ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday 31 October 2013

అవసరం


 అద్భుతమైన ఫలితాలు కలగడానికి ఆసక్తి ఒక కారణం. అవసరం అతి ముఖ్య కారణం. ఈ రెండూ ఉన్న ప్రాణి మానవుడు. పరిసరాలను, అవకాశాలను, సమయాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటే ప్రతి వ్యక్తీ ఉన్నత స్థాయికి చేరతాడు. దీనికి కావలసిందల్లా కాస్త నిదానం, మరికాస్త ఓపిక. అవసరం మనిషిచేత ఎంత పనైనా చేయిస్తుంది. కష్టాలను భరించేటట్లు చేస్తుంది. సాహసాలను చేయిస్తుంది. వాటి వల్ల కొత్త ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటాయి.
చలికాలంలో చన్నీటి స్నానం చేయమంటే జంకుతారు. కానీ కాలుజారి పడి ఒళ్ళంతా బురద అయితే దాన్ని కడుక్కోవడానికి మరో ఆలోచన లేకుండా అంత చలిలోనూ చన్నీటి స్నానం చేయడానికి వెనకాడరు. వడిగా ప్రవహిస్తున్న నదిలో ప్రమాదవశాత్తు పడిపోతే కనిపించిన ఏ గడ్డిపరకనైనా ఆధారంగా చేసుకుని బయటపడటానికి ప్రయత్నిస్తారు ఎలాంటివారైనా. ఆ సమయంలో ఆ గడ్డిపరక తన ప్రాణాలను కాపాడగలుగుతుందా, లేదా అనే ఆలోచన ఉండదు. తనకు ఈతరాదు కదా ఎలా ఒడ్డుకు చేరతానని ఆలోచించరు. ఆ సమయంలో వారి ఆలోచన అంతా ఒక్కటే- ప్రాణం నిలబెట్టుకోవాలి. వీటన్నింటికీ కారణం 'అవసరం'. ఆ అవసరం కలిగిననాడే వెదుకులాట మొదలవుతుంది. అప్పుడే కొత్త ఆవిష్కరణ జరుగుతుంది.

జీవకుడు గౌతమ బుద్ధుడి (పూర్వాశ్రమంలో సిద్ధార్థుడి)కి ఆస్థానవైద్యుడు. అతడు తక్షశిలలో గురువును మెప్పించి వైద్య శాస్త్రాన్ని నేర్చుకున్నాడు. విద్య పూర్తయింది. 'ఈ నగరానికి రెండు మైళ్ల కైవారం (చుట్టూరా)లో ఉన్న మొక్కల్లో మందుకు పనికిరానిది తెచ్చి నాకివ్వు' అని గురువు గురుదక్షిణ కోరాడు. 'అదెంత పని' అనుకుని బయలుదేరాడు జీవకుడు. అలా వెళ్ళినవాడు ప్రతి మొక్కను పరిశోధన చేసి, కొన్ని సంవత్సరాల తరవాత గురువు దగ్గరకు చేరాడు. 'క్షమించండి గురుదేవా! మీరు చెప్పిన పరిధిలో మొక్కలన్నింటినీ పరిశోధించాను. వాటిలో కొత్త కొత్త ఔషధాల విషయంలో ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి. అంతే తప్ప వాటిలో మందుగా పనికిరాని మొక్క ఒక్కటీ కనబడలేదు' అని విన్నవించుకున్నాడు. ఆ మాటకా గురువు 'నీకా విషయం తెలియజేయడానికే అలా కోరాను. వాటిన్నింటినీ పరిశోధన చెయ్యమని చెబితే అర్థం చేసుకోవు. ఏ మొక్క ఏ చికిత్సకు పనికివస్తుందో పరిశోధన చేయమంటే 'ఇప్పటివరకూ ఉన్న విజ్ఞానం చాలులే' అని నిర్లక్ష్యం చేయవచ్చు. ఇలాగైతే తప్పనిసరి కాబట్టి, ఎన్నో పరిశోధనలు చేశావు. అది నీ భావి వైద్యవృత్తికి ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ రకంగా నా గురుదక్షిణ నాకు చేరింది, వెళ్ళిరా' అని ఆశీర్వదించి పంపాడు.

ఒక అవసరం మనిషికి స్ఫూర్తిగా మారుతుంది. అది అతడి అవసరం తీర్చడమే కాదు, భవిష్యత్తులో ఎందరికో ఉపయోగపడుతుంది. ఒకరి అవసరం కోసం ఏర్పరచుకున్న సౌకర్యం, ఒక ప్రాణాన్ని నిలబెట్టడం కోసం కనిపెట్టిన మందు... ఇలా వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి ఏర్పరచుకున్న సౌకర్యాలు భావితరాల వారికి సమష్టిగా ఉపయోగపడిన దాఖలాలు ఎన్నో...

ఒక బాలుడు ఆటలాడుతుండగా ప్రమాదవశాత్తు రెండు కళ్లూ పోగొట్టుకున్నాడు. ఆ అంధత్వాన్ని అధిగమించి చదువుకోవాలనుకున్నాడు. అనేక ప్రయత్నాలు చేసి చేతి వేళ్లతో తడిమితే అర్థమయ్యే అక్షరాలకు రూపకల్పన చేశాడు. చదువుకుని విద్యావంతుడయ్యాడు. అతడు రూపొందించిన ఆ అక్షరాలు అతడికొక్కడికే కాకుండా లోకంలో ఉన్న అంధులందరికీ ఉపయోగకరంగా మారాయి. అదే బ్రెయిలీ లిపి. ఆ లిపిని సృష్టించిన వాడు లూయీ బ్రెయిల్‌. డాన్‌ బాస్కో అనాథ బాలుడు. ఏ ఆధారం లేకపోవడం వల్ల ఎన్నో బాధలు అనుభవించినవాడు. కష్టనష్టాలకు ఓర్చి జీవితంలో నిలదొక్కుకున్నాడు. ఆయన స్థాపించిన సేవాసంస్థలు నేడు ప్రపంచవ్యాప్తంగా ఎందరో అనాథ, వీధి బాలలకు ఆశ్రయాన్ని కల్పిస్తున్నాయి. మంచి ఆశయంతో అవసరాలు తీర్చుకోవడంకోసం చేసిన ఆవిష్కరణలు తరవాతి తరాల వారికి ఉపయోగపడినట్లే, స్వార్థ అవసరాల కోసం ఏర్పడిన ఆవిష్కరణలు అనర్థాలకీ దారితీస్తాయి. కాబట్టి 'అవసరం చెడ్డది' అనిపిస్తే దాన్ని తీర్చుకోకపోవడమే మంచిది.
- అయ్యగారి శ్రీనివాసరావు

Wednesday 30 October 2013

బ్రహ్మసత్యం


 గవంతుడి అనుగ్రహం పొందాలన్నా, మోక్షం ప్రాప్తించాలన్నా సత్యమే ఆధారం. ఎందుకంటే సత్యమనేది ఒక సద్గుణం మాత్రమే కాదు. అది బ్రహ్మ స్వరూపం. అదొక మహత్తరమైన శక్తి. సత్యమనే మాట పలకడం ఎంత సులభమో సత్యమైన మాటను నిలుపుకోవడం అంత కష్టతరం. భగవంతుడు ఈ మానవ జన్మ ఇచ్చినందుకు జీవనసత్యం తెలుసుకోవాలి, ఆచరించాలి. ఇతరులకు సత్యవాక్పాలనలో ఆదర్శంగా నిలవాలి. పరోపకారమనేది అసలైన జీవన సత్యమని స్థూలంగా ధర్మశాస్త్రాలు చెబుతున్నా, సత్యంతో అనేక ధర్మసూత్రాలు ముడివడి ఉన్నాయి. ఇతరులను పీడించరాదనీ, సకల ప్రాణికోటినీ ప్రేమించాలనీ, స్వార్థ చింతనకు మనసులో తావీయరాదనీ ఉద్బోధిస్తారు. రుజువర్తన, నిజాయతీ, చిత్తశుద్ధితో జీవన ప్రస్థానం కొనసాగించాలనీ, అరిషడ్వర్గాలను దూరంగా ఉంచాలనీ, వీటన్నింటితోను సత్యమనే సద్గుణానికి సాన్నిహిత్యం ఉందనీ ఉపనిషత్తులు, వేదాలు చెబుతున్నాయి.
సత్యాచరణవల్లనే మనమేమిటో మనకు బోధపడుతుంది. తేజోమయ తపం వల్ల యజ్ఞం, సత్యం ఆవిర్భవిస్తున్నాయంటారు. ధర్మాత్ముణ్ని ఆవలితీరానికి చేర్చే నౌక కేవలం సత్యమే. సత్యాసత్యాల మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉం టుంది. అంతిమ విజయం సత్యానిదే. సోమదేవుడు సత్యాన్ని పాటించి, అసత్యాన్ని అంతం చేస్తాడని వేద కథనం. అసత్యమాడినవారికి దుర్గతులు, సత్యమాడినవారికి సద్గతులు ప్రాప్తిస్తా యంటారు. 'సత్యం వద, ధర్మం చర'- సత్యాన్నే పలకాలనీ, ధర్మాన్నే ఆచరించాలనీ తైత్తరీయోపనిషత్తు చెప్పింది. సత్యపాలనలో అలక్ష్యం, ఏమరుపాటు తగదనీ వివరించింది. సత్యం పలకడమంటే అమృతపానం చేయటం.

తపస్సు చేసేవారికి, బ్రహ్మచర్య దీక్షలో ఉన్నవారికి, సత్యపాలన చేసేవారికే బ్రహ్మలోకం లభ్యమవుతుందని 'ప్రశ్నోపనిషత్తు' చెబుతోంది. సత్యనిష్ఠ మనిషిని శాశ్వతంగా పవిత్రుడిగా చేస్తుంది. దోషరహితుడైన యోగి, జ్యోతిర్మయ స్వరూపమైన పవిత్రమైన ఏ ఆత్మను దర్శిస్తాడో, అదే సత్యమని 'ముండకోపనిషత్తు' వ్యాఖ్యానిస్తోంది.

సృష్టిలోని సమస్త జనులకు సత్యమే శరణమనీ వారి ప్రతిష్ఠకు సత్యమే కారణమనీ, వారి శక్తికి మూలం సత్యమేననీ ఛాందోగ్యోపనిషత్తు ప్రవచిస్తోంది. అరుణ రుషి తన పుత్రుడైన శ్వేతకేతువుతో అష్ట సిద్ధుల్లో మొదటిదైన 'అణిమ'యే యావత్ప్రపంచానికి 'ఆత్మ' అనీ అదే సత్యమనీ, సకల జీవరాశుల మనుగడకు సత్యమే మూలబీజమనీ చెబుతాడు. సత్యపూర్వకంగా ప్రవర్తించినందువల్లనే దేవతలు కీర్తిని ఆర్జించగలిగారనీ, సత్యవాక్కు తప్ప మరేదీ పలకరాదని 'శతపథ బ్రాహ్మణం' బోధిస్తోంది. ఈ అఖిల సృష్టికీ సత్యసాక్షి సూర్య భగవానుడేనని చతుర్వేదాలూ అంగీకరించాయి. మానవుడు అసత్యమాడి చట్టం నుంచి, ధర్మం నుంచి తాత్కాలికంగా తప్పించుకున్నా, కర్మ సాక్షి సూర్య భగవానుడి దృష్టినుంచి మాత్రం తప్పించుకోలేడు. యుగాలు, రుతువులు మారినా సత్యం మాత్రం మారదు. అది నిత్యమైనది. సత్యవాక్పాలకులను సర్వదా విజయం వరిస్తుంది. మానవతా విలువల్ని పెంచుతుంది. భగవదన్వేషణకు ఏకైక మార్గం సత్యమార్గమే.

తపస్సులలో సత్యపాలనను మించింది లేదు. తరచూ మనం స్వార్థపూరితమైన లాభాల కోసమేకాక, అసందర్భంగా, అకారణంగా అబద్ధమాడుతుంటాం. ఇలా అబద్ధాలకు పూనుకోవడం ద్వారా క్రమక్రమంగా భగవంతుడికి దూరమవుతున్నామన్న మాట. ఎందుకంటే సత్యమే పరమాత్మ. అసత్యమాడటమంటే నాస్తికతను ఆహ్వానించడమే. ఎవరికీ హాని జరక్కపోయినా, కాకతాళీయంగా వ్యర్థంగా అబద్ధమాడేస్తుంటాం. అది మన వ్యక్తిత్వాన్నీ, ప్రతిష్ఠనీ దెబ్బ తీసేదే! ఆధ్యాత్మిక సాధన అనే మొక్కకు అబద్ధమే చీడపురుగు. మన పూర్వీకులైన జ్ఞానులు, విద్యావేత్తలు, మహర్షులు, ధర్మవిదులు, వేదమూర్తులు, రాజులు, నేతలు సత్యం కోసం ఎంతటి మహత్తర త్యాగాలు చేశారో సర్వవిదితం.

మితభాషిత్వం సత్యవ్రతాచరణకు ఎంత గానో దోహదపడుతుంది. మౌనవ్రతమూ సత్యదీక్షకెంతో ప్రేరణ కలిగిస్తుంది. మనిషి జీవిత పర్యంతం కాపాడే ఏకైక పవిత్ర ఛత్రం 'సత్యం'! భగవంతుడితో మాట్లాడాలంటే మౌనమొకటే ప్రధాన సాధనం. ఇతరులకు అప్రియమైనదైనా సత్యమే పలకాలని మహాభారత సందేశం. 'బ్రహ్మ సత్యమ'న్న నిత్యసత్య నిర్వచనాన్ని అర్థంచేసుకోగలిగితే మానవ జీవనం నవజీవన- బృందావనమే!
- చిమ్మపూడి శ్రీరామమూర్తి

Tuesday 29 October 2013

సహజాన్వేషణ


   లోకం మనలను మార్చడానికి ఉంది. మనం లోకాన్ని మార్చడానికి లేం. లోకానికి ఒక ప్రయోజనం ఉంది. లోకానికి ఒక ఉద్దేశం ఉంది. లోకానికి ఒక లక్ష్యం ఉంది.

మనమూ ఒక లక్ష్యం పెట్టుకుని లోకం వైపు సాగితే, అందులో ఉన్న మంచిచెడ్డలు లోకం విచారించి, దారి చూపుతుంది. తన గమ్యంవైపు తాను వెళుతూ వ్యక్తి ప్రయోజనాలు కాపాడటమే లోకం ఉద్దేశం. అదే, లోకేశ్వరుడి అంతరంగం.

లోకంలో ఎందుకు ఇంత బాధ, బీభత్సం, కన్నీళ్లు, ఆవేదనలు ఉన్నాయి? సృష్టిని మరోలా ఒక సుందర స్వప్నంలా తీర్చిదిద్దవచ్చు కదా అని కొందరికి అనిపించవచ్చు. కొందరికి నిజంగా ఈశ్వరుడి మీద కోపం రావచ్చు. అందరినీ, అందరి భావాలను అలవోకగా విని, హాయిగా నవ్వుకుని, తన పని తాను చేసుకుపోయే స్థితప్రజ్ఞుడు దేవుడు.

లోకాన్ని చూసి మనం స్పందించాలి. స్పందించకపోతే మనుషులం కాలేం. ఎంత ఎక్కువగా స్పందిస్తే, అంత తొందరగా ఈశ్వరుడి ప్రయోజనం నెరవేరుతుంది. కదలని రాయిలా ఉండేవాడినీ కదిలించగలడు దేవుడు- తన సృష్టిలోని వ్యక్తీకరణల ద్వారా.

వసంతం వస్తే కూసే కోయిలనెవరైనా ఆపగలరా? శరత్కాలపు చంద్రుణ్ని చూడకుండా కళ్లు మూసుకుని ఉండగలరా? కట్టలు తెంచుకున్న సంతోషాన్ని కనపడనీయకుండా ఆపగలరా? గుండెలు బద్దలయ్యే రోదనను పెదవి అంచున ఒడిసి పట్టగలరా?

మనిషిని అన్నివైపులనుంచి రకరకాల భావాలతో అంతర్ముఖుణ్ని చేసి లోపలికి పంపించే సత్తా ఉండే లోకాన్ని సృష్టించాడు ఈశ్వరుడు. మనం వద్దన్నా, కాదనుకున్నా ఆయన భావాలకు వశమైపోతుంటాం. అది మన అదృష్టం. తనవైపు తీసుకువెళ్ళే గురువులా, భగవంతుడు మన మీద దృష్టిపెడితే ఇంకేం కావాలి?

కష్టమో, నష్టమో జీవితం మనలను కదిలించాలి. లోకం మనలను వివిధ సంఘటనల్లోకి, సమస్యల్లోకి ఈడ్చాలి. అప్పుడే మన సత్తా తెలుస్తుంది. అలజడిలోనే నిజమైన మనిషి బయటపడతాడు. సుఖదుఃఖాల్లోనే మానవత్వం పూర్తిగా వికసిస్తుంది.

సాధన చెయ్యి, సాధన చెయ్యి అని ఎంతమంది చెప్పినా మనం వినం. జీవితం కొట్టిన దెబ్బలకు, లోకం కదులుతున్న తీరుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటాం. ఇదే సహజాన్వేషణ. ఇందులోంచే అన్ని మార్గాలు, అన్ని సాధనలు పుట్టుకొచ్చాయి.

శాస్త్రాలు, గురువులు చెప్పినదానికంటే జీవితం బాగా నేర్పిస్తుంది. జీవితం క్షమించదు. లోకం మరో అవకాశాన్ని ఇవ్వదు. ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.

నలుగురితో కలిసి ఉంటూనే, మనలాగ మనం ఉండాలి. అందరితో కలిసి అన్ని విషయాల్లో పాలుపంచుకుంటూనే మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. కొండలు, కోనలు పట్టకుండా, రంగుదుస్తులు మార్చకుండానే లోతుగా సత్యాన్వేషణ చెయ్యవచ్చు. బతుకు, మరణం రెండూ రెండు సింహాల్లాంటివి. వాటితో సర్కస్‌ చెయ్యాలి. బలైపోకూడదు. రింగ్‌మాస్టర్‌లా అతీతంగా నిలవాలి. అప్పుడే సుఖం, శాంతి. అప్పుడే అందరి కరతాళ ధ్వనులూ వినిపిస్తాయి.

ఎవరిని ఎప్పుడు తన వైపు తిప్పుకోవాలో భగవంతుడికి తెలుసు. లోకంలో మనం జీవించే విధానంలోనే, మన తాత్వికత ఇమిడి ఉంది. చక్కగా జీవిస్తే చాలు. రోగం ఎలా కుదర్చాలో దైవ ధన్వంతరికి బాగా తెలుసు!

