ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday 20 May 2013

వికాస దర్శనం


ఈ సృష్టిలో మానవ జన్మకున్న విశిష్టత మరే ప్రాణికీ లేదు. పెక్కు సందర్భాల్లో, ఎన్నో పరిమితులకు లోబడి, సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కరించుకోలేక నిస్సహాయంగా మిగిలిపోయే ఇతర జీవులకు భిన్నంగా, ఆలోచనా సామర్థ్యంతో క్లిష్టతరమైన పరిస్థితులను సైతం ఎదుర్కొని నిరంతర వికాస ప్రక్రియకు ప్రాణం పోసే శక్తిగా పుట్టిన మనిషి మిక్కిలి అదృష్టవంతుడు. అందుకే మానవ జన్మ సర్వోన్నతమైనదని శాస్త్రాలు నొక్కి వక్కాణిస్తుంటాయి. విశిష్టత అనేది తలవని తలంపుగా దానంతట అదే వచ్చిపడేది కాదు. మానవ ఔన్నత్యాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడాన్ని మనిషి ఓ దీక్షలా చేపట్టాలి. తప్పదు. అందులోని మొదటి అంశంగా మనిషిగా పుట్టే అవకాశాన్నిచ్చిన సృష్టికర్తకు భక్తితో ప్రణమిల్లాలి. మానవ ఔన్నత్యానికి మరిన్ని మెరుగులు దిద్దేందుకు నిబద్ధతతో తనవంతు బాధ్యతను నిర్వహిస్తానని ప్రతినపూనాలి.
మనిషి ప్రతిభాశాలి. ధీరోదాత్తుడు. అతడు తన ఆలోచన, వివేచన శక్తితో, నిర్ణయ సామర్థ్యంతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించగలడు. తద్వారా సాధ్యమైన ఫలితాలతో జీవన విధానాన్ని సులభతరమూ చేయగలడు. అందుచేతే జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకునే సమర్థుడిగా మనిషి పేరుగాంచాడు.

ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, డబ్బు, ఆస్తి, మానవ సంబంధాలు వంటి అనేకానేక అంశాలకు సంబంధించి అవాంతరాలు, సమస్యలు ఎదురైనప్పుడు చాలామంది మనుషులు ఒక్కసారిగా నిరుత్సాహానికి గురవుతారు. అది సహజమే అయినా అలాంటి సందర్భాల్లో మానవ ఔన్నత్యాన్ని గుర్తించక మరింతగా నిరాశ, నిస్పృహలకు గురై కుంగిపోయిన జీవితాన్ని కొనసాగించడం మాత్రం నిస్సందేహంగా ఆక్షేపణీయమే! నిరాశా నిస్పృహలు ఆలోచనలను నిర్వీర్యం చేస్తాయి. తద్వారా నిర్ణయ సామర్థ్యం దెబ్బతింటుంది. తదనంతరం వచ్చే ఫలితాలు మనిషి సామర్థ్యాన్ని వెక్కిరిస్తూ అతడి ఉనికికే సవాళ్లు విసరుతాయి. అలాంటి సందర్భాల్లోనే మనిషి వినాశకర మార్గాల్లో పయనిస్తాడు. జీవిత ఔన్నత్యాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తాడు. ఎట్టి కష్టతర పరిస్థితుల్లోనూ మనిషి అలా చేయడం తగదు గాక తగదు.

సమస్యలను పరిష్కరించడంలోనే మనిషి గొప్పదనం బహిర్గతమవుతుంది. అందుచేత కష్టాలు, సవాళ్లు, సమస్యలు ఎదురైనప్పుడు జీవిత ఔన్నత్యాన్ని ఇనుమడింపజేయడం కోసం, వ్యక్తిగత సామర్థ్యాన్ని రుజువు చేసుకోవడం కోసం, మనిషి నాలుగు అంశాల పట్ల దృష్టి సారించి అప్రమత్తంగా, బాధ్యతగా మెలగాలి.

