ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Friday 31 May 2013

సరస్వతీ నదీ పుష్కరాలుసరస్వతీ నదీ ప్రశంస రుగ్వేదం 'నదీ స్తుతి'లో కనిపిస్తుంది. ఇది హిమాలయంలోని శివాలిక్‌ పర్వతశ్రేణిలోని హాక్రాఘగ్గర్‌ ప్రాంతాల మీదుగా ప్రవహించేదని ఇతిహాసం చెబుతోంది. కాలాంతరంలో సరస్వతీ నది అంతర్థానమైపోయింది. దాని గమనాన్ని కనిపెట్టడానికి 'నాసా' విస్తృతమైన శాస్త్రీయ పరిశోధనలు జరుపుతోంది. ప్రస్తుతం ఒక అంతర్వాహినిగా సరస్వతీ నది గంగా యమునలతో చేరి త్రివేణి సంగమమైంది. గుజరాత్‌, హర్యానా, రాజస్థాన్‌లలో ఈ పుష్కర కోలాహలం మెండుగా కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని త్రివేణీ సంగమస్థానమైన అలహాబాద్‌ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.

పుష్కరం అంటే కమలపుష్పం అని ఒక అర్థం ఉంది. విష్ణు సహస్రనామాల్లో 'పుష్కరాక్షః' అన్న నామం రెండు పర్యాయాలు ఆవృతం కావటం గమనించదగ్గ విశేషం. సూర్య కిరణ స్పర్శవల్ల వికసించిన పద్మంవంటి కన్నులు కలవాడని, ఆ కన్నులు కృపారసం వర్షించేవనీ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు.

పుష్కరనామాన్ని బ్రహ్మకు, శివుడికి వర్తింపజేస్తున్నాయి కొన్ని పురాణగాథలు. పుష్కర తీర్థంలో బ్రహ్మాలయం ఉంది. పరమశివుడు సతీదేవి వియోగం వల్ల జలజల రాల్చిన కన్నీరు మున్నీరై అన్ని దిక్కుల్లో ప్రవహించిందట. ఇక్కడ పుష్కర శబ్దానికి జలం అన్న అర్థం అన్వయిస్తుంది. 'పుష్కరం సర్వతో ముఖం'- దాని గుణం అంతటా ప్రవహించటం.

బృహస్పతిని నవగ్రహాలకు అధిపతిగా తలచటానికి కారణం అతడి 'గురు' స్థానం. గురువుల్లో అగ్రగణ్యుడు, పైగా శుభాలు ఇచ్చేవాడు కాబట్టి, ఒక్కొక్క రాశిలో ప్రవేశించగానే ఒక్కొక్క నదికో పుష్కరయోగం కలుగుతుంది. ఇలా పన్నెండు రాశుల్లో పర్యటిస్తూ ఉండటంవల్ల పన్నెండు నదులు పుణ్యతీర్థాలుగా మారి పుష్కర ఘట్టానికి తెరలేస్తుంది. మళ్ళీ గురుడు ఆ రాశిలో ప్రవేశించటానికి పన్నెండు సంవత్సరాలు కావాలి. ఒకసారి పుష్కర యోగం పట్టిన నదిలో స్నానం చేస్తే అన్ని పాపాలు పటాపంచలవుతాయని ప్రజల విశ్వాసం. శుభాలు చేకూరగలవన్న నమ్మకంతో ప్రజలు ధారాళంగా దానధర్మాలు చేస్తారు. భక్తిశ్రద్ధలతో పితృకార్యాలు నిర్వహిస్తారు. పన్నెండు రోజుల దాకా పుష్కరుడు, దేవతలు దిగివచ్చి ఆ నదీ జలాలను పునీతం చేస్తారు కాబట్టి మిగతా నదుల దృష్టికూడా పుష్కర నదీ ముఖంగా ప్రవహిస్తాయి. పుష్కరం పన్నెండేళ్లకు ఒకసారి రావటంవల్ల ఆ కాలమానం ఒక కొలమానంగా ప్రజాదృష్టిలో నిలిచిపోయింది. పుష్కర స్నానాభిలాషతో దేశం నలు చెరగుల నుంచి జనసందోహం తరలి రావటం సహజం. కుల, మత, జాతి భేదాలు మరచి స్నానాలు చేయటం ఒక దృశ్యకావ్యంగా పర్యాటకులు భావిస్తారు. భారతీయ సంస్కృతిలోని 'భిన్నత్వంలో ఏకత్వా'నికి ఈ స్నానఘట్టం ఒక దర్పణం లాంటిది.

బృహస్పతి (గురుడు) మిథున రాశిలో 31.5.2013 ఉదయం 7.17గంటలకు ప్రవేశిస్తున్నట్లు పంచాంగం చెబుతోంది. వైశాఖ బహుళసప్తమి మొదలు పదకొండు రోజుల దాకా సర్వస్వతీ నదీపుష్కరాలు జరుగుతాయి. ఉత్తరప్రదేశ్‌లోని భీంపూర్‌, అలహాబాద్‌నగరాలు ముఖ్య కేంద్రాలు. గురుడు కన్యారాశిలోకి రాగానే కృష్ణా నదికి (విజయవాడ), తులారాశిలో కావేరి నదికి (శ్రీరంగం), వృశ్చికంలో తామ్రపర్లినదికి (బాణా తీర్థం), ధనుస్సులో పుష్కరిణీ నదికి (అజ్మీర్‌), మకరంలో తుంగభద్రనదికి (కర్నూలు), కుంభంలో సింధునదికి (కాశి), మీనంలో ప్రణీతానదికి (చోప్రా), మేషంలో గంగానదికి (హరిద్వార్‌), వృషభంలో నర్మదానదికి (నారీశ్వర్‌), కర్కాటకంలో యమునానదికి (మధుర), సింహంలో గోదావరి నదికి (రాజమహేంద్రి) పుష్కర యోగం పడుతుంది. సింధునది ప్రస్తుతం పాకిస్థాన్‌ పరం కావటంవల్ల కాశికాపురిలోని గంగానదీ స్నానంతో సరిపెట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా పుష్కర నదీస్నానాలు విదేశీయుల దృష్టిని కూడా ఆకర్షించి, అంతర్జాతీయ ఖ్యాతిని గడించటం భారతజాతికి గర్వకారణం
                                                                   - ఉప్పు రాఘవేంద్రరావు 

Thursday 30 May 2013

మాట్లాడే కళ


మాట్లాడటం ఒక కళ. అందరూ మాట్లాడతారు. ఏది అనుకుంటే అది మాట్లాడేస్తారు. కాని చక్కగా మాట్లాడటం మనకు వచ్చునా? అందరూ వక్తలు కాకపోయినా, చక్కటి సంబంధాలు నెలకొల్పాలంటే ఎంతో సౌమ్యంగా మాట్లాడాలి. చక్కగా సంభాషించాలి. మాట్లాడకపోతే నష్టమా? ఎంతో నష్టం. నోరు మంచిదైతే వూరు మంచిది అన్నారు.

  మాట్లాడటంలో ఏముంది అని అనుకోవడం పొరపాటు. చక్కగా మాట్లాడటం ఒక కళ. తానొవ్వక ఇతరుల నొప్పించక మాట్లాడాలి. చాతుర్యంగా మాట్లాడాలి. మాట్లాడుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించాలి. మంచినే మాట్లాడాలి. చెడు మాట్లాడే అవకాశం రానివ్వకుండా జాగ్రత్తపడాలి. నిజాయతీగా మాట్లాడాలి. నిరాడంబరంగా మాట్లాడాలి. సందర్భానుసారం ఏం మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడాలి. వ్యవహారం చక్కబెట్టుకు రావడానికి అప్రమత్తంగా మాట్లాడాలి.

 ముందే దుర్యోధనుడు వచ్చినా, అర్జునుణ్ని ముందు పలకరించిన శ్రీకృష్ణుడు మాట్లాడిన విధానం, దాని వెనక ఉన్న రాజనీతిజ్ఞత గ్రహించాలి. కురుక్షేత్ర రణరంగం మధ్యలో రథాన్ని నిలిపి, అర్జునుడి విషాదం గ్రహించి, అతణ్ని యుద్ధం వైపు తిప్పిన ఆ భగవానుడి సంభాషణలు విశ్వస్ఫూర్తిదాయకమై భగవద్గీతగా వెలుగుతున్నాయి. ఆ పలుకుల వెనక ప్రస్తుత కాలానికి అవసరమైన వ్యక్తిత్వ వికాసం, మానవ సంబంధాల గురించి ఎన్నో విషయాలున్నాయి. ఇంతవరకు అంత అద్భుతంగా మాట్లాడిన అవతారమూర్తి కానరాడు.

 బుద్ధుడు కొన్నివేల మైళ్లు తిరిగి, ఒక సంఘం స్థాపించి ఎంతో మందిని తనవైపు ఆకర్షించడానికి ఎన్నో సంభాషణలు చేశాడు. అతడి మాటలు వినడానికి జనం బారులు తీరారు. పరుగులు తీశారు. ఇప్పటికీ ప్రపంచంలో ఎన్నోచోట్ల బుద్ధుడి దివ్యమైన శక్తిమంతమైన మాటలు వినిపిస్తూనే ఉంటాయి.

  చిన్న చిన్న ఉదాహరణలతో చక్కటి మహిమగల మాటలాడి తన దివ్యత్వం చూపించిన జీసస్‌ను ఎన్నో మిలియన్ల మంది ఆరాధిస్తున్నారు. ఆయన వాక్యం శక్తి అందరికీ తెలిసిందే కదా. తన అనుభూతిని అందరికీ తెలిసిన ఉపమానాలతో హృదయంలో ముద్రించుకుపోయేటట్లు తెలియజేసిన రామకృష్ణ పరమహంస సాధారణమైన మాటల ముందు కేశవచంద్ర సేన్‌ లాంటి పండితులు తలవంచారు. ఇచ్చిన కొన్ని నిమిషాల కాలాన్ని అపరిమితంగా సద్వినియోగం చేసుకుని చికాగో నగరంలో అద్భుత ప్రసంగం చేసి భారతదేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పిన వివేకానందుడి మాటలు అమెరికా అంతా మార్మోగాయి. దేశదేశాలు వివేకానందుడి వాక్కులకోసం పరితపించి పోయాయి. జ్ఞాన సరస్వతి వివేకానందుడి మాటలు నేటి యువతకు కూడా జీవన లక్ష్యంవైపు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నాయి. అంకితభావం కలిగి, శుద్ధత్వం సంపాదించుకుని లోక కల్యాణం కోసం జీవించిన గురునానక్‌, ఆదిశంకరుల వంటి మహాత్ముల సంభాషణలు మరచిపోగలమా?

 అందరం మాట్లాడతాం. మంచిగా మాట్లాడదాం. మంచి కోసం మాట్లాడదాం. దీన, హీన జనుల పక్షాన నిలబడి మాట్లాడదాం. లోకం నీతిమార్గంలో నడవడానికి, మహనీయుల బోధలు అనుసరించడానికి జనులను జాగృతం చేయడానికి మాట్లాడదాం. నీకోసం నాకోసం మాటలు తగ్గించి పదిమంది మేలు కోసం పరులహితం కోసం అహోరాత్రాలు మాట్లాడదాం. అదే నిజమైన దైవస్తుతి.
                                                                  - ఆనందసాయి స్వామి

Wednesday 29 May 2013

మోక్షం

      మనుషుల్లో మూడు రకాల వాళ్లుంటారు. ఐహిక సుఖం కోరుకునేవారు, పరం చాలనుకునేవారు, ఇహపర సుఖాలు రెండూ కోరుకునేవారు. పరసుఖం అంటే మోక్షం. మోక్షం కావాలని కోరుకున్నా అది అందరికీ ప్రాప్తించదు. ఎన్నేళ్లు సాధన చేసినా, తపస్సు చేసినా రుషులందరికీ మోక్షం లభించలేదు. అందుకు పూర్వజన్మ సుకృతమూ ఉండాలి. ఈ జీవితంలో చేసే అవిరళ కృషీ ఉండాలి.

 భారతీయ దార్శనికక్షేత్రంలో మోక్షం అద్వితీయమైన పరమార్థం. ప్రపంచంలోని ఏ ఇతర ధర్మచింతనలోను కనిపించని ప్రాధాన్యం మోక్షానికి మన సనాతన ధర్మచింతనలోనే గోచరిస్తుంది. దేశంలోని సర్వ సంప్రదాయాల దర్శనమిది. చింతన అనేది అన్ని రకాలైన సత్యాన్వేషణకు పునాది. జీవితంలోని అన్ని లోపాలను సవరించి, దుఃఖాలనుంచి విముక్తి కలిగించే మార్గమే చింతన. అప్పుడే శాశ్వతానందపథం గోచరిస్తుంది. అదే మోక్షం. చతుర్విధ పురుషార్థ ఫలాల్లో మోక్షమే అగ్రేసర స్థానంలో నిలబడి ఉంది. మానవుడి చరమలక్ష్యం మోక్షప్రాప్తి. భారతీయ తత్వదర్శనంలో మోక్షం పరమోత్కృష్ట మూల్యం, సర్వశ్రేష్ఠ పురుషార్థం. దార్శినికులు ఆస్తికులు, నాస్తికులుగా విభిన్న అభిప్రాయాలు కలవారుగా ఉన్నప్పటికీ, భారతీయ సంప్రదాయాలన్నీ ఏకగ్రీవంగా మోక్షాన్నే సమర్థిస్తాయి. జీవితానికి చరమలక్ష్యంగా అంగీకరిస్తాయి. మోక్షం ఆత్మకు సంబంధించింది. నాస్తిక సంప్రదాయాన్ని అనుసరించిన బౌద్ధ దర్శనం కూడా మోక్ష సిద్ధాంతాన్ని నిర్ద్వంద్వంగా సమ్మతించింది. మోక్షానికి బౌద్ధం 'నిర్వాణం' అని పేరు పెట్టింది. అన్ని బంధాలు, దుఃఖాలు తీరిపోవటమే నిర్వాణం. మోక్షేచ్ఛకు నిర్వచనం కూడా దాదాపు అదే. జైనమతమూ మోక్ష సిద్ధాంతాన్నే చరమ లక్ష్యంగా భావిస్తుంది. మోక్షప్రాప్తికి సమ్యక్‌ జ్ఞానం, సమ్యక్‌ దర్శనం, సమ్యక్‌ చరిత్ర ఆవశ్యకమని చెబుతుంది.

  మోక్షం నిరానందస్థితి. ఇది తత్వజ్ఞానం వల్ల లభిస్తుంది. న్యాయ ధర్మ సిద్ధాంతాల అనుసారం తత్వజ్ఞానమంటే ఆత్మను శరీరం, మనసు ఇంద్రియాల నుంచి వేరుగా తెలుసుకోవడం. ఈ జ్ఞానం పఠన, శ్రవణ, మనన విధి ధ్యాసలవల్ల కలుగుతుంది. ఇవే మోక్షమార్గాలు. మోక్షం కోరుకునే జాతిలో ఏ అరిష్టమూ, అశుభమూ చోటు చేసుకోలేదు. విశ్వశాంతికి అటువంటి జాతే సర్వదా సహకరిస్తుంది.

   సాంఖ్య-యోగ దర్శనాలను అనుసరించి మోక్షమంటే కైవల్యం. దుఃఖం నుంచి సర్వులకూ విముక్తి కలిగించేది అదే. కైవల్యంలో సుఖం కూడా ఉండదు. అంటే అది శుద్ధచైతన్యావస్థ. ఈ స్థితి జ్ఞానంవల్లనే సిద్ధిస్తుంది. మోక్షసాధనాల్లో సర్వోత్కృమైన సాధనం భక్తే. భక్తి వల్లనే అంతర్యామి అనురాగం, ఆశ్రయం లభిస్తాయి. అద్వైతం జ్ఞానానికి ప్రాధాన్యమిస్తుంది. విశిష్టాద్వైతం భక్తికి ప్రాముఖ్యమిస్తుంది.

   స్థూలంగా మోక్షం అంటే సమర్పణభావం. ఇది అంత సులువు కాదు. అది ఒక పావన భావన. అందులో నిరహంకారం, వినయం, శ్రద్ధ, ప్రేమ, విశ్వాసం నిండుగా ఉండాలి. అత్యంత ప్రియతముణ్ని ఆత్మసమర్పణ చేసుకొమ్మంటాడు వాసుదేవుడు. ఆ ప్రియతముడే అర్జునుడు.

