ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Saturday 11 May 2013

మాతృదేవోభవ

                                 
అకార, ఉకార, మకారాల                       
కలయిక వల్ల 'ఓం'కారం ఏర్పడుతుంది.

అనురాగం, ఉపకారం, మమకారాల  
మేలు కలయికవల్ల అమ్మ సాకారమవుతుంది.
        సృష్టికి మూలం అవ్యాజమైన మాతృప్రేమ. మధుర పరిమళం లాంటిదీ, అనిర్వచనీయమైన ఆనందానుభూతిని ఇచ్చేదీ మాతృప్రేమ. ప్రేమకు నిలువెత్తు ప్రతిరూపం అమ్మ. అవధుల్లేని ప్రేమను పంచేది అమ్మ. తాను కరిగిపోతూ లోకానికి వెలుగునిస్తుంది కొవ్వొత్తి. తాను చితికిపోతూ, 'చితి'కిపోతూ కూడా బిడ్డల మేలు కోరుతుంది మాతృమూర్తి. ఈ రోజుల్లో అందరూ ఉన్నప్పటికీ అనాథను చేసి, వృద్ధాశ్రమాల్లో చేర్పించినా కూడా, ఆ తల్లిమనసు బిడ్డల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అంతులేని త్యాగమూర్తి మాతృమూర్తి.
     భూదేవితో సమానమైన సహనం కలిగింది మాతృమూర్తి. సాగరమంత దయ ఈ మాతృమూర్తి సొంతం. క్షమయా ధరిత్రీ. బిడ్డల క్షేమాన్నీ, శ్రేయాన్నీ, అభ్యున్నతినీ కాంక్షించి, అనుక్షణం అమితంగా బాధ్యత తీసుకునే అమృతమూర్తి మాతృమూర్తి. ఇలా ప్రేమ, త్యాగం, సహనం, బాధ్యతలనే నాలుగు స్తంభాలతో నిర్మించిన దేవాలయమే- అమ్మ చిరునామా.
      ప్రథమ పోషకురాలు తల్లి. నెలతప్పిన దగ్గరనుంచి అనేక కష్టాలుపడి బిడ్డను కాపాడుకుంటూ వస్తుంది. కడుపులో బిడ్డ ఆకారం దాల్చేటప్పుడు తల్లి అనేక వికారాలకు లోనవుతుంది. తాను తినే తిండినీ, తన రక్తమాంసాలనూ కడుపులోని బిడ్డకు పంచి, బిడ్డను పెంచుతుంది. పేగు తెంచుకుని, కడుపు చీల్చుకుని బిడ్డ బయటకు వచ్చినప్పటినుంచి తాను తిన్నా, తినకపోయినా బిడ్డ కడుపు నింపుతుంది. పెట్టే విషయంలో తల్లిని మించినవారు లేరు. అడగనిదే అమ్మయినా పెట్టదంటారు, కాని అడగకపోయినా పెట్టేది అమ్మ మాత్రమే. భోజ్యేషు మాతా.
           భోజరాజీయంలోని కథ మనందరికీ తెలిసిందే. ఒక పెద్దపులి ఒక గోవువెంట పడింది, తన ఆకలి తీర్చుకోవడానికి. అప్పుడు గోవు 'నా బిడ్డ చాలా ఆకలితో ఉన్నది. వెళ్లి నా బిడ్డకు కడుపునిండా పాలిచ్చి వస్తాను. అప్పటిదాకా కొంచెం ఓపికపట్టు. నేను తప్పకుండా తిరిగి వస్తాను. నా మాట నమ్ము' అని ప్రాధేయపడింది. గోమాత మాటపై విశ్వాసముంచి సరే అన్నది పెద్దపులి. ఇచ్చిన మాట ప్రకారం వెళ్లి బిడ్డ ఆకలి తీర్చి, వచ్చిన గోమాత పెద్దపులితో 'ఇప్పుడు నన్ను భక్షించి, నీ ఆకలి తీర్చుకో నాకేమీ అభ్యంతరం లేదు' అన్నది. ఆకలి తీర్చడమే అమ్మ లక్షణం. అది కన్నబిడ్డయినా ఒకటే, పరాయి బిడ్డయినా ఒకటే, పగవాడైనా ఒకటే. దాతృత్వమే మాతృత్వం.
     ప్రథమ సేవకురాలు తల్లి. బిడ్డకు సేవచేయడంలో తల్లిని మించినవారు లేరు. ఏమాత్రం అసహ్యించుకోకుండా అన్ని రకాల సేవలూ చేసేది తల్లి మాత్రమే. కార్యేషు దాసీ. సేవాతత్వానికి పరాకాష్ఠ తల్లే. అందుకే మదర్‌ థెరెసా సేవాతత్పరతను ఈ నాటికీ ప్రపంచమంతా వేనోళ్ల కొనియాడుతోంది.
        ప్రథమ గురువు తల్లి. బిడ్డ కడుపులో ఉన్నప్పటినుంచీ తల్లి అనేక విషయాలు బిడ్డకు నేర్పుతుంది. పిల్లలు బుడిబుడి అడుగులు వేసేటప్పుడు పొడిపొడి అక్షరాలు, మాటలు నేర్పుతుంది. పిల్లలకు నడకతో పాటు, నడతనూ నేర్పుతుంది. విద్యాలయాల్లో నేర్చుకునేదానితోపాటు, గృహాలయాల్లో నేర్చుకునే విద్యలనేకం. అందుకే తల్లిదండ్రులు తొలి గురువులైతే, గురువులు మలి తల్లిదండ్రులు.
         ప్రథమ సంరక్షకురాలు తల్లి. కన్నబిడ్డ చిన్నవాడైనా, పెద్దవాడైనా కంటికి రెప్పలా కాచుకుని, గుండెల్లో దాచుకునేది తల్లి. దేశానికి రాజైనా తల్లికి బిడ్డే కదా! కరణేషు మంత్రీ.
      ఇలా అనేక విషయాల్లో తల్లి ప్రథమురాలు. అందుకనే కనిపించని ఆ దేవుని కన్నా, కని పెంచే అమ్మే మిన్న. కాబట్టి తల్లి ప్రథమదైవం. త్రిలోకాల్లోనూ త్రికాలాల్లోనూ మాతృదేవోభవ!
                                                              - గుజ్జుల వీరనాగిరెడ్డి

No comments:

Post a Comment