మానవ జన్మ గొప్పది. దీన్ని భోగమయం కావించి రోగమయం చేసుకోరాదు. చేసుకుని చింతించిన ప్రయోజనం ఉండదు. దేహాన్ని పవిత్రంగా భావించాలి. దివ్యత్వాన్ని ప్రకటించే ఉత్తమ సాధనంగా మార్చుకోవాలి.
మన దేహాన్ని ఆధ్యాత్మిక సాధనంగా మార్చుకోవాలి. తుచ్ఛమైనదని భావించరాదు. భగవద్గీత దేహాన్ని క్షేత్రంగా పేర్కొంది. ఈ దేహమనే పొలాన్ని చక్కగా చూసుకొని ఉత్తమ ఆధ్యాత్మిక ఫలాన్ని అందుకోవాలి. దేహం దేవాలయం వంటిదన్నారు విజ్ఞులు. మనిషి పోకడలు విచిత్రంగా ఉంటాయి. అందుకు కారణం మన ఆశలు. వాటిలో ప్రధానమైనది కీర్తి సంపాదించాలన్న కోరిక!
ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. తన రూపాన్ని పోలిఉండే శిల్పఖండాలను చాలా నిర్మించాడు. ఒకమారు వాటి మధ్య పడుకొన్నాడు. మృత్యుదేవతకు, అతగాడి అసలు దేహమేదో, నకలు దేహమేదో తెలియలేదు. మృత్యుదేవత ఆలోచించింది. 'ఆహా, ఎంత అద్భుతం... ఎవరో ఈ శిల్పి. అపూర్వ సృష్టి' అని ప్రశంసించింది. అది విన్న వెంటనే శిల్పి ఆనందంతో లేచి 'నేనే' అన్నాడు. మృత్యుదేవత అతణ్ని లాక్కుపోయింది.
మనసు భావోద్వేగాల సాగరం. మనసు ద్వారానే ఆత్మ గొప్పదనాన్ని తెలుసుకోవాలంటుంది ఉపనిషత్తు. నిగ్రహం లేని మనసు, మనిషిని నరకకూపంలో పడవేస్తుంది. నిగ్రహం కలిగిన మనసు మనలను దైవసన్నిధికి తీసుకొని వెళ్తుంది. దానికి జ్ఞానరూపమైన ఉత్తమ ఆహారాన్ని అందించాలి. జ్ఞానం మనకు శక్తిని అందజేస్తుంది. నైతికశక్తివల్ల ఇచ్ఛాశక్తి పెరుగుతుంది. ప్రేమ, దయ, సానుభూతి, సేవాభావం వంటి భావనాత్మక గుణాలు పెంచుకోవటంవల్ల భావశుద్ధి ఏర్పడుతుంది.
దేహేంద్రియాల సర్వతోముఖాభివృద్ధి సాధించడంతోపాటు, వాటికి అతీతంగా మనం జీవనం సాగేలా ప్రయత్నించాలి. ఈ ప్రయత్నాల ఫలితంగా సాధించిన ఫలితాన్ని జ్ఞానులు తమ అనుభవాలు, ఉపదేశాల ద్వారా బోధిస్తారు.
ఒకటి భక్తిమార్గం. మనకంటే మిన్నదైన శక్తినే భగవంతుడు అంటాం. మనం భగవంతుడికి శరణాగతులం కావాలి. మరొకటి జ్ఞానమార్గం. మన వ్యవహారాలన్నింటికీ కాక, మన ఆలోచనలకు ఆధారమైనది. నేను ఎవరిని అని అన్వేషించడమే ఉత్తమ మార్గం. భగవాన్ రమణ మహర్షి 'నేను' ఎవరో తెలుసుకొనేందుకు యత్నించమన్నారు. ఆ యత్నమే మన జీవనగమ్యం కావాలి. సత్యాన్ని నిరూపించడానికి ఎన్నో శాస్త్రాలు, ఇతిహాసాలు వెలువడ్డాయి. మహాత్ములు, భక్తులు, అవతార పురుషులు- తాము తెలుసుకొన్న పరమసత్యాన్ని లోకానికి చాటిచెప్పారు.
మన ఆకలి నివారణకు మనమే ఆహారం సేవించాలి. ఇతరులు తింటే మన ఆకలి తీరదు. 'శ్రద్ధావాన్ లభతే జ్ఞానం' అన్నాడు గీతాచార్యుడైన కృష్ణ భగవానుడు. అదే మన మహర్షులు, యోగులు అనుసరించిన మార్గం. అప్పుడే మన జీవితం సార్థకం కాగలదు. అదే మన జీవనగమ్యం కావాలి.
- డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి
No comments:
Post a Comment