ఒకటి. భక్తితో, అంకితభావంతో భగవంతుడి సృష్టి స్వభావాన్ని విశ్లేషిస్తూ వ్యక్తిగత సామర్థ్యాలను గుర్తించాలి. స్వాధ్యాయియై అభ్యసనం చేయాలి. ప్రతి ఉనికికీ ఓ విశిష్టత ఉన్న సత్యాన్ని అవగతం చేసుకోవాలి. పంచ భూతాలనే తీసుకుందాం. భూమి తనపై పడిన ఎలాంటి మలినాన్నయినా ఓర్పుతో సహించి దాన్ని ఎరువుగా మార్చి వృక్షాలకు అందిస్తుంది. జీర్ణం కాని పదార్థాలను తనలో దాచుకొని పరిశోధకులు జ్ఞానాన్ని విస్తృత పరచడంలో దోహదపడుతుంది. అగ్ని ఊర్ధ్వముఖమై వెలుగుతూ లోకానికి వెలుతురునిస్తుంది. తనను స్పృశించిన దాన్ని నిర్మల విభూతిగా మారుస్తూ తాను నిత్య శుచియై ఉంటుంది. నీరు స్తబ్ధంగా నిలిస్తే చెడిపోవడం ఖాయమనే వాస్తవాన్ని తెలియజేస్తూ ప్రగతిశీలంగా ముందుకు పయనిస్తూ ఉంటుంది. తనను తాకిన దాన్ని శుభ్రం చేస్తూ, ప్రాణుల దాహార్తి తీరుస్తూ జీవితాన్ని అందిస్తుంది. వాయువు నిరంతరం సంచరిస్తూ దుర్గంధాన్ని హరించి సుగంధాన్ని వెదజల్లుతుంది. శ్రమజీవులను చల్లగా స్పృశించి వారిలో ఉల్లాసాన్ని నింపుతుంది, ప్రాణశక్తినిస్తుంది. ఆకాశం గర్జనలను సైతం మింగేసి నిశ్శబ్దంగా, నిర్మలంగా ఉంటుంది. సంకుచితంగా ఉండక విశాలంగా విస్తరించి అందరికీ అవకాశాలు కల్పిస్తుంది. అంతదాకా ఎందుకు? చిరుగాలి వీస్తే చాలు, గడ్డిమొక్క తలొంచుకొని వణికిపోతుంది. అది తలచుకున్నప్పుడు మాత్రం కఠినమైన భూమిని సైతం చీల్చుకుంటూ వచ్చి తన ఉనికిని చాటుకుంటుంది. కాబట్టి సమస్యలెదురైనప్పుడు మనిషి వెరవక తనలో నిక్షిప్తమై ఉన్న ధీశక్తిని గుర్తించాలి. బేషరతుగా, హృదయపూర్వకంగా సమస్యలకు స్వాగతం పలకాలి. సముద్రమంత సహనంతో విశ్లేషణాత్మకంగా, వికాసవంతంగా ఆలోచించి సముచితమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. మొక్కవోని దీక్షతో నిర్ణయాన్ని ఆచరణలో పెట్టి వచ్చిన ఫలితాలకు బాధ్యత వహించాలి. అవసరమైతే మెరుగైన నిర్ణయంతో మళ్ళీ పూనుకోవాలి. సమస్యల్లో చిక్కుకున్న ఇతరులను నిర్దాక్షిణ్యంగా వదిలేయక చొరవతో వెన్నుతట్టి వారు వికాస మార్గంలో పయనించేలా శ్రద్ధ తీసుకోవాలి. సేవా దృక్పథాన్ని పుణికి పుచ్చుకొని తోటివారి, ఇతర ప్రాణుల జీవితాల్లో వెలుగు నింపేలా ప్రవర్తించాలి. 
ఈ అంశాలను ప్రతి మనిషీ మనసా, వాచా, కర్మణా పాటిస్తే జీవితం పరమ అర్థవంతమూ, తేజోవంతమూ అవుతుంది. ఫలితంగా వ్యక్తిగత జీవితం వికసిస్తుంది.

                                                               - వంగీపురం శ్రీనివాసాచారి 

No comments:

Post a Comment