ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Tuesday 3 September 2013

భక్తి - భుక్తి - ముక్తి


ఎంతటి జ్ఞాని అయినా మనుషులకు దూరంగా ఒంటరి జీవితం గడిపితే, ఆయన వల్ల సమాజానికి కలిగే మేలు ఏమీ ఉండదు. ప్రజలతో కలవని సాధువృత్తికి ఫలం లేదు. అజ్ఞానులు ఎప్పుడూ మూర్ఖత్వంలో పొర్లాడుతూ ఉంటారు. వాళ్లు తమను తాము గొప్పగా భావించుకుంటారు. భక్తులకు వీటితో పని లేదు. తమ సామర్థ్యాన్ని లోకోపకారానికి ఉపయోగిస్తారు. దైవభక్తుల గుణాలు ఎలా ఉంటాయి? స్కంద పురాణం వైష్ణవ ఖండం ఇలా చెబుతోంది.

ప్రశాంత చిత్తం, సౌమ్యత, జితేంద్రియత, మనోవాక్కాయాల చేతా పరులకు కీడు తలపెట్టకుండటం, దయాగుణం, పరుల ఆనందాన్ని తనదిగా భావించడం, అందరి హృదయాల్లో ఉండే వాసుదేవుణ్ని గుర్తించడం... అనే గుణాలు గలవాళ్లు భక్తులు! శ్రీహరి చరణారవిందాలనే సదా ధ్యానిస్తూ ఉండటం చేత, చూసేవారికి జడులుగా కనిపిస్తారు. రామకృష్ణ పరమహంస అలాగే కనబడేవాడు. మనసును, వాక్కును వినయంతో భగవంతుడికి సమర్పించడం వల్ల భక్తులు పరమశాంతంగా జీవిస్తారు. సదా భజనలతో కాలం గడుపుతారు. తానొక నీటిబొట్టు. భగవంతుడు మహాసముద్రం. ఆ మహాసముద్రంలో తాను కలిసిపోవడమే మోక్షం. భక్తుడి జీవితమే ఒక తపస్సు. ఆ మార్గంలో అతడు అనేకమై, అనంతమై, బ్రహ్మమై, తుదకు వాసుదేవుడవుతాడు.

భక్తిమార్గంలో ప్రయాణించేవారి హృదయంలో మానవత్వం తొణికిసలాడుతూ ఉంటుంది. నిరంతర కృషి, సాటివారిపై దయ చూపడం- ఇవే మానవత్వ లక్షణాలు. ఈ సుగుణాలు లేకుండా ఉంటే 'భక్తి' ప్రదర్శన కేవలం 'భుక్తి' కోసమే. పెద్ద పెద్ద రుద్రాక్షమాలలు, ఒంటినిండా బొట్లు మాత్రమే ఉంటే- అది 'భుక్తి' మార్గం. 'భక్తులను భగవంతుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి భక్తి ఒక్కటుంటే చాలు బతికిపోవచ్చు' అని కొందరు భావిస్తుంటారు.

ఇద్దరు భక్తులు తీర్థయాత్రలకు బయలుదేరారు. నడిచీ నడిచీ అలసి సొలసి ఒక చెట్టుకింద కూర్చున్నారు. 'మిత్రమా! ఆకలి వేస్తూ ఉంది. అలా వనంలోకి వెళ్ళి తినడానికేమైనా కాయాగసరూ దొరుకుతాయేమో వెదుకుదాం పద!' అన్నాడు ఒకడు. 'నాకూ ఆకలిగానే ఉంది. నేను నిజమైన భక్తుణ్ని గదా! నా తిండి సంగతి దేవుడే చూసుకుంటాడు. నాకు రాసిపెట్టి ఉంటే ఆహారం అదే నా వద్దకు నడుచుకుంటూ వస్తుంది!' అని రెండోవాడు కాళ్లు బార చాపుకొని పడుకున్నాడు. మొదటి బాటసారి రామ నామాన్ని జపిస్తూ, పరిసర ప్రాంతాల్లోని చెట్టూ చేమల్ని గాలించి, కొన్ని పండ్లు సేకరించి తెచ్చాడు. 'మిత్రమా! కొన్ని పండ్లు నువ్వు కూడా తిను!' అంటూ తానుతెచ్చిన వాటిలో సగాన్ని రెండో భక్తుడి ముందర పెట్టాడు. అతడు సంతోషంగా వాటిని అందుకున్నాడు. 'నేను ముందే చెప్పలా... ఆ దేవుడే నాకు పంపిస్తాడు! చూశావా? ఇప్పుడీ పండ్లు అవే నడుచుకుంటూ వచ్చాయా లేదా?' అన్నాడు తన భక్తి మహత్తుకు మురిసిపోతూ. మొదటి భక్తుడు నింపాదిగా అన్నాడు-