  అత్యంత దుర్లభమైన ఈ మానవ జన్మ లభించాక కూడా మోక్షప్రాప్తికి యత్నించని, తపించని మానవుడు మూఢుడు. జడుడు, మహాపాపి. పాపానికైనా, పుణ్యానికైనా ఈ శరీరం సహకరించాల్సిందే కద! అందుచేత సత్కర్మల కోసమే ఈ శరీరాన్ని స్వస్థతతో కాపాడుకోవాలి. ముక్తి కోసం ధ్యానయోగాల్ని, ధ్యానయోగాల కోసం జ్ఞానాన్ని, జ్ఞానం కోసం ధర్మాన్ని పరిరక్షించుకోవాలి. ధర్మాచరణ కోసం శరీరాన్ని ఆరోగ్యవంతంగా సంరక్షించుకోవాలి. కనుక మోక్షప్రాప్తికి శరీరారోగ్య పరిరక్షణ అత్యావశ్యకం, అనివార్యం.

   'ఇది నాది' అనుకుంటే మనిషి బంధాల్లో చిక్కుకుంటాడు. 'ఇది నాది కాదు' అనుకుంటే మోక్షార్హుడవుతాడు. సాంసారిక వాసనలతో నిండి ఇంద్రియచాపల్యం కలిగించే కర్మలు చేస్తున్న మానవుడికి పరమ తత్వజ్ఞానం అవగాహన కాదు. త్రికరణ శుద్ధిగా పవిత్రుణ్ని చేసే విద్యే విద్య. అటువంటి విద్యనే సాధకుడు హస్తగతం, మనోగతం చేసుకోవాలి. దాన్ని ఆచరణతో సమన్వయపరచుకోవాలి. దాన్ని జీవనలక్ష్యంగా స్వీకరించాలి. అందుకు సద్గురువు సహకారం అనివార్యం. ప్రాణ, మానమోహాలు వీడి, మమతాను బంధాలు త్యజించి, ధర్మవ్రతుడై ఏకాగ్రతతో ప్రణవం జరిపించి, జితేంద్రియుడై, ఐహిక శృంఖలాల నుంచి విముక్తి పొందడమే మోక్షం. అటువంటి మోక్షానికి మనసు దర్పణమై ప్రకాశిస్తుంది. అందులో విశ్వపురుషుడి ప్రతిబింబమే ప్రభాసిస్తుంది. ఆ అలౌకిక దర్శనానుభూతే మోక్షం!
                                                             - చిమ్మపూడి శ్రీరామమూర్తి 

Tuesday 28 May 2013

వైవిధ్యం

                             
         తెల్లగా మెరిసిపోయే రెండు సమాంతర గోడలున్నాయి. వాటి మధ్య ఒంటరిగా ఒక మనిషి ప్రయాణిస్తున్నాడు. పరిశుభ్రంగా, చక్కగా ఉన్నాయే అని పది అడుగులు వేశాడు. కనుచూపు మేరలో మరో నరుడు కనబడలేదు. వడివడిగా మరో వంద అడుగులు వేశాడు. నరుడేకాదు; పురుగు కూడా లేదు. అటూ ఇటూ చూస్తే ఒకే రంగు. తల తిరిగినట్లయింది. ముందుకు పరుగెత్తాడు. తెలుపు... తెలుపు... ఒకే రంగు! భయం వేసింది. కాసేపటికి పిచ్చిగా కేకలు వేస్తూ పడిపోయాడు. అతడిలో ఒంటరితనమూ, నిస్సహాయతా... అన్నింటికంటే మించి వైవిధ్య రహితమైన దృశ్యమూ విపరీత పరిణామానికి దారితీశాయి. భగవంతుడు ఈ లోకంలో అన్నింటికీ తగు స్థానాన్ని కల్పించాడు. అవేవీ ఒకే జాతివి కావు. గడ్డిపోచ నుంచి మహావృక్షం వరకు, ఏక కణ జీవి నుండి ఏనుగు వరకు... ఎన్ని రకాలో! చిన్నపుట్టలు గుట్టల నుంచి మహాపర్వతాల వరకు ఎన్నెన్నో పరిమాణాలు. ఆకుపచ్చని చెట్టుకు ఎర్రటి పూలు! ఆ చెట్టుపై రంగు రంగుల రెక్కలతో ఎగిరే సీతాకోక చిలుక!

భారతీయుల దృష్టిలో ప్రతిదీ భగవత్‌ స్వరూపమే! సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే కొండల్నీ, గోవుల్నీ పూజించమని నందాదులకు సూచించాడు. ఈ భూమిని రక్షించడానికి శ్రీహరి చేపగా, తాబేలుగా, వరాహంగా అవతారాలెత్తాడు. గజముఖుణ్ని విఘ్నేశ్వరుడిగా పూజిస్తాం. కపివరుడైన హనుమంతుణ్ని పూజిస్తే శ్రీరాముని పూజించినట్లే! ఆంజనేయుడి గుండెలోనే తారక రాముడు కొలువై ఉన్నాడు. ఈ పౌరాణిక గాథల సారాంశం ఒక్కటే! భిన్న ఆకృతులతో కనబడే స్వరూపాలన్నీ భగవదంశలేగాని వేరుకాదు.

మానవుడు బుద్ధిజీవి. బుద్ధిని మంచికీ చెడుకీ- దేనికైనా ఉపయోగించవచ్చు. లోకమంతా తన చెప్పుచేతల్లో ఉండాలనుకోవడం రాక్షసత్వం. ప్రకృతిని వశం చేసుకొనే ప్రయత్నంలో మానవుడు రాక్షసుడవుతున్నాడు. ఒక్కొక్క జాతినీ హరిస్తున్నాడు. పట్టణాల్లో పిచ్చుకలు మచ్చుకైనా లేకుండా మాయమయ్యాయి. కాకులు కరవైపోతున్నాయి. రసాయన పదార్థాల దెబ్బకు ఇప్పటికే వేలకు వేల వృక్ష, జంతు జాతులు అంతరించిపోయాయి.

'బుద్ధి'కి పరమార్థం ఏమిటి? ప్రకృతిని భగవంతుని ప్రసాదంగా స్వీకరించి పరిరక్షించడం. 'బుద్ధిహీనత' అంటే? ప్రకృతిని పరిమార్చడం. కొండలను బండరాళ్ల కుప్ప అనుకుంటాం. హిమాలయాలు మాయమైన మరుక్షణం మన దేశం మనగలుగుతుందా? జీవనదులు ప్రవహిస్తాయా? ఇవన్నీ అంతరించిపోయిన తరవాత ఆ ప్రాంతానికి ఒక అందమా చందమా, ఒక చెట్టా పుట్టా? అప్పుడు కనబడే దృశ్యం ఒకటే! ఎటు చూసినా 'కాంక్రీటు' అరణ్యాలు. బండగుండెల మనుషులు. జీవజాలపు అస్తికల పర్వతాలు! ఒక వైవిధ్యానికి తావులేదు. ఎటు చూసినా ఒకే జీవజాతి. అదే మానవజాతి. చోటుకోసం, నీటికోసం, తుదకు గాలికోసం పోటీపడే మానవజాతి! పేరుకు మానవులు. ప్రవర్తనలో దానవులు. దేవాలయ స్థలాలూ, ఆస్తులూ వారి ఆకలికి చాలవు. వారి తర్కం ఒక్కటే! 'మనకే గతి లేకపోతే ఈ రకరకాల జీవులన్నింటినీ రక్షించడమేమిటి? వాటన్నింటినీ మనం ఆహారంగా ఉపయోగించుకుంటే తప్పేమిటి? పాపంలేదు. పుణ్యం లేదు! మన ఉనికే సత్యం, మిగతాదంతా కల్పన!' ఈ తర్కం కర్కశత్వానికి దారి తీస్తుంది. తన ఉనికిని రక్షించుకునే ప్రయత్నంలో సాటి జీవులకు మనుగడ లేకుండా చేస్తాడు. తెల్లవాడు లోకాన్నంతా తెల్లవాళ్లే పరిపాలించాలనుకుంటాడు. తెల్లతోలు గల మానవజాతి శ్రేష్ఠమైనదని నమ్మిస్తాడు. ఎదిరిస్తే ప్రాణాలు హరిస్తాడు. 'తెల్లగా ఉండటం అందం' అని అందరూ భ్రాంతిపడేలా చేస్తాడు. కానీ లోకంలో ఎంత వైవిధ్యం ఉంది. అందం రంగుకు సంబంధించిన సంగతి కాదు. కృష్ణుడిది ఏ రంగు? ఆ నల్లనివాడి దివ్య సౌందర్యాన్ని దర్శించి భక్తులు ధన్యులయ్యారా లేదా? అది త్రిజగన్మోహనమా కాదా? ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క రంగు. ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క వాహనం! అంతా వైవిధ్యమే! అదే స్వామి- శ్రీరంగంలో ఒకరీతి, పండరి క్షేత్రంలో ఒకతీరు. అందంలో, అలంకారంలో... ఎంత వైవిధ్యం! అదే కన్నుల పండుగ! ఈ వైవిధ్యమే జీవితాన్ని రంగుల కలగా మారుస్తుంది. కష్టాలను మరపిస్తుంది. మనం చేసే అలంకారాల్లోనే ఇన్ని రకాలుంటే, దేవుడి సృష్టిలో ఇంకెన్ని ఉండాలి? వైవిధ్య భరితమైన ఈశ్వర సృష్టిని రక్షించడానికే మానవుడికి 'బుద్ధి'ని ప్రసాదించాడు. ఆ బుద్ధి సరైన విధంగా ఉపయోగించేటట్లు చేయమని తిరిగి ఆ పరమేశ్వరుణ్నే ప్రార్థించవలసివస్తోంది.
                                                  - డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు 

Monday 27 May 2013

భగవంతుడి వజ్రం

                                 

                తన జ్ఞానంతో మనల్ని రంజింపజేసిన వ్యక్తిలో 'ఏదో వెలుగు' ఉంది. అతనిలో జ్ఞానజ్యోతి సుస్పష్టంగా తేజరిల్లుతున్నదని అంటుంటాం. ఇలాంటి వెలుగును మనం వజ్రపు కాంతితో పోలుస్తాం. అత్యంత ప్రకాశవంతమైన వస్తువుల్లో వజ్రం ఒకటి. విచిత్రమేమిటంటే, వజ్రం సొంత వెలుగుతో ప్రకాశించదు. దానిపై కాంతి పరావర్తనం చెందినప్పుడు మాత్రమే అది భాసిస్తుంది. అలాగే జ్ఞాని సైతం సొంత కాంతివల్ల కాకుండా, ఉన్నత భూమికల నుంచి పరావర్తనం చెందిన అతిలోక తేజస్సుతో ప్రకాశిస్తాడు.

అటువంటి జ్ఞాని ఏ కాంతిని వెదజల్లుతాడు? తాను భగవంతుడి నుంచి వచ్చానన్న నిత్యస్ఫూర్తి అతడికి ఉంటుంది. అందువల్ల అతడు భగవంతుడి కాంతి కిరణమే. బంకించంద్ర ఛటర్జీ ముఖంలో రవీంద్రుడు అటువంటి వెలుగును చూశాడు. హిమాలయాల్లో ఒక వ్యక్తికి వివేకానందుడు కనిపించాడు. గొప్ప తేజస్సు కలిగిన ఆయన త్రిశూలం పట్టుకున్న శివుడిలాగా ఆ వ్యక్తికి గోచరించాడు. సింహం వంటి శిరస్సుతో గుచ్చే చూపులతో ఆయన భారతదేశపు ఉజ్జ్వల సూర్యబింబంలాగా మెరిసిపోతున్నాడని అనీబిసెంట్‌ వర్ణించారు.

మనలో అటువంటి వెలుగు అధికంగా ప్రసరించాలంటే మరింత అధికంగా భగవంతుడు మనలో ప్రకాశించాలి. మనలో ప్రతి ఒక్కరిలో ఈ దివ్యత్వం విరాజిల్లుతోంది. ఎక్కువగానో, తక్కువగానో మన అందరిలో దివ్యత్వ కిరణాలు మెరుస్తుంటాయి. సర్వశక్తిమంతుడితో, సర్వజ్ఞుడితో మనం ఏకత్వం ఎంత ఎక్కువగా సాధిస్తే అంత కాంతి మనలో ప్రజ్వరిల్లుతుంది.
భగవంతుడి సృష్టి, మనిషి, పక్షి, మృగం, పురుగును మనం నిస్వార్థంగా ప్రేమించినప్పుడు మనలో దివ్యప్రేమ శోభిల్లుతుంది. నిర్మల మనసు, సత్యమంటే ప్రేమ, విలువల పట్ల గౌరవం, దయ, దాతృత్వం, సేవా తత్పరత, క్షమించేగుణం... ఇవన్నీ మనిషి ఆత్మ పార్శ్వాలు. అవి వజ్రానికున్న పార్శ్వాలవంటివి. అవన్నీ భగవంతుడి లక్షణాలే. ఈ గుణాలు మన దివ్యమూలాన్ని ప్రతిఫలిస్తాయి. ద్వేషం, లోభత్వం, కామం, భయం లాంటి లక్షణాలు ఉంటే మనం వెలుగు నుంచి దూరమై పోతుంటాం. చీకటి నుంచి వెలుగును సృష్టించలేం.

తన ప్రయోజనాలు, భౌతిక విషయ సుఖాలతో నిండి ఉన్న మనిషి దివ్యప్రకాశాన్ని ప్రసరించలేడు. అతడు ధ్యానం చేస్తూ, దివ్య లక్షణాలను తనలో ప్రోదిచేసుకుంటే, అతడిలోని వెలుగు ఇతరులను ఆకర్షిస్తుంది. వారు కూడా దివ్య ప్రేమపథంలో పయనించేటట్లు చేస్తాయి. ప్రాణంలేని వజ్రమే మనుషుల్ని ఆకర్షించినప్పుడు, ప్రేమతో స్పందించే సాధుపురుషుడు ఎందరినో తనవైపు తిప్పుకోలేడా? 'నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో' అని బుద్ధ భగవానుడు ఆనందుడు అనే తన శిష్యుడికి అదే ప్రబోధిస్తాడు. 'ఈ ప్రపంచానికి నీవే వెలుగువి. నీ కాంతి మనుషుల మధ్య ప్రకాశించాలి. నీ మంచి పనులను జనం మెచ్చుకుంటారు. భగవంతుడు మరింతగా ఆనందిస్తాడు' అన్న జీసస్‌ ప్రబోధం వెనక రహస్యం అదే.