ఆధ్యాత్మిక సంపదను లోకంలో ఎక్కడ చూసినా కనిపించే విధంగా అమర్చిపెట్టాడు భగవంతుడు. మనకే కనపడటం లేదు. ఏదో ఒకరోజు బలవంతంగా బల్ల ఎక్కించి, శస్త్రచికిత్సచేసి కంటిచూపును ఇస్తాడు. అప్పుడు చూడక తప్పదు. మూడో కన్ను ప్రాముఖ్యం తెలుసుకోక తప్పదు. ముక్కంటి చేష్టలకు అవగాహన రాక తప్పదు!
- ఆనందసాయి స్వామి 

Monday 28 October 2013

సాధన... ఓ ఆస్వాదన

    సాధనలో తీవ్రత లేదా తీవ్రమైన సాధన... అంటే ఏమిటి? ఎవరికైతే భగవంతుడిపట్ల తీవ్రమైన అనురక్తి వుంటుందో, పరమపదాన్ని పొందాలనే పరితాపం వుంటుందో వాళ్లు చేసే, చేయవలసిన నిరంతర ప్రయత్నమే తీవ్ర సాధన. ఎంత కష్టమున్నా క్లిష్టతరమైనా సహించి, ప్రేమతో చేసికోరవలసిన క్రియలు, ప్రక్రియలే తీవ్ర సాధన. ఏం, తీవ్రసాధనలు చేయకపోతే భగవంతుడు కనికరించడా... లభించడా? భగవంతుడు భక్త సులభుడంటారే! నిజమే. భగవంతుడు భక్త సులభుడే. అప్రమేయుడైన దైవం ముందు ఏ రకంగానూ అంచనాకైనా అందని అత్యంత అల్పుడు మనిషి. అలాంటి మనిషికి అంతటి అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు అందుతున్నాడంటే- అదంతా ఆయన దయ, అనుగ్రహం, అందాలనే సానుభూతి, ప్రేమ కాకపోతే మన నిర్వాకం ఏమీ లేదు. ఏ మాత్రం కాదు. కాకపోతే మనమంటూ ఒకరమున్నామని, ఆయననే కోరుకుంటున్నామని ఆయన దృష్టికి తీసుకురావాలి. దృష్టిలో పడే ప్రయత్నం చేయాలి. అదే సాధన. ఇంకా తీవ్ర పరితాపం, అపరిమితమైన ఆర్తి ఉంటే దానికి కావలసిందే తీవ్రసాధన. పిండి కొద్దీ రొట్టె, ప్రయత్నం కొద్దీ ఫలితం.

సాధన అంటే భగవంతుడి సాన్నిధ్యానికి ప్రయత్నం కాదా? మళ్లీ సాధనలో రకాలుంటాయా? సాధన, తీవ్రసాధన అనే అంతరాలుంటాయా? భగవంతుడు మనసు చూస్తాడు. నిజమే. మనసు ప్రధానం. ఆ మనసులోని ఆర్తి ప్రధానం. అయితే మనసు అంత సులభంగా మనకు కట్టుబడుతుందా, పరమాత్ముని పట్టుకుంటుందా ఆర్తి నింపుకొంటుందా? దాన్ని భగవంతుడివైపు మరల్చాలంటే, అక్కడే, ఆయన పాద కమలాలమీదే స్థిరం చేయాలంటే చిన్న విషయమా? అసలు ఆయన పాదాలవైపు చూడాలంటేనే ఎన్ని జన్మల సుకృతం ఉండాలి! ఆ మనసుకెన్ని సుగుణాలుండాలి! ఎంత స్వచ్ఛత కావాలి?

చిన్న మొత్తం బంగారం ఉందనే ఆచూకీ దొరికితే చాలు, కొండనే కరిగిస్తాం. వ్యర్థాలు తొలగిస్తాం. ముడి బంగారం శుద్ధి చేస్తాం. ఎంతైనా కష్టపడతాం. ఇక సర్వ శ్రేష్ఠుడు, సర్వోన్నత అధికారి, సకల కల్యాణ సంపన్నుడు... భగవంతుడు. ఆయన లభించే మార్గమే ఉండాలిగానీ- ఆ మార్గం ఎంత దుర్గమమైతేనేమి, దుర్లభమైతేనేమి... ప్రయత్నం చేయడం గొప్ప విషయం కాదు. ప్రయత్నించే అవకాశం ఉండటమే గొప్ప. ఆరోగ్యం పొందుతామంటే కాలకూట విషాన్నే మందులా మింగే మనిషికి, భగవంతుడి నామాన్ని తొట్టతొలిసారి స్మరించినది ఆదిగా కైవల్యం పొందేవరకూ అద్వితీయమైన అమందానందం పొందగల అద్భుతమైన అవకాశం ఉన్న ఈ భక్తి మార్గం అందుకుని సాధనం చేయటం ఎంత గొప్పవరం! అదృష్టం! చేద్దాం... సాధన. తీవ్ర సాధన. తీవ్రాతితీవ్ర సాధన. ఎముకలు విరగనీ. కండలు కరగనీ. గుండెలు ఎండనీ. చివరకు పై పొరలన్నీ చిరిగి చితికి జీర్ణమై లోపలి, లోలోపలి ఆత్మజ్యోతి మాత్రం మిగలనీ. వెలగనీ. మనిషికి ఇంకా ఏం కావాలి, ఇంకేం కావాలి?
ఇదంతా- బాధ్యతలు విస్మరించి, కర్తవ్యాలు మరచి, సంసారాన్ని త్యజించి చేయవలసింది కాదు. సంసారంలోనే ఉంటూ, కర్తవ్య పాలన చేస్తూ, అదంతా భగవత్‌ సేవగా భావిస్తూ చేయవలసిన అమృతతుల్య సాధన. ప్రాపంచిక కర్తవ్యాలను పారమార్థిక సేవలుగా భావించేవాడికి సాధన సులభతరమవుతుంది. బాధ మాధుర్యంగా భాసిస్తుంది. అపజయాలు అనంతుడి చిలిపి చేష్టలుగా ముచ్చట కలిగిస్తాయి. నిజానికి సంసారం... ఆధ్యాత్మిక జీవితమనే అసలు జీవితానికి అదనపు పని (పార్ట్‌టైం జాబ్‌) లాంటిది. ఒక చిన్న అభిరుచి (హాబీ) లాంటిది. ఆటవిడుపు లాంటిది. పనిమీద బజారుకు వెళ్తున్న మనతో అమ్మ 'ఎటూ అటే వెళ్తున్నావు కదా? ఇంట్లోకి ఫలానాది తీసుకురా' అని అప్పజెప్పిన కొసరుపని లాంటిది. ప్రాపంచికం అప్రధానం. పారమార్థికమే మనం వచ్చిన అసలు పని. అదే అసలు జీవితం, జీవిత పరమార్థం. దాన్ని సాధించే క్రమంలో తోడు తీసుకున్న చిన్నపాటి వ్యవహారం సంసారం... అంతే. సాధించాలనుకున్న అసలు పదార్థానికి సంసార జీవితం ఓ ఉప ఉత్పత్తి... అంతే!
                                                                          - చక్కిలం విజయలక్ష్మి

Sunday 27 October 2013

తలలు-తలపులు

   బ్రహ్మ చతుర్ముఖుడు. కుమారస్వామి షణ్ముఖుడు. పురాణ పురుషుల్లో ఇలా ఎక్కువ ముఖాలు కలిగినవారు ఇంకెందరో ఉన్నారు. రావణాసురుడికి పది తలలు. మనిషికి మాత్రం ఒక తలకాయే ఉంటుంది.

మనిషికి బయటకు ఒక ముఖం మాత్రమే కనిపిస్తున్నా, లోపల ఇంకో ముఖం దాగి ఉంటుంది. సందర్భాన్నిబట్టి ఆ ముఖం బయటకు వస్తుంది. ఈ రెండు తలలూ ఎప్పుడోగాని ఏకీభవించవు. అందువల్లే ఒక వ్యక్తిలో రెండు విరుద్ధ భావాలను చూడవచ్చు. ధర్మరాజు వంటి మహాత్ముడు 'అశ్వత్థామ హతః...' అని అరిచాడు. అర్జునుడంతటి వీరుడు కూడా, అస్త్రశస్త్రాలను అవతలపెట్టి నిస్పృహ చెందాడు.

కరుణాపయోనిధి వంటి దాశరథి వాలిని కూలనేశాడు. లోపల దాగిన తల్లే వేదాలు చదివిన దశకంఠుణ్ని సీతాపహరణానికి పురికొల్పింది. ప్రతిమనిషీ ఏదో ఒక సందర్భంలో మానసిక సంఘర్షణకు గురి అవుతాడు. ఒకే వ్యక్తిలో ఉన్న రెండు ముఖాలమధ్య వాదోపవాదాలు చోటుచేసుకుంటాయి. 'ఇలా చేద్దాం!' అంటుంది. ఒక ముఖం. 'వద్దు! అలాకాదు. ఇలా చేస్తే విజయం తథ్యం' అంటుంది రెండో ముఖం. చివరికి ఏదో ఒకదాని వాదం నెగ్గుతుంది. నెగ్గిన వైపే మొగ్గుతాడు మనిషి. ఓటమి సంభవించిందో... 'అప్పుడు వద్దువద్దని ఎంత చెప్పినప్పటికీ నీ వెధవ ముఖం ఒప్పుకొని చావలేదు. ఇప్పుడు అనుభవించు!' అని శాపనార్థాలు పెడుతుంది మంచి సలహా ముందుగా చెప్పిన ముఖం. ఓడిన ముఖం వాడిపోతుంది. దీంతో మానసిక వేదన!

బాధ్యతల నిర్వహణలో రెండు ముఖాలకూ 'ముఖాముఖి' ఘర్షణ తప్పదు. న్యాయమూర్తిగారి ఒక ముఖానికి తెలుస్తుంది బోనులో ఉన్నవాడు నేరస్థుడే అని. కానీ, సాక్ష్యాలు సరిగా లేకపోవడంవల్ల రెండోముఖం అతడు నిర్దోషి అని తీర్పు చెబుతుంది. ఒక తలకు వ్యతిరేకంగా ఇంకో తల తీర్పు! మన జీవితాల్లోనూ ఇటువంటి పరిస్థితులు ఎన్నో తారసపడతాయి. 'ఏ ముఖం పెట్టుకొని మళ్ళా వచ్చావు?'- ఇలాంటి మాటలూ తరచూ మన చెవిలో పడుతుంటాయి. అలాంటి మాటలు అంటే ఎవరి ముఖాలైనా చిన్నపోక తప్పదు.

ధన సంపాదన, నైతిక విలువలు- ఈ రెండూ మనిషికి అవసరమే. అవినీతి మార్గంలో ధన సంపాదన చేసేవాళ్లు నైతిక విలువలకు తిలోదకాలిస్తారు. అన్యాయంగా సంపాదించిన ఆ ధనాన్ని రక్షించుకునే ప్రయత్నంలో ఒక తలకు ఎప్పుడూ నొప్పి వస్తూ ఉంటుంది. పరిమితులు దాటి చేసే అవినీతి పనులవల్ల రెండో తలకు బొప్పి కడుతూ ఉంటుంది. ఇటువంటివాళ్లకు లోలోన ఏ ఘర్షణా ఉండదు. చివరకు మిగిలేది శిరోవేదన మాత్రమే! రెండు ఆలోచనల వరకు ఫరవాలేదు. అంతకంటే ఎక్కువైతే మాత్రం జీవితం గందరగోళమే!

ఒక యువకుడు దక్షిణ దిక్కుగా వడివడిగా నడుస్తున్నాడు. కొంత దూరం పోయి, ఒకచోట ఠక్కున ఆగాడు. ఒక్కక్షణం తలగోక్కొని, గిర్రున వెనక్కి తిరిగి ఉత్తర దిక్కుగా నడక ప్రారంభించాడు. ఒక పెద్దాయన ఈ యువకుని తతంగం అంతా చూస్తూన్నాడు. 'బాబూ! ఎక్కడికి వెళుతున్నావు?' అని అడిగాడు. 'ఒక ముఖ్యమైన పని మీద అవతలి వూరికి వెళుతున్నాను!' అన్నాడు యువకుడు.

'మరి వెనక్కి తిరిగావేం?'
'అక్కడ నా పని కాదేమో అనిపించింది!'
'మరి... బయలుదేరే ముందు బాగోగుల గురించి బాగా ఆలోచించుకో లేదా?'
'చాలాసార్లు నాలో నేను మథన పడ్డాను. చివరికి వెళితేనే బాగుంటుందని బయలుదేరా. కానీ, మధ్యలో అనుమానం వచ్చి వెనక్కి తిరిగా!'

'నాయనా! ప్రారంభించిన పనిని మధ్యలో ఆపేయడం పెద్ద తప్పు. ముందే బాగా ఆలోచించుకొని, ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రయాణం ప్రారంభించాలి. ప్రారంభించడం, ప్రారంభించక పోవడం- అనే రెండింటి గురించి మాత్రమే చర్చించుకొని, ఒకదాన్ని నిర్ణయించుకోవాలి. మూడో ఆలోచనని బుర్రలోకి రానీయకూడదు!'

'అలా అయితే రెండు రకాలెందుకు? ఒకే ఆలోచన చేస్తే ఇంకా మంచిది కదా?'
'మంచీ చెడూ ప్రతిదానికీ ఉంటాయి. ఈ రెంటిలో మనం మంచినే ఎంచుకోవాలి!' ఆ పెద్ద మనిషి హితబోధతో యువకుడు, తాను అనుకున్నది సాధించే వరకు మనసు మార్చుకోకూడదని నిశ్చయించుకొని మళ్ళా దక్షిణం వైపు తిరిగి పోయాడు! ఈ సలహా చెప్పిన పెద్దాయన చైనా తత్వవేత్త కన్‌ఫ్యూషియస్‌!
                                                            
                                                             - డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

Saturday 26 October 2013

మానసిక ఆనందం

    
   మానవుడు శాంతి, ఆనందాలతో జీవించాలని కలలు కంటాడు. ఏ మనిషీ దుఃఖాన్ని కోరుకోడు. అందుకు కారణం దుఃఖం అప్రియమైన అనుభవాల రూపంలో పలకరించి మనిషిని కలవర పెడుతుంది. దుఃఖపు అంచులోనే సుఖం ఉంటుంది. కాబట్టి దాని కోసం నిరీక్షించడంలో విజ్ఞత ఉందంటారు విజ్ఞులు.
ఎప్పుడూ దరహాస వదనంతో కనిపించేవారికి అందరూ ఆత్మీయులే! వారితో చెలిమికోసం ప్రపంచం ఉవ్విళ్ళూరుతుంది. హాస్య ప్రియులకు ఎల్లవేళలా చెక్కుచెదరని చిర్నవ్వు ఓ అలంకారం! మనిషి నవ్వినప్పుడు 43 మౌఖిక కండరాలు పనిచేస్తాయంటుంది మానవ శరీర నిర్మాణ శాస్త్రం. మనసారా నవ్వినప్పుడు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే రసాయనాలు విడుదలై ఆరోగ్యానందాలకు కారణమవుతాయంటారు శాస్త్రజ్ఞులు. మనిషికి ఆనందాన్ని అందించడంలో హాస్యం-హాసం ప్రమేయం, పాత్ర ఎనలేనివి. నవ్వుతూ తుళ్ళుతూ హాయిగా బతికేవారే ఆయురారోగ్యాలతో జీవిస్తారు. హాస్యప్రియత్వం ఓ సంస్కారవంతమైన సుగుణం. నవ్వుతూ బతకాలేకానీ, నగుబాటు పాలుకాకుండా జీవించాలంటారు పెద్దలు.

పాశ్చాత్య పార్కిన్‌సన్‌ సంప్రదాయంలో ముఖాలు విషణ్నంగా పెట్టడం దైవాపచారంగా పరిగణిస్తారు. ఆ మతానుయాయులు భగవంతుడి సాకారస్వరూపాన్ని దర్శించినప్పుడు, సహభక్తుల ముఖాలు చూసేటప్పుడు చిర్నవ్వుతో కనిపించడం ఓ సంప్రదాయం. హాసమే దైవమని వారి నమ్మిక. నిజానికి హాస్యం ఆనందానికి చిరునామా! ఆనందం ఆధ్యాత్మిక పరిణతికి కొలబద్ద. హాస్యప్రియులు ఆధ్యాత్మిక పథంలోనూ ముందంజలో ఉంటారు.

మనసు ఆహ్లాదంగా ఉంటే సాధనలో ఎదుర్కోవలసిన కఠోరనియమాలు బాధించవు. సాధన తనను ఉద్ధరించుకోవడం కోసమని కాక భగవంతుడి కోసమని ఎవరైనా భావిస్తే అదో మొక్కుబడి క్రతువుగా మారే ప్రమాదం ఉంది. లోక వ్యవహారాలు మానవ జీవితాన్ని గంభీరతరం చేస్తాయి. మనసులోని భారాన్ని దించుకునేందుకు సరస సంభాషణం, హాస్య చమత్కృతి మనిషికి ఉపకరిస్తాయి. తమ భక్తులతో చేసే సంభాషణలో రామకృష్ణ పరమహంస హాస్య చమత్కృతిని చొప్పించి వారిని ఉత్సాహభరితులను చేసేవారు. హాస్య భాషణలో వెల్లివిరిసే నవ్వులో కల్మషాలు ఉండవు. హృదయాన్ని తాకి సున్నిత హాస్యం పండించే నవ్వులో నటన ఉండదు. గురజాడవారి 'కన్యాశుల్కం' అందుకు ఓ చక్కని ఉదాహరణ. పౌరాణికులు భగవచ్ఛింతనను భక్తుల హృదయాల్లో నిలపడానికి సరస సంభాషణలు, సన్నివేశాలు కల్పన చేసి తమ హరికథాగానంలో జోడించి వినిపించేవారు.

హాస్యం మనిషి ఉద్విగ్న భారాన్ని దూరం చేసే ఓ అమృతగుళిక. సంస్కృత భాషలో భరతముని రచించిన 'నాట్యశాస్త్రం'లో హాస్య రసానికి పెద్దపీట వేశారు. చిలకమర్తి వారి 'గణపతి' ఓ హాస్యపు విరిజల్లు. తెనాలి రామకృష్ణకవి ప్రసక్తిలేక హాస్య రసప్రస్తావనకు పరిపూర్ణత లేదు. హాస్యం, హాసం మనిషి దీర్ఘాయుష్షుకు తోడ్పడే విశేష సంస్కారాలు.

సకల ప్రాణికోటిలో నవ్వగలవాడు మనిషే! నవ్వలేనివాడు అసలు మనిషే కాదన్నారు. నవ్వించే గుణం ఓ సుగుణమే. నవరస భరితమైన మానవ జీవితంలో హాస్యాన్నికున్న స్థానం ఇంత అని చెప్పలేనిది. హాస్యరస సౌరభాలు ఆస్వాదించిన మనసు పారమార్థిక జీవన స్రవంతిలో ఎదురయ్యే సంక్లిష్ట అనుభవాలను తట్టుకొని లక్షించిన ఆధ్యాత్మిక గమ్యం వైపు సులభంగా పయనించగలుగుతుంది.
                                                                       - గోపాలుని రఘుపతిరావు

Friday 25 October 2013

దైవంతో భాషణం


   'వాన్‌! సమస్త చరాచర ప్రాణికోటిలో నిన్ను సందర్శించేటట్లు, నా జీవితంలో ప్రతి శ్వాస నీ స్మృతిలో ఉండేటట్లు నా ప్రతి చర్య నీ సేవకు అంకితమయ్యేటట్లు కటాక్షించు!'
'భగవాన్‌, నా మనసు నిరంతరం నీ దివ్యరూపాన్ని ధ్యానించేటట్లు, నా వాక్కు నీ నామాన్ని గుణాలను గానం చేసేటట్లు, నా శరీరం నీ సేవ చేసేటట్లు అనుగ్రహించు!'- ఇవి భక్తుడి ప్రార్థనలు.

