ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Wednesday 25 September 2013

ఉషోదయం

షోదయదృశ్యం కళ్ళకెంత మనోహరంగా కనిపిస్తుందో! ఈ సృష్టిలోని సర్వజీవరాసులపైన అపారమైన దయతో ఆ సృష్టికర్త అందిస్తున్న అందమైన చిత్రమది. అలాంటి సుమనోజ్ఞ సృష్టివిన్యాసం నింగిలో తప్ప మరెక్కడా కనిపించదు. అత్యద్భుతమైన ప్రశాంత సమయం కూడా అదే. ప్రతీ ఉషోదయం సౌందర్య ప్రభలతో వెలిగిపోతూ అనంతమైన సందేశాలను జీవకోటికి అందిస్తుంది. ఆత్మవికాసం, ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది తొలిసంధ్య. ఉషోదయ కిరణాలు సృష్టినంతటినీ మేల్కొలుపుతాయి. అంతేనా! అవి క్రమశిక్షణకు నిలువెత్తు ప్రతీకలు. 

విశ్వాన్ని మేలుకొలిపే ఆ కాంతిరేఖలు ఎందరెందరికో స్ఫూర్తిని కలిగిస్తాయి. సంకల్పబలం ఎంత గొప్పదో లోకానికి చాటి చెప్పి జీవకోటిలో చైతన్యం కలిగించి కర్తవ్యోన్ముఖుల్ని చేస్తాయి.
 
చదువుల తల్లి సరస్వతీదేవి నడయాడుతూ నర్తించే సమయమది. ఆ వేళలో ఏ విద్య అభ్యసించినా మస్తిష్కంలో నాటుకుపోతుందని పెద్దలంటారు.
ప్రభాత సమయం భగవంతుడికి ప్రీతికరమైనదంటారు. రామాయణ మహాకావ్యంలో బాలరాముణ్ని విశ్వామిత్ర మహర్షి మేల్కొలుపుతూ 'కౌసల్య సత్‌ పుత్రుడవైన ఓ రామా! తెల్లవారుతోంది... ఓ నరశ్రేష్ఠుడా లెమ్ము భగవత్‌ ప్రీతికరమైన కార్యాలు ఆచరించాల్సి ఉంది!' అంటాడు. అలా మేల్కొలపడంలో ఎనలేని వాత్సల్యం కనిపిస్తుంది. ఆ భగవంతుడు కనులు విప్పితేనే జగత్కల్యాణం జరుగుతుందనే భావన గోచరిస్తుంది. ఈ సుప్రభాతం ఆ సర్వాంతర్యామినే కాదు, సమస్త ప్రపంచాన్నీ జాగృతపరచే ప్రభాత గీతం. అందరినీ కర్మాచరణకు ప్రోత్సహించే ప్రబోధగీతం.

దేశ ఉన్నతికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు ఉషోదయ వేళలో తీసుకున్నవేనని గాంధీజీ చెప్పేవారు. 
ఒకసారి గాంధీజీకి, రవీంద్రనాధ్‌ ఠాగూర్‌కి మధ్య ఉషోదయ సమయంలో సంభాషణ జరుగుతోంది. 
ఉదయభానుడి లేతకిరణాలతో ప్రభావితుడైన ఠాగూర్‌... గాంధీజీ ఏదో ధ్యాసలో ఉండటం గమనించారు. 'మీరెందుకంత నిశ్చలంగా ఉన్నారు? సూర్యోదయవేళ ఉదయభానుడి లేత ఎర్రని కిరణాలు చూస్తే మీ మనసు ఆనందంతో నిండిపోదా? పక్షుల కిలకిలరావాలు విని మీ హృదయం పరవశించదా? విచ్చుకుంటున్న ఎర్రగులాబీలను చూస్తే ఆహ్లాదంగా అనిపించదా?' అని ప్రశ్నించారు.

అప్పుడు గాంధీజీ 'గురుదేవ్‌, నేనేమీ జీవం లేని శిల్పాన్ని కాదుకదా... ఉదయభానుడి ఎర్రని కిరణాలతో, పక్షుల కిలకిలారావాలతో, విచ్చుకున్న గులాబీలతో పరవశించకుండా ఉండటానికి! కానీ, నేనేమి చేయను? నా మనసంతా వేరేచోట ఉంది. ఆ లేత గులాబీ ఎర్రదనాన్ని ఆకలితో అలమటించే కోట్లాది జీవుల చెక్కిళ్ళపై ఎప్పుడు చూస్తానా అనిపిస్తోంది. ఆనందం వాళ్ళల్లో ప్రస్ఫుటిస్తుందా, పక్షుల కిలకిలరావాల్లాంటి మధుర ధ్వనిని వాళ్ళ గొంతుల్లోంచి వింటానా, ఉదయభానుడి లేతకిరణాలతో పేదవాడి మనసు సమస్యలు తీరి ఎప్పుడు పరవశిస్తుందా అని ఆలోచిస్తుంటాను!' అని సమాధానం చెప్పారు. దేశప్రజల కోసం ప్రతి క్షణం తపించడంవల్లే మహాత్ముడిగా గాంధీ కీర్తి గడించారు.

పల్లెల్లో ఉషోదయ దృశ్యాలు మనోఫలకం మీద చెరగని ముద్రవేస్తాయి. ఎరుపెక్కిన తూరుపు తెల్లవారుతూంటుంది. పిల్లగాలులు వీస్తూంటాయి. పక్షుల కిలకిలలూ, లేగదూడల అంబారావాలు, కవ్వంతో చల్ల చిలుకుతున్న చప్పుళ్ళు, ఇళ్ళముందు బియ్యంపిండితో ముగ్గులేసే పల్లె పడుచులు... సాక్షాత్తూ ఆనాటి వేదనాగరికతే ఈనాటికీ పల్లెల్లో కనిపిస్తుంది. సమైక్యతకు, సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తుంది.

తెలతెలవారుతూంటే పిట్టలు ఆకాశంలో సందడిచేస్తూ కనిపిస్తాయి. చిన్న పొట్ట కోసం ఎంత దూరం ఎగురుతాయో! శ్రమైక జీవన సౌందర్యాన్ని లోకానికి వెల్లడిచేస్తాయి. మూగజీవుల్లా ప్రతీ మనిషీ ఉషోదయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. మంచి నిర్ణయాలతో కర్తవ్యోన్ముఖుడు కావాలి. వెలుగనే జ్ఞానామృతాన్ని అందరికీ పంచుతూ అతడో ఆదిత్యుడిగా మారాలి.
-విశ్వనాథ రమ

No comments:

Post a Comment