'మనిషిలో లోలోపల భాసిస్తున్న దివ్యత్వాన్ని అభివ్యక్తం చేయడమే మతం ప్రయోజనం' అంటాడు వివేకానందుడు. మనలోని దివ్యత్వాన్ని గుర్తుపెట్టుకుని, సన్నిహితంగా జీవితాన్ని సాగిస్తే, భగవంతుడి వజ్రంలాగా ఈ లోకంలో మెరిసిపోవచ్చు.
                                                                          - కె.యజ్ఞన్న

జీవిత సాఫల్యం

                              
       జీవితంలో ఎంతో కొంత ఆహ్లాదం ఉండాలి. అలా అనుకోవడం తప్పా అన్నది ప్రశ్న. ఆ ఆనందమో ఆహ్లాదమో ఎలా అనుభవిస్తున్నామన్నది చర్చనీయాంశం. దీనికి రెండు సమాధానాలు. ఒకటి, అందరూ ఆమోదించిన రీతిలో ఆనందంగా గడపడం. రెండోది, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అనుకుని ముందుకెళ్ళడం. అయినా కొంతమంది ఏ విధంగానూ అడుగు కదపలేరు. ఈ విధమైన ఆలోచనా సరళి ఉండటం ఏమీ కొత్తకాదు. ఎందుకంటే ఏది తప్పో అది కళ్ళముందు కనపడుతున్నా, ఇంకోపక్క కోరిక అనేది ఉంటుంది. అది ఎక్కడికీ పోదు. దాన్ని అణచుకున్నా అది కేవలం తాత్కాలికమే. అలా అణచిపెట్టుకుంటే ఆ ఆలోచన బలపడుతుందే తప్ప తరగదు.
          మనం మనసును, శరీరాన్ని ఒకటిగా చూస్తాం. నిజానికి ఆ రెండూ వేరు వేరు. ధర్మ విరుద్ధమైన పని అయినా దాన్ని చెయ్యమని ప్రోత్సహించేది శరీరం. ఎందుకంటే అది రుచులను కోరుతుంది. కొత్త అనుభవాలు పొందాలని తహతహలాడుతుంది. నిజానికి ఈ తపనను నిగ్రహించుకోవడం అంత సులభమైన పని కాదు. మరోవిధంగా చెప్పాలంటే ఇష్టానికి- ధర్మానికి మధ్య ఉన్న (నిజమైన) ఘర్షణే అంతర్యుద్ధం. ఈ విధమైన మనస్తత్వం నుంచి సరైన మార్గంలో మహాపురుషుల జీవితాలు ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళేవారు కొంతమంది. మన పురాణ, ఇతిహాసాల్లోని పాత్రల జీవితాలనుంచి ప్రేరణ పొందేవారు ఇంకొంతమంది. ఇలాంటివారు తాము చేసిన ధర్మవిరుద్ధమైన పనులను తాము చదివిన, విన్న పురాణ పాత్రలు ఎలా ప్రవర్తించాయో వాటిని ఉదాహరణగా చూపి తమ పనులను సమర్థించుకుంటారు. త్యాగరాజస్వామి కీర్తన ఉండనే ఉంది- 'ఎంత నేర్చినా ఎంత చూసినా ఎంతవారలయిన కాంత దాసులే...'
               మనిషిని చెడు మార్గంలో తీసుకువెళ్లే కారణాలు- కాంత, కనకం (బంగారం). అరిషడ్వర్గాలుగా చెప్పే కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు వీటికి మానసపుత్రులే. ఉన్న సంపద చాలకపోవడం, లేని వస్తువు కావాలనుకోవడం వల్లనే అసలు సమస్య మొదలవుతుంది. ఇక్కడ 'వస్తువు' అంటే అది ఒక వ్యక్తి తాలూకు ఆర్థిక, సామాజిక స్థితి కావచ్చు, లేక స్త్రీ వ్యామోహం కావచ్చు. అందుకని ఎప్పుడు ఒక వ్యక్తిలో అంతర్మథనం మొదలవుతుందో ఆ నిమిషంలో ఆ వ్యక్తి- స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. తాము ఇప్పటివరకు సమాజంలో గౌరవంగా బతికాం, ఈ కాస్త ఆనందం కోసం దిగజారి ప్రవర్తించాలా అని ఆలోచిస్తే, ఆ మనిషిలో మార్పు వచ్చి తీరుతుంది. కొంతమంది లోకనిందకు భయపడి అయినా ధర్మాచరణ కొనసాగిస్తారు.
              కోరిక ఉండటం తప్పుకాదు. కానీ ఆ కోరిక తీరితే జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయని ఆలోచించడం ముఖ్యం. కోరిక ధర్మ సమ్మతమైనదేనా కాదా అన్నది రెండో ప్రశ్న. మూడోది- ఏదో ఒకరకంగా ఆ కోరిక తీరితే దానిద్వారా వచ్చే ఆనందం ఏమిటి? అసలు ఆ వ్యక్తి ఇప్పుడు ఉన్న స్థితిలో ఆనందంగా లేడా? ఏదైనా తీరని వాంఛలతో బాధపడుతున్నాడా లేదా ఉన్నదానితో తృప్తిపడలేడా అనేది చర్చనీయాంశం. ఆ విధంగా మనోవిశ్లేషణ చేసుకుని ఆ కోరిక తీరడానికి కొంత ప్రయత్నం చేసినా, తప్పు తెలుసుకుని ఆ క్షణం నుంచి ప్రయత్నాలు విరమించుకుని యథాస్థితికి వచ్చినా- అతడు ఇంద్రియ నిగ్రహం కలవాడనే చెప్పాలి. అలా కాకుండా ఎంత ఖర్చయినా, ఏమి జరిగినా, తనకు అపవాదు వచ్చినా సరే, తన కోరిక తీరడమే ముఖ్యం అనుకున్నవారు ఆ వక్రమార్గంలో ముందుకుసాగి, చివరకు అధోగతి పాలయ్యారని చరిత్ర మనకు చెబుతున్న సత్యం. ఇలా ధర్మం ఏమిటో తెలిసినా అధర్మంవైపే ముందుకెళ్ళి నాశనమైనవారు- దుర్యోధనుడు, రావణాసురుడు.
                 ఆత్మ న్యూనత భావానికి లోనుకావడం తప్పే, అహంకారం ఉండటమూ తప్పే. తన మీద తనకు ఆత్మవిశ్వాసం తగినంత ఉండటం తప్పుకాదని పెద్దలు చెబుతారు. ఈ ఆత్మవిశ్వాసం, అహంకారానికి దారి తీయనంతవరకు ఆ మనిషికి ఎదురు ఉండదు. ఎప్పుడైతే తనను మించినవాడు లేడనుకుంటాడో, ఆ క్షణంలోనే, అతణ్ని అన్ని విషయాల్లో అధిగమించినవాడు తారసపడతాడు. ఇది సత్యం. ఈ విధంగా జీవితం భగవంతుడిచ్చిన వరం అనుకుని నువ్వు ఉన్నంత వరకు దీన్ని గట్టిగా పట్టుకో, ధర్మబద్ధంగా ప్రవర్తించి గొప్పవాడనిపించుకో. నలుగురితో స్నేహంగా ఉండు. నీవు ఉన్నా లేకపోయినా ఈ కాలచక్రం ఆగదని గుర్తుంచుకోవడం తెలివైనవారి లక్షణం. నువ్వు లేకపోయినా నువ్వు మంచివాడివని ఈ లోకం అనుకునేలా జీవించు. అందులోనే ఉంది ఆ వ్యక్తి జీవిత సాఫల్యం.
- ఆదినారాయణశాస్త్రి

Saturday 25 May 2013

మహా వైశాఖి


వైశాఖ మాసానికి వేదశాస్త్రరీత్యా 'మాధవ'మాసం అనిపేరు. రుతురాజైన వసంతంలో ఈ రెండోనెల దైవశక్తిపరంగానూ ఉత్కృష్టమైనదని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
స్నాన, దాన, జప, హోమాదులకు సమప్రాధాన్యం కలిగిన ఈ మాసమంతా మహిమాన్వితమైంది. అయినప్పటికీ, ప్రత్యేకించి పూర్ణిమకు ఒక వైశిష్ట్యం ఉంది. మాసశక్తి అంతా పూర్ణిమలో సారంగా, కేంద్రంగా ఉంటుంది- ఇది శాస్త్రమర్యాదలతో సాధనకు యోగ్యంగా విజ్ఞులు చెప్పేమాట. అందునా- ఈ వసంత పూర్ణిమ మరింత మహిమాన్వితమని పురాణ వచనం.

మాసమంతా సాధన చేయలేనివారు, ఈ ఒక్క రోజైనా నియమబద్ధంగా చేసే సాధనలు శీఘ్రంగానూ, పూర్ణంగానూ ఫలిస్తాయని శాస్త్రోక్తి. దీనికి 'మహావైశాఖి' అని శాస్త్ర వ్యవహారం. ఈ రోజు చేసే దానానికి విశేషప్రాధాన్యం ఉంది. గ్రహదోషాలను తొలగించడానికి, అరిష్టాలను నివారించడానికి జలదానం, వస్త్రదానం, ఛత్ర పాదుకాదుల దానం కర్తవ్యాలని చెబుతారు. బాటసారులకు జలం, శీతల పానీయాలు భగవత్ప్రీతిగా సమర్పించినవారికి రోగహరణం, తాపనాశనం కలుగుతాయని పురాణాల మాట.

వసంత పూర్ణిమల్లో వైశాఖి రెండోది కనుక- దానికి మరింత ప్రత్యేకత ఉంది. మహాత్ములు 'వసంతంవలె లోకహితానికై సంచరిస్తా'రని వివేక చూడామణిలో ఆదిశంకరుల ఉవాచ.

వసంతం చిగురింతలతో, పూలతో, పళ్లతో వనాలకు పచ్చదనాన్ని, సాఫల్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రాణులకు మేలు కలిగిస్తుంది. తానేమీ ఆశించదు.

అదేవిధంగా మహాత్ములు తమ జ్ఞానంతో, స్వార్థరహితమైన సహాయంతో, అనుగ్రహంతో లోకానికి మేలు కలిగించడానికై సంచరిస్తారు. వసంతం తనంత తానై వనాలవద్దకు వచ్చి మోడుతనాన్నీ, నీరసాన్నీ తొలగించి రసత్వాన్నీ, హరితాన్నీ ప్రసాదిస్తుంది. అలాగే త్యాగమూర్తులు సంచరిస్తూ అజ్ఞానాన్నీ, దుఃఖాన్నీ తొలగిస్తూ విద్యతోనో, జ్ఞానంతోనో, హితోపదేశంతోనో, కారుణ్యంతోనో కాపాడి ఎందరి జీవితాలకో జ్ఞానసాఫల్యాన్ని, ఆనందసిద్ధినీ కలిగిస్తారు. అందుకే వారిని వసంతంతో పోల్చారు.

వసంతంలాంటి వ్యక్తిత్వం కలిగిన అవతారపురుషులు, ఆచార్యులు, సిద్ధులు ఈ మాసంలోనే ఎక్కువమంది జన్మించడం విశేషం. ఈ వైశాఖ పూర్ణిమనాడే బుద్ధుడు జన్మించాడు. తొలి తెెలుగు వాగ్గేయకారుడు, సంకీర్తనాచార్యుడు అన్నమయ్య పుట్టిన రోజు కూడా ఇదే. లేతలేత పదాలతో, వేల'పదాల'తో జ్ఞానపథాలను ఏర్పరచిన మహాయోగి అన్నమాచార్య. భారతీయ తత్వచింతనలో ఒక వెలుగు బుద్ధభగవానుడు.

ఈ వైశాఖంలోనే ఆదిశంకరులు, రామానుజులు (శుద్ధపంచమి) జన్మించారు. త్యాగరాజ జయంతి వైశాఖ శుద్ధ షష్ఠి (సప్తమి-అని కొందరి అభిప్రాయం). పరమపావని గంగాదేవి భువిపై అవతరించిన జన్మతిథి కూడా శుద్ధసప్తమి- అని శాస్త్రవచనం.

నారాయణుడి యోగావతారం నరసింహస్వామి ఆవిర్భావతిథి వైశాఖ శుద్ధ చతుర్దశి. జ్ఞానమూర్తి అయిన ఆంజనేయస్వామి పుట్టిన తిథి బహుళ దశమి- అని సంహితవచనం.

ఆదిశంకరుల అనంతరం భారతీయ సనాతన ధర్మానికి మరో అద్భుత ప్రకాశాన్నిచ్చిన ఆచార్యులు శ్రీవిద్యారణ్యస్వామి అవతరించిన పుణ్యతిథి శుద్ధ సప్తమి.

ఇలా వైశాఖంలో ప్రతి తిథికీ పురాణోక్త మహిమలే కాక, చారిత్రక ప్రాముఖ్యాలూ ఉన్నాయి.

ఈ వైశాఖ పూర్ణిమ 'జ్ఞానపూర్ణిమ' అనీ స్పష్టమవుతోంది.

మందర పర్వతాన్ని ఉద్ధరించిన, ఆధారశక్తి స్వరూపంగా ఉపాసించే ఆదికూర్మం అవతరించిన పుణ్యతిథి ఈ పూర్ణిమేనని శాస్త్రాల కథనం. మంగళకరమైన సంపద్గౌరీదేవిని ఆరాధించే పూర్ణతిథి ఇది. ఇలా వ్రతపర్వంగా, దానస్నానపర్వంగా, సాధనల పండుగగా ప్రసిద్ధిచెందిన వైశాఖపూర్ణిమ ఆధ్యాత్మిక పూర్ణత్వానికి సంకేతం.
                                                                                                         - సామవేదం షణ్ముఖశర్మ

Friday 24 May 2013

నారు పోసినవాడు...


        'నారు పోసినవాడు నీరుపోయడా' అనే మాట చాలా బావుంటుంది. మనిషికి బతికేందుకు ధైర్యాన్నిస్తుంది. భవిష్యత్తుపై భరోసా ఇస్తుంది. నిజమే. కానీ ఆ మాటను మనం రెండు విధాల తీసుకోవచ్చు. నిరాశకు తావు లేకుండా చేసేందుకు, నిస్పృహకు లోను కాకుండా ఉండేందుకు. ఇది బావుంది. ఆ 'మాట' ఆసరాతో బతికేయొచ్చు. భగవంతుడు అవసరమైనప్పుడు జీవన శకటం ఆగిపోకుండా ఎప్పటికప్పుడు ఇంధనాన్ని వేస్తూపోతాడట. అయితే ముందు మనం బండి నడిపే ప్రయత్నం చేద్దాం. ఆగిపోయే పరిస్థితిలో ఆయనే ఆదుకుంటాడనే భరోసా. నిజంగా ఇది బావుంది. మరో ఆలోచన... జీవితం మనదే. కానీ జీవనం పట్ల మనకేమీ బాధ్యత లేదు. పుట్టించిన అతగాడెవరో ఆయనే ఆదుకుంటాడట. ఔను. ఇది పక్కా పరాన్నభుక్కు తత్వం, నీచత్వం, ఆత్మహత్యాసదృశం. వేలు చూపిస్తే దాని ఆసరాతో ముందుకు నడవాలిగానీ దాన్నే కొరుక్కు తినకూడదు.    

దేవుడు మనను సృష్టించి అన్ని హంగుల్నీ సమకూర్చింది స్వయంప్రతిపత్తితో జీవించమని. ఆ తృప్తితో, ఆత్మవిశ్వాసంతో, స్వాభిమానంతో బతకమని. ఇచ్చిన శరీరావయవాలను, మెదడును, మనసును, జ్ఞానాన్ని ఉపయోగించి వాటిని సద్వినియోగం చేసుకొమ్మని. పసితనంలో ప్రతిదానికీ అమ్మ మీద ఆధారపడిన బిడ్డ పెద్దయ్యాక కూడా అన్ని పనులకూ ఆమె మీద ఆధారపడితే అది అవిటితనం అవుతుంది. మనిషికి సొంత ప్రయత్నం ఉండాలి. స్వయంప్రతిపత్తి కావాలి. స్వయంఉపాధి సమకూర్చుకోవాలి. ఎప్పుడూ ఎవరి మీదా ఆధారపడకూడదు... అనారోగ్యంలోనో, అవిటితనంలోనో తప్ప. మనను పోషించటం, అస్తమానం నీరు పోయటం దేవుడి పని కాదు. మనమైనా ఒక మొక్క నాటుతాం. నీరు పోస్తాం. కొంతకాలం పోషిస్తాం. కొన్నినాళ్లు రక్షిస్తాం. అంతే. ఆ తరవాత దాని జీవిక అదే చూసుకుంటుంది. దాని రక్షణ అదే చేసుకుంటుంది. ఉన్నచోటనే దాని ఉనికిని భద్రం చేసుకుంటుంది. పైపెచ్చు మనకే ఉపకారం చేస్తుంది. వూరికే ఉపకారం చేస్తుంది. మనిషి మాత్రం పరాన్నభుక్కుగా మారిపోతున్నాడు... పక్షవాతపు రోగిలా, పనికిమాలిన జోగిలా.

ప్రభుత్వాలు కూడా ఓట్లకోసం అనుచితమైన ఉచితాలు మప్పి ప్రజల్ని తమ మీద ఆధారపడేలా మారుస్తున్నాయిగానీ స్వయంపోషకత్వాన్ని పంచడంలేదు. పెంచడం లేదు. కష్టపడటంలో, కష్టాలను ఎదుర్కోవడంలోనే మనిషి శక్తి పెరుగుతుంది. మనోస్త్థెర్యం రగులుతుంది. సమస్యల్ని అధిగమించే దారులకై అన్వేషణ మొదలవుతుంది. దీనర్థం, కేవలం మనిషి కష్టపడటమే ఉత్తమమని కాదు. సుఖమనీ కాదు. సుఖాన్వేషణ మనిషి బాధ్యతే అని. అవకాశాలివ్వడం వరకే భగవంతుడిదైనా, మన పెద్దలదైనా, ప్రభుత్వాలదైనా బాధ్యత అని. నీరు పోయడమంటే అదే. అంతే.

