ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Tuesday, 22 October 2013

జీవితాన్ని దర్శించే కోణం

  ఒక దట్టమైన అడవి ప్రాంతం. అలసిపోయిన ఓ ప్రయాణికుడు రాత్రివేళ అక్కడ చిక్కుకున్నాడు. దారి తెలియక నడుస్తూ వెళ్లి నీరులేని బావిలోకి జారిపోయాడు. ఆ పడిపోయే సమయంలో అదృష్టమో, దురదృష్టమోగానీ అతడి చేతికి ఒక మర్రివూడ కొస అందింది. దాని ఆసరాతో, ప్రమాదకరమైన స్థితిలో చీకట్లో బిక్కుబిక్కుమంటూ భయంతో గడిపాడు. తెల్లారగానే సురక్షితమైన స్థితికి చేరుకోవాలనే పట్టుదలతో ఎక్కే ప్రయత్నాలను తిరిగి ప్రారంభించాడు. పైకి చూడగానే ఓ క్రూరమృగం- ఆ బావి దగ్గరే సంచరిస్తున్నట్లు గ్రహించాడు. దాని దృష్టి ఇతడి మీద పడింది. కిందికి దిగిపోవాలని నిర్ణయించుకున్నాడు. చేతిలో ఉన్న వూడ కూడా అంత బలంగా లేదని గ్రహించాడు. తన బరువుకు అది తెగిపోయే ప్రమాదం ఉందని తెలిసింది. దిక్కుతోచని పరిస్థితి. ఆ సమయంలో బంకలాంటి పదార్థం ముఖం మీదుగా జారి నాలికకు తగిలింది. చిత్రం! మధురంగా ఉంది. అవి పైన మర్రిచెట్టు కొమ్మకున్న తేనెతుట్టెనుంచి రాలిపడిన తేనెబొట్లు. అలాంటి పరిస్థితుల్లోనూ ఇంకా ఆ తేనె జారిపడితే బావుండుననే ఆశ...

జీవితం కూడా ఇలాంటిదే ఇంచుమించు. సమస్యలకు అంతులేదు. సర్వత్రా వ్యాపించే ఉంటాయి. వివేకం మధురమైన పరిస్థితులను గమనించి సంతోషానికి మార్గం ఏర్పరుస్తుంది. ప్రతి ఒక్కరూ జీవితాన్ని ఒక్కో కోణంలో చూస్తారు. అన్వయించుకుంటారు. చూసే దృక్పథం ముఖ్యం. బాహ్య పరిస్థితులకన్నా ఆంతరంగిక వ్యక్తిత్వం అనేది ఒకటుంటుంది.

ఈ భౌతిక ప్రపంచంలో, పోటీప్రవాహంలో వ్యక్తి ఒంటరిగా తన కోణంలోంచి జీవితాన్ని చూస్తాడు. తన అహంభావంతో పరిశీలిస్తాడు. ఇక్కడ ఆ అహాన్ని తృప్తిపరచడానికి ఆశావహ ధోరణిని గానీ నిరాశావాద దృక్పథంగానీ ప్రయోగిస్తాడు. తాను అనుసరిస్తున్న మార్గం మేలైనదని, అందరూ అభినందించాలని ఆశిస్తాడు. గొప్పవాడిగా కీర్తి పొందాలనుకుంటాడు. అహం మరింత పెరుగుతుంది. అది ఎప్పుడైతే జరుగుతుందో ఇక అతడు ఆ వూబిలోంచి బయటపడలేడు. ఆధ్యాత్మికపరమైన ఆలోచనలతో ఉదాత్తచిత్తుడైన వ్యక్తి, అహంతో కాకుండా ఆత్మతో స్పందిస్తాడు. భావోద్వేగాలతో కాకుండా విజ్ఞతతో ప్రవర్తిస్తాడు.

సాధారణంగా వ్యక్తి ఈ ప్రపంచాన్ని పరుగుపందాల మైదానంలాగా జీవితాన్ని పోటీలకు సిద్ధంచేసే రీతిలో పరిగణిస్తుంటాడు. అతడి ఏకైక లక్ష్యం విజయం సాధించడం. శక్తియుక్తులన్నీ కూడగట్టుకుంటాడు. తనను ఎవరూ దాటిపోకూడదనుకుంటాడు. వెళ్లకుండా ఉండేందుకు ఏం చేయాలో కూడా తానే ఆలోచిస్తాడు. దాటిపోయిన వాళ్లను చూసి ఈర్ష్య చెందుతాడు. వ్యధకు లోనవుతాడు. తానే ముందుకెళ్ళగలిగితే ఇక ఆనందానికి అవధులు ఉండవన్నట్లు ప్రవర్తిస్తాడు.

ఆధ్యాత్మిక సాధన చేసే వ్యక్తి ఈ ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూస్తాడు. తననూ మిగిలినవాళ్లలో ఒకడిగానే భావించుకుంటాడు. తోటివారికి చేతనైన తోడ్పాటునందిస్తాడు. తాను సవ్యంగా ఉంటూ మిగిలినవారి క్షేమం కోరుకుంటాడు. అందరి క్షేమమే తన క్షేమంగా భావిస్తాడు. తన శక్తిని సవ్యంగా ఉపయోగిస్తూ ఇతరులతో సఖ్యంగా ఉంటాడు. విషయాలపట్ల, విషయవాంఛలపట్ల పొంగిపోడు, కుంగిపోడు. ఏదైనా సరే, ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించే గుణాన్ని కలిగి ఉంటాడు. ఫలితాలు ఎలాఉన్నా, స్వయంకృషిని నమ్ముకుంటాడు. 'కాలం కలిసిరావడం' అన్న ముఖ్య సూత్రాన్ని విశ్వసిస్తాడు.

అహాన్ని పెరగనిస్తే మన ఉనికి విషయంలోనే గందరగోళ పరిస్థితి చోటుచేసుకుంటుంది. అందుకే దాన్ని పక్కనపెట్టి మనమేమిటో ముందు ప్రశ్నించుకోవాలి. పోటీదారుడిగా కాకుండా పాత్రధారుడిగా తయారుకావాలి.

ఆ భగవంతుడు రచించిన విలువైన జీవితంలో మన పాత్రను మనం ముందు గుర్తెరగాలి... ఇతర పాత్రలన్నీ కొన్ని పరిమితులకు లోబడే ఉంటాయని గ్రహించాలి. ఎంతవరకూ ఆ పాత్ర పోషించాల్సి ఉంటుందో అంతవరకూ పోషించి, హుందాగా, మర్యాదగా వైదొలగడంలోనే గొప్పదనం దాగి ఉంది.

                                                                           - మంత్రవాది మహేశ్వర్‌

No comments:

Post a Comment