ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday 5 September 2013

సాగరమథనం సంకేతమే!


 మన ఇళ్లల్లో కండచీమలు గుంపులుగా వెళ్తుంటాయి. అవి కాశీకి ప్రయాణం చేస్తున్నాయని పెద్దలు చెబుతారు. చిన్నపిల్లలు దాన్ని నమ్మేవారు. మరికొందరు నమ్మలేదు. ఇంకా కొందరు- చీమలేమిటి, కాశీ వెళ్లడమేమిటి అని హేళన చేశారు. కాశీ ఒకటి ఉందని అక్కడికివెళ్తే పుణ్యం వస్తుందని తెలిసినవారెవరో ఈ కట్టుకథను సృష్టించారు. 'కాశీ వెళ్తాను' అని అనుకున్నా పుణ్యమేనని పెద్దలు ఇప్పటికీ అంటుంటారు. కాశీ అనే పదం అంత పరమ పవిత్రం, మహానివేదనం. కాశీ అంటే అర్థం 'అంతిమ ప్రకాశం'. అక్కడికి చేరడం అంటే మోక్షంలోకి అడుగుపెట్టడమే. ప్రళయ కాలంలో కాశీ నాశనం కాదని విజ్ఞులు చెబుతారు. 

ఇలాంటి చిట్టి కథలు మనకు ఎన్నో కనిపిస్తాయి. అటువంటి వాటిలో సూర్యచంద్రులను రాహుకేతువులనే సర్పాలు కబళించడం ఒకటి. ఈ కథను హేతువాదం కొట్టిపడేస్తుంది. గ్రహణాలు ఎలా ఏర్పడతాయో విజ్ఞాన శాస్త్రం చెప్పినా ఇప్పటికీ రాహుకేతువులు సూర్యచంద్రుల్ని కబళించడం వల్లనే ఏర్పడుతున్నట్లు నమ్మేవారున్నారు. 
ఈ గ్రహణాలపై అనేక తర్జన భర్జనలు జరిగాయి. రాహుకేతువులు నిజంగా సర్పాలు కావని, అవి ఛాయగ్రాహాలు అని; అవి సూర్యుడికి, భూమికి, చంద్రుడికి మధ్య ఏర్పడే నీడల పేర్లని, అలా పుస్తకాల్లో రాసి ఉందని కొందరు విచిత్ర సిద్ధాంతం లేవనెత్తారు. ఆ సిద్ధాంతం నిలబడలేదు. ఎంతగా తర్కించి చెప్పినా హేతువాదం నమ్మదు. ఎంతగా కుతర్కించి చెప్పినా సనాతనులు వినిపించుకోలేదు. 

గ్రహణాల కథ మన మనసుల్ని తప్పకుండా క్షీరసాగర మథనం వైపు నడుపుతుంది. రాహుకేతువులు సూర్యచంద్రుల్ని కబళించడం గురించి చెప్పినవారికి కావలసింది అదే. తమను మూర్ఖులని అనుకొన్నప్పటికీ వారు ఈ కథను ప్రచారం చేశారు. అసలు మథనం గురించి ఆ యుద్ధం. పాల సముద్రంలో మంథరగిరిని లేపి వాసుకి అనే పామును తాడుగా చేసి అటు రాక్షసులు, ఇటు దేవతలు మథించారట... ఏమి అద్భుత కల్పన! ఈ కలియుగంలో, కంప్యూటర్‌ యుగంలో ఈ కథను నమ్ముతారా! అసలు వింటారా? 

సాగర మథనం చేస్తే విషం పుట్టింది. శివుడు దాన్ని స్వీకరించి ఆరాధ్యమూర్తిగా నిలిచాడు. తరవాత అమృతం పుట్టింది. దేవతలు స్వీకరించారు. రాక్షసులకు దక్కలేదు. దేవతలు అమరులే కానీ వారు అమృతం తాగారు. మంచి చెడుల సంఘర్షణలో విషం పుడుతుంది. అమృతమూ ఆవిర్భవిస్తుంది. భగవంతుడే అమృత ప్రదాత. 
క్షీరసాగరం అంటే పాలతో నిండిన సముద్రం అని అర్థం లేదు. అదొక సంకేతం. వేద రుషుల భావనలో శాశ్వత అస్తిత్వానికి సంకేతం. అది నిరపేక్ష మాధుర్యం, పూర్ణ ఆనందంతో నిండిన అనంతం (సముద్రం), పరాత్పరతత్వం. 

విశ్వమనే భౌతిక మంథర పర్వతంతో కనిపించని కాలాన్ని, అస్తిత్వ సాగరాన్ని మథిస్తే జీవనమంతా అమృత మహార్ణవంగా మారుతుంది. విషాగ్ని కీలలు దాటి అమృతం తాగిన మనం దివ్యమూర్తులవుతాం. 
అందరిలోనూ దాగిన, అందరినీ తనలో దాచుకున్న సర్వవ్యాపక పరాత్పరుని తెలుసుకున్న వ్యక్తి అమరుడవుతాడు. అమృతం పాల సముద్రంలో పుట్టిన తీయని, శీతల పానీయం కాదు. ఆత్మ శాశ్వత స్థితి, దివ్యస్థితి. అది కాలానికి, విశ్వానికి అతీతమైన అక్షర మహత్య స్థితి. అదీ అమృతత్వం. ఇంతటి దైవతత్వాన్ని నేరుగా చెబితే ఎవరికీ అర్థం కాదు. అందుకనే గ్రహణాల్ని క్షీరసాగర మథన రూపంలో కథలుగా రుషులు చెప్పారు. గ్రహణాలు ఎప్పుడూ సంభవిస్తూనే ఉంటాయి. ఈ కథల్ని గ్రహణాలతో ముడిపెట్టారు. ఎందుకంటే వాటితో పాటే కథల్ని కూడా నిత్యమూ స్మరిస్తుంటుంది మానవాళి. ప్రాచీన కథలన్నీ సంకేతాలే. వాటిలోని ఆంతర్యం గ్రహించడం ముఖ్యం.
                                                                                 - కె.యజ్ఞన్న 

No comments:

Post a Comment