ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday, 12 May 2014

జీవన సౌఖ్యాలు


నిషి పుట్టిన తరవాత, బుద్ధి తెలిసిన నాటినుంచి అతడు అనుక్షణం కోరుకునేది సౌఖ్యం. అయితే సౌఖ్యం అంత సులభంగా దొరకదు. దానికోసం కష్టపడాలి. కష్టం చేయకుండా ఇష్టమైన సౌఖ్యం సాధ్యం కాదు. అందుకే దుఃఖానంతరం సుఖం, సుఖానంతరం దుఃఖం- చక్రంలా మనిషి జీవితంలో తిరుగాడుతూ ఉంటాయని అన్నీ తెలిసిన పెద్దలు అంటారు. సుఖదుఃఖాలు శాశ్వతాలు కావని సారాంశం.
మనిషి ఎంత స్వార్థపరుడంటే, చివరికి మరణం కూడా సుఖంగానే రావాలని భగవంతుణ్ని కోరుకుంటాడు. నిరంతరం పాపాలు చేసే మనిషి, చేసిన పాపాలకు ఎప్పుడో ఒకప్పుడు శిక్ష అనుభవించాలి కదా! చేసిన పాపాలకు శిక్షపడకుండా తప్పించుకోవాలని శతవిధాలా ప్రయత్నించడం మానవనైజం. శిక్షానుభవం తప్పదంటే, కనీసం కొన్నేళ్లపాటు శిక్షను వాయిదా వేసుకోవడానికైనా ప్రయత్నిస్తాడు. అంటే మనిషి ఎంతటి సుఖలాలసుడో తేటతెల్లం అవుతుంది. కష్టాలకు భయపడే మనిషిని కాలం ఇంకా భయపెడుతుంది. భయం ఒక మానసిక బలహీనత. ఇది ఉంటే అన్ని రోగాలూ ఉన్నట్లే. చీమ చిటుక్కుమన్నా భయపడేవాడు ధీరుడు ఎలా కాగలడు? అందుకే మనిషి భయాన్ని జయించాలి. అందుకోసం కష్టాన్ని సైతం ఇష్టపడాలి. మహాత్ములు కష్టాలకు భయపడరు. వనవాసంతో సీతారామ లక్ష్మణులూ, పంచపాండవులూ పొందినంత కష్టం లోకంలో ఎవరైనా పొందారా? అయినా వారు ఎంత ధైర్యంగా ఉన్నారో గ్రహిస్తే 'భయం' అనేది మిథ్య అని తేలుతుంది.

నిరంతరం ధనం వస్తుండటం, రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉండటం, మనసుకు నచ్చిన- మధురంగా మాట్లాడే భార్య ఉండటం, తన మాటను జవదాటని కొడుకులు లేదా కూతుళ్లు ఉండటం, డబ్బును సంపాదించి పెట్టే విద్య ఉండటం... మనిషి జీవితంలోని సౌఖ్యాలని 'హితోపదేశం'లో నారాయణ పండితుడు అంటాడు. ఇవన్నీ ఉన్నవారు నేటిలోకంలో చాలా అరుదు. ప్రవాహంలా డబ్బు వస్తే వస్తుందేమోగానీ, అనారోగ్యాలు రాకుండా ఎలా ఉంటాయి? 'లక్షాధికారి అయినా లవణాన్నమే తింటాడుగానీ బంగారు ముద్దలను మింగలేడు' అని నరసింహ శతకకర్త అంటాడు. నేడు కోటీశ్వరుడికి షడ్రసోపేత భోజనం చేసే అదృష్టం ఉండదు. ఈ రెండూ (డబ్బూ, ఆరోగ్యం) ఉంటే ఇంట్లో భార్యానుకూల్యం ఉండదు. భార్య అనుకూలవతి అయినా, కొడుకులు చెడుదారి పడతారు. చెప్పిన మాటలు వినరు. కూతుళ్లూ అంతే. అన్నీ ఉన్నా, డబ్బు సంపాదించిపెట్టే విద్య ఉండదు. ఇలా మానవ జీవనంలో అన్నీ సక్రమంగా ఉండటం అనేది ఎండమావే.

కొందరు ధార్మికులు అంటారు- 'మనిషికి ఇన్ని కష్టాలున్నా, తనను పుట్టించిన దేవుణ్ని కనీసం కృతజ్ఞతతో తలవడమే లేదు. దేవుడు అన్ని సౌఖ్యాలూ వాడికి ఇస్తే, ఇక దేవుణ్ని లెక్కచేస్తాడా?' అని. ఇందులో సత్యం లేకపోలేదు. ఎన్ని కష్టాలున్నా మనిషి కృతఘ్నుడు కాకూడదు. తన పుట్టుపూర్వోత్తరాలను స్మరించుకోవాలి. తన జన్మకు కారణమైనవారిని తలచుకొని, నమస్కరించాలి. వీలైతే సేవ చేయాలి. అందులోనే మానవ సౌఖ్యం ఉంది. సేవలో సౌఖ్యాన్ని అనుభవిస్తున్న గొప్ప మనుషులెందరో లోకంలో ఉన్నారు!

మనిషి అమితంగా సుఖాలకు అలవాటు పడటం మంచిది కాదు. శ్రుతిమించిన సౌఖ్యం శరీరాన్ని భారంగా మార్చివేస్తుంది. అనారోగ్యాలకు ఆలవాలమవుతుంది. కనుక కష్టాన్ని కూడా ఇష్టంతో ఎదుర్కోవాలి. పురాణ పురుషులందరూ భగవంతుణ్ని ప్రార్థించే సమయంలో, తమకు కష్టాలే ఉండాలని కోరుకునేవారట. దాని పరమార్థం- కష్టాలుంటేనే భగవంతుడు గుర్తుకు వస్తాడు. లేకుంటే మనిషి భగవంతుణ్ని కూడా మరచిపోతాడు. కష్టాల్లో భగవంతుణ్ని తలచుకుంటే, అతడు భక్తుణ్ని ఇష్టపడతాడు. ద్రౌపదీ మాన సంరక్షణం, గజేంద్రమోక్షం లాంటి కథలు ఇందుకు ఉదాహరణలు.

స్వప్న వాసవదత్త నాటకంలో విదూషకుడన్నట్లు 'సుఖం అంటే రోగాలతో గడపడం కాదు, ఆరోగ్యంగా ఉండటమే' అనే మాటల్ని తలచుకుంటే 'ఆరోగ్యమే సౌఖ్యం' అనేది అక్షరసత్యం. మానవాళి ఆయురారోగ్య భాగ్యాలతో ఆచంద్రార్కం వర్ధిల్లుగాక! శ్రుతిమించిన సుఖాలను కోరకుండుగాక!
- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

No comments:

Post a Comment