ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Sunday 25 August 2013

హీనంగా చూడకు దేన్నీ!


   'కొంచెముండుటెల్ల కొదవ కాదు' అన్నాడు వేమన. పరిమాణం ప్రమాణం కాదు. పొట్టివాళ్లెందరో గట్టివాళ్లు అనిపించుకున్నారు. ఆకారాన్నిబట్టి, ఆస్తిపాస్తులనుబట్టి- మనుషుల ఔన్నత్యాన్ని అంచనా వేయలేం. ఒకప్పుడు భూమిపై రక్కసి బల్లులే రాజ్యమేలాయి. విపరీతమైన దేహపరిమాణంతో లోకంలో ఎదురులేకుండా సంచరించాయి. వాటితో పోలిస్తే తాబేళ్లు అల్పజీవులు. ఒక్క గ్రహశకలం తాకిడితో భువిపై ఉన్న రక్కసి బల్లులన్నీ మట్టిలో కలిసిపోయాయి. కానీ, తమలోకి తామే ముడుచుకుపోయే స్వభావంగల అల్పప్రాణులైన తాబేళ్లు మాత్రం ఆ ధూళి ప్రళయం నుంచి తప్పించుకుని నిక్షేపంగా నేటికీ నడయాడుతున్నాయి.

ప్రపంచంలో ఏ ఇతర జంతువుల కాటువల్ల మరణిస్తున్నవారికన్నా దోమకాటువల్ల ఎక్కువమంది చనిపోతున్నారు. ఆకారాలనుబట్టి మంచి చెడులను బేరీజు వేయలేమని స్పష్టమవుతోంది కదా! సమాజంలోని హీనులను దీనులను మహాత్ములు మరింత ఇష్టపడ్డారు. దీన నారాయణసేవే జీవిత ధ్యేయంగా కాలం గడిపారు. రామకృష్ణ పరమహంస, రమణమహర్షి వంటివారి జీవితాలే ఇందుకు నిదర్శనం.

ప్రాణులన్నింటికీ ముసలితనం తప్పదు. వాళ్లు పనికిరానివాళ్లని, పోషించడం దండగనీ భావించకూడదు. వయసులో వారు చేసిన సేవలు మరువకూడదు. శారీరక శక్తి లేకున్నా, అనుభవాలను పంచిపెట్టగల సమర్థులు వాళ్లు. అపార యుక్తిసంపద వాళ్ల సొత్తు.

ఒక వృద్ధ వృషభం పొరపాటున పాడుబడిన బావిలో పడిపోయింది. వూళ్లోవాళ్లు దాని అరుపులు విని, వచ్చి చూశారు. లోపల ముసలి ఎద్దు మోరచాచి దీనంగా చూస్తూ కనిపించింది. పెద్దపెద్ద మోకుల సాయంతో దాన్ని బయటకు లాగమని యువకులకు ఒక పెద్దాయన సలహా చెప్పాడు. కుర్రవాళ్లు తలా ఒకవిధంగా అన్నారు.

'చావబోయే ముసలి ఎద్దును పైకి తీసి ఏం లాభం? అది చనిపోయిన తరవాత ఎలాగూ మేళతాళాలతో మోసుకుపోయి, పెద్ద గొయ్యి తీసి పూడ్చిపెట్టాలి! ఇప్పుడే ఈ బావిని పూడిస్తే ఆ పని పూర్తవుతుంది గదా' అన్నాడొక యువకుడు. అందరూ పాడుబావిని పూడ్చడం మొదలుపెట్టారు. లోపలున్న ముసలి ఎద్దు తనపై పడిన మట్టిని విదిలించుకుంటూ మట్టిపైకి ఎక్కడం మొదలుపెట్టింది. క్రమంగా బావి గట్టుదాటి బయటపడింది. 'అరే, ఎందుకూ పనికిరాదనుకున్న ముసలెద్దుకు ఎన్ని తెలివితేటలున్నాయి! జీవితంలో ఢక్కామొక్కీలు తిరిగిన ముసలివారి అనుభవ జ్ఞానాన్ని తెలుసుకొంటే ఆపదలనుంచి బయటపడవచ్చు గదా!' అనుకున్నారు యువకులు.

సృష్టిలో పనికిరాని వస్తువేదీ లేదు. ఒకరికి నిష్ప్రయోజనకరమైన వస్తువు ఇంకొకరికి అత్యంత విలువైనది కావచ్చు. తలుపు గొళ్లెం... హారతి పళ్లెం- దేని విలువ దానిదే! చిన్నప్పుడు రాసిన కలాన్ని ప్రాణప్రదంగా జీవితమంతా భద్రపరచుకునే వాళ్లెందరో ఉన్నారు. సీతాదేవి అరణ్యవాసం చేసేటప్పుడు సంచరించిన భూములను, అయోధ్యకు తిరిగివచ్చిన తరవాత కూడా, 'తిరిగి ఒక్కసారి చూసిరావాలి' అని శ్రీరాముణ్ని కోరుకుంటుంది! సంపదలకంటే మధురానుభూతులకే మానవ హృదయం ఎక్కువ స్పందిస్తుంది.


ఒక ధనవంతుడికి సంతానం కలగలేదన్న చింత పీడిస్తూ ఉండేది. పెద్దవయసులో ఆ దంపతుల నోములు ఫలించి ఒక బిడ్డ పుట్టాడు. అయితే అతడు బుద్ధిమాంద్యంతో జన్మించాడు. ఆ వృద్ధ దంపతులు ఒక దాదిని నియమించి ఆ శిశువును అత్యంత ప్రేమతో పెంచారు. దాది తన కన్నకుమారుడిలా బాలుణ్ని పెంచింది. పదేళ్ల ప్రాయంలోనే ఆ బాలుడు స్వర్గస్థుడయ్యాడు. వృద్ధ దంపతులు దిగులుతో మంచంపట్టి మరణించారు. వాళ్ల వీలునామా ప్రకారం ఆస్తిని వేలానికి పెట్టారు. మొదట చనిపోయిన బాలుడి చిత్రపటాన్ని బయటకుతీసి వేలం ప్రారంభించారు. 'పాడు బొమ్మ... ఇదెవరికి కావాలి! భవనం, వస్తువులు, భూములు వేలానికి వచ్చినప్పుడు పాడదాం' అని ఎవరూ చిత్రాన్ని కొనడానికి ముందుకు రాలేదు. అక్కడే నిలుచుని ఉన్న దాది తాను పోగుచేసుకున్న డబ్బంతా ఇచ్చి, ఆప్యాయంగా ఆ బొమ్మను స్వాధీనపరచుకొంది. 'ఈ పనిమనిషికి పిచ్చా? పనికిమాలిన బొమ్మ కొనుక్కుంది!' అని అంతా అవహేళన చేశారు. అప్పుడు- అధికారులు ఒక కవరు తీసి దాని లోపల ఉన్న చీటీని చదివి వినిపించారు. 'మా అబ్బాయి చిత్రపటాన్ని దక్కించుకున్నవారికే మా ఆస్తినంతా స్వాధీనం చేయవలసింది!' అని రాసిఉంది అందులో!
                                                              - డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు 

No comments:

Post a Comment