ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Wednesday 7 May 2014

పుత్రవ్యామోహం

పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు కాదు- ఆ కుమారుడు పెరిగి పెద్దవాడై, గుణవంతుడై, పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పుడే వాస్తవంగా కలుగుతుందని ప్రసిద్ధ శతక పద్యం చెబుతోంది. భారతీయ సమాజంలో పున్నామనరకం నుంచి రక్షించేవాడు పుత్రుడనే భావన ఉంది. అందుకే అన్ని కాలాల్లో పుత్రసంతానాన్ని కోరుకునేవారు కనిపిస్తారు. పుత్రకామేష్ఠియాగం గురించి తెలిసిందే.

పుత్రులు తమ కుటుంబ భౌతిక సంపదలకే కాదు- సద్గుణ సంపత్తికి, సత్సంప్రదాయాలకు, ధార్మిక జీవనానికీ వారసులు కావాలి. శైశవం నుంచి తల్లిదండ్రులు తమ పిల్లల పోషణలో చూపే శ్రద్ధ, తమ వారసుల్ని గొప్పవారిగా తీర్చిదిద్దాలనే తపన ఫలించి భవిష్యత్తులో వారు సంస్కారవంతులై గొప్ప వ్యక్తిత్వంతో విరాజిల్లుతారు. దీనికి భిన్నంగా పుత్రులు తమ సంపదకు వారసులని, వారు తమకన్నా ఎక్కువ సంపాదించాలని వస్తుసంస్కృతినే బోధిస్తూ స్వార్థచింతనకు, అక్రమార్జనకు, అధర్మాచరణకు తమ సంతానాన్ని వారసులుగా తీర్చిదిద్దుతున్నవాళ్లు ప్రజాస్వామిక వ్యవస్థలో కొల్లలుగా మనకు కనిపిస్తున్నారు. పుత్రులపై ప్రేమ ఉండటం తప్పు కాదు. వారిని అధర్మవర్తనులను కావించేటంతటి అభిమానం- దురభిమానమే గాని ప్రేమ అనిపించుకోదు!

మహాభారతంలో ధృతరాష్ట్రుడి పుత్రప్రేమ ప్రసిద్ధమైనది. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు, వారికి హాని చేయ సంకల్పిస్తాడు దుర్యోధనుడు. వ్యాసుడు ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చి- నీ కుమారుడి అధర్మవర్తనాన్ని మాన్పించమని ప్రబోధిస్తాడు. వాడిది దుర్బుద్ధి అని తెలిసికూడా పుత్రప్రేమవల్ల ఉదాసీనుణ్నయ్యానని తన నిస్సహాయత వెల్లడిస్తాడు గుడ్డిరాజు. ఈ సందర్భంలో వ్యాసుడు ఇంద్ర-సురభి సంవాదాన్ని రాజుకు చెబుతాడు. పూర్వం సకల గోవులకు తల్లి అయిన సురభి దేవేంద్రుడి వద్దకు వెళ్లి ఏడ్చింది. ఇంద్రుడు కారణమడిగితే, నీ పాలనలో నా సంతానం కష్టాలనుభవిస్తున్నారని చెప్పింది. బలమైన పశువులతో బలహీనమైన పశువుల్ని కట్టి మనుషులు నాగళ్లతో దున్నుతున్నారు. అవి ఆ భారం మోయలేకపోతే ములుకోలతో కొట్టి, పొడిచి హింసిస్తున్నారు. అది చూడలేకుండా ఉన్నానని రోదించింది. దానికి ఇంద్రుడు నీకు వేలకొద్దీ సంతానం ఉంది. అందరికీ ఇటువంటి దుఃఖమే కలగలేదు. ఎందుకు బాధపడతావని ఓదార్చాడు. కాని, సురభి 'తల్లికి బిడ్డలందరూ సమానమే. ఒకరిపై ఇష్టం మరొకరిపై అయిష్టం ఉండకూడదు. బాధల్లో ఉన్నవారినే మరింతగా ప్రేమించాలి' అన్నది. ఇంద్రుడు ఆమె మాటలు విని వర్షం కురిపించాడు. నేలమీద తృణసంపద పెరిగింది. పశుగ్రాసంతో పశువులు బలిష్ఠమయ్యాయి. ఈ కథ చెప్పిన వ్యాసుడు- నీ పుత్రులపై ఉన్న ప్రేమ నీ తమ్ముడి కొడుకులపైనా చూపవయ్యా అని సలహా ఇచ్చాడు. మైత్రేయ మహాముని వచ్చి నీ కుమారుడికి ధర్మోపదేశం చేస్తాడనీ చెప్పి వెళ్లిపోయాడు.

మైత్రేయుడు రాగా ధృతరాష్ట్రుడు అతణ్ని పూజించాడు. దుర్యోధనుడు మాత్రం నిర్లక్ష్యంగా చూశాడు. ముని 'పాండవులతో వైరం మంచిది కాదు... యుద్ధమంటూ వస్తే వారిని నీవు జయించలేవు' అంటూ వారితో మైత్రి నెరపమని హితవు పలికాడు. అహంకారియైన దుర్యోధనుడు కాలిబొటన వేలితో నేలను తాటిస్తూ చేతులెత్తి తొడలు చరుచుకొంటూ నవ్వాడు. మైత్రేయుడు ఆగ్రహించి- సమరంలో భీముడి గదాఘాతంవల్ల నీ తొడలు విరిగిపోతాయని శాపం ఇచ్చాడు. ధృతరాష్ట్రుడు భయంతో శాపం మరల్చమని ప్రార్థించాడు. 'వీడికి సమబుద్ధి ఏర్పడితే నా శాపం బాధించ'ద'న్నాడు. కాని దుర్యోధనుడిలో మార్పు రాలేదు. మునిశాపం అనుభవించాడు. ధృతరాష్ట్రుడి గుడ్డిప్రేమే దీనికి కారణం. తమ వారసులకు అక్రమంగా సంపదలు దోచిపెడుతున్న నాయకులు, ఆ ధనమదంతో ధర్మాన్ని విస్మరించి అధర్మరాజ్య స్థాపనకు వ్యూహాలు పన్నుతున్న వారసుల్ని జనాగ్రహం క్షమించదు. మన పిల్లల్ని మంచి పౌరులుగా, ధర్మప్రతీకలుగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులు విస్మరిస్తే సమాజమే రోగగ్రస్తమవుతుంది.
- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు 

No comments:

Post a Comment