మన హృదయాన్ని దైవం ముందు ఆవిష్కరించుకోవడాన్ని ప్రార్థన అన్నారు. అది ఏ గ్రంథం లోనిదైనా కావచ్చు. శ్లోకం కావచ్చు; పద్యం గాని, పాట గాని కావచ్చు. మాటలే లేని మౌన ధ్యానమూ కావచ్చు. భగవంతుడితో భక్తుడు జరిపే సంభాషణ ప్రార్థన. ప్రార్థన మనిషి జీవితంలో, ఆలోచనల్లో భాగం. ప్రార్థన మన శ్వాస వంటిదే.

కవులు తమ కావ్యారంభంలో ఇష్టదేవతా ప్రార్థన చేస్తారు. తమ కావ్యాలకు యశస్సు, పండితాదరణ కావాలని కోరుకుంటారు. కావ్యావతారికల్లో ఇష్టదైవాన్ని తమ ప్రభువులకు విజయ పరంపర కలిగించమని ప్రార్థిస్తారు. రాజాశ్రయం కోరని పోతన 'శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్‌' అన్నాడు. అంటే, మోక్షం కోసం రాస్తున్నానని విన్నవించుకున్నాడు. భక్త రామదాసు కీర్తనల్లో ఆర్తి, ప్రేమ, కోరిక కనిపిస్తాయి. వీటిలోంచి విన్నపం పుడుతుంది. అదీ ప్రార్థనే. అధికారికి విన్నవించుకునేటప్పుడు అతడి విశ్రాంతి సమయం చూసుకుని, మనోభావం చిత్తవృత్తి గ్రహించి మరీ వ్యవహరిస్తారు. అలాగే భగవంతుడికి షోడశోపచారాలు చేసి కొంతసేపు కీర్తిస్తారు. నీ సేవకుడినంటూ దాసోహం చేస్తారు.

కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు కొందరికి భగవంతుడు గుర్తుకు వస్తాడు. అప్పుడు కష్టాలు తొలగించమని ప్రార్థిస్తారు. మొసలి వల్ల తన ప్రాణం పోవడం నిశ్చయం అనుకొని గజేంద్రుడు 'నా బలం నశించిపోతోంది. ధైర్యం తరిగిపోయింది. ప్రాణాలు పోతున్నాయి... వచ్చి రక్షించు!' అని శ్రీహరిని ప్రార్థించాడు. నిత్య జీవితంలో సంకటాలు ఎదురైనప్పుడు, కోరికలు నెరవేరనప్పుడు, ఏదైనా ఆశించినప్పుడు దైవాన్ని ప్రార్థించడం పరిపాటి. కాని, ప్రార్థనను జీవితంలో భాగంగా చేసుకోవాలి. రామకృష్ణ పరమహంస ప్రతినిత్యం తాను భగవంతుడితో మాట్లాడుతున్నానని చెప్పేవారు. నరేంద్రుడు ఆయన దగ్గరకు వెళ్ళి తన సమస్యలు చెప్పి తన కష్టాలు తీరేలా జగన్మాతను ప్రార్థించమని అర్థించాడు. రామకృష్ణులు 'నువ్వే ప్రార్థించు. అమ్మ నీ మొర ఆలకిస్తుంది' అన్నారు. నరేంద్రుడు ఆలయానికి వెళ్ళి కళ్లు మూసుకొని దేవిని ప్రార్థిస్తుంటే ఆ శక్తి స్వరూపిణి తన కళ్ల ఎదుట ప్రత్యక్షమైన అనుభూతి కలిగింది. ఆ సమయంలో ఆయనకు తన కష్టాలు, కన్నీళ్లు గుర్తుకు రాలేదు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ప్రసాదించమని కోరుకున్నాడు. దేవి అంతర్ధానమయ్యాక మళ్ళీ ప్రాపంచిక విషయాలు గుర్తుకు వచ్చాయి. తన కోరిక చెప్పుకోలేకపోయానని బాధపడ్డాడట. ఇలా మూడుసార్లు జరిగింది. సమస్యలు, కష్టాలు, సంక్షోభాలు అందరి జీవితాల్లోనూ ఉంటాయి. ఎవరికి వారే వాటిని పరిష్కరించుకోవాలి. అందుకు అవసరమైన శక్తిని ఇవ్వమని మాత్రమే భగవంతుని ప్రార్థించాలి.

ప్రార్థనలో హృదయశుద్ధి, భగవద్విశ్వాసం ముఖ్యం. నమ్మకం లేనప్పుడు ప్రార్థన సాధ్యం కాదు. సర్వాంతర్యామి మనముందు నిలబడి మనం చెప్పేది శ్రద్ధగా వింటున్నట్టు నమ్మాలి. దైవాన్ని నిరాకారుడిగాను, నిర్గుణుడిగాను కూడా ప్రార్థించవచ్చు. దైవాన్నే గాక త్రిమూర్త్యాత్మకుడైన సద్గురువునూ ప్రార్థించవచ్చు. ప్రార్థన వల్ల అజ్ఞానికి జ్ఞానం, పిరికివాడికి ధైర్యం, కష్టాల్లో ఉన్నవాడికి ఓదార్పు లభిస్తాయి. ప్రార్థనవల్ల మనలోని అహంకారం నశిస్తుంది. సాత్వికత పెంపొందుతుంది. ఆత్మబలం ఇనుమడిస్తుంది. మనసు ప్రక్షాళనమవుతుంది. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. శాంతి సహనాలు వృద్ధి చెందుతాయి. ప్రార్థించే సాధకుడికి ప్రశాంత జీవనశైలి అవసరం. ప్రార్థన మన జీవన విధానంలో మార్పు తీసుకువస్తుంది. ప్రార్థించేవారికి శరణాగతి ముఖ్యం. ధర్మవిరుద్ధమైన, న్యాయ ప్రతికూలమైన ప్రార్థనలు ఎన్నటికీ ఫలించవు. సాధకుడికి ధార్మిక వర్తనం ముఖ్యం. యోగ్యమైన ప్రార్థన ఎన్నటికీ వ్యర్థం కాదు.

వ్యక్తిగత క్షేమం గురించి కాక రుషులు, మహనీయులు లోక కల్యాణం కోసం ప్రార్థించారు. సకల జనులకు శుభం కలగాలని, అన్ని లోకాలు క్షేమంగా ఉండాలని ప్రార్థించారు. సగుణారాధన విశ్వసించని బ్రహ్మసమాజం వంటి సంస్థల్లో ప్రార్థనకు అత్యంత ప్రాముఖ్యం ఉంది. మనమూ నిర్భాగ్యుల కోసం, బలహీనుల కోసం ప్రార్థించాలి!
                                                    
                                                    - డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

Thursday 24 October 2013

ఆలోచనామృతం

       క్రియకు తొలిదశ ఆలోచన. మలిదశ వాక్కు. మూడోదశ కర్మ. 'మనసా-వాచా-కర్మణా' అనే మూడు దశలతోనే మన జీవన విధానం కొనసాగుతుంది.
కర్మ ఒక నిర్మాణం అనుకుంటే, ఆలోచన పునాది. ఆలోచన ఆచరణగా మారే దశ మహత్తరమైంది. ఎందుకంటే- దీని పర్యవసానాలే, సత్ఫలితాలు, దుష్ఫలితాలు. విద్యార్థి తాను చదువు ద్వారా పొందిన జ్ఞాన అవగాహనలోంచి ఆలోచన ప్రారంభిస్తాడు.

విద్య ప్రాథమిక జ్ఞానం. దాన్ని పోనుపోను పెంచుకోవటం, విస్తరించుకోవటం విద్యార్థి కర్తవ్యం.

పరీక్షల్లో ప్రథమశ్రేణి ఉత్తీర్ణతతో పరిపూర్ణత లభించదు. జ్ఞాన వినియోగంలో విజ్ఞత ఉండాలి. ఖడ్గవిద్యలో ఆరితేరాక చెట్లు నరికితే ఏమిటి ఉపయోగం? దేశరక్షణలో, శత్రువులను తరిమికొట్టడంలో సద్వినియోగం చేయాలి!

అలాగే- మంచి ఆలోచన ద్వారా విజ్ఞానాన్ని విజ్ఞతతో వినియోగించాలి. ఆలోచన అమృత సమంగా ఉండాలి. అనృతమయంగా ఉండకూడదు. అంటే- అబద్ధాలతో అవతలివారిని మభ్యపెట్టి, మన పని సాధించుకోకూడదు.

ఒక మొక్క పాతుతున్నప్పుడు, 'అది బతికి, పెద్దదై, చెట్టుగా పక్షులకు ఆశ్రయాన్ని, పాంధులకు నీడను, ఆకలిగొన్నవారికి ఫలాలను ఇవ్వాలి' అనుకోవటం అమృత సమానమైన ఆలోచన. లోకక్షేమాన్ని ఆకాంక్షిస్తూ చేసే ఆలోచనే- ఆలోచనామృతం.

రెండోది ఆలోచనా గరళం. అంటే విషసమానం.

'చెట్టుగా మారాక, నీడకోసం వచ్చేవారి దగ్గర శుల్కం, వలపన్ని చెట్టుమీద పక్షుల్ని పట్టుకుని అమ్ముకుంటే ధనం, పళ్లు కాయలు అమ్ముకుంటే లాభం, గాలివానకు చెట్టు కూలిపోతే కట్టెలు అమ్ముకోవచ్చు...' అనేవన్నీ విషతుల్యమైన ఆలోచనలు.

వైద్యవిద్యలో ఉత్తీర్ణత సాధించి, 'దీనులను, అనాథలను, పేద రోగులను ఆదుకోవాలి' అనుకోవటం ఆలోచనామృతం. 'రోగుల్ని పీడించి ధనం దండిగా ఆర్జించవచ్చు' అనుకోవటం విషతుల్యం.

ఇలా ప్రతి పనికీ రెండు పార్శ్వాలుగా ఆలోచనలు ఉంటాయి. స్వార్థం వల్ల రాక్షసులకు అమృతం దక్కలేదు. అమృతపానంతో అమరులై దేవతల్ని తరిమికొట్టాలని, స్వర్గం తమదిగా చేసుకోవాలని రాక్షసులలోని దుర్మార్గపు ఆలోచన. పరమాత్మ ఆదేశంతో ధర్మరక్షణ చేస్తూ, లోకంలో సుఖశాంతులు వర్ధిల్లజేయాలన్నది దేవతల ఆలోచన.

అందువల్లనే రాక్షసుల్ని మోహవికారంలో పడేసిన మహావిష్ణువు అమృతాన్ని దేవతలకిచ్చాడు. భగవంతుడు ధర్మపక్షపాతి. ఆయన భక్తులకు దాసుడు.

భక్తి అంటే భజనలు, పూజలు, నైవేద్యాలు, స్తోత్రపాఠాలు కావు. పరిపూర్ణ సజ్జనత్వం, శుద్ధసత్వం. భగవంతుడిమీద గురితప్పని దీక్ష. పరమాత్మ రుషుల ద్వారా మనకందజేసిన అనేక ఆధ్యాత్మిక సందేశాలను మన జీవితంలో భాగంగా చేసుకుని జీవించటం.

వీటిని మన సొంతం చేసుకోవాలంటే మనోనిర్మలత్వం కావాలి. నిర్మలం అంటే కాలుష్యంలేనిది. స్వచ్ఛమైనది. నీరు స్వచ్ఛంగా లేకపోతే రోగాలు వచ్చినట్లే- మనసు నిర్మలంగా లేకపోతే, ఆలోచనలు వికృతంగా, విషతుల్యంగా ఉంటాయి.

మనసును నిర్మలంగా ఉంచగలిగేవే ఆధ్యాత్మిక సాధనలు. అవి కల్మషభావాలను వడపోసి, ఆలోచనామృతాన్ని తేరుస్తాయి. దాన్ని స్వీకరించడానికి సిద్ధపడదాం.
                                   
                                                                  - కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌

Wednesday 23 October 2013

రసయోగం


మాద్భుత కళాకారుడైన భగవంతుడి సృజన పౌరుషానికి సజీవ సాక్ష్యమే ఈ సృష్టి! ఇది ఆయన గీసిన బొమ్మ. ఆయన చేసిన రచన. ఆయన భావుక మహా సౌందర్య శోభ, ప్రకృతిలోని ప్రతి అణువునా ప్రతిఫలిస్తుంది. సమ్మోహనపరుస్తుంది. దాని శ్రేష్ఠతకు సౌందర్యమే ప్రమాణం! భగవంతుడి సృజనలో పరమ రహస్యం దాగి ఉంది. స్త్రీ పురుష ప్రకృతుల మధ్య ఆరాధన, సమర్పణలతో శృంగార సంఘర్షణలోనే సృష్టి యావత్తూ ప్రభవిస్తుంది. నాగరికమైన కట్టుబాటు ఫలితంగా వివాహ వ్యవస్థ నిర్మాణమైంది. వేదం నిర్దేశించిన ఆ వ్యవస్థ మానవజాతి శారీరక అవసరాలను తీర్చింది. మానసిక బంధాలను కూర్చింది. అనురాగ మాధుర్యాన్ని జతపరచి, ఆధ్యాత్మిక శిఖరాలకు చేర్చింది. భారతీయ వివాహ వ్యవస్థ వాస్తవానికి స్త్రీ పురుష సర్వేంద్రియ సంతర్పణకు దోహదకారి, ఆత్మీయ శిఖరాయమాన పరిపూర్ణ దాంపత్య అపూర్వ అద్వైత అనుభూతికి సహాయకారి!
అద్భుతం అనే మాటను ఒకే అక్షరంలో చెబితే అది స్త్రీ. ఆ అద్భుతాన్ని పురుషుడికి సొంతంచేసే రెండక్షరాల ప్రక్రియ పేరు పెళ్ళి. మూడు ముళ్ళతో మొదలయ్యే నూరేళ్ల బంధాన్ని మూడే అక్షరాల్లో పలికితే- అది దాంపత్యం. దాంపత్య జీవనంలో స్త్రీ అనే వీణను అమోఘంగా శ్రుతి చేయగల గొప్ప విద్వాంసుడి నాలుగు అక్షరాల పేరు- పురుషుడు. అలా వారిద్దరి మధ్య ఏర్పడే ఆత్మీయ బంధానికి అయిదక్షరాల మాట- భార్యాభర్తలు. ఆడ, మగ- భార్యాభర్తలయ్యే క్రమానికి ప్రామాణికతను ఆపాదించే ఆరు అక్షరాల తంతు పేరు 'వైదిక ప్రక్రియ'. వేద ప్రమాణాన్ని ఆచరించే భార్యాభర్తలు తమ తలకెత్తుకునే ఏడక్షరాల గొప్ప బాధ్యత- గృహస్థాశ్రమ ధర్మం. ఇదే సప్తపది... ఏడు అంచెల జీవన మాంగల్య మహాసూత్రం!

ఏడు అడుగులతో పురుషుడి జీవితంలోకి ప్రవేశించే స్త్రీ- అప్పటిదాకా తన వెంట వచ్చిన ఇంటిపేరును, గోత్రాన్ని, ప్రాణమిత్రుల్ని, అన్నదమ్ముల్ని... ఆఖరికి తన తల్లిదండ్రులను, వారి గారాబాన్ని... అన్నీ విడిచిపెట్టి వస్తుంది. ఇకపై తన భర్త నుంచి- ఆ వదులుకున్నవన్నీ పొందగలనన్న నమ్మకంతో వస్తుంది. అందుకే పెళ్ళిచూపుల్లో 'భావ'ం కలగాలని వేదం అంటుంది. 'ఈమె నా కోసం పుట్టింది' అనే భావం పురుషుడికి కలగాలి. 'ఇతడు నాకోసం ఉన్నాడు' అన్న భరోసా స్త్రీకి కలగాలి. సప్తపది మంత్రాల్లో పురుషుడి నోట పలికించే వాగ్దానం అదే! 'ఏడడుగులు నాతో నడిచి మిత్రురాలివి కా! ఒకరికొకరం చక్కని స్నేహితులమై జీవితపర్యంతం కలిసి నడుద్దాం'- అని పురుషుడు పలుకుతాడు. నిజానికి సుముహూర్తం అంటే- బెల్లం జీలకర్ర తంతు కాదు, తొలి చూపులో పురుషుడి కంటి నుంచి స్త్రీకి సర్వ భద్రంకరమైన ఆ భరోసా ప్రసారమయ్యే క్షణాన్నే శుభముహూర్తం అనాలి. తెర తొలగించాకా జరిగే ఈ చూపుల కలయికనే 'చక్షు సంయోగం' అంటారు. ఆ సమయంలో మంచి మనసుతో చేసిన ఆ వాగ్దానాన్ని పురుషుడు జీవితాంతం నిలబెట్టుకోవాలి. భర్త సమక్షంలో ఉండే సమయంలో స్త్రీకి తండ్రి గుర్తొచ్చినా, బెంగ కలగకూడదు. తల్లి దగ్గర లేదన్న లోటు తెలియకూడదు. తోబుట్టువులు, స్నేహితులు... ఎవరి గురించీ దిగులు పుట్టకూడదు. వారినుంచి గతంలో ఆమె ఎన్నెన్ని రకాల ఆప్యాయతలను పొందిందో, అన్ని రకాలనూ ఆమె తన భర్తనుంచి అందుకోగలగాలి. పురుషుడు స్త్రీకి అన్ని కోణాల్లోంచీ బంధువు కావాలి. స్పర్శలో, మాటలో, చేతలో, చూపులో... అంతెందుకు- 'తన' పురుషుడి స్మరణమాత్రం చేత స్త్రీ మనసు రాగరంజితం కావాలి. పురుషుడు స్త్రీకి సఖుడు కావాలంది వేదం. సఖ్యం అనే మాట పెళ్ళి మంత్రాల్లో విశేషంగా ధ్వనిస్తుంది. పైన చెప్పిన ప్రతి చేష్టలోనూ స్త్రీకి 'సఖ్యత' అనేది అనుభవంలోకి రావాలి. అతడి లాలనలో ఆమె అనుక్షణం పరవశం చెందుతూ ఉండాలి. ఆమె గుండెలో అది ఒకానొక ఆకుపచ్చని పులకరింతగా స్థిరపడి... అతడు ఎక్కడున్నా చెంతనే, తనకు తోడుగా ఉన్నాడన్న భావం కలిగిస్తూ- అనుభూతి పరిమళాన్ని పంచుతూ ఉండాలి. దీన్నే 'సర్వేంద్రియ సంతర్పణం' అంటారు. స్త్రీలోని ప్రతి అణువునూ ఉత్తేజపరుస్తుందది. అటువంటి పురుషుడికి స్త్రీ తన సర్వస్వాన్నీ ఇష్టంగా ధారపోస్తుంది. ఆమె అలా చేయాలంటే, పురుషుడు రసజ్ఞ మనోజ్ఞ ప్రతిభామూర్తి అయి ఉండాలి. 'ఈ సృష్టిలో కృష్ణుడొక్కడే పురుషుడు' అని మీరాబాయి అనడంలో అంతరార్థం అదే! భార్య పస్తులుంటే భర్తకు అన్నం సయించని స్థితి కలగాలి. ఆమెకు కష్టమొస్తే తనకు నొప్పి తెలియాలి. ఇంటిదగ్గర ఆమె ఒంటరిగా ఉందని ఏదో తెలియని దిగులు వంటిది మనసుకు తోచాలి. త్వరగా ఇల్లు చేరాలన్న ఆరాటం కలగాలి. తహతహ పుట్టాలి.

