ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Sunday 9 June 2013

వ్యసనం


       వ్యసనం అంటే ఒక విషయం మీద మితిలేని ఆసక్తి. నియంత్రణలేని కోరిక. దానివల్ల మనిషి ఇంద్రియాలకు బానిసగా మారి, అవి నడిపినట్టు కీలుబొమ్మలా నడుస్తాడు. తనకు తానే తెలిసి తెలిసి హాని చేసుకొంటాడు. వ్యసనపరుడు అంటే తన వ్యసనానికి సంబంధించిన విషయాల్లో, మామూలు మనిషిలా వివేకమూ, బుద్దీ ఉపయోగించే శక్తి కోల్పోయినవాడు. 'వ్యసనం కామక్రోధాలవల్ల కలిగే దోషం' అంటుంది మహాభారతం. ఏడు ముఖ్య వ్యసనాలను సప్త వ్యసనాలుగా గుర్తిస్తుంది. వీటిలో మద్యపానం, స్త్రీలోలత్వం, జూదం, వేట అనేవి నాలుగూ కామం వల్ల కలిగే వ్యసనాలు. వాక్పారుష్యం, దండ పారుష్యం, అర్థ దూషణం అనే మూడూ క్రోధంవల్ల కలిగే వ్యసనాలు.

కాలం ఎంత మారినా మనిషిని పీడించే కొన్ని వ్యసనాలు (మద్యపానం, స్త్రీలోలత్వం) త్రికాలాబాధితంగా, ఎల్లకాలం కొనసాగటం ఒక విచిత్రమైతే, కొన్ని వ్యసనాలు (జంతువుల వేట) కాలగతిలో వెనకబట్టడం మరో విచిత్రం. జూదం అప్పటికీ, ఇప్పటికీ కొంత రూపాంతరం చెందినట్టు కనిపిస్తుంది. ధర్మరాజు కాలంలో జూదం పాచికల ఆట. ఆ జూదమే ఇప్పుడు పేకాట (దీనికి చతుర్ముఖ పారాయణం అనే అందమైన పేరు ఎవరు పెట్టారో!) గుర్రప్పందాలూ, క్రికెట్‌ పందాలూ- ఇలా కొత్త కొత్త రూపాల్లో కనిపిస్తుంది. అంతర్జాలం ద్వారా జూదం ఆడే సదుపాయాలూ ఏర్పడ్డాయి. కేవలం అదృష్టం మీద ఆధారపడి, షేర్‌ మార్కెట్లో చిన్న పెట్టుబడితో పెద్దలాభం ఆర్జించాలని చేసే ప్రయత్నాలూ ఓ రకమైన జూదమే.

మద్యపానం లాంటి వ్యసనానికి, నాగరికతా సాంకేతిక విజ్ఞానం పెరిగిన కొద్దీ ధూమపానం, మాదక ద్రవ్యాల సేవనం లాంటివి కలిశాయి. దీంతో ఈ సప్త వ్యసనాల లెక్క కొంచెం అటూ ఇటూ అవుతుంది. కామం తప్పు అని ఎవరూ అనరు. మనిషి సాధించుకోవాల్సిన చతుర్విధ పురుషార్థాల్లో అది ఒకటి. అయితే ధర్మవిరుద్ధం కాని కామం పురుషార్థం. ఉచితానుచితాల వివేకం, ధర్మాధర్మాల విచక్షణ పోగొట్టి, మనిషిని స్వతంత్ర బుద్ధిలేని యంత్రంగా, బానిసగా మార్చే కామం వ్యసనం. అడ్డూ ఆపూలేని కామం వ్యసనం. కీడు చేయనంత మోతాదులో ఉన్న వ్యసనం 'సరదా', అలవాటు. కీడు చేసే మోతాదును దాటిన 'సరదా'యే వ్యసనం అవుతుంది.

