కోట్ల జనాభా ఈ భూమ్మీద నివసిస్తోంది. అనుక్షణం ప్రతి ఒక్కరికీ ఎన్నో ఆలోచనలు పుడుతుంటాయి. కరిగిపోతుంటాయి. జీవరాశులు వస్తుంటాయి, పోతుంటాయి. అయితే జీవితాల్లో ఒక క్రమం ఉంది. రావడం, జీవించడం, నిష్క్రమించడం... సముద్రంలో ఎప్పుడైనా అల స్థిరంగా ఉండటం చూశామా... వస్తుంది. వెళ్ళిపోతుంది. రాత్రి... పగలు... రుతువులు అలాగే ఆలోచనల స్పందనలు, ప్రతిస్పందనలు! జీవితంలో ఈ చలన స్వభావాన్ని పరిశీలిస్తే- దేనినైనా పట్టుకుని 'ఇది ఇలాగే ఉండాలి' అని, 'ఉంటుందీ' అని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకు మనం కొన్ని విషయాలపట్ల తీవ్రంగా ప్రవర్తిస్తాం, చిత్రంగా ఆలోచిస్తాం? కారణం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మనలోని తీవ్ర వ్యతిరేకత. మనమనుకున్నది జరగకపోతే ఏదో అయిపోతుందేమోనన్న అభద్రత. మనమనుకున్నట్లు, వూహించుకున్నట్లు జరగకపోతే ఏదో అయి అయోమయంలోకి నెట్టి లోపల పీడించే బాధ. జరిగేదానివల్ల మనకు మంచి ఉండొచ్చు. దానివల్ల మనకెంతో మేలూ కలగవచ్చు. కానీ, మన ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. అందుకు ముందు తిరస్కరిస్తాం... వ్యతిరేకిస్తాం... కారణం దృక్పథం. ఆలోచనా ధోరణి... చూసే కోణం- రాయికి, రత్నానికి భేదం కనుక్కోలేని స్థితి. ఏదైతే బాధను కలిగించిందో, అదే ఆ తరవాత మన జీవితంలో మధురాతిమధురమైన పరిణామానికి దారితీయవచ్చు. ఏదైనా బాధకు కారణం అయినదానిపట్లా కృతజ్ఞత అవసరం. చిత్రంగానే ఉంటుందీ భావన... కానీ ఆ తరవాత అది ఓ అంతర్మథనానికి, ఓ గొప్ప అవకాశానికి హేతువు అవుతుంది. చాలా సందర్భాల్లో ఆ ఒత్తిళ్లు, బాధలు మంచి మార్పునకు దోహదపడతాయి.
ఈ సత్యాన్ని గ్రహిస్తే మనసు అల్లకల్లోలానికి, శరీరం అనారోగ్యానికి గురికాకుండా ఉంటుంది.
శిల్పకారుడు ఒక శిలను తీసుకుని ఉలితో అనవసరమైనదాన్ని తొలగిస్తూ ఓ అందమైన శిల్పంగా మారుస్తాడు. అలాగే బాధలు, ఒత్తిళ్లు, చిక్కులు, చీకాకులు జీవితం అందంగా రూపొందడానికి సహాయపడతాయి.
ఒంటరితనం అవసరం. ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళిపోతాం ఈ లోకంనుంచి. జీవితంలో ఎక్కువ ఆలోచనలు, అవకాశాలు ఒంటరిగా ఉన్నప్పుడే వస్తుంటాయి. ఒంటరితనాన్ని దూషించడం తగదు. నిజానికి ఒంటరిగా ఉండే పరిస్థితులకు కారణమైన వ్యక్తులకు, సందర్భాలకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఒంటరితనంలో చేసే ఆలోచనలవల్ల చాలావరకు మనసు ప్రశాంతమవుతుంది. ఎవరికి వారు అర్థం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అలా జరిగినప్పుడే జీవితం విలువ తెలుస్తుంది. కానీ, ఒంటరిగా ఉండటానికి సాధారణంగా ఎవరం ఇష్టపడం. భయపడతాం. తోడు కోసం పాకులాడతాం. చిత్రమేమిటంటే తోడు దొరికిన మరుక్షణం నీలోని 'నువ్వు' మాయమవుతుంది. అది జరిగినప్పుడు మనలోకి మనం తొంగిచూసుకునే అవకాశం దూరమవుతుంది. ఒంటరితనం బాధించినప్పుడు దానితోనే ఎక్కువ కాలం ఉండే ప్రయత్నం చేయాలి. మొదట్లో ఇబ్బంది అనిపించవచ్చు. ఎప్పుడైతే ఒంటరితనం అనే విత్తనంలో జీవించడం అలవాటు అవుతుందో- ఓ అందమైన వృక్షాన్ని తరవాత చూడగలుగుతాం. ఆ విత్తనమే ప్రేమ, శాంతి, సామరస్యం, సుఖసంతోషాలను... ఎన్నింటినో అందిస్తుంది. ఒంటరితనాన్ని ఓర్పుతో పట్టి ఉంచగలగాలి. ఒంటరితనం ఏర్పడినప్పుడు భగవంతుడి ఆశీస్సులుంటాయి. 'దిక్కులేనివాడికి దేవుడే దిక్కు' అని వూరికే అనలేదు. మానసిక బలం చేకూరుస్తుంది ఈ మాట.
ఈ లోకం చాలా వింతైనది. ఎప్పుడూ దేనితోనో ఒకదానితో ముడిపెట్టి ఉంచుతుంది. తీరిక లేకుండా చేస్తుంది. ఆలోచనలకు ఆస్కారం లేకుండా ఉంటుంది. దేవుడున్నాడా లేడా... అన్న చర్చలొద్దు. 'దేవుడున్నాడు అన్నీ ఆయనే చూసుకుంటాడు' అనే ధైర్యం మనిషిని ముందుకు నడిపిస్తుంది. ఆశావహ దృక్పథాన్ని కలిగిస్తుంది. 'మనం చేసే పాపపుణ్యాలు ఆ దేవుడు చూస్తుంటాడు' అని విశ్వసిస్తే పాపకార్యానికి అడుగు ముందుకు పడదు. - మంత్రవాది మహేశ్వర్