ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday 19 August 2013

జీవితం


  మనిషి ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ బతకడానికే ఇష్టపడతాడు. ఆ మాటకొస్తే ప్రతి ప్రాణీ అంతే! యాచక వృత్తి చేపట్టవలసి వచ్చినా అందులోనూ ఆనంద మకరందాన్ని ఒడిసిపట్టుకునే ప్రయత్నం చేస్తాడు మనిషి. జీవితం అన్న మూడక్షరాల పదం విభిన్న రుచుల మేళవింపు. ఒకరికది మధురం... మరొకరికి జీవితం ఓ పీడకల. ఇంకొకరికి అతి సామాన్యం. ఎందరికో అది దాట శక్యం కాని వైతరణి. అందనంత ఎత్తులకు ఎదిగినది మాత్రమే జీవితం కాదు. ఓ యాచకుడిది, ఓ భయానక దీర్ఘ రోగిదీ సైతం జీవితమే! ఓ దేహధారిగా అమ్మ కడుపు నుంచి బయటపడ్డాక మనిషి జీవయాత్ర ప్రారంభమవుతుంది. బాల్యంలో తల్లిదండ్రుల వాత్సల్యామృత ధారలో, యౌవనంలో భాగస్వామి ప్రేమైక జీవన సాహచర్యంలో, వృద్ధాప్యంలో కన్నబిడ్డల సంరక్షణలో గడుస్తుంది.

చాలీచాలని బతుకులు గడిపే సమయంలో ఎన్నో ప్రలోభాల విషవలయాలు చుట్టుముడతాయి. నేర్పుతో, ఓర్పుతో ఆ చక్రవ్యూహాల్ని ఛేదించుకు పోగలిగితే సరి! లేకపోతే పద్మవ్యూహాన్ని దాటి రాలేని అభిమన్యుడి అనుభవమే ఎదురవుతుంది. యోగ విద్య వల్ల మనిషి దీర్ఘాయువు, ఆనందమయ జీవితం సాధించగలడేమో కానీ- ధనం, అది సమకూర్చే సౌకర్యాల వల్లకాదు. దేహం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనసూ ఆరోగ్యవంతమవుతుంది. అందుకు అనుగుణంగానే ఆలోచనా సరళి ఉంటుంది. ఆలోచనలు సక్రమంగా సాగినప్పుడు ఇహంలోని అనేక సామాజిక రుగ్మతలకు ఔషధం దొరికినట్లే. సోమరిగా ఉంటూ మనసును పిశాచాలకు నెలవు చేసినప్పుడు ఉగ్రవాదం, తీవ్రవాదం, ఆర్థిక సామాజిక నేరాలు సహజంగానే పుట్టుకొస్తాయి.

మనిషి ప్రవర్తన వల్ల తన జీవితకాలాన్ని తానే నిర్దేశించుకుంటాడు. ఏం తినాలి, ఎలా జీవించాలి, ఏ క్రమశిక్షణ తాను గమ్యం చేరడానికి ఉపకరిస్తుంది, తన ధనం తనకు నిజంగా మేలు చేస్తుందా, తన గురించి పొరుగువారు ఏమనుకుంటారు? ఈ ఆలోచన చేసిన నాడు తన పోకడలో లోపం ఉంటే మనిషి సరిదిద్దుకునే వీలు కలుగుతుంది. సమాజానికి చీడపురుగులా తయారైన మానవుడు తన పతనం తానే కొనితెచ్చుకుంటాడు. అందరూ మహాత్ములు కాలే రు. అందరూ కొంగొత్త జీవిత ఆవిష్కరణలు చేయలేరు. నిజానికి అందరూ అందనంత ఎత్తులకు ఎదగగలిగే అవకాశమూ రాదు. మహాత్ములు ఏర్పరచిన బాటలో తమ గమ్యాన్ని నిర్దేశించుకున్న సాధకులు ధన్యులు. సాధనలో కృతకృత్యులైన సామాన్యులూ శ్రేష్ఠతములే!

'జీవితం మనిషికి ఒక్కసారే లభిస్తుంది. సరిగ్గా మలచుకుంటే నిజానికి ఈ ఒక్క జన్మచాలు, సార్థకత పొందవచ్చు!' అంటుంది 'మీ వెస్ట్‌' అనే పాశ్చాత్య కళాకారిణి.

'చాలామంది పేరుకు జీవిస్తారు. కొందరు మాత్రమే జీవితాన్ని జీవితంలా జీవించడంలో సఫలీకృతులవుతా'రన్నది ఆస్కార్‌ వైల్డ్‌ అభిప్రాయం.

మానవజీవితం జీవనదీ ప్రవాహంలాంటిది. ఆ ప్రవాహలక్ష్యం సాగర సంగమమైనట్లు, మానవ జీవిత ఏకైక లక్ష్యం మోక్షం కావాలంటాడు విదురుడు. సూర్యోదయ సూర్యాస్తమయాలు ప్రతి జీవితానికీ ఆద్యంతాలు ఉంటాయని హెచ్చరిస్తాయి. అల్పాయుష్కుడైన మనిషి తాను జీవించి ఉన్న కొద్దికాలంలో తన బతుకు ఎవరికీ భారం కాకుండా మంచిని పూయించి జీవన మకరందాన్ని పొంది ఆనందించే ప్రయత్నం చేయాలి. పదుగురికీ ఆదర్శప్రాయంగా జీవించగలిగినప్పుడే మానవ జీవితం సార్థకమవుతుంది.                                                                       - గోపాలుని రఘుపతిరావు

No comments:

Post a Comment