ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Wednesday 21 August 2013

దైవాన్వేషణ


దైవాన్ని అన్వేషించాలా? అన్వేషణ అన్వేషణ అంటారు. ఎంతవరకు అది సరైన మాట? దొరకనిది వెదుక్కోవాలి, పట్టుకోవాలి. సంతోషించాలి. దైవం దొరకడా, అంతదూరాన ఉంటాడా, ఎక్కడ ఉంటాడు? కొండపైన, లోయలోన, ఆకాశం అంచున, సముద్రంలో దాక్కుని ఉంటాడా? మన శక్తి సరిపోతుందా ఆయనను వెదకడానికి? ఒక వస్తువో, మనిషో అయితే ఎవరో ఒకరు వెదికి సంపాదించుకుంటారు. అందరిలో ఉంటాడంటారు. అంతటా ఉంటాడంటారు. ఆయనను వెదుక్కోవాలా? దొరికాడు అని అరిచి లోకానికి చెప్పుకోవాలా? విడ్డూరంగా ఉంది కదూ. వింతగా అనిపిస్తోంది కదూ. మన మాటలు కోటలు దాటతాయి. మన ఆలోచనలు గాలిలో ఎగురుతుంటాయి. వాస్తవం భిన్నంగా ఉంటుంది. 

 సరే. ఒక శుభముహుర్తాన దేవుణ్ని వెదకడం మొదలుపెట్టాం. మనం వెదికే సమయానికి ఆయన మనకు చేరువలో ఉంటాడా, దూరంగా ఉంటాడా? అసలు ఈ అన్వేషణ ఎందుకు? ఆయనకు తెలియకుండా చేసేబదులు, చెప్పి చేస్తే మంచిది కదా. సరే చెప్పడం మొదలు పెడదాం. ఎలా? దేవుడికి చెప్పటం అంటే ఏమిటి? ప్రార్థన చెయ్యడమే కదా. నేను వెదుకుతున్నాను... నువ్వు దొరుకు అని చెప్పాలా? నన్ను పెద్ద కష్టపెట్టకుండా నాకు కనిపించు అనా? వెదుక్కో వెదుక్కో అని ఎందరో చెప్పారు, అందుకే వెదుకుతున్నాను. నాకు కూడా ఆ భాగ్యం కలిగించమనా? ఏదో ఒకటి, మన మనసు ఎలా ప్రేరణ కలిగిస్తే అలా.

ఇప్పుడు మొదలుపెడదాం అన్వేషణ. దేవుడికి చెప్పుకొన్నాం కదా. భక్తులెందరికో పట్టుబడినట్లు మనకీ పట్టుబడతాడని అనుకుందాం. ఈ అన్వేషణలో ఎన్నో అడ్డంకులు. చెట్టు, పుట్ట, పాము, పక్షి కనబడినట్లు ఆయన కనపడటం లేదు. మరి ఎలా కనిపిస్తాడు? దేవుడికి ఒక రూపం ఉంటుందా? ఉంది కదా. ఇంతకుముందు కనిపించాడు కదా. త్రేతాయుగంలో రాముడిగా, ద్వాపరయుగంలో కృష్ణుడిగా... ఇంకా ఇంకా ఎన్నో రూపాల్లో కనిపించాడు కదా. ఆయనకు ఇష్టమైన రూపంలో ఎలా బాగుంటే అలాగే కనపడనీ. కానీ, గుర్తుపట్టడం ఎలా? ఇంతకు ముందు చూసినవాణ్ని, అలాగే కనిపిస్తే గుర్తుపట్టొచ్చు. కానీ రూపం మార్చుకుని ఏ బిచ్చగాడిగానో, మరోలాగానో కనిపించడు కదా. ఆయనకు ఇష్టమైన రూపంలో ఎలా బాగుంటే అలాగే కనిపిస్తే మనకు సాధ్యమవుతుందా ఆయనను గుర్తించడం? పెద్దచిక్కే... ఎలా? అన్వేషణ అయితే మొదలుపెట్టేశాం. ఎన్నో సందేహలు... ఇవన్నీ ఎవరు తీరుస్తారు?

తెలిసినవాళ్లని అడగాలి. దేవుణ్ని చూసినవాడిని కలుసుకోవాలి. ఆయనముందు మన గోడు విన్నవించుకోవాలి. కథ మళ్ళీ మొదటికొచ్చినట్లుంది. మనకు మనం ఈ అన్వేషణ మొదలుపెడితే ముందుకు సాగడం కష్టమే. ఆ దేవుణ్ని సాక్షాత్కరించుకున్నవాడిని కలుసుకోవాలి. ఇంతకీ ఆయనెక్కడుంటాడు? దేవుణ్ని చూసినవాడు అంత సులువుగా మనకు దొరుకుతాడా? ఏం చెయ్యాలి! ఎలా ఈయన్నీ ప్రసన్నం చేసుకోవాలి? అసలు మనకు ఎందుకు ఆయన దర్శనం ఇస్తాడు? మనం ఆయనకు చేసింది ఏమిటి? ఏమీ లేదు. మరి ఆయనెందుకు సహాయపడతాడు? అన్వేషణ ఉత్సాహం తప్ప మనదగ్గర ఏం లేదు. దేవుణ్ని వెదుక్కోవాలి అన్న ఆరాటం తప్ప మరేం లేదు. దేవుణ్ని పట్టుకుని- 'ఏమయ్యా? ఇంతకాలం ఎందుకు దాక్కుని ఉన్నావు?' అని నిలదియ్యాలనే ఆవేశం తప్ప... ఇంకేం లేదు.

దేవుణ్ని చూసినవాళ్లు ఎలా ఉంటారు, మనలాగే ఉంటారా? మనలాగే తింటారా, మనలాగే నిద్రపోతారా, రాగద్వేషాలు మనలాగే ఉంటాయా? వాళ్లలో ఏం మార్పులు ఉంటాయి. వాళ్లను ఎలా గుర్తుపట్టడం?

దైవాన్వేషణలో కూడా దైవాన్ని చూడాలంటే ముందు వివేకం అనే చూపు కావాలి. ఆ వివేకం ఎలా వస్తుంది? జ్ఞానం వల్ల. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? అది ఎవరిదగ్గర ఉందో వాళ్లవల్ల. వాళ్లు మనకు ఆ జ్ఞానం ఇస్తారా? తప్పకుండా. శ్రీకృష్ణుడు ఆ చూపే ఇచ్చి అర్జునుడిలో ఉన్న విషాదాన్ని తొలగించి, విశ్వరూప దర్శనం ఇచ్చి కార్యోన్ముఖుణ్ని చేశాడు. చూపు లేకపోతే ఏమవుతుంది? అంధకారంలో తిరుగుతాం. జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? దైవాన్వేషణకు దారి దొరకదు. అంటే... ఇంతేనా? జీవితమంతా పశుతుల్య జీవనం గడపాల్సిందేనా? జన్మజన్మలు ఇలా వృథా అయి పోవాల్సిందేనా... అని కన్నీరు విడిచి, తపించి తపించి తల్లడిల్లిపోతుంటే- ముందుకు వస్తాడు. ఎవరు? భగవంతుడు కాదు. మానవ రూపంలోనే గురువు. అక్కడితో మన అన్వేషణ ఫలించినట్లే. ఆనందం అవధులు దాటినట్లే.
                                                                           - ఆనందసాయి స్వామి 

No comments:

Post a Comment