మనకు పది వేళ్లున్నది రెండు చేతులతో బొక్కమని కాదు, మెక్కమని కాదు, పని చేసుకొమ్మని. పదిమందికి సహాయపడమని. అప్పుడు మనమే దేవుడైపోతాం. ఎవరో రచయిత అన్నట్లు సహాయమే దేవుడు. దేవుడంటే సహాయం. దేవుడు సర్వజ్ఞుడు. మనిషి అన్నం కంటే సోమరితనాన్నే ఎక్కువ అభిలషిస్తాడని ఆయనకు తెలుసు. అందుకే తిన్న అన్నానికి సరిపడా శ్రమ చేయకపోతే అది జీర్ణమయ్యే ప్రసక్తే లేకుండా విధించాడు. అన్నమే కాదు, మనం ఏం పొందినా దానికి తగిన శ్రమనో, ప్రేమనో, త్యాగాన్నో, దానాన్నో మనం పెట్టుబడిగానో, ప్రతిఫలంగానో అందించవలసి ఉంది. ఇది తిరుగులేని వ్యవస్థ. మనిషి అస్తవ్యస్త అవ్యవస్థను అవస్థలు సరిచూసే, సరిచేసే సువ్యవస్థ. నిజమే... నారు పోసినవాడు నీరు పోస్తాడు. కానీ, వ్యవసాయం మనం చేయవలసి ఉంది. అప్పుడే ఫలసాయాన్ని పొందే అధికారం ఉంటుంది.
- చక్కిలం విజయలక్ష్మి 

Thursday 23 May 2013

నృసింహ జయంతి


ప్రహ్లాదుడు జ్ఞాని. అతడి హరి పదాంబుజ ధ్యాన నిష్ఠా గరిష్ఠత గొప్ప భక్తుడిగా నిలబెట్టింది. నడుస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు అన్నివేళలా హరిని స్మరించే ప్రహ్లాదుణ్ని పరిపూర్ణ భక్తి తత్వానికి దృష్టాంతంగా భాగవత పురాణం చిత్రించింది. హరి సర్వాంతర్యామిత్వాన్ని నిరూపించింది ప్రహ్లాదుడే. ప్రహ్లాదుని రక్షించి హిరణ్య కశిపుని దంభాన్ని హరించడానికే హరి స్తంభంలో ఆవిర్భవించాడు. అదే నరసింహావతారం. కొన్ని ఘడియలు మాత్రమే ఈ అవతార విజృంభణ, ఉపసంహరణ. 'కలడో లేడో, అన్న సంశయానికి 'కలడు' అన్న నివృత్తి లభింపజేసిన అవతారమిది.

మనిషిలోని వీర్యత్వం, సింహంలోని వేట లక్షణం కలిసి దుష్టశక్తిపై అద్భుతమైన పరాక్రమాన్ని స్ఫురింపజేసి విజయాన్ని సాధించిన విలక్షణ రూపం నరసింహ రూపం. 

నరసింహావతారంలో మరొక వైశిష్ట్యం శివ, విష్ణుతత్వాల కలయిక. స్థితిని కలిగించే విష్ణువు నరరూపం, లయ కారకుడైన శివుడి ఉగ్రరూపాల సమైక్య స్వరూపం నరసింహస్వామి. 
నృసింహుడు ఆవిర్భవించిన సంధ్యాకాలం శివతాండవ సమయం. హిరణ్య కశిపుని లయం చేసేందుకు, ప్రహ్లాదుని ఉన్నత స్థితుని గావించేందుకు ఆవిర్భవించిన హరిహరరూపంగా కొందరు భావిస్తారు. ఆయన ఉగ్రమూర్తి అయినా ప్రహ్లాదుడి వంటి భక్తులకు ఆకర్షణీయమైన సుందరరూపమే. ఆగ్రహానుగ్రహాలు ఏకకాలంలో ప్రదర్శించిన అద్భుతావతారం. ఒకే సమయంలో నరసింహుడి నేత్రంనుంచి వెలువడిన కోపాగ్ని హిరణ్యకశిపుడి హృదయాన్ని భయకంపితం చేయగా, అదే కంటినుంచి వెలువడిన దయావర్షం ప్రహ్లాదుణ్ని పులకాంకితుని చేసింది. అత్యద్భుతమైన ఆవేశావతారమిది.

నృసింహస్వామిని అపార కరుణామయుడిగా కీర్తించే గుణ సంప్రదాయం ఉంది. స్వామి ఆత్మ సాధకులకు, హృదయోపాసకులకు అత్యంత ప్రీతిపాత్రుడు. నవనారసింహమూర్తిగా అహోబిలంలో, పంచనారసింహమూర్తిగా వేల్పుగొండలో, లక్ష్మీనరసింహమూర్తిగా మంగళగిరిలో, వరాహనరసింహస్వామిగా సింహాచలంలో, లక్ష్మీ నరసింహస్వామిగా యాదగిరిగుట్టలో, ఇంకా అంతర్వేది మొదలైన చోట్ల పూజలందుకొంటున్నాడు. తెలుగువారు నరసింహ భక్తులు. శ్రీ నారసింహుడి నిత్యారాధనవల్ల ఐహికమైన మృగ, వృశ్చిక, జరా, మరణాది భయాలు తొలగి పారలౌకిక సద్గతులు కలుగుతాయని భక్తుల విశ్వాసం. వైశాఖ శుద్ధ చతుర్దశి నృసింహ జయంతి.
- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు 

Wednesday 22 May 2013

వినమ్రత


ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే గొప్పతనమని ప్రకృతి మనకు బోధిస్తోంది. ఆ లక్షణమే వినమ్రత. 
             మృదుమధురమైన ఫలసంపదను ఇచ్చే వృక్షాలు ఫలభారంతో వంగి కనిపిస్తాయి. ప్రాణికోటికి జీవధారను అందించే మేఘాలు భూమాతకు దగ్గరగా ఉన్నట్లు వినయంగా కనిపిస్తూ వర్షధారలు కురిపిస్తున్నాయి. నీరు పల్లాన్ని ఆశ్రయిస్తూ సమస్త జీవులకు అందుబాటులో ఉంటోంది. ఇలా ప్రకృతి మొత్తం వినమ్రతతతో కనిపించి మానవాళికి సేవచేస్తోంది.లోకంలో సత్పురుషులు కూడా వినయవిధేయతలతో, వినమ్రతతో మహోన్నతమైన కార్యాలు పూర్తిచేశారు.
        వాల్మీకి రామాయణంలో అయోధ్యకాండలో శ్రీరాముని వ్యక్తిత్వాన్ని గురించి వాల్మీకి చెబుతూ 'శ్రీరాముడు చక్కని బుద్ధి కలవాడు, ఎవరినైనా తానే ముందుగా పలకరించేవాడు. తాను ఎంత బలవంతుడైనా ఏ మాత్రం బలగర్వంలేని వినయశీలి' అని ప్రస్తుతిస్తాడు. 
         వినమ్రత అంటే అందరిలోనూ భగవంతుని దర్శించే ప్రయత్నమే. వినయ విధేయతలున్నవారే భగవంతుడి కృపకు పాత్రులవుతారు. 
మానవుణ్ని జ్ఞానపథంవైపు నడిపిస్తూ విజ్ఞానకాంతులు నింపే విద్య కూడా వినమ్రత లేకపోతే శోభిల్లదని పురాణాలు చెబుతున్నాయి. 
ప్రహ్లాద చరిత్రలో హిరణ్యకశిపుడు ఏమేమి చదివావో చెప్పమని కొడుకైన ప్రహ్లాదుణ్ని ప్రశ్నిస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు గురువులు తనను బాగా చదివించారనీ చెబుతాడు. ధర్మశాస్త్రాలను చదివానని అంటాడు. ఇంకెన్నో చదివానని చెబుతూనే 'చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!' అని వినమ్రతతో అద్భుతమైన విశ్లేషణ ఇస్తాడు.
        వినమ్రంగా ఉండటం ఆత్మన్యూనతగా భావిస్తారు కొందరు. కానీ విధేయత అనేది ఓ మానవీయమైన సౌజన్య లక్షణం. స్వాభిమానాన్ని పెంచుకున్నప్పుడు మనిషిలో గర్వం, అహంకారం అధికమవుతాయి. మనకంటే సద్గురువులు ఎంతోమంది ఉన్నారని, వారి వద్దనుంచి నేర్చుకోవలసినది చాలా ఉందని తెలుసుకున్నాక- హృదయంలో అహంకార పొరలు కరిగి వినమ్రతాభావం ప్రవేశిస్తుంది. 
     మహాభారతంలో మానవ సంబంధాలకు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన చిన్న కథలెన్నో ఉన్నాయి. అవి అద్భుతమైన సందేశాలు అందిస్తాయి. 
ఒకసారి సముద్రుడు నదులతో సమావేశమై ఒక ప్రశ్న అడిగాడు. 'నదులారా! మీరు వరదలతో వేగంగా ప్రవహించేటప్పుడు, కొండలపైనుంచి దూకేటప్పుడు పెద్ద పెద్ద చెట్లను పడగొట్టేస్తారు. వూళ్ళకు ఖీ000ళ్ళు ముంచెత్తుతారు. కాని అల్పమైన తుంగ మొక్కలు మాత్రం చెక్కుచెదరకుండా ఉంటున్నాయి. వాటిని మీరెందుకు కదిలించలేకపోతున్నారు?' అని అడుగుతాడు.
           అప్పుడు అన్ని నదుల పక్షాన గంగానది సముద్రుడితో 'మేము వేగంగా ప్రవహించేటప్పుడు కొండలు, చెట్లు అహంకారంతో మాకు అడ్డుగా నిలుస్తాయి. అందువల్ల మా బలాన్ని చూపించి వాటిని పడగొట్టేస్తాం. ప్రబ్బలి, తుంగవంటి మొక్కలు మా రాకకు స్వాగతం చెబుతున్నట్లు వినయంతో తలవంచుతాయి. కనుక మేము వాటిమీదుగా ప్రవహించి నీ దగ్గరకు చేరుకుంటాం. తరవాత అవి తలలు ఎత్తి మునుపటిలా బతుకుతాయి. అంతే తప్ప వాటిమీద మాకు ప్రత్యేకంగా ప్రేమ ఏమీ లేదు' అని చెబుతుంది.
           శత్రువు బలవంతుడైతే బలహీనుడు ఏ ఉపాయంతో ఆపదనుంచి తప్పించుకోవాలో వివరిస్తూ భీష్ముడు ధర్మరాజుకు ఈ కథ చెబుతాడు. ఈ విధంగా వినమ్రతలోని గొప్పతనాన్ని లోకానికి వెల్లడిస్తాడు. 
వినమ్రత మానవ జీవితానికి ఆభరణం వంటిది. దానివల్ల మనిషి గుణాలు మరింతగా పరిమళిస్తాయి. విద్వాంసుడి పాండిత్యం, ధనవంతుడి ధనం, బలవంతుడి బలం, గుణవంతుడి నమ్రత అనే గుణాలు లోకహితం కోసం వినియోగించడం మంచిదని నీతికోవిదులు చెబుతున్నారు. 
వినమ్రత మనిషి జీవితాన్ని మంచిమార్గం వైపు నడిపిస్తుంది. విలువలతో కూడిన జీవనమార్గాన్ని చూపిస్తుంది. అందుకే ఉత్తముడైన మనిషి ఎవరినీ ఎగతాళి చేయకూడదు. అసభ్యకరంగా ఏనాడూ ప్రవర్తించకూడదు. పెద్దలను, గురువులను గౌరవించాలి. ఏ మనిషైనా ఎంత ఒదిగి ఉంటే అంత ఎదుగుతాడు.
         పోల్చి చూసుకోవడం, పోటీపడటం- ఈ రెండూ ఈర్ష్యాసూయలకు సంబంధించినవి. వీటివల్ల మనిషి ఎదగలేడు. మంచి ఆలోచనలతో ముందుకు సాగి మనమేమిటో మనం గ్రహించి ఉన్నతంగా అభివృద్ధి చెందడానికి ప్రయత్నించాలి. 
సభ్యసమాజం మనిషి గుణశీలాలకు, వినయవిధేయతలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే వినమ్రతను ఓ సంపదగా భావించి ఏ మనిషైనా ముందుకు సాగితే, ఎల్లప్పుడూ అతడే విజేత

                                                                    - విశ్వనాథ రమ


Tuesday 21 May 2013

అన్నవర వైభవం

సత్య శివ సుందర స్వరూపుడైన పరమాత్మకు ఎన్నో రూపాలు. మరెన్నో నామధేయాలు. ప్రతి రూపానికీ ప్రత్యేకత, ప్రతి అవతారానికి విశిష్టత ఉంటాయి. ఆ సంవిధానంలోనిదే శ్రీసత్యనారాయణస్వామి స్వరూపం. హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మకుడై, శివ సహిత అనంతలక్ష్మి సత్యవతీదేవి సమేతుడై వీర వెంకట సత్యనారాయణస్వామి అన్నవరం దివ్యక్షేత్రాన కొలువై ఉన్నాడు. రాజమండ్రి సమీపంలో రత్నగిరిపై, పంపానది తీరాన స్వయం వ్యక్తంగా సత్యదేవుడు విలసిల్లుతూ భక్తుల్ని అనుగ్రహిస్తాడు. తెలుగువారి ఇంటింటి దైవమైన సత్యనారాయణుడు వ్రతాధిష్ఠాన దైవం. సత్యదేవుడి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే సకల అభీష్టాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. స్కాంద పురాణం రేవా ఖండంలో ఈ క్షేత్ర వైభవం, సత్యనారాయణుడి లీలా ప్రాభవం, వ్రత వైశిష్ట్యాలు సవివరంగా ఉన్నాయి.

రత్నగిరిపై ఉన్న అంకుడు చెట్టు పొదలో తాను శిలారూపంలో వ్యక్తమైనట్టుగా కర్ణంపూడి సంస్థానాధీశ్వరుడు రాజా ఇనుగంటి వెంకటరామరాయణం స్వప్నంలో స్వామి వెల్లడించినట్టు స్థలపురాణం. శ్రీఖరనామ సంవత్సరం శ్రావణ శుక్ల విదియనాడు మఖా నక్షత్రంలో గురువారం రోజు (1891 సంవత్సరం ఆగస్ట్‌ ఆరున) సత్యదేవుడు ఆవిష్కారమయ్యాడని ప్రతీతి. వందేళ్ల చరిత్రతోనే వెయ్యేళ్ల ప్రాశస్త్యాన్ని పొందిన ఈ క్షేత్రం అనిన వరాల్ని నెరవేర్చే అన్నవరంగా, ఆపన్నుల దివ్యధామంగా పేర్కొంటారు. ఈ పవిత్ర సన్నిధానం ఆవిర్భావానికి సంబంధించి ఎన్నో పురాణగాథలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి.

భద్రుడు, రత్నాకరులనే భక్తులు విష్ణువు కోసం తపస్సు చేయగా శ్రీహరి అనుగ్రహంతో భద్రుడు భద్రాద్రిగా, రత్నాకరుడు రత్నగిరిగా రూపు దాల్చారని చెబుతారు. ఆ రత్నగిరిపైనే సత్యదేవుడు త్రిమూర్తుల సమన్వితంగా విరాజిల్లుతున్నాడు.మరో కథనం ప్రకారం, మేరు పర్వత రాకుమారుడైన రత్నగిరి, మునికన్య పంప పరస్పరం ప్రేమించుకున్నారు. వారిరువురు ప్రణయ భావనలతో వనవిహారం చేస్తుండగా, పంప తండ్రి గమనిస్తాడు. ఆగ్రహంతో ఇద్దరినీ శపిస్తాడు. తమ పవిత్ర ప్రేమను వివరిస్తూ ఇద్దరూ ఆ ముని పాదాలపైపడి శరణు వేడతారు. దాంతో పర్వత రూపంలో రత్నగిరి, ఆ గిరి సమీపంలోనే పావన జలరాశిగా పంప కొలువుతీరతారని ఆ ముని ఆశీర్వదిస్తాడు. శ్రీమన్నారాయణుడు సత్యదేవుడిగా రత్నగిరిపై వేంచేస్తాడనీ, పంప జలరాశులతో ఆ స్వామికి సేవ చేసుకునే భాగ్యం కలుగుతుందని వివరించాడంటారు. నారద మహాముని ఈ రత్నగిరిపై కొంతకాలం తపమాచరించాడనీ, ఈ రత్నగిరి గర్భంలో శ్రీమన్నారాయణ మహామంత్ర ఫలితాన్ని నిక్షిప్తం చేశాడని చెబుతారు.

ఇటీవలే అన్నవరం దేవస్థానాన్ని జీర్ణోద్ధరణ చేశారు. 1893 సంవత్సరంలో బదరీనాథ్‌ క్షేత్రంనుంచి తీసుకొచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహా వైకుంఠ నారాయణ యంత్రాన్ని ఆలయం దిగువన ప్రతిష్ఠించారు. ఇది దివ్య యంత్రమనీ, 24 వృత్తాలతో ఉన్న ఈ యంత్రంలో అనేక బీజాక్షరాలు, తొమ్మిది యంత్ర గాయత్రీమంత్రాలున్నాయని వేద పండితులు పేర్కొంటారు. గర్భాలయంలో అభీష్ట వరదాయకుడైన సత్యనారాయణుడికి ఎడమవైపున వాణీరమాంబా స్వరూపిణి అయిన శ్రీ అనంతలక్ష్మీ సత్యవతిదేవి, కుడివైపున శివుడు కనిపిస్తారు. యంత్రరూపాన బ్రహ్మ ప్రతిష్ఠ జరిగింది.