ఇవన్నీ స్త్రీకీ వర్తిస్తాయి. దాంపత్య బంధంలోని చమత్కారం అదే! స్త్రీకి గౌరవ వాచకం ఇల్లాలు. ఇల్లాలికి గౌరవవాచకం తల్లి. ఆ రెండు హోదాలనూ స్త్రీకి కట్టబెట్టేది వివాహ బంధమే! స్త్రీకి జీవితంలో సర్వశ్రేష్ఠమైన ఆనందం అనుభవమయ్యేది- అమ్మ అయినప్పుడే. స్త్రీ జన్మకు తల్లి కావడమే ధన్యత. భర్తకు తనను తాను సంపూర్ణంగా సమర్పణం చేసుకుని స్త్రీ తరించాలి. భార్యాభర్తలను వేదం దంపతులు అనదు- 'దంపతి' అంటుంది. అలాంటి అద్వైత స్థితిలో అతడు పూవయితే, ఆమె పరిమళం. అతడు చంద్రుడైతే, ఆమె వెన్నెల. అతడు దీపం, ఆమె వెలుగు. అతడు వాక్కు అయితే ఆమె దాని అర్థం. శివ పార్వతుల బంధాన్ని కాళిదాసు అలాగే కీర్తించాడు. ఆలుమగలు ఆడదిగా మగాడిగా మిగిలిపోకుండా దంపతిగా మారినప్పుడే- సమభాగం, సమభోగం, సమయోగం అన్న భావన సార్థకం అవుతుంది. ఇది భారతీయ దాంపత్య రసయోగంలోని సారాంశం. స్త్రీ పురుషులు తప్పనిసరిగా అధ్యయనం చేయవలసిన పాఠ్యాంశం!

                                                                             - ఎర్రాప్రగడ రామకృష్ణ

Tuesday 22 October 2013

జీవితాన్ని దర్శించే కోణం

  ఒక దట్టమైన అడవి ప్రాంతం. అలసిపోయిన ఓ ప్రయాణికుడు రాత్రివేళ అక్కడ చిక్కుకున్నాడు. దారి తెలియక నడుస్తూ వెళ్లి నీరులేని బావిలోకి జారిపోయాడు. ఆ పడిపోయే సమయంలో అదృష్టమో, దురదృష్టమోగానీ అతడి చేతికి ఒక మర్రివూడ కొస అందింది. దాని ఆసరాతో, ప్రమాదకరమైన స్థితిలో చీకట్లో బిక్కుబిక్కుమంటూ భయంతో గడిపాడు. తెల్లారగానే సురక్షితమైన స్థితికి చేరుకోవాలనే పట్టుదలతో ఎక్కే ప్రయత్నాలను తిరిగి ప్రారంభించాడు. పైకి చూడగానే ఓ క్రూరమృగం- ఆ బావి దగ్గరే సంచరిస్తున్నట్లు గ్రహించాడు. దాని దృష్టి ఇతడి మీద పడింది. కిందికి దిగిపోవాలని నిర్ణయించుకున్నాడు. చేతిలో ఉన్న వూడ కూడా అంత బలంగా లేదని గ్రహించాడు. తన బరువుకు అది తెగిపోయే ప్రమాదం ఉందని తెలిసింది. దిక్కుతోచని పరిస్థితి. ఆ సమయంలో బంకలాంటి పదార్థం ముఖం మీదుగా జారి నాలికకు తగిలింది. చిత్రం! మధురంగా ఉంది. అవి పైన మర్రిచెట్టు కొమ్మకున్న తేనెతుట్టెనుంచి రాలిపడిన తేనెబొట్లు. అలాంటి పరిస్థితుల్లోనూ ఇంకా ఆ తేనె జారిపడితే బావుండుననే ఆశ...

జీవితం కూడా ఇలాంటిదే ఇంచుమించు. సమస్యలకు అంతులేదు. సర్వత్రా వ్యాపించే ఉంటాయి. వివేకం మధురమైన పరిస్థితులను గమనించి సంతోషానికి మార్గం ఏర్పరుస్తుంది. ప్రతి ఒక్కరూ జీవితాన్ని ఒక్కో కోణంలో చూస్తారు. అన్వయించుకుంటారు. చూసే దృక్పథం ముఖ్యం. బాహ్య పరిస్థితులకన్నా ఆంతరంగిక వ్యక్తిత్వం అనేది ఒకటుంటుంది.

ఈ భౌతిక ప్రపంచంలో, పోటీప్రవాహంలో వ్యక్తి ఒంటరిగా తన కోణంలోంచి జీవితాన్ని చూస్తాడు. తన అహంభావంతో పరిశీలిస్తాడు. ఇక్కడ ఆ అహాన్ని తృప్తిపరచడానికి ఆశావహ ధోరణిని గానీ నిరాశావాద దృక్పథంగానీ ప్రయోగిస్తాడు. తాను అనుసరిస్తున్న మార్గం మేలైనదని, అందరూ అభినందించాలని ఆశిస్తాడు. గొప్పవాడిగా కీర్తి పొందాలనుకుంటాడు. అహం మరింత పెరుగుతుంది. అది ఎప్పుడైతే జరుగుతుందో ఇక అతడు ఆ వూబిలోంచి బయటపడలేడు. ఆధ్యాత్మికపరమైన ఆలోచనలతో ఉదాత్తచిత్తుడైన వ్యక్తి, అహంతో కాకుండా ఆత్మతో స్పందిస్తాడు. భావోద్వేగాలతో కాకుండా విజ్ఞతతో ప్రవర్తిస్తాడు.

సాధారణంగా వ్యక్తి ఈ ప్రపంచాన్ని పరుగుపందాల మైదానంలాగా జీవితాన్ని పోటీలకు సిద్ధంచేసే రీతిలో పరిగణిస్తుంటాడు. అతడి ఏకైక లక్ష్యం విజయం సాధించడం. శక్తియుక్తులన్నీ కూడగట్టుకుంటాడు. తనను ఎవరూ దాటిపోకూడదనుకుంటాడు. వెళ్లకుండా ఉండేందుకు ఏం చేయాలో కూడా తానే ఆలోచిస్తాడు. దాటిపోయిన వాళ్లను చూసి ఈర్ష్య చెందుతాడు. వ్యధకు లోనవుతాడు. తానే ముందుకెళ్ళగలిగితే ఇక ఆనందానికి అవధులు ఉండవన్నట్లు ప్రవర్తిస్తాడు.

ఆధ్యాత్మిక సాధన చేసే వ్యక్తి ఈ ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూస్తాడు. తననూ మిగిలినవాళ్లలో ఒకడిగానే భావించుకుంటాడు. తోటివారికి చేతనైన తోడ్పాటునందిస్తాడు. తాను సవ్యంగా ఉంటూ మిగిలినవారి క్షేమం కోరుకుంటాడు. అందరి క్షేమమే తన క్షేమంగా భావిస్తాడు. తన శక్తిని సవ్యంగా ఉపయోగిస్తూ ఇతరులతో సఖ్యంగా ఉంటాడు. విషయాలపట్ల, విషయవాంఛలపట్ల పొంగిపోడు, కుంగిపోడు. ఏదైనా సరే, ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించే గుణాన్ని కలిగి ఉంటాడు. ఫలితాలు ఎలాఉన్నా, స్వయంకృషిని నమ్ముకుంటాడు. 'కాలం కలిసిరావడం' అన్న ముఖ్య సూత్రాన్ని విశ్వసిస్తాడు.

అహాన్ని పెరగనిస్తే మన ఉనికి విషయంలోనే గందరగోళ పరిస్థితి చోటుచేసుకుంటుంది. అందుకే దాన్ని పక్కనపెట్టి మనమేమిటో ముందు ప్రశ్నించుకోవాలి. పోటీదారుడిగా కాకుండా పాత్రధారుడిగా తయారుకావాలి.

ఆ భగవంతుడు రచించిన విలువైన జీవితంలో మన పాత్రను మనం ముందు గుర్తెరగాలి... ఇతర పాత్రలన్నీ కొన్ని పరిమితులకు లోబడే ఉంటాయని గ్రహించాలి. ఎంతవరకూ ఆ పాత్ర పోషించాల్సి ఉంటుందో అంతవరకూ పోషించి, హుందాగా, మర్యాదగా వైదొలగడంలోనే గొప్పదనం దాగి ఉంది.

                                                                           - మంత్రవాది మహేశ్వర్‌

Monday 21 October 2013

వూయల పండుగ

భారతదేశంలో పండుగలన్నీ దాదాపు దేవతల చుట్టూ అల్లుకొన్నవే. స్త్రీలుకానీ, పురుషులు కానీ వారి వారి జీవితాల్లో ఎదుర్కొనే కష్టాలు, దుఃఖాలను నివృత్తి చేయడానికి ప్రాచీన కాలంనాటి రుషిపుంగవులు ఎంతో ఆలోచించి ఏర్పాటుచేసిన వ్రతాలు, నోములు, యాగాలు- ఒక పట్టాన అంతుచిక్కవు. వాటిని చూసి హేతువు తెల్లబోతుంది. 'మా కష్టాలు పోతే చాలు. ఏ నమ్మకమైనా, మాకు నష్టం లేదు' అనే మానసిక తత్వం నుంచి బయలుదేరిన కథలు ఈ వ్రతాల్లో మనకు కనిపిస్తాయి. అవి అన్నీ ప్రగాఢ విశ్వాసంపైనే ఆధారపడి ఉంటాయి. కాలక్రమేణా విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందినకొద్దీ ఒకనాడు వాటిని ఆదరించిన మనసే వాటిని దూరం చేసుకొంది. అయినా ఇంకా అక్కడక్కడ అవి బతికే ఉన్నాయి.

పూర్వం ఒక మహారాజుకు కావేరి అనే అతిలోక సౌందర్యవతి అయిన కుమార్తె పుట్టింది. ఆమెకు పెళ్లీడు రాగానే వివాహ ప్రయత్నాలు ప్రారంభించారు. ఆమె అట్లతద్ది వ్రత కథను విన్నది. ఆమె తన స్నేహితురాళ్లు- మంత్రి కుమార్తె, సేనాపతి కుమార్తె, పురోహితుడి కూతురుతో కలిసి 'చంద్రోదయ ఉమా వ్రతం' (అట్లతద్ది) భక్తితో ఆచరించింది. ఈ వ్రతం ఆచరించిన వారికి నవ యౌవనవంతులైన భర్తలు లభిస్తారని ఆనాటి నమ్మకం. రాజు కుమార్తెకు తప్ప మిగిలినవారికి అందమైన భర్తలు లభించారు. రాజు కుమార్తె పెళ్లి ప్రయత్నాలన్నీ విఫలం కాసాగాయి. ఆమె విసిగిపోయి పక్కనేవున్న అడవికి పోయి తపస్సు చేసింది. పార్వతీ పరమేశ్వరులు ఆమెకు కనిపించి తపస్సుకు కారణం తెలుసుకొన్నారు. 'నేను ఉమా వ్రతాన్ని ఆచరించినా ఎందుకు ఫలించలేదు?' అని అడిగింది రాజకుమార్తె. 'ఆ నోము నోచే సమయంలో ఉపవాస దీక్షను తాళలేక సొమ్మసిల్లిపోగా, నీ సోదరులు అద్దంలో చంద్రుని చూపించారు. నువ్వు దీక్ష విరమించావు. ఆ విధంగా వ్రత భంగమైంది. వచ్చే ఆశ్వీయుజ బహుళ తదియనాడు క్రమంతప్పక వ్రతం ఆచరించు... నీ కోరిక నెరవేరుతుంది' అని కావేరిని దీవించి ఆదిదంపతులు అదృశ్యమయ్యారు. కావేరి అలాగే శ్రద్ధతో వ్రతం చేసి చక్కని భర్తను వివాహమాడిందని కథ.

ఈ పండుగను పల్లెల్లో 'వూయల పండుగ' అంటారు. ఈ పండుగ ముందురోజు భోగి అంటారు (సంక్రాంతి భోగి వేరు). స్త్రీలు, పిల్లలు గోరింటాకు పెట్టుకుంటారు. బాగా పండితే అనురాగం నిండిన భర్త వస్తాడని ఇప్పటికీ నమ్మేవారు ఉన్నారు. మర్నాడు తదియనాడు ఉదయాన్నే లేచి చద్ది అన్నం, గోంగూర పచ్చడి, పెరుగన్నం కడుపారా భుజించి పొరుగువారిని లేపుతూ 'అట్ల తద్దోయ్‌, ఆరట్లోయ్‌' అని పాటలు పాడతారు. ఆ రోజు చంద్రోదయం అయ్యేవరకు ఉపవాసం ఉండి, తరవాత స్నానంచేసి అట్లు వేసుకుని నివేదనకు సిద్ధం చేసుకుంటారు. షోడశోపచారాలతో ఉమా శంకరులను పూజించి, వ్రతకథను చెప్పుకొని అక్షతలు శిరస్సుపై వేసుకొని ముత్త్తెదువలతో కలిసి భుజిస్తారు.

వివాహం అనేది స్త్రీ జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన. ఆదిదంపతుల ఆశీస్సులతో ఆనందప్రదమైన అనురాగ దాంపత్యం లభిస్తుందని ఆనాటివారి గట్టి నమ్మకం. శ్రద్ధ, నమ్మకంతో జీవితాల్ని అందంగా మలచుకోవచ్చని ఈ పండుగ సందేశం.
                                                                                          - కె.యజ్ఞన్న

Sunday 20 October 2013

జగమే మాయ...


'మాయ' అంటే సత్యాన్ని తెలుసుకోలేకపోవడం. అనిత్యాన్ని అర్థం చేసుకోలేకపోవడం. ఈ లోకంలో నిత్యాలు- అనిత్యాలు, సత్యాలు- అసత్యాలు, స్థిరాలు- అస్థిరాలు అని ఉంటాయి. వాటి మధ్య తేడా తెలుసుకొని, అస్థిరమైనవాటి ప్రలోభాలకు లోనుగాకుండా, అవన్నీ మాయ అనీ, మాయ కానివన్నీ మాధవుడికి చెందినవనీ గమనించి, జీవనయానం చెయ్యడమే మన పరమావధి అని గ్రహిస్తే చాలు- ముముక్షతకు సుముఖులమైనట్లే.
సృష్టికర్త మాయాతీతుడు, ఆయన లీలలు ఎవరికీ తెలియతరం కావు. సృష్టి మొదలైనప్పటినుంచే 'మాయ' పుట్టింది. నేను 'దేహాన్ని' అని భావించడమే మాయ. ఎందుకంటే ఆ దేహం ఎప్పుడు పుడుతుందో, ఎలా పుడుతుందో, ఎప్పుడు అంతమవుతుందో తెలీదు. ఇదే అజ్ఞానం. ఈ అజ్ఞానం మనలో ఉన్నంతవరకు మాయఉండే తీరుతుంది. ఈ అజ్ఞానపు తెరనే అన్యాపదేశంగా నాదబ్రహ్మ త్యాగరాజు తిరుపతి సందర్శించినప్పుడు స్వామివారి దర్శనం లభించక ఆవేదన చెందుతూ, ఆర్తితో 'తెరతీయగ రాదా' అంటూ గానం చేశారు. ఈ అజ్ఞానమనే తెర తొలగినప్పుడు ఆత్మ దర్శనమవుతుంది. ఆత్మతత్వం బోధపడుతుంది. అదే పరమాత్మ సందర్శనానికి సులభతర సాధనమవుతుంది. ఈ మాయను వదిలించుకోవాలన్నా, దైవానుగ్రహం కావలసిందే. సత్సంగం చేయవలసిందే. నామస్మరణ చేయవలసిందే. శాస్త్ర-వేద-పురాణాల అధ్యయనం చేయవలసిందే! ఈ మాయ అన్ని యుగాల్లోనివారినీ వలలో పడేసింది. వ్యామోహితుల్ని చేసింది. అపకీర్తి పాలు చేసింది. అనేక విధాల అష్టకష్టాలపాలు చేసింది.

శుక్రాచార్యులు హెచ్చరించినా వినని బలిచక్రవర్తి విష్ణువంతటివాడే (వామనావతారంలో) తనను దానమడిగాడని, యశోపలోభితుడై మూడడుగుల దానం ఇవ్వబోయి అధఃపాతాళానికి పోయాడు. ఇది మాయా ప్రభావమే. వనవాసంలో సీతాదేవి బంగారులేడిని చూసి, దాని వ్యామోహంలో పడి శ్రీరామచంద్రుడికి దూరం కావడం మాయవల్లనే కదా! ద్యూతమాయకు వశుడై ధర్మరాజు అడవులపాలు కావడం మనకు తెలిసిందే. విశ్వామిత్రుడు మోహమాయలో పడిపోయి మేనకను చేపట్టి వేల సంవత్సరాల తపోఫలాన్ని నష్టపోయాడు. ఇలా ఎందరెందరినో మాయ కష్టపెట్టింది.

సంసారం మాయ అంటాడో విరాగి. దేవుడే మాయ అంటాడో నాస్తికుడు. మనకు తెలీకుండా మన కళ్లెదుటే జరుగుతున్నది మాయంటాడో మేధావి. భగవంతుడు కల్పించే పరీక్షాకాలమే 'మాయ' కనుక దాన్ని జయిస్తే మాయను జయించినట్లే అంటారు సాధకులు, భక్తులు. సర్వ కర్మలు భగవదర్పితం చేస్తున్నప్పుడు మాయను గురించి ఆందోళన ఉండదు. భగవంతుడి శరణు కోరినవాడిని ఏ మాయా అంటదు. గీతాతాత్పర్యమూ ఇదే చెబుతున్నది.

పరమాత్మ ఒక్కడేననీ, అతడి వినోదమే మాయ అనీ, ఆ మాయ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు, ఓషధుల నుంచి ఆహారం ఉద్భవించినట్లు 'తైత్తరీయోపనిషత్‌' చెబుతోంది. ఈ మాయ తాలూకు దుష్ప్రభావాన్ని ప్రధానంగా కలియుగ మానవుడు గ్రహించి తీరాలి. ధర్మాన్ని, నీతిని, న్యాయాన్ని, గాలికి వదిలేసి అక్రమంగా, అత్యాశాపరుడై పరుల్ని దోచుకుని కూడబెట్టే సంపదనంతా రేపు తాను అనుభవించగలడా? పోనీ, తనవాళ్లయినా శాశ్వతంగా అనుభవించి సుఖశాంతులు పొందగలరని కచ్చి తంగా చెప్పగలడా? అందుకు హామీ ఇవ్వగలడా? లేదు. పోయేనాడు తనవెంట ఏదీ రాదనీ తెలుసు. మరి, ఎందుకీ అధర్మ మార్గానుసరణ? ఈ అశాశ్వతమైన మాయాజాలంలో చిక్కుకుపోవడం దేనికి? కారణం అజ్ఞానం, అహంకారం. వీటన్నింటికీ జన్మస్థలం మనసు. దాన్ని నియంత్రించుకోగలిగితే చాలు, సకలం కరతలామలకమైనట్లే! బుద్ధిని సద్వినియోగపరచుకోగలిగితే చాలు, సిద్ధి పొందినట్లే!

