైనా మంచి పనులే చేయాలి. ఇదే పరమార్థం.

గత జన్మలూ, ఆగామి జన్మలూ ఉన్నాయని నమ్మినా, నమ్మకపోయినా ఏ ప్రమాదమూలేదు కానీ- మంచి పనులు చేయడం మరచిపోతే మాత్రం అడుగడుగునా ప్రమాదాలే ఎదురవుతాయనేది త్రికాల సత్యం. అందుకే మనిషి మంచినే భావించాలి. మంచినే భాషించాలి. మంచినే ఆచరించాలి. మంచినే అనుసరించాలి.
- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

Tuesday 19 November 2013

జీవిత లక్ష్యం


దైవాన్ని గుర్తించి, నోరెత్తకుండా తన పని తాను చేసుకుపోవడమే ఆధ్యాత్మికతలో ఉన్న పరమ రహస్యం. చాలామంది సాధకులు భగవంతుణ్ని తెలుసుకున్న తరవాత మౌనం వహించారు. ఎందుకు? ఈశ్వరుడు ఆడిస్తున్న నాటకాన్ని సాక్షిగా చూస్తూ లోపల పరమానందాన్ని వాళ్లు పొందుతున్నారు. ఇది నిజమా, ఇదే నిజమా? శాస్త్రాలు, గురువులు ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నప్పుడు- విశ్వసించాలి మరి.
అన్ని అనుభవాలూ మనకు సూటిగా లభించవు. ఇతరులకు లభించిన దాన్ని ప్రాతిపదికగా తీసుకుని రుజువు చేసుకోవాలి. దీనికి విశ్వాసం కావాలి. అప్పుడే మన లోపల తాళం మనం తెరుచుకోగలం. అంతరంగంలో జరుగుతున్న దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోగలం.

దైవాన్ని గుర్తించడం అంత సులువైన పని కాదు. అది సాదాసీదా పని కాదు. అందరికీ సాధ్యమయ్యేది కాదు. అలా అని వూరుకుంటే మనం నిజమైన మానవులం కాదు. మనకు ఒక బాధ్యత ఉంది. ధర్మం ఉంది. మన జీవితానికి ఒక ప్రయోజనం ఉంది. అన్నింటికీ మించి పరమార్థం ఉంది. దాన్ని గుర్తించాలి.

నన్ను గుర్తించు అంటూ దేవుడు మన దగ్గరకి రాడు. మన సుఖం కోసం శాంతి కోసం ధన సంపాదన ఎలా అయితే చేస్తున్నామో, ఈశ్వరారాధనా అలాగే చెయ్యాలి. ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని పొందాలి. ఈ విషయాన్ని ఉపనిషత్తులు ఉద్బోధిస్తున్నాయి.

లౌకిక జీవనం సుఖవంతం కావడానికి ఎంతోమంది శాస్త్రజ్ఞులు జీవితాలు అంకితం చేశారు. అపార కృషి చేశారు. అలౌకిక మార్గంలో నడిపించి దైవసాన్నిధ్యం కల్పించడానికి ఎందరో మహానుభావులు తపించారు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుని జీవనం సాగించడం ఉత్తమ మానవుడి లక్ష్యం. ఏది వదిలిపెట్టినా జీవితం పరిపూర్ణం కాదు. వనం ఉండాలి. వసంతం ఉండాలి. అందులో కోయిల ఉండాలి. అప్పుడే పాట హాయిగా ఉంటుంది! హృదయం ఉండాలి. అందులో ప్రేమ ఉండాలి. దగ్గరకు తీసుకునే చేతులు ఉండాలి. అప్పుడే ఆ పరిష్వంగం ఆనంద రసకందాయమవుతుంది.

తీపిని బెల్లం నుంచి వేరు చెయ్యలేం. కాంతిని సూర్యుడి నుంచి వేరు చెయ్యలేం. కెరటాన్ని సముద్రం నుంచి వేరు చెయ్యలేం. మన జీవనం లోంచి ఆధ్యాత్మికతను వేరు చేసి చూసే అవకాశమే లేదు. అవగాహనకు వస్తున్న కొద్దీ దేవుడు మిత్రుడవుతాడు. మార్గదర్శకుడవుతాడు. గురువవుతాడు. చిట్టచివరకు ప్రేమికుడవుతాడు.

ఎక్కడ మనం ఉన్నామో, ఆ ప్రదేశం ఏమిటో, ఎందుకు మనం ఉన్నామో, ఆ స్థితి ఏమిటో, మనల్ని ఇలా ఉంచినవాడితో సంబంధ బాంధవ్యాలు ఎలా జరుపుకోవాలో తెలియకపోతే- మనకు బుద్ధి ఎందుకు? మనిషికి జంతువుకి తేడా ఏమిటి? హేతుబద్ధంగా ఆలోచించడం విజ్ఞానానికే కాదు, వేదాంతానికీ కావాలి. భగవంతుడు రుజువయ్యాడు. దానికి నిజభక్తులే సాక్ష్యం. భగవంతుడు రుజువవుతాడు. ఆధ్యాత్మిక హృదయం వికసించాలి. ఆ దిశలో మనం కళ్లు తెరుచుకుని చూడాలి.

'జీవిత లక్ష్యం ఏమిటి?' అని కొత్తగా వచ్చిన ఓ శిష్యుడు బోధకుణ్ని అడిగాడు.

'ఈ జీవితంలో ఎంతో బ్రహ్మానందం ఉంది. కాని, మామూలుగా జీవించాలని మనం అనుకోవడం లేదు. ఏదో సాధించాలని పరుగులు తీస్తున్నాం. జీవించడమే ప్రాతిపదికగా ఉన్న జీవితాన్ని ఓ సాధనంగా మార్చుకోవాలని అనుకుంటున్నాం. ఆశయాల కోసం తీస్తున్న పరుగులే మనలో ఉద్విగ్నతను పెంచుతున్నాయి' అని బదులిచ్చాడు ఆయన.
- ఆనందసాయి స్వామి 

Monday 18 November 2013

గోవిందుడే గమ్యం


 ఎప్పుడూ కల్లోల పరిస్థితుల్లోంచి కమనీయత జనిస్తుంది. కన్నీటి మడుగులోంచే కమలాలు ఉద్భవిస్తాయి. శ్రీ కృష్ణుడి ముఖతా యుద్ధమధ్యంలోంచి భగవద్గీత ఆవిర్భవించింది. అంపశయ్యలోంచే భీష్ముడు విష్ణు సహస్ర నామాన్ని లోకానికి అందించాడు. ముళ్ల మీది నుంచి ముళ్లను వొత్తిగించుకుని వచ్చి వికసిస్తుంది గులాబీ పుష్పం. చీకట్లను చీల్చుకునే వెలువడుతుంది కాంతిపుంజం. మథనం, గరళం తరవాతే జనించింది అమృతం. నిజానికి అందువల్లే దేనికైనా వన్నె, విలువ పెరుగుతాయి.
కల్లోలం, కన్నీళ్లు అనివార్యాలు. నిజానికి అవసరాలు. అవి అనివార్యాలనీ, అవసరాలనీ గుర్తించినప్పుడు కన్నీళ్లు కళ్లను శుభ్రం చేస్తాయనీ, గుండెమంటలు ఆర్పుతాయనీ, కల్లోలాలు అమృతోద్భవం ముందు గరళం వేసే చిందులనీ అర్థం చేసుకుంటాం. భగవంతుడు సంతోషాన్ని, సౌందర్యాన్ని ఇనుమడింపజేయడానికే వ్యక్తిరిక్త, విభిన్న అంశాలను పక్కపక్కనే, లేదా వెంటవెంటనే సృజించాడు. సర్వత్రా వర్జనీయమైన 'అతి'ని నియంత్రించేందుకే మంచైనా చెడైనా... దేన్నయినా దీర్ఘం నుంచి లఘువుగా మలిచాడు.

మనిషి ముల్లు విరిగిందని నడక ఆపడు. ముల్లు తీసుకుని తిరిగీ నడుస్తాడు. ఎండ ఉందని, వర్షం వచ్చిందని పనులు ఆపుకోడు. గొడుగు పట్టుకుని వెళ్లి పనులు ముగించుకుంటాడు. అతి చిన్న అవసరాలను, ఆటంకాలను కూడా ఇంత శ్రద్ధగా సరిచేసుకుని, పూడ్చుకొని ముందుకు వెళ్లే మనిషి జీవనగమ్యమైన, జీవిత సార్థక్యమైన అసలు గమనాన్ని గుర్తించకుండా కష్టాల దగ్గరే కుంగిపోయి, గొంతు కూర్చుని ఆగిపోతున్నాడు. చిన్న అవసరాలకే ఆటంకాలను అధిగమించగలిగే మనిషి అత్యంత పెద్దదీ, అసలుదీ అయిన జీవిత సార్థక్య దిశగా సాగిపోయే క్రమంలో... వచ్చే కష్టాలను, ఆటంకాలను లెక్కచేయవలసిన అవసరం ఉందా? ఓరకంట కూడా చూడరాదు. అక్కడే ఆగిపోయి అత్యంత విలువైన కాలాన్ని వృథా చేయరాదు. జీవితం సుదీర్ఘమైందే. అయితే అన్ని విషయాలకు ఇది వర్తించదు. కొన్ని పనులకు అతి స్వల్పమైంది అవుతుంది. ఈ అల్పకాలంలోనే అనల్ప కార్యాన్ని ముగించుకోవాల్సి ఉంది. అదే సాధన. పరమ పదసోపాన అధిరోహణ. గమ్యం ఎంతో దూరం. దుర్గమం. దుర్లభం. దురూహ్యం కూడా. అయినా పయనించాల్సే ఉంది. చేరుకోవాల్సే ఉంది. ఎందుకంటే, అది మనకు అనివార్యం. కాబట్టి, అత్యంత అవసరం. ఇలాంటి పయనంలో మనం ముళ్లూ రాళ్లనే కాదు. కాలనాగుల్ని, కారు చీకట్లను కూడా అధిగమించాల్సి ఉంటుంది.

ఈ లోకంలో ఏ వస్తువూ మనకు వూరకే రాదు. పొందగోరే అంశాన్ని బట్టి శ్రమో, ప్రేమో, ధనమో, మరేదో పెట్టుబడిగా పెట్టక తప్పదు.

దీపం పురుగులు దీపాన్ని ఆశించి రెక్కలు కాల్చుకుంటాయి. చాలాసార్లు ప్రాణాలే పోగొట్టుకుంటాయి. నిజానికి తాను ఆశిస్తున్నది తనకు ఉపయుక్తమైందేనా, లభించి తీరేదేనా అనే జ్ఞానం, భరోసా వాటికి లేవు. అయినా ప్రయత్నం ఆపవు. మరి మనకో? భగవంతుడనే ఓ జ్ఞానదీపం, అమృత కలశం, వాడని పుష్పం, సర్వ కాలాల్లో, సకల లోకాలను కాచే సర్వశ్రేష్ఠుడు... ఉన్నాడు. మనకు అంది తీరుతాడు. మన శాశ్వత ఆనందం, పరిణామం, ప్రమాణం- ఆయనలో ఐక్యతే. మరెందుకు మనం ప్రయత్నించం, ప్రయాణానికి సన్నద్ధం కాము? ఈ ప్రయత్నం, ప్రయాణం కష్టమే. కఠినమే. అయినా మధురమైనవి. పరిమళభరితమైనవి. ప్రమాదరహితమైనవి. భరోసా ఉన్నది. అన్నింటికంటే ముఖ్యంగా అనివార్యమైనది. మనం ప్రయత్నం మొదలుపెడదాం. ప్రయాణం ప్రారంభిద్దాం. యుద్ధం సాగనీ, మథనం జరగనీ, అంపశయ్య సిద్ధమై ఉండనీ, గరళం గొంతు దిగనీ, బురద పీకలలోతు దింపనీ, కంటకాలు హింసించనీ... జానేదో- ఔను. జానేదో. మనసు మాధవుడితో నిండిపోయినప్పుడు, గమ్యం గోవిందుడైనప్పుడు మనం ప్రహ్లాదులమైపోతాం- నీరు ముంచదు, అగ్ని కాల్చదు, విషం చంపదు!
- చక్కిలం విజయలక్ష్మి 

Sunday 17 November 2013

కార్తిక పౌర్ణమి


  న్ని మాసాల్లోనూ పరమపావనమైనది కార్తిక మాసమని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. 'శివుడికీ, విష్ణువుకీ ఇద్దరికీ ప్రీతికరమైనందువల్ల వారిద్దరి ఆరాధనకీ, తద్వారా వారి అనుగ్రహం పొందడానికీ తగిన మాసమనీ దీనికి ఇంత ప్రాశస్త్యం' అనీ తెలుపుతున్నాయి పురాణాలు. ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే. సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధికతరమైన ప్రభావవంతమైనవంటారు. నెలరోజులూ చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం ఒక్కటీ మరొక ఎత్తు; అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనీ పురాణాలు వివరిస్తున్నాయి.
ఈరోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యముంది. శివ, విష్ణు దేవాలయాలు రెండింటా దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో, ఉసిరికాయలమీద దీపాలు వెలిగిస్తారు. శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో అఖండదీపాన్ని, ఆకాశదీపం పేరుతో ఎత్త్తెన ప్రదేశాల్లో భరిణలతో (కుండలు, లోహపాత్రలతో తయారుచేసి) వేలాడదీస్తారు. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి జలవనరుల్లో విడిచి పెడతారు. ఇలాచేయడం పుణ్యప్రదమని భక్తుల భావన. వైజ్ఞానికపరంగా ఆలోచిస్తే అనేక దీపాలవల్ల, వాటినుంచి వచ్చే వాయువులవల్ల వాతావరణంలో కాలుష్యం తగ్గి, శుద్ధి అవుతుందని తద్వారా ఆరోగ్యం చేకూరుతుందనీ స్ఫురిస్తుంది.

