మహాభారతం, రామాయణం వంటి ప్రాచీన కావ్యాల్లో ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయి. అవి అన్నీ నమ్మదగినవిగా ఉండవు. కొన్ని సంఘటనలు నిజంగా జరిగాయా అని ఆశ్చర్యం వేస్తుంది. కల్పిత గాథలుగా కనిపించినా అవి యుగాలుగా నిలిచి ఉన్నాయి. ఇప్పటికీ వాటిని ఎంతో ఆసక్తితో చదువుతూనే ఉన్నాం. పసిపిల్లలు మాత్రమే కాదు, పెద్దవారికీ కథలంటే ఆకర్షణ. దేవతల గురించి కథలు మరీ మరీ ఇష్టం. 'అవి అన్నీ అబద్ధాలు, వాటిని చదవవద్దు' అని జ్ఞానం ఉన్నవారెవరూ అనలేదు. అడ్డు చెప్పలేదు. కథలు చదవగా చదవగా వాటి వెనక మరేదో రహస్యం ఉన్నట్లు, ఏదో సత్యం దాగి ఉన్నట్లు తెలుస్తుంది. మన మనసు అంతఃస్ఫూర్తితో విశాలంగా ఎదిగిన కొద్దీ కథలన్నీ ప్రతీకలుగా కనిపిస్తాయి. మనిషి మనసు, జీవితం వికాసం చెందడానికి పనికివచ్చే అంతరార్థాలు అన్నింటినీ వాటిలో ద్రష్టలు నిక్షిప్తం చేశారనిపిస్తుంది. వాటిలో నైతిక, ఆధ్యాత్మిక, ధార్మిక పరమార్థం ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రాచీన కథలు- అంతర్దర్శన కథలు!
మనిషిలో ధర్మం, నీతి ఉన్నంతకాలం కథలు కల్పితాలైనా నష్టం రాదు. రామాయణ, భారతాలు కల్పితాలైనా, కట్టుకథలైనా వాటిలో ధర్మం, నీతి లేవని ఎవరూ ధైర్యంగా చెప్పలేదు. అవి చదివితే పాతివ్రత్య మహిమ అనేది ఉందని, తపశ్శక్తితో ఏదైనా సాధించవచ్చునని తెలుస్తుంది. మానవాళి ధర్మం, నీతిని కాపాడుతూ వచ్చేవి ఆ కథలే.
ప్రాచీన యుగాల్లో ఉన్న ధర్మం, నీతి ఆ స్థాయిలో ఇప్పుడు ఉన్నాయా అన్న సందేహం వస్తుంది. కారుచీకట్ల మధ్య వెలిగే దీపకళికలాగా- దొంగలు, అవినీతిపరులు, హంతకులు, దుష్ట కీచకులు. అధర్మ, వికృత రాకాసి నీడల మధ్య ధర్మం ఇంకా వెలుగుతూనే ఉంది.
ధర్మం మరణిస్తే మానవజాతి గురించి గొప్పగా చెప్పుకొనేది ఏదీ చరిత్రలో మిగలదు. కాంతిహీనమైన నిర్జీవ భూగోళం సూర్యుడి చుట్టూ నిరామయంగా పరిభ్రమిస్తూనే ఉంటుంది. ధర్మం, నీతిని కాపాడే బాధ్యత ఇప్పుడు మానవజాతి భుజస్కంధాలపైనే ఉంది. 'ధర్మం ఎవరిక్కావాలి, నీతి ఎవరికి అవసరం' అని మొండిగా జీవించాలనుకుంటే మానవ జీవనపరిణామ హోమగుండంలో రాక్షస ప్రవృత్తులు మాత్రమే ప్రజ్వరిల్లుతాయి. అవి మానవజాతి ఉనికికే ప్రమాదం తెస్తాయి.
భవిష్యత్తులో ప్రపంచం సద్వర్తనులు, సాధుమూర్తుల ధర్మధామం కావాలంటే నేటి పసిపిల్లల ఆలోచనలే కాంతిపునాదులు కావాలి. క్రాంతి బీజాలు కావాలి. వారు భగవంతుడి కలలకు ప్రతిరూపాలు. చిన్న పిల్లలు ఉత్సాహంగా పుస్తకాలు చదువుతున్నప్పుడు 'అవి కట్టు కథలు' అని చెప్పి, వారిని నిరుత్సాహపరచకూడదు. 'జీవితం అలా ఉండదు' అని ఎప్పుడూ వారితో అనకూడదు. 'ప్రస్తుతం ప్రపంచం అలా లేదు. పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కాని వాటి వెనక, ఒక అతిలోక సౌందర్యం దాగి ఉంది. ఈ కురూపి ప్రపంచం ఆ అద్భుత సౌందర్యాన్ని వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తోంది' అని వారితో చెప్పాలి. 'ఈ సౌందర్యాన్ని నువ్వు ప్రేమించాలి. నీ వైపు ఆకర్షించుకోవాలి. దీన్ని నీ స్వప్నాలు, నీ ఆశల పరమావధిగా చేసుకోవాలి' అని చెప్పాలి. వారిని ప్రోత్సహించాలి.
తాము అందమైన కల కన్నామని, ఆ కలలో తమకెన్నో శక్తులున్న భావం కలిగిందని, అక్కడ అన్నీ దివ్య సౌందర్యంతో భాసిస్తున్నాయని పిల్లలు చెప్పినప్పుడు 'మీ జీవితం అలా ఉండదు' అని వారితో ఏనాడూ చెప్పకూడదు. 'జీవితం అలాగే ఉంటుంది' అని చెప్పాలి. అప్పుడే ప్రేమ మాధుర్యాలు నిండిన బంగరులోకం తలుపులు తెరుచుకుంటాయి.
- కె.యజ్ఞన్న
No comments:
Post a Comment