ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Saturday 10 May 2014

నేను-ఏమిటి?


'నేను' అనే పదానికి లోతైన అర్థం ఉంది. రోజూ కనీసం పదిసార్లయినా చెప్పుకొనే ఈ పదానికి అర్థం చాలామందికి తెలీదు. అదేమిటో అనుభవిస్తేగాని అంతుపట్టని ఒక చిత్రమైన ప్రయోగం.
మంత్రార్థం తెలుసుకోకుండా ఎన్నిసార్లు మంత్రం వల్లెవేసినా ఫలితం దక్కదు. అన్ని మంత్రాలకు అతీతమైన ఈ 'నేను' అనే మూలమంత్రం గురించి తెలుసుకుని మననం చేయకపోతే జీవితకాలం వృధా అయిపోతుంది.

ఇంతకూ 'నేను' అంటే ఏమిటి? కాలా, మోకాలా? తొడా, నడుమా? కడుపా, కాలేయమా? గొంతు, నోరు, ముక్కు, మొహం, చెవులు, కళ్లు, గుండెకాయ, తలకాయ- ఇవేవీ కాదు. ఇవన్నీ శరీరంలోని భాగాలు మాత్రమే. ఒకదానితో మరొక దానికి పోలిక లేదు. వాటి రూపాల్లా వాటి కర్మలూ వేరువేరు. ఒకవేళ వాటికి తామేమిటో తెలియజేయగల అవకాశం కలిగితే, దేనికది నేను అంటే ఆశ్చర్యపోనవసరంలేదు. అంచేత, నేనుకు అర్థం వీటిలో వెతకటం వృధా ప్రయాస.

కాస్త కుదురుగా కూర్చుని, ప్రశాంతంగా ఆలోచిస్తే, ఈ విభజనకు అతీతంగా ఒక అఖండ చైతన్యం ఉండవచ్చునన్న తలపు, తలుపు తడుతుంది. ఆ చైతన్యమే అన్నింటా నిండి నిబిడీకృతమై ఉండాలన్న అభిప్రాయం కలుగుతుంది. అన్ని జీవరాశుల్లో ఉన్న ఈ నేను- దేవ, మానవ, దానవ గణాలకు అన్వయిస్తుందన్న ఎరుక ఏర్పడుతుంది.

ఈ మేను- నేను కాదని తెలియకపోవటంవల్ల, జీవితంలో వ్యాకులపాటు, భయభ్రాంతులు చోటుచేసుకున్నాయి. మేనుకు, నేనుకు మధ్య అవిద్య ఒక అడ్డుగోడ కావటంవల్ల, ఈ ప్రపంచం అడ్డగోలుగా, తలకిందులుగా కనిపిస్తోంది. ఇలా మనల్ని తికమకపెడుతోంది, ఆత్మ నుంచి మరింత దూరం చేస్తోంది- వికారషట్కం! అంటే, 'నేనున్నాను, నేను పుట్టాను, నేను పెరుగుతున్నాను, నేను మార్పుకు లోనవుతున్నాను, నేను తరిగిపోతున్నాను, నేను చనిపోతున్నాను' అన్న ఆరు వికారాలే భ్రాంతికి మూలకారణం. ఈ భ్రాంతి ముదిరి భవరోగంగా మారిపోతుంది. కురుక్షేత్రంలో అర్జునుణ్ని పట్టుకున్న ఈ భవరోగం అతణ్ని విషాద యోగానికి గురిచేసింది. వివేకం కోల్పోయి వియోగబాధతో విలవిల్లాడిపోయాడు. అది మరింత విషమించకుండా కృష్ణుడు గీతామృతం అందించి తగిన చికిత్స చేశాడు నరుడికి.

ఆ నరుడి సంతతి మనది కాబట్టి ఈ ఆరు వికారాల భవరోగానికి దూరంగా ఉండాలి మనం. అలతోపాటు ఆకాశానికి ఎగసిన ఒక నీటి బిందువు తన అస్తిత్వపు మూలం తెలుసుకుని తిరిగి ఆ సింధువులో ఒక బిందువుగా మారిపోయింది. ఇంతే నేను అన్న భావనవల్ల మనల్ని మనం పరిమితం చేసుకుని అజ్ఞానంలో కుమిలిపోతున్నాం. భావనే భవకారణం కాబట్టి, మనసును అన్నివైపులా వ్యాప్తిచెందేలా ప్రయత్నం చేయాలి. సాధన వల్ల అంతా నేనే భావన బలపడి, మనసు సముద్రమంత విశాలమవుతుంది. భూమి ఆకాశం ఏకమైనట్టు, పరిమితమైన నేను అపరిమితమైన నేనుతో లీనమైపోవటమే యోగం.

నేను- ఏమిటి అన్న ప్రశ్నకు సంతృప్తికరమైన జవాబు రాబట్టుకోవటం అంత సులభం కాదు. కనీసం ఈ జీవితంలో రోజూ ఎదురయ్యే మూడు ప్రశ్నలకు సమాధానం తెలుసుకోగలిగితే జీవితం ధన్యమవుతుంది. శరీరం ఆలోచనల దృశ్యరూపం, మనసు అదృశ్యరూపం, ఆత్మ నగ్నరూపం!
- ఉప్పు రాఘవేంద్రరావు

No comments:

Post a Comment