గర్విష్ఠుడైన ఒకరాజు కళ్లు తెరిపించేందుకు ఓ సన్యాసి, రాజాస్థానానికొచ్చాడు. సన్యాసి జ్ఞానబోధల్ని ఏమీ వినిపించుకోకుండా, తనకంతా తెలుసునన్న నిర్లక్ష్యంతో, తన గొప్పతనం చెప్పుకోవడం కోసం- స్వామీ! మీకేం కావాలో కోరుకోండి, ఇస్తాను' అన్నాడు దర్పంగా రాజు. 'నీ సొంతమైనదేదైనా ఉంటే అదివ్వు' అన్నాడు సన్యాసి. 'ఈ కోశాగారం, అశ్వశాల, గోశాల, ఈ రాజ్యం, అన్నీ నా సొంతమే. ఏదైనా అడగండి ఇస్తా'నన్నాడు మళ్ళీ రాజు. సన్యాసి అన్నాడు- 'ఇదంతా ప్రజలు నీకిచ్చినదే. నీ శరీరం భగవంతుడిచ్చిందే. నీ మనసు, బుద్ధీ అన్నీ దైవదత్తాలే. ఈ జన్మ నీ స్వార్జితం కాదు. ఇక నీ సొంతమనేది ఏదీ లేకపోతే- నువ్వు నాకేమివ్వగలవు?' రాజుకు తల తిరిగిపోయింది. తన అజ్ఞానమనే మాయను తెలుసుకున్నాడు. లజ్జతో తలవంచుకుని సన్యాసిని క్షమాపణ కోరుకున్నాడు. అహంకార రహితుడై జ్ఞానసముపార్జన చేసి, నిరాడంబర జీవనం కొనసాగిస్తూ ప్రజలకు శ్రేష్ఠమైన పాలన అందించి కీర్తి పొందాడు. ఈ 'మాయ' అనే ఊబిలో పడకుండా ఉండాలంటే నిర్మల చిత్తంతో నిరీశ్వరుణ్ని ధ్యానించాలి. సకల ప్రాణికోటినీ ప్రేమించాలి. సదాచరణతో, త్రికరణశుద్ధిగా పరోపకార సంలగ్నులం కావాలి. నిరంతరం జ్ఞాన సముపార్జనారతులమై ఉండాలి. ధర్మకార్యవ్రతులం కావాలి. మాయలో పడేసే మనోవికారాలన్నింటినీ 'సంయమన పాశుపతాస్త్రం'తో దగ్ధం చేసెయ్యాలి. అప్పుడే మానవ జన్మకు సార్థకత!
                                                                    - చిమ్మపూడి శ్రీరామమూర్తి

Saturday 19 October 2013

మృత్యు రహస్యం


జీవితం జీవించడానికే. మరణం గురించి ప్రశాంతంగా ఆలోచించలేం. 'మరణం గురించి ఆలోచిస్తేనే జీవితం గురించి తెలుస్తుంది' అంటాడు వివేకానందుడు. మృత్యు రహస్యం తెలుసుకొమ్మంటాడు మాక్స్‌ ముల్లర్‌. ఉపనిషత్తులు మరణం గురించి ఎంతో లోతుగా తెలియజేస్తున్నాయి. సరే, మరణం గురించి తెలుసుకుంటే ఏం జరుగుతుంది? మరణ భయం పోతుంది. మరణం గురించి భయపడనవసరం లేదని తెలుస్తుంది. మరణ భయం పోతే ధైర్యం వస్తుంది. జీవించడానికి ఉత్సాహం కలుగుతుంది. జీవన సమరానికి సిద్ధపడతాం.
మరణ భయం పోగొట్టుకున్న మహాత్ములే చాలామంది తుపాకి గొట్టానికి ఎదురు వెళ్లారు. మరణం గురించి ఖాతరు చెయ్యనివాళ్లే, జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడి ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్నవారికి, వృద్ధులకు, అనాథలకు సహాయం చేశారు. లోకకల్యాణం కోసం ఎన్నో మంచి పనులు చేశారు.

మరణం అన్న ఆలోచనే పెద్ద ప్రతిబంధకం. మరణ భావనను అధిగమిస్తే స్వేచ్ఛను మరుక్షణమే అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. మరణం తరవాత జీవితం గురించి వాదోపవాదాలు, చర్చలు అనవసరం. ఆ విషయం గురించి ఆలోచించనక్కరలేదు.

బతికి ఉన్నన్నాళ్లు ఎంత గొప్పగా బతకాలి అని ఆలోచించాలి. అలా బతకాలంటే మృత్యురహస్యం తెలుసుకోవాలి. మృత్యువు రహస్యంగా ఉందా, కనపడకుండా ఉందా? నిత్యం మన వెన్నంటే నీడలా ఉంది. కాని, భయపడనవసరం లేదు. దాని పని అది చేస్తుంది. మన పని మనం చెయ్యాలి.

అది వచ్చినప్పుడు ఒక్క క్షణంలో పని అయిపోతుంది. కానీ మరణ భావన మాత్రం మనల్ని ఇరుకున పెడుతుంది. గొప్ప గొప్ప కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు చెయ్యనివ్వకుండా 'నీ జీవితం ఎంత, నువ్వేం చేస్తావు?' అని నిరాశపరుస్తూ ఉంటుంది. దీన్ని అధిగమించడం ఎలా?

జీవితానికి మరణమే చివరి అంకం అనుకున్నవాళ్లకు మృత్యుభయం ఉంటుంది. అది సహజం, అసహజం కానే కాదు. ప్రతి ఒక్కరికి పుట్టినరోజు ఉన్నట్లే మరణించే రోజు ఉంటుంది. ఈ రెండు రోజుల మధ్యలో మనం ఏం సాధించాలో పథకం వేసుకోవాలి. స్పష్టత కలిగి ఉండాలి. చివరి రోజున మన గురించి లోకం మంచిగా మాట్లాడుకోవాలి. గొప్పగా మాట్లాడుకోవాలి. మనల్ని మరచిపోకుండా ఉండాలి. అదీ జీవితం. అలాంటి జీవితం కోరుకోవాలి.

లోకం కోసం పాటుపడుతున్న నిజాయతీపరులైన మహానుభావులను 'నీ పని మధ్యలో వదిలేసి నాతో రా!' అని మృత్యువు పిలుస్తుందా? ఒకవేళ పిలిచినా భయపడవలసిన పనిలేదు. ఇంకొకరు ఆ స్థానంలో భర్తీ అయి ఆ పనిని కొనసాగిస్తారు. భగవంతుడు ఆ ఏర్పాటు చేస్తాడు. ఎవరెంతవరకు చెయ్యాలో, అది వారికి జీవితం ఇచ్చే అవకాశాన్నిబట్టి ఉంటుంది.

మృత్యువు అంటే ఏమిటి, ఎందుకు అది మరణాన్ని కలిగిస్తుంది, మరణమంటే ఏమిటి, మృత్యుధర్మం ఏమిటి... వీటిపై శాస్త్రాలు చాలా విషయాలు చెప్పాయి.

భూమి మీద నూకలు చెల్లిపోయిననాడు దేవుడి కొడుకైనా వెళ్లిపోవాల్సిందే. అది అనివార్య సిద్ధాంతం. దీని గురించి రాద్ధాంతం అనవసరం. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించేవాడు పుట్టక తప్పదు అంటోంది భగవద్గీత. సృష్టి-స్థితి-లయాలు మూడూ జరగాలి. ఎవ్వరూ ఆపలేరు.

మృత్యువును ఎదిరించి బట్టకట్టినవాడు ఒక్కడూ లేడు. మృత్యువును కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాయిదా వేసుకున్నవాళ్లు ఉన్నారు. మృత్యువు రాకుండా చేసుకున్నవాళ్లు ఒక్కరూ లేరు.

ప్రతి క్షణం బాధపడుతూ, నిత్యం నరకం అనుభవిస్తూ మృత్యువును కోరుకునేవారు కొందరుంటారు. పుట్టడం దురదృష్టంగా, మరణించడం అదృష్టంగా భావిస్తారు వాళ్లు. పుట్టుక మన చేతిలో ఉందా, మనం అనుకున్నప్పుడు మరణించడానికి?

ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా బతకడానికే ప్రయత్నించాలి. చివరి ఆశను కూడా వదులుకోకూడదు. బతకాలి, నలుగురిని బతికించడానికి ప్రయత్నించాలి. బతికించేవాడిని చూస్తే మరణం భయపడుతుంది. మృత్యువు పారిపోతుంది. బతుకంటే భయం దానికి.

'నువ్వు చావు పుట్టుకలు లేనివాడివి. నువ్వు శరీరానివి కాదు. నువ్వు ఆత్మవి. ఆత్మకు మరణం లేదు' అని అర్జునుడితో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ విషయం మనకు ఎప్పటికి అవగాహనకు వచ్చి అనుభూతిని కలిగిస్తుందో వేచి చూడాలి!
                                                                           - ఆనందసాయి స్వామి

Friday 18 October 2013

దేహమే ఆత్మగా...


మానవుడికి దేహభావం ప్రధానంగా ఉంటుంది. అలా ఉండకూడదనీ, 'నేను' అంటే ఆత్మే అనీ, దేహం దానికి ప్రత్యక్ష ఉపాధి మాత్రమేననీ వేదాలు, విజ్ఞులు, మహాత్ముల బోధలు ఘోషిస్తున్నాయి. నిజమే. ఆత్మను అసలు నేనుగా గ్రహించేందుకే, అనుభవించేందుకే మానవుడి తపోసాధనలు. శ్రీకృష్ణుడన్నట్లు అన్ని వడబోతలు పోను, కోట్లమందిలో ఒకరో ఇద్దరో మాత్రమే అసలు తత్వాన్నెరిగి నిలబడగలరు. మరి దేహానికంత ప్రాధాన్యం లేనప్పుడు, ఎవరో మహానుభావుడన్నట్లు శ్రీరామ, శ్రీకృష్ణ సుందర రూపాలనెందుకు భక్తులు, రుషులు, గోపికలు, అర్జునుడు ఆరాధించారు? వారికి ఆత్మలు లేవా లేక దేహాలే ఆత్మలా? పురుషులకే మోహాన్ని కలిగించే శ్రీరాముడికి 'నేను' అంటే- ఆయన రూపమా? చిన్నాపెద్దా, వివాహితులు, అవివాహితులు అనే తేడా లేకుండా భువన మోహనరూపుడైన శ్రీకృష్ణుని వెంటబడి అందరూ ఎందుకు పరుగులు తీశారు? శ్రీకృష్ణుని ఆత్మ ఆయన దేహంగానే అభివ్యక్తమైందా? శ్రీరాముడు మానవుడిగానే పుట్టాడు. మానవుడిగానే జీవించాడు. ఎంతగా అంటే ఆయన సాక్షాత్‌ శ్రీహరి అన్న విషయం రుషులకు తెలిసినంతగా కూడా ఆయనకు తెలీనంతగా. ఒక సాధారణ మానవుడి దేహాన్ని (లోకం దృష్టిలో) ఇంతగా ప్రేమించాలా?!
ఏమిటీ దేహం, ఎవరీ ఆత్మ, రెండింటికీ సమన్వయం లేదా? పరస్పర సహకారం, అవగాహన... లేవా? దేహానికి లోపాలున్నా, పనిచేస్తూనే ఉన్నా, చేయిస్తూనే ఉన్నా దేహస్పృహకు అందనిది, అర్థం కానిది ఆత్మ... దేహం అసలు తత్వాన్ని పట్టుకునే వరకు.

అసలు ఆత్మలోంచి, ఆనందాత్మలోంచి, ఆ పరమ ఆత్మలోంచి అంశారూపంగా, అసలు సూత్రంలోంచి తెగిపడకుండా, విడివడకుండా, కేవలం సూత్రప్రాయంగా ఒక దేహం ఆసరాగా ఈ లోకంలోకి వచ్చిందే జీవాత్మ. దేహం వేరు. ఆత్మ వేరు. కానీ చివరి వరకూ, దేహం నిలిచే వరకూ (బహుశా ఆత్మ దాన్ని నిలిపేవరకూ) రెండూ కలిసే ఉంటాయి. ఉండాలి. ఎందుకంటే రెండూ పరస్పరాధారితాలు. అయితే ఆత్మను ధరించి, దాని ఆధారంగా మాత్రమే నడయాడే దేహానికి ఆత్మ గురించిన ఆచూకీ తెలియదు. ఆ స్పృహా ఉండదు. తానో స్వయంప్రతిపత్తిగల అపురూప రూపాన్ననే భావిస్తుంది. అపోహ పడుతుంది. అహంకరిస్తుంది. ఇలాంటి దేహాన్ని ధరించిన రామ-కృష్ణులు, వారి రూపాలు... అవి ఎంత అతిశయ లోకోత్తర సౌందర్యమూర్తులు కానీగాక... అంత ఆరాధ్యనీయాలెలా అయ్యాయి? ఆకర్షకమూర్తులు ఎలా అయ్యారు?

రాముడు-కృష్ణుడు... మనం లోతుగా పరిశీలిస్తే... చివరకు వాళ్లు భగవదవతారాలు అన్న విషయాన్ని కూడా విస్మరించి చూస్తే వాళ్లలోని లోకోత్తర 'మానవీయ' గుణాలు మనకు అడుగడుగునా సృష్టమవుతాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పిన దైవీగుణాలు పొల్లుపోకుండా వారిలో వూపిరిపోసుకున్నాయి. పోతపోసిన ధర్మ విగ్రహం శ్రీరాముడు. శ్రీకృష్ణుడు అప్పడప్పుడూ లౌక్యమో, పక్షపాతమో ప్రదర్శించాడన్న అపోహ ఉన్నా అది కేవలం అపోహే. ఎందుకంటే ధర్మం అత్యంత సూక్ష్మమైనది. దాన్ని నిభాయించడం, అక్షరాలా నిర్వహించటం, రామకృష్ణులు మాత్రమే చేయగలిగారు. ధర్మం బాహ్యదృష్టికి గోచరం కానిది. అది మనోధర్మం, రంధ్రాన్వేషణకు అందనిది. విమర్శలకు లొంగనిది. ప్రశంసలకు పొంగనిది. అది కేవలం ఆచరణీయం. రామ, కృష్ణుల వంటి లోకోత్తర పురుషులకు ఆరాధనీయమైనది.

వీరిలోని మరో అపురూప గుణం- వారు ఆత్మదేహ భావంతో జీవించినవారు కాదు! ఆత్మభావంతో ఆత్మగానే జీవించారు. పరమాత్మకు ప్రతిరూపంగా(పరమాత్మే అయినా మానవ దేహంలో ఉన్నారు కాబట్టి), పరమాత్మగానే నడయాడినవారు. మరి వారి దేహాలు అత్యంత ఆకర్షక కేంద్రాలు కావటంలో ఆశ్చర్యమేముంది?!

వారి తిరుగులేని ఆకర్షణకు ఇదే అసలు కారణం. ఆత్మ భావమే. 'ఆత్మ' సౌందర్యానికి, 'ఆత్మ' ఆకర్షణకు వయసు, సౌందర్యం, శౌర్యం లాంటివాటితో పనిలేదు. చంద్రుని చుట్టూ వెన్నెల నిండి ఉన్నట్లు ఆత్మే స్వయం ఆకర్షకం. ఆధునిక రుషులైన రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వంటివారూ వారి వయసుతో పనిలేకుండా యావత్‌ ప్రపంచాన్నీ పాదాక్రాంతం చేసుకున్నారు.
                                                                          
                                                                            -చక్కిలం విజయలక్ష్మి

Thursday 17 October 2013

నాదోపాసన


శిశువూ, పశువూ, ఆఖరికి పాముసైతం గానరసాన్ని ఆస్వాదిస్తాయని నానుడి. సంగీతం కేవలం హృదయాహ్లాదకరమే కాదు. మోక్షమార్గం కూడా! సర్వేశ్వరుడు సంగీత ప్రియుడు. శివుడి ఢమరుక వాయిద్యం నుంచి వెలువడిన ధ్వనులే అచ్చులూ హల్లులూ అంటారు. అవే భాషా సాహిత్యాలకు ఆధారం. సరస్వతీ స్వరూపంగా వీణను ఆరాధిస్తాం. శ్రీకృష్ణ పరమాత్మ వేణుగాన లోలుడు. ఈశ్వర సాన్నిధ్యం పొందడానికి సంగీతాన్నే సాధనంగా ఎంచుకొని విద్వాంసులెందరో కలకాలం నిలిచే కృతులను రచించి సుకృతులయ్యారు. ఆధ్యాత్మికవేత్తలు నాదాన్ని వేదంగా భావిస్తారు. పరమ పవిత్రమైన శ్రీరామాయణాన్ని కుశలవులు గానం చేశారు. స్వరార్చనతో ఈశ్వరార్చన గావించిన త్యాగయ్య, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు, స్వాతితిరుణాళ్‌, అన్నమయ్య, క్షేత్రయ్య, నారాయణ తీర్థులు వంటివారెందరో కొన వూపిరి ఉన్నంతవరకూ తమ ఇష్టదైవాలను గురించి అసంఖ్యాక కృతులను ఆలపిస్తూనే జీవయాత్ర గడిపారు. భౌతికంగా ఆ మహాత్ములు నేడు లేకపోయినా, ఎన్నో వేలమంది సంగీత సాధనలో నిమగ్నులై ఉన్నారు. సంగీతాన్ని మోక్షమార్గంగా చూపుతూనే ఉన్నారు.
నారద తుంబురాది ఎందరో మహానుభావులు... నాదోపాసన ద్వారా అంతర్యామిని అర్చించారు. వారి దృష్టిలో సంగీతం ఒక ఉత్తమ ఉపాసనా మార్గం ఓంకారనాదం సృష్ట్యాది నుంచీ లోకమంతా నిండి ఉంది. ఓంకారం ఈశ్వరనామాల్లో సర్వశ్రేష్ఠమైనది. త్యాగరాజు వంటి మహాత్ములకు ప్రాణం ప్రణవం. త్యాగయ్య భక్తిభావ బంధురమైన కృతులతో శ్రీరామచంద్రుణ్ని ఆరాధించాడు. విగ్రహాలు కనబడనప్పుడు ఆయన శోకమూ గానమే, తిరిగి లభించినప్పుడు సంతోషమూ సంగీతమే! సాక్షాత్తు నారదుడే త్యాగయ్యకు సంగీతశాస్త్రాన్ని ప్రసాదించాడని గాథ. నాదోపాసకులకు నరస్తుతి ఇష్టం ఉండదు. ఇష్టదైవాన్ని స్తుతించిన నోటితో దుష్ట నరప్రభువుల గురించి కృతులు చెప్పడానికి అన్నమయ్యా తిరస్కరించాడు. త్యాగయ్యా కాదు పొమ్మన్నాడు. త్యాగయ్య కోరి పేదరికాన్ని వరించాడు. నిధికంటే రాముని సన్నిధే సుఖమని ఘంటాపథంగా చెప్పాడు.

'సంగీతానికి భక్తి మూలం' అన్నాడు ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు వూత్తుకాడు వెంకట సుబ్బయ్య అయ్యర్‌. 'భక్తియోగ సంగీతమార్గమే పరమపావనం' అని గానం చేశాడు. గోపీకృష్ణుల మధుర ప్రేమను పరవశంతో వర్ణించాడు. పాడి లోకాన్ని పరవశం గావించాడు. గణపతి, కామాక్షి, శ్రీరాముడు, కార్తికేయులపై ఆయన కీర్తనలు ఆలపించాడు. సంగీతం భక్తిమయం అయినప్పుడే హృదయరంజకంగా విరాజిల్లుతుందని ఆయన ప్రకటించాడు. భక్తి సంగీతాన్ని ముక్తిమార్గంగా ఎంచుకున్నాడు ఆ మహానుభావుడు. తిరువాన్కూరు ప్రభువు స్వాతి తిరునాళ్‌ మహారాజు సంగీతమే సద్గతికి గతి అని విశ్వసించాడు. ఈయన కులదైవం పద్మనాభస్వామి. వేలకొలది కీర్తనలు రచించి, తన స్వామిపై భక్తి ప్రపత్తులను సంగీత మార్గంలో ప్రకటించి ధన్యుడయ్యాడు.

