ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Tuesday, 8 October 2013

రాగద్వేషాలు


నిషి మనసును పక్షితో పోలుస్తారు. రాగద్వేషాలు దాని రెండు రెక్కలు. ఆ రెండు రెక్కల సాయంతో మనసనే పక్షి యథేచ్ఛగా విహరిస్తుంది. మమకారం, అహంకారం, అభిమానం, దురభిమానం, అతిశయం... లాంటివన్నీ- రాగం అనే రెక్కలోని ఈకలు. అలాగే ఈర్ష్య, అసూయ, పగ, ప్రతీకారం, కోపం, మూర్ఖత్వం మొదలైనవన్నీ- ద్వేషం అనే రెక్కలోని ఈకలు. ఈకలు ఎంత దట్టంగా ఉంటే రెక్కలంత బలిష్ఠంగా ఉంటాయి. రాగద్వేషాలు బలపడితే మనసు గతి తప్పుతుంది.

మనసును అదుపులో ఉంచాలనుకుంటే మొదట రాగ ద్వేషాలను నియంత్రణలో ఉంచాలి. చిత్త నిరోధమని చెప్పలేదు- మన పెద్దలు చిత్తవృత్తి నిరోధం అనే చెప్పారు. పక్షికి ఈకలుగా చెప్పుకొన్నవన్నీ ఒకరకంగా చిత్త వృత్తులే! వాటిని అదుపు చేయడం ద్వారా రాగద్వేషాలు, తద్వారా చిత్తం అదుపాజ్ఞల్లోకి వస్తాయి. చిత్తవృత్తులను లోబరచుకోవడాన్ని 'యోగ' అన్నారు.

బంధమైనా, మోక్షమైనా మనసు కారణంగానే ఏర్పడతాయని అమృతబిందు ఉపనిషత్తు బోధించింది. రాగద్వేషాలకు మనిషి బద్ధుడైతే- అది బంధం. వాటినుంచి ముక్తుడైతే - అది మోక్షం. బందీ అయినవాడు బద్ధుడు. బయటపడినవాడు- బుద్ధుడు!

రాగద్వేషాలు వ్యసనాలకు తల్లిదండ్రులు. కామజాలు అంటే కోరికల్లోంచి పుట్టేవి. క్రోధజాలంటే కోపంలోంచి పుట్టే వ్యసనాలు. రాగం కామజాలకు పుట్టిల్లు. ద్వేషం క్రోధజాలకు పుట్టిల్లు. సప్త వ్యసనాలైన స్త్రీ, పానం, జూదం, వేట, వాక్పారుష్యం, దండపారుష్యం, అనవసర వ్యయప్రీతికి రాగద్వేషాలే కారణం. అంటే, వ్యసనాలన్నీ మనసులోంచే ఉద్భవిస్తాయి.

ధర్మరాజు ద్యూత వ్యసనం, దుర్యోధనుడి దురభిమానం, ధృతరాష్ట్రుడి పుత్రవ్యామోహం, దక్షప్రజాపతి దురహంకారం, రావణాసురుడి కాముకత్వం, కీచకుడి మూర్ఖత్వం, కంసుడి భయం, అశ్వత్థామ పగ, తన కూతురు దేవయానిపై శుక్రాచార్యుడి మితిమీరిన మమకారం... ఇలా మనిషి పతనానికి దోహదం చేసే సంభారాలన్నీ రాగద్వేషాల ముడిసరకులే!

ముని శాపం కారణంగా పరీక్షిత్తు అనే రాజు తక్షకుడనే సర్పం కాటుకు మరణించాడు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. తన తండ్రి మరణానికి ఒక పాము కారణమైంది కనుక, సర్పజాతి మొత్తాన్ని సమూలంగా నిర్మూలించాలని జనమేజయుడు కక్షగట్టాడు. సర్పయాగం తలపెట్టాడు. ఇది కలియుగ ఆరంభంలోని మానవ జాతిలో మొలకెత్తిన ఒకానొక విపరీత వికార లక్షణం. ఇది మహాభారత గాథలోని ఒక విషాదకరమైన కీలకాంశం. కేవలం ఒక్క వ్యక్తి మృతి కారణంగా, ఈ సృష్టిలోని ఒక జాతి మొత్తాన్ని సర్వనాశనం చేయాలన్న ప్రతీకారేచ్ఛకు అది బీజ ప్రాయమైన హెచ్చరిక. ఒక్క మనసులో రగిలిన పగ, సృష్టిని ఒక కుదుపు కుదుపుతుందని, అది కలియుగ లక్షణమని మనకు మహాభారతం చేసిన సూచన.

దీన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే- ఈ కాలంలో సంభవిస్తున్న దుర్ఘటనలు, నరమేధాలు, మారణహోమాలు, వూచకోతలు తదితరాలకు ప్రధాన హేతువు మనకు గోచరిస్తుంది. ఒక మనసు రాజేసిన పగ- ఆ జాతికో, తెగకో సంక్రమించి దావానలంగా విస్తరించి, ప్రతీకారంగా ప్రజ్వలించి మరో జాతికో, తెగకో హాని చేస్తోంది. మానవ జాతి వినాశనానికి మూల కారణం అవుతోంది. కలియుగ మానవుడి ప్రధాన కర్తవ్యం ఏమంటే ప్రతిమనిషీ- జనమేజయుడి సర్పయాగాన్ని అడ్డుకున్న అస్తీక మహర్షి కావాలి. తన మనసుదాకా వచ్చిన చీడను తనలోనే అంతం చేసి, దాన్నిక వ్యాపించకుండా చూడాలి. అలా చేటును అడ్డుకున్న ప్రతి వ్యక్తీ అస్తీక మునే అవుతాడు. అలా కావాలంటే ముందు మన చిత్తవృత్తుల తోకలుత్తరించాలి. రాగద్వేషాలనే రెక్కలను కత్తిరించాలి. మనసనే పక్షిని పంజరంలో బంధించాలి. అలా మనసును మనం బంధించకపోతే మనమే దానికి బందీలవుతాం. బంధం విడిపోతే మోక్షం. మనసు ప్రభావం నుంచి బయటపడిన మనిషే మహర్షి! బంధమైనా, మోక్షమైనా కారణం మాత్రం మనసే- అని ఉపనిషత్తు చెప్పిన మాటకు అర్థం అదే!

మనమూ ఆధ్యాత్మిక యోగబలంతో రాగద్వేషాలను నిరోధించి మనసును అదుపాజ్ఞల్లో ఉంచుకోవచ్చు. రాగద్వేషాలతో కిక్కిరిసిపోయిన మనసులో శివుడికి కాస్త చోటు కల్పిస్తే, అదే యోగం! శివుడితో బంధం పెరగడమే మనసు నుంచి మోక్షం చిక్కుతోందనడానికి చిహ్నం.ఇది మనసును అదుపు చేయడానికి సులువైన దారి!
- ఎర్రాప్రగడ రామకృష్ణ

No comments:

Post a Comment