అన్నవర క్షేత్రంలో నిత్యోత్సవాల నుంచి బ్రహ్మోత్సవాల వరకు స్మార్త ఆగమ విధాన పూర్వకంగా నిర్వహిస్తారు. స్వామివారికి ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకు పంచాహ్నికంగా బ్రహ్మోత్సవాల్ని జరుపుతారు. ఏకాదశినాడు స్వామివారి కల్యాణం, రజత గరుడ వాహనంపై వూరేగింపు, ద్వాదశినాడు ప్రథమ హోమం, రావణ వాహనంపై వూరేగింపు, త్రయోదశినాడు కల్యాణ సదస్యం నిర్వహిస్తారు. చతుర్దశినాడు స్వామివారి విహారయాత్ర, పూర్ణిమనాడు చక్రతీర్థం, నాకబలి, బహుళ పాడ్యమినాడు పుష్పయాగం నేత్రపర్వంగా సాగుతుంది. కార్తిక శుద్ధ ద్వాదశినాడు స్వామివారి తెప్పోత్సవం కడు కమనీయంగా శోభిల్లుతుంది. సత్యదేవుడి వ్రతకథల్లో స్వామివారి ప్రసాదానికి ప్రత్యేక స్థానం ఉంది. గోధుమనూక, ఆవునెయ్యి, పంచదార, సుగంధ ద్రవ్యాలతో కలిపి తయారుచేసే అన్నవర ప్రసాదం మహిమాన్వితమైనదని భక్తుల విశ్వాసం. 

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే లోగిలిలో కొలువు తీరిన అరుదైన, అద్వితీయ సన్నిధి... భక్తుల పాలిట దివ్యపెన్నిధి- అన్నవరం క్షేత్రం.

                                                              - డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌

Monday 20 May 2013

వికాస దర్శనం


ఈ సృష్టిలో మానవ జన్మకున్న విశిష్టత మరే ప్రాణికీ లేదు. పెక్కు సందర్భాల్లో, ఎన్నో పరిమితులకు లోబడి, సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కరించుకోలేక నిస్సహాయంగా మిగిలిపోయే ఇతర జీవులకు భిన్నంగా, ఆలోచనా సామర్థ్యంతో క్లిష్టతరమైన పరిస్థితులను సైతం ఎదుర్కొని నిరంతర వికాస ప్రక్రియకు ప్రాణం పోసే శక్తిగా పుట్టిన మనిషి మిక్కిలి అదృష్టవంతుడు. అందుకే మానవ జన్మ సర్వోన్నతమైనదని శాస్త్రాలు నొక్కి వక్కాణిస్తుంటాయి. విశిష్టత అనేది తలవని తలంపుగా దానంతట అదే వచ్చిపడేది కాదు. మానవ ఔన్నత్యాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడాన్ని మనిషి ఓ దీక్షలా చేపట్టాలి. తప్పదు. అందులోని మొదటి అంశంగా మనిషిగా పుట్టే అవకాశాన్నిచ్చిన సృష్టికర్తకు భక్తితో ప్రణమిల్లాలి. మానవ ఔన్నత్యానికి మరిన్ని మెరుగులు దిద్దేందుకు నిబద్ధతతో తనవంతు బాధ్యతను నిర్వహిస్తానని ప్రతినపూనాలి.
మనిషి ప్రతిభాశాలి. ధీరోదాత్తుడు. అతడు తన ఆలోచన, వివేచన శక్తితో, నిర్ణయ సామర్థ్యంతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించగలడు. తద్వారా సాధ్యమైన ఫలితాలతో జీవన విధానాన్ని సులభతరమూ చేయగలడు. అందుచేతే జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకునే సమర్థుడిగా మనిషి పేరుగాంచాడు.

ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, డబ్బు, ఆస్తి, మానవ సంబంధాలు వంటి అనేకానేక అంశాలకు సంబంధించి అవాంతరాలు, సమస్యలు ఎదురైనప్పుడు చాలామంది మనుషులు ఒక్కసారిగా నిరుత్సాహానికి గురవుతారు. అది సహజమే అయినా అలాంటి సందర్భాల్లో మానవ ఔన్నత్యాన్ని గుర్తించక మరింతగా నిరాశ, నిస్పృహలకు గురై కుంగిపోయిన జీవితాన్ని కొనసాగించడం మాత్రం నిస్సందేహంగా ఆక్షేపణీయమే! నిరాశా నిస్పృహలు ఆలోచనలను నిర్వీర్యం చేస్తాయి. తద్వారా నిర్ణయ సామర్థ్యం దెబ్బతింటుంది. తదనంతరం వచ్చే ఫలితాలు మనిషి సామర్థ్యాన్ని వెక్కిరిస్తూ అతడి ఉనికికే సవాళ్లు విసరుతాయి. అలాంటి సందర్భాల్లోనే మనిషి వినాశకర మార్గాల్లో పయనిస్తాడు. జీవిత ఔన్నత్యాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తాడు. ఎట్టి కష్టతర పరిస్థితుల్లోనూ మనిషి అలా చేయడం తగదు గాక తగదు.

సమస్యలను పరిష్కరించడంలోనే మనిషి గొప్పదనం బహిర్గతమవుతుంది. అందుచేత కష్టాలు, సవాళ్లు, సమస్యలు ఎదురైనప్పుడు జీవిత ఔన్నత్యాన్ని ఇనుమడింపజేయడం కోసం, వ్యక్తిగత సామర్థ్యాన్ని రుజువు చేసుకోవడం కోసం, మనిషి నాలుగు అంశాల పట్ల దృష్టి సారించి అప్రమత్తంగా, బాధ్యతగా మెలగాలి.

ఒకటి. భక్తితో, అంకితభావంతో భగవంతుడి సృష్టి స్వభావాన్ని విశ్లేషిస్తూ వ్యక్తిగత సామర్థ్యాలను గుర్తించాలి. స్వాధ్యాయియై అభ్యసనం చేయాలి. ప్రతి ఉనికికీ ఓ విశిష్టత ఉన్న సత్యాన్ని అవగతం చేసుకోవాలి. పంచ భూతాలనే తీసుకుందాం. భూమి తనపై పడిన ఎలాంటి మలినాన్నయినా ఓర్పుతో సహించి దాన్ని ఎరువుగా మార్చి వృక్షాలకు అందిస్తుంది. జీర్ణం కాని పదార్థాలను తనలో దాచుకొని పరిశోధకులు జ్ఞానాన్ని విస్తృత పరచడంలో దోహదపడుతుంది. అగ్ని ఊర్ధ్వముఖమై వెలుగుతూ లోకానికి వెలుతురునిస్తుంది. తనను స్పృశించిన దాన్ని నిర్మల విభూతిగా మారుస్తూ తాను నిత్య శుచియై ఉంటుంది. నీరు స్తబ్ధంగా నిలిస్తే చెడిపోవడం ఖాయమనే వాస్తవాన్ని తెలియజేస్తూ ప్రగతిశీలంగా ముందుకు పయనిస్తూ ఉంటుంది. తనను తాకిన దాన్ని శుభ్రం చేస్తూ, ప్రాణుల దాహార్తి తీరుస్తూ జీవితాన్ని అందిస్తుంది. వాయువు నిరంతరం సంచరిస్తూ దుర్గంధాన్ని హరించి సుగంధాన్ని వెదజల్లుతుంది. శ్రమజీవులను చల్లగా స్పృశించి వారిలో ఉల్లాసాన్ని నింపుతుంది, ప్రాణశక్తినిస్తుంది. ఆకాశం గర్జనలను సైతం మింగేసి నిశ్శబ్దంగా, నిర్మలంగా ఉంటుంది. సంకుచితంగా ఉండక విశాలంగా విస్తరించి అందరికీ అవకాశాలు కల్పిస్తుంది. అంతదాకా ఎందుకు? చిరుగాలి వీస్తే చాలు, గడ్డిమొక్క తలొంచుకొని వణికిపోతుంది. అది తలచుకున్నప్పుడు మాత్రం కఠినమైన భూమిని సైతం చీల్చుకుంటూ వచ్చి తన ఉనికిని చాటుకుంటుంది. కాబట్టి సమస్యలెదురైనప్పుడు మనిషి వెరవక తనలో నిక్షిప్తమై ఉన్న ధీశక్తిని గుర్తించాలి. బేషరతుగా, హృదయపూర్వకంగా సమస్యలకు స్వాగతం పలకాలి. సముద్రమంత సహనంతో విశ్లేషణాత్మకంగా, వికాసవంతంగా ఆలోచించి సముచితమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. మొక్కవోని దీక్షతో నిర్ణయాన్ని ఆచరణలో పెట్టి వచ్చిన ఫలితాలకు బాధ్యత వహించాలి. అవసరమైతే మెరుగైన నిర్ణయంతో మళ్ళీ పూనుకోవాలి. సమస్యల్లో చిక్కుకున్న ఇతరులను నిర్దాక్షిణ్యంగా వదిలేయక చొరవతో వెన్నుతట్టి వారు వికాస మార్గంలో పయనించేలా శ్రద్ధ తీసుకోవాలి. సేవా దృక్పథాన్ని పుణికి పుచ్చుకొని తోటివారి, ఇతర ప్రాణుల జీవితాల్లో వెలుగు నింపేలా ప్రవర్తించాలి. 
ఈ అంశాలను ప్రతి మనిషీ మనసా, వాచా, కర్మణా పాటిస్తే జీవితం పరమ అర్థవంతమూ, తేజోవంతమూ అవుతుంది. ఫలితంగా వ్యక్తిగత జీవితం వికసిస్తుంది.

                                                               - వంగీపురం శ్రీనివాసాచారి 

అనుసరణీయం  ఉపనిషత్తులనే ఉద్యానవనం నుంచి ఆధ్యాత్మిక సత్యాలనే పుష్పాలను ఏర్చి కూర్చిన మాలయే భగవద్గీత అని ఉద్ఘాటించారు స్వామి వివేకనంద. అందుకే గీతను ప్రపంచ మానవాళికంతటికీ పెన్నిధి అంటారు. గీతలో భక్తియోగం, ధ్యానయోగం, జ్ఞానయోగం ఉన్నాయి. మనలోనూ భక్తిజ్ఞానాలు ఉన్నాయి. మనం ధ్యానం చేస్తాం. దైనందిన జీవితంలో ఎన్నో పనులు చేస్తుంటాం. ఈ కర్మలు (పనులు) చేయనిదే మన జీవితాలు ముందుకు సాగవు. మనకోసం, మన కుటుంబం కోసం పనులుచేస్తూ బతుకుతాం. జ్ఞానశూన్యమైన మానవేతర ప్రాణికోటీ అలాగే బతుకుతోంది. ఇలా బతకడం చెప్పుకోదగినదీ కాదు, గొప్పదీ కాదు.

కొంచెం నిదానంగా ఆలోచిస్తే- మన జీవితాన్ని మహత్తరంగా మలచుకోవడం మన చేతుల్లోనే, మన చేతల్లోనే ఉందని అవగతమవుతుంది. అందుకోసం మన భక్తిజ్ఞానాలను, ధ్యానకర్మలను యోగాలుగా మలచుకోవాలి.  
ఏ పనీ పాటూ లేకుండా, ఏ వ్యవహారమూ చేయకుండా మానవుడు వూరకనే ఉండడు. అలాగైతే మనిషి సోమరిగా, జడప్రాయుడిగా తయారవుతాడు. అప్పుడతడి జీవితం నిరర్థకమవుతుంది. అందుచేత, మన భావాల్ని పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అప్పుడే మనం చేసేపని (కర్మ) మహాయజ్ఞంగా రూపొందుతుంది. దీనినే కర్మల (పనుల) ద్వారా పరమాత్మను సేవించడమంటారు, అర్చించడమంటారు. ఇందువల్ల ముక్తి లభిస్తుంది. కారణం? మన ఈ పనులవల్ల అన్ని ప్రాణుల్లోనూ ఉన్న పరమాత్మ సంతోషిస్తాడు కాబట్టి. పరహిత భావనతో మనం పనులు చేస్తే అందరి అంతఃకరణల్లోనూ అంతర్యామిగా వెలుగొందే ఆ పరమాత్మ ఆనందిస్తాడని అర్థం. లోకంలో సుఖశాంతులు నెలకొనాలని, ప్రజలంతా హాయిగా, ఆనందంగా ఉండాలనే కదా- తపోధనులైన మునీశ్వరులు ఆనాడు యజ్ఞాలు, క్రతువులు చేశారు... నేడు స్వాములు, ఆచార్యులు మొదలైన మనీషులు యజ్ఞయాగాదులు జరుపుతున్నారు. భగవంతుణ్ని ధ్యానిస్తూ, స్మరిస్తూ మనవృత్తిని (పనిని లేక కర్మను) ఫలాపేక్ష లేకుండా నిస్వార్థబుద్ధితో చేస్తే, అది కర్మయోగంగా మారుతుంది. ఇలా మన పనుల్లో మానవోచితమైన పరహిత భావన సైతం ఉన్నందువల్ల, భగవంతుడికి సన్నిహితులం, అయన కృపకు పాత్రులం కాగలుగుతాం. అందుకే కర్మయోగం దైవసన్నిధికి దగ్గరిదారి.

కుటుంబంలో, సమాజంలో భాగమైనవ్యక్తి సొంత పనుల్లో నిమగ్నుడై ఉంటూనే భగవంతుని స్మరిస్తూ ఉండాలి. కర్మ ఫలితాన్ని ఆ అంతర్యామికే సమర్పించుకోవాలి. అలాంటప్పుడు ఆ వ్యక్తికీ సమాధి నిష్ఠలో ఉండే యోగికి లభించే ఫలితమే లభిస్తుంది. అంటే మన శరీరం ప్రవృత్తి మార్గంలో ఉన్నా, మనసు నివృత్తి మార్గంలో ఉంటే- అది కర్మయోగం అనిపించుకుంటుంది. అంటే ఆ వ్యక్తికి తానుచేసే పనివల్ల లభించే లాభనష్టాలతో సంబంధం ఉండదన్నమాట. దీనినే తామరాకుమీది నీటిబొట్టు చందంగా ఉండటమని అంటారు. జనక చక్రవర్తి రాజయోగం ఇదే.

భగవంతుడి మ్రోల మన మనసు ఆవేశపూరితమై భక్తి పరవశమై ఉంటుంది. పూజ, ప్రార్థన, సంకీర్తన, నామస్మరణ, ధ్యానం, వందనాది తొమ్మిది విధాలైన భక్తి ప్రపత్తుల్ని అనుసరిస్తాం. ఈ భక్తిమార్గంలో పయనించి ముక్తిని పొందవచ్చు. ఇది భక్తియోగం. కొంతమంది ధ్యానంపై ఆసక్తి కలిగి ఉంటారు. బాహ్యమైన లోకవ్యవహారాలపై వీరికి ఆసక్తి ఉండదు. మనసును లేదా చిత్తాన్ని అంతర్ముఖంలోనే ఉంచుతారు. దీనినే ధ్యాన (ఆత్మసంయమ) యోగమని అంటారు. మరికొంతమంది వివేచనాపరులై ఉంటారు. విచారణ చేస్తూ ఉంటారు. ఈ జ్ఞానులు సత్యాసత్యాలను, ఆత్మపరమాత్మలను గురించి వివేచిస్తారు. దీన్ని జ్ఞానయోగమంటారు. ఫలితం ఆశించకుండా నిష్కామంగా పనులు చేస్తే, అది కర్మయోగం అవుతుంది. భక్తి, జ్ఞాన, ధ్యాన యోగాదుల కన్నా కర్మయోగమే సామాన్యలకు సైతం ఆచరణ యోగ్యం, అనుసరణీయం.
                                                           - కాలిపు వీరభద్రుడు

భక్తుడు


భగవంతుడి పట్ల ప్రదర్శించే ప్రేమను భక్తి అంటాం. భగవంతుని హృదయపూర్వకంగా ప్రేమించాలనుకొనే ఆశ సాకారం కానపుడు భక్తుణ్ని నిరుత్సాహం ఆవహిస్తుంది. ఎదుటి వ్యక్తిని పవిత్రంగా ప్రేమించగలిగే హృదయం ఉంటే చాలు. సభక్తికంగా, సంతృప్తికరంగా భగవంతుని కూడా ప్రేమించడంలో కృతకృత్యులం కావచ్చు. విషయ వస్తుజాలంపై ఉండే ప్రేమను పవిత్రీకరించి భగవంతుడి పైకి మరల్చినప్పుడు ఆయనకు ఆ ప్రేమ ప్రీతిపాత్రమవుతుంది. ఆయన అనుగ్రహ భాగ్యం అమృతధారగా తప్పక చేతికందుతుంది.
        లోకాన్నంతా భగవన్మయంగా భావించి ప్రేమను పంచగలిగే వ్యక్తిత్వాన్ని నిజభక్తుడు సాధన చేస్తాడు. దైవాన్నే తోడునీడగా భావిస్తాడు. తల్లిదండ్రులు, సోదరీసోదరులు, స్నేహితులు, సన్నిహితులు- ఇలా అందరూ భగవంతుడి ప్రతిరూపాలే అన్న స్పృహ ఇరుగుపొరుగువారినీ అదే స్ఫూర్తితో దర్శించగల అవకాశం కల్పిస్తుంది. ఆ చేతన భక్తుణ్ని దైవానికి దగ్గర చేస్తుంది.

