ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Friday 30 August 2013

సనాతన ధర్మదీపిక


 అనాదిగా, అవిచ్ఛిన్నంగా ఉన్నదీ, శాశ్వతమైనదీ 'సనాతనధర్మం'. దీన్ని వేదధర్మమనీ అంటారు. మనిషిని అన్ని విధాలైన అనర్థాలు, ఆపదల నుంచి ఉద్ధరించి, ఉన్నతివైపు నడిపించేది ధర్మం. కొన్ని కాలాల్లో కొన్ని కొన్ని ధర్మాలు ఆచరణలో ఉంటాయి. కాని సనాతన ధర్మం సర్వదా ఉండేది. దీన్నెవరో సృష్టించలేదు. దానంతటదే ఆవిర్భవించింది. ఆద్యంతాలులేనిదే సనాతన ధర్మమని శ్రీరామానుజాచార్యులు వ్యాఖ్యానించారు.

సనాతన ధర్మం మనదేశానికి మహాప్రాణం. దీనివల్లనే ప్రపంచంలో అత్యున్నత ఆధ్మాత్మిక శిఖరాన శోభిల్లగలుగుతోంది. ధర్మాన్ని రక్షిస్తే, అది మనల్ని సదా రక్షిస్తూనే ఉంటుంది. దీనికి సాటియైన ధర్మం లోకంలోనే మరోటి లేదు. ఇది మతం కాదు. ఎందుకంటే మతానికి ఆది-అంతం ఉంటాయి. పరధర్మాచరణకన్న స్వధర్మాన్నే విశ్వసించి చేయడం సముచితమనీ, స్వధర్మానుసరణలో మరణమైనా శ్రేయస్కరమేననీ గీతాప్రవచనతాత్పర్యం. ఇతరులు నీపట్ల ఎలా ప్రవర్తించాలని నీవనుకుంటావో నీవూ అలానే ప్రవర్తించాలనేది సర్వ ధర్మాలసారం. మనిషికి పుట్టుకతోనే స్వధర్మం వెన్నంటి ఉంటుంది. మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి అనే ధర్మసూక్ష్మాలు శైశవదశనుంచే తల్లిదండ్రుల ఆసక్తి, శ్రద్ధల వల్ల పిల్లలకు అలవడతాయి. ఆ తరవాత విద్య, వివేకం, అనుభవం, సమాజంవల్ల మరికొన్ని ధర్మసూత్రాలు వాళ్లు తెలుసుకుంటారు. బంధుప్రీతి వల్ల అర్జునుడు కురుక్షేత్రంలో యుద్ధం చేయనని, స్వధర్మాన్ని త్యజించేందుకు సిద్ధపడితే కృష్ణపరమాత్మ అతణ్ని జాగరూకుణ్ని చేస్తాడు. ధర్మపక్షపాతికి దేనిమీదా వ్యామోహం ఉండదు. ఇతర ప్రాణికి ఏ కష్టమూ కలిగించకపోవడమే ధర్మం.

ధార్మిక జీవనం మంచి మరణానికి దారితీస్తుంది. అంతరాత్మ చెప్పినట్లు జీవించడం ధర్మం. మనసు చెప్పినట్లు జీవించడం అధర్మమవుతుంది. ఇంద్రియవ్యామోహమున్నవారు ధర్మనిర్వహణ చేయలేరు. దేవుడంటే భయభక్తులుండటం వల్లనే మనిషి కొంతలో కొంతైనా ధర్మబద్ధంగా జీవించగలుగుతున్నాడు. ప్రకృతిలోని చెట్టు, గట్టు, ఏరు, గాలి, నేల, నింగి, నిప్పు మొదలైనవన్నీ తమతమ ధర్మాల్ని నిర్వర్తించగలుగుతూంటే, మానవుడే తన ధర్మాన్ని మరిచి విశృంఖలంగా ధర్మ ధిక్కారం చేసి ఎండమావుల్లాంటి భోగాలవెంట పరుగులు తీస్తున్నాడు.

