ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Wednesday 7 August 2013

సాధనతోనే ఏదైనా...


 ఏది కావాలన్నా, ఎంత కావాలన్నా దానికి మార్గం మనమే అన్వేషించుకోవాలి. అది సాధనతోనే సుసాధ్యం చేసుకోగలుగుతాం. ముందు మనలో ప్రేమన్నది లేకపోతే ప్రేమను సాధించలేం. నిజాయతీగా డబ్బు సంపాదించాలంటే మన శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు అంచనా వేసుకుని కృషిచేయాలి. ఏ విషయమైనా సరే సాధనతోనే...

ఎటువంటి అవమానం ఎదురైనా, ఏ తప్పు దొర్లినా దానికి కారణం మనమే అనుకుంటూ మనల్ని మనం నిందించుకుంటూ కూర్చోవడం అలవాటు చేసుకుంటే- నిరుత్సాహపడిపోతాం. పరిస్థితి నిరాశాజనకంగా మారిపోతుంది. సాధనవైపు దృష్టి మరలదు. అలాగే మనం తలబిరుసుతో ప్రవర్తిస్తూ, ప్రతి విషయాన్ని, ప్రతి ఒక్కరినీ విమర్శిస్తూపోతే మన చుట్టూఉన్నవాళ్లకు దూరమవుతాం. 'నా' అన్నవాళ్లు మనకు మిగలరు. ప్రతి విషయానికీ ఎక్కువగా ఆలోచించేసి చలించిపోవడమూ మంచి లక్షణం కాదు. అందరికీ దూరంగా ఉండి బతకాలనుకోవడం పద్ధతి కాదు. నచ్చనివాళ్లను, నచ్చినవాళ్లను కూడా కలుపుకొనిపోయేవారే ఎక్కువ విజయాలు సాధించడం చూస్తుంటాం.

మనల్ని మనం ప్రేమించడం, ఓర్పు, దయాగుణం... వీటికోసం సాధన చేస్తూపోతే కొన్నాళ్లకు అది అలవాటుగా మారుతుంది. మొదట్లో కృత్రిమంగానూ, అసౌకర్యంగానూ అనిపించవచ్చు. కష్టమనే భావనా కలగవచ్చు. కాలం గడచిన కొద్దీ మార్పు అనివార్యమవుతుంది. ఈ సాధన మన దృక్పథంలో పరివర్తన తీసుకొస్తుంది. సాధన ఆసక్తికరంగా మారుతుంది. ఇది ఒకసారితో ఆగేది కాదు. నిరంతర అధ్యయనం. నేర్చుకోవడమనేది ఎక్కడైనా నిరంతర ప్రక్రియే. అన్నీ అందరం నేర్చుకుంటూనే ఉంటాం. కొంతమందే, మనసు లగ్నం చేసినవారే- ప్రతిఫలాలను పొందగలుగుతారు. ఓ స్వామిజీ చెప్పే ప్రవచనాన్ని రోజూ ఇష్టంతో వింటుంటాం. మన మనసుకు హత్తుకుంటుంది. ఆచరణవైపు దృష్టిసారిస్తాం. చెప్పే విషయం మీద గురికుదిరి ఆయన పుస్తకాలను చదువుతాం. ఆయన చెప్పిన ప్రతి అంశం ఆచరణ సాధ్యం కాకపోయినా సాధన ప్రక్రియ కొనసాగుతూనే ఉండాలి. క్రమక్రమంగా మార్పు సాధ్యమవుతుంది.

సాధన అనేది ఒక క్రమశిక్షణ. బుద్ధిపూర్వకంగా చేయాల్సినది. నిస్సారంగా, యాంత్రికంగా, కేవలం ఒక కాలక్షేపంగా చేస్తే ప్రయోజనం దక్కదు. సాధన సంతోషంతో కూడినదై ఉండాలి. తేలికగా అనిపించాలి. అవసరంలేని గాంభీర్యం, ఒక రకమైన బింకాన్ని తెచ్చిపెట్టవచ్చు. గర్వం పెరిగిపోవచ్చు. ఇందులో ఏది కలిగినా ఆధ్యాత్మికత పక్కదారి పట్టినట్లే. వీణ లేదా వయొలిన్‌ తీసుకుందాం. దానిమీద సంగీతం అభ్యసించడం ఎలా? ఆ సంగీత పరికరాలకు తీగెలు వదులుగానూ ఉండకూడదు. అలాగని బిగువుగానూ ఉండకూడదు. ఇటువంటి సమ ధోరణి సాధకులకు అవసరం.
                                                                   - మంత్రవాది మహేశ్వర్‌

No comments:

Post a Comment