ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Tuesday 12 November 2013

ప్రేమామృతం


ప్రేమ అనే రెండక్షరాల్లో అద్భుతమైన ఆకర్షణ ఉంది. ప్రేమకు అంతరాలు లేవు. ప్రేమ ఎంతో పవిత్రమైనది. ఎంతో శక్తిమంతమైనది. ఔదార్యంతో నిండిన ఉదాత్తమైన త్యాగగుణం ప్రేమలోనే ఉంది.

ప్రేమంటే తనను తాను అర్పించుకోవడమే. ఎదుటివాళ్లు తమకు అర్పణ కావాలని కోరుకోవడం కాదు. రాధ ఈ సంగతి లోకానికి చాటిచెప్పింది. రాధ హృదయం గోపాలుని నిలయం. ఆమె మనసు వెన్నకన్నా చల్లనైనది. పలుకు తేనెకన్నా తీయనైనది. ఆమెకు కావలసినది కృష్ణుడి క్షేమమే. అందుకే ఎలాంటి త్యాగానికైనా ముందుండేది.

హృదయాన్ని మనసావాచా ప్రేమించడమంటే ఆ హృదయంలోని భావాలన్నింటినీ యథాతథంగా స్వీకరించడమనే దివ్యజ్ఞానానికి ప్రతీక రాధ. అందుకే ఆమెకు కృష్ణుడే లోకమయ్యాడు. సత్యభామ తలపెట్టిన తులాభారం గురించి తెలిసినప్పుడు రాధకు చెప్పలేనంత బాధ కలుగుతుంది. ధనకనకాలేవీ తూచలేని కృష్ణుడిని రుక్మిణి తులసిదళంతో తూచగలిగిందని అందరూ గొప్పగా చెప్పుకొంటారు. అలాంటి విశిష్ట వ్యక్తిని, గొప్ప వ్యక్తిని దేనితో తూచినా తప్పేనని భోరుమంటుంది రాధ. ధనంతో ఆ ప్రయత్నం చేసిన సత్యభామ అయినా, తులసిదళంతో అందుకు పూనుకొన్న రుక్మిణి అయినా తన దృష్టిలో ఒకటేనని బాధపడుతుంది. అంతటి శుద్ధమైన కృష్ణప్రేమ రాధ సొంతం.

దేవకీసుతునిలో ఐక్యం కావడానికే జీవాత్మ అయిన రాధ జన్మించింది. దేవుడు, జీవుడు ఏకమయ్యే విశుద్ధ ప్రక్రియ ఇది. వీరిది అభౌతికమైన అపూర్వ బంధం.

స్వార్థంలేని పవిత్ర ప్రేమకు చిహ్నం రాధ. ఆమె కృష్ణుడికి భార్య కావాలని కోరుకోలేదు. ఆ స్వామిని నిస్వార్థంగా ఆరాధించింది. దేవుడిలా పూజించింది. ప్రేమంటే ఆకర్షణ కాదని, ఆప్యాయతల హరివిల్లని లోకానికి చాటిచెప్పింది రాధ. అందుకే ఆమె ప్రేమ నేటికీ సజీవంగా నిలిచిపోయింది. ప్రేమ ఉన్నచోట భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడు ఉన్న ప్రదేశమంతా ప్రేమమయమే. ప్రేమతోనే నరుడు నారాయణుడవుతాడు. ప్రహ్లాదుడు శ్రీహరిని ప్రార్థించాడు. బాల్యంనుంచీ ఆ నారాయణుడే లోకమని భావించి, ప్రేమించి బాలభక్తుడిగా నిలిచిపోయాడు.

ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ భక్తి, సేవాగుణం ఉంటాయి. వాల్మీకి రచించిన రామాయణంలో దీనికి సంబంధించిన ఉదాహరణలు ఎన్నో కనిపిస్తాయి. శ్రీరాముడి పాదుకలను తలపై ఉంచుకొని అయోధ్యకు మరలిన భరతుడిది సోదర ప్రేమ అయితే, రాముణ్ని గంగానది దాటించిన గుహుడిది స్నేహపూర్వకమైన ముగ్ధభక్తి. ఇక జటాయువు, శబరి, ఆంజనేయుడు- రాముణ్ని ప్రేమించి, అభిమానించి సేవించిన తీరు అమోఘం. ఆ ప్రేమలో ఆత్మీయత ఉంది. భక్తి ఉంది. సృష్టిలో ప్రేమకు ఉన్న శక్తి దేనికీ లేదు.

లేగదూడను ఆవు ఎంతలా ప్రేమిస్తుందో అంత ప్రేమ మనలో ఉండాలని వేదం చెబుతోంది. తన బిడ్డను ప్రేమించడంలో గోవుకు ఎలాంటి స్వార్థం లేదు. ఆ ప్రేమ సహజమైనది. స్వచ్ఛమైనది. మనం కూడా ఇతరులను ఆ విధంగానే ప్రేమించాలి. మనిషి ఏది సాధించాలన్నా ప్రేమతోనే సాధ్యమవుతుంది. ప్రేమ ఆనందాన్ని కలిగిస్తుంది. శత్రువును మిత్రుడిగా మారుస్తుంది. ప్రేమంటే అందమైన మనుషుల్ని, జీవుల్ని, అందమైన ప్రదేశాలను ప్రేమించడం కాదు. ఈ సృష్టి మొత్తం భగవంతుడి ప్రతిరూపమే కాబట్టి అందర్నీ ప్రేమించాలి. ఆ ప్రేమలో ఎలాంటి తారతమ్యాలూ చూపించకూడదు.

ఆత్మీయులనే కాకుండా అనాథలనూ ప్రేమించగలగాలి. అప్పుడే మనిషి మాధవుడవుతాడు. ప్రేమ స్వరూపుడవుతాడు.
- విశ్వనాథ రమ

No comments:

Post a Comment