వాక్పారుష్యం అంటే మాటలో కాఠిన్యం, దురుసుతనం, క్రోధావేశంలో ఒళ్ళు మరిచి, విచక్షణ కోల్పోయి, 'నోటికి ఏదివస్తే అది' మాట్లాడటం వల్ల కూడా మనిషి విపరీతంగా నష్టపోతాడు. ఇది రోజూ మన చుట్టూ కనిపించే లోకానుభవమే. మానవ సంబంధాలను వాక్పారుష్యం తీవ్రంగా దెబ్బతీస్తుంది. పరుషమైన వాక్కు పదునైన కత్తికంటే, విషం పూసిన బాణం కంటే, తుపాకీ తూటాకంటే ఎక్కువగా గాయపరచగలదు. దండపారుష్యం అంటే ఇతరులను దండించటంలో పరుషత్వం. ఇది అధికారులకు, ప్రభుత్వాధికారులకు, న్యాయాధికారులకే కాదు, ఇతరులకూ వర్తిస్తుంది. పిల్లలను, పిన్నలను, బలహీనులను అవకాశం దొరికినప్పుడు తీవ్రంగా దండించేవారందరికీ వర్తిస్తుంది. అర్థదూషణం అంటే ధనం దుర్వ్యయం చేసే వ్యసనం. దుబారా. ఒక రూపాయి ఖర్చుపెట్టవలసిన చోట, బుద్ధికుదురు లేక ఏమరుపాటుతోనో తొందరపాటుతోనో దానికి రెట్టింపు ('దుబారా') ఖర్చుచేసే అలవాటు. పై సప్త వ్యసనాల లెక్కలోకి వచ్చినా రాకపోయినా, పరిమితీ నియంత్రణా లేని అలవాట్లన్నీ వ్యసనాలే. ఆహార విహారాదుల్లో మితిలేకపోవటం వ్యసనం. అతిగా టీవీ చూడటం, అతిగా సెల్‌ఫోన్‌ వాడటం, అతిగా ధనార్జన కోసం తాపత్రయపడటం, పుస్తకాల పురుగులా చదవటం, అతివాగుడూ... ఇలాంటివన్నీ వ్యసనాలే.

'వ్యసనాలకు దూరంగా ఉంటే మంచిది, వాటికి లొంగిపోతే మనిషి నాశనమవుతాడు' అని మన పురాణాలు, ఇతిహాసాలు ముక్తకంఠంతో ఘోషించే మాట. అది ఆనాటికీ, ఈనాటికీ ఏనాటికీ వర్తించే నిత్యసత్యం. వ్యసనపరులందరూ ముందు మామూలు మనుషులే, కళ్లు తెరుచుకొని ముందు వ్యసనపు వూబిలో కాలుపెట్టి తరవాత అందులో కూరుకుపోయినవారే అనేది కూడా సత్యమే. నిజమే. ఈ వ్యసనాలు అలవడటంలో ఒక క్రమం ఉన్నది అంటుంది భగవద్గీత.

కల్లు అనే పదార్థం గురించి తెలియకపోతే మనిషికి మద్యపాన వ్యసనం కలగదు! దాన్ని గురించి వినగా, కనగా, అది సేవించినవారిని చూడగా, ప్రకటనల్లో దాని గొప్పతనం గురించి సమాచారం దొరకటంవల్లా, దాంతో సంబంధం కలుగుతుంది. తరవాత దాన్ని గురించి పదేపదే ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఉండటంవల్ల దాని మీద ఆసక్తి బలపడి, అది అతిగా మారి మద్యపాన వ్యసనానికి దారితీస్తుంది. కామంవల్ల కలిగే వ్యసనాలన్నింటికీ బీజం ఆ వ్యసనపరులతో సాంగత్యం, వ్యసన విషయాన్ని గురించిన ధ్యానం. 'అల్పాశ్రయమును కలుగు వ్యసనములు/ కల్పాంతరమైన పోవు...' అని త్యాగరాజ స్వామి ఒక కీర్తనలో చెప్పారు.

ఆ అల్పాశ్రయానికీ, ఆ సాంగత్యానికీ దూరంగా ఉండగలిగితే ఆ వ్యసనానికి దూరంగా ఉండటం కొంత తేలిక. ఆ జాడ్యం అంటి, ముదిరిన తరవాత 'ఇది హానికరం, అది అనారోగ్యకరం' అని ఎన్ని హెచ్చరికలు వినిపించినా అవి తలకెక్కవు. 'తగని అలవాటు పడి హద్దు మిగిలినట్టి/ వాని మరలింపనెవ్వాని తరముకాదు' అని హరికథా పితామహులు నారాయణదాసు స్వానుభవంతో చెప్పిన మాట.

ఈ నాణానికి మరో వైపు ఉంది. సంగమూ, ధ్యానమూ వల్ల దృశ్యరూపమైన ఇంద్రియ విషయాల్లో ఆసక్తి ఎలా పెరుగుందో, అలాగే అదృశ్యరూపమైన ఆధ్యాత్మిక విషయాల మీదా సంగమూ, ధ్యానమూ వల్ల ఆసక్తి పెంచుకొంటే, ఆ ధ్యాస బలపడి, క్షేమ శ్రేయస్సులకు దారి చూపే మంచి 'వ్యసనం' కలిగించుకోవచ్చు అని పెద్దలు చెబుతారు.
                                                  - ఎం. హనుమంతరావు

No comments:

Post a Comment