ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday 20 May 2013

అనుసరణీయం



  ఉపనిషత్తులనే ఉద్యానవనం నుంచి ఆధ్యాత్మిక సత్యాలనే పుష్పాలను ఏర్చి కూర్చిన మాలయే భగవద్గీత అని ఉద్ఘాటించారు స్వామి వివేకనంద. అందుకే గీతను ప్రపంచ మానవాళికంతటికీ పెన్నిధి అంటారు. గీతలో భక్తియోగం, ధ్యానయోగం, జ్ఞానయోగం ఉన్నాయి. మనలోనూ భక్తిజ్ఞానాలు ఉన్నాయి. మనం ధ్యానం చేస్తాం. దైనందిన జీవితంలో ఎన్నో పనులు చేస్తుంటాం. ఈ కర్మలు (పనులు) చేయనిదే మన జీవితాలు ముందుకు సాగవు. మనకోసం, మన కుటుంబం కోసం పనులుచేస్తూ బతుకుతాం. జ్ఞానశూన్యమైన మానవేతర ప్రాణికోటీ అలాగే బతుకుతోంది. ఇలా బతకడం చెప్పుకోదగినదీ కాదు, గొప్పదీ కాదు.

కొంచెం నిదానంగా ఆలోచిస్తే- మన జీవితాన్ని మహత్తరంగా మలచుకోవడం మన చేతుల్లోనే, మన చేతల్లోనే ఉందని అవగతమవుతుంది. అందుకోసం మన భక్తిజ్ఞానాలను, ధ్యానకర్మలను యోగాలుగా మలచుకోవాలి.  
ఏ పనీ పాటూ లేకుండా, ఏ వ్యవహారమూ చేయకుండా మానవుడు వూరకనే ఉండడు. అలాగైతే మనిషి సోమరిగా, జడప్రాయుడిగా తయారవుతాడు. అప్పుడతడి జీవితం నిరర్థకమవుతుంది. అందుచేత, మన భావాల్ని పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అప్పుడే మనం చేసేపని (కర్మ) మహాయజ్ఞంగా రూపొందుతుంది. దీనినే కర్మల (పనుల) ద్వారా పరమాత్మను సేవించడమంటారు, అర్చించడమంటారు. ఇందువల్ల ముక్తి లభిస్తుంది. కారణం? మన ఈ పనులవల్ల అన్ని ప్రాణుల్లోనూ ఉన్న పరమాత్మ సంతోషిస్తాడు కాబట్టి. పరహిత భావనతో మనం పనులు చేస్తే అందరి అంతఃకరణల్లోనూ అంతర్యామిగా వెలుగొందే ఆ పరమాత్మ ఆనందిస్తాడని అర్థం. లోకంలో సుఖశాంతులు నెలకొనాలని, ప్రజలంతా హాయిగా, ఆనందంగా ఉండాలనే కదా- తపోధనులైన మునీశ్వరులు ఆనాడు యజ్ఞాలు, క్రతువులు చేశారు... నేడు స్వాములు, ఆచార్యులు మొదలైన మనీషులు యజ్ఞయాగాదులు జరుపుతున్నారు. భగవంతుణ్ని ధ్యానిస్తూ, స్మరిస్తూ మనవృత్తిని (పనిని లేక కర్మను) ఫలాపేక్ష లేకుండా నిస్వార్థబుద్ధితో చేస్తే, అది కర్మయోగంగా మారుతుంది. ఇలా మన పనుల్లో మానవోచితమైన పరహిత భావన సైతం ఉన్నందువల్ల, భగవంతుడికి సన్నిహితులం, అయన కృపకు పాత్రులం కాగలుగుతాం. అందుకే కర్మయోగం దైవసన్నిధికి దగ్గరిదారి.

కుటుంబంలో, సమాజంలో భాగమైనవ్యక్తి సొంత పనుల్లో నిమగ్నుడై ఉంటూనే భగవంతుని స్మరిస్తూ ఉండాలి. కర్మ ఫలితాన్ని ఆ అంతర్యామికే సమర్పించుకోవాలి. అలాంటప్పుడు ఆ వ్యక్తికీ సమాధి నిష్ఠలో ఉండే యోగికి లభించే ఫలితమే లభిస్తుంది. అంటే మన శరీరం ప్రవృత్తి మార్గంలో ఉన్నా, మనసు నివృత్తి మార్గంలో ఉంటే- అది కర్మయోగం అనిపించుకుంటుంది. అంటే ఆ వ్యక్తికి తానుచేసే పనివల్ల లభించే లాభనష్టాలతో సంబంధం ఉండదన్నమాట. దీనినే తామరాకుమీది నీటిబొట్టు చందంగా ఉండటమని అంటారు. జనక చక్రవర్తి రాజయోగం ఇదే.

భగవంతుడి మ్రోల మన మనసు ఆవేశపూరితమై భక్తి పరవశమై ఉంటుంది. పూజ, ప్రార్థన, సంకీర్తన, నామస్మరణ, ధ్యానం, వందనాది తొమ్మిది విధాలైన భక్తి ప్రపత్తుల్ని అనుసరిస్తాం. ఈ భక్తిమార్గంలో పయనించి ముక్తిని పొందవచ్చు. ఇది భక్తియోగం. కొంతమంది ధ్యానంపై ఆసక్తి కలిగి ఉంటారు. బాహ్యమైన లోకవ్యవహారాలపై వీరికి ఆసక్తి ఉండదు. మనసును లేదా చిత్తాన్ని అంతర్ముఖంలోనే ఉంచుతారు. దీనినే ధ్యాన (ఆత్మసంయమ) యోగమని అంటారు. మరికొంతమంది వివేచనాపరులై ఉంటారు. విచారణ చేస్తూ ఉంటారు. ఈ జ్ఞానులు సత్యాసత్యాలను, ఆత్మపరమాత్మలను గురించి వివేచిస్తారు. దీన్ని జ్ఞానయోగమంటారు. ఫలితం ఆశించకుండా నిష్కామంగా పనులు చేస్తే, అది కర్మయోగం అవుతుంది. భక్తి, జ్ఞాన, ధ్యాన యోగాదుల కన్నా కర్మయోగమే సామాన్యలకు సైతం ఆచరణ యోగ్యం, అనుసరణీయం.
                                                           - కాలిపు వీరభద్రుడు

No comments:

Post a Comment