ఈరోజు ఆచరించేవాటిలో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిస్తుందంటారు. భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికీపేరు. ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది. పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. వారుచేసిన ఆరాధనలోని చిన్నలోపంవల్ల సరైన వరం ఇవ్వదలచుకోలేదట శివుడు. అందుకే 'అల్పాయుష్కుడు, అతిమేధావి అయిన కొడుకు కావాలా... పూర్ణాయుష్కురాలు, విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే- కుమారుణ్నే కోరుకున్నారా దంపతులు. అతడి వయసు పెరుగుతున్న కొలదీ వారిలో గుబులూ జోరెత్తుతోంది. ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టిపడింది. అమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి, శక్తి కలదని విన్నారా దంపతులు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమబిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు. వివాహమైన కొన్నాళ్లకే భర్తకోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వి. తక్షణమే తనభక్తి ప్రభావంతో శివుని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం.

ఈ రోజుకు త్రిపుర పూర్ణిమ అనీ మరొకపేరు. తారకాసురుడి ముగ్గురు కుమారులూ బ్రహ్మను మెప్పించి, ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు. ఎవరివల్లా మరణం లేకుండా వరంకోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథంకాని రథంమీద, విల్లుకాని విల్లుతో, నారికాని నారి సారించి, బాణంకాని బాణం సంధించి, మూడు నగరాలూ ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒకేబాణంతో ముగ్గురినీ ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు.

ఆ వరబలంతో పట్టణాలతో సహా సంచారంచేస్తూ లోకాలన్నింటా కల్లోలం సృష్టిస్తున్నారు. వివిధ లోకవాసులు బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు. విష్ణువు దగ్గర కెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకా శక్తిలేదని, వారిని వెంటపెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు. దేవతలందరూ సహకరిస్తే తానీపని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లుకాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీమహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను (మూడు పట్టణాల యజమానులైన రాక్షసులను) సంహరించాడని, అందువల్ల ఈ పేరు వచ్చిందనీ పురాణ కథనం.

ఈరోజు చేసే స్నానం, దీపారాధన, ఉపవాసం లాంటి అన్నింటిలోనూ ఆరోగ్య, ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి. ఈ మాసమంతా వేకువనే శిరస్నానం చేయడం ఆ కాలపు వాతావరణపరంగా ఆరోగ్య ప్రదం. ఏ కారణం చేతనైనా పైవిధంగా ఆచరించలేని వారు పౌర్ణమినాడు ఆచరిస్తే చాలు, నెలంతా చేసిన ఫలితం ఒనగూరుతుందన్నది పెద్దల మాట. ఈ రోజున స్త్రీలకోసం ప్రత్యేకంగా ఉపవాసం చెబుతున్నాయి శాస్త్రాలు. పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి దీపారాధన చేసి, చలిమిడిని చంద్రుడికి నివేదించి, ఫలహారంగా స్వీకరించాలని చెబుతారు. ఇలాచేయడం వల్ల కడుపు చలవ (బిడ్డలకు రక్ష)అని పెద్దలంటారు. ఆరోగ్యపరంగా చూస్తే- ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేద కథనం.

శివాలయాల్లో జరిపే జ్వాలాతోరణం ఈ రోజుకు మరో ప్రత్యేకత. ఇంకా ప్రాంతీయ, ఆచార వ్యవహారాల భేదంతో అనేక వ్రతాలు, పూజలు, నోములు చేస్తారీ రోజు. వాటిలో వృషవ్రతం, మహీఫలవ్రతం, నానాఫలవ్రతం, సౌభాగ్యవ్రతం, మనోరథ పూర్ణిమావ్రతం, కృత్తికావ్రతం లాంటివి ముఖ్యమైనవి. వీటితోపాటు లక్షబిల్వార్చన, లక్షప్రదక్షిణి, లక్షవత్తులు, లక్షరుద్రం లాంటి పూజలూ చేస్తారీ రోజు.
- అయ్యగారి శ్రీనివాసరావు 

Saturday 16 November 2013

జగద్గురు నానక్‌

                                                              
   భగవంతుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏమి చేస్తుంటాడు?జిజ్ఞాసువులు ఇలాంటి ప్రశ్నలతో సతమతమవుతుంటారు. కొందరు 'కనిపించని దైవాన్ని నమ్మటమెలా' అని వితండవాదం చేస్తారు. ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని శాస్త్రీయంగా, భౌతికంగా నిర్వచిస్తుంటారు కొందరు. చెట్లకు ప్రాణముందని శాస్త్రీయంగా రుజువయ్యేదాకా ఆ విషయం చాలామంది నమ్మలేదు. అన్నింటికీ రుజువులు వెతకటం సాధ్యమా, దైవం తర్కానికి అందుతాడా?

 ఆచారాలు, సంప్రదాయాలు తరతరానికీ మారిపోతున్నాయి. అంధ విశ్వాసాలుగా, మూఢనమ్మకాలుగా రూపు మార్చుకున్నాయి. వీటి మరుగున పడి అసలు నిజం అర్థంకాకుండా పోతోంది. ఇలాంటి సమయంలోనే మహాత్ములు జన్మిస్తారు. అలాంటి మహాత్ముడే గురు నానక్‌ దేవ్‌. ఆయన్ను- నానక్‌ బాబా, గురు నానక్‌ దేవ్‌, నానక్‌ షా అని సిక్కులు భక్తితో పిలుచుకుంటారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న రాయ్‌భోయ్‌ తల్వాండీలో కార్తిక పౌర్ణమినాడు గురు నానక్‌ జన్మించారు. ప్రస్తుతం నానక్‌ జన్మస్థలాన్ని 'నన్‌కానా సాహెబ్‌'గా వ్యవహరిస్తున్నారు.

జన్మతః ఆయన క్షత్రియుడు. తండ్రి గ్రామాధికారి. సంప్రదాయవాది. బాల్యం నుంచే కులమతాలకు అతీతంగా ఉండేవాడు నానక్‌. అసాధారణ జ్ఞానంతో, ఆలోచనాత్మక వాక్కులతో బాలనానక్‌ అందర్నీ ఆకట్టుకుంటూ, ఆశ్చర్యం కలిగించేవాడు. నానక్‌ హిందు, ముస్లిమ్‌ బోధకుల వద్ద విద్య అభ్యసించాడు. తన సహజ కుతూహలంతో అనేక ఆధ్యాత్మిక సందేహాలను అడిగి తెలుసుకునేవాడు. నానక్‌ ప్రశ్నలు ఎంతో ప్రముఖులైన ఆధ్యాత్మికవేత్తలకే ఆశ్చర్యం కలిగించేవి. నానక్‌ మొదటి సంప్రదాయ విరుద్ధచర్య, ఉపనయనాన్ని వ్యతిరేకించడం. 'దయను పత్తిగా చేసి, సంతృప్తిని సూత్రంగా మార్చి, నిగ్రహాన్ని ముడివేసి, సత్యాన్ని పురి ఎక్కించి దాన్ని ఉపవీతంగా ధరించటమే నిజమైన ఉపనయనం' అని నానక్‌ చెప్పగా విన్న పెద్దలందరూ అవాక్కయ్యారు. అలా మొదలైన నానక్‌ ఆధ్యాత్మిక ప్రస్థానం, ప్రపంచవ్యాప్తంగా కొనసాగింది. అన్ని మతాలవారూ ఆయన బోధలకు ఆకర్షితులయ్యేవారు. భగవత్‌ ప్రేరణతో ఆయన చేసే ప్రవచనాలు అతి సులభంగా అందరికీ అర్థమయ్యేవి. వారు వెంటనే తమ జీవన విధానాన్ని మార్చుకునేవారు. నానక్‌ శిష్యులయ్యేవారు. సిక్కు అంటే శిష్యుడని అర్థం. ఎవరైనా తన కులమతాల గురించి ప్రశ్నిస్తే 'నాది పంచభూతాల కులం, భేదరహిత సన్మార్గపు తెగ, సర్వమానవ క్షేమమే నా మతం' అనేవాడు నానక్‌. నిజమైన భక్తుడు- 'బతికి ఉండి మరణించినవాడిలా, నిద్రించీ మేల్కొనిఉన్నవాడిలా, తెలిసి తెలిసి తన్ను దోచుకొననిచ్చినవాడిలా' ఉండాలనేవాడు నానక్‌. కోపం, గర్వం, కోరికలు లేకుండా అన్నింటా సమబుద్ధి కలిగి, నిశ్చల సమాధిలో భగవధ్యానం చేస్తూ, భగవద్వాణి తప్ప ఇతరమేదీ వినకుండా, సర్వాంతర్యామియైన పరమాత్మను అందరిలోనూ, అన్నింటిలోనూ చూడగలిగేవాడే భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రుడు- అని నానక్‌ చెప్పేవాడు. నానక్‌ తన సందేశాలను మధురమైన కీర్తనల రూపంలో పాడుతుంటే, ముసల్మాను శిష్యుడైన మర్దానా శ్రుతి వేస్తూ, ఏక్‌తారా మీటేవాడు.


  సిక్కుల ఆదిగురువు గురు నానక్‌ దేవ్‌ తరవాత, తొమ్మండుగురు గురువులు ధర్మపథాన్ని బలోపేతం చేశారు. చివరి గురువు గురు గోబింద్‌ సింగ్‌. తన తరవాత గురుగ్రంథ సాహెబ్‌నే శాశ్వత గురువుగా ఆయన నిర్ణయించాడు. ప్రపంచంలో అందరినీ ఆత్మీయంగా అక్కున చేర్చుకునే, కులమతాతీతమైన ఏకైక దైవమార్గం సిక్కు ధర్మం. ఇది పూర్తిగా స్వదేశీయమైనది. భారతీయ ఆధ్యాత్మికతకు కిరీటంగా, మేలిమి బంగారంగా, కల్మషరహితంగా చెప్పదగినది సిక్కు ధర్మం. గురుద్వారాలు అందరికీ స్వాగత ద్వారాలు.
                                                                     - కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌ 

Friday 15 November 2013

దృఢ విశ్వాసం


వేద వాంగ్మయంలో హోమ పక్షి ప్రస్తావన ఉంది. ఆ పక్షి ఎప్పుడూ ఆకాశంలోనే ఎగురుతూ ఉంటుంది. దానికి ఆహారం ఆకాశంలో దొరకదు కాబట్టి, భూమి మీద ఆహారాన్ని స్వీకరిస్తుంది. కానీ, కాళ్లు భూమిపై మోపదు. అది గుడ్లు కూడా భూమిమీద పెట్టదు. ఆకాశంలో ఎగురుతూనే గుడ్డు జారవిడుస్తుంది. గుడ్డు భూమిపైకి జారేలోగానే దాన్నుంచి పక్షిపిల్ల బయటకు వస్తుంది. పిల్ల అలా కిందికి జారుతున్న సమయంలోనే రెక్కలు మొలుచుకొస్తాయి. పక్షిపిల్ల లక్ష్యం తన తల్లిని చేరటమే! రెక్కలు అల్లాడించి పైకి ఎగిరే ప్రయత్నం చేస్తుంది. నెమ్మదిగా తల్లిని కలుసుకోవడమనే లక్ష్యాన్ని సాధిస్తుంది. భగవంతుని చేరాలనే లక్ష్యాన్ని భక్తుడు అలా సాధించుకోవాలంటారు రామకృష్ణ పరమహంస. సంసారికైనా, సన్యాసికైనా ఆశించదగ్గ ఏకైక బ్రహ్మపదార్థం- భగవంతుడే!
   ఆధునిక ప్రపంచంలో లౌకిక జీవనం చేసే మానవులకు కర్మ, జ్ఞాన యోగాలు అనుష్ఠించడం ఎంతవరకు ఆచరణ సాధ్యం? కర్మయోగం నిష్కామకర్మను (చేసిన కర్మకు ఫలితాన్ని ఆశించకపోవడం) ప్రతిపాదిస్తుంది. నిష్కామకర్మ ఆధునిక జీవితంలో సాధ్యమా అని యోచిస్తే, సమాధానం ఆశాజనకంగా ఉండదు. జీతమే లక్ష్యంగా ఉద్యోగం, లాభమే లక్ష్యంగా వ్యాపారం, ఆదాయమే లక్ష్యంగా పెట్టుబడి- మనం చేసే అలాంటి వ్యాపకాలేవీ నిష్కామకర్మలు కావు. జ్ఞానయోగం నేను, నాది అనే భ్రమను వీడమంటుంది. స్థితప్రజ్ఞతను ప్రతిపాదిస్తుంది. సుఖాల్లో పొంగిపోతాం. కష్టాల్లో కుంగిపోతాం. రోగాలకు చలించిపోతాం. చావంటే వణికిపోతాం. మరి స్థితప్రజ్ఞత సాధించేదెన్నడు?