కొందరు సాధకుల లక్ష్యం స్వర్గం కావచ్చు. మరికొందరు మోక్షాన్ని కోరుకోవచ్చు. లౌకిక సుఖాలను స్వర్గంగా, లౌకిక బంధనాల నుంచి విముక్తిని మోక్షంగా భావించడం సాధారణంగా జరిగే విషయం. పారమార్థిక పరిభాషలోని స్వర్గమోక్షాలు లభించాలంటే వాటికోసం అవిరళ కృషి, అచంచల విశ్వాసం, అవిశ్రాంత సాధన సాగించవలసి ఉంటుంది. మరణానంతరం లభించగల స్వర్గ సుఖాలు, మోక్షంపై ఆకాంక్షవల్ల అవి ప్రసాదించగల దైవంపై విశ్వాసం బలోపేతమవుతుంది. విశ్వాసం ప్రవర్ధమానమైతే శాంతి, ఆనందాలు క్రమక్రమంగా చేరువవుతాయి. నిజానికి శాంతి, ఆనందాలే స్వర్గమోక్ష ధామాలకు స్వాగత తోరణాలు.

ప్రతి సాధకుడికీ ఆత్మోన్నతి లక్ష్యం కావాలి. ఆ లక్ష్యం ఆధ్యాత్మిక పరిణతి, వికాసానికి దోహదకారి అవుతుంది. భక్తి వికసించిన మహనీయుడికి భగవంతుడే తోడు-నీడ, సర్వస్వం అవుతాడు. జీవన నౌకను ఒడుదొడుకులు లేకుండా ముందుకు సాగించమని భక్తుడు తన దైవానికి నివేదించుకొనే భాష మంత్ర సదృశమవుతుంది. ప్రేమాస్పదులు శాశ్వతంగా ఎడమైనప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. ఆ బాధ ముల్త్లె హృదయాన్ని గుచ్చుతుంది. భగద్విశ్వాసమనే కవచం హృదయానికి తొడిగినప్పుడు సాధకుణ్ని ఏ బాధా బాధించదు. అన్నీ దైవమే అని నమ్మిన సాధకుడు భగవంతుడి సర్వవ్యాపకత్వాన్ని, సర్వకర్తృత్వాన్నీ విశ్వసించినట్టే! ముక్కుతాడు వేసి పగ్గాలు పట్టుకున్న రైతు కనుసన్నల్లో సేద్యపు గిత్తలు నడచినట్లు, స్వీయనియమాల నియంత్రణా వలయంలో భక్తియాత్ర సాగించినప్పుడు- భక్తుడు గమ్యం నుంచి వైదొలగే ప్రమాదం ఉండదు.

రక్షించే దైవం తప్పులను సరిదిద్దే బాధ్యతనూ తీసుకుంటాడు. దైవం దుష్టశిక్షణే కాక భక్తులను సన్మార్గంలో నడిపించడానికి వలసిన దండనా చేస్తాడు. ఆ ప్రభావంగా భక్తుడి హృదయం వ్యాకులపడవచ్చు. శరీరం గాయపడవచ్చు. మనసు సంకట పడవచ్చు. అంతా తన మంచికే అని భక్తుడు త్రికరణ శుద్ధిగా విశ్వసించినప్పుడు అతడికి మేలే జరుగుతుంది.

కనిపించేవారిపై చూపే ప్రేమలో కాపట్యం ఉండవచ్చు. కాలుష్యం చోటు చేసుకోవచ్చు. నిరాకారుడిపై ప్రేమ నిర్మలమైతేనే అది స్వీకరణ యోగ్యమవుతుంది. దైవంపై భక్తికి ఎల్లలుండవు. హృదయాంతర్గతమైన భక్తివల్ల శంకరుడు కింకరుడవుతాడు. పైకి మిసమిసలాడుతూ కనిపించే మేడిపండు లోపల పురుగులతో నిండి ఉన్నట్లు ఈ ప్రపంచం పైకి అందంగా కనిపిస్తూ ఆంతరంగిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. అంతర్గత క్షోభతో కునారిల్లే జగత్తును రక్షించగల సర్వసమర్థుడు దైవమే. భక్తుడి ఆ భావనే భగవంతుడిపై పొంగులువారే భక్తికి ప్రేరణ అవుతుంది. దేహధారులందరూ భగవత్‌ స్వరూపులే అన్న మహాన్నత భావన భక్తుణ్ని సర్వోన్నతంగా నిలిపి దైవసమానుణ్ని చేస్తుంది.
                                                         - గోపాలుని రఘుపతిరావు

విడుదల


విడుదల అంటే- విముక్తి, మోక్షం, స్వేచ్ఛ. జైలు నుంచి ఖైదీ బయటికి వచ్చి స్వేచ్ఛగా జీవించడం. ఆధ్యాత్మికపరంగా జీవుడు దేహబంధం నుంచి, సంసారబంధం నుంచి విడుదల కావడం. బంధాల నుంచి తొలగాలనే దాన్నే 'ముముక్షత్వం' అంటారు. ఇది మోక్షానికి దారి.
            ప్రకృతిలోని సమస్త జీవరాశి సృష్టి ప్రసాదించిన మేరకు సహజత్వాన్ని వీడకుండా ఆహార సంపాదన, ఆత్మరక్షణ, సంతానోత్పత్తి జరుపుకొంటాయి. వాటికదే ప్రకృతి ధర్మం.

అన్ని జీవరాశుల్లోను ఉన్నతమైన సంస్కారవంతమైన జీవి నరుడు. ప్రకృతి ప్రసాదించిన చిత్తం, మనసు, బుద్ధి, జ్ఞానం, అహంకారం, విచక్షణ కలిగిన ఉత్కృష్టమైన జీవి. వీటితోపాటు నవ్వు, రాగద్వేషాలు, కామ-క్రోధాలు, ఈర్ష్య అసూయలు, జాలి, సిగ్గు, అనుమానం, అసహ్యం, కులం, శీలం, జాతి అనే బంధాలను; భక్తి, రక్తి, వైరాగ్యం, ముక్తి అనే పారమార్థిక సంపదనూ సృష్టికర్త ప్రసాదించాడు. ఇంతటి ధన్యజీవి అయిన మానవుడు నేడు ఎంతవరకు జీవన్ముక్తుడు కాగలగుతున్నాడన్నది ప్రశ్నార్థకమే!

గతంలో యోగులు, రుషులు, వేదాంతులు, పురాణ పురుషులు, సత్య, ధర్మాల్ని పాటిస్తూ ఎరుకతో మరుజన్మ లేని స్థితిని పొందినట్లు మన శాస్త్ర పురాణ ఇతిహాసాలు ఘోషిస్తున్నాయి. తమ జ్ఞానసంపదతో ఇంద్రియ నిగ్రహంతో, చిత్త వృత్తుల్ని నిరోధిస్తూ, అరిషడ్వర్గాల్ని జయించి పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సక్రమరీతిలో సాధించి చరితార్థులైనారు.

ప్రకృతిలో మార్పు సహజం. దానికి ఈ కలికాలం కూడా మినహాయింపు కాదు. జనాభా పెరిగింది. ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోయింది. పోటీతత్వం ఇంతలంతలై జీవన సమస్య భారమైంది. నేటి మానవుడు భౌతికపరంగా, విజ్ఞానపరంగా అభివృద్ధి సాధించినప్పటికీ- మానసిక శాంతి లేక కొట్టుమిట్టాడుతున్నాడు. ఒంటరిగా, కంటినిండా నిద్రలేక, సంపాదనే ధ్యేయంగా అహరహం శ్రమిస్తూ యాంత్రిక జీవనం సాగిస్తున్నాడు.

ఈ సుడిగుండాల నుంచి మానవుడు బయటపడి మానసిక స్వేచ్ఛతో తిరగలేడా? అంటే తప్పక విడుదల కాగలడు! ముందుగా మనిషి సంపాదన తప్పు కాదని, సంసారం తన ధర్మమని, అతి మాత్రం కూడదని, ఇవేవీ శాశ్వతం కాదని, పుట్టిన ప్రతిజీవీ గిట్టక తప్పదని మామూలు లోకజ్ఞానంతోనైనా గ్రహించాలి. అయితే వచ్చిన చిక్కల్లా అతిగా సంసారబంధాలు పెంచుకోవడం, తానెప్పటికీ శాశ్వతుడననుకోవడం- అనుకొని అక్రమాలు చేసి కూడబెట్టడం కూడదని తెలుసుకోవాలి. ఈ ఇరుక్కున్న బంధాల నుంచి మానసికంగా బయటపడటమే విడుదల, ముక్తి, మోక్షం.

భవబంధనాల నుంచి విడుదల కావడం అంత తేలికైన పనికాకపోయినా అసాధ్యం మాత్రం కాదు. 'గృహాశ్రమ' జీవనంలో ఉంటూనే, తామరాకుపై నీటిబొట్టులా, అంటీ అంటని రీతిలో విరాగత్వం పొందవచ్చు. అక్కరలేనివి కూడబెట్టే పద్ధతికి స్వస్తి పలికి ఆత్మతృప్తితో జీవించడం ఉత్తమం. గీతాచార్యుడు సెలవిచ్చిన భక్తి, జ్ఞాన, కర్మ, యోగమార్గాలు ముక్తికి సోపానాలు. అందులో యోగమార్గమైన ధ్యానం ద్వారా చిత్తవృత్తుల్ని నిరోధించి, ఇంద్రియ ప్రేరేపితమైన కోర్కెల్ని అదుపుచేస్తే ఈ బంధాలనుంచి విడుదలై మానసిక స్వేచ్ఛతో ఇక్కడే స్వర్గసౌఖ్యాలు పొందవచ్చు. నరకం, స్వర్గం రెండూ మన బుర్రలోనివే. సాధన ద్వారా అరిషడ్వర్గాలను జయించి మానవులంతా స్వేచ్ఛాజీవులై బ్రహ్మనంద భరితులు కావాలి. తద్వారా మానవతకు మహోన్నత స్థానం కల్పించాలని ఆశిద్దాం.
                                                                         - బి.వి.బంగార్రాజు

మరణం అంటే ఏమిటి?

'ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఆశ్చర్యకరమైనదేది?' అన్నది యక్షుడి ప్రశ్న. 'నిత్యం అనేకమంది తన కళ్ళముందే చనిపోతున్నా తాను మాత్రం చిరంజీవినని అనుకుంటూంటాడు మనిషి. ఇంతకన్న ఆశ్చర్యం ఇంకేముంటుంది?' బదులిస్తాడు యుధిష్ఠిరుడు.
         ప్రతి మనిషికీ మరణం తప్పదు. అయినా తాను మాత్రం శాశ్వతంగా బతకబోతున్నట్టు ప్రవర్తిస్తుంటాడు. తనకేదో రోజున హఠాత్తుగా రాబోయే మరణం గురించి తెలుసుకోవటానికి మనిషికి క్షణం కూడా తీరికలేదు.
                  మనిషికి తన పుట్టుక గురించి తెలుసు. కాని, మరణం గురించి బొత్తిగా తెలియదు. దాన్నించి తప్పించుకోవటం అసంభవమనీ తలంచడు. చనిపోయాక ఏమవుతుంది? మరణం తరవాత మనిషి ఎక్కడికి వెడతాడు? అసలు మానవ జన్మకు ప్రయోజనమేమిటి? ఆత్మ అన్నది ఉన్నదా? శరీరాన్ని వదిలేశాక ఆత్మ ఎక్కడికి వెడుతుంది?
        జీవితం మీద జిజ్ఞాస ఉన్న ప్రతి మనిషికీ ఎదురయ్యే ప్రశ్నలివి. జీవించటంలో మునిగిపోయి ఈ ప్రశ్నలకు జవాబుల గురించి అన్వేషించడు. చివరికి ప్రాణాంతకమైన జబ్బుచేసినా, ఆఖరి క్షణాలు ఆసన్నమవుతున్నా- ఇంకా జీవితాన్ని ఎలా పొడిగించాలా అన్న ఆలోచనే తప్ప, జన్మాంతర జీవితం గురించి తలంచడు.
              వాస్తవంగా తల్లి గర్భంలో పడినప్పటినుంచి మరణంవైపు మనిషి ప్రయాణం ఒక్కొక్క అడుగే సాగుతూంటుంది. ఓ క్షణం ముందుకు నడుస్తోందంటే ఆయుష్షులో ఓ క్షణం తరిగిపోతున్నట్టే కదా! బ్రహ్మ జ్ఞానులకు ఇది అసంబద్ధమనిపించదు. ఎందుకంటే, మరణానంతర జీవితం గురించి మన వేదాలు ఘోషిస్తున్నాయి కనుక. ఈ జీవితం ఎంత ముఖ్యమో, ఆ జీవితమూ అంతే అవసరం!
     కొన్ని మతాలు మరణానంతర జీవితం గురించి భయపెడుతుంటాయి. జీవితం ఎంత స్వేచ్ఛాసుఖాలతో అనుభవించవచ్చో మరణం కూడా అంత స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో ముగించవచ్చని మన వేదాలు చెబుతున్నాయి.
           కొందరు మతస్తులు మనిషికి ఒకే జన్మ ఉంటుందని, మానవ జన్మ తక్కువ సమయంలో ముగిసిపోతుంది కనుక వస్తు రూపేణా దొరికే సుఖాలన్నీ ఈ జన్మలోనే తనివి తీరా అనుభవించేయాలని బోధిస్తారు. మనిషికొకే జన్మ అని అనుకోవటంలో ప్రమాదమే అది. రేపో, ఎల్లుండో ఎలాగా పోతాం కనుక త్వరత్వరగా అన్నీ అనుభవించేయాలని పిచ్చి పరుగులు పెడుతుంటారు వాళ్ళు.
          వేద పరిజ్ఞానమున్నవారిని మరణం భయపెట్టదు. వస్తురూపంగా చవిచూసే గుణాలకన్న మానసికంగా దొరికే ఆనందమే వారికి ముఖ్యం. జీవితం దారి జీవితానిదే! మరణం దారి మరణానిదే! మరణం జీవితానికి ఆఖరిమెట్టు. ఆత్మ జీవితం అనంత వాహిని. ఒక జన్మ ఆత్మ వేసుకునే వస్త్రం మాత్రమే! ఆత్మకు చావులేదు.
      భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 'అర్జునా! ప్రతి దేహంలో నివసించే దేహి లేక ఆత్మ నిత్యుడు. అవధ్యుడు. మరణమనగా దేహంనుంచి దేహి బయటికి వెళ్ళడం. దేహం ధరించే వస్త్రం లాంటిది. ఈ రెండింటి సంయోగం క్షణికమే! పాత బట్టల్ని విడిచి కొత్త బట్టల్ని ధరించటం వంటిదే! ఆత్మ తన పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ఆశ్రయిస్తుంది' అని స్పష్టంగా చెప్పాడు.
       ఏదో క్షణంలో ఈ జీవితం ముగిసిపోవచ్చు. ఈ ప్రశ్నలకు జవాబులు దొరక్కుండానే సమయం అంతం అయిపోవచ్చు. అందుకే, వస్తువుల ద్వారా దొరికే సుఖసౌఖ్యాలన్నీ కేవలం తాత్కాలికమేనని, శాశ్వతంగా లభించే ఆనందం వేరే ఉందని మనసులో జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలి. అప్పుడే ఈ మానవ జన్మకు ముక్తిమార్గం లభ్యమవుతుంది. దివ్యజ్ఞానం దక్కుతుంది. ఈ ఆత్మ పరమాత్మకెంతో దగ్గరని అర్థమవుతుంది.
                                                                - తటవర్తి రామచంద్రరావు

Wednesday 15 May 2013

మనమూ శంకరులమే!


