ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday 1 August 2013

సహాయం


హాయం అందరికీ కావాలి. సహాయం అవసరం లేనివాళ్లు ఉండరు. అన్నీ ఉన్నా, ఎప్పుడో ఒకసారి ఏదో ఒక విషయంలో సహాయం అవసరం పడుతుంది. కొంతమందికి ఎక్కువసార్లు. కొంతమందికి తక్కువసార్లు. నిస్సహాయ స్థితిలో ఆర్తనాదాలు చేస్తూ సహాయం కోసం ఎదురుచూస్తూ ఉంటాం. ఈ పరిస్థితి జీవితంలో ఎప్పుడో ఒకసారి రావచ్చు. అప్పుడు చాలామందికి దేవుడు గుర్తుకువస్తాడు. కొంతమంది దేవుడి మీద భారం వేసి ఎదురుచూస్తూ ఉంటారు.

మన పని మనం చెయ్యకపోతే దేవుడేం చేస్తాడు అంటారు కొందరు. మనం పనిచేస్తున్నా దైవం సహాయం చెయ్యకపోతే విజయం వరించదు అంటారు ఇంకొందరు. సహాయం చేసేవాడిని వద్దని ఎవరైనా అంటారా? అయితే ఆ సహాయాన్ని అందుకోవడానికి మనకు అర్హత ఉందా లేదా అని చూసుకోవాలి.

కొందరు దేవుడిని ఎందుకు పూజించాలి, మనకు సహాయం చెయ్యకపోతే దేవుడైనా దయ్యమైనా ఒకటే అంటారు. మరికొందరు మన కష్టాలు మనకు ఎప్పుడూ ఉండేవే, దైవాన్ని మరిచిపోతే ఎలా అంటారు. ఇంకొందరు దేవుడితో బేరం పెడతారు. నీకు ఇది చేస్తాను, నాకు అది ఇస్తావా అంటారు. ఇదంతా దైవసహాయం పేరిట జరిగే వ్యవహారం.

అందరూ ప్రార్థన చేస్తారు. దేవుడు వారి మొర సమానంగానే ఆలకిస్తాడు. తాను చెయ్యాల్సింది మాత్రమే చేస్తాడు భగవంతుడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. దైవసహాయం అందరూ అందుకోలేరు. దైవం కూడా ప్రత్యక్షంగా వచ్చి బ్యాంకు నుంచి కరెన్సీ నోట్లు తెచ్చి మన చేతిలో పెట్టడు. సహాయం చేసే పద్ధతులు ఉంటాయి. మన అర్హత, యోగ్యతను బట్టి సహాయం అందుకుంటాం. సహాయం చేశాను కదా అని భగవంతుడు ప్రతిఫలంగా ఏమీ కోరుకోడు. పత్రం, పుష్పం, ఫలం, తోయం అని భగవద్గీత చెబుతోంది. ప్రేమతో మనం చెప్పిన కృతజ్ఞతలు కూడా ఆయన ఆనందంగా స్వీకరిస్తాడు. మనకు ఇంతచేసిన దేవుడికి పట్టు వస్త్రాలు పెట్టలేదు. కల్యాణం చేయించలేదు... హోమం చేయించలేదు. అని రకరకాలుగా బాధపడిపోతుంటాం. ఆ బాధ ఉండటం మంచిదే. కాని, దేవుడు బేరసారాలు సాగించే తెలివైన వ్యాపారవేత్త కాదు. మనం మాత్రం కొనుగోలుదారుల్లాగా ఉంటాం. నిజమైన భక్తుడు తన భౌతిక బాధల్లో దైవసహాయం కోరడు. తన వివేకంతో వాటిని ఓర్చుకుంటాడు. అవి ఎందుకు వచ్చాయో, ఎలా వచ్చాయో, ఎంతవరకు ఉంటాయో అతడికి క్షుణ్నంగా తెలుసు. ఆందోళన పడడు. ఆవేదన చెందడు. సామాన్యుల్లా దైవాన్ని నిందించడు. స్వయంకృతాపారాధాలను నెత్తిన వేసుకోడు. సాక్షిగా ఉంటాడు. జరుగుతున్నదాన్ని ఒక నాటకంలా చూస్తూ ఉంటాడు.

సంసారం సముద్రం. ఇందులో ఎన్నో బాధలు ఉంటాయి. ఆటుపోట్లు ఉంటాయి. అలజడులు ఉంటాయి. తుపానులు ఉంటాయి. వాతావరణ మార్పులు విశేషంగా ఉంటాయి. దైవం, ఆయనతో మనకున్న సంబంధం, ఆయన చేసే సహాయం గురించి చక్కగా తెలుసుకున్నవాడికి ఇది ఒక ఆట. 
అందుకే కబీరు అంటాడు- ముందు దైవాన్ని తెలుసుకో. ఆ తరవాత నీ ఇష్టం వచ్చినట్లు ఆడుకో అని.
                                                                   - ఆనందసాయి స్వామి 

No comments:

Post a Comment