ఓ దేహధారిగా స్థితప్రజ్ఞుడికీ దేహావసరాలుంటాయి. ఆ అవసరాలు తీర్చుకోకుండా బతుకు బండి సాగదు. బాహ్యసంరక్షకులుగా ఎవరున్నప్పటికీ ఎవరికైనా దేహభారం వహించేది నిజానికి దైవమే. ఆ ఎరుకే ఆయన పట్ల మనిషి చూపగల నిజమైన కృతజ్ఞత! సంపద, పలుకుబడి, అందం, అధికారం, హోదా, కళాభినివేశం వంటి ప్రలోభాలకు దాసుడుకాని వ్యక్తి ఆత్మసాధన పట్ల నిజాయతీ కలిగి ఉంటాడు. కలియుగంలో భక్తిమార్గం ద్వారానే దైవాన్ని సాకారం చేసుకోవాలనే కల నిజం చేసుకోవచ్చంటాయి శాస్త్రాలు. లక్ష్యాన్ని సాధించగలనన్న సాధకుడి బలమైన విశ్వాసం అతడికి సత్ఫలితాలను అందిస్తుంది.

ఒకప్పుడు ఓ ప్రాంతంలో అనావృష్టి విలయతాండవం చేసింది. వరుణదేవుడి కరుణ కోసం గ్రామస్థులంతా దేవాలయంలో జప తపాలు, ప్రత్యేక పూజలు చేయాలని సంకల్పించారు. నిర్ణయించిన ముహూర్తానికి వైదిక కర్మలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణానికి ఓ బాలుడు గొడుగుతో వచ్చాడు. పూజాఫలంగా వర్షం కురుస్తుందనీ, అప్పడు ఛత్రం ఉపయోగించవచ్చనీ బాలుడి బలమైన విశ్వాసం. అటువంటి నమ్మకం అవసరం. లక్ష్యాన్ని సాధించగలనన్న దృఢ విశ్వాసం సాధకుడికి ఉండటం అత్యంత ఆవశ్యకం! 
లక్ష్యశుద్ధి లేకుండా లక్ష్యసిద్ధి జరగదన్నది పెద్దల మాట!
- గోపాలుని రఘుపతిరావు 

Wednesday 13 November 2013

క్షీరాబ్ధి ద్వాదశి


కప్పుడు ఈ దేశంలో పిల్లా-మేక, పశువూ-పక్షి, చెట్టూ-చేమ మానవ పరివారంలో భాగంగా ఉండేవి. మనిషి వాటితో కలిసి బతికేవాడు. గోవును దేవతా స్వరూపంగా భావిస్తూ గోమాతగాను, భూమిని భూమాతగాను గౌరవించడం ఈ దేశ సంస్కృతిలో భాగం. తులసి, ఉసిరి, మామిడి, రావి, మారేడు, జమ్మివంటి వృక్షజాతులను సైతం పూజించడం ఈ దేశంలో ఆచారం. మన పండుగలు, పర్వాలు ఈ ఆచారాలను, వ్యవహారాలను పదేపదే గుర్తుచేయడానికా- అన్నట్లుగానే ఉంటాయి. తక్కిన ప్రాణికోటితో మనిషికి ఒకానొక బంధాన్ని ముడివడేలా చూసుకుంటూ, మన పెద్దలు కొన్ని విధివిధానాలు రూపొందించారు. కార్తికంలో వచ్చే క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినం అందులో భాగం. తులసి మొక్కకు, ఉసిరి చెట్టుకు కార్తికమాసంలో ఎంతో ప్రాధాన్యం ఉంది.

కార్తిక శుద్ధ ఏకాదశిని 'ప్రబోధనా ఏకాదశి' అంటారు. ఆనాడు శ్రీ మహావిష్ణువు పాల కడలిపై పవళింపును చాలించి, తులసి వనానికి చేరుకుంటాడట. బ్రహ్మాది దేవతలు సైతం ఆయనతోపాటు కదిలివచ్చి తులసి వనంలో కొలువుంటారంటారు. మరునాడు ద్వాదశి పూట క్షీరాబ్ధి ద్వాదశి భావనతో- దీపదానాలు చేసి 'క్షీరాబ్ధి శయన వ్రతం' ఆచరించాలని వ్రత గ్రంథాలు సూచిస్తున్నాయి. శ్రీకృష్ణుడితో తులసికి పెళ్ళయిన రోజిది. కనుక ఈ రోజు 'తులసి వివాహ పర్వం' నిర్వహిస్తారు. కృష్ణుడు తనకు బాగా ఇష్టమైన చోట్లు మూడు- అని ఉద్ధవుడికి చెప్పాడట. భక్తుల హృదయాలు కృష్ణుడికి బాగా ప్రీతికరమైన స్థానం. తపస్వుల సన్నిధానం రెండోది. మూడోది- తన ప్రియురాలైన తులసితో కలిసి ఉండటం కృష్ణుడికి చాలా ఇష్టం. ఈ కథను ఆధారంగా చేసుకుని క్షీరాబ్ధి ద్వాదశినాడు తులసి వివాహ పర్వాన్ని ఆచరించడం ఆనవాయితీగా మారింది. నూతన వస్త్రాలు, గాజులు, పసుపుకుంకుమలతో తులసి మొక్కను అలంకరించి- కృష్ణుడి మూర్తికి, తులసి మొక్కకు మధ్య అడ్డుగా తెరను పట్టుకుని వివాహతంతు నిర్వహిస్తారు. కొన్నిచోట్ల కాయలతో ఉన్న పచ్చని ఉసిరి కొమ్మను తెచ్చి, తులసి కోటలో పాతి దీపారాధన చేయడం ఆచారంగా వస్తోంది. వేప, రావిచెట్లు రెండూ కలగలిసి ఉన్నచోట వాటిని లక్ష్మీనారాయణ స్వరూపంగా పూజించినట్లే; తులసిని లక్ష్మిగాను, ఉసిరికను నారాయణుడిగాను ఆరాధించడం- క్షీరాబ్ధి ద్వాదశి నాటి ఆచారం.

తులసి మొక్కను అనునిత్యం అర్చించినట్లే ఉసిరిక చెట్టును కార్తిక మాసమంతటా పూజించాలని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. అమలక తరువు అనేది తెలుగులోకి వచ్చేసరికి ఉసిరి పక్కన 'క' చేరి ఉసిరిక చెట్టు అవుతోంది. దీన్నే ధాత్రీ వృక్షమనీ పిలుస్తారు. ఉసిరి చెట్టు నీడ సోకే చెరువునీట స్నానం కార్తిక మాసంలో చాలా పవిత్రం. కార్తిక వన సమారాధనలు ఉసిరి చెట్టు నీడలో నిర్వహించడం అందరికీ తెలిసిన విషయమే! ఏ తోటలో అయినా ఉసిరి చెట్టును ఒక దాన్నయినా పెంచడం శుభప్రదంగా భావిస్తారు. ఆయుర్వేదం తులసి, ఉసిరికల ఔషధ విశేషాలను విస్తారంగా వర్ణించింది. తులసిని సర్వరోగ నివారిణిగా చెబుతుంది. ఏదైనా ఒక విద్యపై గట్టిపట్టు సాధించినప్పుడు 'ఆయనకు అది కరతలామలకం' అంటుంటారు. అంటే, అరచేతిలో ఉసిరిలా అమరిపోయిందని అర్థం. ఇది జ్యోతిర్విద్యకు చెందిన ఒక రహస్య సంకేతం. మనిషి అరచేతిలోని రేఖలకు, ఉసిరికాయపై కనబడే గీతలకు, భూగోళంపై గల అక్షాంశ, రేఖాంశాలకు సమన్వయం చూపిస్తూ- భాస్కరాచార్యుడు తన 'సిద్ధాంత శిరోమణి'లో గోళాధ్యాయం పేరుతో ఎన్నో విశేషాలు వివరించాడు. రామాయణం బాలకాండలోని ఒక శ్లోకం 'రామకథ వాల్మీకి ముని అరచేతిలో అమలకం' అంటుంది. అలా కరతలామలకం అనే పదప్రయోగం వెనక చాలా కథ ఉంది. గోళాకారంగా ఉండే నిమ్మకాయవంటి వేరే పళ్లకు దక్కని ఒకానొక ఔచిత్య సౌభాగ్యం ఈ పోలికలో ఉసిరిపండు దక్కించుకుంది.

తులసి, ఉసిరి ఒకేచోట పుట్టాయని 'శివ పురాణం'లోని ఒక కథ వివరించింది. కాలనేమి కుమార్తె 'వృంద'. ఇదే పేరు పద్మపురాణంలో 'బృంద'గా కనిపిస్తుంది. ఆమె జలంధరుడి భార్య. మహాపతివ్రత. ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి విష్ణుమూర్తి జలంధరుడి రూపంలో వృందను సమీపిస్తాడు. భర్తగా పొరబడి ఆమె విష్ణువును గాఢంగా ఆలింగనం చేసుకుంటుంది. ఆ పిదప వాస్తవాన్ని గ్రహించి, అవమానభారంతో తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేస్తుంది. చితిలో దగ్ధమవుతూ ఆమె 'నన్నిలా నా భర్త నుంచి దూరం చేసిన మూలంగా నీవూ నీ భార్యకు దూరమై చిరకాలం దుఃఖాన్ని అనుభవించి, చివరకు కోతుల సాయంతో ఆమెను దక్కించుకుందువుగాక!' అని విష్ణువును శపిస్తుంది. ఆమె చితాభస్మం భూమిలో కలిసిపోయిన చోటులోంచి తులసి, ఉసిరి మొక్కలు మొలిచాయని శివపురాణ గాథ. ఆ కారణంగా ఆ రెండింటికీ పవిత్రత, పూజ్యత చేకూరాయని పెద్దలు చెబుతారు. కార్తిక మాసమంతటా కాకపోయినా, కనీసం క్షీరాబ్ధి ద్వాదశినాడైనా ఆ రెండింటినీ ఆరాధించాలని పెద్దలు నిర్దేశించడం వెనక ఇలా ఎన్నో అంతరార్థాలు, రహస్యాలు ఇమిడి ఉన్నాయి. అవి తెలిసి చేసినా, తెలియకుండా చేసినా ఆరాధనవల్ల ఆయురారోగ్యాలు, శుభాలు చేకూరతాయి. అలాంటి పర్వదినం క్షీరాబ్ధి ద్వాదశి!
- ఎర్రాప్రగడ రామకృష్ణ 

Tuesday 12 November 2013

ప్రేమామృతం


ప్రేమ అనే రెండక్షరాల్లో అద్భుతమైన ఆకర్షణ ఉంది. ప్రేమకు అంతరాలు లేవు. ప్రేమ ఎంతో పవిత్రమైనది. ఎంతో శక్తిమంతమైనది. ఔదార్యంతో నిండిన ఉదాత్తమైన త్యాగగుణం ప్రేమలోనే ఉంది.

ప్రేమంటే తనను తాను అర్పించుకోవడమే. ఎదుటివాళ్లు తమకు అర్పణ కావాలని కోరుకోవడం కాదు. రాధ ఈ సంగతి లోకానికి చాటిచెప్పింది. రాధ హృదయం గోపాలుని నిలయం. ఆమె మనసు వెన్నకన్నా చల్లనైనది. పలుకు తేనెకన్నా తీయనైనది. ఆమెకు కావలసినది కృష్ణుడి క్షేమమే. అందుకే ఎలాంటి త్యాగానికైనా ముందుండేది.

హృదయాన్ని మనసావాచా ప్రేమించడమంటే ఆ హృదయంలోని భావాలన్నింటినీ యథాతథంగా స్వీకరించడమనే దివ్యజ్ఞానానికి ప్రతీక రాధ. అందుకే ఆమెకు కృష్ణుడే లోకమయ్యాడు. సత్యభామ తలపెట్టిన తులాభారం గురించి తెలిసినప్పుడు రాధకు చెప్పలేనంత బాధ కలుగుతుంది. ధనకనకాలేవీ తూచలేని కృష్ణుడిని రుక్మిణి తులసిదళంతో తూచగలిగిందని అందరూ గొప్పగా చెప్పుకొంటారు. అలాంటి విశిష్ట వ్యక్తిని, గొప్ప వ్యక్తిని దేనితో తూచినా తప్పేనని భోరుమంటుంది రాధ. ధనంతో ఆ ప్రయత్నం చేసిన సత్యభామ అయినా, తులసిదళంతో అందుకు పూనుకొన్న రుక్మిణి అయినా తన దృష్టిలో ఒకటేనని బాధపడుతుంది. అంతటి శుద్ధమైన కృష్ణప్రేమ రాధ సొంతం.

