ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday 24 October 2013

ఆలోచనామృతం

       క్రియకు తొలిదశ ఆలోచన. మలిదశ వాక్కు. మూడోదశ కర్మ. 'మనసా-వాచా-కర్మణా' అనే మూడు దశలతోనే మన జీవన విధానం కొనసాగుతుంది.
కర్మ ఒక నిర్మాణం అనుకుంటే, ఆలోచన పునాది. ఆలోచన ఆచరణగా మారే దశ మహత్తరమైంది. ఎందుకంటే- దీని పర్యవసానాలే, సత్ఫలితాలు, దుష్ఫలితాలు. విద్యార్థి తాను చదువు ద్వారా పొందిన జ్ఞాన అవగాహనలోంచి ఆలోచన ప్రారంభిస్తాడు.

విద్య ప్రాథమిక జ్ఞానం. దాన్ని పోనుపోను పెంచుకోవటం, విస్తరించుకోవటం విద్యార్థి కర్తవ్యం.

పరీక్షల్లో ప్రథమశ్రేణి ఉత్తీర్ణతతో పరిపూర్ణత లభించదు. జ్ఞాన వినియోగంలో విజ్ఞత ఉండాలి. ఖడ్గవిద్యలో ఆరితేరాక చెట్లు నరికితే ఏమిటి ఉపయోగం? దేశరక్షణలో, శత్రువులను తరిమికొట్టడంలో సద్వినియోగం చేయాలి!

అలాగే- మంచి ఆలోచన ద్వారా విజ్ఞానాన్ని విజ్ఞతతో వినియోగించాలి. ఆలోచన అమృత సమంగా ఉండాలి. అనృతమయంగా ఉండకూడదు. అంటే- అబద్ధాలతో అవతలివారిని మభ్యపెట్టి, మన పని సాధించుకోకూడదు.

ఒక మొక్క పాతుతున్నప్పుడు, 'అది బతికి, పెద్దదై, చెట్టుగా పక్షులకు ఆశ్రయాన్ని, పాంధులకు నీడను, ఆకలిగొన్నవారికి ఫలాలను ఇవ్వాలి' అనుకోవటం అమృత సమానమైన ఆలోచన. లోకక్షేమాన్ని ఆకాంక్షిస్తూ చేసే ఆలోచనే- ఆలోచనామృతం.

రెండోది ఆలోచనా గరళం. అంటే విషసమానం.

'చెట్టుగా మారాక, నీడకోసం వచ్చేవారి దగ్గర శుల్కం, వలపన్ని చెట్టుమీద పక్షుల్ని పట్టుకుని అమ్ముకుంటే ధనం, పళ్లు కాయలు అమ్ముకుంటే లాభం, గాలివానకు చెట్టు కూలిపోతే కట్టెలు అమ్ముకోవచ్చు...' అనేవన్నీ విషతుల్యమైన ఆలోచనలు.

వైద్యవిద్యలో ఉత్తీర్ణత సాధించి, 'దీనులను, అనాథలను, పేద రోగులను ఆదుకోవాలి' అనుకోవటం ఆలోచనామృతం. 'రోగుల్ని పీడించి ధనం దండిగా ఆర్జించవచ్చు' అనుకోవటం విషతుల్యం.

ఇలా ప్రతి పనికీ రెండు పార్శ్వాలుగా ఆలోచనలు ఉంటాయి. స్వార్థం వల్ల రాక్షసులకు అమృతం దక్కలేదు. అమృతపానంతో అమరులై దేవతల్ని తరిమికొట్టాలని, స్వర్గం తమదిగా చేసుకోవాలని రాక్షసులలోని దుర్మార్గపు ఆలోచన. పరమాత్మ ఆదేశంతో ధర్మరక్షణ చేస్తూ, లోకంలో సుఖశాంతులు వర్ధిల్లజేయాలన్నది దేవతల ఆలోచన.

అందువల్లనే రాక్షసుల్ని మోహవికారంలో పడేసిన మహావిష్ణువు అమృతాన్ని దేవతలకిచ్చాడు. భగవంతుడు ధర్మపక్షపాతి. ఆయన భక్తులకు దాసుడు.

భక్తి అంటే భజనలు, పూజలు, నైవేద్యాలు, స్తోత్రపాఠాలు కావు. పరిపూర్ణ సజ్జనత్వం, శుద్ధసత్వం. భగవంతుడిమీద గురితప్పని దీక్ష. పరమాత్మ రుషుల ద్వారా మనకందజేసిన అనేక ఆధ్యాత్మిక సందేశాలను మన జీవితంలో భాగంగా చేసుకుని జీవించటం.

వీటిని మన సొంతం చేసుకోవాలంటే మనోనిర్మలత్వం కావాలి. నిర్మలం అంటే కాలుష్యంలేనిది. స్వచ్ఛమైనది. నీరు స్వచ్ఛంగా లేకపోతే రోగాలు వచ్చినట్లే- మనసు నిర్మలంగా లేకపోతే, ఆలోచనలు వికృతంగా, విషతుల్యంగా ఉంటాయి.

మనసును నిర్మలంగా ఉంచగలిగేవే ఆధ్యాత్మిక సాధనలు. అవి కల్మషభావాలను వడపోసి, ఆలోచనామృతాన్ని తేరుస్తాయి. దాన్ని స్వీకరించడానికి సిద్ధపడదాం.
                                   
                                                                  - కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌

No comments:

Post a Comment