ప్రతి కృతికీ పద్మనాభ అనేదే మకుటం. జీవితాంతం తిరునాళ్‌ తిరువనంతపురం పద్మనాభస్వామిని సంగీతంతో సమర్చించి శ్రీకైవల్యం చెందాడు. త్యాగరాజు నాదోపాసకుడు. శ్రీరామ భక్తి సామ్రాజ్యాధినేత. రామావతార విశిష్టతను ఎంత వర్ణించినా త్యాగయ్యకు తనివి తీరలేదు. ఆనాటి త్యాగయ్య కృతులు నేటికీ సంగీతప్రియులకేగాక సర్వజన సమ్మోహనకరాలు. మనుషుల గురించి కీర్తించడం ఆయనకు నచ్చదు, ఒక్క శ్రీరామచంద్రుని తప్ప! ఈ నాదోపాసకులందరూ మహా పండితులు, బహుభాషావేత్తలు, సంగీతశాస్త్రాన్ని ఔపోసన పట్టినవారు- అన్నింటికీ మించి మహాభక్తులు. తమ భాషా పాండిత్యాన్ని సంగీతశాస్త్ర ప్రావీణ్యాన్ని దైవాంకితం గావించి, తమ కృతులకు రాగాలు సమకూర్చి తుదకు దైవసాన్నిధ్యం పొందారు. వారి రచనలను ఆలపించి తరించిన వారెందరో ఉన్నారు. నేటికీ సంగీత సభల్లో అవి శ్రోతలను బ్రహ్మానంద సంభరితం కావిస్తూనే ఉన్నాయి.

ముత్తుస్వామి దీక్షితులు వీణావాదన నిపుణుడు. సంగీత దివ్యత్వాన్ని స్వానుభవం ద్వారా గ్రహించిన మహాత్ముడు. నాదం జగన్నాథంగా భావించి ఆరాధించాడు. తీర్థయాత్రలు చేసి సర్వ దేవతారాధన గావించాడు. కాశీ విశ్వనాథుని గురించీ, అన్నపూర్ణాదేవిని గురించీ సంగీతారాధన చేసేటప్పుడు ఉత్తరాది సంగీతాన్ని వినియోగించడం ఆయన విశిష్టత. త్యాగయ్య 'ఎందరో మహానుభావులు' అన్నది సంగీతాన్నే ముక్తి మార్గంగా ఎంచుకున్న ఈ పుణ్యాత్ములను గురించే. శ్రీమన్నారాయణుడిపై గానం చేసిన నారదుడు చిరంజీవి. నాదోపాసనను మోక్షమార్గంగా భావితరాలకు చూపిన మన సంగీత సరస్వతులందరూ చిరంజీవులే!
                                                               - డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

Wednesday 16 October 2013

త్యాగ సంస్మరణల పర్వదినం


త్యాగం, ప్రేమ, కరుణ, ఉపకారం వంటి దైవీగుణాల్ని అలవరచుకొని ప్రతి మనుజుని మనసు పరిశుద్ధమైన కొద్దీ ప్రపంచశాంతి పరిఢవిల్లుతుందని పర్వదినాలు బోధిస్తాయి. ఈ గుణగణాల్ని అవగాహన చేసుకొని ఆచరిస్తే ప్రతి ఒక్కరు ఉన్నత జీవితాన్ని గడపగలరని, ఉత్తమ గతులు పొందగలరని ఉద్గ్రంథాల సారం. త్యాగనిరతి కలవారి ధర్మ సందేశాల్ని, గాథల్ని బక్రీద్‌ పర్వదిన సందర్భంగా ముస్లిమ్‌ పండితులు వినిపిస్తారు. త్యాగం విశ్వవిభుడి ఆనందానికి హేతువవుతుందని వివరిస్తారు.
బక్రీద్‌ పర్వదినాన్నే 'ఈదుల్‌ అజ్‌హా' అనీ అంటారు. అజ్‌హా అంటే విశ్వవిభునికి సమర్పించే బలిదానం అని అర్థం. పవిత్ర త్యాగానికి ప్రతిరూపమై జీవితాంతం విమలపథం వీడని దైవ ప్రవక్త హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ తన త్యాగ గుణాలతో పరమ విభుని మెప్పించిన మహనీయుడు. దైవాజ్ఞ, ధర్మరక్షణల నిర్వహణలో పుత్రప్రీతి అడ్డుకాకూడదని తలచిన మహా మనిషి. ఆయన అల్లాహ్‌ ప్రసన్నం కోసం చేసిన అసమాన త్యాగాల్ని ఈ పండుగ సందర్భంగా ముస్లిములు స్మరించుకొంటారు.

సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం ఇప్పటి ఇరాక్‌ దేశంలో ప్రవక్త ఇబ్రాహీమ్‌ జన్మించారు. ఆ కాలంలో ఆ దేశమంతా అశాంతి చెలరేగింది. న్యాయానికి ధర్మానికి నిలువనీడ లేకపోయింది. నమ్రూద్‌ అనే క్రూరమైన రాజు ఆ దేశాన్ని పాలించేవాడు. ఆధ్యాత్మిక ప్రగతికి విఘాతం ఏర్పడింది. అతడి దుష్టపాలనను ప్రజలు సహించారే తప్ప వ్యతిరేకించలేని శక్తిహీనులయ్యారు. అలాంటి భీతావహ పరిస్థితిలో నమ్రూద్‌ రాజు నిరంకుశత్వాన్ని, కల్పించుకొన్న దైవత్వాన్ని హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ ప్రజల మధ్య నిరసించారు. రాజు వెంటనే హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ను పిలిపించాడు. తనపై చేస్తున్న వ్యతిరేక ప్రచారం గురించి ప్రశ్నించాడు- ఇబ్రాహీమ్‌ సౌమ్య పదజాలంతో సమాధానమిచ్చాడు- 'విశ్వవిభుడు ఒక్కడే. ఆయనే ఆరాధ్యుడు. సకల చరాచర సృష్టికి మూలకారకుడు. నిర్మల జీవనం గడుపుతూ జనుల్ని పాలించేవాడే నిజమైన రాజు. ధర్మేతర శక్తులు తలెత్తని విధంగా తన రాజ్యాన్ని మలచుకోగలిగిన పాలకుడే దైవానికి ఇష్టుడు. హృదయంలేని ధర్మాలకు నిబంధనలకు జీవం పోయడం తగదు' అని.

హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ సమాధానం విన్న రాజు కోపోద్రిక్తుడయ్యాడు. ఇబ్రాహీమ్‌కు దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. ఇబ్రాహీమ్‌ ధర్మపత్నిని వెంట పెట్టుకొని ఉన్న వూరిని, కన్నవారిని, దేశాన్ని వీడి బయలుదేరారు. కష్టాల సహిష్ణుతే ఆయన కవచమైంది. శాంతిదూతగా అనేక దేశాలు పర్యటించారు. తన అనంతరం దివ్య సందేశాన్ని పుడమికి అందించే నిమిత్తం సంతానం ప్రసాదించమని సంతానం లేని తాను దైవాన్ని ప్రార్థించారు. మగబిడ్డ కలిగాడు. ఇబ్రాహీమ్‌ దంపతులు మురిసిపోయారు. ఇంతలో భార్యాబిడ్డల్ని ఎడారిలో వదలి రమ్మని దైవం ఇబ్రాహీమ్‌ను ఆదేశించాడు. దైవాజ్ఞానుసారం భార్యాబిడ్డల్ని ఎడారిలో వదిలారు. అది దిక్కు, దెసలేని ప్రాంతం. కనీసం గుక్కెడు నీళ్లు కూడా అక్కడ దొరకవు. నీటి దప్పికవల్ల బాధపడుతున్న ఆ పసిబాలుడు తన కాలి మడమలతో ఇసుక మీద రాసిన చోట నీటి వూట ఉబికింది. ఇప్పటికీ ఆ పవిత్ర జలాన్ని 'ఆబె జమ్‌జమ్‌' పేరిట ముస్లిములు తీర్థజలంగా దేహ తాపాలు, మనోక్లేశాలు తొలగించే దివ్యౌషధంగా సేవిస్తున్నారు. ఆ ఎడారి ప్రాంతమే నేటి మక్కానగరమంటారు.

హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ తన తనయుడు ఇస్మాయీల్‌ సహాయంతో మక్కాలో కాబా గృహం నిర్మించారు. అది దైవగృహం అయింది. ఒకరోజు హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ తన కుమారుడు ఇస్మాయీల్‌ కంఠాన్ని స్వహస్తాలతో ఖండిస్తున్నట్లు కలగన్నారు. ఇది దైవాజ్ఞ అని తండ్రి భావించారు. విషయం కుమారుడికి చెప్పారు. ఏ మాత్రం ప్రతిఘటించని కుమారుడు దైవాజ్ఞను నెరవేర్చండన్నాడు. దైవ నామస్మరణ చేస్తూ భక్తిలో లీనమైన హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ కుమారుని మెడ జుబహ్‌ చేయడానికి (కోయడానికి) ఉద్యుక్తులయ్యారు. వెంటనే దైవవాక్కు వినిపించింది- ఇబ్రాహీమ్‌! నీవు ప్రతి పరీక్షలోనూ ఉత్తీర్ణుడయ్యావు. నీ త్యాగనిరతి, అహంకార మమకార రహిత సన్మార్గ ప్రవర్తన ప్రసన్నత కలిగించాయి- అని.

ఐహిక సుఖాలు వీడి, విశ్వవిభుడి ఆజ్ఞల్ని పరమభక్తితో పాటించి విన్నవారి హృదయాలు జలదరించే విధంగా త్యాగాలకు ఒడిగట్టిన హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ ఆదర్శప్రాయుడై ఇస్లామ్‌ చరిత్రలో సుస్థిరంగా నిలిచారు.

బక్రీద్‌ పండుగ సందర్భంగా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనల కోసం తగిన ఏర్పాట్లు చేస్తారు. ఉదయం ఎనిమిది గంటలనుంచి పదిన్నర గంటల మధ్య సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు.

ఆల్పాశయుల ఆచరణ ప్రపంచ సభ్యతకు సిగ్గుచేటని, దైవచింతన ఉన్నా విశ్వమానవ శ్రేయాన్ని ఆలోచించనప్పుడు అది సంపూర్ణంగా నిరుపయోగమైందనిబక్రీద్‌ బోధిస్తోంది.
                                     
                                                             - డాక్టర్‌ షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా

Tuesday 15 October 2013

సప్త మాతృకలు

 విశ్వ నిర్వహణ శక్తిని జగన్మాతగా దర్శించి, వేద పురాణాగమాలు ఆ శక్తి తాలూకు వివిధ కోణాలను వివిధ రూపాలుగా ఆవిష్కరించాయి. వాటి ఉపాసనా విధులను ఏర్పరచాయి.
ఆ పద్ధతిలో 'సప్త మాతృకా' తత్వం ఒకటి.

శుంభునిశుంభాది అసురులను అమ్మవారు సంహరిస్తున్న సమయంలో, భయంకరమైన అసుర సేనల్ని నిర్మూలించడానికే బ్రహ్మాది దేవతల్లోని శక్తులు మూర్తులు ధరించి వచ్చినట్లుగా 'దేవీ మహాత్మ్యం' వర్ణించింది.

1. బ్రహ్మలోని శక్తి 'బ్రాహ్మి', 2. విష్ణుశక్తి 'వైష్ణవి', 3. మహేశ్వరుని శక్తి 'మహేశ్వరి', 4. స్కందుని శక్తి 'కౌమారి', 5. యజ్ఞ వరాహస్వామి శక్తి 'వారాహి', 6. ఇంద్రుని శక్తి (ఐంద్రి), 7. అమ్మవారి భ్రూమధ్యం (కనుబొమల ముడి) నుంచి ఆవిర్భవించిన కాలశక్తి 'కాళి' (చాముణ్డా). -వీటిని 'సప్త మాతృకలు' అంటారు. ఈ శక్తులు విశ్వాన్ని నిర్వహించే ఏడు రకాల మహా శక్తులు.

ఆధ్యాత్మిక సాధనలోని పురోగతి క్రమంలో మనలో జాగృతమయ్యే శివ శక్తులు, నిజానికి ఒకే శక్తి తాలూకు వివిధ వ్యక్తీకరణలు.

1. బ్రాహ్మి: అనంతాకాశంలో, హృదయాకాశంలో అవ్యక్తనాదంగా ఉన్న శక్తి బ్రాహ్మి. కంఠాది ఉపాధులతో ఈ నాదమే స్వర, అక్షరాలుగా శబ్దరూపంగా వ్యక్తమవుతుంది. సర్వ శాస్త్ర జ్ఞానాలకు మూలమైన ఈ శబ్ద స్వరూపిణిని ఉపాసించడం జ్ఞానదాయకం.

2. వైష్ణవి: విశ్వమందంతటా తేజస్తరంగాలుగా వ్యాపించి అన్ని వస్తువులను ప్రకాశింపజేసే అద్భుత శక్తి, స్థితికారక శక్తి ఈ తల్లి.

3. మహేశ్వరి: ప్రతివారి హృదయంలో 'అహం' (నేను) అనే స్ఫురణ వ్యక్తమయ్యే అంతర్యామి చైతన్యమే మహేశ్వరి. 'సర్వ భూత హృదయాల్లో ఈశ్వరుడే, శరీరాది ఉపాధులను కదిలిస్తున్నాడు' అని భగవద్గీత 18వ అధ్యాయం 61వ శ్లోకం ఈ భావాన్నే చెబుతున్నది.

4. కౌమారి: సాధన ద్వారా శుద్ధమైన అంతఃకరణంలో శుద్ధ సత్యాన్ని ప్రకాశింపజేసే జ్ఞానశక్తి కౌమారి.

5. వారాహి: ఈ యజ్ఞ వరాహశక్తి అన్న ప్రదాయిని. చేతిలో ధరించిన నాగలి, రోకలి ఆయుధాలు అన్నోత్పత్తినీ, అన్నపరిణామాన్నీ (మార్పునీ) తెలియజేసే సంకేతాలు. దేవతలకు హవ్యాన్నీ, మానవాది జీవులకు యోగ్యమైన అన్నాలను అందించే ఆహార శక్తి.

6. ఐంద్రి: జగద్రక్షణకు కావలసిన వీరత్వం, దుష్టులను సంహరించే ప్రతాపం ఈ శక్తి. బలానికి సంకేతంగా వజ్రాయుధాన్ని ధరించే శక్తి.

7. చాముణ్డా: కథ ప్రకారం- రక్తబీజుడనే రాక్షసుని దేవి సంహరించేటప్పుడు, స్రవించే ప్రతి రక్తకణం నుంచి ఎందరో రాక్షసులు ఉత్పన్నమవుతుంటే, 'చాముణ్డా' దేవి తన నాలికతో ఈ రక్తాన్ని పానం చేసింది. అప్పుడు ఆ అసురుడు హతమారిపోయాడు.

విషయ లంపటానికి సంకేతం రక్తబీజుడు. రకరకాల కామసంకల్పాలే రక్తకణాలు. వీటి నుంచి ఉత్పన్నమయ్యే బాధాకర, అజ్ఞానశక్తులే అసురులు. వాటిని నిర్మూలించే సమాధిస్థితిలోని దివ్య చైతన్యం 'చాముణ్డా'.

ఏకం పరబ్రహ్మ తత్వం. అనేకం ప్రపంచ స్వరూపం. ఈ అనేకమే 'చమూ' (సేనలు). ఈ అనేకత్వం నుంచి ఏకత్వ స్థితిని చేరుకోవడమే సమాధి. దీనినే 'చాముణ్డా' అని సంకేతించారు.

చండ, ముండ- అనే దనుజుల్ని సంహరించినందుకు 'చాముణ్డా'- అన్నారని మరో కథనం. యోగపరంగా చూస్తే- మూలాధారం నుంచి గ్రంథిని భేదించడం చండాసుర సంహారం. సహస్రార కమలంలో ప్రవేశించేటప్పుడు జరిగే భేదనం ముండాసుర సంహారం.

- ఈ విధమైన తాత్విక, యోగదర్శనాన్ని కావ్యకంఠ గణపతి ముని సంభావించారు (ఉమా సహస్రం).

మొత్తంగా పరిశీలిస్తే- 1.విశ్వాన్ని నడిపే శక్తులు, 2.యోగసాధనవల్ల మనలో మేల్కొనే దివ్యశక్తులు- వీటినే విభిన్న శక్తిరూపాలుగా పురాణాదులు ఆవిష్కరించాయని స్పష్టమవుతోంది.

ఈ సర్వశక్తుల సమన్వయ రూపిణి జగన్మాతకు వందనాలు.
- సామవేదం షణ్ముఖశర్మ

Monday 14 October 2013

వృక్షో రక్షతి రక్షితః


మాటలే మంత్రాలు, చెట్లే ఔషధాలని పెద్దలు ఏనాడో చెప్పారు. ఏ మాటలను పొందుపరిస్తే మంత్రం అవుతుందో, ఏ చెట్టులో ఏ ఔషధ గుణాలున్నాయో తెలుసుకున్నప్పుడే- వాటి విలువ అవగతమవుతుంది. మన పూర్వీకులు కొన్ని చెట్లలో ఔషధ గుణాలుండటం గమనించి, మనిషి ఆరోగ్యానికి ఉపకరిస్తాయని తెలుసుకొని వాటిని జాగ్రత్తగా పరిరక్షించి పూజించడం మొదలుపెట్టారు. వీటిలో తులసి, మామిడి, రావి, మేడి, మర్రి, మారేడు, వేప, జమ్మి మొదలైనవి పవిత్రమైనవిగా భావించి మన పూర్వీకులు వీటిని దేవాలయ ప్రాంగణాల్లో, మామిడితోటల్లో వూరి మధ్యన పెంచి మనకు తెలియని ఉపకారం చేశారు. వారి దూరదృష్టి వలనే నేడు పెద్దపెద్ద వృక్షాలు అక్కడక్కడ మనకు కనిపిస్తున్నాయి. మనుషులకు, పశువులకు నీడనివ్వడమే కాకుండా పక్షి సంతతి జీవించడానికి ఆధారమయ్యాయి. విలువ తెలియని నేటి కాలం మానవులు స్వార్థప్రయోజనంతో ఏదో సాకుతో మహోన్నత వృక్షాలను నేలకూల్చి పర్యావరణానికి హాని చేస్తున్నారు. పక్షిజాతి అంతరించడానికీ కారకులవుతున్నారు. చెట్లను మనం కాపాడితే అవి మనల్ని రక్షిస్తాయి.
రావిచెట్టు, వేపచెట్టు, మామిడిచెట్టు బొగ్గుపులుసు వాయువును ఎక్కువగా స్వీకరించి, మానవులకు అవసరమైన ప్రాణవాయువును అధిక మోతాదులో విడుదల చేసి ఆరోగ్యవంతులుగా ఉండటానికి దోహదపడుతున్నాయి. వేప, రావిచెట్లు రెండూ కలిసి ఒకచోట ఉంటే లక్ష్మీనారాయణ స్వరూపమని ప్రదక్షిణలు చేసి పూజిస్తారు. ఆదివారంనాడు 108 ప్రదక్షిణలు చేయడం వల్ల రావి వేపలో ఉండే గాలి ప్రభావం వల్ల పిల్లలు లేని వారికి సంతాన యోగ్యత కలుగుతుందని పెద్దలు చెబుతారు. రావిచెక్కను కొన్ని రోగాలకు మందుగా వాడతారు.