దేవకీసుతునిలో ఐక్యం కావడానికే జీవాత్మ అయిన రాధ జన్మించింది. దేవుడు, జీవుడు ఏకమయ్యే విశుద్ధ ప్రక్రియ ఇది. వీరిది అభౌతికమైన అపూర్వ బంధం.

స్వార్థంలేని పవిత్ర ప్రేమకు చిహ్నం రాధ. ఆమె కృష్ణుడికి భార్య కావాలని కోరుకోలేదు. ఆ స్వామిని నిస్వార్థంగా ఆరాధించింది. దేవుడిలా పూజించింది. ప్రేమంటే ఆకర్షణ కాదని, ఆప్యాయతల హరివిల్లని లోకానికి చాటిచెప్పింది రాధ. అందుకే ఆమె ప్రేమ నేటికీ సజీవంగా నిలిచిపోయింది. ప్రేమ ఉన్నచోట భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడు ఉన్న ప్రదేశమంతా ప్రేమమయమే. ప్రేమతోనే నరుడు నారాయణుడవుతాడు. ప్రహ్లాదుడు శ్రీహరిని ప్రార్థించాడు. బాల్యంనుంచీ ఆ నారాయణుడే లోకమని భావించి, ప్రేమించి బాలభక్తుడిగా నిలిచిపోయాడు.

ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ భక్తి, సేవాగుణం ఉంటాయి. వాల్మీకి రచించిన రామాయణంలో దీనికి సంబంధించిన ఉదాహరణలు ఎన్నో కనిపిస్తాయి. శ్రీరాముడి పాదుకలను తలపై ఉంచుకొని అయోధ్యకు మరలిన భరతుడిది సోదర ప్రేమ అయితే, రాముణ్ని గంగానది దాటించిన గుహుడిది స్నేహపూర్వకమైన ముగ్ధభక్తి. ఇక జటాయువు, శబరి, ఆంజనేయుడు- రాముణ్ని ప్రేమించి, అభిమానించి సేవించిన తీరు అమోఘం. ఆ ప్రేమలో ఆత్మీయత ఉంది. భక్తి ఉంది. సృష్టిలో ప్రేమకు ఉన్న శక్తి దేనికీ లేదు.

లేగదూడను ఆవు ఎంతలా ప్రేమిస్తుందో అంత ప్రేమ మనలో ఉండాలని వేదం చెబుతోంది. తన బిడ్డను ప్రేమించడంలో గోవుకు ఎలాంటి స్వార్థం లేదు. ఆ ప్రేమ సహజమైనది. స్వచ్ఛమైనది. మనం కూడా ఇతరులను ఆ విధంగానే ప్రేమించాలి. మనిషి ఏది సాధించాలన్నా ప్రేమతోనే సాధ్యమవుతుంది. ప్రేమ ఆనందాన్ని కలిగిస్తుంది. శత్రువును మిత్రుడిగా మారుస్తుంది. ప్రేమంటే అందమైన మనుషుల్ని, జీవుల్ని, అందమైన ప్రదేశాలను ప్రేమించడం కాదు. ఈ సృష్టి మొత్తం భగవంతుడి ప్రతిరూపమే కాబట్టి అందర్నీ ప్రేమించాలి. ఆ ప్రేమలో ఎలాంటి తారతమ్యాలూ చూపించకూడదు.

ఆత్మీయులనే కాకుండా అనాథలనూ ప్రేమించగలగాలి. అప్పుడే మనిషి మాధవుడవుతాడు. ప్రేమ స్వరూపుడవుతాడు.
- విశ్వనాథ రమ

Monday 11 November 2013

కృత్తివాసుడు ...

    పూర్ణిమనాడు కృత్తికా నక్షత్రం ఉంటే అది కార్తికం అవుతుంది. కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం. శివుడి మూడోనేత్రం అగ్ని. తన తనయుడు కుమారస్వామిని కృత్తికలనే రుషిపత్నులు పెంచడంవల్ల వారి పేరుతో ఉన్న కార్తికమంటే శివుడికి ప్రీతి. గరళకంఠుడైన శివుడి తమోగుణాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు. కనుక కార్తిక సోమవారం విశిష్టమైనది. శివారాధనకు ప్రత్యేకమైనది. సోముడంటే చంద్రుడు. పూర్ణిమ అనేది చంద్రుడు పదహారు కళలతోనూ కనిపించేరోజు. అటు అగ్ని వేడిమి, ఇటు చంద్రుడి చల్లదనం కలిసి ఒకేసారి శరీరం అనుభవించే రోజు- కార్తిక పూర్ణిమ.

శివుడు రుద్రుడు. అంటే రౌద్ర స్వరూపంతో ఎర్రని కన్నులతో, నుదుట భగభగమండే కొలిమి వంటి నేత్రంతో ఉంటాడు. ఆయన శిరసు మీద ఎంతో చల్లదనంతో ఉండే గంగమ్మ, ఒక పక్కగా చంద్రుడు ఉంటారు. ఇదే చలి వేడిమిల కలయిక. శివపత్ని పార్వతీదేవి కూడా అగ్నివర్ణంలో ఉండటమే గాక తాను నిత్యం చేసే తపంవల్ల ఎర్రదనంతో ప్రకాశిస్తుంటుంది. శివుడు అర్ధనారీశ్వరుడు. పార్వతి ఆయన ఎడమ భాగం, ఆమె శిరసుపై చంద్రుడు ఉంటాడు. కనుక ఆమె కూడా శీతలాగ్నుల కలయికే. పారిజాత పుష్పం పార్వతికి ప్రీతిపాత్రమంటారు. బయట ఎర్రని రంగుతోనూ, లోపల తెల్లని రేకుల తోనూ కనిపించే ఈ పుష్పాన్ని అగ్నిచంద్రులకు ప్రతీకగా భావిస్తారు.

ప్రపంచానికి ఆధారభూతమైన దేవతలెవరని యోచించి అయిదుగురిని నిర్ణయించారట. వారు సూర్యుడు, అంబిక, విష్ణువు, గణపతి, మహేశ్వరుడు. ఈ అయిదుగురి ప్రత్యేక పూజలకూ అయిదునెలలు నిర్ణయించారట కూడా. భాద్రపదమాసంలో గణపతిని, ఆశ్వయుజంలో అమ్మవారిని, కార్తికంలో శివుని, మార్గశిరంలో శ్రీహరిని, పుష్యమాసంలో సూర్యుణ్నీ ఆరాధించేలా వివిధ రకాల పండుగల్ని ఏర్పాటు చేశారు. కార్తికం శివారాధనామాసం.

శివుడంటే శుభప్రదుడని అర్థం. ఆయన భక్తవశంకరుడు. యోగధ్యానంలో తన స్వరూపంలో లీనమైపోయినప్పుడు శాంతుడు, సౌమ్యుడు. జగత్తులోని పాపాలపై దృష్టిసారించినప్పుడు రౌద్రరూపంలో భయంకరాకారుడవుతాడు. అతడు లయకారుడు. సృష్టికి తగినంత సంహారకమున్నపుడే స్థితికార్యం జరగగలదు. సంహారకశక్తి సమతౌల్యంగా ఉన్నప్పుడే సృష్టి స్థితులకు వీలుంటుంది.

శివుడు యోగవిద్యకు ఆద్యప్రవర్తకుడు. నృత్యవిద్యకూ శివుడే అధిదైవం. ఆయన డమరుకం నుంచే అ-ఇ-ఉ-ణ్‌ మొదలైన 14 వ్యాకరణమూల సూత్రాలు వెలువడ్డాయంటారు. వీటిని మహేశ్వర సూత్రాలంటారు. ఈ ధ్వనులే పాణిని వ్యాకరణానికి, భరతుడి నాట్యశాస్త్రానికి మూలమని పండితుల భావన. అక్షరాభ్యాస సమయంలో 'ఓం నమశ్శివాయ' అని పిల్లవాడిచేత బియ్యంపై రాయించడం సంప్రదాయం. శివతత్వాన్ని ఆ సమయంలోనే బోధించడం జరుగుతోందన్నమాట. శివుడు సర్వజీవులయందు సంచరించే చైతన్యస్వరూపుడు. సర్వజీవులయందు కరుణ చూపగలిగితే ఆ ప్రేమతత్వమే శివతత్వం. అది కాలానికి అతీతం. వర్ణనలకు అతీతం. కళ, కాష్టం, నిమిషం అనే కాలప్రమాణాలన్నీ శివతేజస్సులే. కాలం శివాధీనం.

కృత్తివాసుడి ఆరాధనలో రుద్రాభిషేకం, ప్రాతఃకాలస్నానం, దీపదానం, ఉపవాసం ముఖ్యమైనవి.
- డాక్టర్‌ డి.వి.సూర్యారావు

Sunday 10 November 2013

మానవత


ప్రాణులకు పునరుత్పత్తి శక్తి దైవప్రసాదం. సంతానంపై అంతులేని మమకారం వాటికి కొంతకాలం ఉంటుంది. ఆ ప్రేమే పిల్లలకు శ్రీరామరక్ష. జంతువులు పిల్లలకి పాలిచ్చి పెంచుతాయి. పక్షులు ఆహారం తెచ్చి పిల్లల నోటికి అందిస్తాయి. పిల్లలు రెక్కలు వచ్చి ఎటో ఎగిరిపోతాయి. పశువులూ అంతే! దేనికి అదే!
మనుషులు అలా కాదు. తల్లీ, తండ్రీ, పిల్లలూ... ఒక కుటుంబ వ్యవస్థ. ఈ బంధం శాశ్వతం. పిల్లలకు ఒక బాధ్యత ఉంటుంది. 'తల్లి దైవం, తండ్రి దైవం' అని వేదఘోష. వాళ్లు జీవించినంతకాలం గౌరవంతో, భక్తితో చూడాలి. వాళ్లు స్వర్గస్తులైన తరువాతా భక్తితో స్మరించాలి. ఇలా శ్రద్ధను ప్రదర్శించడమే 'శ్రాద్ధం'.

తల్లిదండ్రులు తమ సంతానం కోసం ఏ త్యాగానికీ వెనకాడరు. తాము తినీ తినకా బిడ్డలను చక్కగా పోషిస్తారు. వారి త్యాగాలను బిడ్డలు సదా స్మరిస్తూ ఉండాలి. కని పెంచడం అనేది కేవలం భౌతిక ధర్మంగా భావించకూడదు. తల్లిదండ్రులకు, బిడ్డలకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు మధ్య ఉండే అనిర్వచనీయ బంధం పవిత్రతను సంతరించుకుంది.

మన సంస్కృతిలో భార్యాభర్తల బంధానికి దైవమే సాక్షి. ఈ సంబంధాలన్నీ మన పురాణేతిహాసాల్లో ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. భరతుడు అన్నగారి పాదుకలను శిరస్సున పెట్టుకుని పూజించాడు. శ్రీరామునితోపాటు ఒక వైపు తమ్ముడు లక్ష్మణుడూ, ఇంకోవైపు సీతాదేవీ పూజలందుతారు. వాళ్ళ మధ్య ఉన్న సంబంధాలు త్యాగం, ప్రేమ, స్నేహం, దయ, వాత్సల్యం, భక్తి... మొదలైన ఉత్తమ గుణాలతో కూడినవి. ఇవన్నీ దైవాంశలు. వీటిని రసవత్తరంగా వర్ణిస్తూ మహాకవులు కావ్యాలనూ, నాటకాలనూ మనకు ప్రసాదించారు.

మానవ సంబంధాలు ఎలా ఉండాలో భాసమహాకవి తన రూపకాల్లో గొప్పగా చిత్రించాడు. 'మధ్యమ వ్యాయోగం' రూపకంలో తల్లిదండ్రులకూ సంతానానికీ మధ్య ఉండే అనుబంధం, ఒకరి కోసం ఒకరు త్యాగం చేయడానికి సిద్ధపడే ఘట్టం హృదయాలను కరిగిస్తుంది. కళ్లు చెమ్మగిల్లేట్లు చేస్తుంది.

