ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Wednesday, 22 May 2013

వినమ్రత


ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే గొప్పతనమని ప్రకృతి మనకు బోధిస్తోంది. ఆ లక్షణమే వినమ్రత. 
             మృదుమధురమైన ఫలసంపదను ఇచ్చే వృక్షాలు ఫలభారంతో వంగి కనిపిస్తాయి. ప్రాణికోటికి జీవధారను అందించే మేఘాలు భూమాతకు దగ్గరగా ఉన్నట్లు వినయంగా కనిపిస్తూ వర్షధారలు కురిపిస్తున్నాయి. నీరు పల్లాన్ని ఆశ్రయిస్తూ సమస్త జీవులకు అందుబాటులో ఉంటోంది. ఇలా ప్రకృతి మొత్తం వినమ్రతతతో కనిపించి మానవాళికి సేవచేస్తోంది.లోకంలో సత్పురుషులు కూడా వినయవిధేయతలతో, వినమ్రతతో మహోన్నతమైన కార్యాలు పూర్తిచేశారు.
        వాల్మీకి రామాయణంలో అయోధ్యకాండలో శ్రీరాముని వ్యక్తిత్వాన్ని గురించి వాల్మీకి చెబుతూ 'శ్రీరాముడు చక్కని బుద్ధి కలవాడు, ఎవరినైనా తానే ముందుగా పలకరించేవాడు. తాను ఎంత బలవంతుడైనా ఏ మాత్రం బలగర్వంలేని వినయశీలి' అని ప్రస్తుతిస్తాడు. 
         వినమ్రత అంటే అందరిలోనూ భగవంతుని దర్శించే ప్రయత్నమే. వినయ విధేయతలున్నవారే భగవంతుడి కృపకు పాత్రులవుతారు. 
మానవుణ్ని జ్ఞానపథంవైపు నడిపిస్తూ విజ్ఞానకాంతులు నింపే విద్య కూడా వినమ్రత లేకపోతే శోభిల్లదని పురాణాలు చెబుతున్నాయి. 
ప్రహ్లాద చరిత్రలో హిరణ్యకశిపుడు ఏమేమి చదివావో చెప్పమని కొడుకైన ప్రహ్లాదుణ్ని ప్రశ్నిస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు గురువులు తనను బాగా చదివించారనీ చెబుతాడు. ధర్మశాస్త్రాలను చదివానని అంటాడు. ఇంకెన్నో చదివానని చెబుతూనే 'చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!' అని వినమ్రతతో అద్భుతమైన విశ్లేషణ ఇస్తాడు.
        వినమ్రంగా ఉండటం ఆత్మన్యూనతగా భావిస్తారు కొందరు. కానీ విధేయత అనేది ఓ మానవీయమైన సౌజన్య లక్షణం. స్వాభిమానాన్ని పెంచుకున్నప్పుడు మనిషిలో గర్వం, అహంకారం అధికమవుతాయి. మనకంటే సద్గురువులు ఎంతోమంది ఉన్నారని, వారి వద్దనుంచి నేర్చుకోవలసినది చాలా ఉందని తెలుసుకున్నాక- హృదయంలో అహంకార పొరలు కరిగి వినమ్రతాభావం ప్రవేశిస్తుంది. 
     మహాభారతంలో మానవ సంబంధాలకు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన చిన్న కథలెన్నో ఉన్నాయి. అవి అద్భుతమైన సందేశాలు అందిస్తాయి. 
ఒకసారి సముద్రుడు నదులతో సమావేశమై ఒక ప్రశ్న అడిగాడు. 'నదులారా! మీరు వరదలతో వేగంగా ప్రవహించేటప్పుడు, కొండలపైనుంచి దూకేటప్పుడు పెద్ద పెద్ద చెట్లను పడగొట్టేస్తారు. వూళ్ళకు ఖీ000ళ్ళు ముంచెత్తుతారు. కాని అల్పమైన తుంగ మొక్కలు మాత్రం చెక్కుచెదరకుండా ఉంటున్నాయి. వాటిని మీరెందుకు కదిలించలేకపోతున్నారు?' అని అడుగుతాడు.
           అప్పుడు అన్ని నదుల పక్షాన గంగానది సముద్రుడితో 'మేము వేగంగా ప్రవహించేటప్పుడు కొండలు, చెట్లు అహంకారంతో మాకు అడ్డుగా నిలుస్తాయి. అందువల్ల మా బలాన్ని చూపించి వాటిని పడగొట్టేస్తాం. ప్రబ్బలి, తుంగవంటి మొక్కలు మా రాకకు స్వాగతం చెబుతున్నట్లు వినయంతో తలవంచుతాయి. కనుక మేము వాటిమీదుగా ప్రవహించి నీ దగ్గరకు చేరుకుంటాం. తరవాత అవి తలలు ఎత్తి మునుపటిలా బతుకుతాయి. అంతే తప్ప వాటిమీద మాకు ప్రత్యేకంగా ప్రేమ ఏమీ లేదు' అని చెబుతుంది.
           శత్రువు బలవంతుడైతే బలహీనుడు ఏ ఉపాయంతో ఆపదనుంచి తప్పించుకోవాలో వివరిస్తూ భీష్ముడు ధర్మరాజుకు ఈ కథ చెబుతాడు. ఈ విధంగా వినమ్రతలోని గొప్పతనాన్ని లోకానికి వెల్లడిస్తాడు. 
వినమ్రత మానవ జీవితానికి ఆభరణం వంటిది. దానివల్ల మనిషి గుణాలు మరింతగా పరిమళిస్తాయి. విద్వాంసుడి పాండిత్యం, ధనవంతుడి ధనం, బలవంతుడి బలం, గుణవంతుడి నమ్రత అనే గుణాలు లోకహితం కోసం వినియోగించడం మంచిదని నీతికోవిదులు చెబుతున్నారు. 
వినమ్రత మనిషి జీవితాన్ని మంచిమార్గం వైపు నడిపిస్తుంది. విలువలతో కూడిన జీవనమార్గాన్ని చూపిస్తుంది. అందుకే ఉత్తముడైన మనిషి ఎవరినీ ఎగతాళి చేయకూడదు. అసభ్యకరంగా ఏనాడూ ప్రవర్తించకూడదు. పెద్దలను, గురువులను గౌరవించాలి. ఏ మనిషైనా ఎంత ఒదిగి ఉంటే అంత ఎదుగుతాడు.
         పోల్చి చూసుకోవడం, పోటీపడటం- ఈ రెండూ ఈర్ష్యాసూయలకు సంబంధించినవి. వీటివల్ల మనిషి ఎదగలేడు. మంచి ఆలోచనలతో ముందుకు సాగి మనమేమిటో మనం గ్రహించి ఉన్నతంగా అభివృద్ధి చెందడానికి ప్రయత్నించాలి. 
సభ్యసమాజం మనిషి గుణశీలాలకు, వినయవిధేయతలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే వినమ్రతను ఓ సంపదగా భావించి ఏ మనిషైనా ముందుకు సాగితే, ఎల్లప్పుడూ అతడే విజేత

                                                                    - విశ్వనాథ రమ


No comments:

Post a Comment