మర్రిచెట్టు నీడన పరమశివుడు దక్షిణామూర్తి రూపాన కొలువైవుండి భక్తులకు దర్శనమిస్తాడని విశ్వసిస్తారు. మర్రిచెట్టు వూడలు, వేళ్లతో చేసిన చూర్ణం వంధ్యత్వాన్ని పోగొట్టి సంతానవంతులను చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.

మారేడు లక్ష్మీస్వరూపమని, త్రిమూర్తుల ప్రతీకగా భావించి శివకేశవులను ఇద్దరినీ మారేడు దళాలతో పూజిస్తారు. మారేడుపండు గుజ్జు ఉపయోగించి ఆయుర్వేద మందులు తయారుచేసి అనేక రోగాలను పోగొట్టడానికి వాడతారు. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వారి ఆయుధాలను జమ్మిచెట్టుపై దాచారని మహాభారతం తెలియజెబుతోంది. యజ్ఞయాగాదులకు జమ్మిచెక్కను రాపిడి చేసి అగ్ని పుట్టించి సమిధలు వెలిగిస్తారు. జమ్మిచెట్టులో అనేక ఔషధ గుణాలున్నాయంటారు. దాన్ని ఉపయోగించి ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు ఔషధాలు తయారుచేస్తారు. విజయదశమి నాడు జమ్మిచెట్టుకు ప్రదక్షిణలు చేసి పూజిస్తారు. హిందువుల ప్రతి ఇంట్లో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం లభిస్తుంది. ఇంటి ముందు కానీ, పెరట్లో కానీ పవిత్ర ప్రదేశంలో దీన్ని పెంచి పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తారు. 'తులసి కోట' లేక 'బృందావనం' అని తులసిని పెంచే చోటును పిలుస్తారు. తులసి సర్వరోగ నివారిణిగా, అనేక రోగాలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.

ఏ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఏ శుభకార్యం వచ్చినా మామిడితోరణాలు కట్టకుండా జరగదు. ఇది హిందూ సంప్రదాయం. మామిడి కొమ్మలు ప్రాణవాయువును ఇవ్వడమే కాకుండా క్రిమికీటకాలను అడ్డుకుంటాయి. వాటిని ఇంటిలోనికి రానివ్వవు. మామిడికాయలు, పళ్లు రుచికరం, ఆరోగ్యదాయకం. మేడిచెట్టు దత్తాత్రేయుడికి ప్రీతికరమైందంటారు. ఆ స్వామి ఆ చెట్టు నీడన ఎల్లవేళలా ఉంటాడని నమ్మి మేడిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. ఆయుర్వేద వైద్యానికి, కొన్ని వ్యాధుల నివారణకు మేడిపళ్లను, చెట్టు బెరడును ఉపయోగిస్తారు.

ఉసిరిచెట్టుకే అమలక వృక్షమని మరో పేరు ఉంది. ఉసిరిచెట్టు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. కార్తికమాసంలో దీపారాధాన చేసి ప్రదక్షిణలు చేయడమే కాకుండా చెట్టుకింద వనభోజనాలు చేస్తారు. ఉసిరికాయ సర్వరోగాలకు దివ్య ఔషధం. విటమిన్‌ సి పుష్కలంగా ఉండే ఫలం.

ఇంకా అనేక వృక్షాలను భగవంతుడు మనకు ప్రసాదించాడు. స్వచ్ఛమైన గాలి, నీడతోపాటు ఔషధాలు, మధుర ఫలాలు, కలప అందిస్తున్న వాటిని సంరక్షించకుండా మట్టుపెట్టడం మంచిదికాదు. సకాలంలో వర్షాలు కురవకపోవడం, ఎండ తీవ్రత పెరగడానికి వృక్ష సంతతిని నాశనం చేయడమే ప్రధాన కారణం. వృక్షో రక్షతి రక్షితః అని అందరూ గ్రహిస్తే భూమి ఇంకా కొన్నాళ్లు పచ్చగా ఉంటుంది.
                                                                  - మహాభాష్యం నరసింహారావు

Sunday 13 October 2013

జయహో దుర్గామాతా!

    శక్తితో కూడుకున్నది- సృష్టి. బ్రహ్మాండం, ప్రపంచం, దేశం, సమాజం, కుటుంబం, వ్యక్తి- ఇలా దేన్ని తీసుకున్నా శక్తితో నడుస్తున్నదే. శక్తి లేనిదే చలనం ఉండదు. అందుకే 'సర్వం శక్తిమయం జగత్‌' అన్నారు. బ్రహ్మకు సృష్టి చేసే శక్తి, విష్ణువుకు వృద్ధిచేసే శక్తి, శివుడికి లయం చేసుకునే శక్తి- ఈ శక్తులన్నీ ఓ మహాశక్తి నుంచి ప్రసాదితమైనవే. ఆ మహాశక్తే ఆది పరాశక్తి. యోగనిద్రారూపిణియైన మహామాయ!
ఆశ్వయుజం అమ్మలమాసం, దేవీనవరాత్రుల పేరిట పలు రూపాల్లో ఆ ఆదిపరాశక్తిని ఆరాధించే పర్వదినాల మాసం. అమ్మ అనే పదానికి అర్థం సర్వజీవుల్నీ వశపరచుకుని, అనేకానేక సుఖసంపదలనీ, శాంతినీ ప్రసాదించేదని వ్యాఖ్యానిస్తున్నారు విజ్ఞులు. బ్రహ్మవైవర్త పురాణం అమ్మను ప్రకృతి అంటున్నది. ప్రకృతి అనే పదానికి ఉన్నతురాలైన దేవి అనే అర్థముంది.

ఈ దేవీ నవరాత్రుల్లో పరాదేవత, సకలజగత్కల్యాణదాయిని ఎనిమిదో రోజున 'దుర్గాదేవి'గా అలంకృతయై భక్తులకు దర్శనమిస్తున్నది. మనలో నిద్రాణమై ఉన్న శక్తులను జాగృతం చేసుకుని, భవ్యనవ్య మార్గాన్ని సుగమం చేసుకుని, జీవిత సార్థక్యానికి ఉపక్రమించడమే దుర్గారాధనలోని ప్రధాన లక్ష్యం. ఎనిమిదో రోజున దుర్గ దర్శనం కనుక ఈ పర్వడిని దుర్గాష్టమి అంటున్నాం.

'దుర్గే దుర్గతి నాశని' అంటారు. మన సకల దుర్గతుల్ని నాశనం చేసి, మనకు సద్గతుల్ని కలిగించేది 'దుర్గా' అని అర్థం. 'దు' అంటే దారిద్య్రం, దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం మొదలైన దుర్వికారాలు; 'గ'కారానికి అర్థం శమింపజేయడం, నివారించడం. 'దుర్గా' అనే పదంలోని 'అ'కారానికి అర్థం అన్యాయం, అధర్మం, అలసత్వం, అసుర ప్రవృత్తి, అవాంఛనీయం. కనుక 'దుర్గా'దేవి సకల అనర్థాలనీ నివారించి, శాంతి, సౌఖ్యాలను లోకాలకు ప్రసాదించే తల్లి అని అర్థం. సమస్త దేవతల ప్రాణశక్తి నుంచి ఉద్భవించిందీ మాత. అందుకే ఆమెను అష్టలక్ష్మీ స్వరూపిణి, 'త్రిగుణాతీత' అన్నారు. ఆదిశక్తి దుర్గ యోగమాయ రూపంలోనే కాక- గ్రామాల్లో పోలేరమ్మ, అంకమ్మ, గంగమ్మ, పెద్దమ్మ, ముత్యాలమ్మ, మారెమ్మ, మైసమ్మ తదితర నామాలతో పూజలందుకుంటోంది. అజ్ఞాతవాసం ఆరంభంలో పాండవులు, కురుక్షేత్ర సంగ్రామానికి ముందు అర్జునుడు, రావణసంహారానికి బయలుదేరినప్పుడు శ్రీరాముడు దుర్గను పూజించారంటారు

'దుర్గముడు' అనే రాక్షసుడు బలగర్వితుడై, సకల లోకవాసులను హింసిస్తుంటే, వెళ్లి వాణ్ని వధించి లోకాలను కాపాడిన తల్లిని దుర్గామాతగా స్తుతిస్తున్నారు. దుర్గామాత, ఎనిమిదో రోజున రుద్రశక్తిగా సింహకాసురుణ్ని వధించినట్టు పురాణ కథనం ఉంది. అనుష్ఠానం, నవగ్రహ జపాలు, యాగాలు, చండీపారాయణం, హోమం, బలులతో ఈ నవరాత్రుల వైభవం వర్ణనాతీతం.

'దుర్గ'నామాన్ని జపించినంత మాత్రాన సకల దుఃఖాలు, ఆపదలు తొలగిపోతాయంటారు. శుంభ, నిశుంభ, మహిషాదుల వంటి వేలాది రక్కసుల సంహరించి లోకాలకు విముక్తిని ప్రసాదించిన భగవతి ఆమె. అష్టమినాడు అలంకరించే ఈ దేవి పేరుతోనే 'దుర్గాష్టమి' ఏర్పడింది. 'మాతంగి' అనే పేరుతో జగన్మాత అంటరానితనాన్ని నిర్మూలించేందుకు పూనుకొందని, వాగ్దేవిగా మధురమైన వాక్కులిచ్చి ప్రశంసలందుకుందని చెబుతారు. ఆకాశంలో ఉండి ఏకపదిగా, అంతరిక్షంతో కూడి ఉండి ద్విపదగా, నాలుగు దిక్కులా వ్యాపించి చతుష్పదిగా, ఎనిమిది దిక్కులా వ్యాపించి అష్టపదిగా, వూర్ధ్వ-అధోదిశలూ కలిపి దశపదిగా, శబ్దబ్రహ్మమయిగా భాసిల్లుతున్న సహస్రాక్షరి విజయవాడ ఇంద్రకీలాద్రిపైన, కృష్ణవేణి నదీతీరాన స్వయంభువై వెలసి భక్తకోటి నీరాజనాలు అందుకుంటోంది. దుర్గాదేవిని ఎనిమిదో రోజున ఎర్రని వస్త్రాలు ధరించి, ఎర్రని పూలతో పూజించి, నివేదనగా వడపప్పు, పానకం, పులిహోర, గారెలు, గుమ్మడికాయ సమర్పిస్తారు. ఎర్రని ఫలాలను కూడా ఈ మహాష్టమి పర్వదినాన అమ్మవారికి సమర్పిస్తారు. శాక్తేయులు, మధ్వలు, వైష్ణవులు, వీరశైవులు తదితర విభిన్న మత సంప్రదాయవాదులకే కాక- కోయలు, గిరిజనులు వంటివారెందరికో అమ్మ ఆరాధ్య దేవత! ఆటవికులు దుర్గను పూజించిన ఘట్టాన్ని హరివంశ పురాణం వర్ణించింది. భక్తుడికి భక్తిశ్రద్ధలు ఉంటేచాలు, దుర్గకృప అవశ్యం లభించి తీరుతుందంటారు. ఈ దుర్గాష్టమీ పుణ్యదినాన దేవిని మనసారా స్మరించి తరిద్దాం!
                                                                  - చిమ్మపూడి శ్రీరామమూర్తి

Friday 11 October 2013

తల్లిదండ్రులు


ప్రపంచమంతా తల్లిదండ్రులతోనే నిండి ఉన్నది అన్నారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. దాన్నిబట్టి, ఈ జగత్తులో అమ్మానాన్నలకు ఉన్న స్థానం ఎంతటిదో తెలుస్తుంది. తల్లిదండ్రులు వాగర్థాలవంటివారనీ, వారిని విడదీయడం సాధ్యం కాదనీ అన్నాడు కాళిదాసు రఘువంశంలో. అంటే సృష్టిలో తల్లిదండ్రులకు గల శాశ్వతత్వం ఎలాంటిదో స్పష్టమవుతోంది. ఇలా సకల సాహిత్యాలూ తల్లిదండ్రుల ఉనికిని అత్యున్నత స్థానంలో నిలుపుతుంటే, అలాంటి ప్రత్యక్ష దైవాలకు నేటి బిడ్డలు కనీస కృతజ్ఞతనైనా ప్రకటిస్తున్నారా అంటే, అనుమానమే. ఏ కొందరు మాత్రమే మినహాయింపు కావచ్చు.
'మాతృదేవోభవ', 'పితృదేవోభవ' అనే వేదసూక్తులు 'తల్లిదండ్రులనే దేవతలుగా భావించేవాడివై జీవించు!' అని చెబుతున్నాయి. ఈ సూక్తిని శిరస్సున ధరించి అనుసరిస్తున్నవారు కొందరైతే, తల్లిదండ్రులను తమ సుఖసంతోషాలకు అవరోధాలుగా భావించి, వాళ్లను దయ్యాలుగా చూస్తూ తరిమికొట్టే అధములైన కొడుకులు లోకంలో లేకపోలేదు. పున్నామనరకం నుంచి తమను ఉద్ధరిస్తాడనుకొనే కొడుకు, తాము బతికి ఉండగానే తమకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంటే 'వీడు కొడుకా లేక యమ కింకరుడా?' అని తల్లిదండ్రులు దుఃఖించే పరిస్థితులు నేడు సమాజంలో కనబడటం శోచనీయం.

తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆస్తిపాస్తుల్నీ, డబ్బూ దస్కాన్నీ బలవంతంగా లాక్కొని, తల్లిదండ్రులను ఇంటిలో నుంచి మెడలు పట్టి గెంటేస్తున్న కొడుకులు నేడు కనబడతారు. వీళ్లంతా నిజమైన కొడుకులేనా, అసలు మనుషులేనా?

తల్లిని గౌరవించి, ఆదరించేవారికి మానవ ప్రపంచంలోనూ, తండ్రిని ప్రేమించి పూజించేవారికి అంతరిక్ష లోకాల్లోనూ, గురువులను భక్తిప్రపత్తులతో సేవించేవారికి బ్రహ్మలోకంలోనూ తిరుగు ఉండదని మనుస్మృతి చెబుతోంది. నవమాసాలూ గర్భంలో మోసి, ప్రసవ వేదనను అనుభవించి తనను కన్నతల్లినీ, అష్టకష్టాలు పడి, పెంచి పోషించిన తండ్రినీ క్షణంలో మరచిపోయి, తన ప్రయోజనాన్ని మాత్రమే చూసుకొనే సంతానానికి నిష్కృతి ఉంటుందా? ఉండనే ఉండదు. తల్లిదండ్రుల రుణాన్ని నూరేళ్లపాటు సేవించినా తీర్చుకోవడం కష్టమే. ఏ తల్లిదండ్రులైనా తమ సంతానం గుణవంతులుగా రాణించాలనీ, తమకు ఆత్మసంతృప్తిని కలిగించాలనీ మాత్రమే కోరుకుంటారు. అర్థదృష్టితో చూడనే చూడరు. అలాంటి తల్లిదండ్రులను డబ్బుకోసం, ఆస్తులకోసం, శారీరక సౌఖ్యం కోసం కాలదన్నడం ఎంతవరకు ధర్మం? గుణహీనులైన ఎందరో కొడుకులకంటే గుణవంతుడైన ఒక్క పుత్రుడు చాలుననీ, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నా ఏం ప్రయోజనం- ఒక్క చంద్రుడు ఉంటే చాలు ఆకాశానికీ, భూమికీ అందం, ఆహ్లాదం కలుగుతాయనీ పంచతంత్రం చెబుతోంది.

పార్వతీ పరమేశ్వరులను ఈ జగత్తుకే తల్లిదండ్రులుగా ప్రస్తుతించాడు కాళిదాసు. అంటే తల్లి పార్వతీదేవి వలె సకల మంగళాలకూ నిలయమైనదనీ, అపార కారుణ్యమూర్తి అనీ, ఆమెను తలచుకుంటే చాలు సకల సౌభాగ్యాలూ వర్షిస్తాయనీ తాత్పర్యం. అలాగే తండ్రి పరమేశ్వరుడి వలె అడిగిన వెంటనే అన్నీ సమకూర్చే స్వభావం కలవాడనీ, పోషించే గుణం నిలువెల్లా నిండి ఉన్నవాడనీ, పిల్లల తప్పులను సరిదిద్దే వాత్సల్యగుణం కలిగినవాడనీ అర్థం. పార్వతీ పరమేశ్వరుల వంటి తల్లిదండ్రులను హృదయకమలంలో నింపుకొని ఆరాధించాలేగాని, వారి మనసులను నొప్పించరాదనే సత్యాన్ని సంతానం తప్పక గ్రహించాలి. తల్లిదండ్రులు లేని పిల్లలు అనాథలవుతారు. తల్లిదండ్రులు కళ్ల ఎదుట ఉన్నంత కాలం వారి విలువ తెలియదు. వారు కనుమరుగైపోతే ఎంత కష్టం, ఎంత నష్టం? అది ఎవరూ పూరించలేని లోటు. తల్లిదండ్రులు బతికి ఉన్నప్పుడు బాధలకు గురిచేసి, చచ్చిన తరవాత వారి సమాధులపై పూలు చల్లితే ఏం లాభం? 'మరు జన్మలో కూడా ఈ సంతానమే మాకు కావాలి' అని తల్లిదండ్రులు కోరుకునే విధంగా పిల్లలు ప్రవర్తించాలన్నదే అన్ని శాస్త్రాలూ ఉపదేశిస్తున్న సత్యం.