    అవకాశం లభించాలే కాని మనం జ్ఞానులమని ఇతరులు గుర్తించాలనేలా ప్రవర్తిస్తాం. మౌలికంగా మనం తెలివి కలిగినవారమని మన నమ్మకం. ఇతరులు ఏదైనా చెబితే దాన్ని ఖండించేందుకు మాటలను అన్వేషిస్తాం. అవసరం లేని గర్వాన్ని పెంచుకుంటాం. దానితో అరిషడ్వర్గాలన్నీ మనలను ఆవహిస్తాయి. వీటితోపాటు అతిశయం అంతరంగంలోకి చేరుతుంది. ఈ ప్రపంచంలో తెలివి అన్నది ఏ ఒక్కరి సొత్తు కాదు. ఈ చిన్న నిజాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. తెలివితేటలంటే మనకున్న కొద్దిపాటి జ్ఞానాన్ని చర్వితచర్వణం చేయడమా?
అందులో మన సొంతం ఒక్కటీ ఉండదు. మన ప్రజ్ఞ ఎక్కడా ప్రస్ఫుటం కాదు. అన్నీ అరువు తెచ్చుకొన్నవే. మన సొంత జ్ఞానం ఏ పాటిదని మనం ఎందుకు విశ్లేషించుకోం? మనలో మౌలికత లేదు. క్రియాశీలత అంతంతమాత్రమే. ఇది నా ఆలోచన, ఇది నా ప్రజ్ఞావిశేషం, ఇది నేను తెలుసుకొన్న సత్యం- అని ఒక్కటంటే ఒక్కటి... చూపగలుగుతున్నామా? పైగా ఇతరులు ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తే, ససేమిరా వినం.

సార్వత్రిక మత సమ్మేళనం అమెరికాలోని చికాగోలో జరిగినప్పుడు ఆ సభల్లో పాల్గొనడానికి భారత్‌ నుంచి వివేకానందుడు వెళ్లాడు. మహామహులందరూ అక్కడ ఉన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానంతో తలలు పండినవాళ్లందరూ ఆ సభలో ఆసీనులయ్యారు. పేరు ప్రఖ్యాతులున్న ఆధ్యాత్మికవేత్త ఒకరు వివేకానందుడి వైపు చూసి కించిత్తు చులకన స్వరంతో 'నీకు ఏం తెలుసునని ఈ సభలకు వచ్చావ్‌. మేం చెప్పేది వినడానికా లేక నీవు మాకే ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నావా?' అని ప్రశ్నించాడు. వివేకానందుడు ఎంతో సౌమ్యంగా 'మహాశయా! మీరు చెప్పింది వినడానికి మాత్రమే ఉబలాట పడుతున్నాను' అన్నాడు. 'అదంత సులువు కాదు. ఈ సభలోని వక్తల మాటలు వినేందుకు అర్హత ఉండాలి. ముందు నీకేం తెలుసో మూడు నిమిషాల్లో మాకు వివరించగలవా' అని అతిశయంతో ప్రశ్నించాడు. వివేకానందుడు సరేనంటూ వేదికపైకి ఎక్కి 'నా ఆత్మీయులారా...' అంటూ ప్రారంభించిన ఉపన్యాసం గంటన్నరపాటు ధారాళంగా సాగింది. శ్రోతలందరూ సమ్మోహితులయ్యారు. సభలో అందరి కరతాళధ్వనుల మధ్య వివేకానందుడి ప్రసంగం ముగిసింది. ఆయన ఆధ్యాత్మికంగా ఆవిష్కరించుకొన్న సత్యాన్ని అలవోకగా తెలియజేశాడు. అదీ ఆయన ప్రజ్ఞావైభవం. మనిషి మానసం నిరంతర అన్వేషి. జ్ఞానం కోసం సదా వెతుకుతూనే ఉండాలి. మనసు అంటే ఏమిటి? అది పాత సామానులు నిలువచేసే గది కాదే! పుస్తకాలు చదివి పురాణాలు వినడం ద్వారా కలిగిన జ్ఞానం మన సొంతమా? కానే కాదు. ఈ జ్ఞానాన్ని మానసం అనే మూలగదిలో దాచి మన సొంతమని గర్వపడితే ఎలా? ఇదేనా మన విద్వత్తు? మన మనసులో కొత్తదనం ఉండాలి, మనలో జీవం ఉండాలి. మన హృదయాంతరాళాల్లో చైతన్యం వికసించాలి. మనసును శూన్యం చేసుకోవాలి. సరికొత్త జ్ఞానపరంపరం మనసులోకి చేరడానికి అవకాశం కలిగించాలి. గుప్పెడు మనసు అంటాం కాని, అంతులేని అలౌకిక జ్ఞానాన్ని అది తనలో ఇముడ్చుకుంటుంది. అదే స్వీయ ప్రజ్ఞ. అప్పుడే జీవి స్వతంత్రుడవుతాడు.

ఆదిశంకరాచార్యులను ఆయన శిష్యగణంలోని ఒకడైన కమలనాభుడు ఒక రోజు ప్రశ్నించాడు. 'స్వామీ! ఎందరికో ఎన్నో గొప్పగొప్ప విషయాలు చెబుతున్నారు. నాకు మాత్రం ఏదీ చెప్పడం లేదు' అని. అందుకు శ్రీ శంకర భగవత్పాదులు నవ్వుతూ 'ఎందరికో ఎన్నో చెబుతున్నానన్నావు... మరి నీవు వినడం లేదా? అంటే నీ మనసు ఖాళీగాలేదు. నిబ్బరం లేక అది ఉరకలు వేస్తున్నట్టుంది. ముందు నీ మనసును శూన్యంగా చేయి. నేను చెబుతున్నవన్నీ అందులోకి చేరుతాయి. అపుడు నీవు సైతం ప్రజ్ఞావంతుడవుతావు' అన్నారు.

జీవితం ఎన్నో సంవత్సరాల ప్రస్థానంలో అవసరమైనవీ అనవసరమైనవీ పోగుచేసుకొంటుంది. అవి కొండలుగా పేరుకుపోయి ఉన్నాయి మనలో. ఆ కొండ పేరే 'నేను' అనే మానసం. జన్మజన్మలుగా పేరుకుపోయిన అనవసరమైన చెత్త బరువు మోయలేక జీవచైతన్యం వెలవెలబోతోంది. ఆ బరువు నుంచి స్వేచ్ఛ పొందడమే మానవ జీవితానికి విముక్తి, పవిత్రత! జీవి స్వతంత్రం కావడమే జీవన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరామా... మనమూ ఆదిశంకరాచార్యులమే.
                                                    - అప్పరుసు రమాకాంతరావు

Tuesday 14 May 2013

వినయం

  అతి వినయం ధూర్త లక్షణం అన్నారు. అదెంతవరకు నిజమో తెలియదు కాని ఈ కాలంలో కాగడా పట్టుకుని వెదికినా వినయం కనిపించదు. ప్రతి ఒక్కరూ మహారాజే. తప్పనిసరి అయితేనే తలవంచుతారు. ఆ తరవాత బోర విరుచుకుని తిరుగుతారు. మంచి-చెడ్డ, నీతి-న్యాయం, పెద్ద-చిన్న అనే మాటలకు అర్థాలు మారిపోయాయి. కాలానుగుణంగా మార్పులు వస్తాయి, స్వీకరించాలని అందరూ అంటూ ఉంటారు. అదెంతవరకు నిజం?
      బతుకులో ఒక అయోమయం ఉంది. అయోమయంలో ఒక్కో బతుకు ఉంది. ఈ పరిస్థితి ఇలా కొనసాగితే మానవ సంస్కృతి అటకెక్కిపోతుంది. పురాణాలు కథలుగానైనా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందా? ధర్మాలు శాసనాలకు పరిమితమైపోయి మ్యూజియంలో మగ్గుతుంటాయి. దేవుడు అనే పదానికి అర్థం లేకుండాపోతుంది. మతం బూజు పట్టిపోతుంది. మంచితనం కనుమరుగై పోతుంది.
        పెద్దవాళ్లను గౌరవించకపోవడం కాలానుగుణంగా వచ్చిన మార్పా? ధర్మాత్ములను శ్లాఘించకపోవడం ప్రకృతిలో చోటుచేసుకున్న పరిణామమా? విచ్చలవిడితనం, ఆకతాయితనం, దుర్మార్గత్వం జీవనశైలిలో వచ్చిన సహజమైన మార్పులా? కానే కాదు. ఏది సహజమో ఏది అసహజమో తెలుసుకోవాలి. ఏది అపరాధమో, ఏది స్వయంకృతాపరాధమో గ్రహించాలి. స్వార్థం లోంచి పుట్టినవేవో, త్యాగమే ఆలంబనగా లోకంలో కొనసాగుతున్నవేవో జల్లెడ పట్టాలి.
       వినయ విధేయతలు కలిగినవాళ్లు, కపటం లేనివాళ్లు, నిజాయతీతో కూడిన ధర్మాచరణ కలిగినవాళ్లే దైవసమానులని పూజలందుకుంటారు. దైవం చేత గుర్తింపు పొందుతారు. వినయం బానిసత్వ చిహ్నమని, వూడిగం చేసేవాళ్ల లక్షణమని అనుకుంటే అది మన తప్పు. వినయమే విద్యాసంపన్నుల లక్షణం. వినయమే నిజమైన పాండిత్యానికి భూషణం. వినయం లేని ఏ విద్యా ప్రకాశించదు. వినయం వల్లనే సమస్తం మన ఆధీనంలోకి వస్తుంది. ఎంత గొప్ప స్థితికి చేరినా వినయం విడిచిపెట్టనివారే అసలైన గొప్పవారు. గొప్పవాళ్లుగా చాటుకునేవాళ్లు, లేనిపోని గొప్పతనం తెచ్చిపెట్టుకుని సొంత డబ్బా వాయించుకునేవాళ్లు- వినయాన్ని నటిస్తారు. వాళ్లు ఎన్నటికీ శాశ్వతమైన కీర్తిని సంపాదించలేరు. సహజంగా వినయగుణం కలిగినవారు ఎదిగినకొద్దీ ఒదుగుతారు. ఒదిగిన కొద్దీ ప్రకాశిస్తూ ఉంటారు.
        సూర్యుడు ఎంతో గొప్పవాడు. సూర్యోదయం ఎంత ఆనందకరంగా ఉంటుంది. కాని, ఆయన లోకంలోకి వస్తున్నాడంటే ఏ మేళతాళాలూ ఉండవు. ముందు వెనక ఎర్రలైట్లు తిప్పుకొంటూ వాహనాల హడావుడి కనిపించదు. ఎంతో నిరాడంబరంగా సాదాసీదాగా తన పని తాను చేసుకుపోతాడు. ఇంద్రాది దేవతల్లో తాను ఒకడిగానే ఉన్నాడు. అష్టదిక్పాలకుల్లో తాను ఒకడిగానే ఉన్నాడు. నవగ్రహల్లో తాను ఒకడిగానే ఉన్నాడు. ఇంద్రుడి ముందు తలవంచుతాడు. భూమికి కావలసిన శక్తి పంచుతాడు. వినయంగా ఉండి ప్రకాశించడం ఎలాగో- సూర్యుణ్ని చూసి తెలుసుకోవాలి. చంద్రుడు, వాయువు, వరుణుడు, అగ్ని... అందరూ ఇంతే. మహామహాశక్తులే విష్ణువు ముందు తలవంచుతాయి. వినయ విధేయతలు ప్రదర్శిస్తాయి.
         మరి, మనకెందుకు గర్వ అహంకారాలు? ఏం చేసుకోవాలి వాటితో? అందరూ మనలను వదిలిపోవడానికా? వానపాముల్లాంటి వాళ్లు కూడా తాచుపాముల్లా ఉందామనుకుంటారు. తాచు పామైనా వానపాములా ఉంటే చంపేస్తారని అందరి భావన. అదెంతవరకు నిజం?
     మంచితనానికి మించిన భూషణం లేదు. వినయానికి మించిన సంపద లేదు. పారిజాత పుష్పానికి ఇచ్చే గొప్పదనం గడ్డిపువ్వుకు లేకపోయినా, దాని స్థానంలో అది గొప్పదే కదా. ఎవరి స్థానంలో వాళ్లు ఉంటూ ఇతరుల స్థితిని గుర్తించాలి. గౌరవించాలి. అది తప్పుకాదు. అలా మనం ఒక రోజున ఉన్నత స్థితికి చేరుకుంటాం.
      వినయ విధేయతలు లేకుండా పనిచేసే సేవకుణ్ని ఒక యజమాని ఎంతవరకు భరిస్తాడు? అసలెందుకు భరించాలి? బుద్ధిచెప్పి దార్లోకి తీసుకువస్తాడు. లేదంటే 'నీ కర్మ' అని వాణ్ని వదిలేస్తాడు. అలాంటి 'పని'వాడు ఎక్కడున్నా పనిచేసే వాతావరణాన్ని పాడుచేస్తాడు.
       ఒక గొప్ప చిత్రకారుడు. వినయం లేదు. అతడి పరిస్థితి ఏమిటి? ఒక గొప్ప సంగీత విద్వాంసుడు, వినయం లేదు. అతడి భవిష్యత్తు ఏమిటి? ఒక గొప్ప కళాకారుడు. వినయం లేదు. అతడిని ఎవరు ఆదరిస్తారు. నిజం చెప్పుకోవాలంటే వినయం లేకుండా గొప్పదనం రాదు. ఒకవేళ వచ్చినా అది నిలబడదు. ఎవ్వరూ దీన్ని కాదనలేరు!
                                                                       - ఆనందసాయి స్వామి

Monday 13 May 2013

మట్టి పూలు       పత్తిపూలు, ప్లాస్టిక్‌ పూలు, గుడ్డపూలు, గడ్డిపూలు, వెండి పూలు, పసిడి పూలు... ఎన్నెన్నో రకాలు ఉంటాయి. కానీ, మట్టిపూలు ఉంటాయా, ఉన్నా స్పందిస్తాయా? సహజత్వం ఉంటుందా? సౌకుమార్యం, సౌరభం, స్పందనకనిపిస్తాయా? అసలేమిటీ మట్టిపూలు? మనుషులే మట్టిపూలు. మట్టిలో, పంచభూతాల్లో ఒక భూతమైన మట్టి ప్రధాన భూతంగా జన్మించే మనిషే మట్టిపూవు. మనుషులు మట్టిపూలా! మట్టి! సర్వజీవులూ కాళ్లతో తొక్కి, మలమూత్రాలు విసర్జించే మట్టి!! ఔను. ఆ మట్టే. ఆ మట్టే శ్రీరాముడు వనవాసానికి అయోధ్య నుంచి అడవులకు వెళ్తూ వెంట తీసుకుని వెళ్లి పద్నాలుగు సంవత్సరాలు పవిత్రంగా ఆరాధించుకున్న ఆ మట్టే. శ్రీకృష్ణుడు తనకు ప్రియాతిప్రియమైన వెన్నకంటే కమ్మగా ఉన్నట్టు లొట్టలేస్తూ తిని అమ్మకు పట్టుబడి, కట్టుబడి ఆమెకు పద్నాలుగు లోకాలు ప్రదర్శించేందుకు కారణమైన ఆ మట్టే. సీత ఏకంగా ఆ మట్టి గర్భంలోంచే పుట్టింది. ఔను. మట్టే. ఆ మట్టి మూర్తీభవిస్తే- ఆమె భూమాత. మూర్తీభవించిన ఓరిమి. మనం భారతీయులం అమ్మగా, మాతృభూమిగా కొలుచుకునే ఆ మట్టే. ఔను- మనం ఆ మట్టిలో పుట్టి, ఆ మట్టినే శరీరంగా మలచుకుని, చివరకు మట్టిలో మట్టిగా ఆ మట్టిలోనే కలిసిపోయే మట్టిపూవులం. ఎంత పవిత్రమైన, ఎంత సహజమైన, ఎంత సౌరభపూర్ణమైన పూవులం! కానీ మనం సహజత్వాన్ని వదిలి కాగితపు పూలలా మారిపోయాం. ప్లాస్టిక్‌ పూలలో చేరిపోయాం. కంతిరి పూలలా అయిపోయాం. భగవంతుడి ఆరాధనకే పుట్టిన మట్టి పూవులం. ఆయన ఆరామాన్ని చేరుకునేందుకే వచ్చిన ధన్యజీవులం. కానీ ఎందుకిలా అయిపోయాం!
           వరుణుడు వాన కురిపించి మేఘమనే పన్నీటి బుడ్డితో పరిమళం చిలుకుతున్నాడు. వానకు తడిసి, కమ్మని వాసనలతో, మట్టి వాసనలతో ఈ జగమంతా పరవశిస్తుంది. గర్భిణీ స్త్రీలు వానకు తడిసిన మట్టి బెడ్డలు ప్రీతితో తిని గర్భంలోని తమ శిశువులకు మరింత మట్టి మప్పుతున్నారు. సహజత్వాన్ని అద్దుతున్నారు. మట్టిపూలుగా మలుస్తున్నారు.
        మట్టి మహత్వపూర్ణమైంది. భగవంతుడు బంగారుపుష్పాలను కూడా తిరస్కరించి మట్టిపూలను కోరుకున్నాడు. శివుడు మృణ్మయలింగమై మురిసిపోయాడు. ఈ మట్టిపూలకు, ఈ మట్టి మనుషులకు మళ్లీ ఈ మట్టే మెతుకై అన్నం పెడుతుంది. విచిత్రమైన బంధం. విమలమైన అనుబంధం.
       అయితే ఈ మట్టిని మనం నాశనం చేస్తున్నాం. మనమే నాశనం చేస్తున్నాం. అంటే మనను మనమే నాశనం చేసుకుంటున్నాం. ఏసుక్రీస్తు తనను సిలువ వేస్తున్నవారిని గురించి అన్నట్లు- మనమేం చేస్తున్నామో మనకు తెలీదా? మనం మరీ అంత అమాయకులమేం కాదు. తెలుసు. అన్నీ తెలుసు. తెలిసిన మూర్ఖులం. ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం. మనం ఒక్కరం జాగ్రత్తపడితే చాలదు కదా అనే నిర్లక్ష్యం. బిందువు బిందువు కలిస్తే బిందె నిండుతుంది. పిడికెడు పిడికెడు గింజలు కూడబెడితే గాదె నిండుతుంది. నిర్లక్ష్యమైనా అంతే. చిరుగాలి పెనుగాలి అవుతుంది. చిన్న అగ్గిపుల్ల పెద్ద అడవినే బుగ్గి చేస్తుంది. మనం అగ్గిపుల్ల కావద్దు. మనకు ప్రాణం పోసిన అన్నం పెట్టిన మట్టి తల్లికి, భూమి తల్లికి అగ్గిపెట్టొద్దు. ఆఖరుకు మనను పూడ్చేందుక్కూడా పనికిరానిదిగా మార్చుకోవద్దు. భూమిని రక్షించుకుందాం. మట్టిని కాపాడుకుందాం!
                                                                       - చక్కిలం విజయలక్ష్మి