ధర్మానికి, దైవానికి ప్రతీకగా నేలనేలుతున్న సత్యాన్నే పలకాలని మనుస్మృతి. ధర్మవ్యాధోపాఖ్యానంలో ధర్మవ్యాధుడు బహువిధాలైన ధర్మసూక్ష్మాల్ని కౌశికుడికి బోధిస్తాడు. 'సత్యంవద' అనే సూక్తితో తైత్తిరీయోపనిషత్తు సత్యం ద్వారానే ధర్మావిష్కరణ సాధ్యమని చెబుతోంది. సహనం, ధైర్యం, మనోనిగ్రహం, పరధనాపరిగ్రహణం, బాహ్యాభ్యంతరశుచి, సత్యాసత్యవిచక్షణ, కావలసిన పరిజ్ఞానం, సత్యభాషణం, క్రోధ విసర్జనం, ప్రేమ- ఈ పది లక్షణాలు ధర్మజీవనానికి ప్రముఖమైనవిగా విజ్ఞులు చెప్పారు. యుద్ధానికి బయలుదేరేముందు ఆశీస్సుల కోసం తల్లి గాంధారి వద్దకు వచ్చిన దుర్యోధనుణ్ని పుత్రవాత్సల్యంకన్న ధర్మమే శ్రేష్ఠమని నమ్మి, 'ధర్మానికి విజయం లభించుగాక' అని దీవిస్తుంది.

ఆత్మీయత, ప్రశాంతత, ప్రసన్నత, పరపీడనాభావరాహిత్యం, అతిథుల పట్ల ఆదరణ, శిష్టవ్యావహారికత, ఆధ్యాత్మిక చింతన, సత్కార్యాల పట్ల శ్రద్ధ వంటి 55 సద్గుణాల రాశి- 'ధర్మం' సమగ్ర స్వరూపం. మనిషి తన మనసుతోసహా సర్వాంగాలను ధర్మానువర్తనకే వినియోగించాలి. ధర్మప్రతిష్ఠాపన కోసం ఆదిశంకరుల వంటి మహనీయులెందరో అహర్నిశలు కృషిచేసి, అది తమ ధర్మంగానే భావించారు. దుర్యోధనుడి మనసు మార్చాలని భీష్మద్రోణాది ఆచార్యులెంతగానో హితవు చెబుతారు. దుర్యోధనుడంటాడు- 'ధర్మమని తెలిసినా, నేనాచరించలేను. అధర్మమని తెలిసి కూడా దాన్ని అనుసరించడం మానను' అని. తగిన ప్రాయశ్చిత్తం జరగనే జరిగింది. పరకాంతావ్యామోహాన్ని గరళంతో సమానంగా పోల్చింది సనాతన ధర్మం. రావణ దుశ్చరిత్ర అదే నిరూపించింది. సామాజికధర్మాలు, రాజనీతిధర్మాలు, సంప్రదాయక ధర్మాలని వివిధ రకాలుగా ధర్మవర్గీకరణ జరిగింది. సనాతన ధర్మవర్తనుడైనకొద్దీ మనిషి జీవితంలో స్నేహం, ఆనందం, సౌహార్దత, సౌభ్రాతృతం, పరోపకారం, ఔదార్యం, దాతృత్వం వంటి మహోన్నత సద్గుణాలు పెంపొందుతూంటాయి. శ్రీరాముడు, కృష్ణుడి అవతార విశేషాల్లో ఈ సనాతన ధర్మమే ఎల్లెడలా గోచరిస్తుంది మనకు.

ధర్మావలంబనలో ఎంత లీనమవుతామో, అంతగా దుర్వ్యసనాలన్నింటినీ దూరం చేసుకోగలం. రజస్తమోగుణాలను విసర్జించగలం. సనాతన ధర్మం విశ్వధర్మం. సమస్త ప్రాణికోటి శ్రేయానికి సంబంధించింది. పరమ రమణీయమైన ప్రకృతి ధర్మాలకు సంబంధించింది. శ్రుతి-స్మృతి-వేద-పురాణాదుల్లో సర్వత్రా ధర్మమే మూలమంత్రం. కనుక ధర్మమే మనకు శ్రీరామరక్ష!
                                                                    - చిమ్మపూడి శ్రీరామమూర్తి 

No comments:

Post a Comment