తల్లిదండ్రులు జీవించినంతకాలం వారి మనసులను నొప్పించకుండా, అవసరమైనప్పుడు సేవలు అందిస్తే చాలు- అప్పుడు ఈ లోకమే ఒక స్వర్గం. ఒక కైలాసం. ఒక వైకుంఠం. ఒక బ్రహ్మలోకం. ఒక ముక్తిధామం!
- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ 

Thursday 10 October 2013

మూలపూజ


  సృష్టిలో అనేక రకాల శక్తులున్నాయి. వాటిలో జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి అనే మూడు శక్తులు ముఖ్యమైనవి. గుణాలూ అనేక రకాలు. వాటిలో సత్వ, రజో, తమోగుణాలు ముఖ్యమైనవి. సత్వ (సాత్విక) గుణం సామాన్య జీవనానికి, జ్ఞాన, వైరాగ్య, మోక్ష మార్గాలకు దారి చూపుతుంది. రజోగుణం రాజస లక్షణాలైన అధికారం, అహంభావం, దర్పం, ఉచ్చస్థితిలో ఉండాలనుకోవడం లాంటి మార్గాలకు ప్రతీక. తామస గుణ లక్షణం పేరులోనే వ్యక్తమవుతోంది. అజ్ఞానం, అకృత్యం, అలసత్వం, మౌఢ్యం మొదలైన ఆసురీ లక్షణాలకు ప్రతీక. సృష్టి అంతా ఈ మూడు గుణాల సమాహారమే. గుణాలు, శక్తులు- ఎవరికి, ఏవి, ఎలా ఉన్నా వాటన్నింటినీ నియంత్రించడానికి సర్వోన్నత శక్తి ఒకటి ఉండాలి. అలా నియంత్రించగలిగే సర్వశక్తుల సమాహార స్వరూపిణే ఆదిశక్తి. ఆమెకు అనేకమైన పేర్లున్నాయి. అనేక రూపాలతో కొలుస్తారు. ఆమె సర్వవ్యాపిని, సర్వమంగళకారిణి. సర్వైశ్వర్య ప్రదాయిని. దుష్టశక్తులకు దుఃఖదాయిని, సర్వోపద్రవ నివారిణి. అయినా అభయ ప్రదాయిని. కాబట్టి పై మూడు శక్తుల సమాహారమైన ఆ ఆదిశక్తిని ఆశ్వయుజమాసంలో తొలి రోజునుంచి తొమ్మిది రోజులు, తొమ్మిది రూపాలతో కొలుస్తారు. నక్షత్రాల్లో మొదటిది అశ్విని. ఆ నక్షత్రం పున్నమి నాటి చంద్రునితో కూడిన మాసం ఆశ్వయుజం. ఆదిశక్తిని, ఆది నక్షత్రపు పేరుతో ఏర్పడ్డ మాసంలో పూజించడం వల్ల శుభాలు జరుగుతాయని విశ్వాసం.
ఈ శరన్నవరాత్రుల్లో ఆదిశక్తి అయిన జగన్మాతను అనేక రూపాల్లో, అనేక కారణాలతో అనేక కాంక్షలతో ఆరాధిస్తారు. ఉన్నవి తొమ్మిది రూపాలే అయినా, వారివారి భావనానుసారం, విభవానుసారం, మనోగత కోరికల సిద్ధికోసం వేరు వేరు రూపాల్లో కొలుస్తారు. వీటికి ప్రాంతీయ భేదాలు, ఆచార వ్యవహారాలు సైతం దోహదపడతాయి. ఎవరు, ఎక్కడ ఏ రూపాల్లో కొలిచినా ఆ తొమ్మిది రూపాల్లో ఒకటి సరస్వతీ రూపం తప్పనిసరిగా ఉంటుంది. దీనికి కారణం పైన చెప్పిన మూడు శక్తుల్లో ముఖ్యమైనది, మిగిలిన రెండింటి ఉనికికి ఆధారమైనది జ్ఞానశక్తి. అంత ప్రాముఖ్యం కలిగిన జ్ఞానానికి అధిదేవత సరస్వతి. ఈమె పుట్టిన నక్షత్రం మూల. నవరాత్రుల్లో మూలా నక్షత్రంతో కూడిన దినాన సరస్వతిని పుస్తకరూపంలో పూజిస్తారు. దీనికే 'పుస్తక రూపిణీ సరస్వతీ పూజ'అని 'మూలపూజ' అనీ పేర్లు.

విద్య అనేక రకాలు. వాటిలో వాగ్రూప, కళారూప, లౌకిక, మనోమయ, యోగ విద్యలు ముఖ్యమైనవి. ఇవన్నీ ప్రతి మనిషికీ ఆవశ్యకాలే. వాగ్రూపిణి అయిన సరస్వతి అనుగ్రహం వల్లనే శైశవంలో మాటలు రావడం రూపంలో వాగ్విద్య పట్టుపడుతుంది. దాని ఆసరాతో... లౌకిక, వ్యావహారిక, కళావిద్యలు అభ్యసిస్తారు. వీటన్నింటికీ మూలస్థానం మనసు. కాబట్టి మనోమయ విద్య (జ్ఞాన సముపార్జన) ప్రతివారికీ తప్పనిసరి. వీటన్నింటి ఆసరాతో సాధనా మార్గాన పయనిస్తే పట్టుపడేది యోగవిద్య. ఇది స్వస్థితి నుంచి ముక్తి(అన్ని బంధాల నుంచి విడివడే) స్థితికి చేర్చడానికి ఉపయోగపడుతుంది. ఇన్ని రకాలైన విద్యలన్నింటికీ అధిదేవత సరస్వతీదేవే. బ్రహ్మ సృష్టి చేయడానికి అవసరమైన సంకల్ప శక్తిని సైతం అనుక్షణం ప్రసాదించేది సరస్వతే అని పురాణాలు చెబుతున్నాయి.

స్వరం అంటే అక్షరం, రాగం అనే అర్థాలున్నాయి. అక్షర రూపవిద్య, సంగీత రూప విద్యలు రెండూ వీణానాదం నుంచే పుట్టాయంటారు. అలాగే నాదాన్ని పరిశీలిస్తే సకల దేవతలూ మంత్ర రూపాన ఇమిడి ఉంటారని చెబుతున్నాయి వేదాలు. ఆయా మంత్రపూర్వక శబ్దంతోనే ఆ దేవతలను ఆవాహన చేస్తే వారి అనుగ్రహం సిద్ధిస్తుంది. కాబట్టి అందరు దేవతామూర్తులూ ఇమిడి ఉన్న ప్రదేశం ఆ వీణాతంత్రులే అనేది సుస్పష్టం. చేతిలో నిరంతరం ధరించేది అక్షమాల. అపరా (వేదాంత) విద్యకు ఇది సంకేతం. పైకి ఉచ్చరించడానికి వీలుకాని కొన్ని శబ్దాలను మనసులోనే మననం చేసుకుంటూ స్మరించుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మనో (మనన) రూప విద్యకు అక్షమాల (54 అక్షరాలకు సంకేతంగా 54 పూసలుంటాయని ఈ పేరొచ్చింది. కాని, అసలు పేరు జపమాల) అత్యంత ఆవశ్యకం. ఒక్కొక్క శక్తిని వశపరచుకోవడానికి ఒక్కొక్క నియమిత సంఖ్యా పరిధి ఉంటుంది. అది ఎక్కువైతే విపరీతార్థాలు కలుగుతాయి. తక్కువైతే ఫలితం ఉండదు. అందువల్ల ఆయా సంఖ్యల గణనకు ఉపయోగపడేదీ అక్షమాల. ఆ రకమైన విద్యకు సంకేతం అక్షమాలధారణ. చూపులో కరుణ, చేతుల్లో జ్ఞానముద్ర, రూపంలో శుభలక్షణాలు, హృదయంలో మాతృప్రేమ కలిగిన సర్వవిధ జ్ఞానదాయిని సరస్వతీ రూపం. కాబట్టి జ్ఞాన, క్రియాశక్తులు కలగాలని కోరుకునేవారు విద్యా ప్రదాత్రి అయిన సరస్వతిని ఆరాధించడం, సర్వశుభకరం, సర్వేశ్వర్య ప్రదాయకం, భక్తి ముక్తి కారకం.
- అయ్యగారి శ్రీనివాసరావు 

Wednesday 9 October 2013

సామూహిక ధ్యానం


మానవ నిశ్శబ్దం పరాత్పర నిశ్శబ్దంతో సంభాషించడమే ప్రార్థన. అంతరంగం అనంతంతో మాట్లాడటమే ప్రార్థన. అసలు ఎందుకు ప్రార్థన? ఏవేవో కావాలని, కష్టాల నుంచి కాపాడాలని, సదా రక్షించమని కోరడమేనా? ఎన్నో ఇచ్చినందుకు కృతజ్ఞత చూపడం ప్రార్థనా? ఎటువంటి లోటులేకుండా, భగవంతుడితో బంధం తెగిపోకుండా నిత్యం కృప చూపాలనుకోవడం ప్రార్థనా?
అన్నింటికన్నా నిశ్శబ్ద ప్రార్థనే ఉత్తమం. యాంత్రికంగా బాహ్యపెదవుల్ని కదపడంకన్నా నిండుగుండెతో మౌన ప్రార్థన మేలు- 'నాకు సంపద కాని సౌందర్యం కాని వద్దు. మరో ప్రపంచం అసలే వద్దు. ఈ ప్రపంచాన్ని భరించే నువ్వు ఈ జీవన భారాన్ని మోయడంలో సహాయపడు...' 'ఒక తండ్రి తన కుమారుడి హస్తం పట్టుకుని నడిపించినట్లు నన్ను మహోదయ తీరాలవైపు నడిపించు. నీ కృపచాలు. కోటివరాలు వద్దు'.

వెలుగుకోసం జ్ఞానం కోసం ప్రార్థన మరింత ఉత్తమమైనది. భ్రమలు, భ్రాంతులు తొలగించి దైవం తన యథార్థరూపాన్ని, అంతిమ సత్యాన్ని సాక్షాత్కరింపజేయడానికి మనల్ని మనం అర్హులుగా తీర్చిదిద్దుకోవాలి. కోరికలు తీరుతున్నా కష్టాలు తప్పవు. కృప ఉన్నా నష్టాలు తప్పవు. భగవంతుడి కరుణవల్ల కొందరికి బాధలు అంతరిస్తాయి. మరికొందరికి బాధలు పోవు. అంతమాత్రాన భగవంతుడి కృప వారిపై లేనట్లేగా? ఈ భూమిమీద కావలసినవన్నీ వరాలుగా కురిపిస్తాడు భగవంతుడు. ఒక్కొక్కసారి ఏమీ ఇవ్వకుండా ఆ రోజుకు వాయిదా వేస్తుంటాడు. ఈలోగా భక్తుల్ని తన ఆనంద పరిష్వంగంలోకి తీసుకొని రక్షిస్తాడు. విశ్వాసం, శ్రద్ధ, ఆత్మ సమర్పణ- ప్రార్థనకు పూజా వస్తువులు.

విధివల్ల కలిగే గాయాలు మనల్ని భగవంతుడికి మరీ దగ్గరకు తీసుకొని వెళ్తాయి. గతం, వర్తమానం, భవిష్యత్తులో భగవంతుడి స్వరూపాల్ని కనుగొనాలి. మనం పొందిన వరాలు, పోగొట్టుకున్న వరాలు... అన్నీ ఆయనలోనే పదిలంగా ఉంటాయి. తగిన సమయంలో అన్నీ ఇస్తాడు.

ఈ విశ్వాన్ని ఎవరో రక్షిస్తున్నారు, మనల్ని ఎవరో రక్షిస్తున్నారు అన్న భావన చాలు- జీవితాన్ని వెలుగుగా మార్చడానికి. నిత్యానందమయమైన ఆత్మనుంచి వెలువడే మంత్ర ధ్యానాలే ప్రార్థనలు. వ్యక్తి ప్రార్థనకన్నా సామూహిక ప్రార్థన మరింత శక్తిమంతమైనది. కొంతమంది కలిసి ఒక ముఖ్య లక్ష్యంతో ఒక బృందంగా ఏర్పడి చేసేదే సామూహిక ప్రార్థన లేదా ధ్యానం. అన్ని యుగాల్లో ప్రార్థనకోసం ఒకచోట సమావేశం కావడం జరుగుతుండేది. అనేక దేశాల్లో ఈ సమావేశాలు జరిగేవి. కొందరు దైవసంకీర్తనలు గానం చేసేవారు. స్తోత్రాలు, ధన్యవాదాలు, ఆరాధన, కృతజ్ఞత, సమర్పణ లేదా కీర్తన, ప్రస్తుతి చేసేవారు. ఇందుకు చారిత్రక ఆధారాలున్నాయి. అందరూ కలిసికట్టుగా సమకూడటంవల్ల ప్రార్థనకు బలం చేకూరుతుందని విశ్వసించేవారు. క్రీ.శ. 1000 సంవత్సరంలో జరిగిన ఒక ప్రాచీన ఘటన అద్భుతమైనది. కొంతమంది ప్రవక్తలు విశ్వం అంతమైపోతుందని ప్రకటించినప్పుడు, అన్ని చోట్ల ప్రజలు సమూహాలుగా ఏర్పడి ప్రపంచం అంతం కాకూడదని, రక్షించమని భగవంతుణ్ని ప్రార్థించారట. ఇటీవలి కాలంలో, ఆధునిక యుగంలో ఇంగ్లాండ్‌కు చెందిన కింగ్‌జార్జి న్యూమోనియాతో మరణశయ్యపై ఉన్నప్పుడు, ప్రజలంతా వీధుల్లో బారులుతీరి త్వరగా నయంకావాలని ప్రార్థించారు. ఆశ్చర్యకరంగా ఆ రాజు కోలుకొన్నాడు. ఇందుకు భిన్నంగా సామూహిక అభ్యున్నతికోసం, ఒక శక్తికి, ఒక తేజస్సుకు ఉన్మీలనం కావడం కోసం ఆశ్రమాల్లో, దీక్షారామాల్లో సామూహిక ధ్యానం చేసేవారు. అప్పుడే అంతర్దీపాలు వెలుగుతాయి. అంతర్మార్గాలు తెరచుకొంటాయి... త్వరగా.
- కె.యజ్ఞన్న 

Tuesday 8 October 2013

రాగద్వేషాలు


నిషి మనసును పక్షితో పోలుస్తారు. రాగద్వేషాలు దాని రెండు రెక్కలు. ఆ రెండు రెక్కల సాయంతో మనసనే పక్షి యథేచ్ఛగా విహరిస్తుంది. మమకారం, అహంకారం, అభిమానం, దురభిమానం, అతిశయం... లాంటివన్నీ- రాగం అనే రెక్కలోని ఈకలు. అలాగే ఈర్ష్య, అసూయ, పగ, ప్రతీకారం, కోపం, మూర్ఖత్వం మొదలైనవన్నీ- ద్వేషం అనే రెక్కలోని ఈకలు. ఈకలు ఎంత దట్టంగా ఉంటే రెక్కలంత బలిష్ఠంగా ఉంటాయి. రాగద్వేషాలు బలపడితే మనసు గతి తప్పుతుంది.

మనసును అదుపులో ఉంచాలనుకుంటే మొదట రాగ ద్వేషాలను నియంత్రణలో ఉంచాలి. చిత్త నిరోధమని చెప్పలేదు- మన పెద్దలు చిత్తవృత్తి నిరోధం అనే చెప్పారు. పక్షికి ఈకలుగా చెప్పుకొన్నవన్నీ ఒకరకంగా చిత్త వృత్తులే! వాటిని అదుపు చేయడం ద్వారా రాగద్వేషాలు, తద్వారా చిత్తం అదుపాజ్ఞల్లోకి వస్తాయి. చిత్తవృత్తులను లోబరచుకోవడాన్ని 'యోగ' అన్నారు.

బంధమైనా, మోక్షమైనా మనసు కారణంగానే ఏర్పడతాయని అమృతబిందు ఉపనిషత్తు బోధించింది. రాగద్వేషాలకు మనిషి బద్ధుడైతే- అది బంధం. వాటినుంచి ముక్తుడైతే - అది మోక్షం. బందీ అయినవాడు బద్ధుడు. బయటపడినవాడు- బుద్ధుడు!

రాగద్వేషాలు వ్యసనాలకు తల్లిదండ్రులు. కామజాలు అంటే కోరికల్లోంచి పుట్టేవి. క్రోధజాలంటే కోపంలోంచి పుట్టే వ్యసనాలు. రాగం కామజాలకు పుట్టిల్లు. ద్వేషం క్రోధజాలకు పుట్టిల్లు. సప్త వ్యసనాలైన స్త్రీ, పానం, జూదం, వేట, వాక్పారుష్యం, దండపారుష్యం, అనవసర వ్యయప్రీతికి రాగద్వేషాలే కారణం. అంటే, వ్యసనాలన్నీ మనసులోంచే ఉద్భవిస్తాయి.

ధర్మరాజు ద్యూత వ్యసనం, దుర్యోధనుడి దురభిమానం, ధృతరాష్ట్రుడి పుత్రవ్యామోహం, దక్షప్రజాపతి దురహంకారం, రావణాసురుడి కాముకత్వం, కీచకుడి మూర్ఖత్వం, కంసుడి భయం, అశ్వత్థామ పగ, తన కూతురు దేవయానిపై శుక్రాచార్యుడి మితిమీరిన మమకారం... ఇలా మనిషి పతనానికి దోహదం చేసే సంభారాలన్నీ రాగద్వేషాల ముడిసరకులే!

ముని శాపం కారణంగా పరీక్షిత్తు అనే రాజు తక్షకుడనే సర్పం కాటుకు మరణించాడు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. తన తండ్రి మరణానికి ఒక పాము కారణమైంది కనుక, సర్పజాతి మొత్తాన్ని సమూలంగా నిర్మూలించాలని జనమేజయుడు కక్షగట్టాడు. సర్పయాగం తలపెట్టాడు. ఇది కలియుగ ఆరంభంలోని మానవ జాతిలో మొలకెత్తిన ఒకానొక విపరీత వికార లక్షణం. ఇది మహాభారత గాథలోని ఒక విషాదకరమైన కీలకాంశం. కేవలం ఒక్క వ్యక్తి మృతి కారణంగా, ఈ సృష్టిలోని ఒక జాతి మొత్తాన్ని సర్వనాశనం చేయాలన్న ప్రతీకారేచ్ఛకు అది బీజ ప్రాయమైన హెచ్చరిక. ఒక్క మనసులో రగిలిన పగ, సృష్టిని ఒక కుదుపు కుదుపుతుందని, అది కలియుగ లక్షణమని మనకు మహాభారతం చేసిన సూచన.

దీన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే- ఈ కాలంలో సంభవిస్తున్న దుర్ఘటనలు, నరమేధాలు, మారణహోమాలు, వూచకోతలు తదితరాలకు ప్రధాన హేతువు మనకు గోచరిస్తుంది. ఒక మనసు రాజేసిన పగ- ఆ జాతికో, తెగకో సంక్రమించి దావానలంగా విస్తరించి, ప్రతీకారంగా ప్రజ్వలించి మరో జాతికో, తెగకో హాని చేస్తోంది. మానవ జాతి వినాశనానికి మూల కారణం అవుతోంది. కలియుగ మానవుడి ప్రధాన కర్తవ్యం ఏమంటే ప్రతిమనిషీ- జనమేజయుడి సర్పయాగాన్ని అడ్డుకున్న అస్తీక మహర్షి కావాలి. తన మనసుదాకా వచ్చిన చీడను తనలోనే అంతం చేసి, దాన్నిక వ్యాపించకుండా చూడాలి. అలా చేటును అడ్డుకున్న ప్రతి వ్యక్తీ అస్తీక మునే అవుతాడు. అలా కావాలంటే ముందు మన చిత్తవృత్తుల తోకలుత్తరించాలి. రాగద్వేషాలనే రెక్కలను కత్తిరించాలి. మనసనే పక్షిని పంజరంలో బంధించాలి. అలా మనసును మనం బంధించకపోతే మనమే దానికి బందీలవుతాం. బంధం విడిపోతే మోక్షం. మనసు ప్రభావం నుంచి బయటపడిన మనిషే మహర్షి! బంధమైనా, మోక్షమైనా కారణం మాత్రం మనసే- అని ఉపనిషత్తు చెప్పిన మాటకు అర్థం అదే!

మనమూ ఆధ్యాత్మిక యోగబలంతో రాగద్వేషాలను నిరోధించి మనసును అదుపాజ్ఞల్లో ఉంచుకోవచ్చు. రాగద్వేషాలతో కిక్కిరిసిపోయిన మనసులో శివుడికి కాస్త చోటు కల్పిస్తే, అదే యోగం! శివుడితో బంధం పెరగడమే మనసు నుంచి మోక్షం చిక్కుతోందనడానికి చిహ్నం.ఇది మనసును అదుపు చేయడానికి సులువైన దారి!
- ఎర్రాప్రగడ రామకృష్ణ