ఒక వృద్ధుడి కుటుంబం అరణ్యమార్గంలో పోతూ రాక్షసుడి చేతిలో పడింది. ఆ రాక్షసుడు మంచివాడే! కానీ, తల్లి ఆజ్ఞ చొప్పున, ఒక మనిషిని ఆమె తినడానికి పట్టుకుపోవలసి వచ్చింది! మాతృభక్తి పరాయణుడైన రక్కసుడు ఈ కుటుంబాన్ని పట్టుకున్నాడు. తల్లీ, తండ్రీ, ముగ్గురు కొడుకులు- ఇదీ, ఆ బాటసారుల కుటుంబం. వారిలో ఒకర్ని విడిచిపెడితే, మిగతావారికి హాని తలపెట్టకుండా వదిలివేస్తానని ఆ రాక్షసుడు పలికాడు. 'నేను వృద్ధుణ్ని. సంసారఫలం గ్రహించినవాడిని. నన్ను తీసుకుపో!' అన్నాడు వృద్ధుడు. 'భారతీయ స్త్రీ ముత్తయిదువుగానే జీవితాన్ని ముగించాలనుకుంటుంది కాబట్టి నన్ను నీ వెంట తీసుకువెళ్లు!' అంటుంది ఆ మాతృమూర్తి. ఇలాగే వరసగా ఆ ముగ్గురు కుమారులూ నేను వస్తానంటే నేను వస్తానని ఆ రాక్షసుడి ముందుకు వస్తారు. అందరి లక్ష్యమూ ఒక్కటే. తాను బలియైనా మిగతావారిని రక్షించాలి! వాళ్ల దృష్టిలో త్యాగమే గొప్పది. కుటుంబసభ్యుల రక్షణ కోసం తన ప్రాణం అర్పించడం మహద్భాగ్యం అని ప్రతివారూ భావిస్తున్నారు. తాను పోయినా మిగతావారు క్షేమంగా ఉంటే చాలు! లోకమే తమ కుటుంబంగా మహాత్ములు భావిస్తారు. 'లోకం సమస్తమూ సుఖంగా ఉండాలి' అని మన సనాతన ధర్మం ఉపదేశిస్తున్నది. లోక క్షేమం కోసం తమ జీవితాన్ని హారతి కర్పూరం చేసిన మహాత్ములు దైవసమానులు. భాసుడి 'మధ్యమ వ్యాయోగం' రూపకంలో ఆ పేదకుటుంబ సభ్యుల సంభాషణ విని ఆ రాక్షసుడే చలించిపోతాడు. అతడెవరో కాదు- ఘటోత్కచుడే! అతడు తన తల్లి హిడింబి కోరికను అనుసరించి ఒక మానవుణ్ని పట్టుకువెళ్లడానికి వచ్చాడు. కేవలం తన భర్త భీమసేనుణ్ని దర్శించడానికే హిడింబి ఈ యుక్తి పన్నింది కానీ, నరమాంస భక్షణ కోసం కాదు! అది వేరే కథ. మమతలు ఉన్న చోట మానవత్వం ఎలా పరిఢవిల్లుతుందో చెప్పడానికి భాసుడు మధ్యమ వ్యాయోగంలో ఈ సంఘటన కల్పించాడు.

ఈ మహాకవే రచించిన 'వూరుభంగం' రూపకం- దుష్టుడు సైతం తుది క్షణాల్లో పశ్చాత్తాపం చెందితే, మానవతా లత మరుక్షణమే పుష్పించి, ముక్తి అనే ఫలాన్ని ప్రసాదిస్తుందని నిరూపిస్తుంది. దుర్యోధనుడు ప్రాణం విడిచే ఘట్టం అది. తల్లిదండ్రులతో, గురువుతో, కుమారుడితో, భార్యలతో అతడు సంభాషించిన తీరు ఉత్తమ మానవత్వానికి మచ్చుతునక. తాను గతంలో చేసిన అమానవీయ కృత్యాలను పశ్చాత్తాపంతో గుర్తుచేసుకుంటాడు. ద్వేషం కంటే ప్రేమే గొప్పదంటాడు. హింసకు స్వస్తిచెప్పాలంటాడు. అంతా శ్రీకృష్ణుడి లీల తప్ప వేరేమీ కాదని అతడు గ్రహించడంతో మోక్షం పొందుతాడు. తెలిసి చేసినా, తెలియక చేసినా, కర్మకొద్దీ చేసినా, తుది క్షణాల్లోనైనా హృదయపరివర్తన చెంది భగవన్నామం జపిస్తే సత్ఫలం లభిస్తుందని భాసుడు భంగ్యంతరంగా ఈ రూపకంలో చెప్పాడు. పాండవులను అష్టకష్టాలపాలు గావించిన సుయోధనుణ్ని సైతం మానవతా దృక్కోణం నుంచి చూసిన భాస మహాకవి- వ్యాస హృదయాన్ని తన రూపకాల్లో రసవత్తరంగా ఆవిష్కరించి, లోకంలో శాంతి, అహింసలే ముక్తికి మార్గాలని సూచించాడు.
- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు 

Saturday 9 November 2013

మంచి - చెడ్డ


వరి గురించి అయినా మనం ఎప్పుడూ చెడుగా ఆలోచించకూడదు. ఇది ఒక నియమంగా పెట్టుకోవాలి. అలా ఆలోచించకుండా ఉండగలమా అని సందేహం కలుగుతుంది. అయినా దీన్ని మనం అభ్యాసం చెయ్యాలి. ఎందుకంటే, దీనివల్ల చాలా లాభాలున్నాయి. నిరంతరం ఇతరుల గురించి చెడుగా ఆలోచించటంవల్ల ముందు మన మనసులో చెడ్డ వాతావరణం ఏర్పడుతుంది. అది అవతలవారికి ఎంత హాని చేస్తుందో తెలియదు కాని, ముందు మన ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. తిరుగు లేదు. దీనికి శాస్త్రీయమైన దాఖలాలు ఉన్నాయి. రక్తపోటు పెరుగుతుంది. మధుమేహం అదుపు తప్పుతుంది.

మనిషి ఎలా ఆలోచిస్తే అలాగే ఉంటాడంటారు. చెడుగా ఆలోచించి, ఆలోచించి చెడ్డలో మునిగిపోతే మన మనసును దయ్యంలా చెడు పట్టుకుంటుంది. అది అవతలవారికి హాని చేసే లోపలే మనం దానికి బలి అయిపోతాం.

చెట్టుకు పట్టిన చీడ పక్క చెట్లకు అంటుకునే లోపల మొదటి చెట్టు మూలాన్నే తినేస్తుంది.

దుర్యోధనుడు ఒకసారి వెదికితే ఎక్కడా అతడికి ఒక్క మంచివాడు కూడా కనపడలేదట. చెడ్డవాడికి మంచి ఎక్కడ కనిపిస్తుంది? ఏ చూపుతో చూస్తే ఆ భావమే అందరిలో కనిపిస్తుంది. ఉదయం లేవగానే ఈ లోకం బాగుండాలి, అందరూ బాగుండాలి అని హృదయపూర్వకంగా పది నిమిషాలపాటు కోరుకోవాలి. ఇలా చేస్తే, మందులు వేసుకోకుండానే ఆరోగ్యం బాగుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలియజేస్తున్నా యి. గురువులు బోధిస్తున్నారు. మనం కూడా ఆలోచించాలి, ఆచరించాలి.

రాగద్వేషాలు మనల్ని నలిపి పారేస్తున్నాయి. నువ్వు-నేను అనే భేదం చివరికి ఒకరినొకరు హతమార్చుకునే స్థితికి తీసుకుపోతోంది. జంతులక్షణాలు బాగా ప్రబలి మానవత్వం మంటగలిసి పోతోంది. ఇలా జరగడానికి కారణాలు ఏమిటి?

మంచిగా ఆలోచించడానికి, మంచిగా ఉండటానికి పుణ్యం కారణమైనట్లు, చెడుగా ఆలోచించడానికి చెడ్డగా ఉండటానికి పాపం కారణం అవుతోంది. ఉల్లి ఉల్లివాసనను ఇస్తోంది. మల్లి మల్లివాసనను ఇస్తోంది. ఏ విత్తనం ఆ ఫలాన్ని ఇస్తోంది.

మంచి చెడుల మిశ్రమమే జీవితం. సుఖదుఃఖాల సంగమమే జీవనం. త్రేతాయుగంలో అవతార పురుషుడైన శ్రీరాముడున్నాడు. మంచికి, ధర్మానికి మారుపేరు ఆయన. ఆ యుగంలోనే అతి దురాత్ముడు, మహా పాపి అయిన రావణాసురుడూ ఉన్నాడు. ఏ యుగమూ చెడ్డను తప్పించుకోలేదు.

చెడ్డలో కూడా మంచిని చూడాలి. మంచి గురించే ఆలోచించాలి. ప్రసాద భావంతో భగవంతుడు దేన్ని ఇస్తే దాన్ని స్వీకరించాలని పెద్దలు చెబుతారు. అందుకు అనుగుణంగా ఎవరూ లేరు. కొత్త వూహలు, కొత్త ఆలోచనలు, కొత్త సిద్ధాంతాలు లేవనెత్తుతున్నారు. శాస్త్రీయ పరిష్కారాలు వెదుకుతున్నారు. ఆధునిక మార్గాల్లో వెళుతున్నారు. మంచిదే... ఎవరు వద్దన్నారు, ఎవరు కాదన్నారు? సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. రుతువులు వాటి ప్రభావాన్ని తప్పక చూపిస్తాయి. సార్వత్రిక సత్యాలను ఎవరూ కాదనలేరు.

మార్చుకోవలసింది మన తలరాతను కాదు. ఆలోచనా విధానాలను. ఆలోచనలు మారితే అదృష్టాలు మారతాయి. దైవానుగ్రహం లభిస్తుంది. బతుకులు బాగుపడతాయి.

కష్టాలు, కడగండ్లు అనుభవించిన పాండవులను పరమాత్మ వదిలేశాడా? గర్వంతో విర్రవీగే కౌరవుల ఆలోచనలు ఎలా తలకిందులయ్యాయి? చరిత్రలో ఎక్కడైనా చెడ్డవైపు నిలుచున్నాడా భగవంతుడు? అలా అయితే అతడు దేవుడెలా అవుతాడు? మనకు ఇతరులు ఏ మంచి చేయాలని కోరుకుంటామో, ఏ చెడ్డ చెయ్యకూడదని ప్రతిఘటిస్తామో- మనమూ ఇతరుల పట్ల అలాగే ఉండాలి. అనుకోకుండా చెడ్డ జరిగినా, దానికి దారితీసిన పరిస్థితులను విశ్లేషించుకుని, మళ్ళీ ఎప్పడూ అలా జరగకుండా చూసుకోవాలి. ఇది మన జీవన విధానంలో ఒక సూత్రంగా పెట్టుకోవాలి. కౌరవులు నూరుగురు, పాండవులు అయిదుగురు. తాత్కాలికంగా చెడ్డకున్న శక్తి ఎక్కువగా కావచ్చు. సహనం, సంయమనం, సౌశీల్యం, శాంతం, శరణాగతి, ఈశ్వర కృప ఉంటే విజయాన్ని ఎవరూ ఆపలేరు?

మంచిని నిర్మించే శక్తి మనకు లేకపోవచ్చు. చెడ్డను నిరసించే శక్తి కావాలి. చెడుభావనలు మనసును హింస పెడుతున్నప్పుడు తత్సమానమైన మంచి భావాలతో నింపుకోవాలి.

అందరిలో ఒకడే పరమాత్మ నివసిస్తున్నాడు అనే శుద్ధజ్ఞానం కలిగేంతవరకు ఈ అభ్యాసం తైలధారలాగ కొనసాగాలి. అప్పుడే మంచి కోసం మంచిగా ఉండగలం, మానవత్వాన్ని నిలబెట్టుకోగలం.
- ఆనందసాయి స్వామి 

Friday 8 November 2013

గృహస్థ ధర్మం

లోకాలన్నీ కలిపి పరమాత్మ దివ్యశరీరం. సమస్త దేవతలకు ఆయన శరీరమే గృహం. పంచభూతాలకు తమ అధికార ప్రదేశాలే గృహాలు. భూలోక ప్రాణులకు ఈ చరాచర జగత్తే గృహం. మానవులకు తమ దేహాలే గృహాలు. 
దేహాలను ఆలయంగా వర్ణిస్తుంది వేదం.
ఆ విధంగా ప్రతివారికీ ఒక ఆలయం ఉంది. అది వారి దేహమే. తిరిగి ఆ దేహాలయ రక్షణకు ప్రకృతి వనరులతో మరొక గృహాన్ని నిర్మించుకుంటాడు. అందులో సకుటుంబంగా నివసిస్తుంటాడు. దీన్నే నివాసగృహం అంటారు.
 
స్థిరనివాసం అయితే, అది స్వగృహం. తన ధనంతో నిర్మించుకున్నదన్నమాట. లేదా వారసత్వ ఆస్తిగా లభించినది. ఆధ్యాత్మిక జీవనం గడిపేవారు నివసించేదాన్ని ఆశ్రమం అంటారు. భగవంతుడి విగ్రహాలకు ఆవాసంగా నిర్మించేది కోవెల. అంతరాలయంలో మూలవిరాట్టును ఉంచుతారు. 

ఎవరు గృహ యజమానో అతడే గృహస్థు. వివాహితుడు, భార్యాసమేతుడు అయితే అతడు పూర్ణగృహస్థుడు. భార్యలేనివాడు అర్ధగృహస్థుడు. భార్యకు వివాహమంత్రాల ద్వారా అర్ధశరీర హోదా కల్పిస్తారు. ఆమె అర్ధాంగి అవుతుంది. ఆ క్షణం నుంచీ భార్యాభర్తలిద్దర్నీ గృహస్థులంటారు. యజమాని గృహస్థుడు, యజమానురాలు గృహిణి. 

