ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday 10 October 2013

మూలపూజ


  సృష్టిలో అనేక రకాల శక్తులున్నాయి. వాటిలో జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి అనే మూడు శక్తులు ముఖ్యమైనవి. గుణాలూ అనేక రకాలు. వాటిలో సత్వ, రజో, తమోగుణాలు ముఖ్యమైనవి. సత్వ (సాత్విక) గుణం సామాన్య జీవనానికి, జ్ఞాన, వైరాగ్య, మోక్ష మార్గాలకు దారి చూపుతుంది. రజోగుణం రాజస లక్షణాలైన అధికారం, అహంభావం, దర్పం, ఉచ్చస్థితిలో ఉండాలనుకోవడం లాంటి మార్గాలకు ప్రతీక. తామస గుణ లక్షణం పేరులోనే వ్యక్తమవుతోంది. అజ్ఞానం, అకృత్యం, అలసత్వం, మౌఢ్యం మొదలైన ఆసురీ లక్షణాలకు ప్రతీక. సృష్టి అంతా ఈ మూడు గుణాల సమాహారమే. గుణాలు, శక్తులు- ఎవరికి, ఏవి, ఎలా ఉన్నా వాటన్నింటినీ నియంత్రించడానికి సర్వోన్నత శక్తి ఒకటి ఉండాలి. అలా నియంత్రించగలిగే సర్వశక్తుల సమాహార స్వరూపిణే ఆదిశక్తి. ఆమెకు అనేకమైన పేర్లున్నాయి. అనేక రూపాలతో కొలుస్తారు. ఆమె సర్వవ్యాపిని, సర్వమంగళకారిణి. సర్వైశ్వర్య ప్రదాయిని. దుష్టశక్తులకు దుఃఖదాయిని, సర్వోపద్రవ నివారిణి. అయినా అభయ ప్రదాయిని. కాబట్టి పై మూడు శక్తుల సమాహారమైన ఆ ఆదిశక్తిని ఆశ్వయుజమాసంలో తొలి రోజునుంచి తొమ్మిది రోజులు, తొమ్మిది రూపాలతో కొలుస్తారు. నక్షత్రాల్లో మొదటిది అశ్విని. ఆ నక్షత్రం పున్నమి నాటి చంద్రునితో కూడిన మాసం ఆశ్వయుజం. ఆదిశక్తిని, ఆది నక్షత్రపు పేరుతో ఏర్పడ్డ మాసంలో పూజించడం వల్ల శుభాలు జరుగుతాయని విశ్వాసం.
ఈ శరన్నవరాత్రుల్లో ఆదిశక్తి అయిన జగన్మాతను అనేక రూపాల్లో, అనేక కారణాలతో అనేక కాంక్షలతో ఆరాధిస్తారు. ఉన్నవి తొమ్మిది రూపాలే అయినా, వారివారి భావనానుసారం, విభవానుసారం, మనోగత కోరికల సిద్ధికోసం వేరు వేరు రూపాల్లో కొలుస్తారు. వీటికి ప్రాంతీయ భేదాలు, ఆచార వ్యవహారాలు సైతం దోహదపడతాయి. ఎవరు, ఎక్కడ ఏ రూపాల్లో కొలిచినా ఆ తొమ్మిది రూపాల్లో ఒకటి సరస్వతీ రూపం తప్పనిసరిగా ఉంటుంది. దీనికి కారణం పైన చెప్పిన మూడు శక్తుల్లో ముఖ్యమైనది, మిగిలిన రెండింటి ఉనికికి ఆధారమైనది జ్ఞానశక్తి. అంత ప్రాముఖ్యం కలిగిన జ్ఞానానికి అధిదేవత సరస్వతి. ఈమె పుట్టిన నక్షత్రం మూల. నవరాత్రుల్లో మూలా నక్షత్రంతో కూడిన దినాన సరస్వతిని పుస్తకరూపంలో పూజిస్తారు. దీనికే 'పుస్తక రూపిణీ సరస్వతీ పూజ'అని 'మూలపూజ' అనీ పేర్లు.

