ఈ ప్రపంచం సుఖదుఃఖాల సమాహారం. ఎంతటి ధనరాశి ఉన్నా, ఎంతటి విద్వత్తు ఉన్నా, ఎంతటి యోగదృష్టి ఉన్నా- దుఃఖం తప్పదు! అంతరంగంలో ఆధ్యాత్మిక ప్రకంపనలు చెలరేగినప్పుడు, ప్రాపంచిక విజయాలకన్నా జీవన ప్రయోజనం మరింత గొప్పదని తెలుస్తుంది. అప్పుడే ఒక జ్ఞానజ్యోతి భాసిస్తుంది. ఒక అంతస్ఫూర్తి మేలుకుంటుంది. ఒక అంతర్జ్వాల ప్రజ్వరిల్లుతుంది. అప్పుడే సుఖదుఃఖాలకు అతీతమైన ఒక అద్భుత కిరణం ప్రసరిస్తుంది.
'సుఖదుఃఖాలు ఇసుక, పంచదార లాగా కలిసిమెలిసి ఉంటాయి. ఒక చీమ లాగా వాటిని వేరు చేయగలిగితే మిగిలేది ఆనందం. దీనికి ఎంతో నైపుణ్యం కావాలి. అంతరంగ మథనం కావాలి. అప్పుడే ఆధ్యాత్మిక పురోగమనం సాధ్యపడుతుంది. యోగదృష్టి పెంపొందించిన సాధుపురుషుల మధ్య జీవితాన్ని గడపాలి' అని రామకృష్ణ పరమహంస చెప్పేవారు.
ఆధ్యాత్మిక లోకాలకు ధ్యానమే మార్గం. ధ్యానం మనసుకు సంబంధించినది. ఎంతో ఏకాగ్రత ఉంటేనే అది సాధ్యం. ఆలోచనలతో నిండిన మనసు అనేక మార్గాల్లో పనిచేస్తుంటుంది. మెరుపు వేగాన్ని మించిన ఆలోచనలు శరీరం ఏ పని చేస్తున్నా సాగుతూనే ఉంటాయి.
ఏకాంతాన్ని కోరుకోవడంవల్ల ఆలోచనల ప్రవాహం ఆగిపోదు. నిశ్శబ్ద తీరాల్లో నిలబడినా సముద్ర తరంగాల ఘోష (ఆలోచనలు) వినిపిస్తూనే ఉంటుంది. మనసును నియంత్రించడమే ఏకైక మార్గం.
దైవంపై దృష్టిని ఏకాగ్రం చేయడం ఒక పద్ధతి. ధనుర్విద్య నేర్చుకొనడానికి ముందు బాణాలను పెద్ద వస్తువులవైపు గురి పెట్టాలి. తరవాత నెమ్మదిగా చిన్నదైన లక్ష్యంవైపు మనసును కేంద్రీకరించాలి.
మొదట భగవంతుడి రూపం ధ్యానిస్తూ నెమ్మదిగా మనసులో పరమాత్ముని రూపరాహిత్యం వైపు తిప్పాలి.
చిన్నతనంలో పలకపై పెద్ద అక్షరాలు రాస్తాం. నెమ్మదిగా ఏకాగ్రతతో చిన్న అందమైన అక్షరాలు రాయడం అలవడుతుంది. అలాగే మనసును మొదట భగవంతుడి రూపంపైన ఉంచితే, దారి తప్పే ప్రసక్తి ఉండదు. ఓడలో దిక్సూచి సరిగా పనిచేస్తున్నంత కాలం ఓడ క్షేమంగా ప్రయాణం చేసినట్లు భగవంతుడివైపే మనసు ఉంచితే ఏదోనాడు తీరం చేరవచ్చు. ఒక్క సెకనులో ఆలోచనలు చెల్లాచెదురైపోతాయి. అప్పుడు వాటిని నియంత్రించడం మనసుకు చాలా కష్టమవుతుంది.
సుస్థిరమైన మనసే భగవంతుడివైపు మార్గం చూపుతుంది. ఆలోచనల అలజడి లేని మనోమందిరంలో భగవంతుడు నిశ్చలంగా ప్రకాశిస్తాడు. మనసును భగవంతుడివైపు ఏకాగ్రం చేయగలిగితే, అంతకుమించిన మహనీయ యోగం మరొకటి లేదు. అప్పుడే మనలో అంతర్నేత్రం తెరుచుకుంటుంది.
శాశ్వత తేజస్సు నుంచి ప్రసరించిన కిరణం మనిషి అని తెలుసుకున్నప్పుడు అజ్ఞానం ఉండదు. అజ్ఞానం లేనప్పుడు దుఃఖం ఉండదు. కాంతి దుఃఖిస్తుందా? ఆనందమయ అనంతం నుంచి కాంతిరేఖ తెగిపోవడం జరగదు.
తరంగానికి, సముద్రానికి తేడా లేదు. మానవ కిరణానికి, భగవత్ సూర్యుడికి తేడా లేదు. ఈ జ్ఞానం ఉన్నప్పుడు ఇసుక రేణువులో స్వర్గధామం చూడవచ్చు.
తుపానులు చెలరేగే సముద్రాలపై ప్రయాణం దేనికి? రూపరహితమైన ప్రేమస్వరూపం నీ గుండెల్లో ఉంది కదా! ఆయన నీలోనే వెలుగుతున్నప్పుడు నీవెక్కడ ప్రారంభించావో అక్కడే నీ మహాయాత్ర ఆగిపోతుంది.
- కె.యజ్ఞన్న
No comments:
Post a Comment