వేదవిహితమైన సమస్త కర్మలు భార్యాభర్తలిద్దరూ కలిసి చేయాల్సిందే, లేకపోతే ఫలితాలు లభించవని చెబుతారు. సీతాపరిత్యాగం తరవాత శ్రీరాముడు అశ్వమేధయాగానికి సిద్ధపడతాడు. ప్రత్యామ్నాయంగా స్వర్ణసీతను పక్కన ఉంచి యాగాన్ని పరిసమాప్తి చేస్తారు. 
పర, అపర కర్మలు, పూజలు, వ్రతాలు దంపతసమేతంగానే నిర్వహించాలి. అలా చేయాలంటే ఇద్దరిదీ ఒకేమాట, ఒకేమనసు, ఒకేరీతిగా ఉండాలి. దానినే దాంపత్యధర్మం అంటారు.
గృహస్థధర్మం విస్త్రృతమైనది. గృహిణి తన గృహాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దాలి. పరిశుభ్రతను పాటిస్తూ, గృహదేవతలకు (వీరే ఇలవేల్పులు) నివాసయోగ్యంగా, వారు ప్రసన్నులయ్యే విధంగా గృహాన్ని నిర్వహించాలి. ఇంటికి ఇల్లాలే లక్ష్మి. ఆమె సంతోషంగా, ప్రసన్నంగా ఉంటూ అతిథి అభ్యాగతుల్ని ఆదరంగా చూడాలి. అతిథుల్ని విష్ణుస్వరూపాలుగా భావించమంటుంది మన ధర్మం. 

ఆదిశంకరులు భిక్షకు వెళ్లినప్పుడు కటిక బీదరాలు కేవలం ఒక ఉసిరికాయను మాత్రమే సమర్పించుకుంది. ఆ క్షణంలోనే ప్రసన్నులైన ఆదిశంకరులు ఆశువుగా కనకధారాస్తోత్రం చదివి కనక వర్షం కురిపించారని చెబుతారు. ఇదీ, ఆతిథ్యఫలం.
అతిథులందరూ కనకవర్షాలు కురిపించలేరు. కానీ, అందుకు సమానమైన ఆశీస్సులు కురిపిస్తారు. 
గృహిణి తన కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించే విధంగా గృహస్థు ఏర్పాట్లు చేయాలి. అప్పుడే గృహస్థధర్మాలు సవ్యంగా నిర్వర్తించడం సాధ్యపడుతుంది. రెండు చేతులు కలిస్తేనే పని చేయగలం. రెండు కళ్లూ ఒకే దృశ్యాన్ని చూసినప్పుడే స్పష్టత ఉంటుంది. ఒక కన్నుతో స్పష్టత ఉండదు. భార్యాభర్తల విషయం కూడా ఇంతే. ఏకస్తులుగానే వ్యవహరించాలి. భార్యాభర్తల అభిన్నత్వం రాధాకృష్ణులు, పార్వతీ పరమేశ్వరులు, సీతారాములతో పోల్చదగింది.
శరీరం గృహం కాబట్టి, శరీరధర్మాలను శాస్త్రోచితంగా నిర్వహించాలి. శరీరానికి నివాసగృహం ఉంటుంది గనక, గృహస్థధర్మాలు ప్రత్యేక శ్రద్ధతో పాటించాలి. ప్రపంచమూ గృహంతో సమానం గనుక సర్వప్రాణుల్ని తన గృహంలోని సహజీవులుగా, సమానాధికారాలు గలవారిగా గుర్తించి, ఆత్మీయంగా, ప్రేమాస్పదంగా వ్యవహరించాలి. ప్రపంచ గృహానికి పరమాత్మే నిజయజమాని గనుక, ఆయన పట్ల భక్తిశ్రద్ధలు, విధేయత కలిగి ఉండాలి. సర్వమూ ఆయన సంపదే గనుక వాటి విలువల్ని కాపాడాలి. అందరి సంతోషమూ మన సంతోషంగా భావిస్తే ప్రపంచం ఆనంద నిలయమవుతుంది. ఆ విధంగా ప్రవర్తించటమే అసలైన, సిసలైన గృహస్థ ధర్మం.
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌ 

Thursday 7 November 2013

ఆత్మావలోకనం...


త్మ పరిపూర్ణత్వాన్ని మనం అర్థం చేసుకునే వరకు, అనుభూతి పొందేవరకు అపరిపూర్ణమైన ప్రాపంచిక విషయాలపై మక్కువ కలిగి ఉంటాం. పసివాళ్లు వాళ్ల పరిమిత జ్ఞానాన్నిబట్టి వస్తువులకు ఆకర్షితమవుతారు. పెరిగి, వ్యక్తిత్వాన్ని సమకూర్చుకున్న వ్యక్తి అందుకు తగిన వస్తువుల పట్లే ఆకర్షితుడవుతాడు. పిల్లలాశపడే అర్థంలేని వస్తువుల్ని చూసి వాళ్ల అమాయకత్వానికి, అజ్ఞానానికి నవ్వుకుంటాడు. ప్రస్తుతం మన పరిస్థితీ అదే. పసివాడి పరిస్థితి. మానవజన్మ ఔన్నత్వాన్ని గ్రహించక, పరిమిత వస్తుజాలానికి ఆశపడుతూ వాటితో తృప్తిపడుతున్నాం. మనం పశుపక్ష్యాదులకంటే తక్కువ స్థాయిలో ఆలోచిస్తున్నాం. ఆశపడుతున్నాం.
పులి, సింహంలాంటి మృగాలు ఎంత ఆకలిగొన్నా గడ్డి తినవు. గోవు, ఏనుగు మాంసాహారాన్ని ముట్టవు. చకోరపక్షులెంత దాహార్తితో ఉన్నా మేఘాలు వర్షించే శుద్ధజలాన్ని తప్ప నేలమీది నీటికి ఆశపడవు. అవి అసంకల్పితంగానే, అజ్ఞాన దశలోనే వాటివాటి ఆభిజాత్యాన్ని అనుసరిస్తాయి. జాతి మూలతత్వాన్ని నిలుపుకొంటాయి. మరచిపోవు. మనిషి మాత్రమే... మానసికంగా, శారీరకంగా ఎంతో ఉన్నతదశలో ఉన్న మనిషి మాత్రమే దురదృష్టవశాత్తూ తానేమిటో, తానెవరో మరచిపోయాడు. తాహతుకు తగని అల్ప వ్యక్తిత్వంతో తగ్గిపోయాడు. చిన్నబోయాడు. చిన్నపిల్లాడు సరదాపడి పెద్దల పెద్ద చొక్కా వేసుకుంటే వినోదంగా బాగానే ఉంటుంది. కానీ, పెద్దమనిషి చిన్నపిల్లాడి దుస్తులు వేసుకుంటే పరిహాసాస్పదంగా ఉంటుంది. అసహ్యంగానూ ఉంటుంది. మన పరిస్థితి అది. అదే.

ఒక చిన్న మొలక మొలకలాగే ఉండదు. ఎదుగుతుంది. వృక్షమవుతుంది. ఫల పుష్పాదులనిస్తుంది. శీతలఛాయలు పరుస్తుంది. గోవత్సం వత్సగానే ఉండదు. గోవు అవుతుంది. లేదా కోడెదూడ అవుతుంది. వృషభం అవుతుంది. మొనగాడవుతుంది. రైతు బరువుల్ని, బాధల్ని ఒక్క మెడమీద మోస్తుంది. మూపున కాస్తుంది. శిశువుగా పుట్టిన మనిషి శరీరాన్ని పెంచుకుంటున్నాడు. శరాన్ని పెంచుకోవడం లేదు! ఆభిజాత్యాన్ని గుర్తించే శరం, ఔన్నత్యాన్ని గ్రహించే శరం... బేశరం! ఏం చూసుకుని తలెత్తుకు తిరుగుతున్నాం? అద్దంలో శరీరాన్ని చూసుకుని మురవటమేనా? లోపలేముందో గమనించవద్దా?

గుప్తనిధుల కోసం గుళ్లూ, గోపురాలూ తవ్వి చరిత్ర గుండెలు ఛిద్రం చేయటం కాదు. కొలతలకు, అంచనాలకు అందని అపారనిధి ఉంది మన అంతః మందిరంలో, అంతరంగంలో. దాన్ని తవ్వవద్దా, లోతులు తెలుసుకోవద్దా? లోపల ఏ అద్భుత, అపురూప నిధి ఉందో తెలుసుకోవద్దా? శవాన్ని కోతలు పెట్టి అవమానించటం మాత్రమే మనకు తెలిసింది. మలమూత్రాలు, రక్తమాంసాలు నిండిన తుచ్ఛశరీరమా ఇది? కాదు. ముక్కోటి దేవతల మురిపాల మందిరం. మేరుదండ విపంచిపై రుద్రవీణకులా నిట్టనిలువుగా భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాత్మక ప్రతీకలుగా నిలిచిన చక్ర సముదాయం. అధిష్ఠాన దేవతలుగా గణపతి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువుతీరిన నిటారు పవిత్ర ప్రాంగణం. శివపార్వతుల సమ్మేళన కేంద్రం సహస్రార కమలం. రాత్రింబవళ్లు, శుక్ల కృష్ణ పక్ష నియమభేదాల్లేని సూర్యచంద్రుల సదా విరాజమాన సదనాలు నయనాలు. సుషుమ్న ద్వారా ఎప్పుడు పైకెగబాకుతుందో తెలీని కుండలినీ మాత రాకకై సుషుమ్నకు ఇరువైపులా ఇడా పింగళ నాడులుగా శ్వాస అనే వింజామరలు వీస్తూ పైకీ కిందకూ లయబద్ధ విన్యాసం చేస్తున్న అదే సూర్యచంద్రులు. మానవ శరీరంలోని త్రికోణాకార మూలాధార చక్రాన్నే మణిద్వీపంగా మూడున్నర చుట్టలుగా ఒదిగి రాజసంగా నిద్రిస్తున్న దేవి. ఇవేనా? ఎన్నో. ఇదీ మన దేహం. మనం. 'నేను' అనే పవిత్రాత్మ శిలలోని జలలా, టెంక చుట్టిన నారికేళంలోని అమృత తీర్థంలా విరాజమానమై ఉన్న... దేహం.

అద్భుతమైనది ఏదైనా వ్యర్థం మధ్యే ఉంటుంది.. నిగూఢంగా. ఆత్మ అయినా అంతే. ఈ విషయం మనం గ్రహిస్తే ఈ ఆత్మ వజ్రాన్ని ధరించిన ఈ దేహాన్ని 'నేను' అనుకుంటున్న ఈ దేహశకల సముదాయాన్ని ఎంత అజ్ఞానంగా, ఎంత వ్యర్థంగా, ఎంత అర్థరహితంగా వినియోగించుకుంటున్నామో అర్థమవుతుంది. 'నేను' పరిమితం అనుకున్నప్పుడే పరిమితమైన ఆలోచనలు. అంచనాలు, కోరికలు. నేను అని భ్రమ పడుతున్న ఈ శరీరాన్ని శిశువును మోసే పవిత్ర గర్భకోశంలా వికసించనీ, విస్తృతం కానీ. అప్పుడు... తాను ఎంత పవిత్రమో, ఎంత ఘనమో, ఎంత విశాలమో, ఎంత అనంతమో అర్థమవుతుంది.
- చక్కిలం విజయలక్ష్మి 

Wednesday 6 November 2013

నాగులచవితి

పాముల ఆరాధన ఈనాటిది కాదు. ఎన్నో యుగాలనాటిది. సౌభాగ్యానికి, సత్సంతాన ప్రాప్తికి సర్పపూజ చేయడం లక్షల శరత్తుల కిందటే ఉన్నట్లు ఎన్నో పురాణాలు చెబుతున్నాయి. దేశంలోని అనేక ఆలయాల్లో మెలికలు తిరిగిన నాగరాజు విగ్రహాలు కనిపిస్తాయి ఇప్పటికీ.

దీపావళి అనంతరం వచ్చే కార్తిక శుద్ధ చవితిని నాగుల చవితిగా పండగ చేసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. పాముల్ని ఆరాధించే భారతీయ సంస్కృతి ఆంతర్యం ఏమిటి? ప్రకృతిలోని సమస్త ప్రాణుల్లో దైవత్వం అదృశ్య రూపంలో పరివ్యాప్తమై ఉంటుంది. ప్రాణికోటిని కాపాడుకొంటే సమస్త మానవకోటి మనగడకు ముప్పు వాటిల్లదు. పర్యావరణ సమతుల్యానికి విఘాతం కలగదు. చెట్లలో, పుట్లలో, రాయిరప్పల్లో, కొండకోనల్లో, నదుల్లో దైవత్వాన్ని వీక్షించింది భారతీయ సంస్కృతి. అందులో భాగంగానే నాగరాజుగా, నాగదేవతగా పామును పూజిస్తూ వస్తున్నారు.

భూమిలో పాములు నివసిస్తూ జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా పూర్వీకులు భావించారు. పంటల్ని నాశనం చేసే క్రిములు, కీటకాలను భక్షిస్తూ, పరోక్షంగా రైతుకు పంటనష్టం రాకుండా చూస్తాయట. విషసర్పాల మాట వినగానే భయపడి పారిపోతాం. విషసర్పాలకు మించిన దుష్ట మానవులు మన మధ్యే తిరుగుతూ నిష్కారణంగా కాటేస్తుంటారు.