విద్య అనేక రకాలు. వాటిలో వాగ్రూప, కళారూప, లౌకిక, మనోమయ, యోగ విద్యలు ముఖ్యమైనవి. ఇవన్నీ ప్రతి మనిషికీ ఆవశ్యకాలే. వాగ్రూపిణి అయిన సరస్వతి అనుగ్రహం వల్లనే శైశవంలో మాటలు రావడం రూపంలో వాగ్విద్య పట్టుపడుతుంది. దాని ఆసరాతో... లౌకిక, వ్యావహారిక, కళావిద్యలు అభ్యసిస్తారు. వీటన్నింటికీ మూలస్థానం మనసు. కాబట్టి మనోమయ విద్య (జ్ఞాన సముపార్జన) ప్రతివారికీ తప్పనిసరి. వీటన్నింటి ఆసరాతో సాధనా మార్గాన పయనిస్తే పట్టుపడేది యోగవిద్య. ఇది స్వస్థితి నుంచి ముక్తి(అన్ని బంధాల నుంచి విడివడే) స్థితికి చేర్చడానికి ఉపయోగపడుతుంది. ఇన్ని రకాలైన విద్యలన్నింటికీ అధిదేవత సరస్వతీదేవే. బ్రహ్మ సృష్టి చేయడానికి అవసరమైన సంకల్ప శక్తిని సైతం అనుక్షణం ప్రసాదించేది సరస్వతే అని పురాణాలు చెబుతున్నాయి.

స్వరం అంటే అక్షరం, రాగం అనే అర్థాలున్నాయి. అక్షర రూపవిద్య, సంగీత రూప విద్యలు రెండూ వీణానాదం నుంచే పుట్టాయంటారు. అలాగే నాదాన్ని పరిశీలిస్తే సకల దేవతలూ మంత్ర రూపాన ఇమిడి ఉంటారని చెబుతున్నాయి వేదాలు. ఆయా మంత్రపూర్వక శబ్దంతోనే ఆ దేవతలను ఆవాహన చేస్తే వారి అనుగ్రహం సిద్ధిస్తుంది. కాబట్టి అందరు దేవతామూర్తులూ ఇమిడి ఉన్న ప్రదేశం ఆ వీణాతంత్రులే అనేది సుస్పష్టం. చేతిలో నిరంతరం ధరించేది అక్షమాల. అపరా (వేదాంత) విద్యకు ఇది సంకేతం. పైకి ఉచ్చరించడానికి వీలుకాని కొన్ని శబ్దాలను మనసులోనే మననం చేసుకుంటూ స్మరించుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మనో (మనన) రూప విద్యకు అక్షమాల (54 అక్షరాలకు సంకేతంగా 54 పూసలుంటాయని ఈ పేరొచ్చింది. కాని, అసలు పేరు జపమాల) అత్యంత ఆవశ్యకం. ఒక్కొక్క శక్తిని వశపరచుకోవడానికి ఒక్కొక్క నియమిత సంఖ్యా పరిధి ఉంటుంది. అది ఎక్కువైతే విపరీతార్థాలు కలుగుతాయి. తక్కువైతే ఫలితం ఉండదు. అందువల్ల ఆయా సంఖ్యల గణనకు ఉపయోగపడేదీ అక్షమాల. ఆ రకమైన విద్యకు సంకేతం అక్షమాలధారణ. చూపులో కరుణ, చేతుల్లో జ్ఞానముద్ర, రూపంలో శుభలక్షణాలు, హృదయంలో మాతృప్రేమ కలిగిన సర్వవిధ జ్ఞానదాయిని సరస్వతీ రూపం. కాబట్టి జ్ఞాన, క్రియాశక్తులు కలగాలని కోరుకునేవారు విద్యా ప్రదాత్రి అయిన సరస్వతిని ఆరాధించడం, సర్వశుభకరం, సర్వేశ్వర్య ప్రదాయకం, భక్తి ముక్తి కారకం.
- అయ్యగారి శ్రీనివాసరావు 

No comments:

Post a Comment