ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday 31 October 2013

అవసరం


 అద్భుతమైన ఫలితాలు కలగడానికి ఆసక్తి ఒక కారణం. అవసరం అతి ముఖ్య కారణం. ఈ రెండూ ఉన్న ప్రాణి మానవుడు. పరిసరాలను, అవకాశాలను, సమయాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటే ప్రతి వ్యక్తీ ఉన్నత స్థాయికి చేరతాడు. దీనికి కావలసిందల్లా కాస్త నిదానం, మరికాస్త ఓపిక. అవసరం మనిషిచేత ఎంత పనైనా చేయిస్తుంది. కష్టాలను భరించేటట్లు చేస్తుంది. సాహసాలను చేయిస్తుంది. వాటి వల్ల కొత్త ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటాయి.
చలికాలంలో చన్నీటి స్నానం చేయమంటే జంకుతారు. కానీ కాలుజారి పడి ఒళ్ళంతా బురద అయితే దాన్ని కడుక్కోవడానికి మరో ఆలోచన లేకుండా అంత చలిలోనూ చన్నీటి స్నానం చేయడానికి వెనకాడరు. వడిగా ప్రవహిస్తున్న నదిలో ప్రమాదవశాత్తు పడిపోతే కనిపించిన ఏ గడ్డిపరకనైనా ఆధారంగా చేసుకుని బయటపడటానికి ప్రయత్నిస్తారు ఎలాంటివారైనా. ఆ సమయంలో ఆ గడ్డిపరక తన ప్రాణాలను కాపాడగలుగుతుందా, లేదా అనే ఆలోచన ఉండదు. తనకు ఈతరాదు కదా ఎలా ఒడ్డుకు చేరతానని ఆలోచించరు. ఆ సమయంలో వారి ఆలోచన అంతా ఒక్కటే- ప్రాణం నిలబెట్టుకోవాలి. వీటన్నింటికీ కారణం 'అవసరం'. ఆ అవసరం కలిగిననాడే వెదుకులాట మొదలవుతుంది. అప్పుడే కొత్త ఆవిష్కరణ జరుగుతుంది.

జీవకుడు గౌతమ బుద్ధుడి (పూర్వాశ్రమంలో సిద్ధార్థుడి)కి ఆస్థానవైద్యుడు. అతడు తక్షశిలలో గురువును మెప్పించి వైద్య శాస్త్రాన్ని నేర్చుకున్నాడు. విద్య పూర్తయింది. 'ఈ నగరానికి రెండు మైళ్ల కైవారం (చుట్టూరా)లో ఉన్న మొక్కల్లో మందుకు పనికిరానిది తెచ్చి నాకివ్వు' అని గురువు గురుదక్షిణ కోరాడు. 'అదెంత పని' అనుకుని బయలుదేరాడు జీవకుడు. అలా వెళ్ళినవాడు ప్రతి మొక్కను పరిశోధన చేసి, కొన్ని సంవత్సరాల తరవాత గురువు దగ్గరకు చేరాడు. 'క్షమించండి గురుదేవా! మీరు చెప్పిన పరిధిలో మొక్కలన్నింటినీ పరిశోధించాను. వాటిలో కొత్త కొత్త ఔషధాల విషయంలో ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి. అంతే తప్ప వాటిలో మందుగా పనికిరాని మొక్క ఒక్కటీ కనబడలేదు' అని విన్నవించుకున్నాడు. ఆ మాటకా గురువు 'నీకా విషయం తెలియజేయడానికే అలా కోరాను. వాటిన్నింటినీ పరిశోధన చెయ్యమని చెబితే అర్థం చేసుకోవు. ఏ మొక్క ఏ చికిత్సకు పనికివస్తుందో పరిశోధన చేయమంటే 'ఇప్పటివరకూ ఉన్న విజ్ఞానం చాలులే' అని నిర్లక్ష్యం చేయవచ్చు. ఇలాగైతే తప్పనిసరి కాబట్టి, ఎన్నో పరిశోధనలు చేశావు. అది నీ భావి వైద్యవృత్తికి ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ రకంగా నా గురుదక్షిణ నాకు చేరింది, వెళ్ళిరా' అని ఆశీర్వదించి పంపాడు.

ఒక అవసరం మనిషికి స్ఫూర్తిగా మారుతుంది. అది అతడి అవసరం తీర్చడమే కాదు, భవిష్యత్తులో ఎందరికో ఉపయోగపడుతుంది. ఒకరి అవసరం కోసం ఏర్పరచుకున్న సౌకర్యం, ఒక ప్రాణాన్ని నిలబెట్టడం కోసం కనిపెట్టిన మందు... ఇలా వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి ఏర్పరచుకున్న సౌకర్యాలు భావితరాల వారికి సమష్టిగా ఉపయోగపడిన దాఖలాలు ఎన్నో...

ఒక బాలుడు ఆటలాడుతుండగా ప్రమాదవశాత్తు రెండు కళ్లూ పోగొట్టుకున్నాడు. ఆ అంధత్వాన్ని అధిగమించి చదువుకోవాలనుకున్నాడు. అనేక ప్రయత్నాలు చేసి చేతి వేళ్లతో తడిమితే అర్థమయ్యే అక్షరాలకు రూపకల్పన చేశాడు. చదువుకుని విద్యావంతుడయ్యాడు. అతడు రూపొందించిన ఆ అక్షరాలు అతడికొక్కడికే కాకుండా లోకంలో ఉన్న అంధులందరికీ ఉపయోగకరంగా మారాయి. అదే బ్రెయిలీ లిపి. ఆ లిపిని సృష్టించిన వాడు లూయీ బ్రెయిల్‌. డాన్‌ బాస్కో అనాథ బాలుడు. ఏ ఆధారం లేకపోవడం వల్ల ఎన్నో బాధలు అనుభవించినవాడు. కష్టనష్టాలకు ఓర్చి జీవితంలో నిలదొక్కుకున్నాడు. ఆయన స్థాపించిన సేవాసంస్థలు నేడు ప్రపంచవ్యాప్తంగా ఎందరో అనాథ, వీధి బాలలకు ఆశ్రయాన్ని కల్పిస్తున్నాయి. మంచి ఆశయంతో అవసరాలు తీర్చుకోవడంకోసం చేసిన ఆవిష్కరణలు తరవాతి తరాల వారికి ఉపయోగపడినట్లే, స్వార్థ అవసరాల కోసం ఏర్పడిన ఆవిష్కరణలు అనర్థాలకీ దారితీస్తాయి. కాబట్టి 'అవసరం చెడ్డది' అనిపిస్తే దాన్ని తీర్చుకోకపోవడమే మంచిది.
- అయ్యగారి శ్రీనివాసరావు

No comments:

Post a Comment