శరీరంలో నాడులతో నిండిన వెన్నెముకను వెన్నుపాము అంటాం. కుండలినీ శక్తి మూలాధార చక్రంలో పాము ఆకృతిలో ఉంటుంది. నాగుల చవితినాడు విషసర్పంపుట్టను పూజించి, పాలుపోస్తే, మనిషిలోని విషసర్పం కూడా శ్వేతవర్ణం పొంది హృదయాల్లోని మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా భాసించాలన్న కోరిక నెరవేరుతుందని పెద్దలు చెబుతారు.

సర్పారాధనకు తామరపుష్పాలు, కర్పూరం, పూలు, లడ్డు మొదలైనవి శుభప్రదమైనవి. సర్పారాధన చేసేవారి వంశం తామరతంపరగా వర్ధిల్లుతుందని భవిష్యపురాణం చెబుతోంది. మన దేశంలోని ఎన్నో ఇళ్లలో ఇలవేలుపు సుబ్రహ్మణ్యేశ్వరుడే.

నాగర్‌కోయిల్‌ అనే వూరిలో ఒక నాగుపాము విగ్రహం ఉంది. దాని సమీపంలో తెల్లని ఇసుక ఆరునెలలు, నల్లని ఇసుక ఆరునెలలు ఉబికివస్తుందని భక్తులు చెబుతారు. పాము కుబుసానికి ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. గరళాన్ని ఆయుర్వేద మందుల్లో తగు మోతాదులో ఉపయోగిస్తారు.

నక్షత్ర మండలాలు సర్పాకృతిలోనే ఉన్నాయంటారు. నాగలింగం పువ్వులో పుప్పొడి సర్పాకృతిలోనే ఉంటుంది. శివుడి మెడనిండా సర్పాకృతిలోని హారాలు మెరుస్తుంటాయి. నాగేంద్రుని శివభావంతో చవితినాడు అర్చిస్తే సర్వరోగాలు నశించి సౌభాగ్యవంతులవుతారని రుషివాక్కు..
- కె.యజ్ఞన్న 

Tuesday 5 November 2013

యమద్వితీయ


'భగిని' అంటే తోబుట్టువు అయిన సోదరి అనీ, భాగ్యవంతురాలు అనీ అర్థం. సోదరి చేతివంటను తినడం భగినీహస్త భోజనం. ఈ సంప్రదాయానికి ఎంతో విశిష్టత ఉంది. యమధర్మరాజు సోదరి యమునానది. ఆమె పూర్వం తన అన్న అయిన యమధర్మరాజు దగ్గరకు ప్రతి నిత్యం వెళ్లి, తన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లాల్సిందిగా కోరేదట. నరకలోక పాలనలోనే సతమతమైపోయే యమధర్మరాజుకు సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేయడానికి ఎన్నాళ్లకూ తీరిక దొరకలేదు. ఎలాగైనా ఒక దినాన చెల్లెలి ఇంటికి వెళ్లి భోజనం చేసి రావాలని సంకల్పించుకున్నాడు. చివరికి అతనికి కార్తికమాసం, శుక్లపక్షం, ద్వితీయాతిథినాడు విరామం దొరికింది. ఆ దినాన యమున ఇంటికి వెళ్లాడు. ఎన్నాళ్లో ఎదురుచూడగా అనుకోకుండా వచ్చి, తన ప్రార్థనను మన్నించిన అన్నకు యమున షడ్రసోపేతమైన విందు భోజనాన్ని వడ్డించింది. యముడు సోదరి భక్తితో చేసిన వంటలన్నీ చక్కగా ఆరగించాడు. అమృతాన్ని తాగినంత ఆనందం కలిగింది. అప్పుడు యముడు తన చెల్లెలి చేతివంటను మెచ్చుకొని, ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు. అప్పుడామె- 'అగ్రజా! నీవు ప్రతి సంవత్సరం ఇదే రోజున నా ఇంటికి వచ్చి నా చేతివంటను తినివెళ్లాలి. అంతేగాక, ప్రతి సంవత్సరం కార్తిక శుక్లద్వితీయనాడు లోకంలో ఏ అన్నలు చెల్లెళ్లు వండిన పదార్థాలను భోజనం చేస్తారో, అలాంటివాళ్లకు నరకబాధ ఉండరాదు. ఇదే నేను కోరే వరం' అని పలికింది. యముడు 'తథాస్తు' అన్నాడంటారు. నాటి నుంచి ఈ వేడుక 'యమద్వితీయ' (యముడు తన సోదరి చేతివంటను తిన్న దినం) అనీ, 'భ్రాతృద్వితీయ' (అన్న చెల్లెలి చేతివంట తిన్న పవిత్ర దినం) అనీ ప్రసిద్ధిలోకి వచ్చింది.
'భగినీహస్త భోజనం' అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం, ఆచారం. ఇందులో మానవజీవన విశేషాలు, పరమార్థాలు ఇమిడి ఉన్నాయి. మనిషి కుటుంబజీవి. కనుక కుటుంబాన్ని విడిచి క్షణంకూడా జీవించలేడు. కుటుంబంలో ముఖ్యులు తల్లిదండ్రులు. వాళ్లు సంతానాన్ని కని, పెంచి, పోషించి, పెద్దచేసి, విద్యాబుద్ధుల్ని ప్రసాదించి, తమ సంతానానికీ కుటుంబాలను సంపాదించిపెడతారు. మనిషికి తల్లిదండ్రుల తరవాత ఆత్మీయులైనవాళ్లు తోబుట్టువులైన అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లే కదా! తల్లిదండ్రులు వయసులో పెద్దవాళ్లు కనుక, తమ సంతానం బతికినంతకాలం బతుకలేరు. తమ సమకాలంలో పుట్టిన తోబుట్టువులు తమ జీవితాంతం వరకు బతికే అవకాశం ఉంది. అందువల్ల అన్నలు, తమ్ముళ్లు, అక్కలు, చెల్లెళ్లు కనీసం ఏడాదికి ఒక్కసారైనా కలిసి భోజనం చేయకపోతే ఆత్మీయతలు ఎలా నిలుస్తాయి? అంతేగాక, ఒకరి కష్టసుఖాలను మరొకరు తెలుసుకొని స్పందించే అవకాశం ఉంటుందా? ఉండనే ఉండదు. కనుక ఈ భోజన సంప్రదాయం కుటుంబ సభ్యుల మధ్యన జీవితాంతం వరకు ప్రేమాభిమానాలను కలిగి ఉండే అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. బతుకు తెరువుకోసం దూరదూరాలకు వెళ్లకుండా ఉండిన ప్రాచీనకాలంలోనే ఈ సంప్రదాయం, ఆచారం కొనసాగింది. ఇక ఆధునికకాలం ఉపాధికోసం రాష్ట్రాల సరిహద్దులనే కాదు, దేశాలను, ఖండాలను దాటిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏడాదికొకసారి కాదుగదా, రెండు మూడేళ్లకూ ఆత్మీయులను, తోబుట్టువులను కలుసుకోలేని దుస్థితిలో ఆత్మీయతలు ఎలా నిలుస్తాయి? కనుక ఎప్పుడో ఒకప్పుడు కలిసినా ఈ ఆచారాన్ని పాటించి అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల ఇళ్లకువెళ్లి, వాళ్ల చేతివంటను భుజించి, వారికి ధనకనక వస్తువాహనాలను యథాశక్తిగా సమర్పించుకొంటే ఆత్మీయబంధాలు వర్ధిల్లుతాయి. ఒకరికొకరం అండగా ఉన్నామనే భావన, విశ్వాసం కలుగుతాయి. ఇవే ఆచారాలు, సంప్రదాయాలు. రాగద్వేషాలకు అతీతంగా విశ్వక్షేమం కోసం ఏర్పాటు చేసినవే ఆచారాలనీ, వాటిని వంశపారంపర్య క్రమంలో పాటించినప్పుడు సంప్రదాయాలవుతాయనీ పెద్దల మాట. ఆచారం ఎప్పుడూ దోషభూయిష్ఠమై ఉండదు. యుక్తాయుక్త విచక్షణగల మానవులు తమ ఆచరణల్లో ఏయే లోపాలున్నాయో తెలుసుకొని, వాటిని సవరించుకొని చక్కగా ఆచరించాలి. అదే విజ్ఞత అంటే.

'ఆత్మా వై పుత్రనామాసి' అన్నది వేదం. అంటే, తల్లిదండ్రుల ఆత్మలే సంతానంలో ఉంటాయని అర్థం. అందువల్ల అక్కాచెల్లెళ్లు అమ్మకు ప్రతిరూపాలే. అమ్మ చేతివంట అమృతసమానం అయితే అక్కాచెల్లెళ్ల చేతివంట కూడా సుధామయమే. కనుక 'భగినీహస్త భోజనం' అన్ని విధాలా అమృతభక్షణంతో సమానం. ఈ పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటే చాలు- ఈ పర్వదినంలోని మహిమ బోధపడుతుంది. ఏ సంప్రదాయమైనా, ఆచారమైనా మానవాళి మధ్య సద్భావనలను పెంపొందింపజేసి, స్నేహాన్ని, ఆత్మీయతను, ఆప్యాయతను శాశ్వతంగా నిలపడంకోసమే. ఇది గ్రహిస్తే భూలోకం అభినవ స్వర్గమే అవుతుంది.
- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ 

Monday 4 November 2013

దీపారాధన


 పంచభూతాల్లో ప్రధానమైన 'అగ్ని' ప్రాణికోటి మనుగడకు అవసరమయ్యే తేజస్సును, ఆహారాన్ని ఐహిక ప్రయోజనరూపంలో, సనాతన ధర్మ గరిమను ఆధ్యాత్మిక ప్రయోజన రూపంలో ప్రసాదిస్తోంది. ఏ కార్యక్రమాన్నయినా 'అగ్నిసాక్షి'గా ఆరంభించటం హైందవ సంప్రదాయంలోని ముఖ్యాంశం. దీపాలను వెలిగించడమంటే, మనలోని అజ్ఞాన తిమిరాన్ని పారదోలి జ్ఞానకాంతిని ఇమ్మని ఈశ్వరుణ్ని వేడుకోవడమన్నమాట.
దీపంలో మనకు కనిపించే నీలం, పసుపు, తెలుపు వర్ణాలు మనలోని సత్వరజస్తమో గుణాలకు ప్రతీకలు. సత్యం, శివం, సుందరాలకు సంకేతాలు.

స్వామి దయానంద సరస్వతి అమావాస్యనాడే సన్యసించి తిమిర జగతికి జ్ఞానకాంతిని అందించారు. చీకటి పనులన్నీ పాపాలుగాను, వెలుగులో చేసే పనులను సత్కార్యాలుగాను మహాత్ములు అభివర్ణిస్తారు. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపంగాను, మనో వికాసానికి, నిర్మల హృదయానికి, పావన భావనకు, ఆనందానికి, ప్రసన్నతకు, ప్రశాంతికి సజ్జనత్వానికి నిదర్శనంగాను భావిస్తారు భాగవతులు. జగతిని జాగృతం చేసే చైతన్య కిరణాలు దీపకాంతినుంచే ఆవిష్కృతమవుతాయి. మానవ శరీరం మట్టితో చేసిన ప్రమిద అనీ, ప్రాణం ప్రకాశించే దీపమనీ, ఆధ్యాత్మిక సాధన అందులో పోసే తైలమనీ, అందుకే భగవంతుడికి భక్తుడు చేసే షోడశోపచారాల్లో దీప సమర్పణ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుందనీ పౌరాణికులు చెబుతున్నారు. దీపం లక్ష్మీస్వరూపం కనుక దీపారాధన ద్వారా ఆమెకు ఆహ్వానం పలుకుతాం. అన్ని భారాలనీ భరించే భూమాత దీపం వేడిని భరించలేదట. అందుకే ప్రమిదలో ప్రమిదవేసి మరీ ప్రమదలు, దీపం వెలిగిస్తారట. ఒక దీపం వెలిగించామంటే ఇంట్లోకి అష్టలక్ష్ముల్నీ ఆహ్వానించినట్టేనంటారు. దీపకాంతి జగతికి క్రాంతి, శాంతి ప్రసాదించి భ్రాంతిని తొలగిస్తుందని హైందవ సంప్రదాయ విశ్వాసం.

కార్తిక శుద్ధపాడ్యమి 'బలిపాడ్యమి'గా ప్రశస్తినందుకుంది. ఆరోజునుంచీ మొదలుకొని నెలంతా దీపాలు వెలిగిస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుందని పౌరాణికులు చెబుతారు. నెలంతా వెలిగించలేనివారు కార్తిక సోమవారాల్లో దేవాలయాల్లో దీపదానం చెయ్యవచ్చనీ, అదీ సాధ్యం కాకపోతే కనీసం కార్తికపౌర్ణమినాడయినా దీప ప్రకాశనం చేసి దివ్యలోక సాయుజ్యాన్ని పొందవచ్చని అంటారు. ప్రదోష సమయాల్లో దీపాలు వెలిగించి, పిల్లలు దక్షిణ దిశగా నిలుచుంటే దాన్నే 'ఉల్కాదానం' అంటారు. ఆ దీపాలు పితృదేవతలకు మోక్షద్వారాలు చూపుతాయట. శరదృతువులో క్రిమికీటకాలు వ్యాధుల్ని ప్రబలజేస్తాయి. ఈ కార్తిక దీపాలు ఆ వ్యాధుల్ని నిరోధించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతాయి. పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయి.

