ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday 30 September 2013

ఆలోచనాలోచనం


 మనిషి జీవించి ఉన్నంతవరకు ఆలోచనల నుంచి తప్పించుకోలేడు. మంచో, చెడో ఏదో ఆలోచన చేస్తూనే ఉంటాడు. జ్ఞానాంగాలతో గ్రహించగలిగే పూర్వాపరాల మనోపరిశీలనే ఆలోచన. ఒక వస్తువు లేదా విషయం మీద మనసును కేంద్రీకరించినప్పుడు ఆవిర్భవించే భావతరంగమే ఆలోచన. వూహకీ, విశ్లేషణకీ, విచక్షణకీ, ఆచరణకీ, అభివ్యక్తికీ ఈ ఆలోచనే మూలమవుతుంది. కన్నవీ, కననివీ, విన్నవీ, విననివీ... అన్నీ ఆలోచనలకు ఉత్ప్రేరకాలే. చెలమ మనసైతే, చెలమలోంచి ఊరే నీటి వూట ఆలోచన. నేల మంచిదైతే, నీరు తియ్యగానే ఉంటుంది. నేల మంచిది కాకపోతే, ఆ నీటి చుక్కను కూడా ముట్టలేం.
మంచి ఆలోచనలకు మూలం మంచి మనసు. మనసు నిర్మలమైనప్పుడు, అందులోంచి ఉదయించే భావాలు, వూహలు, ఆలోచనలు అన్నీ నిర్మలంగానే భాసిస్తాయి. అలాంటి ఆలోచనలు ఆలోచించేవారినే కాక, ఎదుటివారినీ ఆహ్లాదపరుస్తాయి.

ఆలోచించడానికి సమయం తప్పనిసరిగా కేటాయించుకునేవాళ్లు కొందరైతే, సమయం గడపడానికి- వ్యర్థమైన ఆలోచనల్ని ఆహ్వానించుకునే నిరర్థకులు కొందరు.

అందుకే ప్రతి మనిషీ ఏ విషయమై ఎంతవరకు ఎలా ఆలోచించాలో ప్రణాళికాబద్ధతను అలవరచుకోవాలి. విపత్కర, విషమ పరిస్థితుల్లో తీవ్రమైన భావోద్వేగాలకు, ప్రతికూల స్పందనలకు బానిసలై, కర్తవ్యతా విమూఢులై చేజేతులా జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్న వాళ్లెంతో మందిని మనం చూస్తున్నాం. ఆలోచనా సరళిలోని లోపాలు, బలహీనతలే ఇందుకు కారణమని చెప్పాలి. మనిషి వ్యక్తిత్వం ఈ ఆలోచనలశైలి మీదనే ఆధారపడి ఉంది. మనిషి భవితవ్యం ఈ ఆలోచనల ధోరణి మీదనే ఆధారపడి ఉంది. పరిస్థితులు, సాటివారి సంభాషణ, ఎదురవుతున్న సమస్యలు, కష్టాలు- వీటినిబట్టి ఆలోచనలను ఎప్పటికప్పుడు సవరించుకుంటూ, మార్చుకుంటూ, తగిన నిర్ణయాలు తీసుకుంటూండాలి. తమ ఆలోచనలనీ, నిర్ణయాలనీ కుటుంబ సభ్యులు, మిత్రులమీద బలవంతంగా రుద్దకూడదు. తన ఆలోచనల్లో పొరపాట్లు జరిగినప్పుడు నిస్సంకోచంగా పశ్చాత్తాపం ప్రకటించాలి. అదే ఉత్తమ మానవుడి లక్షణం.

అపరిమితమైన ఆలోచనలు ఆచరణలకు అవరోధం అవుతుంటాయి. అలాగే ఆలోచనా శూన్యత కూడా మనిషిని నిస్సహాయుణ్ని చేస్తుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేని ఆలోచనలు మనిషిని నిరాశా నిస్పృహలకు గురిచేస్తాయి.

శ్రీరాముడు తగిన సమయంలో వనవాస నిర్ణయం తీసుకోకపోతే పితృవాక్య పాలనా దక్షుడు అనిపించుకోగలిగేవాడు కాదు.

పరస్త్రీ వ్యామోహం వల్ల కలిగిన దురాలోచనల ఫలితంగానే పతనమైపోయాడు రావణాసురుడు.

దుర్యోధనుడు భూమి, పదవి, అధికార వ్యామోహపీడితుడై దాయాదులను హింసించి, అపమార్గాలోచనాదాసుడై అపఖ్యాతిపాలైనాడు. పౌరాణిక గాథల్లో ఇలాటి ఉదాహరణలు కోకొల్లలు.

మనిషి తనను తాను తెలుసుకోగలిగే ఆలోచనలు చేసినప్పుడు 'ఆత్మజ్ఞాని' అవుతాడు. ఆ ఒక్క బిరుదు చాలు- మంచి మనిషిగా జీవించడానికి!

- చిమ్మపూడి శ్రీరామమూర్తి

No comments:

Post a Comment