ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday 27 May 2013

జీవిత సాఫల్యం

                              
       జీవితంలో ఎంతో కొంత ఆహ్లాదం ఉండాలి. అలా అనుకోవడం తప్పా అన్నది ప్రశ్న. ఆ ఆనందమో ఆహ్లాదమో ఎలా అనుభవిస్తున్నామన్నది చర్చనీయాంశం. దీనికి రెండు సమాధానాలు. ఒకటి, అందరూ ఆమోదించిన రీతిలో ఆనందంగా గడపడం. రెండోది, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అనుకుని ముందుకెళ్ళడం. అయినా కొంతమంది ఏ విధంగానూ అడుగు కదపలేరు. ఈ విధమైన ఆలోచనా సరళి ఉండటం ఏమీ కొత్తకాదు. ఎందుకంటే ఏది తప్పో అది కళ్ళముందు కనపడుతున్నా, ఇంకోపక్క కోరిక అనేది ఉంటుంది. అది ఎక్కడికీ పోదు. దాన్ని అణచుకున్నా అది కేవలం తాత్కాలికమే. అలా అణచిపెట్టుకుంటే ఆ ఆలోచన బలపడుతుందే తప్ప తరగదు.
          మనం మనసును, శరీరాన్ని ఒకటిగా చూస్తాం. నిజానికి ఆ రెండూ వేరు వేరు. ధర్మ విరుద్ధమైన పని అయినా దాన్ని చెయ్యమని ప్రోత్సహించేది శరీరం. ఎందుకంటే అది రుచులను కోరుతుంది. కొత్త అనుభవాలు పొందాలని తహతహలాడుతుంది. నిజానికి ఈ తపనను నిగ్రహించుకోవడం అంత సులభమైన పని కాదు. మరోవిధంగా చెప్పాలంటే ఇష్టానికి- ధర్మానికి మధ్య ఉన్న (నిజమైన) ఘర్షణే అంతర్యుద్ధం. ఈ విధమైన మనస్తత్వం నుంచి సరైన మార్గంలో మహాపురుషుల జీవితాలు ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళేవారు కొంతమంది. మన పురాణ, ఇతిహాసాల్లోని పాత్రల జీవితాలనుంచి ప్రేరణ పొందేవారు ఇంకొంతమంది. ఇలాంటివారు తాము చేసిన ధర్మవిరుద్ధమైన పనులను తాము చదివిన, విన్న పురాణ పాత్రలు ఎలా ప్రవర్తించాయో వాటిని ఉదాహరణగా చూపి తమ పనులను సమర్థించుకుంటారు. త్యాగరాజస్వామి కీర్తన ఉండనే ఉంది- 'ఎంత నేర్చినా ఎంత చూసినా ఎంతవారలయిన కాంత దాసులే...'
               మనిషిని చెడు మార్గంలో తీసుకువెళ్లే కారణాలు- కాంత, కనకం (బంగారం). అరిషడ్వర్గాలుగా చెప్పే కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు వీటికి మానసపుత్రులే. ఉన్న సంపద చాలకపోవడం, లేని వస్తువు కావాలనుకోవడం వల్లనే అసలు సమస్య మొదలవుతుంది. ఇక్కడ 'వస్తువు' అంటే అది ఒక వ్యక్తి తాలూకు ఆర్థిక, సామాజిక స్థితి కావచ్చు, లేక స్త్రీ వ్యామోహం కావచ్చు. అందుకని ఎప్పుడు ఒక వ్యక్తిలో అంతర్మథనం మొదలవుతుందో ఆ నిమిషంలో ఆ వ్యక్తి- స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. తాము ఇప్పటివరకు సమాజంలో గౌరవంగా బతికాం, ఈ కాస్త ఆనందం కోసం దిగజారి ప్రవర్తించాలా అని ఆలోచిస్తే, ఆ మనిషిలో మార్పు వచ్చి తీరుతుంది. కొంతమంది లోకనిందకు భయపడి అయినా ధర్మాచరణ కొనసాగిస్తారు.
              కోరిక ఉండటం తప్పుకాదు. కానీ ఆ కోరిక తీరితే జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయని ఆలోచించడం ముఖ్యం. కోరిక ధర్మ సమ్మతమైనదేనా కాదా అన్నది రెండో ప్రశ్న. మూడోది- ఏదో ఒకరకంగా ఆ కోరిక తీరితే దానిద్వారా వచ్చే ఆనందం ఏమిటి? అసలు ఆ వ్యక్తి ఇప్పుడు ఉన్న స్థితిలో ఆనందంగా లేడా? ఏదైనా తీరని వాంఛలతో బాధపడుతున్నాడా లేదా ఉన్నదానితో తృప్తిపడలేడా అనేది చర్చనీయాంశం. ఆ విధంగా మనోవిశ్లేషణ చేసుకుని ఆ కోరిక తీరడానికి కొంత ప్రయత్నం చేసినా, తప్పు తెలుసుకుని ఆ క్షణం నుంచి ప్రయత్నాలు విరమించుకుని యథాస్థితికి వచ్చినా- అతడు ఇంద్రియ నిగ్రహం కలవాడనే చెప్పాలి. అలా కాకుండా ఎంత ఖర్చయినా, ఏమి జరిగినా, తనకు అపవాదు వచ్చినా సరే, తన కోరిక తీరడమే ముఖ్యం అనుకున్నవారు ఆ వక్రమార్గంలో ముందుకుసాగి, చివరకు అధోగతి పాలయ్యారని చరిత్ర మనకు చెబుతున్న సత్యం. ఇలా ధర్మం ఏమిటో తెలిసినా అధర్మంవైపే ముందుకెళ్ళి నాశనమైనవారు- దుర్యోధనుడు, రావణాసురుడు.
                 ఆత్మ న్యూనత భావానికి లోనుకావడం తప్పే, అహంకారం ఉండటమూ తప్పే. తన మీద తనకు ఆత్మవిశ్వాసం తగినంత ఉండటం తప్పుకాదని పెద్దలు చెబుతారు. ఈ ఆత్మవిశ్వాసం, అహంకారానికి దారి తీయనంతవరకు ఆ మనిషికి ఎదురు ఉండదు. ఎప్పుడైతే తనను మించినవాడు లేడనుకుంటాడో, ఆ క్షణంలోనే, అతణ్ని అన్ని విషయాల్లో అధిగమించినవాడు తారసపడతాడు. ఇది సత్యం. ఈ విధంగా జీవితం భగవంతుడిచ్చిన వరం అనుకుని నువ్వు ఉన్నంత వరకు దీన్ని గట్టిగా పట్టుకో, ధర్మబద్ధంగా ప్రవర్తించి గొప్పవాడనిపించుకో. నలుగురితో స్నేహంగా ఉండు. నీవు ఉన్నా లేకపోయినా ఈ కాలచక్రం ఆగదని గుర్తుంచుకోవడం తెలివైనవారి లక్షణం. నువ్వు లేకపోయినా నువ్వు మంచివాడివని ఈ లోకం అనుకునేలా జీవించు. అందులోనే ఉంది ఆ వ్యక్తి జీవిత సాఫల్యం.
- ఆదినారాయణశాస్త్రి

No comments:

Post a Comment