దీపం ఎప్పుడూ అధోదిశవైపు చూడదు. వూర్ధ్వ దిశనే సూచిస్తుంది. మనిషి కూడా ఆ కాంతిలో ఉన్నతమైన ఆలోచనలతో అభ్యుదయ దిశవైపు పయనించాలని అది సంకేతం ఇస్తోంది. 'జ్యోతి స్వరూపమైన ఓ పరమాత్మా! నీవు ఆ కవుల్లో కవిగా మర్త్యజీవుల్లో అమృతుడివిగా భాసిస్తావు. నీ వల్ల మా దుఃఖాలు తొలగుగాక!' అని రుగ్వేదంలో దీపకాంతిని గురించి ప్రార్థన ఉంది. సార్వకాలీనమైన దైవం దీపం. దీపానికి నమస్సునర్పిస్తే సకలదైవాలను ప్రార్థించినట్లే.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి

Saturday 2 November 2013

ఆనందజ్యోతులు

 అలంకారాలన్నింటిలోకీ వెలుగే పెద్ద అలంకారం. అసలు ఏ అలంకారమైనా వెలుగు లేనిదే గోచరించదు కూడా. ప్రపంచంలో ఏ ప్రాంతంవారికైనా ఏ ఉత్సవం జరిపినా వెలుగు తోరణాలతోనో, వెలుగులు చిమ్మే బాణసంచాతోనో వేడుకలు సాగించడం అలవాటు. దీన్నిబట్టి మానవ స్వభావంలోనే వెలుగురవ్వలు ఉత్సాహానందాలకు ఉనికిపట్లు- అనే భావం దాగి ఉంది అని స్పష్టమవుతుంది.
యుగాల క్రితం భారతీయ సంస్కృతి ఈ వెలుగుల వేడుకను 'దివ్యత్వం'గా దర్శించి, దాన్ని పండుగగానూ, పవిత్రమైన ఆధ్యాత్మిక సాధనగానూ ప్రతిష్ఠించింది. ఒక చక్కని వ్యవస్థగా దీపావళిని తీర్చిదిద్దింది.
కేవలం వేడుక మాత్రమే కాక- జ్యోతిషశాస్త్రం, దేవతల అనుగ్రహాన్ని పొందే అర్చనా విధానం, పితరుల్ని తృప్తిపరచే పూర్వీకుల పట్ల ప్రేమ... ఇవన్నీ ఈ పండుగతో ముడివడి ఉన్నాయి. 'దీపావళినాడు ఎలాంటి మానసిక స్థితిలో ఉంటామో, ఏడాది పొడుగునా అదే స్థితి కొనసాగుతుంది' అని ధర్మశాస్త్ర వచనం. అందుకే ఈ రోజున అందరూ ఉత్సాహంగా కలిసిమెలసి ప్రేమలు పంచుకొనే కుటుంబ, సామాజిక సామరస్యపర్వంగా వేడుక జరుపుకొంటారు. పితృతర్పణాలతో, కొరవుల మంటల వెలుగులతో పెద్దలను తలంచుకొని పూర్వీకులపై భక్తిని ప్రకటిస్తారు. ఇంట సిరులు స్థిరంగా ఉండాలని లక్ష్మీపూజ, కుబేరపూజ చేస్తారు. అలక్ష్మిని (దారిద్య్ర, భయ, రోగాది దుర్భావాలను) తొలగించేందుకు ధ్వనులతో కూడిన వెలుగు రవ్వలను బాణసంచులుగా జ్వలింపజేస్తారు. దేవతల కృప లభించేలా దీపతోరణాలను వెలిగిస్తారు. భాద్రపద కృష్ణపక్షపు మహాలయ దినాల్లో ఆరాధించిన పితరులకు ఈ ఆశ్వయుజ అమావాస్య ఒక విధంగా వీడ్కోలు తెలుపుతుందని- పితృదేవతారాధన శాస్త్రాలు చెబుతున్నాయి.

ప్రదోషకాలంలో అమావాస్య ఉన్న రోజునే దీపామావాస్యగా పేర్కొనాలని ధర్మశాస్త్ర వచనం. ప్రాతఃకాలంలో అభ్యంగస్నానం, తదుపరి వినోదాలు, ఇష్టమృష్ఠాన్న భోజనం, బంధుమిత్రులతో సాంగత్యం, సందెవేళ ధనలక్ష్మీ పూజ, దీపలక్ష్మీ ఆరాధన, దీపాలంకరణ- ఈరోజున ఉత్సవ విధులుగా పేర్కొన్నారు. జగదంబ కళాస్వరూపాన్ని నరక చతుర్దశి, దీపరాత్రులతో ఆరాధించడం కూడా కొన్ని చోట్ల సంప్రదాయం.

నరక చతుర్దశి, దీపావళి, కార్తిక శుద్ధ పాడ్యమి- ఈ మూడు రాత్రుల్లో దీపాలు వెలిగించాలి- అని ఈ పండుగకు సంబంధించి ప్రాచీనగ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంటే, త్రిరాత్ర పర్వంగా దీన్ని శాస్త్రం అభివర్ణించింది. ఇంటి వాకిళ్లలో, తులసికోటవద్ద, గుమ్మాల్లో, గోశాలలో, దేవాలయాల్లో దీపమాలికలను వెలిగించాలి- అని పురాణాల మాట. దేవతలు కాంతిశరీరులు కనుక, దీపజ్యోతుల వల్ల దేవతాశక్తులు ఆహ్వానితులై అనుగ్రహిస్తారు- అనే కారణంతో దీపాలు వెలిగించాలంటారు.

లక్ష్మీపూజతోపాటు గోమాతను, వృషభాలను అలంకరించి పూజించాలని- కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది గోలక్ష్మీపూజ. 'దీపేన సాధ్యతే సర్వం' అని ఆర్ష వచనం. దీపంతో దేనినైనా సాధించవచ్చు- అని రుషులు చెప్పిన మహిమా వచనం. గ్రహదోషాలు తొలగాలన్నా, ఆయువు పెరగాలన్నా, అభీష్టాలు సిద్ధించాలన్నా దీపాలను వెలిగించి నమస్కరిస్తే చాలునని దీప మహిమను పురాణ గ్రంథాలు వివరించాయి.
వేదన కలిగించే స్థితికి 'నరకం' అని నిర్వచనం. ఆ నరకాన్ని పోగొట్టి ఆనందాన్నిచ్చే సంతోష కాంతి సాధన దీపావళి పర్వం.
- సామవేదం షణ్ముఖశర్మ 

Friday 1 November 2013

ధన త్రయోదశి


రోగ్యప్రాప్తి, ఐశ్వర్య సిద్ధికోసం దైవ స్వరూపాల్ని విశేషంగా ఆరాధించే పర్వదినమే ధన త్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశినాడు ఆచరించే ఈ పండుగకు ధన్వంతరీ త్రయోదశి, యమ త్రయోదశి, కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి వంటి పేర్లూ ఉన్నాయి. 'అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలి. అకాల మత్యుభయాలు లేకుండా, సిరి సంపదలతో విలసిల్లాలి'- అనే శుభాకాంక్షలకు నేపథ్యమే ధనత్రయోదశి పర్వదినం. సంపదలతో తులతూగడానికి లక్ష్మీదేవినీ, సంపూర్ణ ఆరోగ్యంకోసం ధన్వంతరినీ, సుస్థిర ఆర్థిక వృద్ధికి కుబేరుణ్నీ, అపమృత్యు బాధలు తొలగడానికి యమధర్మరాజును వివిధ రీతుల్లో ధన త్రయోదశినాడు పూజిస్తారు.
ధన త్రయోదశికి పౌరాణిక ప్రశస్తి ఎంతో ఉంది. లక్ష్మీదేవిని నరక చెరనుంచి విముక్తి చేసి, శ్రీహరి ఆమెను ధనాధిష్ఠాన దేవతగా ప్రకటించి, ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషిక్తురాల్ని చేసింది ఈ రోజేనని చెబుతారు. అలాగే వామనుడు త్రివిక్రమావతారాన్ని ధరించి బలిచక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించాడు. భూలోకం మొత్తాన్నీ ఒక్క పాదంతో వామనుడు ఈ ధన త్రయోదశి నాడే ఆక్రమించాడంటారు.

సకల సిరులకు, అష్త్టెశ్వర్యాలకు, నవ నిధులకు, సుఖసంతోషాలకు అధినాయకురాలైన ధనలక్ష్మిని ధన త్రయోదశినాడు ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ విశిష్టమైన పర్వదినంనాడు మనం ఏ భావనతో ఉంటామో, అదే భావం సంవత్సరమంతా కొనసాగుతుందని నమ్మకం. లక్ష్మీదేవి ధనప్రదాతగా ఆవిష్కారమైన రోజు కాబట్టి ఈ ధన త్రయోదశినాడు బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దీంతో ఏడాది పొడవునా తమకు ధనలక్ష్మీ కృపాకటాక్షాలు చేకూరుతాయని విశ్వసిస్తారు. ఆర్థిక స్థిరత్వాన్ని అనుగ్రహించే కుబేరుణ్ని ధన త్రయోదశినాడు వ్రతాచరణ పూర్వకంగా ఆరాధిస్తారు. కుబేరుణ్ని కుబేర యంత్రసహితంగా పూజించడంవల్ల అక్షయ సంపదలు అందుతాయని భావిస్తారు. ధన త్రయోదశినాడు బంగారు, వెండి ఆభరణాలతోపాటు రాగి, పంచలోహ పాత్రలు కొనుగోలు చేస్తారు. రాబోయే సంవత్సరానికి ఇది సమృద్ధిదాయకమని నమ్ముతారు. అలాగే ఈ పర్వదినంనాడు ఇతరులకు రుణాల్ని ఇవ్వకపోవడం, వృథా ఖర్చులు చేయకపోవడం వంటివి సంప్రదాయాలుగా పాటిస్తారు.

పరిపూర్ణ ఆయువుకోసం యమధర్మరాజును ధన త్రయోదశినాడు పూజిస్తారు. ఈ రోజు సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో నువ్వులనూనె పోసి దీపాల్ని వెలిగిస్తారు. వీటిని యమదీపాలుగా పేర్కొంటారు. యముడు దక్షిణదిక్కుకు అధిపతి కాబట్టి, ఇంటి ఆవరణలో దక్షిణం వైపున, ధాన్యపు రాశిమీద దీపాన్ని వెలిగిస్తారు. ఈ యమదీపంవల్ల సమవర్తి అయిన యముడు శాంతి చెంది, అకాల మృత్యువును దరిచేరనీయడని ప్రతీతి. విష్ణుమూర్తి అనేక అవతారాల్లో ధన్వంతరీ స్వరూపం కూడా ఒకటి. ధన త్రయోదశినాడే ధన్వంతరి క్షీరసాగర మథన సందర్భంలో అమృతకలశంతో ఉద్భవించాడంటారు. శ్రీహరి ఆయనకు 'జలుడు' అని నామకరణం చేశాడంటారు. ఆరోగ్యంగా జీవించడానికి ఉపయుక్తమైన ఆయుర్వేదానికి ధన్వంతరిని అధిపతిగా నియమించాడని చెబుతారు. సప్త ధాతువుల్లో బంగారానికి వైద్యపరమైన శ్రేష్ఠత అధికంగా ఉందనీ, స్వర్ణభస్మ సేవనంవల్ల మనిషి జీవన కాలాన్ని పెంపొందించుకోవచ్చని ధన్వంతరి వెల్లడించాడు. ధన త్రయోదశికీ, బంగారానికి అవినాభావ సంబంధం ఏర్పడటానికి ఇది కూడా ఓ కారణంగా చెబుతారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో, వారణాశిలో, తమిళనాడులోని శ్రీరంగంలో, కేరళలోని అష్ట ధన్వంతరీ ఆలయాల్లో ధన్వంతరిని ధన త్రయోదశి నాడు విశేషంగా ఆరాధిస్తారు.

ఉత్తర భారతదేశంలో ధన త్రయోదశిని 'ధన్‌ తేరస్‌' పేరిట నిర్వహిస్తారు. ఇది ప్రధానంగా ఉత్తరాది పండుగే అయినా ప్రస్తుతం దేశమంతా వ్యాప్తి చెందింది. ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ అనే అయిదు పండుగల సమాహారానికి ధన త్రయోదశి శుభశ్రీకారం చుడుతోంది. ఆరోగ్యలబ్ధి, సౌభాగ్య సిద్ధి, ఆయుర్‌వృద్ధి, ఆర్థిక సమృద్ధి ఏకీకృతంగా దైవారాధన ద్వారా అందుకోవడానికి ధన త్రయోదశి పావనకరమైన పర్వదినం.
- డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