ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Friday 15 November 2013

దృఢ విశ్వాసం


వేద వాంగ్మయంలో హోమ పక్షి ప్రస్తావన ఉంది. ఆ పక్షి ఎప్పుడూ ఆకాశంలోనే ఎగురుతూ ఉంటుంది. దానికి ఆహారం ఆకాశంలో దొరకదు కాబట్టి, భూమి మీద ఆహారాన్ని స్వీకరిస్తుంది. కానీ, కాళ్లు భూమిపై మోపదు. అది గుడ్లు కూడా భూమిమీద పెట్టదు. ఆకాశంలో ఎగురుతూనే గుడ్డు జారవిడుస్తుంది. గుడ్డు భూమిపైకి జారేలోగానే దాన్నుంచి పక్షిపిల్ల బయటకు వస్తుంది. పిల్ల అలా కిందికి జారుతున్న సమయంలోనే రెక్కలు మొలుచుకొస్తాయి. పక్షిపిల్ల లక్ష్యం తన తల్లిని చేరటమే! రెక్కలు అల్లాడించి పైకి ఎగిరే ప్రయత్నం చేస్తుంది. నెమ్మదిగా తల్లిని కలుసుకోవడమనే లక్ష్యాన్ని సాధిస్తుంది. భగవంతుని చేరాలనే లక్ష్యాన్ని భక్తుడు అలా సాధించుకోవాలంటారు రామకృష్ణ పరమహంస. సంసారికైనా, సన్యాసికైనా ఆశించదగ్గ ఏకైక బ్రహ్మపదార్థం- భగవంతుడే!
   ఆధునిక ప్రపంచంలో లౌకిక జీవనం చేసే మానవులకు కర్మ, జ్ఞాన యోగాలు అనుష్ఠించడం ఎంతవరకు ఆచరణ సాధ్యం? కర్మయోగం నిష్కామకర్మను (చేసిన కర్మకు ఫలితాన్ని ఆశించకపోవడం) ప్రతిపాదిస్తుంది. నిష్కామకర్మ ఆధునిక జీవితంలో సాధ్యమా అని యోచిస్తే, సమాధానం ఆశాజనకంగా ఉండదు. జీతమే లక్ష్యంగా ఉద్యోగం, లాభమే లక్ష్యంగా వ్యాపారం, ఆదాయమే లక్ష్యంగా పెట్టుబడి- మనం చేసే అలాంటి వ్యాపకాలేవీ నిష్కామకర్మలు కావు. జ్ఞానయోగం నేను, నాది అనే భ్రమను వీడమంటుంది. స్థితప్రజ్ఞతను ప్రతిపాదిస్తుంది. సుఖాల్లో పొంగిపోతాం. కష్టాల్లో కుంగిపోతాం. రోగాలకు చలించిపోతాం. చావంటే వణికిపోతాం. మరి స్థితప్రజ్ఞత సాధించేదెన్నడు?

ఓ దేహధారిగా స్థితప్రజ్ఞుడికీ దేహావసరాలుంటాయి. ఆ అవసరాలు తీర్చుకోకుండా బతుకు బండి సాగదు. బాహ్యసంరక్షకులుగా ఎవరున్నప్పటికీ ఎవరికైనా దేహభారం వహించేది నిజానికి దైవమే. ఆ ఎరుకే ఆయన పట్ల మనిషి చూపగల నిజమైన కృతజ్ఞత! సంపద, పలుకుబడి, అందం, అధికారం, హోదా, కళాభినివేశం వంటి ప్రలోభాలకు దాసుడుకాని వ్యక్తి ఆత్మసాధన పట్ల నిజాయతీ కలిగి ఉంటాడు. కలియుగంలో భక్తిమార్గం ద్వారానే దైవాన్ని సాకారం చేసుకోవాలనే కల నిజం చేసుకోవచ్చంటాయి శాస్త్రాలు. లక్ష్యాన్ని సాధించగలనన్న సాధకుడి బలమైన విశ్వాసం అతడికి సత్ఫలితాలను అందిస్తుంది.

ఒకప్పుడు ఓ ప్రాంతంలో అనావృష్టి విలయతాండవం చేసింది. వరుణదేవుడి కరుణ కోసం గ్రామస్థులంతా దేవాలయంలో జప తపాలు, ప్రత్యేక పూజలు చేయాలని సంకల్పించారు. నిర్ణయించిన ముహూర్తానికి వైదిక కర్మలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణానికి ఓ బాలుడు గొడుగుతో వచ్చాడు. పూజాఫలంగా వర్షం కురుస్తుందనీ, అప్పడు ఛత్రం ఉపయోగించవచ్చనీ బాలుడి బలమైన విశ్వాసం. అటువంటి నమ్మకం అవసరం. లక్ష్యాన్ని సాధించగలనన్న దృఢ విశ్వాసం సాధకుడికి ఉండటం అత్యంత ఆవశ్యకం! 
లక్ష్యశుద్ధి లేకుండా లక్ష్యసిద్ధి జరగదన్నది పెద్దల మాట!
- గోపాలుని రఘుపతిరావు 

No comments:

Post a Comment