ఏడుస్తున్న చంటి పిల్లవాడు... లాలించే యత్నంలో ఉన్న అమ్మను చూసి వూరట చెందుతాడు. సవాలక్ష ప్రశ్నలతో అత్తారింటి గుమ్మంలోకి అడుగుపెట్టిన పెళ్ళికూతురు మనసు- పెళ్ళికొడుకు ప్రసన్నంచేయడంతో కుదుటపడుతుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడికి వైద్యుడి మాటలు ఉపశమనం కలిగిస్తాయి. ఇవన్నీ అంతర్గతంగా అభయహస్తం అందించిన ఉదాహరణలే!
శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడితో 'ఓ సవ్యసాచీ! శత్రువులను జయించు. వాళ్ళంతా ఓడిపోయినవాళ్ళే. నీవు నిమిత్తమాత్రుడవు' అనడం వెనక 'అభయం' ఉంది.
మనసును మంచి కార్యాల్లోకి, ఆచరణల్లోకి మళ్ళించగలిగితే, ప్రక్షాళన పొంది కార్యశూరులుగా నిలబడతాం. అప్పుడు పట్టుదల పెరిగి ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. విశ్వంలో ఎన్ని అవకతవకలు, అన్యాయాలు జరుగుతున్నా శ్రమ, ధర్మం, నీతి, నిజాయతీకి కట్టుబడ్డవారికి 'అంతర్యామి' పరిధిలో సాయం ఉంటుంది. అలా నమ్మకం పెంచుకుంటే 'భరోసా'తో ఆత్మవిశ్వాసం విస్తరించి పనిలో నాణ్యత, క్రమశిక్షణ, జవాబుదారీతనం పెరుగుతాయి. పేదలపట్ల దయాగుణంతో వ్యవహరించాలి. వారికోసం మన చక్షువుల్లో కొంత 'తడి'ని కేటాయించాలి. అంటే, వారి కోసం ఏడవమని కాదు. అభిమానంతో మెలిగితే, ఆర్ద్రత అనివార్యమై మనమే వారికి అభయహస్తంగా నిలబడతాం. అదొక గర్వకారణంగానూ, మానసిక పరిణతిగానూ రూపాంతరం చెందుతాయి.
పూర్వకాలంలో మతపెద్దలు 'ప్రార్థన'కు కొన్ని నియమనిబంధనలు రూపొందించారు. వాటిని పాటించడంవల్ల భగవంతునిపట్ల విశ్వాసం పెరిగి, ధర్మం కోసం ఆలోచనల్లో పడతాం. ఆ కృషి ఫలితమే 'సంతృప్తి' రూపంలోకి మారి మనసు పులకిస్తుంది. సంతృప్తిని మించిన ధనాగారం లేదు కదా! నవ్వును మించిన ఆరోగ్యసూత్రం లేనేలేదు. ఎక్కడో పుడతాం. ఎక్కడో పెరుగుతాం. ఎక్కడో తనువు చాలిస్తాం. ఈ జీవన పరిణామక్రమంలో ఎన్నో సంఘటనలు, సుఖదుఃఖాలు మనల్ని ప్రభావితం చేస్తాయి. ఆ ప్రక్రియలో మనం 'దోషులు'గా నిలబడే సందర్భాలూ ఉంటాయి. మనం సున్నిత హృదయులమైతే ఆ పరిస్థితి పునరావృతం కాకుండా ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. అప్పుడు మనోద్వారాలు వికసించి 'ప్రయత్నించు నేనున్నాను' అనే సందేశం వినిపిస్తుంది. ఆ మంత్రంతో కార్యం సులభతరమవుతుంది.
మనం గుడిమెట్లు ఎక్కుతున్నప్పుడు దేవుణ్ని దర్శించాలన్న ఆరాటం ఉంటుంది. మెట్లు దిగుతున్నప్పుడు మనసు, శరీరం తేలికవుతాయి. మనం చేసిన 'నివేదన' అంతర్యామికి అందిందన్నమాట! నివేదించుకోవటం, అభయహస్తం పొందటం రెండూ ఇచ్చి పుచ్చుకోవడాలన్న మాట. దేవుడికి నైవేద్యంగా నీ 'మంచి'ని చూపించుకుంటే 'అభయం' అనే ప్రతిఫలాన్ని పొందుతావు.
ఆ భావతరంగిణిలో జన్మ సఫలమైందని భావించడమే మోక్షమార్గం.
సూర్యోదయానికి ముందు స్నానాదులు ముగించుకొని దేవుడి గదిలో మంచి మనసుతో దీక్షగా ఆలోచిస్తూ ప్రార్థన కొనసాగిస్తే హాయిగా ఉంటుంది. అలా చేస్తున్నప్పుడు తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల, విద్యాభ్యాసం నేర్పిన గురువు పట్ల, తనతో ఏడడుగులు నడిచిన భార్య పట్ల, సాటి మనుషుల పట్ల తన విధివిధానాల్లో సాయంగా ఉంటానని అనుకోవడం నిరాశా నిస్పృహలను దూరం చేస్తాయి. ఆ 'అభయం'తో శేషజీవిత అనుభవాలు శాంతిగా, ముక్తిమార్గంగా, జీవనమార్గంగా మారతాయి. అదే విజయం!
- గుడిమెట్ల గోపాలకృష్ణ
No comments:
Post a Comment