ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Tuesday 1 April 2014

జీవన సూత్రం

 శ్రీకృష్ణదేవరాయలు రాసిన జాంబవతీ కల్యాణం అనే సంస్కృత నాటకంలో భరతవాక్యం ఈ రీతిగా ఉంటుంది.
'నా సామ్రాజ్యాన్ని ప్రజలు ఎన్నటికీ మరిచిపోకుండా ఉండాలి. నేను నా ప్రజల సౌకర్యం కోసం ఇచ్చిన కానుకలు చిరకాలం కొనసాగాలి'

అదే రాయల జీవన సూత్రమైంది. అదే ఆయనను చిరస్మరణీయుణ్ని చేసి సాహితీ సమరాంగణ సార్వభౌముణ్ని చేసింది. ఎంత అద్భుతమైన జీవన సూత్రం ఇది!

రాజ్యం ఏలే చక్రవర్తికాని, ప్రజలు ఎన్నుకునే నాయకుడు కాని ప్రజాక్షేమం గురించి ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే ఆ వ్యక్తి చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతాడు. ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది.

రఘువంశం రాసిన కాళిదాసు రఘువంశీయుల గొప్పతనాన్ని, ఆ రాజుల జీవనసూత్రాన్ని ఇలా కీర్తిస్తాడు. 'సముద్రం నుంచి నీరు తీసుకున్న సూర్యుడు ఆ నీటిని తనలో దాచుకోకుండా వాన రూపంలో మళ్ళీ భూమి మీదకు వర్షిస్తాడు, ప్రజలకు మంచినీటి కొరత తీరుస్తాడు. సూర్యుడు ఉప్పునీటిని తాను స్వీకరించి ఆ నీటిని శుభ్రపరచి అందరికీ ఉపయోగపడేటట్లు మంచినీటిని అందిస్తున్నాడు'

ఆ విధంగానే రఘువంశంలో పుట్టిన దిలీపుడు కూడా ప్రజలకు సేవచేయడానికి మాత్రమే పన్నులు విధించి వసూలు చేసేవాడు. ఎవరు కట్టగలరో ఎవరు కట్టలేరో చూసి వారి నుంచే పన్నులు వసూలు చేసేవాడు. సేకరించిన సొమ్మును ప్రజాప్రయోజనాలకు వినియోగించేవాడని రఘువంశంలో పుట్టిన దిలీపుడి గొప్పతనాన్ని వర్ణిస్తాడు కాళిదాసు.

అందుకే రఘువంశరాజుల కీర్తిప్రతిష్ఠలు చిరస్థాయిగా నిలిచి పోయాయి. కలిసి రక్షించుకుందాం. కలిసి భుజిద్దాం. కలిసి శక్తిమంతులవుదాం. మనకు తేజస్సు కలగాలి. మనం ద్వేషించుకోం. ఒక్క మాటలో చెప్పాలంటే కలిసి ఉంటే కలదు సుఖం అని అర్థం. ఇదే వేదం చెప్పిన జీవనసూత్రం. ఐకమత్యం గొప్పతనాన్ని వేదం ఎంత గొప్పగా చెప్పిందో! అంతేకాదు. వేదం మనిషి ఎలా బతకాలో చెప్పింది.

మనిషి నూరేళ్లు బతకాలి. అదీ ఎలా అంటే చక్కగా చూస్తూ, చక్కగా వింటూ, మంచి మాట్లాడుతూ, ఎవరికీ ఆధీనుడు కాకుండా బతకాలి. ఇలా ఎవరైనా ఉంటే వందేళ్లు బతుకుతారని అర్థం. వేదం శాంతి సౌభాగ్యాల గురించి చెప్పింది. ఎవరి ధనాన్నీ దొంగిలించవద్దని చెప్పింది. ద్వేషం లేని ప్రేమైక సమాజం జాతికి వెలుగునిస్తుందని చెప్పింది. అందుకే వేదం అంటే జ్ఞాన ప్రవాహం. ఇది మనిషి మనసులోని మలినాలను దూరం చేస్తుంది.

అహింసా సిద్ధాంతంతో ముందుకు సాగిన గాంధీజీ జీవనసరళి ఎంత నిరాడంబరమైనదో! ఆ జీవనసూత్రంతోనే ఆయన పురోగమించి కొన్ని కోట్లమందికి ఆరాధ్యులయ్యారు.

నేడు మనిషికి కావలసినది మతాలు, మొక్కుబళ్లు కావు. కావలసినది దయ, ధర్మం. అవే మనిషిని మహోన్నతుణ్ని చేస్తాయి.

ఈ తమోమయ ప్రపంచంలో ఆత్మకు సుఖశాంతులు ప్రసాదించేవి ధన, కనక, వస్తు వాహనాదులు కానే కావు. అందరినీ ప్రేమించాలి. మనకు ఉన్నదాన్ని పదిమందికి పంచాలి. దరిద్రనారాయణుల సేవలో పాలుపంచుకోవాలి. ఇవే మనిషికి జీవనసూత్రాలు కావాలి.

ఈ జీవనసూత్రాలు ఆచరిస్తూ మనిషి ముందుకు సాగితే ఈ సమాజమే నందనవనమవుతుంది. ఆ మనిషి మహోన్నత మానవమూర్తిగా నీరాజనాలందుకుంటాడు.
 - విశ్వనాథ రమ 

No comments:

Post a Comment