ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday 1 May 2014

స్వర్గం- నరకం

నలో చాలామంది స్వర్గనరకాలను నమ్ముతారు. అవి నిజంగా ఉన్నాయా అన్న అనుమానం మనకు ఒక్కోసారి వస్తుంటుంది. 'నువ్వున్నది స్వర్గమా, నరకమా అన్నది నీ మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది' అన్నాడు బుద్ధుడు.
   
ఒకడికి మనశ్శాంతి లేదు. ఎవరో ఏదో అన్యాయం చేశారనో, మరే కారణంవల్లో అతడి మనసు గాయపడింది. అలజడి, ఆందోళన, ఒత్తిడి, నిస్పృహ, అసూయ, ద్వేషం, కోపం... ఇలా ఏదోటి అతనికి మనఃస్థిమితం లేకుండా చేశాయి. అంటే, అప్పుడతడి మనసు నరకప్రాయమైందని అర్థం. ఇక్కడ నమ్మకంతో ప్రసక్తిలేదు. అతడికది స్వానుభవం!
 
ఇంకొకడి మనసులో నిర్మల ప్రశాంతత. ప్రేమ, కరుణ, క్షమ, ఆర్ద్రత, వెన్నెల... ఏదోటి నెలకొని ఉన్నాయి. ఇక్కడా నమ్మకంతో పనిలేదు. ఒక అపురూప అనుభూతితో మనసు నిండి ఉంది. అదే స్వర్గం. అతడికది స్వాను భవం!
 
తన జీవితంలో సుఖమొక్కటే ఉండాలనుకునేవాడికి, తనకెలాంటి బాధలు కలగకూడదనుకునేవాడికి అడుగడుగునా అసంతృప్తే మిగులుతుంది. బాధే కలుగుతుంది. అనుభవాలు నరక సదృశమవుతాయి.

తన జీవితంలో దొరికినదానితో తృప్తిపడేవాడికి, తనకెంత కష్టంవచ్చినా ఓర్చుకోగలిగినవాడికి అనుక్షణం స్వర్గధామమే!

ప్రతి అనుభూతి పరిపూర్ణ సంతోష భావనగా గ్రహించగలిగిన స్థితప్రజ్ఞుడు ఎంతటి దుఃఖ భాజనుడితోనైనా నిశ్శబ్దంగా సంభాషించగలుగుతాడు. అతడి దుఃఖంలో పాలుపంచుకుంటాడు. తన సుఖాల్ని అతడికి పంచిపెడతాడు. అతణ్ని తన నరకంలోంచి బయటకులాగి తన స్వర్గంలోకి వెంటపెట్టుకుని వెళ్లిపోతాడు.

ఇది సుఖపడే కాలం, ఇది బాధపడాల్సిన సమయం అంటూ ఎవరి జీవితంలోనూ ఎక్కడా రాసి పెట్టి ఉండవు. అంతా ఆ వ్యక్తి వర్తమాన మానసిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అప్పటి కోరిక తీవ్రతనుబట్టి ఉంటుంది.

తాను పరిమళాలను వెదజల్లాలని ప్రత్యేకంగా ఏ పువ్వూ అనుకోదు. అందరినీ తన సువాసనలతో సరిసమానంగా ఆనందపెట్టడం దానికది ప్రకృతి ధర్మం. అలాగే, తన జ్ఞాన పరిమళాలతో పరిసర వ్యక్తుల్ని ప్రభావితం చేయటం- ఒక పరమజ్ఞానికది సహజగుణం! తనకు ఉన్నంతలో తోటివాడి అవసరాలు తీర్చడం ఒక నిర్మల నిస్వార్థ హృదయానికి జన్మతో వచ్చిన త్యాగగుణం.

స్వార్థంతో, అహంకారంతో, అసూయతో తాను సుఖపడకుండా ఇతరులను ఆనందపడనీయకుండా తన బతుకు దుఃఖభరితం చేసుకునే మనిషి జీవితం అతడికే కాకుండా అందరికీ దుర్భరమే!

మనిషి మరణానంతరం స్వర్గ నరకాల్లో దేనిలోకి ప్రస్థానం జరుపుతాడో అన్న మీమాంసతో వర్తమానాన్ని అశాంతి పాలు చేసుకోవాల్సిన అవసరంలేదు.

ఇక్కడే ఈ భూమి మీదే స్వర్గ నరకాల్లో దేనిలో బతకాలన్నా ఆ భగవంతుడు మనిషికి సమానమైన అవకాశాలు అడుగడుగునా సమకూరుస్తూనే ఉం టాడు. దేనిలో ప్రవేశించటమా అన్నది ఆ మనిషి చేతుల్లోనే ఉంది! 
- తటవర్తి రామచంద్రరావు 

No comments:

Post a Comment