చందనోత్సవం

                                  

             దుష్టశిక్షణ, శిష్టరక్షణ ధ్యేయంగా విష్ణువు ధరించిన అవతారాల్లో నాలుగోది నరసింహావతారం. మనిషి రూపం, సింహం తలతో ద్వయరూపాల సమాహారం కాబట్టి ఆ పేరు వచ్చింది. అలాంటి విచిత్రరూపమే హిరణ్యకశిపుణ్ని సంహరించడానికి సమర్థమైనది. బ్రహ్మ నుంచి హిరణ్యకశిపుడు పొందిన వరాలశక్తికి విరుగుడుగా విష్ణువు ఈ అవతారం దాల్చాడు. రాక్షసుణ్ని సంహరించాడు. రెండు రూపాల సమాహారశక్తి కావడం వల్ల రాక్షస వధానంతరం సైతం ఆ ఉగ్రరూపం శాంతించలేదు. దేవతలు, మునులు, లక్ష్మీదేవి, చివరకు అత్యంత ప్రియభక్తుడైన ప్రహ్లాదుడు సైతం ప్రార్థించినా శాంతించలేదు. తమ చేయి దాటిపోవడంతో బ్రహ్మదేవుడికి మొరపెట్టుకున్నారంతా. అతడు వారికో ఉపాయం చెప్పాడు. తాను గతంలో శ్రీచందన వృక్షానికి ఉగ్రత, తాపం, ఉష్ణం తగ్గించే గుణాన్ని వరంగా ఇచ్చానని, అందువల్ల దాన్ని ఆ మూర్తికి పూస్తే శాంతిస్తాడని సలహా ఇచ్చాడు. ఆ సలహాను అనుసరించి ప్రహ్లాదుడు శ్రీచందనాన్ని తెప్పించాడు. దాని పరిమళం ఆ పరిసరాల్లో ప్రసరించగానే ఆ ఉగ్రమూర్తి కొంతవరకు శాంతించాడు. ఆపైన ప్రహ్లాదుడు స్వామిని స్తుతిస్తూ చందనం పూశాడట. దాంతో పూర్తిగా శాంతించాడా స్వామి. ఇది జరిగినది వైశాఖ శుద్ధ తదియ. ఆ రోజు కృత్తిక, రోహిణి ఈ రెండు నక్షత్రాల్లో ఏదో ఒకటి అవుతుంది. ఈ రెండూ అగ్ని(ఉష్ణ) స్వభావం కలిగిన నక్షత్రాలే. అందువల్ల ఈరోజు వాతావరణంలో వేడి ఎక్కువగా ఉంటుంది. నడి వేసవికాలం. అందునా కృత్తిక కార్తె సమయం. ఈ కారణాలన్నింటివల్ల ఆనాటి వేసవితాపం నుంచి ఉపశమనం కోసమే సింహాచల క్షేత్రంలో వేంచేసి ఉన్న వరాహ లక్ష్మీనృసింహస్వామికి చందనోత్సవం జరుగుతుంది. ఈ తరహాలో ఈ క్షేత్రంలో తప్ప మరే నృసింహ క్షేత్రంలోనూ చందనోత్సవం జరగదు. దీనికి కారణాలు ఉన్నాయి.
       ఉగ్రరూపం శాంతించిన నృసింహస్వామి మూర్తులను, ఆ రూపంలోనే అనేక ప్రాంతాల్లో ప్రతిష్ఠించారు. అందులో మొదటిది మనరాష్ట్రంలో ఉన్న సింహగిరి (అదే సింహాచలం). ఇక్కడే ప్రతిష్ఠించడానికి కారణమూ ఉంది. ప్రహ్లాదుని రక్షించడానికి స్వామి భూమిపైన కాలిడిన ప్రదేశం సింహశైలమేనని పురాణాలు చెబుతున్నాయి. అలా వస్తున్నప్పుడు అతడి ధాటికి పాదాలు పాతాళంలోకి వెళ్ళాయని, కాబట్టి నిజరూప దర్శన సమయంలో పాదదర్శనం ఉండదనీ క్షేత్రమహాత్మ్యం చెబుతోంది.
            వైశాఖ శుద్ధ విదియనాడు రాత్రి సింహాచలేశుడి విగ్రహానికి ఉన్న చందనం అంతా వలిచేస్తారు. తదియనాటి ప్రాతఃకాలంలో స్వామికి సహస్ర ఘటాభిషేకం చేస్తారు. ఆ తరవాత ప్రత్యేక పూజలు, ధూపదీప నైవేద్యాలు జరిపిస్తారు. ఆపైన స్వామివారి విగ్రహ నిజరూప దర్శనానికి అనుమతిస్తారు. సంవత్సరానికి ఒక్కసారి, అదైనా ఒక్కపూట మాత్రమే కలిగే అరుదైన నిజరూప దర్శనం చేసుకోవడానికి భక్తులు అనేక దూర ప్రాంతాలనుంచి తరలివస్తారు. ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే నిజరూప దర్శనం ఉంటుంది. ఆపైన విగ్రహానికి చందనం పూసేస్తారు. అలా కప్పివేసే సమయంలో మూడు మణుగుల చందనపు ముద్దను విగ్రహానికి అలదుతారు. ఈరోజు తరవాత వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పూర్ణిమ తిథుల్లో మరల మూడేసి మణుగుల చొప్పున చందనాన్ని స్వామివారికి అలదుతారు. ఇలా చేసేదాన్ని 'కరాళ చందనోత్సవం' అంటారు. వెరసి సుమారు 420 కిలోల చందనం విగ్రహాన్ని అంటి ఉంటుంది. చందనోత్సవానికి వాడే మంచి గంధపు చెక్కలను, తమిళనాడులోని తిరుపత్తూర్‌ నుంచి కొనుగోలు చేస్తుంటారు. సంవత్సరంలో నాలుగుసార్లు అలదే చందనాన్ని సంవత్సరం పొడుగునా రోజుకు కొంత కొంత చొప్పున రాతిసానల మీద అరగదీసి, ఆ ముద్దను చందన భాండాగారంలో భద్రపరుస్తారు. ఇలా తీసిన గంధం పాడైపోకుండా ఔషధ గుణాలున్న మూలికలు, సహజ రసాయనాలు కలిపి నిలవచేస్తారు. పచ్చాకు, పచ్చకర్పూరం, కుంకుమపువ్వు, కస్తూరి, జవ్వాదు, పసుపు, పునుగు, కచ్చూరాలు, భావంచాలు, వట్టివేళ్లు, గవిలాలు మొదలైన సుగంధ ద్రవ్యాలు, మూలికలను కలిపి ప్రత్యేక పద్ధతిలో నిలవ ఉంచుతారు.
           స్వామి విగ్రహం నుంచి వలిచేసిన పాతచందనాన్ని భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. దీన్ని ధరించడంవల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. ఔషధ విలువలున్న ఈ చందనధారణ ఆరోగ్యప్రదమని, ప్రత్యేకంగా సంపాదించుకోవడానికి భక్తులు పోటీపడతారు. అన్ని ఆలయాలూ తూర్పుముఖంగా ఉంటే ఈ ఆలయం పడమటి ముఖంగా ఉండటం విశేషం. ఇలా ఉన్న ఆలయాన్ని దర్శించడం వల్ల విజయం సిద్ధిస్తుందని శాస్త్రవచనం.
          ఈ క్షేత్రంలో ఉన్నది లక్ష్మీనరసింహస్వామి అయినా, రూపంలో వరాహావతార లక్షణాలూ, ఛాయలూ మూర్తిలో ఉంటాయి. అందుకే ఈ క్షేత్రంలోని స్వామికి 'వరాహలక్ష్మీ నర(నృ)సింహస్వామి' అని పేరు. గ్రామీణులు ఈ స్వామిని అప్పన్న అనీ, లేదా అప్పలనరసింహస్వామి అనీ పిలుస్తారు. కోడెదూడలను అచ్చువేసి స్వామికి అంకితం చేస్తూ ఆలయంలో విడిచిపెడతారు భక్తులు. అలా విడిచిన దూడలు- ఆబోతులుగా, గంగిరెద్దులుగా లోకంలో చలామణీ అవుతూంటాయి. కొన్ని పల్లెల్లో ఆ స్వామి పేరు మీద కోడెదూడను అచ్చువేసి గ్రామాల్లో వదిలేస్తారు. అది ఆ గ్రామానికంతటికీ ఆబోతుగా చలామణీలో ఉంటుంది.

                                                           - అయ్యగారి శ్రీనివాసరావుSaturday 11 May 2013

మాతృదేవోభవ

                                 
అకార, ఉకార, మకారాల                       
కలయిక వల్ల 'ఓం'కారం ఏర్పడుతుంది.

అనురాగం, ఉపకారం, మమకారాల  
మేలు కలయికవల్ల అమ్మ సాకారమవుతుంది.
        సృష్టికి మూలం అవ్యాజమైన మాతృప్రేమ. మధుర పరిమళం లాంటిదీ, అనిర్వచనీయమైన ఆనందానుభూతిని ఇచ్చేదీ మాతృప్రేమ. ప్రేమకు నిలువెత్తు ప్రతిరూపం అమ్మ. అవధుల్లేని ప్రేమను పంచేది అమ్మ. తాను కరిగిపోతూ లోకానికి వెలుగునిస్తుంది కొవ్వొత్తి. తాను చితికిపోతూ, 'చితి'కిపోతూ కూడా బిడ్డల మేలు కోరుతుంది మాతృమూర్తి. ఈ రోజుల్లో అందరూ ఉన్నప్పటికీ అనాథను చేసి, వృద్ధాశ్రమాల్లో చేర్పించినా కూడా, ఆ తల్లిమనసు బిడ్డల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అంతులేని త్యాగమూర్తి మాతృమూర్తి.
     భూదేవితో సమానమైన సహనం కలిగింది మాతృమూర్తి. సాగరమంత దయ ఈ మాతృమూర్తి సొంతం. క్షమయా ధరిత్రీ. బిడ్డల క్షేమాన్నీ, శ్రేయాన్నీ, అభ్యున్నతినీ కాంక్షించి, అనుక్షణం అమితంగా బాధ్యత తీసుకునే అమృతమూర్తి మాతృమూర్తి. ఇలా ప్రేమ, త్యాగం, సహనం, బాధ్యతలనే నాలుగు స్తంభాలతో నిర్మించిన దేవాలయమే- అమ్మ చిరునామా.
      ప్రథమ పోషకురాలు తల్లి. నెలతప్పిన దగ్గరనుంచి అనేక కష్టాలుపడి బిడ్డను కాపాడుకుంటూ వస్తుంది. కడుపులో బిడ్డ ఆకారం దాల్చేటప్పుడు తల్లి అనేక వికారాలకు లోనవుతుంది. తాను తినే తిండినీ, తన రక్తమాంసాలనూ కడుపులోని బిడ్డకు పంచి, బిడ్డను పెంచుతుంది. పేగు తెంచుకుని, కడుపు చీల్చుకుని బిడ్డ బయటకు వచ్చినప్పటినుంచి తాను తిన్నా, తినకపోయినా బిడ్డ కడుపు నింపుతుంది. పెట్టే విషయంలో తల్లిని మించినవారు లేరు. అడగనిదే అమ్మయినా పెట్టదంటారు, కాని అడగకపోయినా పెట్టేది అమ్మ మాత్రమే. భోజ్యేషు మాతా.
           భోజరాజీయంలోని కథ మనందరికీ తెలిసిందే. ఒక పెద్దపులి ఒక గోవువెంట పడింది, తన ఆకలి తీర్చుకోవడానికి. అప్పుడు గోవు 'నా బిడ్డ చాలా ఆకలితో ఉన్నది. వెళ్లి నా బిడ్డకు కడుపునిండా పాలిచ్చి వస్తాను. అప్పటిదాకా కొంచెం ఓపికపట్టు. నేను తప్పకుండా తిరిగి వస్తాను. నా మాట నమ్ము' అని ప్రాధేయపడింది. గోమాత మాటపై విశ్వాసముంచి సరే అన్నది పెద్దపులి. ఇచ్చిన మాట ప్రకారం వెళ్లి బిడ్డ ఆకలి తీర్చి, వచ్చిన గోమాత పెద్దపులితో 'ఇప్పుడు నన్ను భక్షించి, నీ ఆకలి తీర్చుకో నాకేమీ అభ్యంతరం లేదు' అన్నది. ఆకలి తీర్చడమే అమ్మ లక్షణం. అది కన్నబిడ్డయినా ఒకటే, పరాయి బిడ్డయినా ఒకటే, పగవాడైనా ఒకటే. దాతృత్వమే మాతృత్వం.
     ప్రథమ సేవకురాలు తల్లి. బిడ్డకు సేవచేయడంలో తల్లిని మించినవారు లేరు. ఏమాత్రం అసహ్యించుకోకుండా అన్ని రకాల సేవలూ చేసేది తల్లి మాత్రమే. కార్యేషు దాసీ. సేవాతత్వానికి పరాకాష్ఠ తల్లే. అందుకే మదర్‌ థెరెసా సేవాతత్పరతను ఈ నాటికీ ప్రపంచమంతా వేనోళ్ల కొనియాడుతోంది.
        ప్రథమ గురువు తల్లి. బిడ్డ కడుపులో ఉన్నప్పటినుంచీ తల్లి అనేక విషయాలు బిడ్డకు నేర్పుతుంది. పిల్లలు బుడిబుడి అడుగులు వేసేటప్పుడు పొడిపొడి అక్షరాలు, మాటలు నేర్పుతుంది. పిల్లలకు నడకతో పాటు, నడతనూ నేర్పుతుంది. విద్యాలయాల్లో నేర్చుకునేదానితోపాటు, గృహాలయాల్లో నేర్చుకునే విద్యలనేకం. అందుకే తల్లిదండ్రులు తొలి గురువులైతే, గురువులు మలి తల్లిదండ్రులు.
         ప్రథమ సంరక్షకురాలు తల్లి. కన్నబిడ్డ చిన్నవాడైనా, పెద్దవాడైనా కంటికి రెప్పలా కాచుకుని, గుండెల్లో దాచుకునేది తల్లి. దేశానికి రాజైనా తల్లికి బిడ్డే కదా! కరణేషు మంత్రీ.
      ఇలా అనేక విషయాల్లో తల్లి ప్రథమురాలు. అందుకనే కనిపించని ఆ దేవుని కన్నా, కని పెంచే అమ్మే మిన్న. కాబట్టి తల్లి ప్రథమదైవం. త్రిలోకాల్లోనూ త్రికాలాల్లోనూ మాతృదేవోభవ!
                                                              - గుజ్జుల వీరనాగిరెడ్డి