'మిత్రమా! దేవుడు నేను కష్టపడి తెచ్చినవి నీకు ఇవ్వమనలేదు. పైగా సోమరిపోతు తనాన్ని ఏ దేవుడూ మెచ్చడు. పని చెయ్యమనే శ్రీకృష్ణుడి ఉపదేశం. కానీ... నేను దైవాన్ని కూడా ధిక్కరించి నీకు పండ్లు ఇస్తున్నాను. సాటి మనిషి ఆకలి పట్టించుకోకుండా ఒక్కడే తినడాన్ని దేవుడు హర్షించడు. ఇప్పుడు నీకు పండ్లు లభించడంలో నీ భక్తి మహిమ ఏమీ లేదు. నాలోని మానవత్వం నీకు పండ్లు ప్రసాదించింది!'

భక్తిమార్గం సమాజాన్ని సం స్కారం వైపు నడిపిస్తుంది. సంఘచైతన్యానికి పాటుపడిన భక్తులెందరో ఉన్నారు. పంజాబులో భక్తి సంప్రదాయంతోనే సిక్కుమతం ప్రారంభమైంది. వీరఖల్సా ఉద్భవించింది. వల్లభ భక్తి సంప్రదాయకులు సైనిక శక్తిని పునరుజ్జీవింపజేయడానికి సంకీర్తన సంఘాన్ని ఏర్పాటుగావించారు. రసఖాన్‌ వంటి సామాజిక సమరసతా భక్తులు తయారయ్యారు. హిందీ భాషీయులు రామచరిత మానస్‌ను శిరసున పెట్టుకొని పూజిస్తారు. వంగ భాషీయులు చైతన్య మహాప్రభువుల సంకీర్తనలను పారవశ్యంతో గానం చేస్తారు. వీరి భక్తి ఉద్యమాలు సమాజంలో పెనుమార్పులకు కారణమయ్యాయి. పాదుషా ప్రభుతను లెక్క చేయని భక్తరామదాసు కీర్తనలు మనకు అత్యంత ప్రీతిపాత్రమైనవి. రాజులను సైతం లెక్క చేయకుండా, దైవభక్తి ఆధిక్యాన్ని స్పష్టంగా ప్రకటించిన అన్నమయ్య, పోతన, ధూర్జటి వంటి మహాకవులు తమ ఇష్ట దేవతారాధనతో ముక్తి పొందారు. వారంతా సమాజంలోని సాటివారితో కలిసి మెలిసి జీవించారు. భుక్తి కోసమైతే రాజభక్తిని ప్రకటించి ఉండేవాళ్లు! గొప్ప భక్తులందరూ యోగీశ్వరులే! 'సమస్త ప్రాణుల సుఖదుఃఖాలను తమవిగా భావించి ఎవరు సేవిస్తారో అటువంటి యోగీశ్వరులు సర్వోత్తములు. విద్య లేనివారికి విద్యను, రోగగ్రస్తుడికి ఔషధాన్ని, పేదలకు అన్న వస్త్రాలను ఎవరు అందజేస్తారో వారే యోగీశ్వరుల్లో శ్రేష్ఠులు'- అంటుంది భగవద్గీత.                                                              - డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

No comments:

Post a Comment