ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday 27 May 2013

భగవంతుడి వజ్రం

                                 

                తన జ్ఞానంతో మనల్ని రంజింపజేసిన వ్యక్తిలో 'ఏదో వెలుగు' ఉంది. అతనిలో జ్ఞానజ్యోతి సుస్పష్టంగా తేజరిల్లుతున్నదని అంటుంటాం. ఇలాంటి వెలుగును మనం వజ్రపు కాంతితో పోలుస్తాం. అత్యంత ప్రకాశవంతమైన వస్తువుల్లో వజ్రం ఒకటి. విచిత్రమేమిటంటే, వజ్రం సొంత వెలుగుతో ప్రకాశించదు. దానిపై కాంతి పరావర్తనం చెందినప్పుడు మాత్రమే అది భాసిస్తుంది. అలాగే జ్ఞాని సైతం సొంత కాంతివల్ల కాకుండా, ఉన్నత భూమికల నుంచి పరావర్తనం చెందిన అతిలోక తేజస్సుతో ప్రకాశిస్తాడు.

అటువంటి జ్ఞాని ఏ కాంతిని వెదజల్లుతాడు? తాను భగవంతుడి నుంచి వచ్చానన్న నిత్యస్ఫూర్తి అతడికి ఉంటుంది. అందువల్ల అతడు భగవంతుడి కాంతి కిరణమే. బంకించంద్ర ఛటర్జీ ముఖంలో రవీంద్రుడు అటువంటి వెలుగును చూశాడు. హిమాలయాల్లో ఒక వ్యక్తికి వివేకానందుడు కనిపించాడు. గొప్ప తేజస్సు కలిగిన ఆయన త్రిశూలం పట్టుకున్న శివుడిలాగా ఆ వ్యక్తికి గోచరించాడు. సింహం వంటి శిరస్సుతో గుచ్చే చూపులతో ఆయన భారతదేశపు ఉజ్జ్వల సూర్యబింబంలాగా మెరిసిపోతున్నాడని అనీబిసెంట్‌ వర్ణించారు.

మనలో అటువంటి వెలుగు అధికంగా ప్రసరించాలంటే మరింత అధికంగా భగవంతుడు మనలో ప్రకాశించాలి. మనలో ప్రతి ఒక్కరిలో ఈ దివ్యత్వం విరాజిల్లుతోంది. ఎక్కువగానో, తక్కువగానో మన అందరిలో దివ్యత్వ కిరణాలు మెరుస్తుంటాయి. సర్వశక్తిమంతుడితో, సర్వజ్ఞుడితో మనం ఏకత్వం ఎంత ఎక్కువగా సాధిస్తే అంత కాంతి మనలో ప్రజ్వరిల్లుతుంది.
భగవంతుడి సృష్టి, మనిషి, పక్షి, మృగం, పురుగును మనం నిస్వార్థంగా ప్రేమించినప్పుడు మనలో దివ్యప్రేమ శోభిల్లుతుంది. నిర్మల మనసు, సత్యమంటే ప్రేమ, విలువల పట్ల గౌరవం, దయ, దాతృత్వం, సేవా తత్పరత, క్షమించేగుణం... ఇవన్నీ మనిషి ఆత్మ పార్శ్వాలు. అవి వజ్రానికున్న పార్శ్వాలవంటివి. అవన్నీ భగవంతుడి లక్షణాలే. ఈ గుణాలు మన దివ్యమూలాన్ని ప్రతిఫలిస్తాయి. ద్వేషం, లోభత్వం, కామం, భయం లాంటి లక్షణాలు ఉంటే మనం వెలుగు నుంచి దూరమై పోతుంటాం. చీకటి నుంచి వెలుగును సృష్టించలేం.

తన ప్రయోజనాలు, భౌతిక విషయ సుఖాలతో నిండి ఉన్న మనిషి దివ్యప్రకాశాన్ని ప్రసరించలేడు. అతడు ధ్యానం చేస్తూ, దివ్య లక్షణాలను తనలో ప్రోదిచేసుకుంటే, అతడిలోని వెలుగు ఇతరులను ఆకర్షిస్తుంది. వారు కూడా దివ్య ప్రేమపథంలో పయనించేటట్లు చేస్తాయి. ప్రాణంలేని వజ్రమే మనుషుల్ని ఆకర్షించినప్పుడు, ప్రేమతో స్పందించే సాధుపురుషుడు ఎందరినో తనవైపు తిప్పుకోలేడా? 'నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో' అని బుద్ధ భగవానుడు ఆనందుడు అనే తన శిష్యుడికి అదే ప్రబోధిస్తాడు. 'ఈ ప్రపంచానికి నీవే వెలుగువి. నీ కాంతి మనుషుల మధ్య ప్రకాశించాలి. నీ మంచి పనులను జనం మెచ్చుకుంటారు. భగవంతుడు మరింతగా ఆనందిస్తాడు' అన్న జీసస్‌ ప్రబోధం వెనక రహస్యం అదే.

'మనిషిలో లోలోపల భాసిస్తున్న దివ్యత్వాన్ని అభివ్యక్తం చేయడమే మతం ప్రయోజనం' అంటాడు వివేకానందుడు. మనలోని దివ్యత్వాన్ని గుర్తుపెట్టుకుని, సన్నిహితంగా జీవితాన్ని సాగిస్తే, భగవంతుడి వజ్రంలాగా ఈ లోకంలో మెరిసిపోవచ్చు.
                                                                          - కె.యజ్ఞన్న

No comments:

Post a Comment