ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday 13 May 2013

మట్టి పూలు



       పత్తిపూలు, ప్లాస్టిక్‌ పూలు, గుడ్డపూలు, గడ్డిపూలు, వెండి పూలు, పసిడి పూలు... ఎన్నెన్నో రకాలు ఉంటాయి. కానీ, మట్టిపూలు ఉంటాయా, ఉన్నా స్పందిస్తాయా? సహజత్వం ఉంటుందా? సౌకుమార్యం, సౌరభం, స్పందనకనిపిస్తాయా? అసలేమిటీ మట్టిపూలు? మనుషులే మట్టిపూలు. మట్టిలో, పంచభూతాల్లో ఒక భూతమైన మట్టి ప్రధాన భూతంగా జన్మించే మనిషే మట్టిపూవు. మనుషులు మట్టిపూలా! మట్టి! సర్వజీవులూ కాళ్లతో తొక్కి, మలమూత్రాలు విసర్జించే మట్టి!! ఔను. ఆ మట్టే. ఆ మట్టే శ్రీరాముడు వనవాసానికి అయోధ్య నుంచి అడవులకు వెళ్తూ వెంట తీసుకుని వెళ్లి పద్నాలుగు సంవత్సరాలు పవిత్రంగా ఆరాధించుకున్న ఆ మట్టే. శ్రీకృష్ణుడు తనకు ప్రియాతిప్రియమైన వెన్నకంటే కమ్మగా ఉన్నట్టు లొట్టలేస్తూ తిని అమ్మకు పట్టుబడి, కట్టుబడి ఆమెకు పద్నాలుగు లోకాలు ప్రదర్శించేందుకు కారణమైన ఆ మట్టే. సీత ఏకంగా ఆ మట్టి గర్భంలోంచే పుట్టింది. ఔను. మట్టే. ఆ మట్టి మూర్తీభవిస్తే- ఆమె భూమాత. మూర్తీభవించిన ఓరిమి. మనం భారతీయులం అమ్మగా, మాతృభూమిగా కొలుచుకునే ఆ మట్టే. ఔను- మనం ఆ మట్టిలో పుట్టి, ఆ మట్టినే శరీరంగా మలచుకుని, చివరకు మట్టిలో మట్టిగా ఆ మట్టిలోనే కలిసిపోయే మట్టిపూవులం. ఎంత పవిత్రమైన, ఎంత సహజమైన, ఎంత సౌరభపూర్ణమైన పూవులం! కానీ మనం సహజత్వాన్ని వదిలి కాగితపు పూలలా మారిపోయాం. ప్లాస్టిక్‌ పూలలో చేరిపోయాం. కంతిరి పూలలా అయిపోయాం. భగవంతుడి ఆరాధనకే పుట్టిన మట్టి పూవులం. ఆయన ఆరామాన్ని చేరుకునేందుకే వచ్చిన ధన్యజీవులం. కానీ ఎందుకిలా అయిపోయాం!
           వరుణుడు వాన కురిపించి మేఘమనే పన్నీటి బుడ్డితో పరిమళం చిలుకుతున్నాడు. వానకు తడిసి, కమ్మని వాసనలతో, మట్టి వాసనలతో ఈ జగమంతా పరవశిస్తుంది. గర్భిణీ స్త్రీలు వానకు తడిసిన మట్టి బెడ్డలు ప్రీతితో తిని గర్భంలోని తమ శిశువులకు మరింత మట్టి మప్పుతున్నారు. సహజత్వాన్ని అద్దుతున్నారు. మట్టిపూలుగా మలుస్తున్నారు.
        మట్టి మహత్వపూర్ణమైంది. భగవంతుడు బంగారుపుష్పాలను కూడా తిరస్కరించి మట్టిపూలను కోరుకున్నాడు. శివుడు మృణ్మయలింగమై మురిసిపోయాడు. ఈ మట్టిపూలకు, ఈ మట్టి మనుషులకు మళ్లీ ఈ మట్టే మెతుకై అన్నం పెడుతుంది. విచిత్రమైన బంధం. విమలమైన అనుబంధం.
       అయితే ఈ మట్టిని మనం నాశనం చేస్తున్నాం. మనమే నాశనం చేస్తున్నాం. అంటే మనను మనమే నాశనం చేసుకుంటున్నాం. ఏసుక్రీస్తు తనను సిలువ వేస్తున్నవారిని గురించి అన్నట్లు- మనమేం చేస్తున్నామో మనకు తెలీదా? మనం మరీ అంత అమాయకులమేం కాదు. తెలుసు. అన్నీ తెలుసు. తెలిసిన మూర్ఖులం. ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం. మనం ఒక్కరం జాగ్రత్తపడితే చాలదు కదా అనే నిర్లక్ష్యం. బిందువు బిందువు కలిస్తే బిందె నిండుతుంది. పిడికెడు పిడికెడు గింజలు కూడబెడితే గాదె నిండుతుంది. నిర్లక్ష్యమైనా అంతే. చిరుగాలి పెనుగాలి అవుతుంది. చిన్న అగ్గిపుల్ల పెద్ద అడవినే బుగ్గి చేస్తుంది. మనం అగ్గిపుల్ల కావద్దు. మనకు ప్రాణం పోసిన అన్నం పెట్టిన మట్టి తల్లికి, భూమి తల్లికి అగ్గిపెట్టొద్దు. ఆఖరుకు మనను పూడ్చేందుక్కూడా పనికిరానిదిగా మార్చుకోవద్దు. భూమిని రక్షించుకుందాం. మట్టిని కాపాడుకుందాం!
                                                                       - చక్కిలం విజయలక్ష్మి

No comments:

Post a Comment