ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday 15 May 2014

నీరు- దైవస్వరూపం


పంచభూతాత్మకమైన ఈ ప్రకృతిలో నీటికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రాణికోటికి జీవనాధారమైనది కనుక నీటిని దైవస్వరూపంగా భావిస్తాం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు, వాటినుంచి అన్నం, అన్నం వల్ల ప్రాణులు ఉత్పన్నమైనట్లు శ్రుతులు చెబుతున్నాయి. మన శరీరం కూడా పంచభూతాల తత్వంతో ఏర్పడిందే. అందుకే దీన్ని పాంచభౌతిక దేహం అంటున్నాం.
సకల చరాచరాలను సృష్టించేది నీరే. 'నారాయణుడు' అంటే నీరే స్థానంగా కలవాడని అర్థం. నీటి నుంచే నారాయణుడు ఆవిర్భవించినట్లు రుగ్వేదం చెబుతోంది. ఉదకంలో భగవంతుడు, భగవంతుడిలో ఉదకం ఉందనీ, దాని విశేషం తెలుసుకున్నవారే ముక్తికి అర్హులనీ 'మంత్రపుష్పం' చెబుతోంది. 'జీవితమివ్వడానికి, దీర్ఘాయువు కలిగించేందుకు, తేజస్సు పెంచేందుకు ఈ జలాలు కదులుతూ మమ్మల్ని తడుపుతుండాలి' అన్న వేదార్థం కూడా ఉంది.

నీటితో చేసే అయిదు రకాల స్నానాల వివరణ పద్మపురాణంలో ఉంది. శరీరానికి విభూతి పూసుకొంటూ జలస్మరణం చేయటం ఆగ్నేయస్నానం. శుద్ధజలంతో స్నానం చేస్తే అది వారుణస్నానం. శిరస్సుమీద జలాన్ని ప్రోక్షణ చేసుకుంటే బ్రహ్మస్నానం. గోధూళిలో సంచరిస్తే వాయవ్యస్నానం. ఎండకాస్తుండగా కురిసేవానలో తడిస్తే దివ్యస్నానంగా చెబుతారు. తడిగుడ్డతో శరీరాన్ని తుడుచుకోవడం కపిలస్నానం. ఏనుగులా చాలాసేపు స్నానం చేయడం శ్రేష్ఠమని నీతిశాస్త్రకారుడు చెప్పాడు.

మన ఆరోగ్యవృద్ధి కోసం సనాతనులు పలు సందర్భాల్లో పలువిధాలుగా నీటిని స్వీకరించాలని చెప్పారు. ఆధునిక విజ్ఞానశాస్త్రమూ దీన్నే సమర్థిస్తోంది. సంధ్యావందనంలో పెట్టిన ఆచమన విధి అందులో ఒక భాగమే. అరచేతిని ఆవుచెవిలా చేసుకొని అందులో ఒక ఉద్ధిరణ శుద్ధోదకం పోసుకుని మూడుసార్లుగా ఆచమనం చెయ్యమన్నారు. సంధ్యావందనం ముగిసేలోగా ఇలా చాలాసార్లు చేయవలసి వస్తుంది. అంటే, రోజూ మనం నీరు తరచూ తాగాలన్న సంకేతమిది. పూజలో కూడా 'మధ్యేమధ్యే పానీయం సమర్పయామి' అంటున్నాం. ఎలాంటి జలం అంటే, 'శుద్ధాచమనీయం' అంటున్నది వేదం. నీరు పరిశుభ్రంగా లేకుంటే వ్యాధులు వస్తాయన్న హెచ్చరిక ఉంది అందులో.

మనకు సంక్రమించే వ్యాధుల్లో అధికభాగం స్వచ్ఛమైన నీరు తాగకపోవడంవల్లే సంభవిస్తున్నాయి. వేదంలో అడుగడుగునా 'శుద్ధోదకం' అనే మాట వినిపిస్తుందందుకే. ఒక అగ్గిపుల్ల ప్రకాశానికీ, దహనానికీ ఎలా వినియోగపడుతుందో ఒక్క నీటిచుక్క ఆరోగ్య రక్షణకు, ఆరోగ్యహానికీ అలాగే ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో జల ఔషధ వైశిష్ట్యం సవివరంగా ఉంది. ప్రకృతి చికిత్సలో నీటికిగల ప్రాచుర్యం అనూహ్యమైనది. వేలసంవత్సరాల పూర్వం రాజులు జలస్తంభన విద్య నేర్చేవారు. పరిశుద్ధమైన నీరునిచ్చే వర్షంకోసం యజ్ఞాలు చెయ్యాలని 'గీత'లో పరమాత్మ చెప్పాడు.

జలతరంగాల్లో అంతర్యామిగా ఉన్న రుద్రుడికి నమస్కారమని 'రుద్రనమకమ్‌' చెబుతోంది. మత్స్యకూర్మావతారాల ఆవిర్భావం నీటినుంచే జరిగింది. అందుకే సలిలం దైవసమానం. జలచరాలన్నింటికీ భగవంతుడే ఆశ్రయమిచ్చి ప్రత్యక్ష సంరక్షకుడయ్యాడు. విషాన్ని హరించి జలాన్ని శుద్ధిచేసే జలచరాలెన్నో ఉన్నాయి. వాటికి ఆ వరం దైవమే ప్రసాదించాడు.

పరమాత్మ 'పత్రం, పుష్పం, ఫలం, తోయం'లలో తనకు నాలుగోదైన నీటిని సమర్పించినా సంతుష్టి పొందుతాననే చెప్పాడు. కలియుగంలో వ్యామోహ, ప్రలోభాలకు దాసులైన మానవాళికి ఇంతటి సేవాసౌలభ్యం అనుగ్రహించాడంటే భగవంతుడికి మనం సర్వదా కృతజ్ఞులమై ఉండాలి.

చెంబుడు నీళ్లుపోస్తే శంభుడు సంబరపడతాడు కదా! అందుకే ఆ అగ్నినేత్రుణ్ని అభిషేక ప్రియుడంటున్నాం. సృష్టిలో మూడువంతులు నీరు, ఒకవంతు నేల ఉంది. వృక్ష సంతతితో సహా సకలజీవకోటిని ఈ నీరే పోషిస్తోంది. పవిత్రమైన నదీ సాగర తీరాల్లో ఎన్నో దేవాలయాలు, పుణ్యతీర్థాలు వెలిసి భక్తకోటిని తరింపచేస్తున్నాయి. సముద్రస్నానం, నదీస్నానం మానవజన్మ సార్ధక్యానికి అత్యంత ఆవశ్యకాలని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఆరోగ్య పరిరక్షణలోనూ నీరు కీలక పాత్ర పోషిస్తుంది. మానవ శరీరంలో అరవై ఎనిమిది శాతం నీరు ఉంది.

భూగర్భంలో జలవనరులు అడుగంటిపోతున్న ఈ విషమ పరిస్థితుల్లో తమవంతుగా నీటిని పొదుపుగా వాడుకోవడం మానవాళి పరమావధి. ప్రతి నీటిబిందువును అమృతసింధువుగా భావించి, అప్రమత్తతతో ఉంటే జలయాగాలు చేసినంత ఫలితం.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి 

No comments:

Post a Comment